Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఅరువదియేడవ అధ్యాయము - దీపదానఫలము లలితకోపాఖ్యానము

మార్కండేయ ఉవాచ : అత్రాప్యుదాహరంతీమ మితిహాసం పురాతనమ్‌ | దీపదానాల్లలితి కాయదవాప పురానృప ! 1

అసీచ్ఛిత్రరథో నామవిదర్భేషుమహీపతిః | తస్యపుత్ర శతంరాజ్ఞో జజ్ఞే పంచదశో త్తరమ్‌ || 2

ఏకైవ కన్యాతస్యా సీల్లలితానామ నామతః | సర్వలక్షణ సంపూర్ణా రూపేణా ప్రతిమాభువి || 3

తాందదౌకాశిరాజాయ సపితాచారుధర్మిణ | శతానితస్యభా ర్యాణం త్రీణ్యాసంశ్చాత్ర ధర్మిణః || 4

తాసాంమధ్యేగ్రమహిషీ లలితాస్య తదాభవత్‌ | విష్ణోరాయతనే తస్యాః సహస్రం రాజసత్తమ || 5

ప్రదీపానాం ప్రజ్వలతి దివారాత్రమరిందమ! | తామిస్రమాశ్వయుక్పక్షం శుక్లపక్షంచ కార్తికాత్‌ || 6

తస్యాః ప్రజ్వలితం దీపముచ్చస్థాన కృతంతథా | తస్మిన్కాలేతథా నిత్యం బ్రాహ్మణావసథేషుసా || 7

నిత్యం భవతిసాయాహ్నే దీపప్రేషణ తత్పరా | చతుష్పథేషు రథ్యాసు దేవతాయతనేషుచ || 8

చైత్యవృక్షేషు గోష్ఠేషు పర్వతానాంచమూర్ధసు | పులినేషునదీనాంచకూప మూలేషు యాదవ || 9

తస్మిన్భవతి సాకాలే దీపదాన వరాయణా | తాంసపత్న్యోథసంగమ్య పప్రచ్ఛు రిదమాదృతాః || 10

మార్కండేయుడీ దీపదానమును గూర్చిన యొక పురాతనేతిహాసము గలదు. లలితికయను సంగన దీపదానము సేసి పొందిన ఫలము వినుము. విదర్భదేశములందు చిత్రరథుడను రాజుండెను. అతనికి నూటపదునేడుగురు పుత్రులుగల్గిరి. కూతురొక్కతియ, లలితకయని యామె పేరు. చక్కని చక్కని లక్షణములన్నియునుగలది. చారుధర్ముడను కాశిరాజునకామోనొసంగెను. అతనికి మూడువందల మంది భార్యలుండిరి. అందరిలో నీ లలితక యగ్రమహిషి. విష్ణ్వాలయములో నామె పెట్టిన దీపములు వేయి రేయింబవళ్ళు చక్కగా వెలుగు చుండును. ముఖ్యముగా అశ్వయుజ కృష్ణపక్షము నందు, కార్తిక శుక్ల పక్షము నందు నామె ఎత్తుగా పెట్టిన దీపసహస్రము మిక్కిలిగ శోభించు చుండెను. అదే పుణ్య కాలము నందామె ప్రతిసాయంకాల మందు బ్రాహ్మణ గృహములకు దీపములు పంపు చుండెడిది. చతుష్పథము లందు (గోశాలలందు) కొండ నెత్తములందు నదీతీరముల నిసుక తిన్నెలందు బావుల మొదల నామెకు దీపములు పెట్టుటే పనిగ నుండెను. అది చూచి యామె సపతులందఱుం గలిసి యాదరమతో నిట్లడిగిరి.

సపత్న్య ఊచుః : సర్వాన్ధర్మాన్పరిత్యజ్యలలితేత్వం సదైవతు | విష్ణోరాయతనే సుభ్రూర్దీవదాన పరాయణా || 11

తదేతత్కథయాస్మాకం లలితే ! కౌతుకంపరమ్‌ | మన్యామహేత్వయావశ్యం దీపదాన ఫలంశ్రుతమ్‌ || 12

లలితికోవాచ : నాహం మత్సరిణీ భద్రానచరాగాది దూషితా | ఏకపత్యాశ్రయా యాతా భవత్యోమమమానదా ః || 13

అపృథగ్ధర్మ చరణాః శృణ్వంతు గదితంమమ | మయై తద్దీవదానస్య యథా వైభుజ్యతే ఫలమ్‌ || 14

హరస్య దయితా భార్యా శైలరాజ సుతావరా! | ఉమా దేవీతి మద్రేషు దేవికాయా సరిద్వరా || 15

నరాణా మనుకంపార్థం బ్రాహ్మణౖరవతారితా | తీరయో రుభయోస్తస్యాః క్షేత్రక్రోశచతుష్టయమ్‌ || 16

తస్మింస్తీర్థేతు పానీయం సర్వతీర్థ ప్రతర్పితమ్‌ | తస్మిం స్తీర్థే మృతామర్త్యాః ప్రాప్నువన్తి శుభాంగతిమ్‌ || 17

శ్రుతాభిలాషితా దృష్టాదేవికా పాపనాశినీ | తస్యాం స్నాత్వా సకృన్మర్త్యో గాణపత్య మవాప్నుయాత్‌ || 18

తస్యాః తీర్థం నృసింహాఖ్యం సర్వ కల్మషనాశనమ్‌ | నృసింహ వపుషా స్నానం కృతం యత్రపురాశుభా || 19

అక్కా! అన్ని ధర్మములు వదలి విష్ణుపునాలయమందు దీపము వెట్టుటదే పనిగ బెట్టుకొన్నావు. లలితా! దీపదానఫల మీవు బాగుగ నాలించితి నను కొందుము. ఆ విశేషము తెలుపుము. మేము వినవలయునని యెంతో ముచ్చట పడుచున్నామన లలితిక వారి కిట్లనియె. నాకు మాత్సర్యము లేదు. (ద్వేషము లేదు) రాగాదులచే చెడను. సుఖముగా నున్నాను. మీరును నేను నొక్కభర్త నీడ నున్నవారము. మీరును నేనును భిన్న ధర్మ పరాయణలముగాము. నేనీ దీపదానము నెట్లనుభవింతునో తెల్పెద వినుండు. హరుని ల్లాలు గిరిరాజు కూతురు. ఉమాదేవి మద్రదేశములందు దేవికా నదీతీరమున నున్నది. ఆమెను బ్రాహ్మణులు నారాయణునను గహము కొఱకవతరింపజేసిరి. ఆ నది యిరుతీరము లందు నాల్గు కోసులు సుక్షేత్రము. ఆ తీర్థ మందలి యుదకము సర్వతీర్థ కల్పితము ఆతీర్థ మందు తను వీగిన వారు పుణ్యగతి నందుదురు. ఆ పుణ్యతీర్థమం గూర్చి విన్నాను. కోరి దర్శించినాను గూడ. అందు తానమాడిన నరుడు గాణాపత్య మందును. (ప్రమథ గణాధిపతియగును.) అనదీ తీర్థము సర్వపాపహరము. నృసింహ తీర్థమనంబడును. నృసింహావతారమెత్తి హరి యిక్కడ స్నానము సేసెను.

సౌవీర రాజస్య పురామైత్రేయోభూత్పురోహితః | తస్మిం స్తీర్థేతదా తేన విష్ణోరాయతనంకృతమ్‌ || 20

అహన్యహని శుశ్రూషాం పుష్పదూపాది తేపనైః | దీపదానాదిభి శ్చైవ చక్రే తత్రసవైద్విజః || 21

కార్తికే దీపకాస్తత్ర ప్రదత్తాస్తేన చైకదా | ఆసీన్నిర్వాణ భూయిష్ఠో దేవార్చా పురతోనిశి || 22

దేవతాయతనేచాసం తథాహమపి మూషికా | ప్రదీప వర్తిహరణ కృతబుద్ధి ర్వరాననే! || 23

గృహీతాచ మయావర్తిః వృషదంశో రురావచ | నష్టాచాహం తదా తస్య మార్జారస్య భయాత్తదా || 24

వర్తిప్రాంతేన నశ్యంత్యా దీపతః ప్రేరితో మయా | జజ్వాల పూర్వవద్దీప్త్యా తస్మిన్నాయతనే పునః || 25

మృతా చాహం తదాజాతా విదర్భరాజ కన్యకా | జాతిస్మరా మహీవస్య మహిషీ చారు ధర్మిణః || 26

ఏషప్రభావో దీపస్య కార్తికే మాసి శోభనాః | దత్తస్యాయతనే విష్ణో ర్యస్యేయం వ్యుష్టి రుత్తమా || 27

యదివో నాస్తి మాత్సర్యం దీపోదేయస్సదా శుభః | అసంకల్పిత మప్యేతత్‌ ప్రేరణం యత్కృతం మయా || 28

కేశవాలయ దీపస్య తస్యేదం భుజ్యతే ఫలమ్‌ | ఏతస్మా త్కారణా ద్దీపానహమేతా సహర్నిశమ్‌ || 29

ప్రయచ్ఛామి హరేర్ధామ్ని జ్ఞాతస్యచహియత్ఫలమ్‌ |

మార్కండేయఉవాచ : ఏవముక్తా స్సపత్న్యస్తాః దీపదానపరాయణాః || 30

బభూవుర్దేవ దేవస్య కేశవస్య నరాగృహే | తతః కాలేనమహతా తేనరాజ్ఞా మహాత్మనా ||

విష్ణులోక మనుప్రాప్తాః పంచత్వం ప్రాప్యమానద || 31

తంలోక మసాద్య నృపేణ సార్ధం సారాజ పుత్రీ కమలాభ రూపా |

రేమే మహీపాల! ముదా సమేతా దీప ప్రదానాచ్చ్యవనా ద్విముక్తా || 32

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే దీపమాహాత్మ్యే లలితికోపాఖ్యానం నామ సప్తషష్ట్యధిక శతతమోధ్యాయః.

మున్ను సౌవీరరాజు పురోహితుడు మైత్రేయుడా తీర్థమందు విష్ణ్వాలయము కట్టించెను. అద్విజుడక్కడ స్వామిని బ్రతిదినము సేవించెను గంధపుష్ప ధూపదీపాదుల నర్చించెను. కార్తిక మందక్కడ దీపములను గూడ పెట్టెను. ఒకతఱి రాత్రి దేవతార్చన ముందున్న యొక దీప మించుమించు పెద్దదగు స్థితిలో నుండెను. అపుడాలయమందెలుక నైదీపములోని వత్తి హరింపవలయు నని యనుచుంటిని. వత్తిని నేను బట్టితిని పిల్లి మ్యాపుమ్యాపు మన్నది. దానివలన జడుపున ప్రాణము విడిచితిని. వత్తి పట్టువిడిచి దానికి దాపుగ నేను బడిన తఱి దీప మెగయించుట జరిగినది. ఆదీపము తొంటియట్ల యయ్యాలయ మందు చక్కగ వెలింగెను. అట నేనుచచ్చి విదర్భరాజు కూతురునై పుట్టితిని. పూర్వజన్మ స్మృతియుం గలిగినది. ఈ చారుధర్మునికి పట్టమహిషినైతిని. కల్యాణులారా! ఇది కార్తిక మాస దీపముయొక్క ప్రభావము. అందులోనిది విష్ణువునాలయము. కార్తిక మాసము. ఇందిట్లు దీపము వెట్టిన ఫలమింతటిది. మీకు మచ్చరము లేదేని మీరీదీపము పెట్టుడు. అనుకోకుండనే నేనీ ప్రేరణ చేయుట జరిగినది. గోవిందాలయ దీపదాన ఫలమిదియే ననుభవించుచున్నాను. ఈ తెలిసినందులకు ఫలముగా నేనీ హరియాలయమున రేయింబవళ్ళు దీపములు పెట్టుచున్నాను. అనవిని లలిత సవతులందరు హరిమందిర మందు దీపదాన పరాయణులయిరి. అవల చిరకాలమునకు వారు పరమపదించి అమహాత్ముడగు రాజుతో విష్ణులోకమందిరి. లక్ష్మీస్వరూపురాలగు రాజపుత్రి లలితయు సవతులు నాఱనితో విష్ణులోక మంది దీపదాన ప్రభావముచే పునరావృత్తిలేక యాతనితో నటవిహరించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున లలితోపాఖ్యానమను నూటయరువదియేడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters