Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ముప్పది ఆరవ యధ్యాయము - పరశురామునకీశ్వరాజ్ఞ

మార్కండేయ ఉవాచ :

అథ బాల్యం సముత్తీర్ణో రామో భృగు కులోద్భవః | శుశ్రూష మాణః పితరం నిత్యమాస్తే మహాయశాః || 1

ఏతస్మిన్నేవ కాలేతు రామే వనగతే తదా | ఆజగామ మహాతేజాః రాజా చిత్రాంగదో వనమ్‌ || 2

విహర్తుం సహ రామాభిర్దేవరాజ సమద్యుతిః | తం దృష్ట్వా రేణుకా చక్రే స్పృహాం భోగేషు భామినీ || 3

జగామ మనసా తంసా రాజానం కామసన్నిభమ్‌ | తస్మిన్నేవ క్షణ సాతుభ్రష్టా బ్రాహ్మణ తేజసా || 4

గతశ్రియంతు తాందృష్ట్వా జమదగ్ని ర్మహాతపాః | పుత్రా నువాచ తా& క్రోధా ద్ధన్యతాం జనని స్వకా || 5

తే విచార్య తతస్సర్వే మాతుర్గౌరవ ముత్తమమ్‌ | నైవ చక్రుః పితుర్వాక్యం తా& శశాప స భార్గవః || 6

యూయం తిర్యక్‌ సధర్మాణో నష్ట సంజ్ఞా భవిష్యథ | ఇధ్మభార ముపాదాయ రామోరతికరః పితుః || 7

అథాశ్రమ మనుప్రాప్తః పితాతం సమచోదయత్‌ | జహీమాం మాతరం క్షుద్రాం రామ ! మా త్వంచిరం కృథాః || 8

ఏవముక్తస్స పిత్రాతు తద్వాక్య సమనంతరమ్‌ | శిరశ్ఛిఛేద తీక్షేన రామః పరశునాతదా || 9

తుతోషాథ పితా తస్య తతో ధర్మభృతాం వరః || 10

జమదగ్ని రువాచ :

స్వచ్ఛందమరణం పుత్ర ! తుష్టేత్వంమయి లప్స్యసే || యావచ్చ వైష్ణవం తేజస్త్వయి తిష్ఠతి ప్రుత్రక ! 11

తావదేవ నతేయుద్ధే కశ్చిజ్జేతా భవిభ్యతి | భవిష్యతి చ ధర్మాత్మా రామో దశరథా త్మజః |

రఘువంశే సముత్పన్నో విష్ణుర్మానుష రూపధృక్‌ || 12

యదా సమేష్యతే తేన తదా వైష్ణవ తేజసా | కృతకర్మా విముక్త స్త్వంస చయుక్తో భవిష్యతి || 13

తతఃపరం త్వయాపుత్ర ! నకార్యం శస్త్రధారణమ్‌ | ఆర్తత్రాణమృతే వీర ! స్త్రీ బ్రాహ్మణ కృతేథవా ||

యథేప్సితం చాప్యవరం వరం వరయ ! పుత్రక ! 14

రామ ఉవాచ :

గురుశ్రేష్ఠ! సముత్థానం జనన్యాః కథయామ్యహమ్‌ | అస్శృతించ తథా తస్యాం భ్రాతౄణాంచ తథాస్మృతిమ్‌ ||

జమదగ్నిరువాచ :

ఏవమస్తు మహాభాగ! తపసా మహతా తథా ! సమారాధయ దేవేశం శంకరం నీలలోహితమ్‌ || 16

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తే సముత్తస్థే రేణుకా బారుహాసినీ | రామస్య భ్రాతర స్సర్వే ముక్తశాపా స్తథైవతే || 17

పిత్రా రామ స్తథోక్తస్తు హిమవ త్యచలోత్తమే | తపస్తేపే మహాతేజా రుద్రారాధన కామ్యయా || 18

ఏతస్మి న్నేవ కాలేతు దేవా స్సేంద్ర పురోగమాః | సైంహికేయ భయత్రస్తాః శంకరం శరణంగతాః || 19

మార్కండేయు డనియె : భృగుకులోద్ధారకుడు రాముడు బాల్యదశను దాటి తండ్రిని నిత్యము శుశ్రూషించుచుండెను. అతడడవికేగినతరి చిత్రాంగదుడను రాజు వనమునకు వచ్చెను. అందత డింద్రునితో సమమయిన దీప్తితో దన సుందరీజనముతో విహరింప జూచి జూచి రేణుకాదేవి యా భోగానుభవమునకు ముచ్చటవడెను. మన్మథునట్లున్న యా ఱని యెడ మనసుపడెను. దాన నాక్షణమ బ్రాహ్మణతేజస్సుచే విహీనయయ్యెను. మహాతపస్వి జమదగ్ని వెలవెలవోయిన యా యింతింగని కనుగొని యామెను జంపుడని కొడుకుల కానయిచ్చెను. వారు తల్లి గౌరవము నాలోచించి తండ్రిమాటను జరుపకయే పోయిరి. భార్గవుడు వారింగని మీరు పశుపక్ష్యాది లక్షణములొంది యూరుపేరులేకుండ బొండని శపించెను. అడవికేగి సమిధల మోపు గొని వచ్చిన రాముడు తండ్రికి చాలప్రీతికరు డాశ్రమమున కేతెంచెను. తండ్రి యీ నీచురాలి నీ తల్లని జంపుము, ఆలసింపకుమన నామాట విన్న యాక్షణమ గండ్రగొడ్డలింగొని యామె శిరస్సు నరకెను. అంతట తండ్రి ధార్మిక శ్రేష్ఠుండు సంతోషించెను. మరియు నాకొడుకుతో నేను సంతుష్టినందితిగాన నీవు స్వచ్ఛందమరణము గలవాడవయ్యెదవు. నీలో విష్ణుతేజస్సున్నంతదాక యుద్ధమందు నిన్నొకడు జయింపనేరడు. దశరథుని కొడుకై ధర్మాత్ముడు రాముడవతరించును. రఘువంశమందు సాక్షాద్విష్ణువు మానుషరూపధారియై వచ్చును. నీవాతనిం గలిసికొన్నతరి నాతడు వైష్ణవతేజస్సుతో గూడికొనును. నీవు వచ్చినపని సమాప్తియై నీవా విష్ణుతేజపస్సుతో విడిపడుదువు. ఆతరువాత నీవు శస్త్రముంబట్టవలదు బాధలోనున్న వారిని రక్షించుటకుతప్ప నీ కామీదట నాయుధముపనిలేదు. ఇదిగాక యింకను నీవలచిన కోరికను నడుగుమన పరశురాముడు గురుశ్రేష్ఠా ! మా అమ్మయొక్క యుత్థానమును (లేచుట బ్రతుకుట) నే నడుగుచున్నాను. అట్లే నా సోదరులును లేవవలయును. మా అమ్మకుగాని వారికిగాని యీ జరిగిన విషయమేమాత్రము జ్ఞాపకముండనట్లు వరమర్థించెద నన తండ్రి ఇట్లేయగును. మహాభాగా! నీవు మహాతపస్సుచేసి నీలలోహితుని శంకరుని దేవేశ్వరు నారాధింపుము అని యమ్ముని యనిన యాక్షణమ రేణుక చక్కగ నల్లన నవ్వుచు లేచెను. రాముని భ్రాతలందరునట్లే శాపముక్తులైరి. తండ్రిచే నట్లానతీయబడి రాముడు హిమాలయ గిరిశ్రేష్ఠమునందు రుద్రు నారాధింపగోరి దపస్సు సేసెను. ఈసమయమందే ఇంద్రాది దేవతలు సైంహికేయుని వలన జడిసి శంకరుని శరణందిరి. వారిట్లు విన్నవించుకొనిరి.

దేవాః ఊచుః :

భగవన్‌ ! దేవదేవేశ ! ప్రణతార్తి వినాశన ! సైంహికేయై ర్వయం సర్వైః స్థానేభ్యస్త్వవరోపితాః || 20

సైంహికేయా నథాశ్రిత్య దైత్యా శ్శతసహస్రశః | సర్వే వసన్తి సతతం తేషాం యత్నం వధే కురు ! 21

మహాదేవ ఉవాచ :

శృణ్వన్తు దేవతా స్సర్వాః దానవా దేవకంటకాః | రామేణాహం వధిష్యామి నరబుద్ధ్యా యతస్తు తాన్‌ || 22

మార్కండేయ ఉవాచ :

గతేషు దేవసంఘేషు దేవదేవః పినాకభృత్‌ | ఆహూయ భార్గవం రామ మిదం వచన మబ్రవీత్‌ః || 23

మహాదేవ ఉవాచ :

సైంహికేయాన్‌ దురాచారా నసురాన్‌ జహి పుత్రక !

సమర్థస్తాన్‌ భవాన్‌ హన్తుం నాన్యః కశ్చన విద్యతే || 24

రామ ఉవాచ:

అస్త్రగ్రామం సమగ్రంమే ప్రయచ్ఛ భగసూదన ! | యేనతాన్‌ సుదురాచారాన్‌ ఘాతయిష్యామి దానవాన్‌ || 25

మహాదేవ ఉవాచ :

కింతవాసై#్త్రః భృగుశ్రేష్ఠ ! విష్ణుస్త్వం నాసి మానుషః | వ్యస్త్రస్యాపిన తేశక్తా యోద్ధుం ప్రముఖతస్తవ || 26

రామ ఉవాచ :

ఘాతయిష్యా మ్యహం సర్వాన్‌ సైంహికేయాన్‌ దురాసదాన్‌ |

త్రిపురారే ! మహాభాగ ! త్వదాజ్ఞా పరిబృంహితః || 27

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవముక్త స్త్రిపురాంతకేన రామస్త్రినేత్ర ప్రతిమ ప్రభావః ||

ఆదాయ తీక్షణం పరశుం జగామ యత్రస్థితాస్తే చరిపు ప్రధానాః || 28

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే రామస్య మహేశ్వరాదేశో నామ షట్త్రింశత్త మోధ్యాయః.

భగవంతుడా ! దేవదేవా ! ప్రణతార్తిహర ! హరా! సైంహికేయులు (సింహిక=కశ్యపుని భార్య, ఆమె కొడుకులు రాక్షసులు) మమ్మందరం బదభ్రష్ఠులం జేసిరి. వేలకొలది రాక్షసులా సింహికా సంతానము నండజేరియున్నారు. వారిని వధింప యత్నమొనరింపుమన మహాదేవుండు వినుడు-దానవులు దేవకంటకులు. వారల నేను రాముని సాధనముగాగొని నరుడనుతలంపున నటించి వారలంగూల్చెదను. నావిని దేవతలరుగ పినాకపాణి మహాదేవుడు రాముం బిలిచి నాయనా ! దురాచారులైన సైంహికేయులను నీవు సంహరింపుము. వారిం జంపుటకు నీవు సమర్ధుడవు. ఇంకొకడులేడు. అనవిని ఓ భగసూదన ! సమగ్రమైన యస్త్ర గ్రామము నాకనుగ్రహింపుము. ఆ దుష్టదానవులం దాన హతమొనర్చెదననగా మహాదేవుడిట్లనెను-నీకు అస్త్రముతో పనియేమి? నీవు మనుష్యుడవుగావు. విష్ణుదేవుడవు. అస్త్రరహితుడవైనను నీయెదుట నిలువబడి వీరు యుద్ధము చేయజాలరనగా-రాముడు ఓ త్రిపురారీ ! మహానుభావా! నీ యాజ్ఞచే నుపబృంహితుడనై (పరాక్రమ ప్రభావములు పెంపొందినవాడనై) దురాసదులైన సైంహికేయులను హతమొనర్చెదను. ఇట్లు త్రిపురాంతకుడానతీయ త్రినేత్రునితో సమమగు ప్రభావముగలవాడై పరశురాముడా శత్రు ముఖ్యు లెటనున్నారటకు పదునైన గండ్రగొడ్డలిం గొనియేగెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పరశురామునికీశ్వరాజ్ఞయను ముప్పదియారవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters