Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయిరువదిమూడవ అధ్యాయము - వాయుస్తోత్రము

బృహస్పతి రువాచ : 

జగదాయుర్భవాన్వాయో : శరీరస్థః శరీరిణామ్‌ | అనంతమూర్తి ర్ధర్మాత్మా దేవోనారాయణః ప్రభుః || 1

అచింత్య వీర్యః పురుషః సదాధారః సనాతనః | సాక్షిభూతశ్చ సర్వేషాం కర్మణోః శుభపాపయోః || 2

ఘ్రాణ స్త్వం దేహినాం దేహే చేష్టితంచ తధా భవాన్‌ | భవాన్‌ రుద్రో భవాన్‌బ్రహ్మా భవాన్విష్ణుః సనాతనః || 3

తవాయత్తం హి జగతాం వర్షావర్షం శుభాశుభమ్‌ | భవాన్విసృజతే మేఘాన్‌ భవాన్సంహరతే పునః || 4

భవాన్ధారయతే మేఘాన్‌ వర్సమాణాం స్తధా దివి | ఆదిత్యరశ్మి పీతస్య మేఘోదరగతస్యచ || 5

రసస్యభం క్తా సతతం భవానేవనభస్తతే | తడిల్లతానాంచతధా భవాన్‌ కర్తా జగత్త్రయే || 6

అంభసాంభేదకాలేతు సర్వాధారః సమీరణః | పరస్పరంహి చవత స్తధా సంఘటనా త్ప్రభో! || 7

గర్జితం జాయతే లోకే మేఘోధర గతం మహత్‌ | బలేన త్వత్సమంనాన్యంభూతం పశ్యామి భూతలే || 8

తస్మాత్త్వంకురు సాహాయ్యం వేదమూర్తే ర్యిభావసోః || 9

ఏతావదుక్తోంగిసామహాత్మా | తధేతి తంప్రాహసమీరణోపి |

జగామ యుద్ధం సహపావకేన | దైత్యేశ్వరాన్‌ దేశరిపూన్మహాత్మా || 10

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

వాయుస్తోత్రంనామ త్రయో వింశత్యధిక శతతమోధ్యాయః.

బృహస్పతియనియె. ఓ వాయుదేవతా ! నీవుజగముయొక్క యాయుస్వరూపుడవు. శరీరుల శరీరమందుందువు. అనంత మూర్తివి. ధర్మాత్ముడవు. నారాయణ దేవుడనీవే. నీ వీర్యమూహింప వలను గానిది. పురుషుడవు సదాధారుడవు. సనాతనుడవు శాభా శుభ సర్వకర్మ సాక్షివి. దేహుల మేనిలోని ఘ్రాణంద్రియము నీవు. కదలిక యంతయు నీవే. త్రిమూర్తులు నీవే. జగత్తుయొక్క వర్షావర్షము, శుభాశుభములు నీయందే ఆధారపడి యున్నవి. నీవు మేఘములను వదలుదువు. ఉపసంహరింతువు. అవివర్షించుతరి నాకాశమందీవు వానిని ధరింతువు. ఆదిత్య కిరణములు త్రావగా మేఘములలో జేరిన రసమును (నీటిని) ఆకసమందు విభజించు వాడవు నీవే. మెరుపు తీగలకు నీవు కర్తవు. మేఘగర్భమందలి నీటిని నీవు విభజించుతరి సర్వాధారుడగు వాయువీవు. ఉదకముతో పొందిన సంఘర్షణ వలన పెద్ద గర్జితము (ఉరుము) పుట్టును. నీతో సమబలు నింకొక భూతముం గానను. (మహాబలుడను పేరు నీకు సార్థకము) అందుచే వేదమూర్తి యైన యగ్నికి సహాయము సేయుము అని యింత వరకంగీరసుడు పలికినది విని వాయుభగవానుడట్లేయని దేవ శత్రువులను దైత్యేశ్వరులపై కగ్నితో గూడ యుద్ధమున కేగెను.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున వాయుస్తోత్రమను నూట యిరువదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters