Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టాదశో7ధ్యాయః.

బ్రాహ్మణాదీనా మాశౌచనిర్ణయ-ఏకోద్దిష్టాదివిధిశ్చ.

సూతః ఏకోద్దిష్ట మథో వక్ష్యే యదుక్తం చక్రపాణినా | మృతే పుత్రై ర్యథా కార్య మాశౌచం చ పితర్యపి.1

దశాహం శావ మాశౌచం బ్రాహ్మణషు విడేయతే | క్షత్రియేషు ద్వాదశాహం పక్షో వైశ్యేషు చైవ హి.2

శూద్రేషు మాస మాశౌచం సపిండేషు విధీయతే | నైశం చాకృతచూధీస్య త్రిరాత్రం పరతః స్మ్రుతమ్‌.3

జననే ష్వేవమేవం తు సర్వవర్ణేషు సర్వదా | అస్థిసంచయనా దూర్థ్వ మంగస్పర్శో విధీయతే.4

ప్రేతాయ పిండదానం తు ద్వాదశాహం సమాచరేల్‌ | పాథేయం తస్య తత్ప్రోక్తం యతః ప్రీతికరం మహత్‌.5

తస్మా త్ప్రేతపురం ప్రేతో ద్వాదశాహేన నీయతే | గృహపుత్త్రకళత్రాది ద్వాదశాహం ప్రపశ్వతి.6

తస్మా న్నిధేయమాకాశే దశరాత్రం పయ స్తథా | ప్రేతతాపోపశాంత్యర్థ మధ్వశ్రమవినాశనమ్‌.7

ఏకాదశాహే విప్రాణాం ద్విజా నేకాదశైవ తు | క్షత్త్రాది సూతకాంతే తు భోజయే దయుతం ద్విజాన్‌.8

ద్వితీయే7హ్ని పున స్తద్వ దేకోద్దిష్టం సమాచరేత్‌ | ఆవాహనాగ్నౌకరణ దేవహీనం విధానతః.9

ఏకం పవిత్ర మేకార్ఘ్య మేకః పిండో విధీయతే | ఉపతిష్టతా మిదం దేయం పశ్చాచ్చెవ తిలోదకమ్‌.10

స్వదితం వికిరే బ్రూయా ద్విసర్గే చాభిరమ్యతామ్‌ | శేషం పూర్వవ దత్రాపి కార్యం వేదవిదో విదుః.11

అనేన విధినా సర్వ మనుమాసం సమాచరేత్‌ | సూతకాన్తే ద్వితీయేహ్ని శయ్యాం దద్వా ద్విచక్షణః.12

అష్టాదశాధ్యాయము.

ద్విజాదులకు ఆశౌచాదికము-ఏకోద్దిష్టాది శాద్థవిధి.

సూతుడు మహర్షులకు ఇంకను ఈ విధముగా చెప్ప నారంభించెను: మత్స్యరూపుడగు నారాయణుడు మనువునకు చెప్పినట్లు తండ్రి మరణించినపుడు పుత్త్రులు చేయవలసిన ఏకోద్థిష్ట శ్రాద్థ విధానమును ఆశౌచము పాటించవలసిన నిర్ణయమును తెలిపెదను.

మృతాశౌచము బ్రాహ్మణులకు పది దినములు క్షత్రియులకు పండ్రెండు దినములు వైశ్యులకు పదునైదు దినములు శూద్రులకు ముప్పది దినములు పాటించవలసియుండును. (పదునొకండవ-పదుమూడవ-పదునారవ-ముప్పదియొకటవ-దినములందు స్నానము చేసిన వీరి కందరకు శుద్థి యగును.) చూడాకర్మ జరుగని (మూడేండ్లు నిండని) శిశువు మరణించినచో ఒక దినము మూడేండ్లు నిండినది మొదలు ద్విజులకు ఉపనయమును ఇతరులకు వివాహమును కానంత వరకు మూడు దినములు మృతాశౌచము.

జాతాశౌచము (పురుడు) కూడ ఆయా వర్ణముల వారికి పైని చెప్పినట్లు పది-పండ్రెండు-పదునైదు-ముప్పది-దినములే అని తెలియవలెను.

తండ్రి మొదలగువారు మరణించినపుడు దహనము జరిపి పిమ్మట అస్థి సంచయనము(దహనము చేయగా ఏర్పడిన భస్మమునుండి ఎముకలను ప్రోగుచేయుట) జరిగిన తరువాతనే అంగస్పర్శము (మరణించినవాని పుత్త్రుడు మొదలగు శ్రాద్థకర్తలను అతని సన్నిహిత జ్ఞాతులైనను తాకుట) జరుగవలెనని శాస్త్రము విధించుచున్నది.

తరువాత పండ్రెండు దినముల వరకు ప్రేతమునకు పిండదానము చేయుచుండవలెను. ఏలయన పరలోకమునకు పోవు ప్రేతమునకు ఆపిండములు దారి బత్తెముగా అయి చాల ప్రీతిని కలిగించును. ఈ పిండదానముచే సంతృప్తి చెందుచు ప్రేతము పండ్రెండు దినములు ముగియుసరికి ప్రేతములు చేరవలసిన లోకమునకు తీసి కొనిపోబడును. (చేర్చబడును) మరణించిన ప్రాణి [ప్రేతము] ఈ పండ్రెండు దినములను తాను మరణించక మునుపు తనవిగా నుండిన ఇల్లు పొలము పుత్త్రులు భార్య మొదలగునవి చూచుచునే ఉండును. [ వీరు తన కొరకై దారి బత్తెముగా ఏమయిన సుఖ సాధనమును సమకూర్తురా లేదా యను చింతతో ఉండును. ] అందుచేతనే పది దినముల వరకు శూన్యమునందు వ్రేలాడు నట్లుగా ప్రేతము నుద్దేశించి నీటితో [పాలతో] నిండిన పాత్ర ము ఉంచెదరు. దీని వలన ఆప్రేతమునకు తాపోపశాంతియు మార్గాయాసశాంతియు కలుగును.

పదునొకండవనాడు బ్రాహ్మణులు పదునొకండు మంది బ్రాహ్మణులను భోక్తలుగా ఉంచి శ్రాద్థము జరుపవలెను. ఇట్లే క్షత్త్రియులును వైశ్యులును శూద్రులును వారి వారి అశౌచము ముగిసిననాడు బేసి సంఖ్యలో భోక్తలను భుజింపజేయవలెను. (శూద్రులు ఆహార పదార్థ దానము మాత్రమే చేయవలెను.)

ఆశౌచము ముగిసిన రెండవనాడు(పదునొకండవ-పదుమూడవ-పదునారవ-ముప్పది యొకటవ దినములలో ప్రేతము నుద్దేశించి ఏకోద్దిష్టమును జరుపవలెను. (ఏక-ఉద్దిష్ట=ప్రేతమును మాత్రమే ఉద్ధేశించి-వారి పై వారినిగాని విశ్వేదేవులను గాని ఉద్దేశించకచేయు శ్రాద్ధము అని అర్థము.) దీనియందు ఆవాహనము అగ్నౌకరణము యథావిధానముగా ఉండును. విశ్వేదేవులకు అర్చన యుండదు. ఒకే పవిత్రము ధరించుట ఒకే అర్ఘ్యము వదలుట ఒకే పిండము వేయుట దీనియందు విధింపబడును. దీనిలో 'ఇదం ఉపతిష్ఠతు.' ఇది ఈ ప్రేతమునకై సన్ని హితమైన ఉండుగాక!'' అని మాత్రమే చెప్పవలెను. (స్వధా అని చెప్పకూడదు.) పిండదానము తరువాత తిలోదకము ఈయవలెను. వికిరపిండము ఇచ్చు సమయమున 'స్వదితం' 'చక్కగా తినబడినది' అనియు-బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పునపుడు 'అభిరమ్యతామ్‌' సుఖము ఆనందమును పొందుగాక!' అనియు చెప్పవలెను. ఇవి కాక మిగిలిన ప్రక్రియలన్నియు లోగడ అయా శ్రాద్ధముల విషయమున చెప్పినట్లే ఏకోద్దిష్టమునను చేయవలెను.

ఈ విధముగా ఏకోద్దిష్టమును ప్రతి మాసమునందును జరుపుచుండవలెను. (వాస్తవమున సపిండీకరణము సంవత్సరాంతమున జరుగవలెను. అంతవరకును మరణించిన జీవునకు 'ప్రేతము' అను వ్యవహారమే యుండును. కాని పితృదేవత్వము రాదు. అంతవరకును చేయు పితృకార్యము అతనిని ఒక్కనికే ఉద్దేశించి చేయుదురు. కావున ఇది ఏకోద్దిష్టము.)

కాంచనం పురుషం తద్వత్‌ ఫలవస్త్రసమన్వితమ్‌ | సంపూజ్య ద్విజదాంపత్యం నానాభరణభూషణౖః. 13

వృషోత్సర్గం ప్రకుర్వీత దేయా చ కపిలా శుభా | ఉదకుంభళ్చ దాతవ్యో భక్ష్యభోజ్యసమన్వితః. 14

యావదబ్దం నరశ్రేష్ఠః సతిలోదకపూర్వకమ్‌ | తత స్సంవత్సరే పూర్ణే సపిండీకరణం భ##వేత్‌. 15

సపిండీకరణా దూర్ధ్వం ప్రేతః పార్వణభా గ్భవేత్‌ | వృషోత్సర్గం సుతః కుర్యాత్‌ పిత్రో శ్చైకాద శేహని.

అథవా పుణ్యదివసే విధినా వృష ముత్సృజేత్‌ | వృషోత్సర్గం సుతో మాసి కుర్యా దేకాదశే7హని. 17

సహోమం విధివచ్చైప పితర్యపిచ జీవతి | వృద్ధిపూర్వేషు యోగ్యశ్చ గృహస్థశ్చ భ##వేత్తతః. 18

సపిణ్ణీకరణశ్రాద్ధం దేవపూర్వం నియోజయేత్‌ | పితౄనేవాశ##యేత్తత్ర పృథక్ప్రేతం వినిర్దిశేత్‌. 19

గన్దోదకతిలైర్యుక్తం కుర్యాత్పాత్రచతుష్టయమ్‌ |అర్ఘ్యార్థం పితృపాత్రేషుప్రేతపాత్రం ప్రసేచయేత్‌. 20

తద్వ త్సంకల్ప్య చతురః పిండా న్పిణ్డప్రద స్తథా | యే సమానా ఇతి ద్వాభ్యా మంతంతు విభ##జేత్త్రిధా.21

చతుర్థస్య పునః కార్యం నకదాచి దతో భ##వేత్‌ | తతః పితృత్వ మాపన్న స్సర్వతః పుష్టిమాగతః. 22

అగ్నిష్వాత్తాదిమధ్యత్వం ప్రాప్నో త్యమృతముత్తమమ్‌ | సపిణ్డీకరణాదూర్ధ్వం తస్త్మెతస్మా న్నదీయతే. 23

పిత్రాదిష్వేవ దాతవ్యం తత్పిణ్డో యేషు సంస్థితః | తతఃప్రభృతి సఙ్క్రాన్తా వుపరాగాదిపర్వసు. 24

త్రిపిణ్డ మాచరే చ్ఛ్రాద్ధ మేకోద్దిష్టం మృతాహని | ఏకోద్దిష్టం పరిత్యజ్య మృతా హేన్య త్సమాచరేత్‌. 25

తథైవ పితృహా స స్యా న్మాతృభ్రాతృవినాశకః| మృతాహే పార్వణం కుర్వన్నధో7ధో యాతి మానవః.

సమ్పర్కే త్వాకులీ భావః ప్రేతేషుతు యతో భ##వేత్‌ | ప్రతిసంవత్సరం తస్మా దేకోద్దిష్టం సమాచరేత్‌. 27

యావదబ్దంచ యోదద్యా దుదకుమ్భం విమత్సరః | ప్రేతాయాన్నసమాయుక్తం సో7శ్వమేదఫలం లభేత్‌.

ఆమశ్రాద్ధం యదా కుర్యా ద్విధిజ్ఞ శ్ర్శాద్ధద స్తథా | తేనాగ్నౌకరణం కుర్యా త్పిణ్డాం స్తేనైవ నిర్వపేత్‌.

త్రిభి స్సపిణ్డీకరణా న్మాసకత్రితయం పితా | యదా ప్రాప్స్యతి కాలేన తదా ముచ్యేత బన్ధనాత్‌. 30

ముక్తోపి లేపభాగిత్వం ప్రాప్నోతి కుశమార్జనాత్‌ | లేపభాజ శ్చ తుర్థాద్యాః పిత్రాద్యాః పిణ్డభాగినః.

పిణ్డద స్స ప్తమ స్తేషాం సాపిణ్డ్యం సాప్తపౌరుషమ్‌. 31u

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమను సంవాదే శ్రాద్ధకల్పే సపిణ్డీకరణాది

శ్రాద్ధవిధిర్నా మాష్టాదశీ7ధ్యాయః.

ఆశౌచము తీరిన తరువాత రెండవ దినమున (విప్రులు 11వ-క్షత్రియులు 13వ-వైశ్యులు 16వ-శూద్రులు 31వ దినములందు) సంప్రదాయము నెరిగి శ్రాద్ధక ర్త ప్రేత నుద్దేశించి అతని సుఖమునకై శయ్యను బంగారు ప్రతిమను ఫలములను వస్త్రములను బ్రాహ్మణ దంపతులకు-వారిని నానా77భరణ భూషణములతో ఆలంకరించి పూజించి-దానము ఈయవలెను. వృషోత్సర్జనము-ఆబోతును విడుచుట-చేయవలెను. కపిలగోవును దాన మీయవలెను. భక్ష్యభోజ్యములను ఉదకుంభమును దానము చేయవలెను. ఇట్లు సంవత్సరము నిండువరకు ఆయా దానములును శ్రాద్ధములును తిలోదక పూర్వకముగా ఆయా సమయములందు జరుపుచుండవలయును. సంవత్సరము నిండిన తరువాత సపిండీకరణము జరుపవలెను. సపిండీకరణము జరిగిన తరువాతనే మరణించిన వ్యక్తికి ప్రేతత్వము తీరి పార్వణమునకు (పార్వణశ్రాద్ధమునందు చేయు ఆయా పిండదానాదికమును గ్రహించుటకు) అర్హుడగును.

తల్లిదండ్రులు మరణించినపుడు పదునొకండవ దినమున కుమారుడు వారి సుఖము నుద్దేశించి వృషోత్సరము చేయవలెను. లేదా ఏదైన పుణ్య సమయమునందై నను ఇది చేయవచ్చును.

కుమారుడు ఇది తల్లి విషయములో ఆమె మరణించిన తరువాత పదునొకండవ దినమునగాని మరేదైన పుణ్యదినమున గాని చేయవలెను. తండ్రి విషయమున అతని పుణ్యమునకై అతడు జీవించియుండగా కూడ వృషోత్సర్గము చేయవచ్చును. ఇవి ఈ విధముగా జరుపుట వలన గృహస్థుడు (మరణించిన వారి కుమారులు మొదలగువారు) వృద్ధిపూర్వకములగు కృత్యములను (నాందీశ్రాద్ధమును జరిపి చేయవలసిన వివాహాది శుషకార్యములను) జరుపుటకు యోగ్యుడగును.

సపిండీకరణ శ్రాద్ధమున మొదట విశ్వేదేవులకును తరువాత పితరులకును ఆవాహనము అర్చనము భోజనము మొదలగునవి జరుపవలెను. అందునను పితరులు అనగా అప్పటికి పితృత్వమును పొందియున్న వారిని మాత్రమే గ్రహించవలెను. ప్రేతను వేరుగా పేర్కొనవలెను. పితృస్థానమునందు నాలుగు పాత్రలను (అర్ఝ్యమునకు) ఉంచి గంధములు తిలలు ఉదకము మొదలగువానితో వేరు వేరుగా (అప్పటికి పితృత్వము పొందియున్న మూడు తరముల వారికి మూడు-ప్రేతకు ఒకటి-మొత్తము నాలుగు) నింపవలెను. తరువాత ప్రేతపాత్రయందలి గంధతిలలతో కూడిన ఉదకమును మూడు భాగములుగా మిగిరిన మూడు పాత్రలయందు కలిపి వేయవలెను. అదే విధముగా పితరులకు ముగ్గురకు మూడును- ప్రేతకు ఒకటియు-మొత్తము నాలుగు పిండములను చేయవలెను. 'యే సమానా' అని ఆరంభమగు రెండు ఋక్కులతో నాలుగవ పిండమును మూడుగా విభజించవలెను. ఆ ఖండములను పితరులకు పితరులకు ఉద్దేశించిన పిండములతో కలుపవలెను. ఇంతేకాని నాలుగవ పిండమునకు అంతకంటె వేరు వినియోగము లేదు. ఈ సపిండీకరణము జరుపుటతో ఈ మరణించిన జీవుడు ప్రేతత్వము వదలి పితృత్వమును పొందును. అన్ని విధముల పుష్టిని (శుభమును) పొందును. అగ్ని ష్వాత్తాది పితృదేవతల దగ్గర ఉత్తమము అమృతము (శాశ్వతము) ఆగు స్థానమును పొందును. అందుచేతనే సపిండీకరణము జరిగిన తరువాత ఈ మరణించిన వ్యక్తికి వర్గత్రయములోని వాడుగానే కాని ఆతనికి వేరుగా పారలౌకిక పితృకార్యములు జరుపబడవు. ఏలయన అతని పిండము తనపై పెద్దల పిండములోనికి చేరినది. కనుక ఇతడును వారిలో ఒకడుగా ఐనాడు.

అది మొదలుకొని సంక్రాంతి-చంద్రగ్రహణము మొదలగు విశిష్ట పర్వములందును అతడు మరణించిన దినమున ప్రతి సంవత్సరమును పిండత్రయముతో శ్రాద్ధము జరుపవలెను. (మరణించిన పెద్దలకు) ఇదే విధముగ మృతదినమునను ఆశౌనదినములందును ఏకోద్దిష్ట శ్రాద్ధమునే ప్రేత నుద్దేశించి చేయవలెను. కాని అంతకుమించి అతనికి పితృత్వమును భావనచేసి పార్వణ శ్రాద్ధము మొదలగునవి చేయరాదు. అట్లు చేసినవాడు తల్లిదండ్రులను సోదరులను చంపినందువలన కలుగు పాపమును పొందును. ప్రేతలుగా నున్న వారు తనకు పితరులతో (గాని ఇతరులతోగాని) సంపర్కము కలిగినచో కలవరము చెందుదురు. కనుక వారికి ఏకోద్దిష్టమునే (వారిని ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి చేయు శ్రాద్ధమునే) జరుపవలయును. కాని ఇతరులతో కలిపి జరుపరాదు. మృతదినములందు పార్వణ శ్రాద్ధమును బరిపిన మానవుడు క్రిందికి క్రిందికి పతితుడగును. కనుక సంవత్సరము నిండు వరకు ఏకోద్దిష్టమునే జరుపవలయును. (ఇచట మూలమున 'ప్రతి సంవత్సరం' అని యున్నది. దీనికి 'సంవత్సరే సంవత్సరే=ప్రతి సంవత్సరం' అని వీప్సార్థమునకాక 'సంవత్సరే=ప్రతి సంవత్సరం' అని సప్తమ్యర్థమున మాత్రమే అవ్యయీ భావమును చెప్పవలెను. లేనిచో సంప్రదాయవిరుద్ధమగును,)

సంవత్సరము నిండువరకు మరణించిన వారి (ప్రేతల) నుద్దేశించి ఉదకుంభమును ఆన్నమును దానము చేయు వారికి అశ్వమేధయాగము చేసినచో కలుగునంత ఫలము కలుగును.

శాస్త్ర విధానానుసారము కర్మములను ఆచరించుట ఎరిగిన శ్రాద్ధక ర్త అన్న శ్రాద్ధమును కాక ఆమశ్రాద్ధమును జరుపునప్పుడు అగ్నౌకరణము కాని పిండదానముగాని ఆమ పదార్థములతోనే చేయవలెను కాని పక్వద్రవ్యములతో చేయరాదు.

ప్రేతకు తనకు పై వారితో సపిండీకరణము జరుపగానే అతడును పితృవర్గత్రితయములో ఒకడగు స్థితిని పొందును. అప్పటినుండి అతడు ప్రేతత్వ బంధనమునుండి ముక్తి పొందును.

ఇట్లు ముక్తడై నవాడు కూడ తన వంశమువారిలో తన కుమారుడు కాక మిగిలిన వారినుండి లేపమును (పిండములు పెట్టినప్పుడు మిగిలిన అంటును) ఆహారముగా పొందదగినవాడు అగును. ఈ లేపము కుశమార్జన పూర్వకముగా అందును.

దీనికి కారనము ఏమన మూడు తరములు దాటి నాలుగవ తరమునుండి పై వారు లేపభాక్కులు. పితృపితా మహప్రపితామహులు పిండభాగులు. ఏడు తరములవరకు ఎవరైనను తమ పూర్వులకు పిండములు వేయవచ్చును. ఏలయన సపిండత్వము ఏడు తరములవరకు నిలుచును.

(ఈ పై వాక్యములకు చాల వివరణము కావలెను. ఎట్లన రామశర్మ అనువాడు తన తండ్రికి ఆబ్దికము జరుపుచున్నాడు. ఇతనికి పితృపితామహ ప్రపితామహులు పిండభాగులు. ప్రపితామహుని తండ్రియు పైవారును తన వంశములోనే వీరి సరితరమునకు చెందిన వారును ఈ రామశర్మ చేయు శ్రాద్ధమున లేపభాక్కులు. కాని ఈ లేపభాగులు ఈ రామశర్మకు పైతరమువారు కొందరు జీవించియుండి వారు తమ తండ్రికి జరుపు శ్రాద్ధమున పిండభాగులుగా ఉండవచ్చును. వంశమూల పురుషునికి ఇద్దరు అంతకంటె ఎక్కువ మంది కుమారులుండినచో వారిలో జ్యేష్ఠుని మనుమలును కనిష్ఠుని కుమారులను ఒక వయస్సు వారు అగుట సంభవించును. ఇట్లే తరములు గడచిన కొలది ఒక వ్యక్తియే ఒకరు జరుపు శ్రాద్ధమున పిండ భాగి అగుటయు మరియొకరు శ్రాద్ధమున లేపభాగి అగుటయు జరుగును. అట్లే ఒకమృతునికి కుమారులుగాని సన్నిహిత జ్ఞాతులు కాని లేనపుడు అతని మూల పురుషుని నుండి ఏడు తరములకులోగా పై చప్పిన పద్దతిలో అగువారు ఎవరైనను ఇతనికి కర్మలు జరిపి ప్రేతత్వము నుండి ము క్తి కలిగింపవచ్చును.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున ఏకోద్దిష్ట శ్రాద్దాది విధానము అను పదునెనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters