Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తమో7ధ్యాయః-మరుదుత్పత్తిః.

మదన ద్వాదశీ వ్రతమ్‌

ఋషుయః దితే పుత్త్రాః కథం జాతా మరుతో దేవవల్లభాః | దేవై ర్జగ్ముశ్చ సాపత్న్యాః కస్మా త్సఖ్య మను త్తమమ్‌.1

సూతః పురా దేవాసురే యుద్ధే హతేషు హరిణాశ రైః | పుత్త్రపౌత్త్రషు శోకార్తా గత్వాభూలోక ముత్తమమ్‌.2

శమన్తపఞ్చకే తీర్థే సరస్వత్వాస్తటే శుభే | భర్తు రారాధనపరా తప ఉగ్రం చచార హ.3

సా దితి ర్థేవసన్త్రాస మృషిరూపేణ సువ్రతా | ఫలాహారా తపస్తేపే కృచ్చ్రచాన్ద్రాయణాదిభిః.4

యావద్వర్షశతం సాగ్రం జ్వరశోక భయాకులా | తత స్సా తపసా తప్తా వసిష్టాదీ నపృచ్చత.5

దిత్యై వసిష్ఠాధ్యుక్త మదనద్వాదశీ వ్రతస్వరూపమ్‌.

కథయన్తు భవన్తో మే పుత్రశోక వినాశనమ్‌ | వ్రతం సౌభాగ్యఫలద మిహలోకే పరత్ర చ.6

ఊచు ర్వసిష్ఠప్రముఖా మదనద్వాదశీవ్రతమ్‌ | యస్య ప్రభావా దభవ త్సుతశోకవివర్జితా. 7

ఋషయః: శ్రోతు మిచ్ఛామహే సూత మదనద్వాదశీవ్రతమ్‌ | సుతా నేకోనపఞ్చాశ ద్యేన లేభే పున ర్దితిః. 8

సూతః: య ద్వసిష్ఠాదిభిః పూర్వం దిత్యై కథితపూర్వకమ్‌ | విస్తరేణ ప్రవక్ష్యామి మత్సకాశా న్నిబోధత. 9

సప్తమాధ్యాయము

మరుదుత్పత్తి - మదన ద్వాదశీ వ్రతము

ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి. దితి కుమారులు దేవతలకు సవతి తల్లి కుమారులును వారితో శత్రుభావము కలవారును కదా! అట్టి దితి కుమారులుఅగు మరుతులు దేవతలకు ప్రీతిపాత్రులై వారితో మిగుల మేలయిన స్నేహము నెట్లు చేసిరి ?

సూతు డిట్లు చెప్పెను : పూర్వము దేవాసుర యుద్ధమున హరి ప్రయోగించిన శరములతో దైత్యులు మరణించిరి. తన కుమారులును మనుమలును మరణించినందున దితి మిగుల దుఃఖించెను. ఆమె శోకార్తురాలయి ఉత్తమమగు భూలోకమునకు పోయెను. శుభమగు సరస్వతీ నదియొడ్డున శమంతపంచకమను తీర్థమున ఉండి ఆసక్తితో శ్రద్ధతో భర్త నారాధించుచు భయంకరమగు తపస్సు ఆచరించెను. ఆమె ఋషులందరవలె ఉత్తమ వ్రత నియమములను పాటించుచు కృచ్ఛ్రము చాంద్రాయణము మొదలగు ఆహార నియమములు పూని ఫలములే ఆహారముగా ఉండియు దేవతలకును భయమును కలిగించు తపస్సు ఆచరించెను. సమగ్రముగ నూరేండ్లు ఆమె ఇట్లు తపస్సు సాగించెను. జ్వరము చేతను భయము చేతను ఆకులురాలై తపస్సు వేడిమిచే తప్తురాలై వసిష్ఠుడు మొదలగు మహర్షులను ఇట్లడిగెను: తాము నాకు పుత్త్రశోక వినాశకరమును ఇహపరలోకములందు సౌభాగ్య ఫలము నిచ్చునదియు అగు వ్రతమును నాకు ఉపదేశించుడు. అనగా వసిష్ఠాది మునులు ఆమెకు మదన ద్వాదశీ వ్రతమును తెలిపిరి. దాని ప్రభావముననే ఆమెకు పుత్త్రశోకము లేకుండ పోయెను. అనగా విని శౌనకాదులు సూతుని ఇట్లడిగిరి : సూతా! దితి మరల నలువది తొమ్మిది మంది కుమారులను పొందగల ఫలమునిచ్చిన మదన ద్వాదశీ వ్రతమును వినవేడుచున్నాము. అనగా సూతుడిట్లనెను : వసిష్ఠాది మహర్షులు పూర్వము దితికి చెప్పియుండిన మదన ద్వాదశీ వ్రతమును విస్తరముగా చెప్పెదను; నా నుండి వినుడు.

చైత్రమాసే సితే పక్షే ద్వాదశ్యాం నియతవ్రతః | స్థాపయే దవ్రణం కుమ్భం సితతణ్డుల పూరితమ్‌. 10

నానాఫలయుతం తద్వ దిక్షుఖణ్డ సమన్వితమ్‌ | సితవస్త్రయుగచ్ఛన్నం సితచన్దన చర్చితమ్‌. 11

నానాభక్ష్య సమోపేతం సహిరణ్యం తు శక్తితః | తామ్రపాత్రం గుడోపేతం తస్యోపరి నివేశ##యేత్‌. 12

తస్మాదుపరి కామంతు కదళీదళసంస్థితమ్‌ | కుర్యా చ్ఛక్తిమయోపేతాం రతిం తస్యచ వామతః. 13

గన్ధం ధూపంచ దీపంచ నైవేద్యం చైవ కారయేత్‌ | తదభావే తదా కుర్యా త్కామకేశవయో ర్వపుః. 14

కామనామ్నా హరే ర్భవ్యం స్నాపయే ద్గన్ధవారిణా | శుక్లపుష్పాక్షతతిలై రర్చయే న్మధుసూదనమ్‌. 15

కామాయ పాదౌ సమ్పూజ్య జజ్ఘే సౌభాగ్యదాయచ | ఊరూ స్మరాయేతి పున ర్మన్మథాయేతి వై కటిమ్‌. 16

స్వచ్ఛోదరాయే త్యుదరం బాహూ పఞ్చశరాయవై | * హృదయం సర్వభూతాయ అనఙ్గాయే త్యురోహరేః. 17

ముఖం వద్మముఖాయేతి ప్రసూనధనుషే భ్రువౌ | నమ స్సర్వాత్మనే మౌళి మర్చయే దితి కేశవమ్‌. 18

తతః ప్రభాతే తం కుమ్భం బ్రాహ్మణాయ నివేదయేత్‌ | బ్రాహ్మణా న్భోజయే త్పశ్చా త్స్వయం చాలవణవ్రతః. 19

భుక్త్వా తు దక్షిణాం దద్యా దిదం మన్త్ర ముదీరయేత్‌ | ప్రీయతా మత్ర భగవా న్కామరూపీ జనార్దనః. 20

హృదయే సర్వభూతానాం య ఆనన్దో7భిధీయతే | ఉదయే సవితు స్స్నానం కృత్వా దానం విధీయతే. 21

అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ | ఉపవాస్య త్రయోదశ్యా మర్చయే ద్విష్ణు మవ్యయమ్‌. 22

ఫల మేకంచ సమ్ప్రాశ్య ద్వాదశ్యాం భూతలే శ##యేత్‌ | తత స్త్రయోదశే మాసి మృతధేనుసమన్వితామ్‌. 23

శయ్యాం దద్యా దనఙ్గాయ నర్వోపస్కరసంయుతామ్‌ | కాఞ్చనం కామదేవంచ శుక్లాం గాం చ పయస్వినీమ్‌.

వసై#్త్ర ర్ద్విజం సపత్నీకం పూజ్య భక్త్యా విభూషణౖః | శయ్యాగవాదికం దద్యా త్ప్రీయతా మిత్యుదీరయన్‌. 25

హోమం శుద్ధైస్సితతిలైః కుర్యా త్కామాయ కీర్తయ& | గవ్వేన సర్పిషా దద్యా త్పాయసేనచ ధర్మవిత్‌. 26

విప్రేభ్యో భోజనం కుర్యా ద్విత్తశాఠ్యవివర్జితః | ఇక్షుదణ్డాం స్తతో దద్యా త్పుష్పమాలాశ్చ శక్తితః. 27

యః కుర్యా ద్విధినా7నేన మదన * ద్వాదశీవ్రతమ్‌ | సర్వపాతకనిర్ముక్తః ప్రాప్నోతి హరిసాత్మతామ్‌. 28

ఇహలోకే + వరా న్పుత్త్రా న్త్సౌభాగ్యం శివ మశ్నుతే | య స్స్మర స్సంస్మృతో విష్ణు రానన్దాత్మా మహేశ్వరః. 29

చైత్ర మాసమున శుక్ల పక్షమున ద్వాదశి తిథినాడు వ్రత నియమములను పూని రంధ్రములు లేని కడవను తెల్లని బియ్యముతో నింపి నిలుపవలెను. (స్థాపనము) దానిపై రాగి పళ్లెరమును ఉంచవలెను. దానిపై తెల్లని గంధము పూయవలెను. తెల్లని వస్త్రముల జతతో దానిని కప్పవలెను. దానియందు నానా విధములగు ఫలములను చెరకు ముక్కలను నానా విధములగు భక్ష్యములను ఉంచవలెను. యథాశక్తిగ బంగారము కూడ ఉంచవలెను. నడుమ బెల్లము నుంచి దానిపై అరటి అకులు పరచి వానిపై మన్మథుని శక్తి రూపలగు దేవతలో కూడిన రతీదేవిని అతనికి ఎడమ ప్రక్కను ప్రతిష్ఠించవలెను. అతనికి గంధ దీపధూప నైవేద్యముల నర్పింపవలెను. ఇట్టివి అన్నియు సంభవము కాని యెడల

___________________________________________

*పృథూదరాయేత్యుదరం .

*ద్వాదశీమిమామ్‌ +వరాన్పుత్త్రాన్త్సౌ భాగ్యఫలమశ్నుతే.

మన్మథ విష్ణువుల ప్రతిమలను సిద్ధపరచవలెను. కాముని పేరితోనే హరి ప్రతిమను గంధజలముతో స్నానము చేయించవలెను. తెల్లని పూలతో అక్షతలతో నూవులతో పూజించవలెను. ఆ మంత్రములు:కామాయ నమః-పాదౌ పూజయామి; సౌభాగ్యదాయ నమః-జంఘే పూజయామి; స్మరాయ నమః-ఊరూ పూజయామి; మన్మథాయ నమః-కటిం పూజయామి; స్వచ్ఛోదరాయ నమః-ఉదరం పూజయామి; పంచశరాయ నమః-బాహూ పూజయామి; సర్వభూతాయ నమః-హృదయం పూజయామి; అనంగాయనమః-ఉరఃపూజయామి; పద్మముఖాయ నమః-ముఖం పూజయామి; ప్రసూనధనుషే నమః-భ్రువౌ పూజయామి; సర్వాత్మనే నమః-మౌళిం పూజయామి; అని ఇట్లు కామ నామమున విష్ణుని పూజించవలెను.

రెండవనాటి ఉదయమున ఆ కుంభమునంతటిని బ్రాహ్మణునకు దానమీయవలెను. పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి యజమానుడు తానును లవణము లేని ఆహారమును భుజించవలయును. తరువాత ఈ యర్థమునిచ్చు మంత్రముచ్చరించుచు బ్రాహ్మణునకు దక్షిణనీయవలెను. ''ఈ వ్రతాచరణముచే కాముని రూపమున నున్నవాడును సర్వ భూతముల హృదయము లందునుండి ఆనందరూపుడని చెప్పబడువాడునగు విష్ణువు ప్రీతి నందుగాక!'' సూర్యోదయమయిన తరువాత స్నానము చేసియే ఈ దానము జరుపవలెను. ద్వాదశినాడు ఒక ఫలమును మాత్రము ఆహారముగ తిని నేలమీద పరుండి త్రయోదశినాడు ఇట్లు విష్ణుని పూజింపవలెను.

ఈ విధానమున ప్రతి మాసమునందును పండ్రెండు మాసములు జరుపవలెను. పదుమూడవ మాసమున నేతితో ధేనువుతో కూడ సర్వోపకరణములతో ఉపస్కరములతో కూడిన శయ్యను మన్మథునకు అర్పించవలెను. ఎట్లన బ్రాహ్మణ దంపతులను పూజించి ఆభరణములను వస్త్రములను ధరింపజేసి బంగారముతో చేసిన మన్మథుని ప్రతిమను తెల్లని పాడియావును పై దెల్పిన శయ్యను నేతిని ఆవును వారికి 'ప్రీయతాం కామ రూపో హరిః' అని చెప్పుచు దానమీయవలెను. తెల్లని శుద్ధమైన నూవులతో 'కామాయ స్వాహా' అని చెప్పుచు హోమము చేయవలెను. ధర్మవేత్తయై యజమానుడు ధనవ్యయమునకు వెనుకాడక ఆవు నేతితో పాయసముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. తరువాత వారికి చెఱకు గడలను పూలమాలలను యథాశక్తి ఈయవలెను. ఈ విధానమున మదన ద్వాదశీవ్రతము నాచరించినవాడు మహా పాతకముల నుండి ముక్తుడయి విష్ణు సారూప్యమును పొందును. ఈ లోకమునందు శ్రేష్ఠులగు పుత్త్రులను సౌభాగ్యమును శుభమును పొందును. కామరూపియగు ఈ విష్ణువు ఆనందాత్ముడగు మహేశ్వరుడును కావున సుఖమును పొందగోరువారు మన్మథ రూపముతోనున్న ఈశ్వరుని స్మరించి పూజించవలెను.

సుఖార్థం కామరూపేణ స్మరే దఙ్గజ మీశ్వరమ్‌ | ఏత చ్ఛ్రుత్వా చకారేదం దితి స్సర్వ మశేషతః. 30

కశ్యపో వ్రతమాహాత్మ్యా దాగత్య పరయా ముదా | చకార చ కృశాం భూయో రూప¸°వనశాలినీమ్‌. 31

వరేణ చ్ఛన్దయామాన సా చ వవ్రే వరం పరమ్‌ | పుత్త్రం శక్రవధార్థాయ సమర్థ మమితౌజసమ్‌. 32

వరయామి మహాత్మానం సర్వామరనిఘాదనమ్‌ | ఉవాచ కశ్యపో వాక్య మిన్ద్రహన్తార మూర్జితమ్‌. 33

ప్రదిశా మ్యహ మేతేన కించైత త్క్రియతాం శుభే | ఆపస్తమ్బః కరో త్విష్టిం ప్రతియా మ్యద్య సువ్రతే. 34

విధాస్యామి తతో గర్భ మముం శక్రనిషూదనమ్‌ | ఆపస్తమ్బస్తత శ్చక్రే పుత్త్రేష్టిం ద్రవిణాధికామ్‌. 35

ఇన్ద్రశత్రుం లభ##స్వేతి జుహావ చ సవిస్తరమ్‌ | దేవైశ్చ యుయుధు ర్దైత్యా విముఖాశ్చైవ దానవాః. 36

దిత్యాం గర్భ మథాయుంక్త కశ్యపః ప్రాహ తాం పునః | త్వయా యత్నో విధాతవ్య స్తస్మి న్గర్భే వరాననే. 37

దిత్యై కశ్యపప్రోక్తగర్భిణీధర్మాః.

సంవత్సరశతం త్వేక మస్మిన్నేవ తపోధనే | సన్ధ్యాయాం నైవ భోక్తవ్యం గర్భిణ్యా వరవర్ణిని. 38

న స్థాతవ్యం న గన్తవ్యం వృక్షమూలేషు సర్వదా | ఉపస్కరేషు న వసే న్ముసలోలూఖలాదిషు. 39

జలం న చావగాహేచ్చ శూన్యాగారం చ వర్జయేత్‌ | వల్మీకేషు న తిష్ఠేత నచోద్విగ్నమనా భ##వేత్‌. 40

విలిఖే న్న నఖై ర్భూమి మఙ్గారేణ న భస్మనా | న శయ్యాసు సమావిష్టే ద్వ్యాయామం చ వివర్జయేత్‌. 41

న తుషాఙ్గారభస్మాస్థికపాలేషు సమావిశేత్‌ | వర్జయే త్కలహం లోకే గాత్రభఙ్గం తథైవ చ. 42

న ముక్తకేశా తిష్ఠేత నాశుచి స్స్యా త్కదాచన | న శయీతోత్తరశిరా న చాపరశిరాః క్వచిత్‌. 43

న వస్త్రహీనా నోద్విగ్నా న చార్ద్రచరణా సతీ | నామఙ్గళ్యాం వదే ద్వాచం న చ హాస్యాధికా భ##వేత్‌. 44

కుర్యాచ్చ గురుశుశ్రూషాం నిత్యమాఙ్గళ్యతత్పరా | సర్వౌషధీభి రుష్ణేన వారిణా స్నాన మాచరేత్‌. 45

కృతరక్షా సుభూషా చ వాస్తుపూజనతత్పరా | తిష్ఠే త్ప్రసన్నవదనా భర్తృప్రియహితే రతా. 46

దానశీలా తృతీయాయాం పార్వత్యా నక్త మాచరేత్‌ | ఇతివృత్తా భ##వే న్నారీ విశేషేణ తు గర్భిణీ. 47

యస్తు తస్యా భ##వే త్పుత్త్ర శ్శీలాయుర్వృద్ధిసంయుతః | అన్యథా గర్భపతన మవాప్నోతి న సంశయః. 48

తథా త్వ మనయా వృత్త్యా గర్భే త్వం యత్న మాచర | స్వస్త్యస్తు తే గమిష్యామి తథేత్యుక్త స్తయా పునః. 49

పశ్యతాం సర్వభూతానాం తత్రైవాన్తరధీయత | తత స్సా కశ్యపోక్తేన విధినా సమతిష్ఠత. 50

ఇది విని దితి ఈ వ్రతమునంతయు ఏమాత్రమును లోపము లేకుండ జరిపెను. వ్రత మాహాత్మ్యమువలన కశ్యపుడు ఆమె కడకు మిగుల సంతోషముతో వచ్చెను. చిక్కిపోయిన ఈమెను మరల ఎప్పటివలె రూప ¸°వనములు కలదానినిగా చేసెను. వరము కోరుకొమ్మనెను. ఆమెయు ఇట్లు మేలైన వరమడిగెను. ఇంద్రుని చంపగల నమర్థుడును అమిత బలము కలవాడును మహాత్ముడు దేవతలందరను గూడ నశింపజేయువాడును అగు కుమారుడు నాకు కలుగవలెను. అని ఆమె కోరగా కశ్యపు డిట్లు పలికెను. నీవు ఎట్టి క్లిష్టమగు వ్రతముల నయినను అనుష్ఠించగలదానవు. నీవు చేసిన ఈ వ్రత మహిమతోనే నీకు ఇంద్రుని చంపు కుమారుని ఇచ్చుచున్నాను. కాని నీవు మరియొక పని చేయవలయును. ఆపస్తంబునిచేత ఇందులకై ఇష్టిని జరిపించుము. పిమ్మట నీయీ గర్భమును ఇంద్రుని చంపగల దానినిగా చేయుదును. అట్లే ఆపస్తంబుడు అధిక ద్రవ్యము వెచ్చించి పుత్త్రేష్టిని జరిపెను. అతడు ఇంద్రశత్రుని కుమారునిగా పొందుము. అని సవిస్తరముగా హోమము చేసెను.

అంతట కశ్యపుడు దితికి గర్భము కలిగించెను. ఆమెతో పిమ్మట అతడిట్లు పలికెను. నీవు ఈ గర్భము విషయమున యత్నము పూనవలసినది. నీవు తపోధనురాలవయి ఈ తపోవనమునందే యుండి ఒకనూరు సంవత్సరముల పాటు ఈ నియమములను పాటించవలెను. ఏమన-గర్భిణిస్త్రీ సంధ్యా సమయమునందు భుజించనేరాదు. ఎట్టి సమయము నందును చెట్ల మొదళ్ళ దగ్గరకు పోరాదు. రోలు రోకలి మొదలగు ఉపకరణములపై కూర్చుండరాదు. నీట మునుగరాదు. శూన్య గృహములలోనికి పోరాదు. పుట్టలపై కూర్చుండ-నిలుచుండ-రాదు. మనస్సున భయమును ఆవేశమును పొందరాదు. గోళ్ళతో బొగ్గులతో బూడిదతో భూమిని గీయరాదు. మంచములపైని కూర్చుండరాదు.వ్యాయామముచేయరాదు.ధాన్యపుపొట్టు-బొగ్గులు-బూడిద-ఎముకలు-పుర్రెలు-వీనిపై కూర్చుండరాదు. ఒడలు విరుచుకొనుట కలహించుట తగదు. ఎట్టి సమయమునందును జుట్టు విరియబోసికొని కాని అశుచియై కాని ఉండరాదు. ఉత్తరమునకు పడమటకు తలపెట్టి నిదురించరాదు. వివస్త్రగా గాని భయావేశములతో గాని తడికాళ్ళతో గాని ఉండరాదు. అశుభములు మాటలాడరాదు. అధిక హాస్యములాడరాదు. ఎల్లప్పుడు శుభ లక్షణములతో నుండి పెద్దలను సేవించుచుండవలెను. అన్ని ఓషధులతో వేడినీటితో స్నానమాడవలెను. తన దేహరక్ష చేసికొనుచు చక్కని ఆభరణములు ధరించి శ్రద్ధతో గృహ పరిసరముల నలంకరించి ఉంచుకొనుచు గృహ దేవతల పూజించుచు సంతుష్టి చెందిన ముఖము కలదై భర్తకు ప్రీతి హితము కలిగించునవే ఆలోచించుచు మాటలాడుచు చేయుచు ఉండవలెను. దానములను చేయుచు శుక్లపక్ష తృతీయాదినమున గౌరిని పూజించుచు నక్త వ్రతమును ఆచరించవలెను. ప్రతి స్త్రీయు ఇట్లే యుండవలెను. విశేషించి గర్భిణి ఇట్లు ఉండవలెను. ఆమెకు కలుగు కుమారుడు మంచి శీలము ఆయుర్వృద్ధి కలవా డగును. లేనిచో గర్భపతనము కలుగు నవకాశము గలదు. కనుక నీవు ఇట్లు నడచుకొనుచు గర్భము విషయములో ప్రయత్నపరురాలవై యుండుము. నీకు శుభమగును. వెళ్ళివత్తును. అని కశ్యపుడు పలుకగా దితియు 'సరే' అనెను. అంతట సర్వభూతములు చూచుచుండగానే కశ్యపు డచ్చటనే అంతర్ధానము నందెను.

అప్పటి నుండి దితియును కశ్యపుడు చెప్పిన విధమున నడుచుకొనుచుండెను.

బలభి త్స తథేన్ద్రోపి దితేః పార్శ్వ ముపాగతః | విహాయ దేవసదనం తాం శుశ్రూషాపరః స్థితః. 51

దితే శ్ఛిద్రం తతః ప్రేప్సు రభవ త్పాకశాసనః | వినీతో7భవ దవ్యగ్రః ప్రశాన్తవదనో బహిః. 52

ఆజ్ఞా మనుసర న్త్సర్వా మాత్మనా శుభ మాచర& | తతో వర్షశతాన్తే సా ఊనే తు దివసై స్త్రిభిః. 53

మేనే కృతార్థా మాత్మానం ప్రీత్యా విస్మితమానసా | అకృత్వా పాదయో శ్శౌచం శయానా ముక్తమూర్ధజా. 54

నిద్రాభరసమాక్రాన్తా దివా పరవశా క్వచిత్‌ | తత స్తదన్తరం లబ్ధ్వా ప్రవిశ్యాన్త శ్శచీపతిః. 55

వజ్రేణ సప్తధా చక్రే తం గర్భం త్రిదశాధిపః | తత స్సప్త సుతా జాతాః కుమారా స్సూర్యవర్చసః. 56

రుదన్త స్సప్త తే బాలా నిషిద్ధా దానవారిణా | భూయోపి రుదమానాం స్తా నేకైకం సప్తధా పునః. 57

చిచ్ఛేద వృత్రహన్తా వై పున స్తదుదరస్థితః | ఏవ మేకోనపఞ్చాశ చ్ఛ్రుత్వా తే రుదతా భృశమ్‌. 58

ఇన్ద్రో నివారయామాస మా రుదధ్వం పునఃపునః | తతశ్చ చిన్తయామాన కిమేత దితి వృత్త్రహా. 59

ధర్మస్య కస్య మాహాత్మ్యా త్పున స్సఞ్జీవితా స్త్వమీ | విదిత్వా ధ్యానయోగేన మదనద్వాదశీఫలమ్‌. 60

నూన మేత త్పరిణత మత్ర వా కృష్ణపూజనాత్‌ | వజ్రేణ నిహతా స్సద్యో న వినాశ మిహాప్నుయుః. 61

ఏకోప్యనేకతా మాప యస్మా దుదరగో హ్యయమ్‌ | అవధ్యా హ్యభవ న్నేతే తస్మా ద్దేవా భవన్తి చ. 62

తస్మా న్మారుద ఇత్యుక్తా రుదన్తో గర్భసంస్థితాః | మారుతా నామ తే నామ్నా భవన్తో మఖభాగినః. 63

తతః ప్రసాద్య దేవేశః క్షమస్వేతి దితిం పునః | అథాశాస్త్రం సమాస్థాయ మయైత ద్దుష్కృతం కృతమ్‌. 64

కృత్వా మరుద్గణౖ ర్దేవై స్సామాన్యం హి సురాధిపః | దితిం విమాన మారోప్య నిన్యే య స్ససుతా దివమ్‌. 65

యజ్ఞభాగభుజో జాతా మరుత స్తేన తే జనాః | తే జగ్ము రైక్యం చ సురైః కామం తే సురవల్లభాః. 66

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే మరుదుత్పత్తౌ మదన

ద్వాదశీవ్రతం నామ సప్తమోధ్యాయః.

తన శత్రువగు బలాసురుని చంపినవాడగు ఇంద్రుడును అట్టి తలంపుతోనే తన స్వర్గలోకమును విడిచి దితిని సేవింపగోరి ఆమె కడకు వచ్చెను. ఆమెలో ఏదయిన దోషము ఎప్పుడు కలుగునా యని అతడు గమనించుచుండెను. అందులకై అతడు బయటికి మాత్రమ ప్రశాంత ముఖము కలవాడు. ఏ ఇతర విషయములపై మనస్సు నుంచనివాడు వినయము కలవాడునై యుండెను. ఆమె ఇచ్చిన ప్రతియొక ఆజ్ఞను అనుసరించుచు త్రికరణములతోను మంచి పనినే చేయుచు ఉండెను. ఇట్లు మూడునాళ్లు తక్కువగా నూరు సంవత్సరములు గడచెను. దితియు తాను కృతార్థురా లయినట్లు భావించుచు ప్రీతురాలయి మనస్సులో ఆశ్చర్యము నంద సాగెను. అట్టి స్థితిలో నిద్రాభారము తను ఆక్రమించగా పరవశురాలై కాళ్లు కడిగి కొనవలసి యున్నను కాళ్లు కడుగుకొనకయే జుట్టు విరియబోసికొని ఒకానొక చోట పండుకొనెను. అంతట ఈ అవకాశము దొ కినదే చాలునని ఆ దేవరాజు దితి గర్భములో ప్రవేశించెను. వజ్రముతో ఆమె గర్భమును ఏడుగా చీల్చెను. దానిచే సూర్యునివలె వర్చస్సు కల కోమలులయిన చిన్న పిల్లలు ఏడు మంది ఏర్పడిరి. ఆ బాలురు ఏడువ సాగిరి. ఏడువ వద్దనుచు ఇంద్రుడు వారిని నిషేధించెను. ఐనను వారు ఏడ్చుచునే ఉండిరి. వృత్రాసురుని చంపిన వాడగు ఆ ఇంద్రుడు ఇంకను దితి గర్భమునందే ఉండి వారిని ఒక్కొక్కరిని ఏడేసి ముక్కలుగా నరకెను. ఇట్లు నలువది తొమ్మిది మందిగా చీల్చబడిన ఆ శిశువులు ఇంకను ఏడ్చుచునో ఉండిరి. ఏడువ వద్దు (మా-రుదధ్వం) అని ఇంద్రుడు వారిని మాటి మాటికి వారింపసాగెను. ఇది ఏమి? ఏ ధర్మానుష్ఠానము చేసిన మాహాత్మ్యము వలన ఇట్లు జరిగినది ? ఎంత చీల్చినను వీరు చావరే ! అని ఇంద్రుడాలోచించెను. అతడు ధ్యానయోగ బలమున ఇది మదన ద్వాదశీ వ్రతఫలమని తెలిసికొనెను. ఇది నిశ్చయముగా విష్ణు పూజనము వలన కలిగన ఫలమే. ఇట్టి కృష్ణానుగ్రహము కలవారు వజ్రముతో దెబ్బ తినియును నాశము పొందరు. గర్భమునందలి శిశువు తానొకడై యుండియు అనేక ఖండములుగా చీల్చబడియు మరణించలేదు. వీరందరును మరల చీల్చబడియు చావకి అవధ్యులై యున్నారు. అందువలన వీరు దేవతలుగా అగుదురు. వారు ఏడ్చుచుండగా ఏడువవద్దు (మా-రుద) అని గర్భమునందే ఉన్న ఈ శిశువులు వారింపబడినారు. కనుక వీరు 'మారుత' అను పేరితో ప్రసిద్ధులై (దేవతలై) యజ్ఞాంశములను అనుభవింతురు. అని ఇంద్రు డనెను.

తరువాత ఇంద్రుడు మరల మరల దితిని తను క్షమించు మని వేడుకొని ఆమెను అనుగ్రహింప జేసికొనెను. నేను శాస్త్ర విరుద్ధముగా నడచినందున ఆ దుష్కృతమునకు ఫలితముగా నేనే ఈ అవకాశము చేసికొన్నదాన నైతినని దితి తలచెను. ఇంద్రుడును మారుతులకు దేవతలతో సమానత్వమును కలిగించెను. దితిని ఆమె కుమారులను విమానముపై ఎక్కించి స్వర్గమునకు తీసికొని పోయెను. ఈ విధముగా మారుతులు అను దితి కుమారులు దేవతలై యజ్ఞ భాగములను (హవిస్సులను) అనుభవించగలవా రైరి. దేవతలతో సమానులైరి. దేవతలకు ప్రీతిపాత్రులు నైరి.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మరుత్తుల ఉత్పత్తి యందు మదన ద్వాదశీ వ్రతము అను సప్తమాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters