Sri Matsya Mahapuranam-1    Chapters   

త్రింశో7ధ్యాయః.

దేవయానీవనవిహారః.

శౌనకః : అథ దీర్ఘేన కాలేన తస్మిన్నేవ నృపోత్తమ | వనం తదేవ నిర్యాతా క్రీడార్థం వరవర్ణినీ. 1

తేన దాసీసహ సేణ సార్ధం శర్మిష్ఠయా తదా | తమేవ దేశం సమ్ప్రప్తా యథాకామం చచార సా. 2

తాభి స్సఖీభి స్సహితా సర్వాభి ర్ముదితా భృశమ్‌ | క్రీడన్త్యో7 భిరతా స్సర్వాః పిబన్త్యో మధు మాధవే. 3

ఖాదన్త్యో వివిధా న్భక్ష్యా న్విదశ న్త్యః ఫలాని చ | పునశ్చ నాహుషో రాజా మృగలిప్సు ర్యదృచ్ఛయా. 4

తమేవ దేశం సమ్ప్రప్తో జలలిప్సు స్స కర్శితః | దదర్శ దేవయానీం చ శర్మిష్ఠాం తాశ్చ యోషితః. 5

పిబన్త్యో లలమానాశ్చ దివ్యాభరణభూషితాః | ఉపనిష్టాంచ దదృశే దేవయానీం శుచిస్మితామ్‌. 6

రూ పేణాప్రతిమాం తాసాం స్త్రీణాం మధ్యే వరాఙ్గనామ్‌ | శర్మిష్ఠయా సేవ్యమానాం పాదసంవాహనాదిభిః. 7

ముప్పదియవ అధ్యాయము

దేవయానీ వనవిహారము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు చాలకాలము గడచెను. దేవయాని ఆ వృషపర్వుని పురమునందే నివసించుచుండెను. ఒకమారు ఆమహాసుందరి క్రీడార్థమయి తాను పూర్వము పోయిన వనమునకే వెళ్ళెను. తన దాసీ సహస్రముతో శర్మిష్ఠయు ఆమెవెంట నుండెను. దేవయాని అప్పటి ప్రదేశమును చేరెను. ఆయా చెలికత్తె లందరతో కూడి మిగుల సంతోషముతో తన ఇచ్చవచ్పినట్లు విహరించెను. వారు అందరును ఆ వసంతర్తువులో చాల ఆనందముగా క్రీడించుచు మద్యమును త్రాగిరి. వివిద భక్ష్యములను భక్షించుచు వివిధ ఫలములను తినుచుండిరి.

ఇంతలో నహుష పుత్త్రుడగు యయాతి దైవసంకల్పమున వేటకై వచ్చి అలసి నీటికై ఆ ప్రదేశమునకే వచ్చెను. అచ్చట అతనికి దేవయానియు శర్మిష్ఠము వేయిమంది శర్మిష్ఠ దాసీజనమును కనబడిరి. వారందరును దివ్యాభరణములతో అలంకరించుకొని మద్యము త్రావుచు విలాసము లనుభవించుచుండిరి. వారందర నడుమ దేవయాని కూర్చుండి యుండెను. ఆమె చిరునవ్వు నిర్మలము. ఆమె రూపము సాటిలేనిది. ఆమె స్త్రీలలో ఉత్తమురాలు. శర్మిష్ఠ ఆమెకు పాదములొత్తుట మొదలగు సేవలు చేయుచుండెను.

యయాతిదేవయానీ సంవాదః.

యయాతిః: ద్వాభ్యాం కన్యాసహస్రాభ్యాం ద్వే కన్యే పరివారితే |

గోత్రేచ నామనీ చైవ ద్వయోః పృచ్ఛా మ్యహం యతః. 8

దేవయానీ : ఆఖ్యాస్యా మ్యనుమోదస్వ వచనం మే నరాధిప

శుక్రో నా మాసుర గురు స్సుతాం జానీహి తస్య మామ్‌. 9

ఇయం చ మే సఖీ దాసీ యత్రాహం తత్రగామినీ | దుహితా దానవేన్ద్రస్య శర్మిష్ఠా వృషపర్వణః. 10

యయాతిః: కథంచ తే సఖీ దాసీ కన్యేయం వరవర్ణినీ | అసురేన్ద్రసుతా సుభ్రూః పరం కౌతూహలం హి మే.

దేవయానీ : సర్వ ఏవ నరవ్యాఘ్ర విధాన మనువర్తతే | విధినా విహితం మత్వా మా విచిత్రం యథా నృప.

రాజవద్రూపవేషస్తే బ్రాహ్మీం* వాచాం బిభర్షి చ | కింనామా త్వం కుతశ్చాసి కస్య పుత్త్రోసి శంస మే. 13

యయాతిః : బ్రహ్మచర్యేణ కృత్స్నో మే వేద శ్శ్రతిపథం గతః |

రాజా7హం రాజపుత్త్ర శ్చ యయాతిరితి విశ్రుతః. 14

దేవయానీ : కేనాప్యర్థేన నృపతే ఇమం దేశం సమాగతః |

జిఘృక్షు ర్వారిజం కిఞ్చి దథవా మృగలిస్సయా. 15

యయాతిః : మృగలిప్సు రహం భ##ద్రే పానీయార్థ మిహాగతః |

బహుధా ప్యనుయుక్తోస్మి త దనుజ్ఞాతు మర్హసి. 16

దేవయానీ : ద్వాభ్యాం కన్యాసహస్రాభ్యాం దాస్యా శర్మిష్ఠయా సహ |

త్వడధీనాస్మి భద్రం తే సఖా భర్తా చ మే భవ. 17

యయాతిః : స్యా దౌశనసి భద్రంతే న త్వా మర్హో7స్మి భామిని | అవై వాహ్యాశ్చ రాజానో దేవయాని పితు స్తవ.

దేవయానీ : సంసృష్టం బ్రహ్మణా క్షత్త్రం క్షత్త్రంచ బ్రహ్మనంస్థితమ్‌ |

ఋషిశ్చ ఋషిపుత్త్రశ్చ నాహుషాద్య భజస్వ మామ్‌. 19

యయాతిః : ఏకదేహోద్భవా వర్ణా శ్చత్వారో7పి వరాననే |

పృథగ్ధర్మాః పృథక్ఛౌచా స్తేషాం వై బ్రాహ్మణో వరః. 20

దేవయనీ : పాణిగ్రహో నాహుషాయం న పుమ్భి స్సేవితః పురా |

త్వం పాణి మగ్రహీ రగ్రే వృణోమి త్వా మహం తతః. 21

కథం తు మే మనస్విన్యాః పాణి మన్యః పుమా న్స్పృశేత్‌ |

గృహీత మృషిపుత్త్రేణ స్వయం వా ప్యృషిణా త్వయా. 22

యయాతిః : క్రుద్ధా దాశీవిషా త్సర్పా జ్జ్వలనా త్సర్వతో ముఖాత్‌ |

దురాధర్షతరో విప్రః పురుషేణ విజానతా. 23

దేవయానీ : కథ మాశీవిషా త్సర్పా జ్జ్వలనా త్సర్వతోముఖాత్‌ | దురాధర్షతరో విప్ర ఇత్యర్థే పురుషర్షభ.

యయాతిః : దశే దాశీవిష స్త్వేకం శ##స్త్రేణౖకశ్చ వధ్యతే |

హన్తి విప్ర స్సరాష్ట్రాణి పురాణ్యపిచ కోపతః. 25

దురాధర్షతరో విప్ర స్తస్మా ద్భీరు మతో మమ అతో7దత్తాం హి పిత్రా త్వాం భ##ద్రే న వివహామ్యహమ్‌.శుక్రాభ్యనుజ్ఞాతస్య యయాతే ర్దేవయానీపరిగ్రహః.

దేవయానీ : దత్తాం వహసి పిత్రా త్వం మాం హి రాజ స్వృతో మయా |

మా యాచతో భయం నాస్తి దత్తాంచ ప్రతిగృహ్ణతః. 27

యయాతి ఇట్లు పలికెను: ''ఇచ్చట ఇద్దరు కన్యలున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక కన్యాసహస్రము పరివారముగా ఉన్నది. కనుక నేను ఆ ఇద్దరి నామగోత్రములు తెలిసికొనగోరుచున్నాను. దేవయాని: ''రాజా! చెప్పెదను. నామాటనే ప్రమాణముగా గ్రహింపుము. రాక్షస గురుడు శుక్రుడున్నాడే- అతని కూతురను నేను. ఇది నా పరిచయము. ఈమె నాకు చెలిగా ఉండు దాసి. నే నెచ్చటికి పోయిన అచ్చటికి వచ్చును. ఈమె దానవేంద్రుడగు వృషపర్వుని కూతురు.'' యయాతి: ''ఈమె రాక్షసరాజు కూతురు. చక్కని కనుబొమలు (మొదలగు మహా సౌందర్య లక్షణములు) కలిగిన ఉ త్తమస్త్రీ కదా ఈమె! ఈకన్య నీకు దాసి ఎట్లయినది? నాకు విన వేడుకగా ఉన్నది.'' దేవయాని: ''రాజా! ప్రతి ఒకరును విధి విధించిన విధానమును అనుసరించి నడుచుకొనవలసినదే. అది ఎరిగినచో నీకు ఆశ్చర్యము కలుగదు. నీరూపమును వేషమును రాజునకువలె నున్నవి. బ్రాహ్మణుని వాక్కు కలిగి ఉన్నావు. నీ పేరు ఏమి? ఎక్కడివాడవు? నీ తండ్రి ఎవరు?'' యయాతి: ''బ్రహ్మచర్య వ్రతమున నేను వేదము అంతయు అధ్యయనము చేసితిని. నేను రాజను. రాజవంశమున పుట్టినవాడను. నా పేరు యయాతి.'' దేవయాని: ''ఏదో పని మీదనే నీవీ ప్రదేశమునకు వచ్చియుందువు. నీటినుండి లభించుదాని నేదైన గ్రహింపగోరియా? వేట కోరియా?'' యయాతి: ''నేను వేటకై వచ్చి నీటికొరకు ఇక్కడకు వచ్చితిని. నీవడిగిన అన్ని ప్రశ్నలకును సమాధానము ఇచ్చితిని. నేను పోయివత్తును. అనుజ్ఞ ఇమ్ము.'' దేవయాని: ''ఈ రెండు వేల దాసీ కన్యా జనముతోను దాసియగు శర్మిష్ఠతోను నీ అధీనురాల నగుచున్నాను. పూజ్యుడవగు నీవు నాకు మిత్రుడవును భర్తవును కమ్ము. యయాతి: ''అగుగాక! నీవు శుక్రుని కూతురవు పూజ్యురాలవు. కోపింపకుము. నేను నిన్ను వివాహమాడ అర్హుడను కాను. నీ తండ్రి క్షత్త్రియులతో వివాహ సంబంధమును అంగీకరించడు.'' దేవయాని: ''బ్రహ్మము క్షత్త్రముతోను క్షత్త్రము బ్రహ్మముతోను పరస్పరము కలిసియే యున్నవి. (బ్రహ్మము-బ్రాహ్మణజాతి ప్రధానలక్షణములు; క్షత్త్రము-క్షత్త్రియజాతి ప్రధాన లక్షణములు) నీవు ఋషివి-ఋషిపుత్త్రుడవును. నహుష కుమారుడవు నీవు. ఇప్పుడయిన నీవు నన్ను పెండ్లాడుటకు అంగీకరించుము. యయాతి: ''సుందరీ! నాలుగు వర్ణములును ఒక దేహమునుండి పుట్టినవే. కాని వాని ధర్మములను రూపములును వేరువేరు. ఈ నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. (కనుక శ్రేష్ఠ వర్ణ స్త్రీని తక్కువ వర్ణపు పురుషుడు పెండ్లాడరాదు.) దేవయాని: ''రాజా! ఈనా పాణిని ఇంతకుముందు ఏ పురుషుడును గ్రహించలేదు. మొట్టమొదట (బావిలోనుండి తీసినప్పుడు) నీవే అది పట్టుకొంటివి. అందుచేతనే నేను నిన్ను వరించుచున్నాను. ఋషి పుత్త్రుడవును స్వయముగా ఋషివి ఐన నీవు గ్రహించినది ఈచేయి. నేను అభిమానవతిని. అట్టి నాయీకరమును మరెవరుగాని ఎట్లు గ్రహింపదగుదురు? యయాతి: ''కోరలనిండ విషము కలిగినదియు కోపించినదియు అగు సర్పము కంటెను-అన్నివైపులకును మంటలురేగుచున్న అగ్నికంటెను విప్రుడు స్పృశించి కలత పరచరాని వాడు. ఈ విషయము విజ్ఞులకు మాత్రమే తెలియును. దేవయాని: ''పురుషశ్రేష్ఠా! ఇది యెట్లో తెలియగోరుచున్నాను. యయాతి: ''పాము ఒక్కనినే కరచును. శస్త్రము ఒక్కనిని మాత్రము చంపును. కాని-కోపించిన బ్రాహ్మణుడు రాష్ట్రములను (గ్రామాదిజన నివాసస్థానములను) పురములను (రాజధానీస్థానములను) కూడ నశింపజేయగలడు. భయపడకుము. ఈ కారణముతోనే బ్రాహ్మణుడు పైచెప్పినవాటి అన్ని టికంటెను దురాధర్షతరుడు (స్పృశించికలతపరచరానివాడు) అని నేనంటిని. అందువలననే పూజ్యురాలవగు నిన్ను నీ తండ్రియే స్వయముగా ఇచ్చిననేకాని వివాహమాడను. దేవయాని: ''రాజా! నేనై స్వయముగా కోరినందునను మాతండ్రి స్వయముగా నన్ను నీకు ఇచ్చిన మీదటను నన్ను నీవు పెండ్లాడబోవుచున్నావు. అంతే కాని నీవు కోరుటలేదు. అడుగకయే ఇచ్చిన దానిని ప్రతిగ్రహించుట దోషము కాదు.

శౌనకః : త్వరితం దేవయాన్యా7థ ప్రేషితా పితు రాశ్రమమ్‌ |

సర్వం నివేదయామాస ధాత్రీ తసై#్మ యథాశ్రుతమ్‌. 28

శ్రుత్వైవ చ స రాజానం దర్శయామాస భార్గవః | దృష్ట్వైవ మాగతం విప్రం యయాతిః పృథివీపతిః. 29

వవన్దే బ్రాహ్మణం కావ్యం ప్రాఞ్జలిః ప్రణత స్థ్సితః | తం చాథాభ్యవద త్కావ్య స్సామ్నా పరమవల్గునా.

దేవయానీ : రాజా7యం నాహుష స్తాత దుర్గే మే పాణి మగ్రహీత్‌ |

నమస్తే దేహి మా మసై#్మ లోకే నాన్యం పతిం వృణ. 31

శుక్రః : వృతో7నయా పతి ర్వీర సుతయా త్వం మమేచ్ఛయా |

గృహాణమాం మయా దత్తాం మహిషీం నహుషాత్మజ. 32

యయాతిః : అధర్మో న స్పృశే దేవం పాపం మా స్యాచ్చ భార్గవ |

వర్ణసఙ్కరజో బ్రహ్మ న్నితి త్వాం ప్రావృణో మ్యహమ్‌. 33

శుక్రః : అధర్మా త్త్వాం చ మోక్ష్యామి వరం వరయ చేప్సితమ్‌ |

అస్మి న్వివాహే మా గ్లాని రహం పాపం తుదామి తే. 34

వహస్వ భార్యాం ధర్మేణ దేవయానీం శుచిస్మితామ్‌ | అనయా సహ సమ్ప్రీతి మతులాం త్వ మవాప్నుహి.

ఇయం చాపి కుమారీ తే శర్మిష్ఠా వార్షపర్వణీ| సమ్పూజ్యా సతతం రాజ న్న చైనాం శయనే హ్వయ. 36

శౌనకః : ఏవ ముక్తో యయాతిస్తు శుక్రే దత్వా ప్రదక్షిణమ్‌ |

జగామ స్వపురం హృష్ట స్సో7నుజ్ఞాతో మహాత్మనా. 37

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీక

సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే యయాతికృత

దేవయానీగ్రహణం నామ త్రింశో7ధ్యాయః.

పిమ్మట వెంటనే దేవయాని తన దాదిని తన తండ్రి ఆశ్రమమునకు పంపెను. ఆమె శుక్రునితో తాను వినిన విషయము వినినట్లు చెప్పెను. వినిన వెంటనే శుక్రుడును వచ్చి రాజునకు దర్శన మిచ్చెను. ఇట్లు తన దగ్గరకు వచ్చిన విప్రుడు-వేదములందు మహాపండితుడు-కవిమహాముని కుమారుడు అగు శుక్రుని యయాతిరాజు నమస్కరించి దోసిలిపట్టి వినయముతో వంగి ఎదుట నిలువబడెను. శుక్రుడు అతనిని చాల ఇంపైన నెమ్మది మాటలతో పలుకరించి మాట లాడెను.

దేవయాని: ''ఈ రాజు నహుషపుత్త్రుడు. ఇతడు ఒకప్పుడు దుర్గ ప్రదేశము (తప్పించుకొని బయటపడ అలవికాని ప్రదేశము)నందున్న నా చేతిని పట్టుకొనెను. (పాణిని గ్రహించెను.) నీకు వందనము. నన్ను ఇతని కిమ్ము. లోకమున నేను మరెవ్వరిని పతిగా వరించను.'' శుక్రుడు: ''ఓ వీరా! నిన్ను ఈ నా కుమార్తె తానే వరించినది. అది నేను ఇష్టపడుచున్నాను. ఈమెను నేనే నీకు ఇచ్చుచున్నాను. నీ వీమెను గ్రహించి రాణిగా చేసికొనుము.'' యయాతి: ''పూజ్య బ్రాహ్మణుడవగు భార్గవా! ఇట్లు చేయుట వలన నాకు అధర్మదోషము కాని వర్ణ సంకరము చేసిన పాపము కాని నా కంట కుండునట్లు నాకు వర మీయ ప్రార్థించుచున్నాను.'' శుక్రుడు: ''ఇదే కాదు. నీ వింకేదయిన ఈప్సితవరమును కూడ కోరు కొమ్ము. ఇత్తును. నిన్ను అధర్మమునుండి విడిపించుచున్నాను. ఈ పెండ్లి వలన నీకు ఎట్టి హానియు కలుగదు. నీ పాపములను నేను ఖండించు(తెగనరకు)చున్నాను. ఈ శుచిస్మితయగు దేవయానిని ధర్మ పత్నిగా గ్రహింపుము. ఇది ధర్మమే కాని అధర్మము కాదు. ఈమెతో కూడి నీవు సాటిలేని సుఖ మనుభవింపుము. వృషపర్వుని కూతురగు ఈ కుమారి శర్మిష్ఠయు నీకు సతతము ఆదరణీయురాలే. కాని నీవు ఈమెను శయనమున గ్రహించరాదు.

ఇట్లు పలికిన శుక్రునకు ప్రదక్షిణము చేసి ఆ మహాత్ముని అనుమతి పొంది యయాతి హర్షముతో తన రాజ ధానికి వెడలెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాతి దేవయానిని గ్రహించుట యను ముప్పదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters