Sri Matsya mahapuramu-2    Chapters    

ఓమ్‌.

శ్రీరస్తు.

శ్రీ మత్స్య మహాపురాణమ్‌

పఞ్చచత్వారింశదుత్తరశతతమోధ్యాయః.

తారకాసురవధకథా ప్రారమ్భః.

ఋషయః : కథం మత్స్యేన కథిత స్తారకస్య వధో మహా& | కస్మిన్కాలే వినిర్వృత్తః కథయ నూతనన్దన.

త్వన్ముఖక్షీరసిన్ధూత్థా కథేయ మమృతాత్మికా | కర్ణాభ్యాం పిబతాం తృప్తి రస్మాకం న ప్రజాయతే. 2

ఇదం మునే! సమాఖ్యాహి మహాబుద్ధే మనోగతమ్‌ |

సూతః పృష్టస్తు మనునా దేవో మత్స్యరూపీ జనార్దనః. 3

కథం శరవణ జాతో దేవ ష్షడ్వదనో విభుః | ఏతత్తు వచనం శ్రుత్వా పార్థివస్యామితౌజనః. 4

ఉవాచ భగవాన్ర్పీతో బ్రహ్మసూనుర్మహామతిం | వజ్రాజ్గోనామ దైత్యోభూ త్తస్యపుత్త్రస్తు తారకః. 5

సురా నుద్వా నుద్వాసయామాస పురేభ్య స్స మహాబలంః| తతస్తే బ్రహ్మణో7భ్యాశం జగ్ము ర్భయనిపీడితాః. 6

భీతాంశ్చ త్రిదశాన్దృష్ట్వా బ్రహ్మా తేషా మువాచహ |

సన్త్యజధ్వం భయం దేవా శ్శజ్కరస్యాత్మజ శ్శిశుః 7

తుహినాచలదౌహిత్ర స్స హనిష్యతి దానవమ్‌ | కాలే కస్మింశ్చి దుద్వాహ్య శైలరాజసుతాం శివః. 8

స్వరేతో వహ్నివదనే వ్యసృజ త్కారణాన్తరే | తత్ర్భాప్తం వహ్నిర్వదనే రేతో దేవా న్త్సమర్పయత్‌. 9

విదార్య జఠరాణ్యషా మజీర్ణం నిర్గతం మునే | పతితం తత్సరోవర్యే తస్మింస్తు శరకాననే. 10

తస్మా త్సతు సముద్భూతో గుహో దినకరప్రభః | స సప్తదివసో బాలో నిజఘ్నే తారకాసురమ్‌. 11

ఏవం శ్రుత్వా తతో వాక్యం తమూచు రృషిసత్తమాః |

ఋషయః : అత్యాశ్చర్యవతీ రమ్యా కథేయం పాపనాశినీ. 12

విస్తరేణ హి నో బ్రూహి యథాతథ్యేన శృణ్వతామ్‌ | వజ్రాజ్గోనామ దైత్యేన్ద్రః కస్య వంశోద్భవః పురా.

యస్యాభూత్తారకః పుత్త్ర స్సురప్రమథనో బలీ | నిర్మితః కో వధేభూచ్చ తస్య దైత్యేశ్వరస్య తు. 14

గుహజన్మతు కార్త్స్నేన అస్మాకం బ్రూహి మానద |

శ్రీరస్తు.

శ్రీమత్స్యమహాపురాణము.

నూట నలుపదియైదవ అధ్యాయము.

తారకాసుర వధ కథారంభము.

మరుత్తులు వజ్రాంగుడు మొదలగువారు జన్మించుట.

ఋషులు సూతుని ఇట్లడిగిరి : సూత కుమారా ! తారకాసుర వధము ఎప్పుడు జరిగెను? ఈ మహావిషయమును మత్స్యరూపుడగు నారాయణుడు తెలిపిన విధమున మాకు నీవు తెలుపుము. నీనోరు క్షీరసాగరము. దానినుండి వెలువడు ఈ కథ అమృతరూపమయినది. మీరు చెప్పుచున్న కథలు ఎంత వినుచున్నను తృప్తి కలుగుటలేదు. (చాలుననిపించుట లేదు.) మహాబుద్ధిశాలియగు సూతమునీ ! మామనోగతమగు కుతూహలము తీర్చుము.

అనగా సూతుడు ఋషులతో ఇట్లు పలికెను : మనువు మత్స్యరూపుడగు నారాయణుని 'సర్వజగద్వ్యాపియు సర్వ సమర్థుడును (విభుః) అగు షణ్ముఖుడు (కుమారస్వామి) శరవణమున (ఱల్లుగుబురులలో) ఎట్లు జన్మించెను?' అని అడిగెను. అమితమగు ఓజస్సు (చిత్త దృఢత్వము) కల మను రాజడిగిన ప్రశ్న విని (సర్వ వేదమూర్తియగు) బ్రహ్మ దేవునికి తండ్రియగు నారాయణుడు ప్రీతుడై (తాను చెప్పినదాని తత్త్వమెరుగగల) మహామతియగు మనువుతో ఇట్లు పలికెను :

పూర్వము వజ్రాంగుడను అసురుడుండెను. అతని కుమారుడు తారకుడు. ఆ మహాబలుడు దేవతలను వారి వారి పురములనుండి వెడలగొట్టెను. వారు భయ నిపీడితులయి బ్రహ్మకడకు పోయిరి. భీతులగు దేవతలనుచూచి బ్రహ్మ వారితో ఇట్లనెను : దేవతలారా ! భయము విడువుడు. శంకరునకు ఆత్మజుడును హిమవంతునకు దౌహిత్రుడును నగు శిశివు ఆ దానవుని చంపును. అనెను.

తరువాత కొంతకాలమునకు శివుడు శైలరాజసుతను వివాహమాడెను. అతడు కారణాంతరమున తన వీర్యమును అగ్ని నోటియందు వదలెను. అగ్ని తన నోటపడిన ఆ రేతస్సు దేవతలకు అర్పించెను. (వారిది మ్రింగగా) అది వారి ఉదరములందు జీర్ణముకాక వారి పొట్టలు చీల్చివచ్చి రెల్లుదుబ్బుల నడుమ పడెను. దానినుండి రవి తేజస్కుడగు గుహుడు (కుమారస్వామి) జనించెను. ఏడు దినముల బాలుడుగా ఉండియే ఆతడు తారకాసుని చంపెను.

అనగా సూతుని వచనమును విని ఋషులిట్లనిరి : ఈ కథ మిగుల ఆశ్చర్యకరమును రమ్యమును అగుటతోపాటు పాపనాశిని అని తోచుచున్నది. (దీనియందు ఉపాసనాంశము కలదని సూచన.) నీవు ఉన్నదియున్నట్లు మాకు సవిస్తరముగ వినిపింపుము. పూర్వమందుండిన వజ్రాంగుడను దైత్యేంద్రుడెవరి వంశమందుద్భవించెను ? దేవతలను నలుగ గొట్టినవాడును బలశాలియునగు తారకుడు అతని కుమారుడయ్యెననిన ఆ వజ్రాంగుడెంటివాడో ! ఇట్టి దైత్యేశ్వరుని వధించువాడెవడయ్యెను ? స్కందుని జన్మమును మహనీయా ! మాకు సమగ్రముగావినిపింపుము.

షష్టినజ్ఖ్యాకదక్షకన్యానాం ధర్మాధిభ్యో దానాదికథనమ్‌.

సూతః : మానసో బ్రహ్మణః పుత్త్రో దక్షోనామ ప్రజాపతిః. 15

షష్టిం సోజనయత్కన్యా వైరిణ్యామేవ నశ్శ్రుతమ్‌ | దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ. 16

సప్తవింశతి సోమాయ చతస్రోరిష్టనేమయే | ద్వేచైవ భృగుపుత్త్రాయ ద్వేచాన్యేజ్గిరసే తథా. 17

ద్వే కృశాశ్వాయ విదుషే ప్రజాపతిసుతాః ప్రభుః | అదితి ర్దితి ర్దను ర్వాశ్వారిష్టావానాయుషా తథా. 18

సురభి ర్వినతా చైవ తామ్రా క్రోధవతీ ఇరా | కుహూర్‌మునిశ్చ లోకస్య మాతరో గోషు మాతరః. 19

తాసాం సకలలోకానాం జజ్గమస్థావరాత్మనామ్‌ | జన్మనామప్రకారాణాం తాభ్యోన్యే దేహిన స్స్మృతాః. 20

దేవేన్ద్రోపేన్ద్రపూర్వాద్యా స్సర్వే హ్యదితిజా మతాః | దితే స్సకాశా ద్దైత్యాహి హిరణ్యకశిపాదయః. 21

దానవాశ్చ దనోః పుత్త్రా గావశ్చ సురభేస్సుతాః | పక్షిణో వినతాపుత్త్రా గరుడప్రముఖా స్స్మృతాః. 22

నాగాః కద్రూసుతా జ్ఞేయా శ్శేషాభ్యోన్యేపి జన్తవః | త్తైలోక్యనాథం శక్రంతు సర్వాసురగణప్రభుమ్‌.

హిరణ్యకశిపు శ్చక్రే జిత్వా రాజ్యం మహాబలః | తతః కేనాపి కాలేన హిరణ్యకశిపాదయః. 24

నిహతా విష్ణునా సజ్ఖ్యే శేషా శ్చేన్ద్రేణ దానవాః |

దిత్యామేకోనపఞ్చాశన్మరుదుత్పత్తిః.

తతో నిహతపుత్త్రాచ దితిర్వర మయాచత. 25

భర్తారం కశ్యపం దేవం పుత్త్రమన్యం మహాబలమ్‌ | సమయే శక్రహన్తారం స తస్యా మపద త్ర్పభుః.

అనగా విని సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : బ్రహ్మమానస పుత్రుడగు దక్షుడను ప్రజాపతికి వైరిణియను పత్నియందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. అతడు వారిలో పదిమందిని ధర్మునకును పదుముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడుమందిని సోమునకును నలుగురును అరిష్టనేమికిని ఇద్దరను భృగుపుత్త్రునకును ఇద్దరను అంగిరసునకును ఇద్దరను కృశాశ్వునకును ఇచ్చెను.

అదితి దితి దనువు విశ్వా అరిష్టా - సురసా సురభి వినతా తామ్రాక్రోధవశా ఇరాకద్రూముని అను ఈ పదుముగ్గురును కశ్యపుని పత్నులు; వీరు లోకమాతలు అని ప్రసిద్ధలు. గో(పశు) జాతియు స్థావర జంగమాత్మకమగు ఇతర ప్రాణి సమూహమును ఇతరములగు నానా ప్రకారములగు ప్రాణులును ఈ పదముగ్గురనుండియే జనించెను. దేవేంద్రుడు ఉపేంద్రుడు (వామన విష్ణువు) పూష (మొదలగు ఆదిత్యులు) మొదలగు వారికి అందరకును అదితి తల్లియయ్యెను. దితివలన హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు జన్మించిరి. దనువు అనునామె గర్భమున దానవులు జన్మించిరి. సురభి అనునామెకు గోవులు జన్మించెను. వినతకు గరుడుడు మొదలగు పక్షులు కలిగెను. కద్రువకు నాగులు కలిగెను. మిగిలిన కశ్యప పత్నులకు మిగిలిన ప్రాణులు జనించెను.

మహాబలుడగు హిరణ్యకశిపుడు త్తైలోక్యనాథుడగు ఇంద్రుని గెలిచి ఆ రాజ్యమును తానే ఏలసాగెను. తరువాత కొంతకాలమునకు హిరణ్యకశిపుడు మొదలగువారు విష్ణుని చేతిలోను మిగిలిన దైత్యదానవులు ఇంద్రుని చేతిలోను మరణించిరి. తరువాత హతపుత్త్రయగు దితి తన భర్తయు దేవుడునగు కశ్యపుని మహాబలుడును శక్రుని చంపు వాడునునగు మరియొక కుమారుని వరముగా నిమ్మనెను. సర్వసమర్థుడగు ఆ కశ్యపుడామెతో ఇట్లనెను :

నియమే వర్త హేదేవి! సహస్రం శుచిమానసా | వర్షాణాం లప్స్యసే పుత్త్రమిత్యుక్తా సా తథాకరోత్‌. 27

వర్తన్త్యా నియమే తస్యా స్సహస్రాక్ష స్సమాహితః | ఉపాసా మాచరం స్తస్యాః సాచైన మనుమన్యత. 28

దశవత్సరశేషస్య సహస్రస్య తదా దితిః | ఉవాచ శక్రం సుప్రీతా వరదా తపసి స్థితా. 29

దితిః : పుత్త్రోత్తీర్ణాం వ్రతప్రాయాం విద్ధి మాం పాకశాసన! భవిష్యతిచ తే భ్రాతా తేనసార్ధ మిమాంశ్రియమ్‌.

భుజ్ష్వవత్స! యథాకామం త్రైలోక్యం హతకణ్టకమ్‌ | ఇత్యుక్త్వా నిద్రయా೭೭విష్టా చరణాక్రాన్తమూర్ధజా. 31

స్వయంసుష్వాప నియతా భావినోర్థస్య గౌరవాత్‌ | తస్తు రన్ధ్రం సమాసాద్య జవనా త్పాకశాసనః. 32

చకార సప్తధా గర్భం కులిశేనతు మాయయా | ఏకైకంతు పునః ఖణ్డం చకార మఘవాం స్తతః. 33

సప్తధా సప్తధా కోపా దబుద్ధ్యత తతో దితిః | విబుద్దోవాచ మా శక్ర ఘాతయేథాః ప్రజాం మమ. 34

తచ్ఛ్రుత్వా నిర్గతశ్శక్ర స్థ్సిత్వా ప్రాఞ్జలిరగ్రతః | ఉవాచ వాక్యం సస్త్రస్తో మాతుర్వై శనకైరిదమ్‌. 35

శక్రః : దివాసుప్తివరా మాతా పాదాక్రాన్తశిరోరుహా | సప్తసప్తభిరాఘాత స్తవ గర్భః కృతో మయా. 36

ఏకోనపఞ్చాశద్భాగా వజ్రేణౖతేన తే శుభాః | దాస్యామి తేషాం స్థానాని దివి దైవతపూజితే. 37

కశ్యపంప్రతి దితేః పుత్త్రాన్తరప్రార్థనా.

ఇత్యుక్తా సా తదాదేవీ నాభ్యభాషత వై దితిః | పునశ్చ దేవం భర్తార మువాచ దితిర్‌దుఃఖితా. 38

పుత్త్రం ప్రజాపతే! దేహి శక్రజేతార మూర్జితమ్‌ | యేనాస్త్రశస్త్రావధ్యత్వం గచ్ఛేత్త్రిదివవాసినామ్‌. 39

ఇత్యుక్తస్స తథోవాచ తాం పత్నీ మతిదుఃఖితామ్‌ | దశవర్షసహస్రాణి తపోనిష్ఠా ప్రలప్స్యసే. 40

వజ్రసారమయైరజ్గై శ్చాద్యైరపయవైర్దృఢైః | వజ్రాజ్గోనామ పుత్త్రస్తే భవితా పుత్త్రవత్సలే. 41

దేవీ ! వేయేండ్లు శుచి మనస్కవై నియమముతో నుండుము. కుమారుని పొందుదువు. అనగా ఆమె అట్లే చేయనారంభించెను. ఆ కాలమున ఇంద్రుడు సమాహితచిత్తుడై ఆమెను సేవింపసాగెను. ఆ సేవ అంగీకరించెను. వేయిటికి పదిఏండ్లు కొరత ఉండగా తపస్సునందున్న దితి మిగుల ప్రీతురాలయి వరమునీయదలచి ఇంద్రునితో ఇట్లు పలికెను : పాకశాసనా : నావ్రతము దాదాపు ముగిసినదని ఎరుగుము. నీకు భ్రాత కలుగును. అతనితో కలిసి వత్సా ! త్రైలోక్యమును నిష్కంటకముగా యథేచ్ఛగా అనుభవించుము.

ఇట్లు పలికి ఇన్నాళ్ళు నియమములతో ఉండిన దితి కానున్న విషయము బలవత్తరమగుటచే (కాబోలు) నిద్రావేశమున తన జుట్టు ముడివీడి వెంట్రుకలపై తన కాళ్ళు పడి తగులుచున్న ఎరుగక గాఢ నిద్రపోయెను. ఈ అశుచిత్వపు అవకాశము దొరుకగనే ఇంద్రుడు వేగముగా మాయతోవజ్రముతో దితిగర్భమును ప్రవేశించి గర్భమును ఏడుగా చేసెను. అతడు కోపముకొలది వాటిలో ఒక్కొక్క దానిని మరల ఏడేసి ముక్కలు చేసెను.

అంతలో దితికి మెలకువ వచ్చి 'ఇంద్రా : నా సంతానమును చంపవలదు.' అనెను. అది విని ఇంద్రుడు బయటకు వచ్చి ప్రాంజలియై ఎదుట నిలిచి భయపడుచు తల్లితో మెల్లగా ఈ వాక్యమును పలికెను : తల్లీ ! నీవు కేశములను పాదాలతో ఆక్రమించి పగలు నిద్రించుచుంటివి. (రెండు దోషములు) ఈ అవకాశముతో నేను నీ గర్భమును ఈ వజ్రముతో ఏడుఏడులు నలువది తొమ్మిది ముక్కలుగా చేసితిని. వారు శుభులు. దేవతా పూజితమగు ద్యులోకమున వారికి స్థానముల నిచ్చెదను. ఇంద్రుడిట్లు పలుకగా దితి ఏమియు మారు పలుకలేదు. ఆమె మరల దేవుడగు తన భర్తతో దుఃఖముతో ఇట్లు పలికెను. ప్రజాపతీ ! ఇంద్రుని జయించగలవాడు స్వర్గవాసుల శస్త్రాస్త్రముల కవధ్యుడు బలశాలియగు కుమారు (నింకొకని) నిమ్ము. అది విని అతి దుఃఖితయగు పత్నితో అతడిట్లనెను : పుత్త్రవత్పలా ! నీవు పదివేలయేండ్లు నిష్ఠాపరురాలవయినచో అట్టి పుత్త్రుని పొందెదవు. వజ్రసారమయములగు దృడావయవములతో వజ్రాంగుడను పుత్త్రుడు నీకు కలుగును.

సాతు లబ్ధవరా దేవీ జగామ తపసే వనమ్‌ | దశవర్షసహస్రాణి సా తపో ఘోర మాచరత్‌. 42

వజ్రాజ్గోత్పత్తిః.

తపసోన్తే భగవతీ జనయామాస దుర్జయమ్‌ | పుత్త్ర మప్రతికర్మాణ మజేయం వజ్రదుశ్ఛిదమ్‌. 43

న జాతమాత్ర ఏవాభూ త్సర్వశస్త్రాస్త్రపారగః | ఉవాచ మాతరం భక్త్యా మాతః కింకరవాణ్యహమ్‌. 44

తమువాచ తతో హృష్టా దితి ర్దైత్యాధిపంచ సా | బహవో మే హతాః పుత్త్రా స్సహసాక్షస్య వర్చసా. 45

తేషాం త్వం ప్రతికర్తుంవై గచ్ఛ శక్రవధాయచ | బాఢ మి త్యేవ తాముక్త్వా జగామ త్రిదివం బలీ.

బద్ద్వా తతః | సహసాక్ష్రం పాశేనామోఘవర్చసా. 46

మాతురన్తికమాగచ్ఛద్‌ వ్యాధః క్షుద్రమృగం యథా | ఏతస్మిన్నన్తరే బ్రహ్మా కశ్యపశ్చ మహాతపాః. 47

అగతౌ తత్ర యత్రాస్తాం మాతాపుత్త్రావభీతకౌ | తతోవాక్య మువాచేదం బ్రహ్మా కశ్యపఏవచ. 48

ముఞ్చైనం పుత్త్ర దేవేన్ద్రం కిమనేన ప్రయోజనమ్‌ | అవమానో వధః ప్రోక్తః పుత్త్రః సమ్భావితస్యతు.

ఆత్మవాక్యేన యో ముక్తో విద్దితం మృత మేవచ | వరస్య గౌరవా న్ముక్తః శత్త్రణా స మహాహవే. 50

జీవన్నేవ మృతో వత్స! దివసేదివసే సతు | మహతాం వశమాయాతే వైరం నైవాస్తి వైరిణి. 51

ఏతచ్ర్ఛత్వాతు వజ్రాజ్గః ప్రణతో వాక్యమబ్రవీత్‌ | న మే కృత్య మనేనాస్తి మాతురాజ్ఞా కృతా మయా. 52

త్వం సురాసురనాధోవై మమచ ప్రపితామహః | కరిష్యే త్వద్వచో దేవః ఏష ముక్త శ్శతక్రతుః. 53

తపసో మే రతిర్దేవ! నిర్వఘ్నత్వంతు మే భ##వేత్‌ | త్వత్ర్పసాదేన భగవ న్నిత్యుక్త్వా విరరామ నః. 54

తస్మిం స్తూష్ణీం స్థితే దైత్యే ప్రోవాచేదం పితామహః

బ్రహ్మాః యతస్త్వం క్రూరమాపన్నో అస్మచ్ఛానన సంస్థితః. 56

అనయా చిత్తశుద్ధ్యా తే పర్యాప్తం జన్మనః ఫలమ్‌ | ఇత్యుక్త్వా పద్మజః కన్యాం చార్వాయతసులోచనామ్‌.

వరము పొంది ఆదేవి తపమునకై వనమునకు పోయెను. పదివేలయేండ్లు ఘెర తపమాచరించెను. అది ముగిసిన పిమ్మట ఆ భగవతికి దుర్జయుడును ఎవరికి ఏమి చేయుటకు అలవికానివాడు వజ్రముతో ఛేదింప శక్యము కానివాడు అజేయుడునగు కుమారుడు కలిగెను. అతడు పుట్టినంతనే సర్వశస్త్రాస్త్ర పారంగతుడయ్యెను. వాడు భక్తితో తల్లితో తల్లీ! నీకై ఏమి చేయుదుననెను. దితి హర్షముతో ఆ దైత్యాధిపతితో ఇట్లనెను : సహస్రాక్షు (ఇంద్రు) ని వర్చస్సుతో నా బహుపుత్త్రులు హతులయిరి. నీవు దానికి ప్రతీకారముగా పోయి ఇంద్రుని చంపిరమ్ము. అనగా సరేయని ఆమెతో పలికి ఆ బలశాలి స్వర్గమునకు పోయెను. అమోఘ శక్తిగల పాశముతో ఇంద్రుని వ్యాధుడు క్షుద్ర మృగమునువలె బంధించి తల్లికడకు తెచ్చెను. ఇంతలో ఆ తల్లి కొడుకులున్న చోటికి బ్రహ్మయు మహాతపస్వి కశ్యపుడును వచ్చిరి. వారిద్దరును అతనితో 'నాయనా ! వీనితో ప్రయోజనమేమున్నది ! ఈ దేవేంద్రుని విడుపుము. లోకమున సంభావితుడగు వానికి అవమానము వధము వంటిది. చెడుమాట అనిపించుకొని శత్రువునుండి విడిపించుకొనినవాడు చచ్చినవాడే; మహా యుద్ధమున శత్త్రుని చేజిక్కి వానినుండి ఆదరముతో విడువబడినవాడు దిన దిన క్రమమున జీవన్మృతుడగుచుండును. తనకంటె గొప్పవారగు శత్రువులకు వశీభూతుడైన శత్రువు విషయమున శత్రుత్వమింకేమున్నది ? అనిన బ్రహ్మకశ్యపుల మాటవిని ప్రణతుడై వజ్రాంగుడు ఇట్లనెను : నాకు వీనితో పనిలేదు. తల్లి ఆన నెరవేర్చితినంతే. నీవు సురాసురనాథుడవు. నాకు ప్రపితామహుడవు; దేవా ! నేను నీ మాట పాటింతును. ఇదిగో ! ఇంద్రుని వదలుచున్నాను. నాకు తపస్సునందాసక్తి కలదు. నాకు అందు నిర్నిఘ్నుత కావలయును. భగవన్‌ ! ఇదియే నేను కోరు నీయనుగ్రహము. అనగా బ్రహ్మ ఇట్లనెను : క్రూరత్వమును పొందియు నీవు నా శాసనమందు నిలిచితివి కావున నీ జన్మము ఈ చిత్తశుద్ధిచే సఫలమయినది. అని బ్రహ్మ మనోహర విశాల లోచనయగు ఒక కన్యను సృజించి ఆమె నతనికి భార్యగా ఇచ్చెను.

తామసై#్మ ప్రదదౌ దేవః పత్న్యర్థం పద్మసమ్భవః | వరాజ్గీతిచ నామాస్యాః కృత్వాయాతః పితామహః. 57

వరాజ్గీనహితవజ్రాజ్గస్య తపోవనగమనమ్‌

వజ్రాజ్గోపి తయాసార్ధం జగామ తపసే వనమ్‌ | ఊర్ధ్వాబాహు స్స దైత్యేన్ద్రోచరదష్టసహస్రకమ్‌. 58

కాలం కమలపత్రాక్ష శ్శుద్ధబుద్ధి ర్మహాతపాః | తావదవాజ్ముఖః కాలం తాపత్పఞ్ఛాగ్నిమధ్యగః. 59

నిరాహారో ఘెరతపా స్తపోరాశి రజాయత | తతస్సోన్తర్జలం చక్రే కాలం వర్షసహస్రకమ్‌. 60

జలాన్తరంప్రవిష్టస్య తస్య పత్నీ మహావ్రతా | తసై#్వవ తీరే సరస స్తత్పత్నీ మౌన మాస్థితా. 61

నిరాహారా తపోఘెరం ప్రవివేశమహాద్యుతిః |

నానారూపేణ ఇన్ద్రకృతవరాజ్గీవిభీషణమ్‌.

తస్యాం తపసివర్తన్త్యా మిన్ద్రశ్చక్రే విభీషితమ్‌. 62

భూత్వాతు మర్కటస్తత్ర తస్యాశ్రమమహద్వనం | చక్రేవిలోలంనిశ్శేషం తుమ్బీఘటకరణ్డకమ్‌. 63

తతస్తుఘెరరూపేణ కమ్పం తస్యాకరోన్మహత్‌ | తతోభుజజ్గరూపేణ బద్ధ్వా చ చరణద్వయమ్‌. 64

అపాకర్ష త్తతో దూరం భ్రమంస్తస్యా మహీ మిమామ్‌ | తపోబలాఢ్యా సాతస్య నవధ్యత్వంజగామ హ. 65

ఆమె పేరు వరాంగి అని పలికి పద్మ సంభవుడా బ్రహ్మ వెడలిపొయెను. వజ్రాంగుడును ఆమెతో తపమునకై వనమేగెను. కమల పత్రాక్షుడగు అదైత్యేంద్రుడు ఎనిమిదివేలఏండ్లు శుద్ధబుద్ధియై మహా తపమాచరించెను. మరి అంతకాలము తలవంచియు మరియు అంతకాలము పంచాగ్ని మధ్యగడయ్యు నిరాహారుడై ఘెర తపస్సాచరించి తపోరాశియయ్యెను. పిమ్మట వేయేండ్లు వాడు నీటిలోపలనుండి తపమాచరించెను. అతడు నీట ప్రవేశించగనే అతని పత్నియు మహావ్రతయై ఆ నరస్తీరమున మౌనమవలంబించి నిరాహారయు మహా తేజోవంతురాలనై ఘెర తపమాచరించెను. ఆమె తపమందున్న కాలమున ఇంద్రుడు ఆమెను భయపెట్టు పనులు చేసెను; అతడు కోతియై ఆ మహావనమందలి ఆమె ఆశ్రమమున పనిముట్లుగా ఉన్న సొర బుర్ర నీటికడవ బరిణలు అన్నియు చెల్లాచెదరు చేసెను. భయంకర రూపుడై మహా భయము కలిగించెను. పామయి ఆమెకాళ్ళు బంధించి చాల దూరమీడ్చికొనిపోయెను. ఆమె నా ప్రదేశమంతయు త్రిప్పి తానును తిరిగెను. కాని తపో బలాఢ్యురాలగు అవరాంగి అతనికి అవధ్యురాలయ్యెను.

తతో గోమాయురూపేణ తస్యాదూషయ దాశ్రమమ్‌ | తతస్తుమేఘరూపేణ తస్యాక్లేదయ దాశ్రమమ్‌. 66

భీషికాభి రనేకాభి స్తాంక్లిశ్య& పాకశాసనః | విరరామ యదా నైవం వజ్రాజ్గమహిషీ తదా. 67

శైలస్య దుష్టతాం మత్వా శావం దాతుం వ్యవస్యత | సశాపాభిముఖాం దృష్ట్వా శైలః పురుషవిగ్రహః. 68

ఉవాచ తాం వరారోహాం వరాజ్గీం భీరుచేతనామ్‌ | నాహం వరాజ్గనే దుష్టః సేవ్యోహం సర్వదేహినామ్‌. 69

విభ్రమంతు కరోత్యేష హృషితః పాకశాసనః | ఏతస్మిన్నన్తరే యాతః కాలో వర్షసహస్రకః. 70

తస్మి న్యాతేచ భగవా న్కాలే కమలసమ్భవః | హృష్టః | ప్రోవాచ వజ్రాజ్గం తమాగమ్యజలాశ్రయమ్‌. 71

బ్రహ్మా ! : దదామి సర్వకామాంస్తే ఉత్తిష్ఠ దితినన్దన | ఏవముక్త స్తదోత్థాయ దైత్యేన్ద్రస్తపసాం నిధిః. 72

ఉవాచ ప్రాఞ్జలిర్వాక్యం సర్వలోకపితామహమ్‌ | వజ్రాజ్గః : అసురోమాస్తుమేభావ స్సంతులోకామమాజ్ఞయా.

తపసేచ రతిర్మేస్తు శరీరస్యాస్తు వర్తనమ్‌ | ఏవమస్త్వితి దేవోక్త్వా జగామ స్వక మాలయమ్‌. 74

వజ్రాజ్గోపి సమాప్తేతు తపసి స్థిరసంయమః | ఆహార మిచ్ఛ న్భార్యాం స్వాం న దదర్వాశ్రమే న్వకే. 75

క్షుధా೭೭విష్ట న్స ఏవాహ క్వగతేయం మమ ప్రియా | దృష్ట్వాతు తస్యశైలస్య గహనం ప్రవివేశహ. 76

ఆదాతుం ఫలమూలాని నచ తస్మిన్విలోకయ& | రుదన్తీం స్వాం ప్రియాంధీనాం తరుప్రచ్ఛాదితాననామ్‌. 77

తాం విలోక్యచ దైత్యేన్ద్రః ప్రోవాచ వరిసాన్త్వయ& |

వజ్రాజ్గః : కేన తేపకృతంభీరుః యమలోకంయియాసునా. 78

కంవా కామం ప్రయచ్ఛామి శీఘ్రంమే బ్రూహి మానిని.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ వజ్రాజ్గోత్పత్త్యాదికథనం నామ పఞ్చ చత్వారింశదుత్తర శతతమోధ్యాయః.

ఇంద్రుడంతట నక్కయై ఆశ్రమమున రోతచేసెను. మేఘమయి ఆశ్రమ ప్రదేశమును తడిపెను. ఇట్లనేకములగు బెదరింపులు చూపుట ఇంద్రడు సాగించుచునేపోయెను. ఇదియంతయు తన యాశ్రమ స్థానమున్న పర్వతపు దుష్టత్వమని తలచి వరాంగి దానిని శపింపబూనెను. ఆమె శాపాభిముఖియగుట చూచి కొండ మానవ రూపముదాల్చి ఆ వరారోహ (సుందరరూప) తో ఇట్లనెను : భయపడు చిత్తబుతోనున్న వరాంగనా ! నేను దుష్టుడను కాను; నేను సర్వప్రాణులకు ఆశ్రయమిచ్చువాడను. ఇంద్రుడు పొగరుతో ఈ చేష్టలు చేయుచున్నాడు. అంతలో వేయి ఏండ్లు ముగిసెను. బ్రహ్మ మెచ్చి హర్షముతో ఆ జలాశయమునకు వచ్చి ఆ వజ్రాంగునితో ఇట్లనెను : దితిపుత్త్రా నీకన్ని కోరికలును ఇత్తును. అనగా తపోనిధియు చైత్యేంద్రుడునగు అవజ్రాంగుడు లేచి ప్రాంజలియై సర్వలోక పితామహుడగు బ్రహ్మతో నిట్లనెను : నాకు అసుర స్వభావము లేకుండవలయును. అక్షయ పుణ్యలోకముల లభించవలయును. తపస్సునందాసరక్తియు నిలువవలయును. ఈ దేహయాత్రయు నడుచుచుండవలయును.

అనగా బ్రహ్మ సరేయని తన లోకమునకేగెను ! స్థిరములగు సంయమములతో తపస్సాచరించి ముగించిన అతనికి ఆకలివేయగా ఆహారము కావలసి తన యాశ్రమమునందు భార్యకై చూడగా ఆమె కనబడలేదు. క్షుదావిష్ణుడగు అతడు నాభార్య ఎక్కడకు పోయియుండుననుకొనుచు పర్వతపు వన ప్రదేశమున ఫలమూలమలేవైన తెచ్చుకొందమని లోపలకు పోయి అచట చూచుచుండ అతనికి తన ప్రియురాలు దీనురాలయి చేట్టుచాటున మొగము కప్పుకొని ఏడ్చుచు కనబడెను. ఆమెను చూచి ఆ దైత్యేంద్రుడు ఓదార్చుచు 'పిరికిదానా ! యమలోకము పోగోరిన వాడెవడు నీకపకారము చేసెను ? మానినీ ! నీకేమి కోరిక తీర్చవలయునో తెలుపుము.' అనెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వజ్రాంగోత్పత్తి - త త్తపశ్చర్యా-కథనమను నూట నలుపదియైదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters