Siva Maha Puranam-4    Chapters   

అథ చతుర్దశోధ్యాయః

పంచాక్షరమంత్రమును జపించే విదానము

ఈశ్వర ఉవాచ |

ఆజ్ఞాహీనం క్రియాహీనం శ్రద్ధాహీనం వరాననే | అజ్ఞార్థం దక్షిణాహీనం సదా జప్తం చ నిష్ఫలమ్‌ || 1

అజ్ఞాసిద్ధం క్రియాసిద్ధం శ్రద్ధాసిద్ధం మమాత్మకమ్‌ | ఏవం చేద్దక్షిణాయుక్తం మంత్రసిద్ధిర్మహత్ఫలమ్‌ || 2

ఉపగమ్య గురుం విప్రమాచార్యం తత్త్వవేదినమ్‌ | జాపినం సద్గుణోపేతం ధ్యానయోగపరాయణమ్‌ || 3

తోషయేత్తం ప్రయత్నేన భావశుద్ధిసమన్వితః | వాచా చ మనసా చైవ కాయేన ద్రవిణన చ || 4

ఆచార్యం పూజయేద్విప్రస్సర్వదాతిప్రయత్నతః | హస్త్యశ్వరథరత్నాని క్షేత్రాణి చ గృహాణి చ || 5

భూషణాని చ వాసాంసి ధాన్యాని చ ధనాని చ | ఏతాని గురవే దద్యాద్భక్త్యా చ విభ##వే సతి || 6

విత్తశాఠ్యం న కుర్వీత యదీచ్ఛేత్సిద్ధిమాత్మనః | పశ్చాన్నివేద్య స్వాత్మానం గురవే సపరిచ్ఛదమ్‌ || 7

ఏవం సంపూజ్య విధివద్యథాశక్తి త్వవంచయన్‌ | ఆదదీత గురోర్మంత్రం జ్ఞానం చైవ క్రమేణ తు || 8

ఏవం తుష్టో గురుశ్శిష్యం పూజకం వత్సరోషితమ్‌ | శుశ్రూషుమనహంకారం స్నాతం శుచిముపోషితమ్‌ || 9

స్నాపయిత్వా విశుద్ధ్యర్థం పూర్ణకుంభఘృతేన వై | జలేన మంత్రశుద్ధేన పుణ్యద్రవ్యయుతేన చ || 10

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ సుందరమగు ముఖము గలదానా! గురువు యొక్క ఉపదేశము, క్రియ, శ్రద్ధ మరియు విధిని పాలించుటకై ఈయదగిన దక్షిణ లేని జపము నిష్ఫలమగును (1). గురువుయొక్క ఉపదేశము, క్రియ, శ్రద్ధ మరియు గురువునకు ఈయబడిన దక్షిణ అనువాటితో కూడిన మంత్రము నా స్వరూపమే యగును. అట్టి మంత్రము సిద్ధించి సాధకునకు గొప్ప ఫలమునిచ్చును (2). బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞాని, తత్త్వవేత్త, జపమును చేయువాడు, మంచి గుణములతో కూడినవాడు, ధ్యానయోగమునందు నిష్ఠ గలవాడు అగు గురువును అంతఃకరణశుద్ధి గల సాధకుడు సమీపించి, ఆయనను మనోవాక్కాయములతో మరియు ధనముతో సంతోషపెట్టవలెను (3,4). బ్రాహ్మణుడు సర్వకాలములలో పూర్ణప్రయత్నమును చేసి ఆచార్యుని పూజించ వలెను. ఏనుగులు, గుర్రములు, రథములు, రత్నములు, పొలములు, ఇళ్లు, అలంకారములు, వస్త్రములు, ధాన్యములు, ధనములు అను వాటిని సంపద ఉన్న సాధకుడు గురువునకు భక్తితోనీయవలెను (5,6). తనకు సిద్ధి కలుగవలెనని కోరుకొనే సాధకుడు ధనివిషయములో శక్తివంచన చేయరాదు. తరువాత సాధకుడు సర్వసామగ్రితో సహా తనను ఆచార్యునకు సమర్పించు కొనవలెను (7). సాధకుడు ఈ విధముగా శక్తిని అతిక్రమించకుండగా, శక్తివంచన లేకుండగా యథావిధిగా గురువును పూజించి, గురువు వద్దనుండి ముందుగా మంత్రమును తరువాత జ్ఞానమును స్వీకరించ వలెను (8). తనను పూజించువాడు, తనవద్ద సంవత్సరకాలము మకాము చేసి శుశ్రూషను చేసినవాడు, అహంకారము లేనివాడు, స్నానము చేసియున్నవాడు అగు శిష్యుని చూచి, గురువు సంతోషించి (9), ఆతనిని విశేష శుద్ధి కొరకై పూర్ణకుంభమునందలి నేయితో, పుణ్యద్రవ్యములతో కూడిన మంత్రముచే పవిత్రము చేయబడిన నీటితో స్నానమును చేయించ వలెను (10).

అలంకృత్య సువేషం చ గంధస్రగ్వస్త్రభూషణౖః | పుణ్యాహం వాచయిత్వా చ బ్రాహ్మాణానభిపూజ్య చ || 11

సముద్రతీరే నద్యాం చ గోష్ఠే దేవాలయే%పి వా | శుచౌ దేశే గృహే వాపి కాలే సిద్ధికరే తిథౌ || 12

నక్షత్రే శుభయోగే చ సర్వదోషవివర్జితే | అనుగృహ్య తతో దద్యాత్‌ జ్ఞానం మమ యథావిధి || 13

స్వరేణోచ్చారయేత్సమ్యగేకాంతే%తిప్రసన్నధీః | ఉచ్చార్యోచ్చారయిత్వా తమావయోర్మంత్రముత్తమమ్‌ || 14

శివం చాస్తు శుభం చాస్తు శోభనో%స్తు ప్రియో%స్త్వితి | ఏవం దద్యాద్గురుర్మంత్రమాజ్ఞాం చైవ తతః పరమ్‌ || 15

ఏవం లబ్ధ్వా గురోర్మంత్రమాజ్ఞాం చైవ సమాహితః | సంకల్ప్య చ జపేన్నిత్యం పురశ్చరణపూర్వకమ్‌ || 16

యావజ్జీవం జపేన్నిత్యమష్టోత్తరసహస్రకమ్‌ | అనన్యస్తత్పరో భూత్వా స యాతి పరమాం గతిమ్‌ || 17

జపేదక్షరలక్షం వై చతుర్గుణితమాదరాత్‌ | నక్తాశీ సంయమీ యస్స పౌరశ్చరణికస్స్మృతః || 18

యః పురశ్చరణం కృత్వా నిత్యజాపీ భ##వేత్పునః | తస్య నాస్తి సమో లోకే స సిద్ధస్సిద్ధిదో భ##వేత్‌ || 19

స్నానం కృత్వా శుచౌ దేశే బద్ధ్వా రుచిరమాసనమ్‌ | త్వయా మాం హృది సంచింత్య స్వగురుం తతః || 20

ఆ సాధకుడు వస్త్రములతో చక్కని ముస్తాబును చేసుకొని, మాలతో మరియు ఆభరణములతో అలంకరించుకొని, గంధమును పూసుకొని, పుణ్యాహవాచనమును చేసి, బ్రాహ్మణులకు ఎదురుగా కూర్చుని వారిని పూజించ వలెను (11). తరువాత సముద్రతీరమునందు గాని, నదీతీరమునందు గాని, గోశాలయందు గాని, దేవళమునందు గాని, లేదా ఇంటిలో పవిత్రమగు స్థానమునందు గాని, సిద్ధిని కలిగించే పుణ్యతిథి, శుభనక్షత్రము, శుభయోగము గల సకలదోషములు లేని కాలమునందు గురువు ఆ శిష్యుని అనుగ్రహించి యథావిధిగా శివజ్ఞానమునీయ వలెను (12,13). గురువు మిక్కిలి ప్రసన్నమగు బుద్ధి గలవాడై, ఏకాంతమునందు ఉత్తమమగు మన యిద్దరి మంత్రమును స్వరసహితముగా చక్కగా ఉచ్చరించి, అతనిచే ఉచ్చరింప జేయవలెను (14). మంగళమగు గాక! శుభమగు గాక! సుసంపన్నమగు గాక! ప్రియమగు గాక! అని పలికి గురువు మంత్రమునిచ్చి తరువాత ఆజ్ఞను ఈయవలెను (15). సాధకుడు ఈ విధముగా గురువు వద్దనుండి మంత్రమును మరియు ఆజ్ఞను పొంది, ఏకాగ్రచిత్తము గలవాడై సంకల్పమును చేసి, నిత్యము పురశ్చరణ పూర్వకముగా జపమును చేయవలెను (16). ఎవడైతే బ్రతికి యున్నంత కాలము మరియొక దానిపైకి దృష్టిని మళ్లించకుండగా తత్పరుడై నిత్యము నూట యెనిమిది సార్లు జపమును చేయునో, వాడు మోక్షమును పొందును (17). అక్షరముల సంఖ్యను నాలుగుతో గుణించి అన్ని లక్షల జపమును ఎవడైతే రాత్రి మాత్రమే భుజిస్తూ ఇంద్రియజయము గలవాడై భక్తితో చేయునో, వాడు పురశ్చరణ చేసిన వాడగునని మహర్షులు చెప్పుచున్నారు (18). ఎవడైతే పురశ్చరణను చేసి మరల నిత్యము జపమును చేయునో, వానితో సమానమైనవాడు లోకములో లేడు. మంత్రసిద్ధిని పొందియున్న అట్టి వ్యక్తి ఇతరులకు కూడ సిద్ధిని ఈయగలడు (19). సాధకుడు స్నానమును చేసి, పవిత్రమగు స్థానములో అందమగు ఆసనముపై కూర్చుండి (లేదా, అందమగు యోగాసనములో కూర్చుండి), నీతో గూడియున్న నన్ను మనస్సులో ధ్యానించి, తరువాత తన గురువును ధ్యానించవలెను (20)

ఉదఙ్ముఖః ప్రాఙ్ముఖో వా మౌనీ చైకాగ్రమానసః | విశోధ్య పంచ తత్త్వాని దహనప్లావనాదిభిః || 21

మంత్రన్యాసాదికం కృత్వా సకలీకృతవిగ్రహః | ఆవయోర్విగ్రహౌ ధ్యాయన్‌ ప్రాణాపానౌ నియమ్య చ || 22

విద్యాస్థానం స్వకం రూపమృషిచ్ఛందో% ధిదైవతమ్‌ | బీజం శక్తిం తథా వాక్యం స్మృత్వా పంచాక్షరీం జపేత్‌ || 23

ఉత్తమం మానసం జాప్యముపాంశుం చైవ మధ్యమమ్‌ | అధమం వాచికం ప్రాహురాగమార్థవిశారదాః || 24

ఉత్తమం రుద్రదైవత్యం మధ్యమం విష్ణుదైవతమ్‌ | అధమం బ్రహ్మదైవత్యమిత్యాహురనుపూర్వశః || 25

యదుచ్చనీచస్వరితైస్స్పష్టాస్పష్టపదాక్షరైః | మంత్రముచ్చారయేద్వాచా వాచికో%యం జపస్స్మృతః || 26

జిహ్వామాత్రపరిస్పందాదీషదుచ్చారితో% పివా | అపరైరశ్రుతః కించిచ్ర్ఛుతో వోపాంశురుచ్యతే || 27

ధియా యదక్షరశ్రేణ్యా వర్ణాద్వర్ణం పదాత్పదమ్‌ | శబ్దార్థచింతనం భూయః కథ్యతే మానసో జపః || 28

వాచికస్త్వేక ఏవ స్యాదుపాంశుశ్శతముచ్యతే | సహస్రం మానవః ప్రోక్తస్సగర్భస్తు శతాధికః || 29

ప్రాణాయామసమాయుక్తస్సగర్భో జప ఉచ్యతే | ఆద్యంతయోరగర్భే%పి ప్రాణయామః ప్రశస్యతే || 30

సాధకుడు ఉత్తరముఖముగా గాని, తూర్పు ముఖముగా గాని కూర్చుండి, మౌనముగా ఏకాగ్రమగ చిత్తము గలవాడై, దహనము ప్లావనము మొదలగు ప్రాణయామములతో అయిదు తత్త్వములను (పృథివి మొదలైనవి) శోధన చేసి (21), మంత్రన్యాసము మొదలగు వాటిని చేసి, దేహమునకు సకలీకరణము అనే ప్రక్రియను పూర్తి చేసి, మన యిద్దరి మూర్తులను ధ్యానము చేయుచూ ప్రాణయామమును చేసి (22), విద్య, స్థానము, తన రూపము, ఋషి, ఛందస్సు, అధిష్ఠాన దేవత, బీజము, శక్తి మరియు వాక్యము అనువాటిని స్మరించి పంచాక్షరీ మంత్రమును జపించ వలెను (23). మానసజపము ఉత్తమమనియు, ఉపాంశుజపము మధ్యమమనియు, వాచికజపము అధమమనియు వేదతాత్పర్యమునెరింగిన పండితులు చెప్పుచున్నారు (24). రుద్రుడు దేవతగా గల మంత్రము ఉత్తమమనియు, విష్ణుదేవతాకమగు మంత్రము మధ్యమమనియు, బ్రహ్మ దేవతగా గలది అధమమనియు ఈ క్రమమును పెద్దలు చెప్పచున్నారు (25). ఉదాత్తానుదాత్తస్వరితములనే స్వరములతో, స్పష్టము మరియు అస్పష్టము అగు పదములతో మరియు అక్షరములతో మంత్రమును వాక్కుతో ఉచ్చరించినచో, అది వాచికజపమని చెప్పబడినది (26). నాలుక మాత్రమే కదులుచుండగా మెల్లగా ఉచ్చరిస్తూ ఇతరులకు వినబడని విధముగా, లేదా వినబడీ వినబడని విధముగా చేసే జపమునకు ఉపాంశుజపమని పేరు (27). అక్షరముల వరుసలో ఒక అక్షరమునుండి మరియొక అక్షరమునకు, ఒక పదమునుండి మరియొక పదమునకు బుద్ధితో ముందుకు సాగుతూ శబ్దమును దాని అర్థమును మరల మరల భావనే చేస్తూ చేసే జపమునకు మానసజపమని పేరు (28). వాచికజపము ఒకవంతు ఫలమునీయగా, ఉపాంశుజపము వంద రెట్లు, మానసజపము వేయి రెట్లు, సగర్భజపము లక్ష రెట్లు ఫలమునిచ్చునని చెప్పబడినది (29). ప్రాణాయామముతో కూడిన జపమునకు సగర్భజపమని పేరు. అగర్భజపములో కూడ ముందులో మరియు ఆఖరున ప్రాణాయామమును చేయుట శ్రేష్ఠమని చెప్పబడినది (30).

చత్వారింశత్సమావృత్తీః ప్రాణానాయమ్య సంస్మరేత్‌ | మంత్రం మంత్రార్థవిద్ధీమానశక్తశ్శక్తితో జపేత్‌ || 31

పంచకం త్రికమేకం వా ప్రాణాయామం సమాచరేత్‌ | అగర్భం వా సగర్భం వా సగర్భస్తత్ర శస్యతే || 32

సగర్భాదపి సాహస్రం సధ్యానో జప ఉచ్యతే | ఏషు పంచవిధేష్వేకః కర్తవ్యశ్శక్తితో జపః || 33

అంగుల్యా జపసంఖ్యానమేకమేవముదాహృతమ్‌ | రేఖయాష్టగుణం విద్యాత్పుత్రజీవైర్దశాధికమ్‌ || 34

శతం స్యాచ్ఛంఖమణిభిః ప్రవాలైస్తు సహస్రకమ్‌ | స్ఫటికైర్దశసాహశ్రం మౌక్తికైర్లక్షముచ్యతే || 35

పద్మాక్తైర్దశ లక్షం తు సౌవర్ణైః కోటిరుచ్యతే | కుశగ్రంథ్యా చ రుద్రాక్తైరనంతగుణితం భ##వేత్‌ || 36

త్రింశదక్షైః కృతా మాలా ధనదా జపకర్మణి | సప్తవింశతిసంఖ్యాతైరక్షైః పుష్టిప్రదా భ##వేత్‌ || 37

పంచవింశతిసంఖ్యాతైః కృతా ముక్తిం ప్రయచ్ఛతి | అక్షైస్తు పంచదశభిరభిచారఫలప్రదా || 38

అంగుష్ఠం మోక్షదం విద్యాత్తర్జనీం శత్రునాశినీమ్‌ | మధ్యమాం ధనదాం శాంతిం కరోత్యేషా హ్యనామికా || 39

అష్టోత్తరశతం మాలా తత్ర స్యాదుత్తమోత్తమా | శతసంఖ్యోత్తమా మాలా పంచాశద్భిస్తు మధ్యమా || 40

మంత్రముయొక్క అర్థమును తెలిసిన వివేకి ప్రాణాయామమును చేయుచూ నలభైసార్లు మంత్రమును భావన చేయవలెను. అన్ని సార్లు చేసే శక్తి లేనిచో, శక్తిని అనుసరించి చేయవచ్చును (31). ప్రాణాయామమును అయిదు సార్లు, మూడు సార్లు లేదా ఒకసారి చేయవచ్చును. జపమును ప్రాణాయామముతో కలిపి (సగర్భ) గాని, లేదా ప్రాణాయామము లేకుండగా (అగర్భ) గాని చేయవచ్చును. కాని వాటిలో సగర్భజపము శ్రేష్టమని చెప్పబడినది (32). సగర్భజపము కంటె సధ్యాన (ధ్యానముతో కూడి) జపము వేయి రెట్లు శ్రేష్ఠమని చెప్పబడినది సాధకుడు ఈ అయిదు రకముల జపములలో ఏదో ఒక దానిని శక్తి మేరకు చేయవలెను (33). వ్రేళ్లతో లెక్కపెట్టుట ఒక వంతు ఫలమునీయగా, రేఖలతో లెక్కించుట ఎనిమిది రెట్లు, గింజల మాలతో లెక్కించుట పది, గవ్వల మాలతో వంద, పగడముల మాలతో వేయి, స్ఫటికమాలతో పది వేలు, ముత్యముల మాలతో లక్ష, పద్మముల విత్తనముల మాలతో పది లక్షలు, బంగరు పూసల మాలతో కోటి, దర్భముడులతో గాని రుద్రాక్షమాలతో గాని లెక్కించుట అనంతమగు రెట్లు ఫలమును ఇచ్చునని చెప్పబడినది (34-36). జపమునందు ముప్పది పూసల మాలధనమును, ఇరవై ఏడు పూసల మాల ఆరోగ్యమును, ఇరవై అయిదు పూసల మాల మోక్షమును, ఏబది పూసల మాల శత్రుహాని అనే ఫలమును ఇచ్చును (37,38). జపములో బొటన వ్రేలును ఉపయోగించినచో మోక్షమును, చూపుడు వ్రేలు శత్రునాశమును, మధ్య వ్రేలు ధనమును, అనామిక శాంతిని ఫలముగా ఇచ్చును (39). వాటిలో నూట యెనిమిది పూసల మాల ఉత్తమోత్తమము; నూరు ఉత్తమము; ఏభై మధ్యమము (40).

చతుః పంచాశదక్షైస్తు హృచ్ర్ఛేష్ఠా హి ప్రకీర్తితా | ఇత్యేవం మాలయా కుర్యాజ్జపం కసై#్మ న దర్శయేత్‌ || 41

కనిష్ఠా%క్షరణీ ప్రోక్తా జపకర్మణి శోభనా | అంగుష్ఠేన జపేజ్జప్యమన్యైరంగులిభిస్సహ || 42

అంగుష్ఠేన వినా జప్యం కృతం తదఫలం యతః | గృహే జపం సమం విద్యాద్గోష్టే శతగుణం విదుః || 43

పుణ్యారణ్య తథారామే సహస్రగుణముచ్యతే | అయుతం పర్వతే పుణ్య నద్యాం లక్షముదాహృతమ్‌ || 44

కోటిం దేవాలయే ప్రాహురనంతం మమ సన్నిధౌ | సూర్యస్యాగ్నేర్గురోరిందోర్దీపస్య చ జలస్య చ || 45

విప్రాణాం చ గవాం చైవ సన్నిదౌ శస్యతే జపః | తత్పూర్వాభిముఖం వశ్యం దక్షిణం చాభిచారికమ్‌ || 46

పశ్చిమం ధనదం విద్యాదౌత్తరం శాంతిదం భ##వేత్‌ | సూర్యాగ్నివిప్రదేవానాం గురూణామపి సన్నిధౌ || 47

అన్యేషాం చ ప్రశస్తానాం మంత్రం న విముఖో జపేత్‌ | ఉష్ణీషీ కంచుకీ నగ్నో ముక్తకేశో గలావృతః || 48

అపవిత్రకరో%శుద్ధో విలపన్న జపేత్క్వచిత్‌ | క్రోధం మదం క్షుతం త్రీణి నిష్ఠీవనవిజృంభ##ణ || 49

దర్శనం చ శ్వనీచానాం వర్జయేజ్జపకర్మణి | ఆచమేత్సంభ##వే తేషాం స్మ రేద్వా మాం త్వయా సహ|| 50

ఏభై నాలుగు పూసల మాల మనోహరము మరియు శ్రేష్ఠము అని చెప్పబడినది. ఈ విధముగా జపమును చేయుటకు ఉపయోగించే మాల ఇతరులకు కనబడరాదు (41). జపకర్మలో అందమగు చిటికెన వ్రేలు అక్షరణి (జపఫలమును నశించకుండగా కాపాడేది) అని చెప్పబడినది. బొటన వ్రేలిని మిగిలిన వ్రేళ్లతో కలిపి మంత్రమును జపించ వలెను (42). ఏలయనగా, బొటన వ్రేలిని విడిచి పెట్టి చేసిన జపము ఫలమునీయదు. జపమును ఇంటిలో చేసినచో సమానమగు ఫలము, గోశాలలో వంద రెట్లు, పవిత్రమగు అరణ్యములో మరియు ఉద్యానవనములో వేయి, పవిత్రమగు పర్వతముపై పది వేలు, నదిలో లక్ష, దేవాలయము నందు కోటి రెట్లు ఫలము లభించగా, నా సన్నిధిలో అనంతమగు ఫలము లభించును. సూర్యుడు, అగ్ని, గురువు, చంద్రుడు, దీపము, నీరు బ్రాహ్మణులు, గోవులు అను వాటి సన్నిధిలో జపము శ్రేష్ఠమని చెప్పబడినది. తూర్పుముఖముగా చేసిన జపము వశీకరణశక్తిని, దక్షిణముఖము శత్రుహానిని, పడమట ధనమును, ఉత్తరము శాంతిని ఇచ్చునని తెలియవలెను. ఎక్కడనైననూ సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, దేవుడు, గురువులు, ఇతరశ్రేష్ఠపురుషులు అను వారి సన్నిధిలో వారికి పెడముఖమును పెట్టి జపమును చేయరాదు. ఏ కాలమునందైననూ తలపాగాను, చొక్కాను దాల్చి గాని, నగ్నముగా గాని, జుట్టు విరబోసుకొని గాని, మెడకు బట్టను చుట్టుకొని గాని, పవిత్రము (దర్భముడి) లేని చేతితో గాని, శుచి కాకుండగా గాని, ఏడుస్తూ గాని జపమును చేయరాదు. జపకర్మయందు కోపమును, గర్వమును, తుమ్ము ఆవులింత ఉమ్మి అను మూడింటిని విడిచి పెట్టవలెను. జపమును చేయుచుండగా కుక్కను, దుష్టులను చూడరాదు. అట్టు జరిగినచో, ఆచమనమును చేయవలెను. లేదా, నీతో గూడియున్న నన్నుస్మరించ వలెను (43-50).

జ్యోతీంషి చ ప్రపశ్యేద్వా కుర్యాద్వా ప్రాణసంయమమ్‌ | అనాసనశ్శయానో వా గచ్ఛన్నుత్థిత ఏవ వా || 51

రథ్యాయామశివే స్థానే న జపేత్తిమిరాంతరే | ప్రసార్య న జపేత్పాదౌ కుక్కుటాసన ఏవ వా || 52

యానశయ్యాధిరూఢో వా చింతావ్యాకులితో%థ వా | శక్తశ్చేత్సర్వమేవైతదశక్తశ్శక్తితో జపేత్‌ || 53

కిమత్ర బహునోక్తేన సమాసేన వచః శృణు | సదాచారో జపన్‌ శుద్ధం ధ్యాయన్‌ భద్రం సమశ్నుతే || 54

ఆచారః పరమో ధర్మ ఆచారః పరమం ధనమ్‌ | ఆచారః పరమా విద్యా ఆచారః పరమా గతిః || 55

ఆచారహీనః పురుషో లోకే భవతి నిందితః | పరత్ర చ సుఖీ న స్యాత్తస్మాదాచారవాన్‌ భ##వేత్‌ || 56

యస్య యద్విహితం కర్మ వేదే శాస్త్రే చ వైదికైః | తస్య తేన సమాచారస్సదాచారో న చేతరః || 57

సద్భిరాచరితత్వాచ్చ సదాచారస్స ఉచ్యతే | సదాచారస్య తస్యాహురాస్తిక్యం మూలకారణమ్‌ || 58

ఆస్తికశ్చేత్ర్పమాదాద్యైస్సదాచారాదవిచ్యుతః | న దుష్యతి నరో నిత్యం తస్మాదాస్తికతాం వ్రజేత్‌ || 59

యథేహాస్తి సుఖం దుఃఖం సుకృతైర్దుష్కృతైరపి | తథా పరత్ర చాస్తీతి మతిరాస్తిక్యముచ్యతే || 60

లేదా, సూర్యుడు మొదలగు కాంతిమండలములను దర్శించ వలెను. లేదా, ప్రాణాయామమును చేయవలెను. ఆసనము లేకుండగా గాని, పరుండి గాని, నడుస్తూ గాని, నిలబడి గాని జపము చేయరాదు (51). వీధిలో గాని, అపవిత్రస్థానమునందు గాని, చీకటిలో గాని జపించరాదు. కాళ్లను చాచుకొని గాని, కోడి వలె కూర్చుండి (కుక్కుటాసనము) గాని జపమును చేయరాదు (52). బండిని ఎక్కి గాని, శయ్యపై కూర్చుండి గాని, అందోళనతో కల్లోలముగా నున్న మనస్సుతో గాని జపమును చేయరాదు. శక్తి గలవాడు ఈ నిమములను అన్నింటినీ పాటించ వలెను. శక్తి లేనిచో తనకు శక్తి ఉన్నంత వరకు నియమములను పాటిస్తూ జపించ వలెను (53). ఇన్ని మాటలేల? సంగ్రహముగా చెప్పెదను. వినుము. సదాచారమును కలిగి శుద్ధహృదయముతో జపమును ధ్యానమును చేయు వ్యక్తి మంగళమును పొందును (54). సచ్ఛీలమే సర్వశ్రేష్ఠమగు ధర్మము. సదాచారమే అనగా సచ్ఛీలమే అన్నింటికంటె గొప్ప ధనము. ఆచారమే సర్వోత్కృష్టమగు విద్య. ఆచారమే మోక్షము (55). ఆచారమునెరుంగని వ్యక్తి లోకములో నిందకు గురి యగును. అట్టి వానికి పరలోకములో నైననూ సుఖము ఉండదు. కావును, మానవుడు సచ్ఛీలము కలవాడు కావలెను (56). వేదవిద్వాంసులు చెప్పిన విధముగా వేదశాస్త్రములు ఎవనికి ఏ కర్మను విధించు చున్నవో, దానిని వాడు అనుష్ఠించుటయే సదాచారమగును గాని, మరియొకటి కాదు (57). సత్పురుషులు ఆచరించుటచే దానికి సదాచారమని పేరు వచ్చినది. అట్టి సదాచారమునకు మూలకారణము ఆస్తిక్యబుద్ధి అని చెప్పెదరు (58). మానవుడు సర్వకాలములలో ఆస్తికుడై యున్నచో, మరుపు మొదలగు దోషముల కారణముగా సదాచారమునుండి జారిపోడు. అట్టి వానికి పాపము ఉండదు. కావున, మానవుడు అస్తిక్యమును కలిగి యుండవలెను (59). ఇహలోకములో మంచి పని చేయువారికి సుఖము, చెడు పని చేయువారికి దుఃఖము కలిగే విధముగానే, పరలోకములో కూడ జరుగుననే నిశ్చయబుద్ధికి ఆస్తిక్యమని పేరు (60).

రహస్యమన్యద్వక్ష్యామి గోపనీయమిదం ప్రియే | న వాచ్యం యస్య కస్యాపి నాస్తికస్యాథ వా పశోః || 61

సదాచారవిహీనస్య పతితస్యాంత్యజస్య చ | పంచాక్షరాత్పరం నాస్తి పరిత్రాణం కలౌ యుగే || 62

గచ్ఛతస్తిష్ఠతో వాపి స్వేచ్ఛయా కర్మ కుర్వతః | అశుచేర్వా శుచేర్వాపి మంత్రో%యం న చ నిష్ఫలః || 63

అనాచారవతాం పుంసామవిశుద్ధషడధ్వనామ్‌ | అనాదిష్టో%పి గురుణా మంత్రో%యం న చ నిష్ఫలః || 64

అంత్యజస్యాపి మూర్ఖస్య మూఢస్య పతితస్య చ | నిర్మర్యాదస్య నీచస్య మంత్రో%యం న చ నిష్ఫలః || 65

సర్వావస్థాం గతస్యాపి మయి భక్తిమతః పరమ్‌ | సిధ్యత్యేవ న సందేహో నాపరస్య తు కస్యచిత్‌ || 66

న లగ్నతిథినక్షత్రవారయోగాదయః ప్రియే | అస్యాత్యంతమపేక్ష్యాస్స్యుర్నైష సుప్తస్సదోదితః || 67

న కదాచిన్న కస్యాపి రిపురేష మహాత్మనః | సుసిద్ధో వాపి సిద్ధో వా సాధ్యో వాపి భవిష్యతి || 68

సిద్ధేన గురుణాదిష్టస్సుసిద్ధ ఇతి కథ్యతే | అసిద్ధేనాపి వా దత్తస్సిద్ధస్సాధ్యస్తు కేవలః || 69

అసాధితస్సాధితో వా సిధ్యత్యేవ న సంశయః | శ్రద్ధాతిశయయుక్తస్య మయి మంత్రే తధా గురౌ ||70

ఓ ప్రయురాలా! మరియొక రహస్యమును చెప్పెదను. దీనిని దాచి పెట్టుము. ఎవరికి పడితే వారికి గాని, నాస్తికునకు గాని, లేదా సదాచారము లేని మూర్ఖునకు గాని దీనిని చెప్పరాదు. కలియుగములో పతితునకు, అంత్యజులకు పంచాక్షరము కంటె గొప్ప రక్షణ లేదు (61-62). ఈ మంత్రమును నడుస్తూ, నిలబడి, తనకు నచ్చిన పనిని చేసుకుంటూ, శుచిగా గాని, శుచి కాకుండగా గాని జపము చేసిననూ ఈ మంత్రము వ్యర్థము కాదు (63). ఆచారము లేనివారు, ఆరు మార్గముల విశేషశోధనము లేనివారు, గురువుయొక్క ఉపదేశము లేనివారు అగు పురుషులు చేసిననూ ఈ మంత్రము వ్యర్థము కాదు (64). అంత్యజుడు, మొండి పట్టుదలవాడు, అజ్ఞాని, పతితుడు, మర్యాద లేనివాడు, నీచుడు అగు వ్యక్తి చేసిననూ ఈ మంత్రముయొక్క జపము వ్యర్థము కాదు (65). నాయందు భక్తి గలవాడు ఎట్టి అవస్థను పొందియున్ననూ ఈ మంత్రము నిశ్చయముగా సిద్ధించి తీరును. సందేహము లేదు. నాయందు భక్తి లేనివానికి ఎవనికైననూ ఇది సిద్ధించదు (66). ప్రియురాలా! ఈ మంత్రమునకు లగ్నము, తిథి, నక్షత్రము, వారము, యోగము మొదలగు వాటితో అధికమగు అపేక్ష లేదు. ఈ మంత్రము సర్వదా జాగరూకముగా నుండునే గాని, నిద్రించదు (67). ఈ మహామంత్రము ఎవనికైననూ ఎప్పుడైననూ హానిని చేయదు. సుసిద్ధము, సిద్ధము, సాధ్యము అను మూడు విధములుగా ఈ మంత్రము ఉన్నది (68). సిద్ధుడగు గురువుచే ఉపదేశించబడిన మంత్రము సుసిద్ధమనబడును. సిద్ధిని పొందని గురువు ఉపదేశించినచో, అది సిద్ధము అగును. ఉపదేశము లేనిది సాధ్యము (69). నాయందు, మంత్రమునందు మరియు గురువునందు అతిశయించిన శ్రద్ధ గల వ్యక్తికి ఈ మంత్రము గురువుచే ఉపదేశించ బడినది అయినా, కాకపోయినా, నిస్సందేహముగా సిద్ధించి తీరును (70).

తస్మాన్మంత్రాంతరాంస్త్యక్త్వా సాపాయానధికారతః | ఆశ్రయేత్పరమాం విద్యాం సాక్షాత్పంచాక్షరీం బుధః || 71

మంత్రాంతరేషు సిద్ధేషు మంత్ర ఏష న సిధ్యతి | సిద్ధే త్వస్మిన్‌ మహామంత్రే తే చ సిద్ధా భవంత్యుత || 72

యథా దేవేష్వలబ్ధో%స్మి లబ్ధేష్వపి మహేశ్వరి | మయి లబ్ధే తు తే లబ్ధా మంత్రేష్వేషు సమో విధిః || 73

యే దోషాస్సర్వమంత్రాణాం న తే%స్మిన్‌ సంభవంత్యపి | అస్య మంత్రస్య జాత్యాదీననపేక్ష్య ప్రవర్తనాత్‌ || 74

తథాపినైవ క్షుద్రేషు ఫలేషు ప్రతియోగిషు | సహసా వినియుంజీత యస్మాదేష మహాబలః || 75

కావున, వివేకవంతుడు అధికారస్థితిని బట్టి విఘ్నములతో కూడియున్న ఇతరమంత్రములను విడిచిపెట్టి, సర్వోత్కృష్టమగు ఈ పంచాక్షరీవిద్యను ఆశ్రయించ వలెను (71). ఇతరమంత్రములు సిద్ధించిననూ, ఈ మంత్రము సిద్ధించినట్లు కాదు. కాని, ఈ మహామంత్రము సిద్ధించినచో, అవి సిద్ధించును (72). ఓ మహేశ్వరీ! దేవతలు లభించిననూ, నేను లభించినట్లు కాదు. కాని, నేను లభించినచో, ఆ దేవతలు లభించినట్లే, ఇదే న్యాయము ఈ మంత్రమునకు కూడా వర్తించును (73). ఈ మంత్రము జాతి మొదలగు అర్హతలను అపేక్షించకుండగా ప్రవర్తిల్లుటచే, ఇతరములగు మంత్రములన్నింటిలో ఏ దోషములు గలవో, అవి దీనియందు సంభవమే కావు (74). అయినప్పటికీ, ఈ మంత్రమును వెంట వెంటనే అల్పఫలముల కొరకు గాని, శత్రుహాని కొరకు గాని వినియోగించ రాదు. ఏలయనగా, ఇది మహాబలము గలది (75).

ఉపమన్యురువాచ |

ఏవం సాక్షాన్మహాదేవ్యై మహాదేవేన శూలినా | హితాయ జగతాముక్తః పంచాక్షరవిధిర్యథా || 76

య ఇదం కీర్తయేద్భక్త్యా శృణుయాద్వా సమాహితః | సర్వపాపవినిర్ముక్తః ప్రయాతి పరమాం గతిమ్‌ || 77

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే పంచాక్షర మంత్రజపవిధివర్ణనం నామ చతుర్దశో%ధ్యాయః (14).

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

ఈ విధముగా సాక్షాత్తు శూలధారియగు మహాదేవుడు లోకముల హితమును గోరి మహాదేవికి పంచాక్షరమంత్రవిధిని చెప్పినాడు. ఆ చెప్పిన విధముగా ఎవడైతే దీనిని భక్తితో కీర్తించునో, లేదా ఏకాగ్రచిత్తముతో వినునో, అట్టివాడు సకలపాపముల నుండి విముక్తుడై మోక్షమును పొందును. (76,77).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో పంచాక్షర మంత్రజపవిధిని వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

Siva Maha Puranam-4    Chapters