Sri Matsya Mahapuranam-2    Chapters   

ఏక పఞ్చాశదుత్తర ద్విశతతమో7ధ్యాయః.

వాస్తు శాస్త్రప్రారమ్భః.

ఋషయః : ప్రాసాదభవనాదీనాం నివేశం విస్తరా ద్వద| కుర్యా త్కేన విధానేన కశ్చ వాస్తు రుదాహృతః. 1

సూతః : భృగు రత్రి ర్వసిష్ఠశ్చ విశ్వకర్మా మయ స్తథా| నారదో నగ్నజిచ్చైవ విశాలాక్షః పురన్దరః. 2

బ్రహ్మా కుమారో నన్దీశ శ్శౌనకో గర్గ ఏవ చ| వాసుదేవో 7నిరుద్ధశ్చ తథా శుక్రో బృహస్పతిః. 3

అష్టాదశైతే విఖ్యాతా వాస్తుశాస్త్రోపదేశ కాః| సఙ్‌క్షేపేనో పదిష్టం య న్మనవే మత్స్యరూపిణా. 4

తదిదానీం ప్రవక్ష్యామి వాస్తుశాస్త్ర మనుత్తమమ్‌|

రెండు వందల ఏబది ఒకటవ అధ్యాయము.

వాస్తు శాస్త్రము- వాస్తూత్పత్తి.

ఋషులు సూతునిట్లడిగిరి : ప్రాసాదములు భవనములు మొదలగు వాని నిర్మాణమును వాని సన్నివేశమును (అమరికను) ఎట్లుచేయవలెనో విస్తరముగ తెలుపుము ; వాస్తుపురుషుడన నెవరు? అనసూతుడిట్లు చెప్పసాగెను.

భృగుడు అత్రి వసిస్ఠుడు విశ్వకర్మ మయుడు నారదుడు నగ్నజిత్‌ విశాలాక్షుడు పురందరుడు బ్రహ్మ- కుమారుడు- సందీశుడు శౌనకుడు గర్గుడు వాసుదేవుడు అనిరుద్ధుడు శుక్రుడు బృహస్పతి- ఈ పదునెనిమిదిమందియు వాస్తుశాస్త్రములనుపదేశించిన (మొదట ప్రవర్తిల్లజేసినారు) వారు; ఇది అనుత్తమ (దీనికంటె గొప్పదిలేని) శాస్త్రము; దీనినిపుడు మీకు తెలిపెదను.

వాస్తూత్పత్తిః.

పురా7న్ధకవధే ఘోరే ఘోరరూపస్య శూలినః. 5

లలాట స్వేదసలిల మపత ద్భువి భీషణమ్‌| కరాళవదనం తస్మా ద్భూత ముద్భూత ముల్బణమ్‌. 6

గ్రసమాన మివాకాశం సప్తద్వీపాం వసున్దరామ్‌| తతో న్ధకానాం రుధిర మపిబ త్పతితం క్షితౌ. 7

తేన త త్సమరే సర్వం పతితం య న్మహీతలే| తథా7 పి తృప్తి మమ త్తధ్బూతం న యదా తదా. 8

సదాశివస్య పురత స్తప శ్చక్రే సుదారుణమ్‌| క్షుదావిష్టం తు తద్భుతం మాహర్తుం జగతీత్రయమ్‌. 9

తతః కాలేన సన్తుష్టో భైరవ స్తస్య చాహ వై | వరం వృణీష్వ భద్రన్తే యదభీష్టం తవా 7నఘ.10

తమువాచ తతో భూతం త్రైలోక్యగ్రసనక్షమమ్‌| భవామి దేవదేవేశ తథేత్యుక్తం చ శూలినా. 11

తతస్తు త్రిదివం సర్వం భూమణ్డల మశేషతః| స్వదేహేనానర్తిక్షంచ రున్ధానం ప్రాపతుద్భువి. 12

భీతభూతై స్తతో దేవై ర్బ్రహ్మాణా చైవ శూలినా| దానవాసురరక్షోభి రవష్టబ్ధం సమన్తతః. 13

యేన యత్రైవ చాక్రాన్తం స త్త్రైవాభవ త్పునః. నివాసా త్సర్వదేవానాం వాస్తు రిత్యభిధీయతే. 14

అవష్టబ్ధేన తేనాపి విజ్ఞప్తా స్సర్వదేవతాః| ప్రసీదధ్వం సురా స్సర్వే యుష్మాభి ర్నిశ్చలీకృతః. 15

స్థాస్యా మ్యహం కిమాహారో హ్యావష్టబ్ధో హ్యధో ముఖః| తతో బ్రహ్మాదిభిః ప్రోక్తం వాస్తుమద్యే తు యో బలిః. 16

ఆహారో వైశ్వదేవాన్తే నూన మస్య భవిష్యతి| ఆజ్ఞానాత్తు కృతే యజ్ఞ స్తవాహారో భవిష్యతి. 17

యజ్ఞోత్సవాదౌ చ బలి స్తవాహారో భవిష్యతి| వాస్తుపూజా మకుర్వామ స్తవాహారో భవిష్యతి. 18

ఏవ ముక్త స్తతో హృష్ట స్స వాస్తు రభవ త్తదా| వాస్తుయజ్ఞ స్స్మృత స్సస్మాత్తః ప్రభృతి శాన్తయే. 19

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ వాస్తుశాస్త్రే వాస్తూత్పత్తికథనం నామ

ఏకపఞ్చాశదుత్తర ద్విశతతమోధ్యాయః.

వాస్తుపురుషోత్పత్తి.

పూర్వము ఘోరమగు అంధకాలురవధమందు ఘోరరూపుడగు శూలి( శివుని) లలాటమునుండి భువిపై భయంకర మగు చెమటనీరు పడెను. దానినుండి భయంకరముఖముగలదియు భయంకరమును అగు సప్తద్వీప సహితయగు భూమిను ఆకాశమున కూడ మ్రింగుచున్నదో యనునట్లు ఆకలితోనున్న భూతమొకటి యుత్పన్నమయ్యెను; అంతటనది భూమిపై పడిన అంధకుల రక్తమును త్రావెను; అది అంతయుత్రావినను దానికి తృప్తికలుగలేదు; క్షుదావిష్టమగు అభూతమంతట సదా శివుని ముందే జగగతీత్రయమును తాను దినునట్లు వరమందదలచి దారుణతపమొనరించెను. కొంతకాలమునకు భైరవ రూపుడగు సదాశివుడు సంతుష్టుడై అనఘా! నీవు భపడకుము ; నీ కభీష్టవరము ఏదియో కోరుకొనుము; అనగా ఆ భూతము దేవదేవేశా! నేను

త్రైలోక్యమును మ్రింగజాలిన దానను కాగోరుచున్నాను. అనెను. శూలియు సరేయనెను ; అంతట అది ఆశేషముగ సర్వభూమండలమును అంతరిక్షమును స్వదేహముతో (క్రమ్మివేయుచు) అడ్డగించుచు నేలపై పడెను. ఎవరెచ్చట దానినా క్రమించిరో దాని ఆదేహాంశమచ్చటనే ఉండిపోయెను; సర్వదేవాదుల -నివాసమయినందున ఆ భూతమునకు 'వాస్తు' (వానస్థానము) అను పేరు వచ్చెను; అట్లు త్రొక్కివేయబడి అణచిపెట్టబడిన ఆ భూతము సర్వ దేవతలతో ఇట్లనెను : సర్వదేవతలారా! నన్ననుగ్రహించుడు మీరు నన్ను కదలకుండ జేసితిరి; ఇట్లు త్రొక్కివేయబడి అధోముఖుడనైన నాకు ఏది ఆహారమయినేమందును? అనగా బ్రహ్మాదులిట్లనిరి ; వైశ్వదేవమాచరించు గృహ స్థుడు వైశ్వదేవాంతమున వాస్తు(గృహ) మధ్యమున వేయు బలియు వాస్తూపశమన యజ్ఞహవిస్సును యజ్ఞోత్సవాదులయందు వేయువాస్తుబలియు వాస్తుపూజ ఆచరించనివాడును అజ్ఞానపూర్వకముగ చేయు యజ్ఞమును నీకాహారమగును; అనగా ఆ వాస్తు పురుషుడు హర్షమందెను; అది మొదలుకొని శాంతికై వాస్తుపూజ నాచరించుట ఆరంభమయ్యెను.

ఇది శ్రీ మతస్య మహాపురాణమున వాస్తుశాస్త్రమున వాస్తూత్పత్తి కథనమను

రెండు వందల ఏబది యొకటవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters