Sri Matsya Mahapuranam-1    Chapters   

షోడశో7ధ్యాయః.

శ్రాద్థ కల్పే నిమంత్రణాది కథనమ్‌.

సూతః : శ్రుత్వైతత్సర్వమఖిలం మనుః పప్రచ్చ కేశవమ్‌ | శ్రాద్థకాలంచ వివిధం శ్రాద్థభేదం తథైవచ. 1

శ్రాద్థేషు భోజనీయా యే యేచ వర్జ్యా ద్విజాతయః | కస్మి న్వాసరభాగేవా పితృభ్య శ్శ్రా ద్థ మారభేత్‌.2

కస్మిన్దత్తం కథం యాతి శ్రాద్థంచ మధుసూదన | విధినా కేన కర్తవ్యం కథం ప్రీణాతి తతృత్రూ9. 3

మత్స్యః : కుర్యాదహరహ శ్శ్రాద్థ మన్నాద్యేనోదకేనవా | పయో మూలఫలై ర్యాపి పితృభ్యః ప్రీతిమహరేత్‌.

నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం శ్రాద్థముచ్యతే | నిత్యం తావ త్ప్రవక్షామి అర్ఘ్యావాహనవర్జితమ్‌.5

అదైవతం విజానీయా త్పార్వణం పర్వసు స్మ్రతమ్‌ | పార్వణం త్రివిధం ప్రోక్తం శృణు తావ న్మహీపతే. 6

పార్వణశ్రాద్థే నియోజ్యభ్రాహ్మణాః.

పార్వణ యే నియోజ్యాస్తు త్రాన్చ్రణుష్వ నరాధిప | పఞ్చగ్ని స్స్నాతకశ్చైవ త్రిసుపర్ణ ష్షడజ్గవిత్‌.7

శ్రోత్రియ శ్శ్రోత్రియసుతో విధివాక్య విశారదః | సర్వజ్ఞో వేదవిత్సత్రీ జ్ఞాతవంశకులాన్వితః. 8

పురాణవేత్తా ధర్మజ్ఞ స్స్వాధ్యాయజపతత్పరః | శివభక్తః పితృపర స్సూర్యభక్తో7థ వైష్ణవః. 9

బ్రహ్మణో యోగవిచ్ఛాన్తో యుఞ్జీతాత్మా సుశీలవా9 | భోజయేచ్చాపి దౌహిత్రం యత్నతశ్శ్వశురంగురుమ్‌.

విట్పతిం మాతులం బన్ధు మృత్విగాచార్యసోమపా9 | యశ్చ వ్యాకురుతే వాచం యశ్చమీమాంసతే7ధ్వరమ్‌.11

సామస్వరవిధిజ్ఞశ్చ పజ్త్కిపావనపావనాః | సామగో బ్రహ్మచారీచ దేవభక్తోథ బ్రహ్మవిత్‌.12

యత్రైతే భుఞ్జతే శ్రాద్థే తదేవ పరమార్థవాత్‌ | ఏతే యోజ్యాః ప్రయత్నేస వర్జనీయాన్ని భోధ మే. 13

పార్వణశ్రాధ్థే వర్జ్యబ్రాహ్మణాః.

పతిత స్తత్సుతః క్లీబః పిశునవ్యజ్గిరోగిణిః | కునఖీ శ్యావదన్తస్తు కుణ్డగోళశ్వ పాలకాః. 14

పరివిత్తి ర్ని యుక్తాత్మా మత్తోన్మత్తశ్చ దారుణః | బైడాలబకవృత్తిశ్చ దమ్భీ దేవలకాదయః.15

కృతఘ్నోనాస్తికస్తద్విన్ల్మేచ్ఛదేశనివాసినః | త్రిశంకుబర్బరోఢ్రాన్థ్రచీనద్రవిడకౌజ్కణాన్‌. 16

వర్జయే ల్లిజ్గిన స్సర్వా న్ర్ఛాద్థ కాలేషు ధర్మవిత్‌ | సర్వేతే శ్రాద్థకాలేతు త్యాజ్యావై బ్రహ్మవాదిభిః. 17

షోడశాధ్యాయము

శ్రాద్థ కల్పము-నిమంత్రణాదివిధి.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను.ఈవిషయమంతయు నిరవశేషముగా విని మనవు కేశవుని మరల ఇట్లు ప్రశ్నించెను.''శ్రాద్థమును జరుపదగిన వివిధమగు కాలవిశేషమును వివిధములగు శ్రాద్థ విశేషములను శ్రాద్థమునందును భుజింపజేయదగిన వారిని భుజింపజేయదగనివారిని పితృ శ్రాద్థ మాచరింపదగిన కాలమును ప్రదేశములను పితృదేవతలను ప్రీతి చెందుటకై శ్రాద్థమాచరింపవలసిన వి ధానమును ఈ విషయములను అన్నిటిని నాకు తెలుపుడు.''

మత్స్య నారయణుడిట్లు మనువుతో చెప్పనారంభించెను. అన్నము మొదలగు పదార్థములతో కాని ఉదకముతో గాని ప్రతిదినమునను శ్రాద్థమును చేయవలెను. అన్నము లభ్యముకాని పక్షమున పాలు-పండ్లు-దుంపలు-వీనితోనైన శ్రాద్దము జరిపి పితరులకు ప్రీతి కలిగించవలెను.

నిత్యము నైమిత్తికము కామ్యము అని శ్రాద్దము మూడు విధములు. మొదటిది ప్రతిదినమును చేయవలసినది. మొదట దీనిని తెలిపపెదను. దీనియందు ఆర్ఘ్యము ఆవాహనము విశ్వదేవార్చనము ఉండనక్కరలేదు.

నిమిత్తము అనగా కాలవిశేష రూపముయిన హేతువు. ఆయా కాలవిశేషములందు చేయవలసినది నైమిత్తిక శ్రాద్థము. ఇది మరల పార్వణశ్రాద్దము సాధారణ శ్రాద్థము అ భ్యుదయ శ్రాద్దము అని మూడు విధములు-వీనిలో శుక్లకృష్ణ పక్షములందలి చతుర్థినాడును అష్టమినాడును పూర్ణిమ అమావాస్యలయందు ను చేయవలసినది పార్వణ (పర్వదినములలో చేయదగిన) శ్రాద్థము. (ఇచట పార్వణ శ్రాద్థము మూడు విధములు అని మూలములో ఉన్నది. కాని సందర్భమునుబట్టి ఇది నైమిత్ర శ్రాద్థము అనిఉండవలెను.)శ్రాద్థమునందుచేయవలసినవిమూడు-హోమము-బ్రాహ్మణభోజనము-పిండదానము అనునవి. అని ఆపస్తంబధగ్మ సూత్ర వ్యాఖ్యానములో హరదత్తులవారు చెప్పినారు. ఆప-ధర్మ-ప్రశ్న-1.పటల-7-కండికా-16 : సూత్రం-2 : తర్పణము పిండదానములో చేరును. ఆవాహనాదికము బ్రాహ్మణ భోజనములో చేరును. హోమము తెలిసినదే. వానిలో భోజనమునకై పిలువదగిన బ్రాహ్మణులను తెలిపెదను. వినుము. పంచాగ్ని హోత్ర కర్మములను అనుష్ఠించువాడు.(|.అన్వాహార్యపచన లేక దక్షిౖణ- 2. గార్హపత్య- 3. ఆహవనీయ- 4. సభ్య- 5. ఆవసథ్య-అనునవి పంచాగ్నులు) వేదాధ్యయనము యథాశాస్త్రముగా ముగించి స్నానవ్రతము జరుపుకొనినవాడు త్రిసుపర్ణములను (ఋగ్వేదమునందలి 'చతుష్కపర్థా' ఇత్యాదిగామూడు ఋక్కులను గాని యజుర్వేదమునందలి 'బ్రహ్మమేతుమాం' మొదలగు మూడు అనువాకములుగాని) అధ్యయనము చేసినవాడు ఆరు వేదాంగములను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు (వేదమును బాగుగా అధ్యయనము చేసినవాడు) శ్రోత్రియుని కుమారుడు (వేదశాస్త్రములందలి) విధి వాక్యము (లర్ధము)లను బాగుగ ఎరిగినవాడు అన్ని విషయములను ఎరిగినవాడు సత్రయాగములను ఆచరించినవాడు అందరకును తెలిసిన వ్రసిద్ధకులమున వంశమున పుట్టినవాడు పురాణములను ధర్మ శాస్త్రములను ఎరిగినవాడు స్వాధ్యాయములను ఎల్లప్పుడును శ్రద్ధతో చేయుచుండువాడు శివభక్తుడు పితృభక్తుడు సూర్య భక్తుడు విష్ణుభక్తుడు బ్రహ్మతత్త్వమును ఎరిగినవాడు యోగవిద్య నెరిగినవాడు శాన్తుడు ఆత్మయోగము నెరిగినవాడు మంచి శీలము కలవాడు దౌహిత్రుడు తన భార్యకు తండ్రి తన గురుడు తన కులమువారిలో పెద్ద-వీరినే ఆంధ్రదేశమున సభాపతి అందురు-కులపు పెద్ద-మేనమామ బంధువు ఋత్విక్‌ ఆచార్యుడు (ధర్మశాస్త్రాదికమును బోధించగలవాడు) సోమ యాజి వాక్కును (బాషలను) వ్యాకరించగలవాడు (వ్యాకరణ తత్త్వమును ఎరిగినవాడు A great linguist) యజ్ఞ ప్రక్రియను శాస్త్రీయముగా చర్చించి వివరించగలవాడు సామవేద స్వర ప్రక్రియను బాగుగా ఎరిగినవాడు ఇట్టె పం క్తిని పావనము చేయువారిలో శ్రేష్ఠులు. సామవేదము నేర్చినవాడు బ్రహ్మచారి భగవద్భక్తుడు బ్రహ్మతత్త్వవేత్త ఏశ్రాద్ధమున భుజింతురో ఆశ్రాద్దము సార్థకమయి పరమార్థఫలమును ఇచ్చును. కనుక శ్రాద్ధమునందు భోక్తలుగా ఇట్టివారినే నియమించవలెను.

ఇక భోక్తలుగా పిలుచుటలో విడువవలసినవారిని తెలిపెదను. వినుము. పతితుడు పతితుని కుమారుడు నపుంసకుడు కొండెములు చెప్పువాడు అంగహీనుడు రోగి పుప్పి గోళ్ళవాడు పచ్చవారిన దంతములు కలవాడు స్త్రీకి భర్త ఉండగాగాని మరణించిన తరువాత గాని పరునివలన పుట్టినవాడు గుర్రములను పోషించి జీవించువాడు అన్నకు పెండ్లి కానిదే పెండ్లి చేసికొన్నవాడు లేదా తన కంటెముందే పెండ్లి చేసికొన్న వారి అన్న తనకు తానై కోరి ఇతరుల సేవకు పాల్పడి జీవించువాడు త్రాగుడు మొదలైనవానిని ఉపయోగించి మత్తతలో ఉండువాడు వెర్రివాడు క్రూరుడు పిల్లివలె కొంగవలె మోసముచే జీవించువాడు కపటి గొప్పలు చెప్పుకొనువాడు పూజారి కృతఘ్నుడు నాస్తికుడు వ్లుెచ్ఛ దేశములలో నివసించు (చిన) వాడు త్రిశంకు బర్బర ఉత్కల ఆంధ్ర చీన ద్రవిడ కొంకణ దేశములవారు తన సంప్రదాయ చిహ్నములను ఎల్లప్పుడు ధరించి తిరుగువారు ఇట్టివారిని కర్మానుష్ఠాన ధర్మమును ఎరిగినవారు శ్రాద్ధమున భోక్తలుగా నియమించకూడదు. వేదతత్త్వము నెరిగి కర్మల ననుష్ఠించువారు వీరిని అందరను శ్రాద్ధ సమయములందు భోక్తలనుగా పిలువక విడువవలయును.

శ్రాద్ధనిమన్త్రణాదివిధిః.

పూర్వేద్యు రపరేద్యుర్వా వినీతాత్మా నిమన్త్రయేత్‌ | నిమన్త్రితాంస్తు పితర ఉపతిష్ఠన్తితా న్ద్వి జాన్‌. 18

వాయురూపాశ్చ గచ్ఛన్తి తథాసీనా నుపాసతే | దక్షిణం జాను మాలభ్య త్వం మయాత్ర నిమన్త్రతః. 19

ఏవం నిమన్త్ర్య నియమం శ్రావయే త్పితృభ క్తిమాన్‌ | అక్రోధనై శ్శౌచపరై స్సతతం బ్రహ్మవాదిభిః. 20

భవితవ్యం భవద్భిస్తు మయా చ శ్రాద్ధ*కారిణా |

పితృయజ్ఞం తు నిర్వర్త్య పార్వణస్య తు యోగ్నిమా&. 21

పిణ్డాన్వాహార్యకం కుర్యా చ్ఛ్రాద్ధ మిన్దుక్షయే తథా | గోమయే నానులిప్తే తు దక్షిణాప్రవణావనౌ. 22

శ్రాద్ధం సమారభే ద్భక్త్యా గోష్ఠే వా జలసన్నిధౌ | అగ్నిమా న్నిర్వపే త్పిత్ర్యం చరుం వా సమముష్టిభిః.

భవితవ్యం భవద్భిశ్చ సావధానైః పర న్తప | పితృభ్యో నిర్వపామీతి సర్వం దక్షిణతో న్యసేత్‌. 24

అభిఘార్య తతః కుర్యా న్నిర్వాపత్రయ మగ్రతః | తే వితస్త్యాయతాః కార్యా శ్చతురఙ్గులవిస్తృతాః. 25

దర్వీత్రయం ప్రకుర్వీత ఖాదిరం రజతాన్వితమ్‌ | రత్ని మాత్రం పరిశ్లక్షణం హస్తాగ్రాకార ముత్తమమ్‌. 26

ఉదపాత్రం చ కాంస్యం తు మేక్షణం తు సమిత్కుశా& | తిలపాత్రాణి సద్వాసో గన్ధధూపానులేపనమ్‌. 27

ఆహరే దపసవ్యం తు సర్వం దక్షిణత శ్శనైః | ఏవ మాసాద్య తత్సర్వం భవనస్యాగ్రతో భువి. 28

___________________________________________

* కర్మణి

గోమూత్రేణ తు లిప్తాయాం గోమయేన తు మణ్డలమ్‌ | అక్షతాభి స్సపుష్పాభి స్సమభ్యర్చ్యాపసవ్యవత్‌. 29

విప్రాణాం క్షాళ##యే త్పాదా వభివన్ద్య పునఃపునః | ఆసనేషూపక్లప్తేషు దర్భవత్సు విధానతః. 30

ఉపస్పృష్టోదకా న్విప్రా నుపవేశ్యానుమన్త్రయేత్‌ | ద్వౌ దైవే పితృకార్యే త్రీ నేకై క ముభయత్ర వా. 31

శ్రాద్ధమునకు ఒక నాడుగాని రెండునాళ్ళుగాని ముందుగా భోక్తలగు బ్రాహ్మణులను వినయముతో నిమంత్రణము-నేను అనుష్ఠించు శ్రాద్ధమునందు మీరు భోక్తలుగా ఉండవలెనని ప్రార్థన-చేయవలెను. చేసి అంగీకరింపజేసి తన ఇంటికి పిలిచికొనిరావలెను. అట్లు నిమంత్రించినచో పితృదేవతలు ఆ బ్రాహ్మణులందు ప్రవేశించి నిలుతురు. పితృదేవతలు వాయురూపులయి ఆ బ్రాహ్మణుల దగ్గరకు పోవుదురు. వారు భోజనమునకై కూర్చుండినప్పుడు వారియందుండి వారితో పాటు తామును కూర్చుందురు.

శ్రాద్ధక ర్త భోక్తయొక్క కుడి మోకాటిని తాకుచు 'అయ్యా! ఈ శ్రాద్ధమునందు బోక్తగా నేను మిమ్ములను నిమంత్రించుచున్నాను. అని నిమంత్రించవలెను. తరువాత అతడు పితృదేవతలయందు భక్తితో ఈ నియమమును వారికి వినిపించవలెను. ''మీరు ఈ శ్రాద్ధకాలములో ఆరంభమునుండి చివర వరకును క్రోధము విడిచి శౌచము కలిగి దేవతా తత్త్వ విషయమునే మాటలాడుచు ఉండవలెను. మీరే కాదు. శ్రాద్ద కర్తనగు నేనును అట్లే యుండవలెను.'' అని ఈ నియమమంత్రమునకు అర్థము.

పార్వణ శ్రాద్ధమును జరుపు నిత్యాగ్ని హోత్రియగు గృమస్థుడు అమావాస్య మొదలగు పర్వములయందు యథా విధిగా పితృ యజ్ఞమును జరిపి పిండముల అన్వాహార్యకమును-పితరులకు పిండములను ఆహారముగా సమర్పించుటను-నిర్వర్తించవలెను.

శ్రాద్ధమును జరుపవలసిన ప్రక్రియాక్రమము ఇది. గోశాలా ప్రదేశమున గాని సరస్సులు నదులు మొదలగు జలసమీపమునందుగాని దక్షిణము వైపునకు వాలుగా ఉన్న ప్రదేశములను గోమయముతో అలికి అచ్చట భక్తితో శ్రాద్ద మాచరించుట ఆరంభించవలెను. అగ్నిహోత్రమును ఏర్పరచుకొనవలయును. చరువును (పితృదేవతలకు అర్పించుటకై పక్వము చేసిన పదార్థమును) సమ పరిమాణము కల పిడికిళ్ళుగా పాత్రయందు వడ్డించుకొనవలెను. ''అయ్యా! ఇది పితృ దేవతలకై వడ్డించుచున్నాను. మీరును నేనును సావధానతతో ఉండవలయును!'' అని భోక్తలను ప్రార్థించుచు అదియంతయు దక్షిణమున ఉంచవలెను! తరువాత దానిపై నేతితో అభిఘారణము చేసి తనముందు మూడు వడ్డనలను చెయవలెను. ఆ వడ్డించు చరు పిండ పరిమాణము పండ్రెండు అంగుళముల పొడవుతో నాలుగంగుళముల వెడల్పు నాలుగు అంగుళముల మందము కలిగి ఉండవలెను. (1 భారతీయాంగుళము = 3/4 బ్రిటిషు అంగుళము.) చండ్రకొయ్యతో మూడు దర్వులను (త్రెడ్డులను) చేయవలెను. వాటిలో వెండి రేకు నమర్చవలెను. అవి పిడికిలి మూసిన మూరపొడవున నున్ననై చేతిముందు భాగపు ఆకారములో ఉత్తమమై ఉండవలెను. కంచుతో చేసిన నీటి పాత్ర-మేక్షణము వైదిక కర్మము లందుపయోగించు ద్రవమును వడ్డించు ఉపకరణము) సమిధలు-కుశలు-తిలపాత్రములు-మడుగు వస్త్రములు గంధములు ధూపద్రవ్యములు అనులేపనములు (పూసికొను సుగ ధ వస్తువులు. ఈ మొదలగునవి సేకరించుకొనవలెను. వీటిలో ప్రతి ఒక్కటియు అపసవ్యముతో నెమ్మదిగా దక్షిణపు వైపుగా తెచ్చుకొని ఉంచుకొనవలెను.

ఇట్లు ఈ వస్తువులలో ప్రతి ఒక్కటియు సమకూర్చుకొని తన భవనమునకు (ఇంటికి) ముందు ప్రదేశమున గోమూత్రముతోను గోమయముతోను అలికిన చోట గోమయముతో మండలము చేయవలెను. ఆ ప్రదేశమున అపసవ్యముతో బ్రాహ్మణులను అక్షతలతోను పుష్పములతోను అర్చించవలెను. తరువాత వారిని మాటిమాటికి అభివందనము చేసి వారి పాదములను ప్రక్షాళనము చేయవలెను. తమ పాద ప్రక్షాళనానంతరము ఆ బ్రాహ్మణులు ఆచమనము ఉదకోపస్సర్శనము చేయవలెను. అట్టి వారిని చక్కగా అమర్చబడి దర్భలు పరచిన ఆసనముల పై శాస్త్ర విధానమున కూర్చుండపెట్టి అనుమంత్రణము (మరల ఆహ్వానించుట-దయచేయుడు-కూర్చుండుడు అనుట) చేయవలెను. విశ్వదేవ స్థానమున ఇద్దరను- పితృ స్థానమున ముగ్గురను-సంభవము కాని యెడల రెండు స్థానములలోను ఒక్కొక్కరినే కాని-భుజింపజేయవలెను. శ్రాద్ధకర్త తాను ఎంత ధనవంతుడైనను ఇంతకంటె ఎక్కువ మందిని శ్రాద్ధమున భోక్తలుగా చేసి భుజింపజేయరాదు.

బోజయే దీశ్వరోపీహ న కుర్యా ద్విస్తరం బుధః | దేవపూర్వం నియోజ్యాథ విప్రా నర్ఘ్యాదినా బుధైః.

అగ్నౌ కుర్యా దనుజ్ఞాతో విపై#్ర ర్విప్రో యథావిధి | స్వగృహ్యోక్తవిధానేన కాంస్యే కృత్వా చరుం తతః.

అగ్నీషోమయమాభ్యాం తు కుర్యా దాప్యాయనం బుధః |

దక్షిణాగ్నౌ ప్రణీతే చ య ఏకాగ్నిర్ద్విజోత్తమః. 34

యజ్ఞోపవీతీ నిర్వృత్యం తత్ర పర్యుఓణాదికమ్‌ | ప్రాచీనావీతినా కార్య మేతత్సర్వం విజానతా. 35

షడ్వై తస్మా ద్ధవిశ్శేషా త్పిణ్డా న్కృత్వా తథోదకమ్‌ | దద్యా దుదకపాత్రం తు సతిలం సవ్యపాణినా. 36

కృత్వాపసవ్యం దత్వైత ద్దర్భయుక్తో విమత్సరః | విధాయ లేఖాం యత్నేన నిర్వపే దవనేజనమ్‌. 37

దక్షినాభిముఖః కుర్యా త్క రే దర్వీం విధాయ వై | నిధాయ పిణ్డ మేకైకం సర్వా న్దర్భోపరి క్రమాత్‌. 38

పిణ్డప్రదానాదివిధిః.

నినయే దథ దర్భేషు నామగోత్రానుకీర్తనైః | తేషు దర్భేషు స్వం హ స్తం నిమృజ్యా ల్లేపభాగినామ్‌. 39

తథైవ చ తతః కుర్యా త్పునః ప్రత్యవనేజనమ్‌ | పిణ్డా నేతా న్నమస్కృత్య గన్ధధూపార్హణాదిభిః. 40

ఏవ మావాహ్య తత్సర్వం వేదమన్రై ర్యథోదితైః | ఏకాగ్నే హ్యేక ఏక స్వా న్ని ర్వాపోర్వికా తథా. 41

తతః కృత్వా న్తరై ర్దద్యా త్తత్పత్నీభ్యః కుశా న్బుధః | తద్వ త్పిణ్డాదికం కుర్యా దావాహనవిసర్జనమ్‌. 42

తతో గృహీత్వా పిణ్డభ్యో మాత్రా స్సర్వాః క్రమేణ తు |

తానేవ విప్రా న్ప్రథమం ప్రాశ##యే ద్యత్నతో నరః. 43

యస్మా దగ్నౌ ధృతా మాత్రా భక్షయన్తి ద్విజాతయః |

అన్వాహార్యక మిత్యుక్తం తస్మా దన్నం న బక్షయేత్‌. 44

పూర్వం దత్వాతు తద్ధస్తే సపవిత్రం తిలోదకమ్‌ | తత్పిణ్డగ్రాం ప్రయచ్ఛేత్తు స్వధైషామస్త్వితి బ్రువన్‌. 45

వర్ణయ న్భోజయే దన్న ముష్ణం పూతం చ సర్వదా |

వర్జయేత్తు త్వరాం క్రోధం స్మర న్నారాయణం హరిమ్‌. 46

తృప్తా న్జాత్వా తతః కుర్యా ద్వికిరం సర్వ మన్తికే | సోదకం చాన్న ముద్ధృత్య సలిలం ప్రోఇపే ద్భువి. 47

ఆచాన్తేషు పున ర్దద్యా జ్జలపుష్పాక్షతోదకమ్‌ | స్వస్తివాచనికం సర్వం పిణ్డోపరి సమాచరేత్‌. 48

దేవాద్యన్తం ప్రకుర్వీత శ్రాద్ధనాశోన్యధా భ##వేత్‌ | విసృజ్య విప్రా న్ర్పణత స్తేషాం కృత్వా ప్రదక్షిణమ్‌.

దక్షిణాం దిశ మాకా న్పితౄ న్యాచేత మానవః | దాతారో నోభివర్ధన్తాం వేదస న్తతిరేవ నః. 50

శ్రద్ధా చ నో మా వ్యగమ ద్బహు దేయంచనోస్త్వితి | అన్నం చ నో బహు భ##వే దతిథీంశ్చ లభేమహి.

యాచితారశ్చ న స్సన్తు మా చ యాచిష్మ కంచన | ఏతచ్చ సతతం ప్రోక్త మన్వాహార్యం తు పార్వణమ్‌.

యథేన్దుసంక్షయే తద్వ దన్యత్రాపి నిగద్యతే | పిణ్డాంస్తు గోజవిప్రేభ్యో దద్యా దగ్నౌ జలేపి వా. 53

విప్రాగ్రతో వా వికిరే ద్వయోభిరథవా೭೭శ##యేత్‌ | పత్నీ తు మద్యమం పిణ్డం ప్రాశ##యే ద్వినయాన్వితా

ఆధ త్త పితరో గర్భం కుమారం పుష్కరస్రజమ్‌ | యథేహ పురుషో సది త్యన్నం సన్తానవర్ధనమ్‌. 55

తావ న్నిర్వా పణం విద్యా ధ్యావ ద్విప్రా విసర్జితాః | వైశ్వదేవం తతః కుర్యా న్నిర్వృత్తే పితృకర్మణి. 56

ఇష్టై స్సహ తత శ్శాన్తో భుఞ్జీత పితృ సేవితమ్‌ | పున ర్భోజన మధ్వానం యాన మాయాసమైథునమ్‌. 57

శ్రాద్ధకృ చ్ఛ్రాద్ధభుక్చైవ సర్వ మేత ద్వివర్జయేత్‌ | స్వాధ్యాయం కలహం వైరం దివా సుప్తం చ సర్వదా. అనేన విధినా శ్రాద్ధం నర స్త్వబ్దే వినిర్వపేత్‌ | కన్యాకుమ్భవృషస్థేర్కే కృష్ణపక్షే తు సర్వశః. 59

యత్ర యత్ర ప్రదాతవ్యం సపిణ్డీకరణాత్మకమ్‌ | తత్రానేన విధానేన దేయ మగ్నిమతా సదా. 60

ఇతి శ్రీ మపత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదే శ్రాద్ధకల్పే

నిమన్త్రణాది కథనం నామ షోడశోధ్యాయః.

శ్రద్ధక ర్తయగు విప్రుడు భోక్తలుగా కూర్చున్న విప్రులను అర్ఘ్యము మొదలగు వాటితో దేవ పూర్వకముగా (మొదట విశ్వ దేవ స్థనామున తరువాత పితృ స్థానమున) అర్చనము జరుపవలెను. తరువాత ఆవిప్రుల అనుమతి పొంది తరువాత చరువు (హోమమునకై ఉంచిన ద్రవ్యము)ను కంచు పాత్రలోనికి తీసికొని దానిని తన గృహ్య సూత్రములందు చెప్పబడియున్న విధమున అగ్నౌ కరణము చేయవలయును. సంప్రదాయమును ఎరిగిన వాడు (అగు గృహస్థుడు) ఈ అగ్నౌకరణముచే అగ్నీషోమయములకు తృప్తి కలిగించవలయును. శ్రాద్ధక ర్తయగు ద్విజోత్తముడు ఏకాగ్ని (వాన ప్రస్థుడు) ఐనచో దక్షిణాగ్నిని (దీనినే అన్వాహార్య పచనాగ్ని యనియు లౌకికాగ్ని అనియు వ్యవహరింతురు.) ప్రణయనము (ప్రజ్వలనము) చేసి దానియందు ఈ అగ్నౌ కరణము జరుపవలెను. ఈ సందర్భములో పర్యుక్షణము అమంత్రకముగా ఏ ఇతర ప్రక్రియ లేకుండ అగ్ని హోత్రుని చుట్టును నీటిని చిలుకరించుట) మొదలగునవి యజ్ఞోపవీతి (ఎడమ భుజము మీదుగా సవ్యముగా జందెముధరించినవాడు) అయి చేయవలెను. మిగిలినది అంతయు ప్రాచీనావీతి (కుడి భుజము మీదుగ జందెముధరించినవాడు-అప సవ్యముగా) అయి చేయవలెను.

అగ్నౌకరణము చేయగా మిగిలిన హవిః శేషము నుండి ఆరు పిండములను చేయవలెను. ఎడమ చేతితో నూవులతో కూడిన ఉదక పాత్రను పట్టుకొనవలెను. పిమ్మట అపసవ్యము చేసికొని దర్భలతో రేఖను ( నిలువుగా దక్షిణాగ్రములుగా దర్భలను పరచుట) చేయవలెను. పిమ్మట చేతితో దర్విని పట్టుకొని దానితో ఆ చోటు అవనేజనము (నీటితో తడుపుట) చేయవలెను. ఇది యంతయు దక్షిణ ముఖముగా తిరిగియే చేయవలెను. తరువాత దర్భలపై ఒక్కొక్క పిండమునే వారివారి నామ గోత్రములను చెప్పుచు ఉంచవలెను. తరువాత లేపభాక్కుల (చేతికి అంటుకొనిన పిండపు అంటు అర్పించుటతోనే తృప్తిపడవలసిన వారు.) నిమిత్తమై శ్రాద్ధకర్త ఆదర్భల పైతన చేతులను కొద్ది నీటితో కడుగుకొనవలెను. తరువాత మరల ప్రత్యవనేజనము (మరల నీటితో తడుపుట) చేయవలెను. గంధ ధూపములు దీపము నై వేద్యము మొదలగు అర్చనలతో పిండములను అర్చించి వాటిని నమస్కరించవలెను. ఇది యంతయు వారివారి గృహ్య సూత్రములందు చెప్పబడిన విధమున బ్రహ్మణులందు విశ్వదేవులను పితృదేవతలను ఆవాహనము చేసి జరుపవలెను. ఏకాగ్నియగు (వాన ప్రస్థుడగు) శ్రాద్ధకర్త మాత్రము దర్వితో ఒకే వడ్డన చేసిన చాలును.

ఇట్లు పురుషులగు పితరులకు పిండదానము చేసిన తరువాత వారి పత్నులకు దర్భలు మొదలైన వాటిని ఆ పిండములు మొదలైన వానిని ఆవాహనమును విసర్జనమును జరుపవలెను. తరువాత పిండముల నుండి అల్పాంశములను తీసికొని ప్రతియొక భాగమును భోక్తలచే తినిపించవలెను.

ద్విజులయినవారు అగ్ని యందు వేల్చగా మిగిలిన శేషమునే (అగ్నౌకరణము కాని హోమము కాని చేసిన తరువాతనే) ఆహారమును తిందురు. కావున అట్టి అగ్నిహవన శేషమునకు అన్వాహార్యకము అని పేరు కనుక భోక్తలకు హవన శేషము కాని అన్న మును తినిపించరాదు.

మొదట భోక్తల హస్తమున పవిత్రముతో కూడ తిలోదకమును విడువవలెను. తరువాత ఆ పిండమాత్రను (పిండపుతునుకను) 'స్వధా ఏషాం అస్తు' అని చెప్పుచు వారి చేతియందుంచవలెను.

ఎల్లప్పుడును అన్నము పవిత్రముగాను ఉష్ణముగాను ఉండునట్లు చూచి ఆ విషయమును వర్ణించుచు భోక్తలచే భుజింపజేయవలెను. త్వరపెట్టుట కాని క్రోధము కాని లేకుండ హరినామన్మరణ చేయుచు భోక్తలకు భుజింపజేయవలెను.

వారు భుజించి తృప్తి నొందినట్లు తెలిసిన తరువాత వికిరాన్నమును వారి దగ్గర (సమంత్రకముగా) ఉంచవలెను. ఉదకముతో కూడ అన్నము తీసికొని నీటిని మాత్రము భూమిపై వదలవలెను.

ఈ స్వస్తి వాచనికము (శుభమును కలిగించుటకై చేయు ప్రక్రియ) అంతయు పిండముల మీద చేయవలెను. శ్రాద్ధ ప్రక్రియ అంతయు విశ్వేదేవులతో ఆరంభించి వారితోనే ముగియున్నట్లు జరుపవలెను. లేనిచో శ్రాద్ధ నాశము జరుగును.

భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పవలెను. వారికి ప్రదక్షిణము చేయవలెను. తరువాత దక్షిణ దిశగా తిరిగి పితృ దేవతలను ఉద్దేశించి ఇట్లు వేడుకొనవలెను. ''(తమంతట తామే ఇచ్చు) మా దాతలు వృద్ధి నొందుదురు గాక! మా వేద సంతతి (పరంపర) వర్ధిల్లుగాక ! మా చిత్తములందు శ్రద్ధ (ఆస్తికతా బుద్ధి) తొలగక నిలిచియుండుగాక! మేము అధికముగా దానము చేయుదుముగాక! మాకు అన్నము అధికముగా లభించుగాక! (మా ఆతిథ్యము అందుకొనుటకు) అతిథులును మాకు లభింతురుగాక! మమ్ములను యాచించు వారు (చాల మంది) ఉందురుగాక! మేము ఎవ్వరిని యాచింపకుందుముగాక ! అయాచితముగా వచ్చిన దానితో తృప్తి నొందెదము గాక !)''

ఇది అన్వాహార్య పూర్వకమగు పార్వణ శ్రాద్ధ విధానము. ఈ ప్రక్రియ అమావాస్య నాడు జరుపవలసిన శ్రాద్ధమునకు సంబంధించినది. ఇతర పర్వ దినములందును పార్వణ శ్రాద్ధము ఇట్లే జరుపవలెను.

శ్రాద్ధము అంతయు ముగిసిన తరువాత పిండములను గోవులకో మేకలకో బ్రాహ్మణులకో తినుటకు ఈయవలెను. లేదా అగ్నిలోనో నీటిలోనో వేయవలెను. బ్రాహ్మణుల ముందయినను వెదజల్లవలెను. పక్షులకైన ఆహారముగా వేయవలెను. శ్రాద్ధ కర్తయొక్క భార్య మాత్రము నడిమి పిండమును వినయముతో తినవలెను. తినునన్పుడు ''ఓ పితృ దేవతలారా ! నా గర్భమున పద్మ మాలికల ధరించు కుమారుని కలుగజేయుడు.'' భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పి పంపువరకు ఉచ్ఛేషణమును (ఎంగిళ్ళను) ఉంచవలెను. (తరువాత అది తీసి శుద్ధి చేయవచ్చును.)

ఇట్లు పితృ కార్యము ముగిసిన తరువాత వైశ్వ దేవమును జరుపవలెను. తరువాత కర్త తన ఇష్టులతో కలిసి పితృ శేషమును భుజించవలెను శ్రాద్ధ దినమున శ్రాద్ధక ర్తగాని శ్రాద్ధమున బోక్తగా ఉండువారు కాని ఈ చెప్పబోవు వానిని చేయరాదు: మరల భోజనము చేయుట-దారి ప్రయాణమ చేయుట-వాహనములపై పయనించుట-శ్రమ కలిగించు పనులు-స్త్రీ సంగమము-స్వాధ్యాయము-కలహము-విరోధపు పనులు-పగటి నిద్ర- ఇవి చేయకూడదు.

ప్రత్యాబ్దిక శ్రాద్ధమును కూడ ఇదే విధముగా జరుపవలెను. సూర్యుడు కన్యా కుంభ వృషభ రాసులలో ఉండగాను ఏ కృష్ణ పక్షమునందే కాని సపిండీకరణము జరుపు సందర్భములందు కాని అగ్నిమంతుడు అగువాడు (సంన్యాసి కాక మిగిలిన ఆశ్రమముల వారు) ఇట్లే శ్రాద్ధము జరుపవలెను.

ఇది శ్రీమత్స్యమమాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్ధ కల్పమున నిమంత్రణాది కథనమను షోడశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters