Sri Vamana Mahapuranam    Chapters   

ఐదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

జటాధరం హరిర్ధృష్ట్వా క్రోధాదారక్తలోచనమ్‌ | తస్మాత్‌ స్థానా దపాక్రమ్య కుబ్జామ్రే7ంతర్హితః స్థితః. 1

వసవో7ష్ఠౌ హరం దృష్ట్వా ససృపుర్వేగతో మునే | సాతు జాతాసరిచ్ఛ్రేష్ఠా సీతా నామ సరస్వతీ. 2

ఏకాదశ తథారుద్రా స్త్రినేత్రా వృషకేతనాః | కాందిశీకాలయంజగ్ముః సమభ్యేత్యేవ శంకరమ్‌. 3

విశ్వే7శ్వినౌచ సాధ్యాశ్చ మరుతో7నల భాస్కరాః | సమాసాద్య పురోడాశం భక్షయంతో మహామునే. 4

చంద్రః సమమృక్షగణౖ ర్నిశాం సముపదర్శయన్‌ | ఉత్పత్యారుహ్య గగనం స్వమధిష్ఠాన మాస్థితః. 5

కశ్యపాద్యాశ్చ ఋషయో జపంతః శతరుద్రియం | పుష్పాంజలిపుటా భూత్వా ప్రణతాః సంస్థితామునే. 6

అసకృద్‌ దక్షదయితా దృష్ఠ్వారుద్రం బలాధికమ్‌ | శక్రాదీనాం సురేశానాం కృపణం విలలాపహ. 7

తతఃక్రోధాభిభూతేన శంకరేణ మహాత్మనా | తలప్రహారై రమరా బహవో వినిపాతితాః. 8

పాదప్రహారై రపరే త్రిశూలేనాపరే మునే | దృష్ట్వాగ్నినా తథైవాన్యే దేవాద్యాః ప్రలయీకృతాః. 9

తతః పూషా హరం వీక్ష్య వినిఘ్నంతం సురాసురాన్‌ |

క్రోధాద్‌ బాహూ ప్రసార్యాథ ప్రదుద్రావ మహేశ్వరమ్‌. 10

తమాపతంతం భగవాన్‌ సంనిరీక్ష్య త్రిలోచనః | బాహుభ్యాం ప్రతిజగ్రాహ కరేణౖ కేన శంకరః. 11

కరాభ్యాం ప్రగృహీతస్య శంభునాంశుమతో7పి హి | కరాంగులిభ్యో నిశ్చేరు రసృగ్ధారాః సమంతతః. 12

తతో వేగేన మహతా అంశుమంతం దివాకరమ్‌ | భ్రామయామాస సతతం సింహో మృగశిశుం యథా. 13

భ్రామితస్యాతివేగేన నారదాంశుమతో7పి హి | భుజౌ హ్రస్వత్వమాపన్నౌ త్రుటితస్నాయు బంధనౌ. 14

రుధిదాప్లుతసర్వాంగ మంశుమంతం మహేశ్వరః | సంనిరీక్ష్యోత్ససర్జైనం అన్యతో7భిజగామహ. 15

తతస్తు పూషా విహసన్‌ దశనాని విదర్శయన్‌ | ప్రోవాచై హ్యేహికాపాలిన్‌ పునః పున రథేశ్వరమ్‌. 16

తతః క్రోధాభిభూతేన పూష్ణో వేగేన శంభునా | ముష్టినాహత్య దశనాః పాతితా ధరణీతలే. 17

భగ్నదంతస్తథా పూషా శోణితాభిప్లుతాననః | పపాత భువి నిఃసంజ్ఞో వజ్రాహత ఇవాచలః. 18

భగ్నో7భివీక్ష్య పూషాణం పతితం రుధిరోక్షితం | నేత్రాభ్యాం ఘోరరూపాభ్యాం వృషధ్వజ మవైక్షత. 19

త్రిపురఘ్నస్తతః క్రుద్ద స్తలేనాహత్య చక్షుషీ | నిపాతయామాస భువి క్షోభయ న్సర్వదేవతాః. 20

తతో దివాకరాస్సర్వే పురస్కృత్య శతక్రతుమ్‌ | మరుద్భిశ్చ హుతాశైశ్చ భయాజ్జాగ్ము ర్దిశోదశ. 21

ప్రతియాతేషు దేవేషు ప్రహ్లాదాద్యా దితీశ్వరాః | నమస్కృత్య తతఃసర్వే తస్థుః ప్రాంజలయో మునే. 22

తతస్తం యజ్ఞవాటంతు శంకరోఘోరచక్షుషా | దదర్శ దగ్దుం కోపేన సర్వాంశ్చైవ సురాసురాన్‌. 23

తతో నిలిల్యిరే వీరాః ప్రణము ర్దుద్రువుస్తథా | భయా దన్యే హరం దృష్ట్వాగతా వైవస్వతక్షయమ్‌. 24

త్రయో7గ్నయ స్త్రిభిర్నేత్రైర్‌ దుఃసహం సమవైక్షత | దృష్టమాత్రా స్త్రినేత్రేణ భస్మీభూతా భవన్‌క్షణాత్‌.

పులస్త్యవచనము : క్రోధతామ్రాక్షుడై వచ్చిన ఆకపర్ణిని చూచి విష్ణువు వెంటనే ఆస్థానం వదలి ఒకకుబ్జామ్రమున దాగికొనెను. అష్టవసువు లాహరుని చూచినంతనే పలాయనము చిత్తగించిరి. వారలు పారిపోయిన మార్గము సీతయను నదీ శ్రేష్ఠమయ్యెను. దానినే సరస్వతీ యని పిలచిరి.శంకరుని రాకతో త్రినేత్రులు వృషకేతనులగు నేకాదశరుద్రులు తమ స్థానములు వదలి పారిపోయిరి. విశ్వేదేవులు అశ్వినులు సాధ్యులు మరుత్తులు సూర్యాగ్నులు పురోడాశమును భక్షంచిరి. నక్షత్రములతో కూడి చంద్రుడు రాత్రితో కూడి ఆకాశమున కెగిరి. తన నెలవును పొందెను. శతరుద్రియమును పఠించుచున్న కశ్యపాది మహర్షులు సంభ్రమముతో చేతులు జోడించుకొని నిలబడిరి. యింద్రాదులను మించి బలప్రదర్శనము చేయుచున్న రుద్రుని చూచి దక్షపత్ని అతికరుణముగ విలపించెను. అప్పుడు క్రోధావేశముతో శంకరుడు ఎందరో దేవతలను చపేట ప్రహారములతో నేలపైబడగొట్టెను. కొందరను పాద ప్రహారములతో కొందరను శూలాఘాతములతో యితర దేవతలను త్రినేత్రాగ్ని జ్వాలల్లో లయింపజేపెను.అంతట పూషుడు శంకరుడొనర్చు దేవతా మారణాన్ని చూచి కోపంతో బాహువులు సాచి ఆయనపై లంఘించెను. తనపైదుముకుచున్న పూషుని రెండు చేతులు ఒక చేతితో నొడిసి పట్టి గట్టిగా పండి అతని వ్రేళ్ళకొనల నుండి రక్తధారలు ప్రవహించునట్లొనర్చెను. వెలుగులు వెదజల్లే ఆదివాకరుని తన పిడికిలితో బంధించి లేడి పిల్లను సింహము త్రిప్పినట్లు గిరగిర త్రిప్పివైచెను. ఓ నారదా! అలా తీవ్రమైన వేగంతో త్రిప్పగా అంశుమంతుని దీర్ఘబాహువులు కుదించుకొని పొట్టివి అయ్యెను. ఎముకలు కీళ్ళు స్నాయువులు నుగ్గునుగ్గయి పోయెను.అంతట శివుడు సర్వాంగాలు రక్తసిక్తములై పడియున్న పూషుని వదలి మరొక వైపు వెళ్ళెను. అట్లు వెళ్ళుచున్న శంకరుని, పూషుడు లేచి పండ్లిగిలించి నవ్వుచు, ఓ కపాలీ! పోపోకుమురమ్మని' మాటిమాటికి వదలించెను. దానితో రెచ్చిపోయి శంభుడా సూర్యుని మూతిపై గట్టిగా ప్రహరించ నాతని పండ్లన్నియు నూడి నేలపైబడెను. అట్లు పండ్లూడి ముఖమంతయు రక్తపుముద్దకాగా పూషుడు స్పృహతప్పి వజ్రాహతి కొరగిన పర్వతము వలె నేలపైబడెను. అట్లు పూషుడు రక్తపు మడుగులో పడిపోవుట చూచి భగుడు భగ్గుమను చూపులతో శంకరుని చూచెను. మరుక్షణములో శంకరుడు ముష్ఠి ఘాతంతో భగుని కన్నుల క్రూరముగనడచి నాతని మట్టికరపించెను, దానితో దేవతలు హాహాకారమొనర్చిరి. దానితో భయకంపితులైన ద్వాదశాదిత్యులు ఇంద్రుడు మరుత్తులు అగ్నులు తలకొక దిక్కుగా పారిపోయిరి. దేవతల పలాయనంతో ప్రహ్లాదుడు తదితర దైత్యులందరు శివునకు సాష్టాంగపడి చేతులు కట్టుకొని నిలబడిరి. శంకరుడు కన్నులు అగ్నిజ్వాలలు చిమ్ముచు యాగశాలనంతను భస్మీపటలము గావింపనెంచి కలయజూచెను. కొదరు వీరులా మహాదేవుని దృష్ఠి తప్పించుకొని దాగికొనిరి. కొందరు ప్రణమిల్లిరి. కొందరు పారిపోయిరి. కొందరు భయాతిరేకంతో యమలోకమును జేరిరి. దుఃసహాతావంతో త్రినేత్రాల్లో జ్వలించుచున్న త్రేతాగ్ని శిఖల వేడికి క్షణకాలంలో సర్వము మాడిబూడిదయయ్యెను.

అగ్నౌ ప్రణష్టేయజ్ఞో7పి భూత్వా దివ్యవపుర్మృగః | దుద్రావ విక్లబతి ర్దక్షిణాసహితో7ంబరే. 26

తమేవాసు ససారేశ శ్చాపమానమ్య వేగవాన్‌ | శరం పాశుపతం కృత్వా కాలరూపీ మహేశ్వరః. 27

అర్ధేన యజ్ఞవాటాంతే జటాధర ఇతి శ్రుతః | అర్ధేన గగనేశర్వః కాలరూపీచ కథ్యతే. 28

యజ్ఞాగ్నులు చల్లారినంతనే యజ్ఞదేవత దివ్య మృగరూపము ధరించి దక్షిణతో సహ గగనవిథికెగసి పోయెను. అట్లు పరిగిడుచున్న యజ్ఞాన్ని చూచి కాలరూపియగు మహేశ్వరుడు పాశుపతాస్త్రం సంధించి దాని వెంటబడెను. ఆ సంధర్భమున శంకరుడు యజ్ఞశాలాంతమున జటాధరుడుగా నర్ధభాగమును, మిగత సగభాగము ఆకాశమున కాలరూపిగను విఖ్యాతుడయ్యెను.

నారద ఉవాచ :

కాలరూపీ త్వమాఖ్యాతః శంభు ర్గగనగోచరః | లక్షణంచ న్వరూపంచ సర్వం వ్యాఖ్యాతు మర్హసి 29

నారదవచనము : బ్రహ్మర్షీ ! శంకరుడు గగన వీథిలో కాలరూపిగ నగుపించునని చెప్పితిరి. ఆ స్వరూప లక్షణ స్వభావములు గూడ విశదముగ సెలవీయవలెను.

పులస్త్య ఉవాచ :

స్వరూపం త్రిపురఘ్నస్య వదిష్యే కాలరూపిణః | యేనాంబరం మునిశ్రేష్ఠ వ్యాప్తం లోకహితే ప్సునా. 30

పులస్త్యవచనము: నారదా! ఆత్రి పురాంతకుడు లోక కళ్యాణ కాంక్షతో కాలరూపియై గగనము నాక్రమించెను. ఆకాలరూపి స్వరూప లక్షణములు వినుము.

యత్రాశ్వినీచ భరణీ కృత్తికాయా స్తథాంశకః | మేషోరాశిః కుజక్షేత్రం తచ్చిరః కాలరూపిణః 31

అగ్నేయాంశా స్త్రయోబ్రహ్మన్‌ ప్రాజాపత్యం కవేర్‌ గృహం |

సౌమ్యార్థం వృషనామేదం వదనం పరికీర్తితమ్‌. 32

మృగార్ధమార్ద్రాదిత్యాంశా స్త్రయః సౌమ్యగృహం త్విదం | మిథునం భుజయోస్తస్య గగనస్థస్య శూలినః.

ఆదిత్యాంశశ్చ పుష్యంచ ఆశ్లేషా శశినో గృహం | రాశిః కర్కటకోనామ పార్శ్వే మఖవినాశినః. 34

పిత్ర్యర్షం భగదైవత్య ముత్తరాంశశ్చ కేసరీ | సూర్యక్షేత్రం విభోర్ర్బహ్మన్‌ హృదయం పరిగీయతే. 35

ఉత్తరాంశాస్త్రయః పాణి శ్చిత్రార్దం కన్యకా త్వయమ్‌l

సోమపుత్రస్య సద్మైతత్‌ ద్వితీయం జఠరం విభోః 36

చిత్రాంశద్వితయం స్వాతి ర్విశాఖాయాంశకత్రయమ్‌ l ద్వితీయం శుక్రనదనం తులానాభి రుదాహృతా. 37

విశాఖాంశ మనూరాధా జ్యేష్ఠా భౌమగృహం త్విదమ్‌ l

ద్వితీయం వృశ్చికోరాశి ర్మేఢ్రం కాలస్వరూపిణః 38

మూలం పూర్వోత్తరాంశశ్చ దేవాచార్యగృహం ధమః l ఊరుయుగళ మీశస్య అమరర్షే ప్రగీయతే. 39

ఉత్తరాంశాస్త్రయః ఋక్షం శ్రవణం మకరోమునే | ధనిష్ఠార్ధం శనిక్షేత్రం జానునీ పరమేష్ఠినః. 40

ధనిష్ఠార్థం శతభిషా ప్రౌష్ఠపద్యాంశకత్రయం | సౌరేః సద్మాపరమిదం కుంభో జంఘేచ విశ్రుతే. 41

ప్రౌష్టపద్యాంశ##మేరంతు ఉత్తరా రేవతీ తథా | ద్వితీయం జీవసదనం మీనస్తు చరణా వుభౌ, 42

ఏవం కృత్వా కాలరూపం త్రినేత్రో యజ్ఞం క్రోధా న్మార్గణౖ రాజఘాన |

విద్ధశ్వాసౌ వేదనాబుద్దిముక్తః ఖే సంతస్థౌ తారకాభి శ్చితాంగః.

అశ్వినీ భరణీ కృత్తిక మొదటి పాదముతో కూడి మేషరాశితో కలిసిన కుజ క్షేత్రం ఈ కాళేశ్వరుని శిరస్సు. శేషించిన కృత్తిక మూడు పాదములు రోహిణి మృగశిర రెండు పాదములు, వృషరాశితో గూడిన శుక్ర క్షేత్రము ఆయన ముఖము. బుధ క్షేత్రం మిథునరాశి, మృగశిర మూడునాలుగు పాదాలు అర్ద్రా పునర్వసు ప్రథమ పాదత్రయము - ఆ మహాదేవుని భుజములు. చంద్ర క్షేత్రం కర్కాటకరాశి, పునర్వసు అంతిమచరణం పుష్యమి అశ్లేష నక్షత్రములుకలిసి అవ్యోమకేశుని యిరుపార్శ్వములు. రవి క్షేత్రం సింహరాశి, మఖ పూర్వఫల్గునీ ఉత్తర ఫాల్గునీ నక్షత్ర ప్రథమ చరణముల సమాహారమే ఆ మహాకాలుని హృదయము. నారదా! బుధుని రెండవ గృహము, కన్యారాశి, కలిగి శేషించిన ఉత్తర ఫల్గుని పాదత్రయము, హస్త, చిత్రా నక్షత్ర పాదద్వయ పరివ్యాప్తమైన భాగమాకాలుని జఠర భాగమని తెలియుము. శుక్రుని రెండవయిల్లు తులారాశి, చిత్రా నక్షత్రము తృతీయ చతుర్ధ పాదములు, స్వాతి, విశాఖ నక్షత్ర పాదత్రయముతో గూడిన గగన పథమాయన నాభిస్థానము. కుజ గ్రహద్వితీయ గృహము, వృశ్చికరాశి, విశాఖ చతుర్థపాదము అనూరాధా జ్యేష్ఠతారలు అకాలరూపి గుహ్యాంగము, బృహస్పతి క్షేత్రం, ధనూరాశి, మూల, పూర్వాషాఢ, ఉత్తదాషాఢ ప్రథమ చరణములు యివి ఈశ్వరుని ఊరువులు (తొడలు); ఓమునీ! శని గృహం, మకరరాశి, ఉత్తరాషాఢ రెండు మూడు నాల్గు చరణాలు, శ్రవణం ధనిష్ఠాచరణద్వయము ఆ పరమేశ్వరుని జానువులు (మోకాళ్లు); సూర్యుని రెండవ గృహం, కుంభరాశి, ధనిష్ట మూడు నాలుగు పాదాలు, శతభిషం పూర్వాభాద్ర మూడు పాదములు గల భాగం ఆస్వామి జంఘలు (పిక్కలు); బృహస్పతి రెంవడవ గృహం, మీనరాశితో గూడి పూర్వాభాద్ర చివరపాదము, ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్ర పరివ్యాప్తమగు నియత్పథనూమహేశ్వరుని చరణ ద్వయము. ఈ విధంగా అనంతమైన కాలరూపం ధరించి ఆ త్రినేత్రుడు కోపంతో యజ్ఞ మృగాన్ని బాణాలతో ప్రహరించాడు. ఆబాణాలతాకిడికి సమస్త బాధలు వదలి ఆయజ్ఞమృగము తారకలతో కలిసి ఆకాశంలోనే నిలచిపోయెను.

నారద ఉవాచ :

రాశయో గదితా బ్రహ్మం స్త్వయా ద్వాదశ##మై మమ | తేషాం విశేషతో బ్రూహి లక్షణాని స్వరూపతః. 44

నారదవచనము : బ్రహ్మర్షీ ! రాశులు పండ్రెండు కలవని తాము సెలవిచ్చిరి. ఆరాశుల స్వరూప లక్షణములు విశదముగా సెలవీయుడు.

పుతస్త్య ఉవాచ :

స్వరూపం తవ వక్ష్యామి రాశీనాం శృణు నారద | యాదృశా యత్రసంచారా యస్మిన్‌ స్థానే వసంతిచ 45

మేషః సమానమూర్తిశ్చ అజావికథనాదిషు | సంచారస్థానమేవాస్య దాన్యరత్నాకరాదిషు. 46

నవశాద్వల సంఛన్న వసుధాయాం చ సర్వశః | నిత్యం చరతి పుల్లేషు సరసాం పులినేషుచ. 47

వృషః సదృశ రూపోహి చరతే గోకులాదిషు | తస్యాదివాస భూమిస్తు కృషీవలధరాశ్రయః. 48

స్త్రీపుంసయోః సమంరూపం శయ్యాసనపరిగ్రహః | వీనావాద్యధృజ్‌ మిథునం గీతనర్తక శిల్పిషు. 49

స్థితః క్రీడారతిర్నిత్యం విహారావనిరస్యతు | మిథునం నామ విఖ్యాతం రాశిర్ద్వేధాత్మకః స్థితః. 50

కర్కిః కుళీరేణసమః సలిలస్థః ప్రకీర్తితః | కేదారవాపీపులినే వివిక్తావనిరేవచ. 51

సింహస్తు పర్వతారణ్యదుర్గకందరభూమిషు | వసతే వ్యాధపల్లీషు గహ్వరేషు గుహాసుచ 52

వ్రీహిప్రదీపికకరా నవారూఢాచ కన్యకా | చరతే స్త్రీరతిస్థానే వసతే నడ్వలేషుచ. 53

తులాపాణిశ్చ పురుషో వీథ్యాపణవిచారకః | నగరాధ్వానశాలాసు వసతే తత్రనారదః. 54

శ్వభ్రవల్మీకసంచారి వృశ్చికో వృశ్చికాకృతిః | విష గోమయ కీటాది షాషానిదిషు సంస్థితః 55

ధనుస్తురంగజఘనో దీప్యమానో ధనుర్దరః | వాజిశూరాస్త్రవిద్వీరః స్థయీగజరథాదిషు. 56

మృగాస్యో మకరో బ్రహ్మన్‌ వృషస్కంధక్షణాంగజః | మకరో%సౌ నదీచారీ వసతేచ మహోదధౌ. 57

రిక్తకుంభశ్చ పురుషః స్కంధధారీ జలాప్లుతః | ద్యూతశాలాచరః కుంభః స్థాయీ శౌండికసద్మసు. 58

మీనద్వయమథాసక్తం మీనస్తీర్థాబ్ధిసంచరః | వసతే పుణ్యదేశేషు దేవబ్రాహ్మణసద్మసు. 59

పులస్త్యవచనము : నారదా! రాశుల స్వరూప లక్షణాలు వినుము. వాని సంచారము. అవి ఉండుచోట్లు చెప్పుచున్నాను. మేషరాశి గొర్రె ఆకారము గలది. ధాన్యములు రత్నపుగనులు, మేకలు, గొర్రెలు, ధనరాసులు, పచ్చిక బయళ్ళు పైరు పచ్చలతో కలకలలాడే జలాశయ తటాలు - యివి ఈ రాశి సంచారానికి ప్రభావానికి లోనగు నట్టి వస్తువులు. వృషభరాశి వృషభాకారంలో ఉండి గోశాలలు, వ్యవసాయ భూముల ప్రభావితము గావించుచుండును. మిథున రాశి దంపతుల జంటవలె నుండును. దాని సంచార ప్రభావములకు లోనగు స్థానములు వస్తువులు - శయ్యాసనములు, వీణా వేణువు లాంటి వాద్యధారణము, గీతనర్తన శిల్పపారగులు, క్రీడలపట్ల ఆసక్తి అభినివేశములు, కేళీ విహార సుందర, భూములు మొదలయినవి. మిథునమనే ఈరాశి ద్వేధాత్మకమైనది. కర్కాటకరాశి ఎండ్రకాయ అకృతి గలది. దీని సంచార నివాస స్థానాలు నీరు, మాగాణి భూములు, బావులు, నదీ తటాలు, ఏకాంత భూములు మొదలగునవి. సింహ రాశి సింహాకారంలో ఉండును. దాని స్థానములు - గిరివనాలు, లోయలు, గుహలు, వేటకాండ్ర పల్లెపట్టులు మొదలయిన దుర్గమ ప్రదేశాలు. ఇక కన్యారాశి, ఒకచేతిలో ధాన్యపుకంకుల మరొక చేత కరదీపిక పట్టుకొని నావమీద కూర్చున్న కన్యకవలె ఉంటుంది. స్త్రీ పురుష సమాగమ స్థానములు రెల్లు పొదలు ఈ రాశి సంచార ప్రభావస్థానాలు. చేతిలో త్రాసు పట్టుకొనిన పురుషాకృతిలో తులారాశి ఉండును. విపణి వీథులు, వ్యాపారసంస్థలు, నగర కేంద్రస్థానములు మొదలగునవి ఈ రాశి చరించు చోటులు. తేలు ఆకృతిలో ఉండే వృశ్చికరాశి పుట్టలు, మెట్టలు గుంటలు, విషములు, ఆవుపేడ, రాళ్ళు రప్పలు, కీటకాలను ప్రభావితం చేస్తుంటుంది. గుర్రపుపిరుదులు గలిగి చేతిలో ధనుస్సు ధరించిన పురుషాకృతి ధనూరాశిది. శూరులు, అస్త్రకోవిదులు, వీరులు, గజరథతురగాదు లీరాశి స్థానాలు. మకరరాశి లేడి ముఖము, ఎద్దు భుజములు కన్నులు రోమములు గలిగి మొసలివలె ఉంటుంది. నదులలో సంచరిస్తూ సముద్రములో వసతి గలిగి ఉంటుంది. నీరు లేని కుండ భుజముపై పెట్టుకొని నీట తడిసిన పురుషుని వలె కుంభరాశి యుండును. జూదగృహాలు పానశాలలు ఈ రాశి సంచారనివాస భూములు. పరస్పరం జతగూడిన చేపలవలె మీనరాశి కనుపించును. పవిత్ర తీర్థాలలో, సముద్రాలలో, క్షేత్రాల్లో సంచరిస్తూ పుణ్యదేశాలలో దేవబ్రాహ్మణ గృహాలలో నివాసము కలిగి ఉండును.

లక్షణాగదితాస్తుభ్యం మేషాదీనాం మహామునే | నకస్యచి త్త్వయాఖ్యేయం గుహ్యమేత త్పురాతనమ్‌ 60

ఏతన్మయా తే కథితం సురర్షే యథా త్రినేత్రః ప్రమమాథ యజ్ఞం |

పుణ్యం పురాణం పరమంపవిత్ర మాఖ్యాతవా న్పాపహరం శివంచ. 61

ఇతి శ్రీవామన మహాపురాణ పంచమోధ్యాయః

మహా మునీ! మేషాదిరాశులను గురించి నేను చెప్పిన వివరములు చాలా గోప్యములు. పురాతనములు. వీని నెవ్వరికిని తెలుపవలదు. ఈ విధముగా త్య్రంబక మహాదేవుడొనర్చిన దక్షాధ్వర ధ్వంస చరిత్ర పరమ పవిత్రము, పుణ్యావహము పురాతనమైనది. సర్వపాపముల పోద్రోలి మంగళములొన గూర్చునది. దేవర్షీ! నీకిది సమగ్రముగా వినిపించితిని.

ఇది శ్రీ వామన మహాపురాణమున పంచమాధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters