Sri Vamana Mahapuranam    Chapters   

మూడవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతః కరతలే రుద్రః కపాలే దారుణ స్థితే | సంతాప మగమద్‌ బ్రహ్మం శ్చింతయా వ్యాకులేంద్రియః. 1

తతః సమాగతా రౌద్రా నీలాంజనచయప్రభా | సంరక్తమూర్ధజా భీమా బ్రహ్మహత్యా హరాంతికమ్‌. 2

తా మాగతాం హరో ద్వష్ట్వా పప్రచ్ఛ వికరాలినీమ్‌ | కా7సి త్వ మా గతా రౌద్రే కేనాప్యర్థేన తద్వద. 3

కపాలిన మథోవాచ బ్రహ్మహత్యా సుదారుణా | బ్రహ్మవధ్యా7స్మి సంప్రాప్తా మాం ప్రతీచ్ఛ త్రిలోచన. 4

ఇత్యేవ ముక్త్వా వచనం బ్రహ్మహత్యా నివేశ హ | త్రిశూలపాణినం రుద్రం సంప్రతాపితవిగ్రహమ్‌. 5

పులస్త్యవచనము : ఓ నారదా: తన చేతి కంటుకొనిన బ్రహ్మకపాలమట్లే యుండుట చూచి రుద్రుడెంతో కలవరపాటందెను. అప్పుడు కాటుకకొండ లాగ భయంకరాకారంతో ఎర్రటి వెండ్రుకలతో రూపుదాల్చిన బ్రహ్మహత్య, రుద్రుని సమీపించెను. కరాళాకృతితో వచ్చిన ఆమెను చూచి శంకరుడో క్రూరురాలా ! నీవెవ్వతెవు? యిచ్చటి కేలవచ్చితివనెను. అపుడా భీకరాంగన - త్రిలోచనా ! నేను బ్రహ్మహత్యను. నన్ను స్వీకరించు మనుచు శివుని దేహములో ప్రవేశించెను. రుద్రుడందుల కెంతయోపరితాపము పొందెను. ఆయన దేహమంతయు కంపించెను.

బ్రహ్మహత్యాభిభూతశ్చ శర్వో బదరికాశ్రమమ్‌ | ఆగచ్ఛన్న దదర్శాథ నరనారాయణా వృషీ. 6

అద్వష్ట్వా ధర్మతన¸° చింతాశోకసమన్వితః | జగామ యమునాం స్నాతుం సా7పి శుష్కజలా7భవత్‌.

కాళిందీం శుష్కసలిలాం నిరీక్ష్య వృషకేతనః | ప్లక్షజాం స్నాతు మగమ దంతర్ధానం చసా గతా. 8

తతో ను పుష్కరారణ్యం మాగధారణ్యమేవచ | సైంధవారణ్యమేవాసౌ గత్వా స్నాతో యేథేచ్చయా. 9

తథైవ నైమిషారణ్యం ధర్మారణ్యం తథేశ్వరః | స్నాతో నైవ చ సా రౌద్రా బ్రహ్మహత్యా వ్యముంచత.

సరిత్సు తీర్థేషు తథాశ్రమేషు పుణ్యషు దేవాయతనేషు శర్వః |

సమాయుతో యోగయుతో7పి పాపా న్నావాప మోక్షం జలదధ్వజో7సౌ. 11

తతో జగామ నిర్విణ్ణః శంకరః కురుజాంగలమ్‌ | తత్ర గత్వా దదర్శాథ చక్రపాణిం ఖగధ్వజమ్‌. 12

తం దృష్ట్వా పుండరీకాక్షం శంఖచక్రగదాధరం | కృతాంజలిపుటో భూత్వా హరః స్తోత్ర ముదైరయత్‌. 13

బ్రహ్మహత్యసోకిన శంకరుడు వెంటనే బదరికాశ్రమమునకు పరిగిడెను. అయితే అక్కడ నర నారాయణు లాయనకు కనపడలేదు. ఆ ధర్మపుత్రులు కనుపించక పోవుటతో చింతాశోకన్యాకులితుడై శంకరుడు యమునలోస్నానము చేయబోగానానది యెండి పోవుచుండెను. కాళిందిలో నీరు లేకుండుటతో ప్లక్షజానదిలో మునగపోగా నానదియు యెండి యుండెను. అక్కడ నుండి పుష్కరారణ్యం మగధారణ్యం సైంధవారణ్యం వెళ్ళి అక్కడి జలాల్లో యథేచ్చగా స్నానం చేశాడు. తర్వాత ధర్మారణ్య నైమిషారణ్య తీర్థాల్లో మునిగిన శంకరుని బ్రహ్మ హత్య వదలలేదు. అంతటనాజీమూత కేతువు శివుడెన్నో తీర్థాల్లో నదీ నదాల్లో మునిగి ఎన్నియో క్షేత్రాల్లోఆశ్రమాల్లో దేవాయతనాల్లో పూజలు, యోగాభ్యాసాలు చేశాడు. ఎన్ని చేసినా బ్రహ్మహత్య వదలకుండుటతో నిర్విణ్ణుడై కురుజాంగలభూమి చేరి అందున్న గరుడ ధ్వజుని శంఖచక్ర గదాధరుడైన పుండరీకాక్షుని దర్శించి అంజలి ఘటించి ఈ విధంగా స్తోత్రం చేశాడు.

హర ఉవాచ :

నమస్తే దేవతానాథ నమస్తే గరుదధ్వజ | శంఖచక్రగదాపాణ వాసుదేవ నమో7స్తుతే. 14

నమస్తే నిర్గుణానంత అప్రతర్క్యాయ వేధసే | జ్ఞానాజ్ఞాననిరాలంబ సర్వాలంబ నమోస్తుతే. 15

రజోయుక్త నమస్తే7స్తు బ్రహ్మమూర్తే సనాతన | త్వయా సర్వమిదం నాథ జగత్సృష్టం చరాచరమ్‌. 16

సత్వాధిష్ఠితలోకేశ విష్ణుమూర్తే అధోక్షజ | ప్రజాపాల మహాబాహో జనార్ధన నమోస్తుతే. 17

తమోమూర్తే అహం హ్యేష త్వదంశ క్రోధసంభవః | గుణాభియుక్త దేవేశ సర్వవ్యాపిన్‌ నమో7స్తుతే. 18

భూరియం త్వం జగన్నాథ జలాంబరహుతాళనః | వాయుర్భుద్దిర్మనశ్చాపి శర్వరీ త్వం నమో7స్తుతే. 19

ధర్మోయజ్ఞ స్తపః సత్య మహింసా శౌచమార్జవమ్‌ | క్షమా దానం దయా లక్ష్మీ ర్ర్బహ్మచర్యంత్వ మీశ్వర.

త్వం సాంగాశ్చతురో వేదా స్త్వం వేద్యో వేదపారగః |

ఉపవేదా భవానీశ సర్వో7సి త్వం నమో7స్తుతే. 21

నమో నమస్తే7చ్యుత చక్రపాణ నమో7స్తుతే మాధవ మీనమూర్తే |

లోకే భవాన్‌ కారుణికో మతోమే త్రాయస్వమాం కేశవ పాశబంధాత్‌. 22

మమాశుభం నాశయ విగ్రహస్థం యద్‌ బ్రహ్మహత్యా7భిభవం బభూవ |

దగ్దో7స్మి నష్టో7స్మ్యసమీక్ష్యకారీ పునీహి తీర్థో7సి నమోనమస్తే. 23

శంకర వచనము: ఓ దేవేశ్వరా ! గరుడధ్వజా ! నీకు నమస్కారము. శంఖ చక్ర గదాధరా! వాసుదేవా నీకు వందనము ! నిర్గుణా ! అనంతా ! అప్రతర్క్యా! సృష్టికర్తా! జ్ఞనాజ్ఞాన స్వరూపా! సర్వాధారా ! నిరాధారా! నీకు నమో వాకములు ! రజోగుణివైన సనాతన బ్రహ్మమూర్తీ ! చరాచరాత్మకమైన నీ జగత్తంతయు నీసృష్టియే. నీకు కై మోడ్పులు ! సత్వగుణాశ్రయుడవై ప్రజాపాలన మొనరించు అధోక్షజా ! లోకేశ్వరా ! జనార్దనా ! విష్ణో ! మహాబాహో ! నీకు వందనము. తమోమూర్తినై నీ క్రోధాంశతో జనించినవాడను నేను. ఓ సర్వవ్యాపీ! దేవేశ్వరా! నీకు ప్రణామము ! ఓ జగన్నాథా ! ఈ భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, బుద్ది, మనస్సు దివారాత్రులు నీవే. నీకు సాష్టాంగపడెదను. ధర్మం యజ్ఞం తపస్సు, సత్యాహింసలు, శౌచము, ఆర్జవము, క్షమాగుణం, దానం, దయ, లక్ష్మి బ్రహ్మచర్యం అన్నియు నీవే ! ఉపవేదాలూ నివే!సమస్తమూ నీవే! నీకు నమస్సులు. ఓ అచ్యుతా! చక్రపాణీ! మాధవా! మత్స్యమూర్తీ! నీకు నమస్కారము. లోకములో పరమకారుణికుడవైన లక్ష్మీపతి ! ఈ పాపబంధాల నుండి నన్ను రక్షించుము. నా దేహగతమైన అశుభాన్ని హరించుము. బ్రహ్మహత్యా సంభవమైన ఆ జ్వాలలో నేను దగ్దమగుచున్నాను. వివేకహీనుడను. ఓ తీర్థ స్వరూపా ! నన్నీ జ్వాలల నుండి కాపాడుము. పవిత్రుని గావింపుము. నీకు నమస్కారము !

పులస్త్య ఉవాచ :

ఇత్థం స్తుతశ్చక్రధరః శంకరేణ మహాత్మనా | ప్రోవాచ భగవాన్‌ వాక్యం బ్రహ్మహత్యాక్షయాయ హి. 24

పులస్త్యవచనము: శంకరుడు చేసిన ఈ స్తోత్రమును విని ఆయనబ్రహ్మహత్యా నివారణార్థమై చక్రపాణి యిట్లనెను.

హరి రువాచ :

మహేశ్వర శ్రణుష్వేమాం మమవాచం కలస్వనామ్‌ | బ్రహ్మహత్యాక్షయకరీం శుభదాం పుణ్యవర్ధనీమ్‌.

యో7సౌ ప్రాజ్‌ మండలే పుణ్య మదంశప్రభవో7వ్యయః |

ప్రయాగే వసతే నిత్యం యోగశాయీతి విశ్రుతః. 26

చరణాద్దక్షిణా త్తస్య వానిర్యాతా సరిద్వరా | విశ్రుతా వరణత్యేవ సర్వపాపభరా శుభా. 27

సవ్యాదన్యా ద్వితీయా చ అసిరిత్యేవ విశ్రుతా | తే ఉభేతు సరిచ్ఛ్రేష్ఠే లోకపూజ్యే బభూవతుః. 28

తాభ్యాం మధ్యేతు యోదేశ స్తత్‌ క్షేత్రం యోగశాయినః | త్రైలోక్యప్రవరం తీర్థం సర్వపాపప్రమోచనం |

న తాదృశో7స్తి గగనే న భూమ్యాం న రసాతలే. 29

తత్రాస్తి నగరీ పుణ్యా ఖ్యాతా వారాణసీ శుభా | యస్యాంహి భోగినో7పీశ ప్రాయాంతి భవతో లయమ్‌. 30

విలాసినీనాం రశనాస్వనేన శ్రుతిస్వనై ర్ర్బాహ్మణపుంగవానామ్‌ |

శుచిస్వరత్వం గురవో నిశమ్య హాస్యా దశాసంత ముహుర్ముహుసాన్త్‌. 31

వ్రజత్సు యోషిత్పు చతుష్పథేషు పదాన్యలక్తారుణితాని దృష్ట్వా |

య¸° శశీ విస్మయమేవ యస్యాం కింస్విత్‌ ప్రయాతా స్థలపద్మినీయమ్‌. 32

తుంగాని యస్యాం సురమందిరాణి రుంధంతి చంద్రం రజనీముఖేషు |

దివా7పి సూర్యం పవనాప్లుతాభి ర్దీర్ఘాభిరేవం సుపతాకికాభిః. 33

భృంగశ్చయస్యాం శశికాంతభిత్తౌ ప్రలోభ్యమానాః ప్రతిబింబితేషు |

ఆలేఖ్యయోషిద్విమలాననాబ్జే ష్వీయుర్భ్రమాన్నైవచ పుష్పకాంతరమ్‌. 34

పరిశ్రమశ్చాపి పరాజితేషు నరేషు సంమోహన ఖేలనేన |

యస్యాం జలక్రీడనసంగతాసు న స్త్రీషుశంభో! గృహదీర్ఘికాసు. 35

నచైవకశ్చిత్‌ పరమందిరాణి రుణద్ది శంభోః నహసా ఋతే7క్షాన్‌ |

నచాబలానాం తరసా పరాక్రమం కరోతి యస్యాం సురతంహి ముక్త్వా. 36

పాశగ్రంథి ర్గజేంద్రాణాం దానచ్ఛేదో మదచ్యుతౌ | యస్యాం మానమదౌ పుంసాం కరిణాం ¸°వనాగమే.

ప్రియదోషాః సదా యస్యాం కౌశికా నేతదేజనాః | చంద్రభూషితదేహశ్చ యస్యాం త్వమివ శంకర!. 39

ఈదృశాయాం సురేశాన వారాణస్యాం మహాశ్రమే | వసతే భగవాంల్లోలః సర్వపాపహరో రవిః. 40

దశాశ్వమేధం యత్ప్రోక్తం మదంశో యత్రకేశవః | తత్ర గత్వా సురశ్రేష్ఠ పాపమోక్ష మవాప్స్యసి. 41

హరి వచనము : మహేశ్వరా! బ్రహ్మహత్యా నివారకములు కర్ణమధురములు శుభకరనములునగు నా వచనములు వినుము. యిక్కడకు తూర్పుగా ప్రయాగ క్షేత్రంలో అవ్యయమగునాయంశ వల్ల జన్మించిన యోగశాయి నిత్య నివాసియై యున్నాడు. అతని దక్షిణ చరణము నుండి సర్వపాపనాశిని శుభదాయిని యగు వరణానది యుద్భవించినది. వామ చరణము నుండి అసియనెడునది వెలువడినది. ఈ రెండు నదులు లోకపూజ్యములుపవిత్రములు. ఆ రెంటికీ మధ్యనున్న యోగశాయి క్షేత్రము సర్వపాపములు పోగొట్టు పవిత్ర తీర్థము. ముల్లోకములలో శ్రేష్ఠమైనది. స్వర్గమర్త్య పాతాళాలలో అలాంటి క్షేత్రం లేదు. ఈశ్వరా! అక్కడ పరమ పవిత్రమూ మంగళరమునగు వారాణసీ నగరమున్నది. ఆ ప్రదేశాన భోగులు కూడా నీలో లయము పొందుదురు. అచట విలాసినీ స్త్రీల మొలనూలు ధ్వనులు విప్రశ్రేష్ఠుల వేద ధ్వనులతో వలిసి పవిత్రతను సంతరించుకొనును. వాని శ్రవణసుభగత్వాన్ని పెద్దలు మందహాస వదనాలతో మాటిమాటికి విని ఆమోదింతురు. లత్తుక పారాణిపూసిన అందలి పురస్త్రీల చరణ చిహ్నాలతో నలంకృతాలయిన చతుష్పథాలను చూచి, చంద్రుడు స్థల పద్మినులాత్రోవ వడచిరాయని యచ్చెరువందును. ఆ నగరంలోని ఆకసాన్నంటే దేవాయతనాలు రాత్రులందు చంద్రకాంతినీ, వాని శిఖరాలపై రెపరెపలాడు సుందర పతాకాలు పగటి యందు సూర్యరశ్మినీ నిరోధించుచుండును. అచ్చటి చంద్రకాంత శిలాభిత్తికల మీద చిత్రించబడిన స్త్రీల వదనారవిందాల ప్రతిబింబాలను చూచి తుమ్మెదలు భ్రమించి వానిని వదలి నిజమైన పుష్పముల వంకకుపోవు. వినోదక్రీడలలో పరాజితులైన వారలలో కూడ నచట అలసట గోచరించదు. తమ యిండ్ల యందలి ఈత కొలనులలో జల క్రీడలాడు స్త్రీలలో గూడ పరిశ్రాంతి ఏ మాత్రము కనిపించదు. శంభో! ఆ నగరవాసులలో, ద్యూతక్రీడల్లో తప్ప, పరగృహములనాక్రమించు వారు లేరు. అనంగ క్రీడలలో తప్ప నబలలపై పరాక్రమము చూపువారుండరు. అక్కడ ఉన్న గజరాజులకే సాధనము, మదపుటేనుగులలోనే దాన జల నిరోధము. ¸°వనంలో ఉన్న మగ ఏనుగులలోనే మాన (దేహపు కొలత)ము మదము(మదజలము)కనిపించును. (ఈ నాలుగు అవలక్షణాలు అచటి పురజనులలోలేవన్న మాట) అందలి కౌశికు (గుడ్లగూబ)లే దోష (రాత్రి) ప్రియలు. ఇతర జనులు కారు. అకులీసత్వం (భూమిలో లీనముగాకుండుట) నక్షత్రాలలోనే, వృత్తచ్యుతి (శీలము-ఛందోవృత్తము లేకుండుట) గద్యమునందే ! ఓ శంకరా ! భూతి (ఐశ్వర్యము) లోభం గలిగిన అచటి వారాంగనలే భుజంగు (విటులు)లతో చంద్రుల (చంద్రహారములు)తో కలిసి నీ వలె విహరించుచుందురు. (శివుడు భస్మ సర్ప చంద్రాలంకృతుడు గదా!) ఈశానా ! ఏవంగుణ విశిష్టమైన వారాణసీ పుణ్యాశ్రమంలో సర్వపాపహరుడగులోలార్కదేవుడు విజయం చేసియున్నాడు. దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ది పొందిన అచ్చోట నా అంశతో కేశపుడున్నాడు. అచటకు వెళ్ళినంతనే ఓ సురశ్రేష్ఠా ! నీవు పాపవిముక్తుడవు కాగలవు.

ఇత్యేవ ముక్తో గరుడద్వజేన వృషద్వజస్తం శిరసా ప్రణమ్య |

జగామ వేగాద్గరుడో యథా7సౌ వారాణసీం పాపవిమోచనాయ. 42

గత్వా సుపుణ్యాం నగరీం సుతీర్థాం ద్వష్ట్వాచ లోలం సదశాశ్వమేధమ్‌ |

స్నాత్వాచ తీర్థేషువిముక్తపాపః స కేశవం ద్రష్టు ముపాజగామ. 43

కేశవం శంకరో దృష్ఠ్వా ప్రణిపత్యేద మబ్రవీత్‌ | త్వత్ప్రసాదాత్‌ హృషీకేశః బ్రహ్మహత్యా క్షయంగతా.

నేదం కపాలం దేవేశ మద్దస్తం పరిముంచతి | కారణం వేద్మి నచత దేతన్మే వక్తుమర్హసి. 45

గరుడధ్వజుని ఈ పలుకులు విన్నంతనే వృషధ్వజుడాయనకు శిరసాప్రణామం చేసి అతిత్వరగా, తన పాప విముక్తికైవారాణసి క్షేత్రానికి వెళ్ళెను. పవిత్ర తీర్థాలతో కూడిన ఆనగరిని దర్శించి,, అందలి తీర్థాలలో స్నానమాడి, దశాశ్వమేధాన్ని లోలార్క భగవానుని దర్శించి సర్వ పాపాల నుండియు విముక్తుడై శంకరుడు కేశవుని చూచుటకై తిరిగి వెళ్ళెను. కేశవునకు ప్రణామం చేసి యిట్లనెను. ''హృషీకేశా! నీ దయవల్ల బ్రహ్మహత్యా తొలగిపోయినది. కాని ఈ కపాలము నా యర చేతిని వదలకున్నది. ఇందులకు కారణమేమి ?''

పులస్త్య ఉవాచ :

మహాదేవవచః శ్రుత్వా కేశవో వాక్యమబ్రవీత్‌ | విద్యతే కారణం రుద్ర! తత్సర్వం కథయామితే. 46

యో7సౌ మమాగ్రతో దివ్యో హ్రదః పద్మోత్పలై ర్యుతః | ఏష తీర్థవరః పుణ్యో దువగంధర్వ పూజితః.

ఏతస్మిన్‌ ప్రవరే తీర్ధే స్నానం శంభోఃసమాచర | స్నాతమాత్రస్య చాద్యైవ కపాలం పరిమోక్ష్యతి. 48

తతః కపాలీ లోకే, ఖ్యాతో రుద్ర భవిష్యసి | కపాలమోచనేత్యేవం తీర్థంచేదం భవిష్యతి. 49

పులస్త్య వచనము : మహాదేవుని మాటకు విష్ణు విట్లనెను. ''ఓ రుద్రా! కపాల మోచనోపాయము చెప్పెద వినుము. ఇదిగో నా ఎదుటనే పద్మోత్పలాలతో నిండియున్న ఈదివ్య సరోవరం పరమ సవిత్ర తీర్థం, దివ్యగంధర్వసేవితం. దీనిలో స్నానం చేసినంతనే నీకు కపాల మోచనము కాగలదు. ఆ కారణంగా ఈ తీర్థానికి కపాలమోచన క్షేత్రమనీ, నీకు కపాలి యనీ ప్రసిద్ది కలుగుతుంది.''

పులస్త్య ఉవాచ :

ఏవముక్తః సురేశేవ కేశ##వేన మహేశ్వరః | కపాలమోచనే సస్నౌ వేదోక్తవిధినా మునే. 50

స్నాతస్య తీర్థే త్రిపురాంతకన్య పరిచ్యుతం హ స్తతలాత్‌ కపాలమ్‌ |

నామ్నా బభూవాథ కపాలమోచనం తత్తీర్థవర్యం భగవత్ప్రసాదాత్‌. 51

ఇతి శ్రీవామనమహాపురాణ తృతీయో7ధ్యాయః.

పులస్త్య వచనము: నారదా! సురేశ్వరుడగు కేశవుడు చెప్పినట్లు మహేశ్వరుడా కపాలమోచన తీర్థంలో విధ్యుక్తంగా స్నానమాచరించగా ఆయన అరచేతికంటుకొని యున్న బ్రహ్మపుర్రె యూడిపడెను. భగవత్ప్రసాదం వల్ల అది కపాల మోచవమను పేర పవిత్ర తీర్థమాయెను.

ఇది శ్రీ వామన మహా పురాణము నందలి మూడవ అధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters