Sri Vamana Mahapuranam    Chapters   

నలుబది మూడవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతః స్వసైన్యమాలక్ష్య నిహతం ప్రమథైరథ | అంధకో7భ్యేత్య శుక్రంతు ఇదం వచనమబ్రవీత్‌| 1

భగవం స్త్వాం సమాశ్రిత్య వయంబాధామ దేవతాః | అథా7న్యానపివిప్రర్షే గంధర్వ సుర కిన్నరాన్‌. 2

తదియంపశ్య భగవన్‌ మయాగుప్తా వరూథినీ | అనాదేవయథానారీ ప్రమథైరపి కాల్యతే. 3

కుజంభాద్యాశ్చ నిహతా భ్రాతరోమమ భార్గవ | అక్షతాః ప్రమథాశ్చామీ కురుక్షేత్ర ఫలంయథా. 4

తస్మాత్కురుష్వశ్రే యోనో నజీయేమయథాపరైః | జయేమచవరాన్‌ యుద్దే తథాత్వం కర్తుమర్హసి. 5

శుక్రో7ంధకవచః శ్రుత్వా సాంత్వయన్‌ పరమాద్భుతమ్‌ | వచనంప్రాహదేవర్షే బ్రహ్మర్షిర్దానవేశ్వరమ్‌.

త్వద్దితార్థం యతిష్యామి కరిష్యామి తవప్రియమ్‌. 6

ఇత్యేవముక్త్వా వచనం విద్యాం సంజీవనీం కవిః | ఆవర్తయామాసతదా విధానేన శుచివ్రతః. 7

తస్యామావర్త్య మానాయాం విద్యాయామ సురేశ్వరాః | యేహతాః ప్రథమం యుద్ధే దానవాస్తేసముత్థితాః. 8

కుజంభాదిషు దైత్యేషు భూయ ఏ వోత్థితేష్వథ | యుద్ధాయాభ్యాగతే ష్వేవ నందీ శంకరమబ్రవీత్‌. 9

మహాదేవ వచోమహ్యం శృణుత్వం పరమాద్భుతం | అవిచింత్య మసహ్యంచ మృతానాం జీవనం పునః 10

యేహతాః ప్రమథైర్దైత్యా యదాశక్త్యారణాజిరే | తేసముజ్జీవితా భూయో భార్గవేణాథ విద్యయా 11

తదిదంతైర్మహా దేవ మహత్కర్మ కృతంరణ | సంజాతం స్వల్పమేవేశ శుక్రవిద్యా బలాశ్రయాత్‌. 12

ఇత్యావముక్తే వచనే నందినాకుల నందినా | ప్రత్యువాచ ప్రభుః ప్రీత్యా స్వార్థ సాధనముత్తమమ్‌ 13

గచ్ఛ శుక్రం గణపతే మమాంతిక ముపానయ | అహంతం సంయమిష్యామి యథాయోగం సమేత్యహి. 14

ఇత్యేవముక్తో రుద్రేణ నందీ గణపతిస్తతః | సమాజగామ దైత్యానాం చమూం శుక్రజిఘృక్షయా. 15

పులస్త్యుడు చెప్పప్రారంభించాడు : ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి యిలా అన్నాడు. ''భగవన్‌! తమ అండ చూచుకొని మేము దేవ కిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చింది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓ భార్గవా! ఇక ప్రమథులో కురుక్షేత్రం ఫలం లాగా అక్షయంగా ఉన్నారు. కాబట్టి మేము శత్రువుల చేతిలో పరాజయం పొందకుండా తగిన ఉపాయం చేయండి. అంధకుని మాటలు విని, దేవర్షీ ! ఆ బ్రహ్మర్షి దానవేశ్వరునితో అద్భుత వచనాలు పలికాడు. అంధకా ఊరడిల్లుము. నీమేలుకోసం యత్నిస్తాను. నీకు ప్రియం కలిగిస్తాను. అలా ఓదార్చి ఆ కవి, శుచియై సంజీవని విద్యను విధివిధానంగా వినియోగించగా అంతకు ముందు యుద్ధంలో చనిపోయిన దైత్యదానవ శ్రేష్ఠులంతా లేచి కూర్చున్నారు. కుజంభాది దైత్యులు మరణించి మరల లేవడం యుద్ధానికిరావడం చూచి నందీశ్వరుడు శంకరునితో ఇలా అన్నాడు. మహాదేవా ! ఈ అద్భుతాన్ని ఆలకించండి. అనూహ్యంగా అసంభవమైనది. చచ్చిన వారలు మరల బ్రదుకుట సంభవించినది. ప్రమథుల శక్తిశౌర్యాల వల్ల యుద్ధంలో మరణించిన దైత్యులనందరనూ భార్గవుడు తనవిద్యచేత బ్రతికించాడు. ఆ విధంగా మేము గాంచిన మహత్‌ సంగ్రామమంతా వ్యర్థం గావించబడింది. నంది మాటలు విని శివుడు స్వకార్యసిద్ధికై అతనితో నీవు వెళ్ళి ఆ శుక్రుని నా ఎదుట గొనిరమ్ము. నేను సమయోచితంగా మాటలాడి అతనిని నిరోధించెదనని, వానిని పంపాడు. అలా శంకరునిచే ఆదేశింపబడి ఆ గణాధిపతి అయిన నంది, శుక్రుని పట్టుకొనుటకై రాక్షస సైన్యం వద్దకు వెళ్ళాడు.

తందదర్శా సురశ్రేష్ఠో బలవాన్‌ హయకంధరః | సంరురోధతదామార్గం సింహస్యేవ పశుర్వనే. 16

సముపేత్యాహన న్నందీ వజ్రేణ శతపర్వణా | సపపాతాథనిః సంజ్ఞో య¸°నందీ తతస్త్వరన్‌. 17

తతఃకుజంభోజంభశ్చ బలోవృత్ర స్త్వయః శిరాః | పంచదానవ శార్దూలా నందినం సముపాద్రవన్‌. 18

తథా7న్యే దానవశ్రేష్ఠా మయహ్లాద పురోగమాః | నానా ప్రహరణాయుద్ధే గణనాథ మభిద్రవన్‌. 19

తతోగణానామధిపం కుట్యమానం మహాబలైః | సమపశ్యంతదేవాస్తం పితామహ పురోగమాః. 20

తందృష్ట్వా భగవాన్‌ బ్రహ్మా ప్రాహశక్ర పురోగమాన్‌ |

సాహాయ్యం క్రియతాంశంభో రేతదంతర ముత్తమమ్‌. 21

పితామహోక్తం వచనం శ్రుత్వాదేవాః సవాసవాః | సమాపతంతవేగేన శివసైన్య మథాంబరాత్‌. 22

తేషామాపతతాం వేగః ప్రమథానాం బలేబభౌ | ఆపగానాం మహావేగం పతంతీనాం మహార్ణవే. 23

తతోహలహలా శబ్దః సమజాయతచోభయోః | బలయోర్ఘో రనంకాశో సురప్రమథ యోరథ. 24

తమంతర ముపాగమ్య నందీసంగృహ్యవేగవాన్‌ |

రథాద్‌ భార్గవమాక్రామ త్పింహః క్షుద్రమృగంయథా. 25

తమాదాయ హరాభ్యాశ మాగమద్‌ గణనాయకః | నిపాత్యరక్షిణః సర్వా నథశుక్రం న్యవేదయత్‌. 26

తమానీతం కవింశర్వః ప్రాక్షిపద్వదనే ప్రభుః | భార్గవంత్వావృతతనుం జఠరేసంన్యవేశయత్‌. 27

సశంభునా కవిశ్రేష్ఠో గ్రస్తో జఠరమాస్థితః | తుష్టావ భగవంతంతం మునిర్వాగ్భి రథాదరాత్‌. 28

శుక్ర ఉవాచ :

వరదాయ నమస్తుభ్యం హరాయ గుణశాలినేః | శంకరాయ మహేశాయ త్ర్యంబకాయ నమోనమః. 29

జీవనాయ నమస్తుభ్యం లోకనాథ వృషాకపే | మదనాగ్నే కాలశత్రో వామదేవాయతే నమః. 30

స్థాణవే విశ్వరూపాయ వామనాయ సదాగతే | మహాదేవాయ శర్వాయ ఈశ్వరాయ నమోనమః. 31

త్రినయన హరభవ శంకర ఉమాపతే జీమూత కేతో

గుహాగృహ శ్మశాన నిరత భూతివిలేపన శూలపాణ పశుపతే|

గోపతే తత్పురుష సత్తమ నమోనమస్తే 32

ఇత్దంస్తుతః కవివరేణ హరో7థభక్త్యా ప్రీతోవరం వరయదద్మిత వేత్యువాచ|

సప్రాహ దేవవర దేహివరం మమాద్య యద్వైతవైవ జఠరాత్ర్పతి నిర్గమో7స్తు. 33

తతోహరో7క్షీణి తదానిరుధ్య ప్రాహద్విజేంద్రాద్య వినిర్గమస్వ|

ఇత్యుక్తమాత్రో విభునాచచార దేవోదరే భార్గవ పుంగవస్తు. 34

పరిభ్రమన్‌ దదర్శాథ శంభో రేవోదరేకవిః | భువనార్ణవ పాతాళాన్‌ వృతాన్‌ స్థావరజంగమైః. 35

ఆదిత్యాన్‌ వసవోరుద్రాన్‌ విశ్వేదేవాన్‌ గణాంస్తథా |

యక్షాన్‌ కింపురుషాద్యాదీన్‌ గంధర్వాప్సరసాంగణాన్‌. 36

అలా వస్తూన్న నందిని చూచి రాక్షసవీరుడైన హయకంధరుడాయనను అడ్డగించాడు. అడవిలో సింహాన్నెదిరించిన లేడిలాగ తనకెదురైన ఆ దైత్యునిమీదకు లంఘించి నంది, నూరు అంచులుగల తన వజ్రాయుధంతో మోది మూర్చబడగొట్టాడు. వానిని తప్పించుకొని వస్తూన్న నందిని కుజంభ, జంభ, బలి, వృత్ర, ఆయఃశిరులను అయిదుగురు దైత్యశార్దూలాలు చుట్టుముట్టారు. మయుడుహ్లాదుడాదిగా గల యితర దానవ వీరులు గూడ అనేక ఆయుధాలు చేపట్టి నందిమీద దాడిచేశారు. అలా ఆ రాక్షసవీరులచే దెబ్బలు తింటూన్న ఆ గణఆధిపతిని ఆకాశంలో నిలబడి బ్రహ్మమొదలయిన దేవతలు చూచారు. ఆ పరిస్థితి గమనించిన బ్రహ్మ యింద్రునితో, వెళ్ళండి మీరంతా వెళ్ళి ఈ అదనున శంకరునకు సహాయపడండని పంపాడు. దానితో యింద్రాదులంతా వాయువేగంతో శివసైన్యానికి బాసటగా ఆకాశాన్నుంచి ఊడిపడి నిలచారు. మహానదులంతా త్వరత్వరగా మహాసముద్రంలోపడి కలిసినట్లా దేవతలు శివసైన్యంలో పడి కలిసిపోవడంతో భయంకరమైన ఘోషతో యిరువర్గాలు తలపడ్డాయి. ఆ గందరగోళంలో తప్పించుకుని ఆ నందీశ్వరుడు వెళ్ళి రథంమీద నుంచి సింహం కుందేలును లాగినట్లు శుక్రుణ్ణి ఒడిసి పట్టుకొని, ఆయన రక్షణ కోసం వచ్చిన వారందరినీ నేలబడగొట్టి శివుని ముందుతెచ్చి పడవేశాడు. ఆ శుక్రుని అమాంతంగా శివుడు తన నోటిలో వేసికొని మింగివేశాడు. అలా శివుని ఉదరంలో బంధింపబడి ఆ భార్గవుడు భక్త్యాదరాతలో నామహాదేవుని యిలాస్తుతించాడు. ''హరా! వరదా! గుణశాలీ నీకు నమస్కారము. శంకరా త్ర్యంబకా మహేశా నీకు నమస్సులు, జీవనా! లోకేశ్వరా! వృషాకపీ! మదనాంతకా! కాలనాశనా! వామదేవా నీకు అంజలులు! స్థాణూ, విశ్వరూపా, సదాగతీ, వామనా, మహాదేవా శర్వా! ఈశ్వరా నమోవాకములు. త్రినేత్రా హరా, భవా శంకరా ఉమాధవా జీమూతకేతూగూహావాసీ, శ్మశానప్రియా, భస్మధరా, శూలధరా పశుపతీ గోపతీ తత్పురుషోత్తమా! నీకు మాటిమాటికీ నమస్సులు. ఇలా స్తోత్రం చేసిన శుక్రుని పట్ల ప్రీతుడై శంకరుడు వరము కోరుకోమనగా నతడు నీ ఉదరం నుండి బయటపడునట్లనుగ్రహించమని వేడుకొన్నాడు. అంతట హరుడు తన నేత్రాలు మూసికొని, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా ! నా కడుపులోనుండి బయటకు వెళ్ళుమని ఆదేశించాడు. అలా శివుని ఉదరంలో నుండి బయటకు వచ్చుటకు ప్రయత్నిస్తూ అందులో పాతాళాది భూవనాలను సాగరాలను సచరాచర జీవులను ఆదిత్య రుద్ర వసు విశ్వదేవాదులను యక్షకిన్నర గంధర్వాప్సరస సమూహాలను, మునులను, మనుష్యులను చూచి, పరిభ్రమించసాగాడు.

మునీన్‌ మనుజసాధ్యాంశ్చ పశుకీట పిపీలికాన్‌ | వృక్షగుల్మాన్‌ గిరీన్‌ వల్ల్యః ఫలమూ లౌషధానిచ. 37

స్థలస్థాంశ్చ జలస్థాంశ్చ నిమిషాన్నిమిషానపి | చతుష్పదాన్‌ సద్విపదాన్‌ స్థావరాన్‌ జంగమానపి. 38

అవ్యక్తాంశ్చైవ వ్యక్తాంశ్చ సగుణాన్నిర్గుణానపి | సదృష్ట్వా కౌతుకావిష్ణః నరిబధ్రామ భార్గవః |

తత్రాసతో భార్గవస్య దివ్యః సంవత్సరోగతః. 39

నచాంతమలభద్‌ బ్రహ్మం స్తతః శ్రాంతో7భవత్కవిః సశ్రాంతం వీక్ష్యచాత్మానం నాలభన్నిర్గమంవశీ|

భక్తినమ్రో మహాదేవం శరణం సముపాగమత్‌. 40

శుక్ర ఉవాచ :

విశ్వరూప మహారూపః విశ్వరూపాక్ష సూత్రధృక్‌ | సహస్రాక్ష మహాదేవ త్వామహం శరణంగతః . 41

నమో7స్తుతే శంకర శర్వశంభో సహస్రనేత్రాం ఘ్రిభుజంగభూషణ|

దృష్ట్వైవ సర్వాన్‌ భువనాంస్తవోదరే శ్రాంతో భవంతం శరణం ప్రసన్నః. 42

ఇత్యేవముక్తే వచనే మహాత్మా శంభుర్వచః ప్రాహతతోవిహస్య|

నిర్గచ్ఛపుత్రో7సి మమాధునాత్వం శిశ్నేనభో భార్గవవంశచంద్రః. 43

నామ్నాతు శుక్రేతి చరాచరాస్త్వాం స్తోష్యంతి నైవాత్ర విచార్యమన్యత్‌|

ఇత్యేవముక్త్వా భగవాన్‌ ముమోచ శిశ్నేనశుక్రం సచనిర్జగామ. 44

వినిర్గతో భార్గవవంశ చంద్రః శుక్రత్వ మాపద్య మహానుభావః|

ప్రణమ్య శంభుంస జగామతూర్ణం మహాసురాణాం బలముత్తమౌజాః. 45

భార్గవే పునరాయాతే దానవా ముదితాభవన్‌ | పునర్యుద్దాయ విదధు ర్మతిం సహగణశ్వరైః. 46

గణశ్వరా స్తానసురాన్‌ సహామరగణౖతథ | యుయుధుః సంకులం యుద్ధం సర్వ ఏవజయేప్సవః. 47

తతో7సుర గణానాంచ దేవతా నాంచయుధ్యతామ్‌|

ద్వంద్వయుద్ధం సమభవద్‌ ఘోరరూపం తపోధన. 48

అంధకోనందినం యుద్ధే శంకుకర్ణం త్వయః శిరాః | కుంభధ్వజం బలిర్దీమాన్‌ నందిషేణం విరోచనః. 49

అశ్వగ్రీవోవిశాఖంచ శాఖోవృత్ర మయోధయత్‌ | బాణస్తథానైగమేయం బలం రాక్షసపుంగవః. 50

వినాయకో మహావీర్యః పరశ్వథ ధరోరణ | సంక్రుద్దో రాక్షసశ్రేష్ఠం తుహుండం సమయోధయత్‌. 51

శివుని ఉదరంలో తిరుగుతూ ఆ భార్గవుడు పశుకీటపిపీలికాలను వృక్షగుల్మలతాదులను ఫలమూలాలను ఓషధులను స్థల జలచరాలను అనిమిషులను నిమేషులను, చతుష్పాదులను, ద్విపాదులను, వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ ప్రాణులను చూస్తూ అత్యంత కౌతుకంతో ఒకే దివ్య సంవత్సరకాలం తిరుగాడుతూ నడపినా బయట పడేదారి కనుగొనలేకపోయాడు. ఓ నారదా! అలా తిరిగి తిరిగి అలసిపోయి కర్తవ్యం తోచక భక్తితో ఆ పరమ శివునకు శరణాగతుడై ఇలా ప్రార్థించాడు. ''ఓ మహారూపా! అక్ష సూత్రాలను ధరిచిన విశ్వమూర్తీ సహస్రాక్షా మహాదేవ ప్రభో! నీకు శరణాగతుడనయ్యాను. ఓ శంకరా శర్వాశంభో సహస్ర నేత్ర చరణధరా భుజభూషణా! నీ విశాల హృదయంలో సకల భువనాలను దర్శించి అలసిపోయి నీ పాదలకడ ఆత్మ సమర్పణం చేస్తున్నాను. నన్ను కరుణించుము''. శుక్రుని దీన పరిదేవనం విని మహాత్ముడగు శంభుడు నవ్వి ఇలా అన్నాడు. ''భార్గవా! నీవునాకు పుత్రుడవైనావు. నా శిశ్నంద్వారా బయటకు రమ్ము. ఇతర విచారాలన్నీ మానుము. నేటి నుంచి నీవు 'శుక్రు'డనే పేరుతో చరాచర జీవులందరకు స్తపనీయుడవు అవుతావు''. అలా చెప్పి శంకరుడా భార్గవుని శిశ్న మార్గాన బయటకు వదిలాడు. అలా శిశ్న ద్వారాన వెలువడి భార్గవుడు శుక్రమహానుభావుడుగా ఖ్యాతుడయ్యాడు. అంతట నాతడు శర్వునకు ప్రణమిల్లి త్వరగా రాక్షస సేనలోకివెళ్ళి చేరాడు. తమ గురువు తిరిగి వచ్చినందులకా దానవులంతా సంతోషించి గణాధిపతులతో మరల యుద్ధానికి సన్నద్దులయ్యారు. శివగణాధిపతులు గూడ దేవగణాలతో కలిసి ఆ దానవులతో విజయకాంక్షతో సంకుల సమరం గావించారు. ''ఓ తపోధనా ! పరస్పర జయకాంక్షతో తలపడిన వారల పోరు భయంకరమైన ద్వంద్వ యుద్ధంతో మరింత ఘోరమైంది. అంధకుడు నందితో, ఆయఃశిరుడు శంకరునితో, బలి కుంభధ్వజునితో, విరోచనుడు నందిషేణునితో , అశ్వగ్రీవుడు విశాఖునితో, వృత్రుడు శాఖునితో, బాణుడు నైగమేయుడగు బలునితో తలపడ్డారు. మహా వీర్యుడగు వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి రాక్షస శ్రేష్ఠుడు తుహుండునితో ఢీకొనగా దుర్యోధనుడు మహాబలి ఘంటాకర్ణునితో పెనుగులాడ మొదలుపెట్టాడు.

హస్తీచ కుండజఠరం హ్లాదోవీరం ఘటోదరమ్‌ | ఏతేహిబలినాం శ్రేష్ఠా దానవాః ప్రమథాస్తథా|

సంయోధయంతి దేవర్షే దివ్యాబ్దానాం శతానిషట్‌. 52

శతుక్రతు మథాయాంతం వజ్రపాణి మభిస్థితమ్‌ | వారయామాస బలవాన్‌ జంభోనామ మహాసురః. 53

శంభునామా7సురపతిః సబ్రహ్మాణ మయోధయత్‌ | మహౌజసం కుజంభశ్చ విష్ణుం దైత్యాంతకారిణమ్‌. 54

వినస్వంతం రణశాల్వో వరుణం త్రిశిరాస్తథా | ద్విమూర్ధాపనవం సోమం రాహుః మిత్రంవిరూపధృక్‌. 55

అష్టౌయేవసవః ఖ్యాతా ధరాద్యాస్తే మహాసురాన్‌ | అష్టానేవ మహేష్వాసాన్‌ వారయామాసురాహవే. 56

సరభః శలభః పాకః పురో7థవిపృథుః పృథుః | వాతాపీచేల్వలశ్చైవ నానాశస్త్రాస్త్ర యోధినః. 57

విశ్వేదేవగణాన్‌ సర్వాన్‌ విష్వక్సేన పురోగమాన్‌ | ఏకఏవరణ రుద్రః కాలనేమిర్మహాసురః . 58

ఏకాదశైవయే రుద్రా స్తానేకో7పి రణోత్కటః | యోధయామాస తేజస్వీ విద్యున్మాలీ మహాసురః. 59

ద్వావశ్వినౌచ నరకో భాస్కరానేవ శంబరః | సాధ్యాన్‌ మరుద్గణాంశ్చైవ నివాతకవచాదయః. 60

ఏవం ద్వంద్వసహస్రాణి ప్రమథామర ధానవైః | కృతానిచ సురాబ్దానాం దశతీః షట్‌ మహామునే. 61

యదానశకితా యోద్దుం దైవతైరమ రారయః|

తదామాయాం సమాశ్రిత్య గ్రసంతః క్రమశో7వ్యయాన్‌. 62

తతో7భవచ్ఛైల పృష్ఠం ప్రావృద భ్రసమప్రభైః | ఆవృతం వర్జితం సర్వైః ప్రమథైరమరైరపి. 63

దృష్ట్వా శూన్యం గిరిప్రస్థం గ్రస్తాంశ్చ ప్రమథామరాన్‌ | క్రోధాదుత్పాయామాస రుద్రోజృంభాయికాంవశీ 64

తయాస్పృష్ణా దనుసుతా అలసామందభాషిణః | వదనం వికృతం కృత్వా ముక్త శస్త్రం విజృంభిరే. 65

జృంభమాణషుచ తదా దానవేషు గణశ్వరాః | సురాశ్చనిర్యయు స్తూర్ణం దైత్యదేహే భ్య ఆకులాః. 66

మేఘప్రభేభ్యో దేత్యేభ్యో నిర్గచ్ఛంతో7మరోత్తమాః | శోభంతే పద్మపత్రాక్షా మేఘేభ్య ఇవ విద్యుతః. 67

గణామరేషుచసమం నిర్గతేషుతపోధన | ఆయుధ్యంత మహాత్మానో భూయ ఏవాతికోపితాః. 68

హస్తి కుండోదరునితో, హ్లాదుడు వీరుడైన ఘటోదరునితో, ఇలా ఆ పరాక్రమవంతులైన రాక్షసులు ప్రమథులు పరస్పరం ఓ దేవర్షీ! వందల దివ్య సంవత్సరాలు యుద్ధం చేశారు. అంత వరకు ప్రక్కన నిలబడియున్న ఇంద్రుడు వజ్రాయుధంతో యుద్ధానికి రాగా జంభుడను మహాదైత్యుడాయనను అడ్డగించాడు. శంభుడను దైత్యుడు బ్రహ్మతో, కుజంభుడను వీరుడు, రాక్షసాంతకుడూ మహౌజసుడునగు విష్ణువుతో, శాల్వుడు వినస్వంతునితో, త్రిశిరుడు వరుణునితో ద్వైమూర్ధుడు వాయువుతో, రాహువు చంద్రునితో, విరూపధృక్‌ మిత్రునితో పోరు సాగించారు. ధరుడు మొదలుగా గల వసువులెనమండుగురూ, శరభ, శలభ, పాక, పృథు, విపృథు, వాతాపి యిల్వలులను ఎనిమిది మంది మహా దైత్యులతో సంగ్రామం సాగించారు. విష్వక్సేనుడాదిగాగల విశ్వదేవగణాల వారినందరనూ అసహాయ శూరుడైన కాలనేమి అనే రాక్షసుడొక్కడే ఎదుర్కొన్నాడు. విద్యున్మాలి అనే మహాదైత్యుడొక్కడే రణకుతూహలంతో ఏకాదశ రుద్రులమీద విరుచుకపడ్డాడు. నరకుడు అశ్వినులతో, ద్వాదశాదిత్యులతో శంబరుడు, నివాతకవచ లిర్వురు, మిగిలిన సాధ్యులతో మరుత్తలతో తలపడి పోరు సాగించారు. ఈ విధంగా ప్రమథులు, దేవతలు దానవవీరులతో వేలాది జంటలుగా నేర్పడి ఆరువది దివ్యసంవత్సరాల కాలం ఘోరంగా పోరాడారు. అయినా ఆ ప్రమథామరులను, రాక్షసులు నిర్జింపజాలక తమ మాయను గప్పి వారందరనూ మ్రింగివేశారు. అలా ప్రమథులను దేవతలను రాక్షసులు మ్రింగివేయగా నా మందరగిరి శిఖరం నల్లని వర్షాకాలపు మేఘాలతో కప్పబడిన కొండకొమ్ములాగా కనిపించిది. రాక్షసుల మాయను గ్రిహించిన మహేశ్వరుడుగ్రుడై ఒక్క పర్యాయం గట్టిగా ఆవులించాడు. ఆయన ఆవులింత గాలి సోకినంతనే ఆ మహా దానవులంతా ఆలస్యం (సోమరితనం) తో స్పూర్తిని కోల్పోయి మెల్లగా గొణుగుకుంటూ వికారంగా తమ నోళ్ళను తెరచి, చేతుల్లోని ఆయుధాలను జారవిడిచి, ఆవలించసాగారు. అలా ఆ దైత్యులంతా నోళ్లు తెరవగానే వారలు మ్రింగిన ప్రమథులు దేవతలూ అందరూ , ఆకులతో వాళ్ళ శరీరాల్లో నుంచి బయటపడ్డారు. కారుమేఘాల్లాంటి రాక్షసుల నోళ్ళ నుంచి దేవతలు ప్రమథులు తమ సహజ నేత్ర కాంతులతో బయట పడటంతో, మెరుపు తీగ లతో నిండిన మేఘాల్లాగ ఆ దృశ్యం శోభించింది. ఓ తపోధనా! అలా బయటపడిన దేవతలు ప్రమథులు యినుమడించిన క్రోధంతో మరల దానవులతో యుద్ధం చేయసాగారు.

తతస్తు దేవైః సగణౖః దానవాః శర్వపాలితైః | పరాజీయంతసంగ్రామే భూయోభూయస్త్వహర్నిశమ్‌. 69

తతస్త్రినేత్రః స్వాంసంధ్యాం సప్తాబ్ధ శతికేగతే | కాలే7భ్యుపాసత తదా సో7ష్టాదశభుజో7వ్యయః. 70

సంస్పృశ్యాపః సరస్వత్యాం స్నాత్వాచ విధినాహరః |

కృతార్థో భక్తిమాన్‌ మూర్ధ్నా పుష్పాంజలి ముపాక్షిపత్‌. 71

తతోననామశిరసా తతశ్చక్రే ప్రదక్షిణమ్‌ | హీరణ్య గర్భేత్యాదిత్య ముపతస్థే జజావహ. 72

త్వష్ట్రైః నమోనమస్తే7స్తుః సమ్యగుచ్చార్య శూలధృక్‌|

ననర్త భావగంభీరం దోర్ధండం భ్రామయన్‌ బలాత్‌. 73

పరినృత్యతి దేవేశే గణాశ్చైవామరాస్తదా | నృత్యంతే భావసంయుక్తా హరస్యాను విలాసినః. 74

సంధ్యాముపాన్య దేవేశః పరినృత్య యథేచ్ఛయా | యుద్దాయదానవైః సార్థం మతింభూయః సమాధధే. 75

తతో7మరగణౖః సర్వైః త్రినేత్ర భూజపాలితైః | దానవానిర్జితాః సర్వే బలిభిర్భయ వర్జితైః. 76

స్వబలం నిర్జితం దృష్ట్వా మత్వా 7జేయంచ శంకరమ్‌ | అంధకః సుందమాహూయ ఇదంవచనమబ్రవీత్‌. 77

సుందః భ్రాతా7పిమేవీరః విశ్వాసం సర్వవస్తుషు |

తద్వదామ్యద్య యద్వాక్యం తచ్ఛ్రుత్వాయత్‌ క్షమంకురు. 78

దుర్జమో7సౌరణపటు ర్ధర్మాత్మా కారణాంతరైః | సమానతే హిహృదయే పద్మాక్షీ శైలనందినీ. 79

తదుత్తిష్ఠస్వగచ్ఛమో యత్రాస్తే చారుహాసినీ | తత్రైనాం మోషయిష్యామి హరరూపేణదానవ. 80

భవాన్‌ భవస్వానుచరో భవనందీ గణశ్వరః | తతోగత్వా7థ భుక్త్వా తాం జేష్యామి ప్రమథాన్‌సురాన్‌. 81

ఇత్యేవముక్తేవచనే బాఢం సుందో7భ్యబాషత | సమజాయతశైలాది రంధకఃశంకరో7ప్య భూత్‌. 82

నందిరుద్రౌతతో భూత్వా మహాసురచమూపతీ | సంప్రాప్తే మందరగిరిం ప్రహారైః క్షతవిగ్రహౌ. 83.

హస్తమాలంబ్య సుందన్య అంధకోహర మందిరమ్‌ | వివేశ నిర్వశంకేన చిత్తే నాసుర సత్తమః | 84

తతోగిరి సుతాదూరా దాయాంతం వీక్ష్యచాంధకమ్‌ | మహేశ్వర వపుచ్ఛన్నం ప్రహారైర్జర్జరచ్ఛవిమ్‌. 85

సుందం శైలాది రూపస్థ మవష్టభ్యావిశత్‌ తతః | తందృష్ట్వా మాలినీం ప్రాహసుయశాంవిజయాంజయామ్‌. 86

జయేపశ్యస్వ దేవస్య మదర్థే విగ్రహం కృతమ్‌ | శత్రుభిర్దానవవరై స్తదుత్తిష్ఠస్వనత్వరమ్‌. 87

ఘృతమావయ పౌరాణాం బీజికాం లవణందధి | వ్రణభంగంకరిష్యామి స్వయమేవ పినాకినః 88

అంతట శర్వ రక్షితులైన ఆ ప్రమథ దేవగణాల చేతిలో దానవులు వరసగా రాత్రింబవళ్ళు మాటిమాటికి చావు దెబ్బలు తిని ఓడిపోయారు. అప్పుడు ఏడు వందలేండ్ల తర్వాత, సంధ్యోపాసన చేసేందుకు అష్టాదశ భుజమలు ధరించి శివుడు, నిశ్చయించుకొని , సరస్వతీ నదిలో విధి పూర్వకంగా స్నానంచేసి, ఆచమనం చేశాడు. భక్తియుతుడై దోసిలిలో పుష్పాలు తీసికొని సమర్పించాడు. శిరస్సు వంచి, ''హిరణ్య గర్భే'' త్యాది మంత్రాలు జపిస్తూ సూర్యుడు ప్రదక్షిణంగావించాడు. అంతనా శూలపాణి- 'ఓత్వష్టా ! నీకు నమస్సుల' నిస్ఫుటంగా ఉచ్చరిస్తూ, బాహు దండాలు త్రిప్పుతూ భావగంభీరంగా నృత్యం చేయసాగాడు. పరమ శివుడలా నాట్యం చేయుట చూచి భావిహ్మలులై ప్రనుథులు దేవతలందరూ ఆయనతో బాటు నృత్యం చేయసాగారు. ఆ విధంగా తృప్తిగా సంధ్యోపాసనం సాంధ్య నృత్యం నిర్వర్తించి ఆ దేవాధిపుడు రాక్షసులతో మరల యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలా త్రినేత్రుని అండ చూచుకొని, దేవప్రమథగధాలు భయమంటూ లేకుండా విజృంభించి, దైత్య దానవులందర్నీ పరాజితులను గావించారు. తన బలాలు విరిగిపోవడం శంకరుడజేయుడుగా నిలవడం చూచి అంధకుడు సుందున పిలిచి యిలా అన్నాడు. ''ఓ మహా వీరా సుందా! నీవు నా సోదరుడవు ! అన్ని విధాల విశ్వసించదగినవాడవు. నేను చెప్పునది విని నీకు చేతనైనంతగా సాయపడవలయును. రణ నిష్ణాతుడైన ఈ శంకరుడితర కారణాలవల్ల దుర్జయుడుగా ఉన్నాడు. ఆ శైల పుత్రియోమో నా మనస్సు దోచుకున్నది. అందుచేత మన మిద్దరము వేషాలు మార్చి ఆచారుహాసినివద్దకు వెళ్లుదము. పద, నేను శివుని రూపం ధరిస్తా, నీవు నందిగా మారిపో. అలా వెళ్లి వంటరిగా నున్న ఆమెను అనుభవించి తిరగి వచ్చి దేవగణాలను సంహరిస్తాను. ''అందుకు మంచిదని హర్షించి ఆ సుందుడు యాయ చేత నందిగా మారాడు. అంధకుడు యుద్ధపు గాయాలతో ఉన్న శివుని రూపం ధరించి మాయ నందితో మందరగిరిమీద శివుని నివాసానికి అదురు బెదురు లేకుండా వెళ్లాడు. నంది చేయి పట్టుకొని యుద్ధపు వ్రణాలతో నింటికి వస్తున్న ఆ అంధకుని దూరాన్నుంచి చూచి ఆ గిరి కన్యా, వారిద్దరు కూర్చొనగా, మాలిని జయలతో యిలా అన్నది. ''జయా! చూచావా, నాకోసం యుద్ధం చేసి అలసిపోయి గాయాలతో స్వామి వచ్చాడు. వెంటనే నేను స్వయంగా చికిత్స చేస్తాను. నీవు నిలవ వుంచిన పాత్ర నేయి, పెరుగు, ఉప్పు, బీజికాదులు తీసుకరమ్ము. అవి కలపి నూరి గాయాలకు పట్టిస్తా. త్వరగా వెళ్ళు''.

కురష్వశీఘ్రం సుయశే స్వభర్తృవ్రణ నాశనమ్‌ | ఇత్యేవముక్త్వా వచనం సముత్థాయవరాసనాత్‌. 89

అభ్యుద్య¸° తదాభక్త్యా మన్యమానా వృషధ్వజమ్‌ | శూలపాణ స్తతః స్థిత్వా రూపంచిహ్నాని యత్నతః 90

అన్వియేష తతోబ్రహ్మ న్నోభౌ పార్మ్వస్థితౌ వృషౌ |

సాజ్ఞాత్వా దానవం రౌద్రం మాయాచ్ఛాదిత విగ్రహమ్‌. 91

అపయానం తదాచక్రే గిరిరాజసుతా మునేః |

దేవ్యాశ్చింతితమాజ్ఞాయ సుందంత్యక్త్వాంధకో7సురః. 92

సమాద్రవత వేగేన హరకాంతా విభావరీమ్‌ | సమాద్రవత దైతేయో యేనమార్గేణ సా7గమత్‌. 93

అపస్కారాంతరం భంజన్‌ పాదప్లుతిభిరాకులః | తమాపతంతం దృష్ట్వైవ గిరిజాప్రాద్రవద్భయాత్‌. 94

గృహంత్యక్త్వా హ్యుపవనం సఖీభిః సహితాతదా | తత్రాప్యనుజగామాసౌ మదాంధో మునివుంగవ. 95

తథాపిన శశావైనం తపసో గోపనాయతు | తద్భయాదావిశద్గౌరీ శ్వేతార్క కుసుమం శుచి. 96

విజయాద్యామహాగుల్మే సంప్రయాతా లయంమునే |

నష్టాయా మతపార్వత్యా భూయో హైరణ్యలోచనిః 97

సుందంహస్తే సమాదాయ స్వసైన్యం పునరాగమత్‌ | అంధకే పునరాయతే స్వబలం మునిసత్తమ. 98

ప్రావర్తత మహాయుద్ధం ప్రమథాసురయోరథ | తతో7మరగణ శ్రేష్ఠో విష్ణుశ్చక్రగదాధరః. 99

నిజఘానా7సురబలం శంకరప్రియ కామ్యయా | శార్‌ఙ్గచాపచ్యు తైర్బాణౖః సంస్యూతా దానవర్షభాః. 100

పంచషట్‌ సపచాష్టౌవా బ్రధ్నపాదైర్ఘనాఇవ | గదయాకాంశ్చిదవధీత్‌ చక్రేణాన్యాన్‌ జనార్దనః. 101

ఖడ్గేనచచకర్తాన్యాన్‌ దృష్ట్వాన్యాన్‌ భస్మసాద్వ్యధాత్‌ |

హరేనాకృష్య చైవాన్యాన్‌ ముసలేనవ్యచూర్ణయత్‌. 102

గరుడః పక్షపాతాభ్యాం తుండేనాప్యురసా7హనత్‌ | సచాదిపురుషోధాతా పురాణః ప్రపితామహః. 103

భ్రామయన్‌ విపులంపద్మ మభ్యషించత వారిణా | సంస్పృష్టా బ్రహ్మతోయేన సర్వతీర్థమయేనహి. 104

గణామరగణాశ్చాసన్‌ నవనాగ శతాధికాః | దానవాస్తేన తోయేన సంస్పృష్టాశ్చాఘహారిణా. 105

సవాహనః క్షయంజగ్ముః కులిశేనేవ పర్వతాః |

అంతనాజయ, ఓ యశస్వినీ ! అలాగే నీ భర్త గాయాలకు చికిత్స చేయవమ్మా అన్నది. అంతట తన ఉత్తమాసనం నుంని లేచి ఆ గిరజ శివుడని భ్రమించి వానికెదురుగా వెళ్ళింది భక్తితో. ఆ శూలపాణి రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించగా యిరు పార్శ్వాలు నుండవలసిన వృష చిహ్నాలు లేకుండుటతో, ఆ మాయా విగ్రహాన్ని దానవుడుగా గుర్తించి ఆ పార్వతి వెంటనే అట నుండి పారిపోయింది. దేవి అంతర్యాన్ని పసిగట్టిన ఆ అంధకుడు సుందుని వదలి ఆ హరురాణిని వేగంగా వెంబడించాడు. ఎటు పోయిననటు వచ్చుచున్న ఆ దైత్యుని చూచి కాళ్లు తడబడగా ఆ గిరికన్య భయ విహ్వలయై యిల్లువదలి బయట ఉద్యానవనంలోకి పరుగెత్తినది. ఆ సఖులు గూడ భయంతో ఆమె వెంట పరుగెత్తారు. ఓ మునిశ్రేష్ఠా కామంతో కళ్లు కప్పిన ఆ అంధకుడు విడువక ఆమెను అక్కడకు గూడ అనుగమించాడు. ఆ దేవి తపో వ్యయానికి భయపడి వానిని శాప దగ్ధుడిని చేయకుండా తానొక తెల్ల జిల్లేడు చెట్టు మొదలుతో లీనమైపోయింది. సఖులు గూడ చెట్ల పొదల్లో అదృశ్యమై పోయారు. ఓ మునీ! అంతటవాడామె నశించినదని తలచి సుందుని చేయి పట్టుకొని మరల తన సేనను కలిశాడు. యుద్ధం మరింత తీవ్రంగా సాగింది. అంతట దేవగణ శ్రేష్ఠుడైన శ్రీ విష్ణువు, శివునకు ప్రియము చేయుటకై చక్రగధాధరుడై రాక్షస బలాన్ని ఊచకోత కోయసాగాడు. శార్‌ఙ్గధనుస్సు నుండి బయలుదేరిన ఆయన బాణాలొక్కొక్కటీ, అయిదుగురిని, ఆరుగురినీ, ఏడుగురినీ, ఎనిమిది మందినీ, ఆ చీకట్లను చేధించే సూర్యకిరణాల్లాగా గ్రుచ్చి సంహరించాయి. ఆ శ్రీహరి కొందరను గదతో, మరెందరినో చక్రధారలతో మృత్యువు పాలుగావింనాడు. కొందరను హలంతో మెడలు పట్టి లాగి రోకటిపోట్లతో తలల బ్రద్దలుగొట్టాడు. ఎందరినో తన చూపులతోనే యమసదనానికి పంపాడు. ఇక వైనతేయుడు తన పక్షాఘాతాలతో వజ్రంలాంటి ముక్కుతో వక్షంతో దొరికిన రాక్షసులందరినీ దునుమాడాడు. ఇక ఆది పురుషుడైన ముసలి బ్రహ్మ తన విశాలమైన కమలంతో బ్రహ్మబలాన్ని, సమస్త పుణ్యతీర్థాల సారాన్ని ప్రోక్షించి దేవగణాలవారికి శతాధిక గజాలశక్తిని చేకూర్చుతూ ఉంటే, ఆ అఘమర్షణ జలబిందువులే పిడుగుల్లా తగిలి దానవులు కొండ శిఖరాల్లాగ కూలిపోసాగారు.

దృష్ట్వా బ్రహ్మహరీయుద్దే ఘాతయంతౌ మహాసురాన్‌. 106

శతక్రతుశ్చ దుద్రావ ప్రగృహ్య కులిశంబలీ | తమాపతంతం సంప్రేక్ష్య బలోదానవ సత్తమః. 107

ముక్త్వాదేవం గదాపాణిం విమానస్థంచ పద్మజమ్‌ |

శక్రమేవాద్రవత్‌ యోద్దుం ముష్టిముద్యమ్య నారదః | బలవాన్‌ దానవసతి రజేయో దేవదానవైః. 108

తమాపతంతంత్రిదశేశ్వరస్తు దోష్ణాంసహస్రేణ యథాబలేన |

వజ్రం పరిభ్రామ్య ఐలస్యమూర్థ్ని చిక్షేప'హేః మూఢ హతో7స్యు దీర్య. 109

సతన్యమూర్థ్ని ప్రవరో7పి వజ్రో జగామతూర్ణం హినహస్రధామునేః

బతో7ద్రవద్‌ దేవపతిశ్చభీతః పరాఙ్‌ముఖో7భూత్సమరాన్‌ మహర్షేః. 110

తంచాపిజంభో విముఖం నిరీక్ష్య భూత్వా7గ్రతః ప్రాహనయుక్తమేతత్‌ |

తిష్ఠస్వరాజా7సి చరాచరస్య నరాజధర్మేగదితం పలాయనమ్‌. 111

సహస్రాక్షోజం భవాక్యం నిశమ్య భీతస్తూర్ణం విష్ణుమాగాన్మహర్షే |

ఉపేత్యాహ శ్రూయతాం వాక్యమీశత్వం వేనాధో భూతభ##వ్యేశ విష్ణోః. 112

జంభస్తర్జయతే7త్యత్థం మాంనిరాయుధ మీక్ష్యహి | ఆయుధందేహిభగవన్‌ త్వామహం శరణం గతః. 113

తమువాచహరిః శక్రం త్యక్త్వాదర్పం వ్రజాధునా |

ప్రార్థయస్వాయుధం వహ్నిం నతే దాస్యత్యసంశయమ్‌. 114

జనార్థనవచః శ్రుత్వా శక్రస్త్వరిత విక్రమః | శరణం పావకమగా దిదంచోవాచనారదః. 115

శుక్ర ఉవాచ :

నిఘ్నతోమేజలం వజ్రం కృశానో శతభాగతమ్‌ | ఏషచాహ్వయతేజంభ స్తస్మాద్ధేహ్యాయుధం మమ. 116

పులస్త్య ఉవాచ :

తమాహభగవాన్‌ వహ్నిః ప్రీతో7స్మితవవాసవ | యత్త్వందర్పం పరిత్యజ్య మామేవ శరణంగతః. 117

ఇత్యుచ్చాత్య స్వశక్త్వాస్తు శక్తిం నిష్క్రామ్య భావతః |

ప్రాదాదింద్రాయ భగవాన్‌ రోచమానోదివంగతః. 118

తామాదాయ తదాశక్తిం శతఘంటాంసుదారుణామ్‌ |

ప్రత్యుద్య¸° తబాజంభం హంతుకామో7రి మర్దనః. 119

తేనాతియశసాదైత్యః సహసైవాభి సంద్రుతః | క్రోధం చక్రేతదాజంభోనిజఘాన గజాధిపమ్‌. 120

జంభముష్టినిపాతేన భగ్నకుంభకటోగజః | నిపపాత యథాశైలః శక్రవజ్రహతః పురా. 121

పతమానాద్ద్విపేంద్రాత్తు శక్రశ్చాప్లుత్య వేగవాన్‌ | త్యక్త్వైవ మందరగిరిం పపాతవసుధాతలే. 122

అలా బ్రహ్మ విష్ణులు యుద్ధం జేయడం రాక్షసులను సంహరించడంచూచి ఇంద్రుడుకూడా వజ్రాయుధం పట్టుకొని యుద్ధానికి దిగాడు. ఆయనను చూచి ఖలుడను అసురసత్తముడు తాను యుద్ధం చేస్తూన్న గదాభరుణ్ణీ విమానస్థుడైన బ్రహ్మను వదలి ఇంద్రుని మీదకు పిడికిలి బిగించి లంఘించాడు. దేవదానవుల కజేయుడైన ఆ బలశాలి మీద దేవరాజు వేయి అంచులు గల తన వజ్రాన్ని గిరగిరి త్రిప్పి బలంకొద్దీ పోరాపో! మూర్ఖా ఈ దెబ్బతో చచ్చావంటూ విసిరివేశాడు. ఆ వజ్రమా బలుని నెత్తికి తగిలి వేయిముక్కలయిపోయింది. నారదా! అంతట నా బలుడు యింద్రునెదుర్కొనగా నాతడు భయంతో రణం వదలి వెనుకముఖంపట్టాడు. అతనిని చూచి జంభుడు ముందుకు వెళ్ళి, నీవు దేవతల ప్రభువువైయుండి యిలా యుద్ధం వదలి వెళ్ళడం యుక్తంకాదు. నిలునిలువుమంటూ ఎదుర్కొనగా నా దేవపతి త్వరత్వరగా విష్ణువు వద్దకు వెళ్ళి ''ప్రభూ! నీవు నా స్వామివి. నేను శరణాగతుడను. నిరాయుధుడనైన నన్ను జంభుడు తరుముతున్నాడు. భగవన్‌! ఆయుధమేదైనా త్వరగాయివ్వండని వేడుకున్నాడు. అందులకా విష్ణువు ఓ యింద్రా నీ గర్వం టెక్కూ వదలి వెళ్ళి అగ్ని దేవుని వేడుకో. ఆయన ఆయుధం యిస్తాడని పంపాడు. జనార్దనుని మాటవిని పరుగుపరుగున అగ్నివద్దకు పోయి ఆ దేవపతి ''ఓ అగ్నీ! శరణు శరణు ! నా వజ్రం విరిగిపోయింది. జంభుడు యుద్ధానికి పిలుస్తున్నాడు. దయచేసి నాకాయుధాన్నియిచ్చి కాపాడుమనగా నాపావకుడు ఇంద్రా! రాజువనే గర్వం విడచి నన్ను అర్థించినందుకు సంతోషం యిదిగో అమోఘమైన శక్తి తీసికొనుచు తనశక్తితో కూడిన ఆయుధన్నిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదా ! అలా అగ్ని దత్తమైన నూరు గంటలతో ఆలరారే దారుణ శక్తిని గ్రహించి ఆ శతమఖుడు జంభుని చంపుటకుద్యమించాడు. ఆలోపుననే ఆ దైత్యుడు మెరుపుదాడిచేసి తన పిడికిలితో, ఇంద్రుని ఐరావతం కుంభస్థలం బ్రద్దలు చేశాడు. దానితో ఆ ఏనుగు పూర్వం యింద్ర వజ్రహతమైన శైలంలాగా కూలిపోయింది. ఏనుగు మీదనుంచి దూకి యింద్రుడు మందగిరిని వదలి భూమ్మీద పడిపోయాడు.

పతమానం హరింసిద్దా శ్చారణాశ్చతదా7బ్రువన్‌ | మామాశక్రః పతస్వాద్య భూతలేతిష్ఠ వాసవ. 123

సతేషాం వచనం శ్రుత్వా యోగీతస్థౌక్షణం తదా |

ప్రాహచైతాన్‌ కథంయోత్స్యేః అపత్రః శత్రుభిః సహ. 124

తమూచుర్దేవ గంధర్వా మానిషాదం వ్రజేశ్వర|

యుధ్యస్వత్వం సమారుహ్య ప్రేషయిష్యామయద్రథమ్‌. 125

ఇత్యేవముక్త్వా విపులం రథం స్వస్తికలక్షణమ్‌ | వానరధ్వజ సంయుక్తం హరిభిర్హరి భిర్యుతమ్‌. 126

శుద్దజాంబూనదమయం కింకిణీజాల మండితమ్‌ | శక్రాయ ప్రేషయామాసు ర్విశ్వావసు పురోగమాః. 127

తమాగత ముదీక్ష్యాథ హీనం సారథినాహరిః | ప్రాహాయోత్స్యే కథఁయుద్దే సంయమిష్యేకథఁహయాన్‌. 128

యదికశ్చిద్ది సారథ్యం కరిష్యతి మమాధునా | తతో7హం ఘాతయేశత్రూన్‌ నాన్యథేతి కథంచన. 129

తతో7బ్రువంస్తే గంధర్వా నాస్మాకం సారథిర్వభో |

విద్యతే స్వయమేవాశ్వాం స్త్వం సంయంతుమి హార్హసి. 130

ఇత్యేవముక్తే భగవాం స్త్యక్త్వాస్యందన ముత్తమమ్‌ | క్ష్మాతలం నివపాతైవ పరిభ్రష్ట స్రగంబరః. 131

చలన్మౌళి ర్ముక్తకచః పరిభ్రష్టాయుధాంగదః | పతమానం సహస్రాక్షం దృష్ట్వాభూః సమకంవత. 132

పృథివ్యాకం కంపమానాయాం శమీకర్షేస్తపస్వినీ | భార్యా7బ్రవీత్ప్రభోః బాలం బహిః కరుయథాసుఖమ్‌. 133

సతుశీలావనః శ్రుత్వా కిమర్థమితి చా7బ్రవీత్‌ | సచాహశ్రూయతాం నాధః దైవజ్ఞ పరిభాషితమ్‌. 134

యదేయం కంపతేభూమి స్తదా ప్రక్షిప్యతేబహః | యద్బాహ్యతో మునిశ్రేష్ఠ తద్భవేద్ద్వి గుణంమునే. 135

ఏతద్వాక్యం తదాశ్రుత్వా బాలమాదాయ పుత్రకమ్‌ | నిరాశంకోబహిః శీఘ్రం ప్రాక్షిపత్‌క్ష్మాతలే ద్విజః. 136

భూయోగోయుగళార్థాయ ప్రవిష్టోభార్యయా ద్విజాః | నివారితో గతావేలా అర్థహానిర్భవిష్యతి.137

ఇత్యేవముక్తే దేవర్షి ర్బహిర్నిర్గత్య వేగవాన్‌ | దదర్శ బాలద్వితయం సమరూప మనస్థితమ్‌. 138

తందృష్ట్వా దేవతాః పూజ్య భార్యాం చాద్భుతదర్శనమ్‌ |

ప్రాహతత్త్వం నవిందామి యత్‌ వృచ్ఛామివదస్వతత్‌. 139

బాలస్యాస్య ద్వితీయస్య కే భవిష్యదుణావద | భాగ్యాని చాస్యయచ్చోక్తం కర్మతత్కథ యాధునా. 140

అలా క్రిందబడి పోతున్న యిందుని చూచి సిద్ధచారణులు శక్రా ! పడిపోకుము. అక్కడే నిలబడుము. అని చెప్పారు. ఆ యింద్రుడు యోగశక్తితో క్షణకాలం నిలబడి, యానం లేకుండా శత్రువుతో నెలా పోరాడగలనన్నాడు. అందులకా దేవగంధర్వులు, ప్రభూ! చింతింపకుము. మేమొక రథం పంపుతున్నాము. దానిపైనెక్కి యుద్ధం చేయండని చెప్పి మరుక్షణమే శుభలక్షణాలు గలిగి విశాలమై, వానర ధ్వజంతో ఆకుపచ్చని ఉత్తమాశ్వాలుగల్గి, చిరుగంటలతో బంగారంతో నిర్మించబడిన రథాన్ని విశ్వావసు మొదలయిన దేవతలు తెచ్చియిచ్చారు. అయితే సారథిలేని ఆ రథాన్ని చూచి, సారధి లేకుండా గుర్రాలను అదుపులో పెట్టుకుంటూ ఒక్కడినే ఎలా పోరాడగలను? సారథి నెవరినైనా పంపుచో నేను యుద్ధంచేసి శత్రుసంహారం చేస్తాను. లేనిచో వీలుపడదని యింద్రుడన్నాడు. అంతట నారాదా! ఆ గంధర్వులు, దేవ రాజా! మావద్ద సారథి ఎవరూ లేరు. మీరే స్వయంగా రథం నడుపుకొని యుద్ధం చేయవలసినదేయనగా, నా యింద్రుడా ఉత్తమస్యందనాన్ని వదలి, ఒడలిమీది హారాలు వస్త్రాలు ఊడిపోగా, ఆయుధాలు, కవచం, జట్టుముడి వీడి తలవణకి పోతూండగా భూమిమీదపడి పోయాడు. ఆ సహస్రాక్షుని పతనం చూచి భూమి కంపించింది. అలా కంపిస్తున్న భూమిని చూచి శమీకుడను మహర్షి భార్య భర్తను చూచి నాథా వెంటనే మన పసివాడిని తెచ్చి బయటపడెయ్యండి. ఆలసించ వద్దన్నది. అందులకు కారణం అడిగిన భర్తతో నా శీలపతి స్వామీ ! భూమి కంపించిన క్షణంలో బయటపడవేసిన వస్తువులు ద్విగుణంగా వృద్ధి అవుతాయని దైవజ్ఞుల వచనము. అని చెప్పగా నా ముని వెంటనే తన పసిబాలుని యింట్లో నుంచి బయట పడవేసి లోపట కట్టివేసిన రెండెడ్లను కూడ తెచ్చుటకు లోపలకు వెళ్ళాడు. అంతట నామె వారించి. నాథా సమయం మించిన తర్వాత బయటవేసిన వస్తువలలో సగం నశించి పోతాయని ఆ ప్రయాత్నాన్ని ఆపింది. ఓ దేవర్షి ! అంతట నా శమీకుడు బయటకు వెళ్ళి చూడగా సరిగ్గా తనకుమారుని పోలిన మరొక బాలకుడుండటం చూచి అద్భుతానంద పరవశుడయ్యాడు. ఆ రెండవ బాలుడు దేవ ప్రార్థన చేయడం చూచి యోగ్యురాలయిన తన గృహిణితో ప్రేయసీ ! ఈ రహస్యం అద్భుతం ! నాకు తెలియరాకున్నది. ఈ రెండవ బాలుని గుణగణాలు, భవిష్యత్తు, అదృష్టం, అతడు చేయబోవు కర్మలు ఎలా ఉంటాయో ఆ విషయం గూడ చెప్పమని అర్థించాడు.

సా7బ్రవీన్నాథతే వక్ష్యే వదిష్యామిపునః ప్రభో | సో7బ్రవీద్వదమే7ద్యైవ నోచేన్నాశ్నామి భోజనమ్‌.

సాప్రాహశ్రూయతా బ్రహ్మన్‌ వదిష్యేవచనం హితమ్‌ |

కాతరేణాద్యయత్పృష్టం భావ్యః కారురయంకిల. 142

ఇత్యుక్త్వవతి సాక్యేతు బాల ఏవత్వదేతనః | జగామసాహ్యం శక్రస్య కర్తుం సౌత్యవిశారదః. 143

తంవ్రజంతంహిగంధర్వా విశ్వావసు పురోగమాః | జ్ఞాత్వేంద్రసై#్యవ సాహాయ్యే తేజసా సమవర్థయన్‌. 144

గంధర్వతేజసాయుక్తః శిశుః శక్రం సమేత్యహి | ప్రోవాచై హ్యేహి దేవేశ ప్రియోయంతా భవామితే. 145

తచ్ఛ్రుత్వాస్య హరిః ప్రాహ కస్యపుత్రో7సి బాలక |

సంయంతా7సికథం చాశ్వాన్‌ సంశయః ప్రతిభాతిమే. 146

సో7బ్రవీద్దృషి తేజోత్థం క్ష్మాభవం విద్దివాసవ | గంధర్వతేజసాయుక్తం వాజియాన విశారదమ్‌. 147

తచ్ఛ్రుత్వా భగవాన్‌ శుక్రః ఖంభేజేయోగినాం వరః | సచాపి విప్రతనయో మాతలిర్నామ విశ్రుతః. 148

తతో7ధిరూఢస్తురథం శక్రస్త్రి దశపుంగవః | రశ్మీన్‌ శమీకతనయో మాతలిః ప్రగృహీతవాన్‌. 149

తతోమందర మాగమ్య వివేశరిపువాహినీమ్‌ | ప్రవిశన్‌ దదృశే శ్రీమాన్‌ పతితం కార్ముకంమహత్‌. 150

శరీరం పంచవర్ణాభం సితరక్తాసితారుణమ్‌ | పాండుచ్ఛాయం సురశ్రేష్ఠం స్తం జగ్రాహస మార్గణమ్‌. 151

అందులకామె నాధా, ఆ విషయాలు మరొకప్పుడు చెప్పెదను. నేడు కాదనగా నా బ్రాహ్మణుడలా కాదు. నా కిప్పుడే చెప్పవలయును. లేనిచో నేనీ రోజు భోజనమే చేయనని పట్టుబట్టాడు. అంతటనామె సరే మీరు గందరగోళంలో పడి అడుగుతున్నారు గనుక హిత వాక్యలు చెబుతాను వినండి ఈ బాలుడు రథచోదకు (కారు) దౌతుడు''. అని చెప్పినది. ఆమె నోటి నుండి ఆ మాటలు వెలువడినంతనే ఆ బాలుడు ఏమీ తెలియనివాడై యుండియు పైకి ఎగిరి ఇంద్రునకు సహాయం చేయుటకు వెళ్తున్న సంగతి గ్రహించిన విశ్వావసు మొదలైన గంధర్వులంతా తమ తేజస్సునాతనికి ధారబోశారు. అలా గంధర్వ తేజోయుక్తుడై ఆ శిశువు శక్రుని సమీపించి, దేవరాజా ! రండు రండు! నీకు ప్రియం కలుగునట్లుగా సారథ్యం చేస్తా నన్నాడు. అది విని యింద్రుడిలా అడిగాడు. ''నీవెవరి పుత్రుడవు బాబూ? అశ్వాలనెలా అదుపులో పెట్టగలగుదువా యని నాకు సందేహంగా ఉన్నది''. అందులకా శిశువు-సురేశ్వరా! ఋషి తేజస్సుతో భూమి నుండి ఉద్భవించాను. గంధర్వ తేజంతో వృద్ధి నొందాను. అశ్వయానంలో విశారదుడనని చెప్పగా, యోగులలో శ్రేష్ఠుడగు నా యింద్రుడూ, మాతలి అని పేరుగల ఆ బాలుడూ వినువీథికి వెళ్ళారు. త్రిదశాధీశ్వరుడగు నా యింద్రుడు ఉత్తమ రథం మీద కూర్చొనగా నాబాలుడు శమీక ఋషి పుత్రుడు గుర్రాల పగ్గాలను పట్టుకొని పిలబడ్డాడు. అంతట నాదేవరాజు మందగిరికి వెళ్ళి శత్రు సేనలోకి ప్రవేశించాడు. అక్కడ తేజస్వికి ఒక మహాధనుస్సు పంచ వర్ణాలతో తెలుపు, ఎరుపు, గోధుమ, పసపు రంగులలో- బాణసమూహంతో కూడి కనిపించింది. అంత సంతోషంతో నాసురశ్రేష్ఠుడా ధనుర్బాణాలను గ్రహించాడు.

తతస్తుమనసా దేవాన్‌ రజస్సత్వత మోమయాన్‌ | సమస్కృత్యశరం చాపే సాధిజ్యేవినియోజయత్‌. 152

తతోనిశ్చేరురత్యుగ్రాః శరా బర్హిణవాసనః | బ్రహ్మేశ విష్ణునామాంకాః సూదయంతో7సురాన్‌ రణ. 153

ఆకాశం విదిశః పృథ్వీం దిశశ్చసశరోత్కరైః. | సహాస్రాక్షోతి పటుభి శ్ఛాదాయమాన నారదః. 154

గజోవిద్ధో హయోభిన్నః పృథివ్యాం పతితోరథః | మహామాత్రోధరాం ప్రాప్తః సద్యః సీదన్ఛరాతురః. 155

పదాతిః పతితోభూమ్యాం శక్రమార్గణ తాడితః | హతప్రధాన భూయిష్ఠం బలంతదభవద్రిపోః. 156

తంశక్రబాణాభిహతం దురానదం సైన్యం సమాలక్ష్యతదా కుజంభః |

జంభాసురశ్చాపి సురేశమవ్యయం ప్రజగ్మతుర్గృహ్య గదేసుఘోరే. 157

తావాపతంతౌ భగవాన్‌ నిరీక్ష్య సుదర్శనే నారివినాశ##నేన |

విష్ణుః కుజంభం నిజఘాన వేగాత్‌ సన్యందనాద్గామగమద్గతాసుః. 158

తస్మిన్‌ హతేభ్రాతరి మాధవేన జంభస్తతః క్రోధవశంజగామ|

క్రోధాన్వితః శక్రముపాద్రవ్యదణ సింహంయథైణో7తి విపన్నబుద్ధిః. 159

తమాపతంతం ప్రసమీక్షశక్రః త్యక్త్వైవచాపం సశరం మహాత్మా |

జగ్రాహశక్తిం యమదండకల్పాం తామగ్నిదత్తాం రిపవేసనర్జ. 160

శక్తిం సంఘంటాం కృతనిస్వనాంవై దృష్ట్వాపతంతీం గదయాజఘాన |

గదాంచ కృత్వాసహ సైవభస్మసా ద్బిభేదజంభం హృదయేచ తూర్ణమ్‌. 161

శక్త్యాసభిన్నో హృదయేసురారిః పపాతభూమ్యాం విగతాసురేవ |

తంవీక్ష్య భూమౌపతితం విసంజ్ఞం దైత్యాస్తుభీతా విముఖాబభూవుః. 162

జంభేహతే దైత్యబలేచ భ##గ్నే గణస్తు హృష్టాహరి మర్చయంతః |

వీర్యం ప్రశంసంతి శతక్రతోశ్చ నగోత్రభిచ్ఛర్వ ముపేత్యతస్థౌ. 163

ఇతి శ్రీ వామన మహాపురాణ త్రిచత్వారింశో7ధ్యాయః.

తర్వాత, సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులకు మనసానమస్కరించి, ఆ మహాచాపాన్ని సంధించి బాణం తొడిగాడు. అంతనా శతక్రతువు ధనుస్సు నుంచి నెమలి ఈకల రెక్కలతో రెపరెపలాడుతూ పుంఖానుపుంఖాలుగా మహోగ్ర శరాలు వెలువడి శత్రు సంహారకాండ సాగించాయి. బ్రహ్మ విష్ణు శివనామాంకితాలయి శత్రువులనుదునుమాడుతూ వెడలిన ఆ బాణాలు భూమ్మాకాశాలను దిశవిదిశలనూ కప్పివేశాయి. నారదా! వాని తాకిడికి ఏనుగులు పీనుగలయ్యాయి. రథాలు విరిగి పోయాయి. అశ్వాల శ్వాసలెగిరిపోయాయి. మావటివాండ్రు విలవిల్లాడుతూ నేలకొరిగిపోయారు. శత్రువాహినిలో అత్యధిక భాగం హతమైపోయింది. ఇంద్రుని బాణాగ్నికి దహించుకపోతున్న తమ సైన్యాన్ని చూచి కుజంభ జంభిలులిద్దరూ భయం కరమైన గదాదండాలు త్రిప్పుతూ క్రోధోన్మత్తులై ఆ మహాత్ముడగు సురనాయకుని సమీపించారు. అలా యింద్రుని మీద కురుకుచున్న వారలను చూచి శ్రీహరి శత్రు వినాశకరమైన సుదర్శన చక్రం వేగంగా త్రిప్పి కుజంభుని మీదకు వదలగా దాని అగ్ని జ్వాలలకు వాడు ప్రాణాలుగోల్పోయి రథం మీద నుండి క్రిందబడిపోయాడు. అలా మాధవుని చేతిలో తన సోదరుడు చచ్చుట చూచి జంభుడు కోపంతో నిప్పులుమియుచూ, చావుమూడిన లేడి సింహం మీదకు అంఘించినట్టులా దేవరాజు మీద విరుచుకపడ్డాదు. అలా ఎత్తి వస్తూన్న జంభుని చూచి శక్రుడు ధనుర్బాణాలు వదలి మృత్యుదండంలాంటి అగ్నిదత్త మైన శక్తిని తీసికొని వానిమీదకి గట్టిగా విసిరాడు. గంటలు గలగల ధ్వనులతో తనమీదకు వస్తున్న ఆ శక్తిమీదకు వాడు గదను ప్రయోగించాడు. ఆ గదను క్షణకాలంలో భస్మంచేసి ఆ శక్తి సూటిగా వెళ్లి జంభుడి వక్షాన్ని చీల్చివేసింది. దాంతో ఆ దేవ విరోధి విగతప్రాణుడై నేలకొరిగాడు. వాని మరణం చూచి రాక్షసులు కూడ పలాయనం గావించారు. జంభుడు హతుడై రాక్షస బలాలు విరిగిపోవుటతో ప్రమథ దేవగణాలు జనార్దనుని పూజించారు. ఇంద్రుణ్ణి ప్రశంసించారు. అంతటనా పర్వతభేది శర్వుని ఎదుటకు వెళ్ళి నిలచాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో నలుబది మూడవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters