Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది ఒకటవ అధ్యాయము

నారద ఉవాచ :

కథంసమహిషః క్రౌంచో భిన్నః స్కందేనసువ్రత | ఏతన్మే విస్తరాద్భ్రహ్మన్‌

కథయస్వామితద్యుతే. 1

పులస్త్య ఉవాచ :

శృణుష్వ కథయిష్యామి కథాంపుణ్యాం పురాతనీమ్‌ | యశోవృద్ధిం కుమారస్య

కార్తికేయస్యనారద. 2

యత్తత్పీతం హుతాశేన స్కన్నంశుక్రం పినాకినః | తేనాక్రాంతో7భవద్బ్రహ్మన్‌ మందతేజాహుతాశనః. 3

తతోజగామదేవానాం సకాశమమితద్యుతిః | తైశ్చాపి ప్రహితస్తూర్ణం బ్రహ్మలోకం జగామహ. 4

సగచ్ఛన్‌ కుటిలాందేవీం దదర్శపథిపావకః | తాం దృష్ట్వాప్రాహకుటిలే తేజ ఏతత్సుదుర్ధ రమ్‌. 5

మహేశ్వరేణసంత్యక్తం నిర్దహేద్‌ భవనాన్యపి | తస్మాత్‌ ప్రతీచ్ఛ పుత్రో7యం తవధన్యో భవిష్యతి. 6

ఇత్యగ్నినాసాకుటిలా స్మృత్వాస్వమతముత్తమమ్‌ | ప్రక్షిపస్వాంభసిమమ ప్రాహ వహ్నింమహాపగా. 7

తతస్త్వధారయద్ధేవీ శార్వం తేజస్త్వపూపుషత్‌ | హుతాశనో7పి భగవాన్‌ కామచారీ పరిభ్రమన్‌. 8

పంచవర్ష సహస్రాణి ధృతవాన్‌ హవ్యభుక్‌ తతః | మాంసమస్ధేని రుధిరం మేదోంత్ర రేతసీత్వచః. 9

రోమశ్మ శ్ర్వక్షి కేశాద్యాః సర్వేజాతాహిరణ్మయాః | హిరణ్యరేతాలోకేషు తేనగీతశ్చ పావకః. 10

పంచవర్షసహస్రాణి కుటిలాజ్వలనోపమమ్‌ | ధారయంతీ తదాగర్భం బ్రహ్మణః స్థానమాగతా. 11

తాందృష్టవాన్‌ పద్మజన్మా సంతప్యంతీం మహాపగామ్‌ | దృష్ట్వా పప్రచ్ఛ కేనాయం తవగర్భః సమాహితః. 12

సచాహశాంకరం యత్త చ్ఛుక్రంపీతం హివహ్నినా | తదశ క్తేనదేవాద్య నిక్షిప్తం మయిసత్తమ. 13

పంచవర్ష సహస్రాణి ధారయంత్యాః పితామహ | గర్భస్యవర్తతే కాలో నపపాతచ కర్హిచిత్‌.

14

తచ్ఛ్రుత్వా భగవానాహ గచ్ఛత్వ ముదయంగిరిమ్‌ | తత్రాస్తియోజనశతం రౌద్రం శరవణం మహత్‌. 15

తత్రైవం క్షిపసుశ్రోణి విస్తీర్ణేగిరిసానుని | దశవర్ష సహస్రాంతే తతోబాలో భవిష్యతి. 16

నారదుడు ప్రశ్నించాడు : ఓ మహాద్యుతీ ! మహిషంతోగూడ క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నా కెరిగించండి. అందుకు పులస్తుడు చెప్పసాగాడు. నారదా! యిది చాలా పురాతనకాలపు కథ. పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెపుతున్నాను వినుము. ఆ విధంగా శివుని వీర్యాన్ని మ్రింగిన అగ్నిదేవుడా తేజస్సును భరించలేక తన తేజస్సును కోల్పోయాడు. అంత నాతడు దేవతలతో చెప్పుకోగా వారంతాకలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమంధ్యంలో అగ్ని కుటిలాదేవినిచూచి ఆమెతో అమ్మా ! ఈ శివతేజాన్ని భరింపలేకున్నాను. ఇది ముల్లోకాలను దహిస్తోంది. అంచేత దీనిని నీవు ధరిస్తే నీకు చక్కని పుత్రుడు కలిగి ధన్యతచెందుతానని చెప్పాడు. అంతట కుటిలతన వెనుకటి ఉదంతాన్ని జ్ఞప్తికితెచ్చుకొని నదీరూపంధరించి ఆ శివవీర్యాన్ని తన నీళ్ళలోకి వదలమని అగ్నితో చెప్పింది. ఆ కుటిలాదేవి శివవీర్యాన్ని ధరించి పోషించింది. అగ్ని కూడ తన భాద వదలించుకొని స్వేచ్ఛగావెళ్ళిపోయాడు. అగ్ని అయిదువేలేండ్లు ఆ అద్భుతతేజాన్ని ధరించినందువల్ల దాని ప్రభావాన అతని రక్తమాంసాస్థిమేదోంత్ర రేతస్సులు చర్మంతసహా అన్నీ బంగారు మయమయ్యాయి. ఆ కారణాన హుతాశనుడీనాటికీ 'హిరణ్యరేత' అని కొనియాడబడుతున్నాడు. కుటిల కూడ ఆ దివ్యవీరాన్ని అయిదువేలేండ్లు గర్భంలో ధరించి ఆ వేడిని భరింపలేక బ్రహ్మవద్దకువెళ్ళింది. ఆ మహానది అలా శివవీర్యాజ్వాలల్లో దగ్ధంకావడం చూచి బ్రహ్మ, ఆ శుక్రం నీ గర్భంలో ఎవరు ఉంచారని ప్రశ్నించాడు. అందులకామె ఓ మహానుభావాః శివశుక్రాన్ని తాగిన అగ్ని దానిని భరించలేక నాలో ఉంచితే ప్రస్తుతం నేనది భరిస్తున్నానని చెప్పింది. అయిదువేలేండ్లు నుంచి నేను ధరిస్తున్నా యింకా అది పక్వదశకువచ్చి బయటపడలేదని తనగోడు చెప్పుకుంది. అంతట నా బ్రహ్మ ఆమెతోనిట్లా అన్నాడు. 'నీవు వెంటనే ఉదయాద్రికి వెళ్ళిపో. అక్కడ నూరుయోజనాల భయంకరమైన రెల్లువనం ఉంది. ఓసుందరీ! ఈ తేజాన్ని దానిలో వదలివేయుము. పదివేల ఏండ్లతర్వాత బాలకుద్భవిస్తాడు''.

సాశ్రుత్వా బ్రహ్మణోవాక్యం రూపిణీగిరిమాగతా | ఆగత్యగర్భం తత్యాజ ముఖేనైవాంద్రినందినీ. 17

సాతుసంత్యజ్యతం బాలం బ్రహ్మాణం సహసాగమత్‌ | ఆపోమయీ మంత్రవశా త్సంజాతాకుటిలాసతీ. 18

తేజసాచాపి శార్వేణ రౌక్మం శరవణం మహత్‌ | తన్నివాసరతాశ్చాన్నే పాదపామృగ పక్షిణః. 19

తతోదశసు పూర్ణేషు శరద్దశ శ##తేష్వథ | బాలార్కదీప్తః సంజాతో బాలః కమలలోచనః . 20

ఉత్తానశాయీభగవాన్‌ దివ్యేశరవణస్థితః | ముఖే7గుష్ఠం సమాక్షిప్య రురోధఘనరాడివ.

21

ఏతస్మిన్నంతరేదేవ్యః కృత్తికాః షట్పుతేజసః | దదృశుః స్వేచ్ఛయాయంత్యో బాలం శరవణస్థితమ్‌. 22

కృపాయుక్తాఃసమాజగ్ముః యత్రస్కందఃస్థితో7భవత్‌ |

ఆహంపూర్వ మహంపూర్వం తసై#్మస్తన్యో7భి చుక్రుశుః. 23

వివదంతీః సతాదృష్ట్వా షణ్మఖః సమజాయత |అబీభరంచతాః సర్వాః శిశుం స్నేహాచ్చకృత్తికాః. 24

భ్రియామాణః సతాభిస్తు బాలోవృద్ధిమగాన్మునే | కార్తికేయేతి విఖ్యాతో జాతః సబలినాంవరః. 25

ఏతస్మిన్నంతరేబ్రహ్మన్‌ పావకం ప్రాహపద్మజ | కియత్ర్పమాణః పుత్రస్తే వర్తతే సాంప్రతంగుహః 26

సతద్వచనమాకర్ణ్య అజానంస్తం హరాత్మజమ్‌ | ప్రోవాచపుత్రం దేవేశ నవేద్మికతమో గుహః. 27

తంప్రాహ భగవాన్‌ యత్తు తేజః పీతంపురాత్వయా | త్రైయంబకం త్రిలోకేశ జాతః శరవణశిశుః. 28

శ్రుత్వాపితామహవచః పావకస్త్వరితో7భ్యగాత్‌ | వేగినం మేషమారుహ్య కుటిలా తం దదర్శహ. 29

తతఃపప్రచ్ఛ కుటిలా శీఘ్రంక్వవ్రజసేకవే | సో7బ్రవీత్‌ పుత్రదృష్ట్యర్థం జాతం శరవణశిశుమ్‌. 30

సా7బ్రవీత్తనయోమహ్యం మమేత్యాహచపావకః | వివదంతౌ దదర్శాథ స్వేచ్ఛాచారీజనార్దనః. 31

తౌపప్రచ్ఛకి మర్థం వా వివాదమిహచక్రథః | తావూచతుః పుత్రహేతో రుద్రశుక్రోద్భవాయహి. 32

తావువాచ హరిర్దేవో గచ్ఛతంత్రివురాంతకమ్‌ | సయద్వక్ష్యతి దేవేశ స్తత్కురుధ్వమసంశయమ్‌. 33

ఆ రెల్లుదుబ్బులు విస్తరించిన పర్వత సానువులలో వీర్యాన్ని వదలుము. పదివేలేండ్ల తర్వాత బాలకుడు జన్మిస్తాడు". అలా బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆ సుందరి ఉదయగిరికి వెళ్ళి గర్భపిండాన్ని అక్కడ వమనంగావించి మరల బ్రహ్మవద్దకు వెళ్ళి మంత్రశక్తివల్ల నదిగా మారిపోయింది. ఆ తేజస్సువల్ల ఆ రెల్లువనం అక్కడి చెట్లుచెమలు మృగపక్షులూ అన్నీ బాంగారు కాంతితో వెలిగిపోయాయి. అంతట పదివేలేండ్లు గడచిన వెనుక ఉదయభానుని కాంతితో కమలరేకుల్లాంటి నేత్రాలతో చక్కని బాలుడు ఉద్భవించి. ఆ రెల్లువనంలో వెల్లకిలాపండుకొని బొటనవ్రేలు నోటిలోపెట్టుకొని మేఘగంభీరస్వనంతో ఏడువసాగాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ఆరుగురు కృత్తిగా సుందరీమణులు రెల్లుపొదలో పరుండిన బాలకుని చూచారు. అంతట జాలిగొని ఆ స్కందుడు (శిశువు)న్న చోట వెళ్లి నేనుముందంటే నేను ముందంటూ ఆ బిడ్డకు స్తన్యం యిచ్చేందుకు పోటీపడ్డారు. వారల తగవుచూచి ఆ బాలుడు ఆరు ముఖాంవాడయ్యాడు. అంతట ఆ ఆరుగురు కృత్తికలు వాత్సల్యంలో ఆ బిడ్డకు ఒకేసారి పాలుత్రాగించారు. అలా కృత్తికల స్తన్యపానంచేసి ఆ బాలకుడు దినదినప్రవర్ధమానుడయ్యాడు. బలవంతులలో శ్రేష్ఠుడయిన ఆ శిశువు కార్తికేయుడుగా ప్రసిద్ధివహించాడు. ఈ లోపల బ్రహ్మ అగ్ని దేవవుని, నీ కుమారుడు గుహుడు ఎంతవాడయ్యాడని అడిగాడు. శివవీర్యం చాలక రూపంధరించడం తెలియక పావకుడు నా పుత్రుడెవడో గుహుడెవడో నాకు తెలియదన్నాడు ''అది కాదోయీ! నీవు పూర్వం మ్రింగి కుటిలానదీజలాల్లో వదలిన శివవీర్యం శరవణవనంలో బాలకుడుగా జన్మించాడ''ని వివరంగా చెప్పాడు విరించి. అది వింటూనే మహావేగంగా పరుగెత్తే మేక మీద కూర్చొని అగ్ని శరవణవనానికి వెళ్ళడం చూచిన కుటిల, ''ఓ అగ్నీ! యింత హడావిడిగా ఎక్కడకు వెళుతున్నావని అడిగింది. ''అక్కడ శరవణవనంలో జన్మించిన నా పుత్రుడికోసం వెళ్తున్నా''నని అగ్ని చెప్పగా నామె ఆ బిడ్డడు నా కుమారుడని నిలదీసింది. అలా అగ్నీ కుటిలాదేవి నాబిడ్డడంటే నా బిడ్డడని కీచులాడుకొనుచుండగా నచటకు నారాయణుడు వచ్చి మీ వివాదానికి కారణమేమని అడిగాడు. శివశుక్రంవల్ల కలిగిన బాలకుడికోసం మా తగవు అని వారలు చెప్పగా నా విష్ణువు, ఈ విషయం తేల్చవలసినది ఆ త్రిపురాంతకుడే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేయుడ''ని సలహాయిచ్చాడు.

ఇత్యుక్తా వాసుదేవేన కుటిలాగ్నీ హరాంతికమ్‌ | సమభ్యేత్యో చతుస్తథ్యం కస్యపుత్రేతి నారద. 34

రుద్రస్తద్వాక్య మాకర్ణ్య హర్ష నిర్భరమానసః | దిష్ట్యాదిష్ట్యే తిగిరిజాం ప్రోద్భూతపులకో7బ్రవీత్‌ 35

తతో7బికాప్రాహహరం దేవగచ్ఛామతం శిశుమ్‌ | ప్రష్టుం సమాశ్రయేద్‌ యంస తస్యపుత్రో భవిష్యతి. 36

బాఢమిత్యేవ భగవాన్‌ సముత్తస్థౌ వృషధ్వజః | సహోమయా కుటిలయా పావకేనచ ధీమతా 37

సంప్రాప్తాస్తే శరవణం హరాగ్ని కుటిలాంబికాః | దదృశుః శిశుకంతంచ కృత్తికోత్సంగ శాయినమ్‌. 38

తతః సబాలకస్తేషాం మత్వాచింతి తమాదరాత్‌ | యోగీ చతుర్ముర్తిరభూత్‌ షణ్ముఖః సశిశుస్త్వపి. 39

కుమారః శంకరమగాద్‌ విశాఖోగౌరి మాగమత్‌ | కుటిలామగమత్‌ శాఖో మహాసేనో7గ్ని మభ్యయాత్‌. 40

తతః ప్రీతియుతోరుద్ర ఉమాచ కుటిలాతథా | పావకశ్చాపి దేవేశః పరాంముదమవాపచ 41

తతో7బ్రువన్‌ కృత్తికాస్తాః షణ్ముఖః కింహరాత్మజః | తాఅబ్రవీద్దరః ప్రీత్యా విధివద్వచనంమునే. 42

నామ్నాతు కార్తికేయోహి యుష్మాకం తనయస్త్వసౌ |

కుటిలాయాఃకుమారే7తి పుత్రో7యం భవితా7వ్యయః. 43

స్కందఇత్యేవ విఖ్యాతో గౌరీపుత్రో భవత్వసౌ | గుహఇత్యేవ నామ్నాచ మమాసౌతనయః స్మృతః. 44

మహాసేన ఇతిఖ్యాతో హుతాశస్యాస్తు పుత్రకః | శారద్వత ఇతిఖ్యాతః సుతః శరవణస్యచ. 45

ఏవమేష మహాయోగీ పృథివ్యాం ఖ్యాతిమేష్యతి | షడాస్యత్వాన్మహాబాహుః షణ్ముఖోనామగీయతే. 46

ఇత్యేవముక్త్వా భగవాన్‌ శూలపాణిః పితామహమ్‌ | సస్మార దైవతైస్సార్ధం తే7ప్యాజగ్ముస్త్వరాన్వితాః. 47

ప్రణిపత్యచ కామారి ముమాంచగిరి నందినీమ్‌ | దృష్ట్వాహుతాశనం ప్రీత్యా కుటిలాంకృత్తి కాస్తథా. 48

దదృశుర్బాల మత్యుగ్రం షణ్ముఖం సూర్యస నిభమ్‌ | ముష్ణంత మివచక్షూంషి తేజసా స్వేనదేవతాః. 49

కౌతుకాభివృతాః సర్వే ఏవమూచుః సురోత్తమాః | దేవకార్యం త్వయాదేవ కృతం దేవ్యా7గ్నినాతథా 50

తదుత్తిష్ఠ ప్రజామో7థ తీర్థమౌజసమవ్యయమ్‌ | కురుక్షేత్రే సరస్వత్యా మభిషించామ షణ్ముఖమ్‌. 51

వాసుధేవుడు చెప్పినట్లుగా కుటిలా అగ్నీ శివునివద్దకు వెళ్ళి ఆయనను ఆ బిడ్డ ఎవరి కుమారుడో నిజం చెప్పమని అర్థించారు. వారల మాటలు విని శంకరు డానందంపట్టలేక ''ఆహా!ఆహా! ఎంతమంచిమాట|'' అని పార్వతితో అన్నాడు. అది విని పార్వతి భర్తతో, ''నాధా'9! మన మా బాలకుని వద్దకు వెళ్దాము. అతడు మనలో నెవరివద్దకువస్తాడో ఆ వ్యక్తికే తనయుడు కాగలడ''ని అన్నది. మంచిదంటూ శివుడులేచి, ఉమ కుటిల అగ్ని వెంటరాగా శరవణవనానికి వెళ్ళాడు. అక్కడ వారు నలుగురూ, ఆ బిడ్డను కృత్తికల ఒడిలో చూచారు. యోగి అయిన ఆ బాలకుడు పరిస్థితిని బాగా ఆలోచించి నాలుగు రూపాలు ధరించాడు. వారిలో కుమారుడు శంకరుని సమీపిస్తే విశాఖుడు గౌరి ఒడిలోకి వెళ్ళాడు. శాఖుడు కుటిల నాశ్రయించగా మహాసేను డగ్ని చేతుల్లోకి వెళ్లాడు. అదిచూచి హరుడు ఉమ కుటిల అగ్ని నలుగురు ఎంతో సంతోషించారు. అప్పుడా కృత్తికలు ఈ షణ్ముఖ బాలకుడు శివుని కుమారుడా? అని అడిగారు. అంతట హరుడు అందరకూ సంతోషం కలుగునట్లుగా ఒక నిర్ణయం వినిపించాడు. ''ఈ బాలకుడు కార్తికేయుడుగా మీ కుమారుడు. కుమారుడుగా కుటిలకు పుత్రుడు. ఈ అవ్యయుడు స్కందుడుగా ఉమాతనయుడుగా ప్రఖ్యాత దౌతాడు. ఇక గుహుడను పేరుతో నాకు ఔరసుడు. మహాసేనుడుగా ఈ మహాయోగి హుతాశనుని పుత్రుడు. ఈ శరవణవనంలో పుట్టినందున శారద్వతుడుగా ప్రసిద్ధుడౌతాడు. ఆరు తలలు కలిగినందుకు ఈ మహావీరుడు షణ్ముఖుడుగా కీర్తింపబడతాడు''. ఈ విధంగా అందరనూ తృప్తిపరచి ఆ శూలపాణి బ్రహ్మాదిదేవతలందరనూ స్మరించాడు. తత్‌క్షణం వారందరూ వచ్చి శివపార్వతులకు వందనాలు చేసి అగ్ని, కుటిల, కృత్తికలను ప్రీతితో సంభావించి, తన శరీరకాంతితో దేవతల కండ్లకు మిరుమిట్లుగొలుపుచూ సూర్యుని వలె ఉగ్రమైన తేజస్సుతో వెలిగిపోతున్న నా షడాననుణ్ణి చూచి మహదానందభరితులై ''హరా' దేవా మీరూ శ్రీఅంబికా, అగ్నిదేవుడు ఈ విధంగా దేవకార్యాన్ని సంపన్నం గావించారు. ''వెంటనే లేవండి మనమందర మీక్షణమే మహాశక్తి నంతమూ అవ్యయమూ అయిన కురుక్షేత్ర తీర్థానికి వెళ్ళి ఈ అద్భుత బాలకుణ్ణి పవిత్ర సరస్వతీ జలాలతో అభిషక్తుని గావించుదాము'' అన్నారు.

సేనాయాః పతిరస్త్వేష దేవగంధర్వ కింనరాః | మహిషం ఘాతయత్వేష తారకం చ సుదారుణమ్‌. 52

బాఢమిత్య బ్రవీచ్ఛర్వః సముత్తస్థుః సురాస్తతః | కుమారసహితా జగ్ముః కురుక్షేత్రం మహాఫలమ్‌. 53

తత్రైవదేవతా స్సేంద్రా రుద్రబ్రహ్మ జనార్ధనాః | యత్నమస్యాభి షేకార్థం చక్రుర్మునిగణౖః సహ. 54

తతో 7ంబునాసప్తసముద్రవాహినీ నదీజలేనాపి మహాఫలేన |

వరౌషధీభిశ్చ నహస్రమూ ర్తిభి స్తదాభ్యషించన్‌ గుహమచ్యుతాద్యాః. 55

అభిషించతి సేనాన్యాం కుమారే రివ్యరూపిణి | జగుర్గంధర్వపతయో ననృతుశ్చాప్సరోగణాః. 56

అభిషిక్తం కుమారంచ గిరిపుత్రీ నిరీక్ష్యహి |

స్నేహా దుత్సంగగం స్కందం మూర్ద్న్యజిఘ్రన్ము హుర్ముహుః.57

జిఘ్రతీ కార్తికేయస్య అభిషేకార్ద్ర మాననమ్‌ |భాత్యద్రిజా యథేంద్రస్య దేవమాతా7దితిః పురా. 58

తదా7భిషిక్తం తనయం దృష్ట్వాశర్వోముదం య¸° | పావకః కృత్తికాశ్చైవ కుటిలాచయశస్వినీ. 59

తతో7భిషిక్తస్యహరః సేనాపత్యే గుహస్యతు | ప్రమథాంశ్చతురః ప్రాదా చ్ఛక్రతుల్య పరాక్రమాన్‌. 60

ఘంటాకర్ణం లోహితాక్షం నందిసేనంచ దారుణమ్‌ | చతుర్థం బలినాంముఖ్యం ఖ్యాతం కుముదమాలినమ్‌. 61

హరదత్తాన్‌ గణాన్‌ దృష్ట్వా దేవాః స్కందస్య నారద |

ప్రదదుః ప్రమథాన్‌ స్వాన్‌ స్వాన్‌ సర్వేబ్రహ్మ పురోగమాః 62

స్థాణుం బ్రహ్మాగణంప్రాదాద్విష్ణుః ప్రాదాద్గణత్రయమ్‌ | సంక్రమంవిక్రమంచైవ తృతీయంచపరాక్రమమ్‌. 63

ఉత్కేశంపంకజం శక్రో రవిర్దండ కపింగలౌ | చంద్రోమణిం వసుమణి మశ్వినౌవత్సనందినౌ. 64

జ్యోతిర్హుతాశనః ప్రాదాద్‌ జ్వలజ్జిహ్వం తథావరమ్‌ |

కుందం ముకుందం కుసుమం త్రీన్‌ ధాతా7నుచరాన్‌ దదౌ. 65

చక్రాను చక్రౌత్వష్టాచ వేధాతిస్థిరసుస్థిరౌ | పౌణిత్యజంకాలకంచ ప్రాదా త్పూషా మహాబలౌ. 66

స్వర్ణమాలం ఘనాహ్వంచ హిమవాన్‌ ప్రమథోత్తమా|

ప్రాదాద్దేవోచ్ఛ్రితో వింధ్య స్త్వతిశృంగంచ పార్షదమ్‌. 67

సువర్చసం చవరుణః ప్రదదౌచాతి వర్చసమ్‌ | సంగ్రహం విగ్రహంచాబ్ది ర్నాగాజయమహాజ¸°. 68

ఉన్మాదంశంకుర్ణంచ పుష్పదంతం తథాంబికా | ఘసంచాతిఘసంవాయుః ప్రాదాదనుచరావుభౌ. 69

పరిఘం చటకం భీమం దహాతి డహనౌతథా | ప్రదదావంశుమాన్‌ పంచప్రమథాన్‌ షణ్ముఖాయహి. 70

దేవగంధర్వకిన్నర సేనల కితడు నాయకుడౌతాడు. భయంకరులైన మహిషాసుర తారకాసులను వధించగలడు''. అది విని హరుడు మంచిదంటూ లేచాడు దేవతలు కూడ ఆయన వెంట కుమారునితో కలిసి మహాఫలదాయియగు కురుక్షేత్రానికి చేరుకున్నారు. హరిహర బ్రహ్మలు యింద్రాదిదేవతలు మునులూ అంతా కలిసి అభిషేక ప్రయత్నాలు చేశారు. అంతట అచ్యుతాలు మహాఫలదాయకాలయిన నదీజలాలు సప్తసముద్రోదకాలు, శ్రేష్ఠమైన ఓషధులు వేయింటిని కలిపి , ఆ గుహునకు మంగళాభిషేకస్నానం చేయించారు. సమస్తదేవసేనల నాయకుడుగా కుమారు నభిషేకించు సమయాన గంధర్వులు గానంచేశారు. అప్సరసలు నాట్యాలు గావించారు. అలా అభిషేకించబడిన ముద్దుబిడ్డను చూచి ముప్పిరిగొన్న వాత్సల్యంకో ఒడిలోకి తీసుకొని ఉమ ముద్దులతో ముంచెత్తింది. కార్తికేయుని అభిషేకంతో తడిగా ఉన్న ముఖాన్ని మాటిమాటికీ గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ సమయాన ఆ గిరినందిని, ఇంద్రుని ఒడిలో నుంచుకొని తేజరిల్లిన దేవమాత అదితిని మరపించింది. అలా అభిషేకించబడిన తనయుని చూచి శివుడు ఆనందభరితుడైనాడు. అగ్నికృత్తికలు కుటిల కూడ ఎంతో ఆనందించారు. దేవసేనావతిగా పట్టాభిషిక్తుడైన గుహునకు హరుడు, ఇంద్రతుల్య పరాక్రమవంతులైన ఘంటాకర్ణ లోహితాక్షనందిసేనకుముదమాలీలను నలుగురు ప్రసిద్ధులైన ప్రమథులను కాన్కగాయిచ్చాడు. నారదా! అలా శివుడు తన గణముఖ్యులను స్కందునకు యివ్వడం చూచి బ్రహ్మాదిదేవతలందరూ తమతమ ప్రమథులను సమర్పించారు. బ్రహ్మ స్థాణుగణాన్ని యిస్తే విష్ణువు సంక్రమ, విక్రమ, పరాక్రములనే ముగ్గుర్ని యిచ్చాడు. ఇంద్రుడు ఉత్కేశ, పంకజులను, రవిరండక, పింగళులను సమర్పించారు. చంద్రుడు మణి, వసుమణులనూ, అశ్వనీదేవతలు వత్సడునంది లను వారిని యిచ్చారు. అగ్ని జ్యోతి, జ్వల జ్ఞిహ్వులనూ, ధాత కంద, ముకుంద, కుసుములనే ముగ్గురు అనుచరులను యిచ్చారు. త్వష్ట చక్రాసు చక్రుల నిద్దరను, వేధ అతిస్థిర, సుస్థిరలను యిచ్చారు. పూషుడు పాణిపత్యజకాలకులనే యిద్దరు బలశాలురను యిస్తే, హింమవంతుడు స్వర్ణమాలుడు ఘనాహ్వుడనే ఉత్తమ ప్రమథులనిచ్చాడు. వింధ్యుడు తన ఔన్నత్యానికి తగినట్టుగా అతిశృంగుడు పార్షదుల నిచ్చాడు. వరుణుడు సువర్చస అతివర్చసులను, సముద్రుడు సంగ్రహ విగ్రహులను, నాగులు జయమహాజయులనువారిని, అంబిక ఉన్మాదుడు, శంకుకర్ణ, పుష్పదంతులను, వాయుదేవుడు ఘస, అతిఘనులను, అంశుమంతుడు పరిఘ, గటక, భీమ దహాతిదహనులకు ఆ షణ్ముఖునకిచ్చారు. యముడు ప్రమాథ, ఉన్మాథ, కాలసేన, మహాముఖ, తాళపత్ర , నాడీజంఘులను అనుచరులను ఆరుగురను, ధాత సుప్రభ సుకర్మలను గణద్వయాన్నీ ఆ మహాసేనునకర్పిచారు.

యమః ప్రమాథమున్మాథం కాలసేనం మహాముఖమ్‌ | తాలవ్రతం నాడిజంఘం షడే వానుచరాన్‌ దదౌ. 71

సుప్రభంచసుకర్మాణం దదౌధాతాగణశ్వరౌ | సువ్రతం సత్యసంధంచ మిత్రః ప్రాదాద్ద్విజోత్తమ. 72

అనంతః శంకుపీఠశ్చ నికుంభః కుముదో7బుజః | ఏకాక్షః కునటీచక్షుః కిరిటీకలశోదరః.73

సూచీవక్త్రః కోకనదః ప్రహాసః ప్రియకో7చ్యుతః | గణాః పంచదశైతేహి యక్షైర్థత్తా గుహస్యతు. 74

కాళింద్యాః కాలకందశ్చ నర్మదాయా రణోత్కటః | గోదావర్యాః సిద్దయాత్రా స్తమసాయాద్రి కంపకః. 75

సహస్రబాహుః సీతాయా వంజులాయాః సితోదరః | మందాకిన్యాస్తథానందో విపాశాయాః ప్రియంకరః. 76

బరావత్యాశ్చతుర్ద్రంష్ట్రః షోడశాక్షో వితస్తయా | మార్జారం కౌశికీప్రాదాత్‌ క్రథక్రౌంచౌచ గౌతమీ. 77

బాహుదాశత శీర్షంచ వాహా గోనందనందికౌ | భీమం భీమరథీప్రాదా ద్వేగారింసరయూర్దదౌ. 78

అష్టబాహుం దదౌకాశీ సుబాహుమపి గండకీ | మహానదీ చిత్రదేవం చిత్రా చిత్రరథందదౌ.79

కుహూః కువలయం ప్రాదా న్మధువర్ణం మధూదకా | జంబూకం ధూతపాపాచ వేణాశ్వేతాననందదౌ. 80

శ్రుతవర్ణంచ పర్ణాసా రేవాసాగర వేగినమ్‌ | ప్రభావర్ధం సహంప్రాదాత్‌ కాంచనా కనకేక్షణమ్‌. 81

గృధ్రపత్రంచ విమలా చారువక్రం మనోహరా | ధూతపాపామహారావం కర్ణా విద్రుమనంనిభమ్‌. 82

సుప్రసాదంసు వేణుశ్చ జిష్ణు మోఘవతీదదౌ | యజ్ఞబాహుం విశాలాచ సరస్వత్యోదదుర్గణాన్‌. 83

కుటిలాతనయ స్యాదా ద్దశశక్ర బలాన్‌ గణాన్‌ | కరాళం పితకేశం చకృష్ణకేశం జటాధరమ్‌. 84

మేఘనాదం చతుర్దంష్ట్రం విద్యుజ్జిహ్వందశాననమ్‌ | సోమాప్యాయన మేహోగ్రం దేవయాజినమేచ. 85

హంసాస్యం కుండజఠరం బహుగ్రీవం హయాననమ్‌ |

కూర్మగ్రీవంచపంచైతాన్‌ దదుః పుత్రాయకృత్తికాః. 86

స్థాణుజంఘం కుంభవక్త్రం లోహజంఘం మహాననమ్‌ |

పిండాకారం చ పంచైతాన్‌ దుదుః స్కందాయచర్షయః. 87

ఓ బ్రాహ్మణోత్తమా! ఆ స్కందునకు మిత్రుడు సువ్రతసత్య సంధులను యక్షులు అనంత, శంకుపీట నికుంభ కుముద అంబుజ, ఏకాక్ష కునటి చక్షు, కిరీటి, కలశోదర, సూచీవక్త్ర కోకనద ప్రహాసప్రియక, అచ్యుతులనే మదిహేను గురుగణాలను అర్పించారు. కాశిందీనది కాలకందునీ, నర్మద రణోత్కటుని, గోదావరి సిద్ధయాత్రుని, తమసానది అద్రి కంపకుని, సీత సహస్రవాహుని వంజల స్మితోదరుని, మందాకిని నందునీ, విపాశ ప్రియంకరుని, ఇరావతి చతుర్దంష్ట్రుని వితస్త షోడశాక్షుని, కౌశికి మార్జారుని, గౌతమి క్రథ క్రౌంచులను, బాహుద శతశీర్షుని, వాహానది గోనంద నందికులను, భీమరథి భీముని, పరయువేగారిని, కాశీ అష్టబాహుని, గండకి సుబాహుని, మహానది కువలయుని, మధూదక మధువర్ణుని, ధూతపాప జంబూకుని, వేణా శ్వేతాననుడిని, పర్ణాస శ్రుతవర్ణుని, రేవసాగరవేగిని, ప్రభావనది అర్థుని, సహుని, కాంచన కనకేక్షకుని విమల గృధ్రపత్రుని, మనోహర చారువక్త్రుని, ధూత పాపమహారావుని, కర్ణానది ద్రుమ సన్నిభుని, సువేణు సుప్రసాదుని, ఓఘవతి జిష్ణుడిని, విశాల యజ్ఞబాహువును, ఆ స్కందునకు ఇచ్చాయి. ఈ విధంగా నదులన్నీ కార్తికేయుని కార్యానికి తోడ్పడినాయి. తన ప్రియ పుత్రునికి కుటిల దేవేంద్రునితో సమాన ఖలులైన, కరాళ, సితకేస, కృష్ణకేశ, జటాధర, మేఘనాధ, చతుర్ధంష్ట్ర, విద్యుజ్జిహ్వ, దశానన, సోమాప్యాయన, దేవయాజిలనే పదిమంది గజ ప్రముఖులను యిచ్చింది. ఇక కృత్తికలందరు ఆ షణ్ముఖునకు హంసాస్య కుండజఠర, బహుగ్రీవ, హయావన, కూర్మ గ్రీవులనే గణ పంచకాన్ని పుత్రవాత్సల్యంతో యిచ్చారు. ఋషులంతా కలిసి స్థాణుజంఘ, కుంభవక్త్ర లోహజంఘమహానన పిండకారులనే అయిదుగురను స్కందునకు ఆశీస్సులతో యిచ్చారు.

నాగజిహ్వం చంద్రభాసం పాణికూర్మ శశీక్షకమ్‌ | చాషపక్త్రం చ జంబూకం దదౌతీర్థః పృథూదకః. 88

చక్రతీర్థం సుచక్రాక్షం మకరాక్షంగయాశిరః | గణం పంచశిఖం నామ దదౌకనఖలః స్వకమ్‌.89

బంధుదత్తం వాజిశిరో బాహుశాలంచ పుష్కరమ్‌ | సర్వౌజసం మాహిషకం మానసః పింగళం యథా . 90

రద్రమౌశననః ప్రాదాత్‌ తతో7న్యే మాతరోదదుః | వసుదామాం సోమతీర్థః ప్రభాసోనందినీమపి. 91

ఇంద్రతీర్థ విశోకాంచ ఉదపానోఘనస్వనమ్‌ | సప్తసారస్వతః ప్రాదా న్మాతరశ్చ తురోద్బుతాః . 92

గీతప్రియాం మాధవీంచ తీర్థనేమిం స్మితాననామ్‌ | ఏకచూడాం నాగతీర్థః కురుక్షేత్రం పలాసదామ్‌. 93

బ్రహ్మయోనిశ్చండ శిలాం భద్రకాళీం త్రివిష్టపః | చౌండీల భైండీం యోగభైండీం ప్రాదాచ్చరణ పావనః 94

సోపానీయాం మహీప్రాదా చ్ఛాలికాం మానసోహ్రదః | శతఘంటాం శతానందాం తథోలూఖలమేఖలామ్‌. 95

పద్మావతీం మాధవీంచ దదౌబదరికాశ్రమః | సుషమామేకచూడాంచ దేవీంధమధమాంతథా. 96

ఉత్త్రాథనీం వేదమిత్రాం కేదారోమాతరోదదౌ | సునక్షత్రాం కద్రూలాంచ సుప్రభాతాం సుమంగళామ్‌. 97

దేవమిత్రాం చిత్రసేనాం దదౌ రుద్రమహాలయః కోటరామూర్థ్వవేణించ శ్రీమతీం బహుపుత్రికామ్‌. 98

ఫలితాం కమలాక్షీంచ ప్రయాగోమాతరోదదౌ | సుపలాం మధుకుంభాంచ ఖ్యాతిందహదహాంపరామ్‌. 99

ప్రాదాత్‌ ఖటకటాంచాన్యాం సర్వపాపవిమోచన ః | సంతానికాం వికలికాం క్రమశ్చత్వర వాసినీమ్‌. 100

జవేశ్వరీం కుక్కుటికాం సుదామాంలోకమేఖలామ్‌ |

వపుష్మత్యుల్ము కాక్షీచ కోకనామామహాశనీ | రౌధ్రాకర్కటి కాతుండా శ్వేతతీర్థో దదౌత్విమా. 101

ఏతానిభూతాని గణాంశ్చ మాతరో దృష్ట్వా మహాత్మా వినతాతనూజః |

దదౌమయూకం స్వసుతం మహాజవమ్‌ తథా7రుణ స్తామ్రచూడం చ పుత్రమ్‌. 102

శక్తిం హుతాశో7ద్రిసుతా చ వస్త్రం దండం గురుః సా కుటిలాకమండలుమ్‌ |

మాలాంహరిః శూలధరః పతాకాం కంఠేచ హారం మఘవానురస్తః . 103

గణౖర్‌ వృతో మాతృభి రన్వయాతో | మయూరసంస్థో వరశక్తి పాణిః.

సైన్యాధిపత్యే స కృతో భ##వేన రరాజ సూర్యేవ మహావపుష్మాన్‌. 104

ఇతి శ్రీ వామన మహాపురాణ ఏకత్రింశో7ధ్యాయః

ఆ స్కందదేవునకు పృథూదక తీర్థం నాగజిహ్వ. చంద్రభాస, పాణికూర్మ, శశీక్షక, చాషవక్త్ర, జంబూక గణాలను యిచ్చింది. చక్రతీర్థం సుచక్రాక్షుని, గయాశిరతీర్థం మకరాక్షుని, కనఖలతీర్థం పంచశిఖఅనేస్వంతగణాన్ని కుమారున కిచ్చాయి. బంధుదత్తుని వాజిశిరం, బాహుశాలుని పుష్కరం, మానసతీర్థం సరౌజస మాహిషకపింగళులను యిచ్చాయి. ఔశనస తీర్థం వసుదాముని, ప్రభాసం నందినిని, ఇంద్రతీర్థం విశోకుని, ఉదపానం ఘనస్వననూ, సప్తసారస్వత తీర్థం అద్భుతం గొలిపే నలుగురు మాతృకలు గీతప్రియ, మాధవి తీర్థనేమి స్మితాననలను యిచ్చాయి. నాగతీర్థం ఏకచూడను, కురుక్షేత్రం పలాసదను, బ్రహ్మయోని చండశిలను, త్రివిష్టపం భద్రకాళిని, చరణపావనతీర్థం చౌండి, భైండి యోగభైండిలను గణాలను యిచ్చాయి. మహీసోపానీయను, మానససరోవరం శాలికను, బదరికాశ్రమంశతానంద, శాతఘంట ఉలూఖలమేఖలలను, పద్మావతి మాధవీ గణాలను యిచ్చాయి. కేదారక్షేత్రం సుషను, ఏకచూడ, దేవి, ధమధమా, ఉత్క్రాథని వేదమిత్రలనే మాతృగణాల నిచ్చింది. రౌద్రమహాలయం సునక్షత్రాన్ని, కద్రూల, సుప్రభాత, సుమంగళ, దేవమిత్ర చిత్రసేనలను యిస్తే ప్రయాగ కోటర, ఊర్ధ్వవేణి శ్రీమతి బహుపుత్రిక పతితి, కమలాక్షీలనే మాతృగణాన్ని యిచ్చింది. సర్వపాపవిమోచనక్షేత్రం సూపల, మధుకుంభ, ఖ్యాతిదహదహ పరా, ఖటకటా సంతానిక వికవికలను యిచ్చింది. క్రమతీర్థం చత్వరవాసిని, జలేశ్వరి, కుక్కుటిక, సుధామా, లోహమేఖలా గణాలను యివ్వగా శ్వేతతీర్థం వపుష్మతి, ఉలూకాక్షి, కోకనామ మహాశనీ రౌద్రాకర్కటిక తుండగణాలను కార్తికేయునకిచ్చింది. ఇందరు భూతాలు గణాలు మాతృకలు ఆ స్కందుని సేవించడం చూచి మహాత్ముడగు వైనతేయుడు పరమ వేగశాలి ఐన తన కుమారుడు మయూరు (నెమలి)ని, అరుణుడు తన పుత్రుడు తామ్రచుడు (కోడి)ని, ఆయనకు సమర్పించారు. అగ్ని దేవుడు శక్తిని, పార్వతి వస్త్రాన్ని, బృహస్పతి దండాన్ని, కుటిల కమండలాన్ని విష్ణువు పుష్పమాలను, శంకరుడు ధ్వజాన్ని, ఇంద్రుడు తనమెడలోని స్వర్ణహారాన్ని విశాఖునకు ఇచ్చారు. భూతగణాలందరు తన్ను పరివేష్ఠించి కొలువగా మాతృగణాలు వెంట రాగా దేవ సేనాధిపత్య వహించిన ఆహరాత్మజుడు మయూరం మీదనెక్కి భాస్కర ప్రభతో వెలిగిపోయాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో ముప్పది యొకటవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters