Siva Maha Puranam-4    Chapters   

అథ పంచమోధ్యాయః

శివ తత్త్వ నిరూపణము

ఉపమన్యురువాచ |

విగ్రహం దేవదేవస్య విశ్వమేతచ్చరాచరమ్‌ | తదేవం న విజానంతి పశవః పాశగౌరవాత్‌ || 1

తమేకమేవ బహుధా వదంతి యదునందన | అజానంతః పరం భావమవికల్పం మహర్షయః || 2

అపరం బ్రహ్మరూపం చ పరం బ్రహ్మాత్మకం తథా | కేచిదాహుర్మహాదేవమనాదినిధనం పరమ్‌ || 3

భూతేంద్రియాంతఃకరణప్రధానవిషయాత్మకమ్‌ | అపరం బ్రహ్మ నిర్దిష్టం పరం బ్రహ్మ చిదాత్మకమ్‌ || 4

బృహత్త్వాద్బృంహణత్త్వాద్వా బ్రహ్మ చేత్యభిధీయతే | ఉభేతే బ్రహ్మణో రూపే బ్రహ్మణో%ధిపతేః ప్రభోః |

విద్యా%విద్యాస్వరూపీతి కైశ్చిదీశో నిగద్యతే || 5

విద్యాం తు చేతనాం ప్రాహుస్తథా%విద్యామచేతనామ్‌ | విద్యా%విద్యాత్మకం చైవ విశ్వం విశ్వగురోర్విభోః || 6

రూపమేవ న సందేహో విశ్వం తస్య వశే యతః | భ్రాంతిర్విద్యా పరా చేతి శార్వం రూపం పరం విదుః || 7

అయథా బుద్ధిరర్థేషు బహుధా భ్రాంతిరుచ్యతే | యథార్థాకారసంవిత్తిర్విద్యేతి పరికీర్త్యతే || 8

వికల్పరహితం తత్త్వం పరమిత్యభిధీయతే | వైపరీత్యాదసచ్ఛబ్దః కథ్యతే వేదవాదిభిః || 9

తయోః పతిత్వాత్తు శివస్సదసత్పతిరుచ్యతే | క్షరాక్షరాత్మకం ప్రాహుః క్షరాక్షరపరం పరే || 10

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

ఈ చరాచర జగత్తు దేవదేవుని శరీరము. జీవులు బంధము బలమైనదగుటచే దానిని ఈ విధముగా తెలియ జాలకున్నారు (1) ఓ యదుకుమారా! మహర్షులు బేదములు లేని పరమార్థస్థితిని యెరుంగని కారణముగా అద్వితీయుడగు ఆ పరమేశ్వరుని అనేకరూపములలో వర్ణించుచున్నారు (2). ఆద్యంతములు లేనివాడు, సర్వాతీతుడు అగు మహాదేవుని కొందరు అపరబ్రహ్మస్వరూపుడనియు, మరికొందరు పరబ్రహ్మస్వరూపుడనియు చెప్పుచున్నారు (3). పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము, ప్రధానము (అవ్యక్తము), విషయములు అనే స్వరూపము గలది అపరబ్రహ్మ అనియు, కేవలచేతనస్వరూపము పరబ్రహ్మ అనియు నిర్దేశించ బడినది (4). పెద్దది మరియు వ్యాపకము అగుటచే పరమాత్మ బ్రహ్మ అని పిలువబడు చున్నాడు. సృష్టికర్తయగు బ్రహ్మకు అధీశ్వరుడు, సర్వసమర్థుడు అగు ఆ పరబ్రహ్మకు రెండు రూపములు గలవు. ఈశ్వరుడు విద్య మరియు అవిద్య స్వరూపముగా కలిగి రెండు రూపములలో నున్నాడని కొందరు చెప్పుచున్నారు (5). చేతనరూపము విద్య అనియు, జడము అవిద్య అనియు చెప్పెదరు. చేతనజడాత్మకమగు ఈ జగత్తు, సర్వవ్యాపకుడు మరియు జగత్తునకు తండ్రి అగు శివుని రూపమే. సందేహము లేదు. ఏలయనగా, జగత్తు ఆయన వశములో నున్నది. భ్రాంతి, విద్య, పరావిద్య అని శివునకు మూడు ఉత్కృష్టరూపములు గలవని చెప్పుచున్నారు (6,7). వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా గాక, పలు విధములుగా తెలుసుకొనుట భ్రాంతి అనబడును. వస్తువుల ఆకారమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనుట విద్య అని కీర్తించ బడుచున్నది (8). భేదములు లేని తత్త్వము పరము (పరావిద్య) అనబడును. దానికి విరుద్ధమైనది అసత్‌ అని వేదవేత్తలు చెప్పుచున్నారు (9). ఆ రెండిటికీ ప్రభువు అగుటచే శివునకు సదసత్పతి అని పేరు. శివుడ క్షర-అక్షర స్వరూపుడని కొందరు, మరి కొందరు ఆయన క్షరాక్షరములకు అతీతుడనియు చెప్పుచున్నారు. (10).

క్షరస్సర్వాణి భూతాని కూటస్థో%క్షర ఉచ్యతే | ఉభేతే పరమేశస్య రూపే తస్య వశే యతః || 11

తయోః పరశ్శివశ్శాంతః క్షరాక్షరపరస్స్మృతః | సమష్టివ్యష్టిరూపం చ సమష్టివ్యష్టకారణమ్‌ || 12

వదంతి మునయః కేచిచ్ఛివం పరమకారణమ్‌ | సమష్టిమాహురవ్యక్తం వ్యష్టిం వ్యక్తం తథైవ చ || 13

తే రూపే పరమేశస్య తదిచ్ఛాయాః ప్రవర్తనాత్‌ | తయోః కారణభావేన శివం పరమకారణమ్‌ || 14

కారణార్థవిదః ప్రాహుస్సమష్టివ్యష్టికారణమ్‌ | జాతివ్యక్తిస్వరూపీతి కథ్యతే కైశ్శిదీశ్వరః || 15

యా పిండేప్యనువర్తేత సా జాతిరితి కథ్యతే | వ్యక్తిర్వ్యావృత్తిరూపం తం పిండజాతేస్సమాశ్రయమ్‌ || 16

జాతయో వ్యక్తయశ్చైవ తదాజ్ఞాపరిపాలితాః | యతస్తతో మహాదేవో జాతివ్యక్తి వపుస్స్మృతః || 17

ప్రధానపురుషవ్యక్తకాలాత్మా కథ్యతే శివః | ప్రధానం ప్రకృతిం ప్రాహుః క్షేత్రజ్ఞం పురుషం తథా || 18

త్రయోవింశతితత్త్వాని వ్యక్తమాహుర్మనీషిణః | కాలః కార్యప్రపంచస్య పరిణామైకకారణమ్‌ || 19

ఏషామీశో%ధిపా ధాతా ప్రవర్తకనివర్తకః | ఆవిర్భావతిరోభావహేతురేకస్స్వరాడజః || 20

సకలపదార్థములు క్షరము (నశించునది) అనబడును. కమ్మరివాని దాగలి వలె వికారములు లేని చైతన్యము అక్షరమనబడును. ఆ రెండు పరమేశ్వరుని రూపములే. ఏలయనగా, అవి ఆయన వశములో నున్నవి (11). ఆ రెండింటికీ అతీతమైనవాడు, శాంతుడు అగు శివుడు క్షరాక్షరపరుడు అని చెప్పబడు చున్నాడు. సమష్టి మరియు వ్యష్టి మరియు వ్యష్టి శివుని రూపమే. సమష్టికి మరియు వ్యష్టికి ఆయనయే కారణమగుచున్నాడు (12). శివుడు సర్వకారణకారణుడని కొందరు మునులు చెప్పుచున్నారు. అవ్యక్తము (జగద్బీజము) నకు సమష్టి అనియు, వ్యక్తము (జగత్తు) నకు వ్యష్టి అనియు పేరు (13). అవి పరమేశ్వరుని ఇచ్ఛనుండి ఉద్భవించుట వలన ఆయన రూపములు అగుచున్నవి. ఆ సమష్టివ్యష్టులకు కారణమగుట వలన శివుడు పరమకారణమని కారణతత్త్వము తెలిసిన పెద్దలు చెప్పుచున్నారు. ఈశ్వరుడు జాతివ్యక్తిస్వరూపుడని కొందరు చెప్పుచున్నారు (14,15). ప్రతి శరీరమునందు అనువృత్తమగునది జాతి అనబడును. శరీరరముయొక్క జాతిని ఆశ్రయించికొని ఉండి దానిని ఇతరమునుండి వేరు చేసి చూపునది వ్యక్తి అనబడును (16). జాతులు మరియు వ్యక్తులు ఆ శివుని ఆజ్ఞ చేతనే పరిపాలించ బడుచున్నవి. కావుననే, మహాదేవుడు జాతివ్యక్తులే శరీరముగా గలవాడని చెప్పబడుచున్నాడు (17). ప్రధానము, పురుషుడు, వ్యక్తము, కాలము స్వరూపముగా గలవాడు శివుడు అని చెప్పబడుచున్నాడు. ప్రధానమనగా జగత్తుయొక్క ఉపాదానము. క్షేత్రము (దేహేంద్రియమనస్సంఘాతము) ను తెలియు చేతనుడు పురుషుడనబడును (18). ఇరవై మూడు తత్త్వములకు వ్యక్తమని పేరు అని విద్వాంసులు చెప్పుచున్నారు. కార్యజగత్తులో వచ్చే మార్పులకు కాలమే ఏకైక కారణము (19). స్వయంప్రకాశస్వరూపుడు, పుట్టుక లేనివాడు, అద్వితీయుడు అగు శివుడు వీటిని సృష్టించి ప్రవర్తింపజేసి, నివర్తింపజేసి, ఇవి అవిర్భవించుటకు, మరల అంతర్ధానమగుటకు కారణమగుచున్నాడు (20).

తస్మాత్ర్పధానపురుషవ్యక్తకాలస్వరూపవాన్‌ | హేతుర్నేతాధిపస్తేషాం ధాతా చోక్తో మహేశ్వరః || 21

విరాడ్ధిరణ్యగర్భాత్మా కైశ్చిదీశో నిగద్యతే | హిరణ్యగర్భో లోకానాం హేతుర్విశ్వాత్మకో విరాట్‌ || 22

అంతర్యామీ పరశ్చేతి కథ్యతే కవిభిశ్శివః | ప్రాజ్ఞసై#్తజసవిశ్వాత్మేత్యపరే సంప్రచక్షతే || 23

తురీయమపరే ప్రాహుస్సౌమ్యమేవ పరే విదుః | మాతా మానం చ మేయం చ మతిం చాహురథాపరే || 24

కర్తా క్రియా చ కార్యం చ కరణం కారణం పరే | జాగ్రత్స్వప్నసుషుప్త్యాత్మేత్యపరే సంప్రచక్షతే || 25

తురీయమపరే ప్రాహుస్తుర్యాతీతమితీతరే | తమాహర్విగుణం కేచిద్గుణవంతం పరే విదుః || 26

కేచిత్సంసారిణఁ ప్రాహుస్తమసంసారిణం పరే | స్వతంత్రమపరే ప్రాహుమస్వతంత్రం పరే విదుః || 27

ఘోరమిత్యపరే ప్రాహుస్సౌమ్యమేవ పరే విదుః | రాగవంతం పరే ప్రాహుర్వీతరాగం తథాపరే || 28

నిష్ర్కియం చ పరే ప్రాహుస్సక్రియం చేతరే జనాః | నిరింద్రియం పరే ప్రాహుస్సేంద్రియం చ తథాపరే || 29

ధ్రువమిత్యపరే ప్రాహుస్తమధ్రువమితీతరే | అరూపం కేచిదాహుర్వై రూపవంతం పరే విదుః || 30

కావున, ప్రధానము పురుషుడు వ్యక్తము మరియు కాలము అనునవి స్వరూపముగా గల మహేశ్వరుడు వాటికి కారణమై వాటిని సృష్టించి వాటిని నడిపిస్తూ వాటికి అధిపతి అగుచున్నాడని చెప్పబడినది (21). ఈశ్వరుడు విరాట్‌ (స్థూలజగదభిమాని) అనియు, హిరణ్యగర్భుడు (సూక్ష్మజగదభిమాని) అనియు కొందరు చెప్పుచున్నారు. లోకములకు కారణమైనవాడు హిరణ్యగర్భుడు. స్థూలజగత్స్వరూపుడు విరాట్‌ (22). శివుడు అంతర్యామి రూపముగా నున్న పరంబ్రహ్మ అని విద్వాంసులు చెప్పుచున్నారు. ఆయన ప్రాజ్ఞ (నిద్రావస్థాభిమాని), తైజస (స్వప్నావస్థాభిమాని), విశ్వ (జాగ్రదవస్థాభిమాని) స్వరూపుడని మరికొందరు చెప్పుచున్నారు (23). ఆయన తురీయుడు (మూడు అవస్థలకు అతీతుడు) అని మరికొందరు చెప్పుచున్నారు. ఆయన అఘోరరూపుడని కొందరు చెప్పుచున్నారు. ప్రమాత (తెలుసుకొనువాడు), ప్రమాణము (తెలుసుకొనే సాధనము), ప్రమేయము (తెలియబడేది), మరియు ప్రమా (జ్ఞానము) అనునవి ఆయన స్వరూపమేనని ఇంకొందరు చెప్పుచున్నారు (24). కర్త, క్రియ, కార్యము, సాధనము, కారణము కూడా ఆయనయేనని కొందరు చెప్పుచున్నారు. ఆయన జాగ్రత్స్యప్నసుషుప్తులనే అవస్థలే స్వరూపముగా గలవాడని మరికొందరు చెప్పుచున్నారు (25). ఆయన తురీయుడు (మూడు అవస్థలకు సమానమగు చైతన్యము) అని కొందరు చెప్పగా, తురీయమునకు అతీతుడని మరి కొందరు చెప్పుచున్నారు (26). ఆయన సంసారి అని కొందరు చెప్పగా అసంసారి అని మరి కొందరు చెప్పుచున్నారు. ఆయన స్వతంత్రుడని కొందరు, అస్వతంత్రుడని మరి కొందరు చెప్పుచున్నారు (27). ఆయన భయంకరాకారుడని కొందరు, ప్రసన్నమగు ఆకారము గలవాడని మరికొందరు చెప్పుచున్నారు. ఆయన రాగము గలవాడని కొందరు, విరాగి యని మరి కొందరు చెప్పుచున్నారు (28). ఆయన క్రియ గలవాడని కొందరు చెప్పగా, మరి కొందరు జనులు ఆయనయందు క్రియ లేదని చెప్పుచున్నారు. ఆయనకు ఇంద్రియములు లేవని కొందరు, కలవని మరికొందరు చెప్పుచున్నారు (29). ఆయన శాశ్వతుడని కొందరు, కాదని కొందరు చెప్పుచున్నారు. ఆయనకు రూపము లేదని కొందరు, ఉన్నదని మరి కొందరు చెప్పుచున్నారు (30).

అదృశ్యమపరే ప్రాహుర్దృశ్యమిత్యపరే విదుః | వాచ్యమిత్యపరే ప్రాహురవాచ్యమితి చాపరే |

శబ్దాత్మకం పరే ప్రాహుశ్శబ్దాతీతమథాపరే || 31

కేచిచ్చింతామయం ప్రాహుశ్చింతయా రహితం పరే | జ్ఞానాత్మకం పరే ప్రాహుర్విజ్ఞానమితి చాపరే || 32

కేచిత్‌ జ్ఞేయమితి ప్రాహురజ్ఞేయమితి కేచన | పరమేకే తమేవాహురపరం చ తథా పరే || 33

ఏవం వికల్పమానం తు యాథాత్మ్యం పరమేష్ఠినః | నాధ్యవస్యంతి మునయో నానాప్రత్యయకారణాత్‌ || 34

యే పునస్సర్వభావేన ప్రపన్నాః పరమేశ్వరమ్‌ | తే హి జానంత్యయత్నేన శివం పరమకారణమ్‌ || 35

యావత్పశుర్నైవ పశ్యత్యనీశం పురాణం భువనస్యేశితారమ్‌ | తావద్దుఃఖే వర్తతే బద్ధపాశస్సంసారో%స్మిన్‌ చక్రనేమిక్రమేణ || 36

యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిమ్‌ |

తదా విద్వాన్‌ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమముపైతి సామ్యమ్‌ || 37

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివతత్త్వ నిరూపణం నామ పంచమో%ధ్యాయః (5).

ఆయన కంటికి కానరాడని కొందరు, కానవచ్చునని మరికొందరు అభిప్రాయ పడుచున్నారు. ఆయన వాక్కులకు గోచరము కాడని కొందరు, అగునని మరికొందరు చెప్పుచున్నారు. ఆయన శబ్దస్వరూపుడన కొందరు, శబ్దమునకు అతీతుడని మరికొందరు చెప్పుచున్నారు. (31). ఆయన మనస్సునకు గోచరమగునని కొందరు చెప్పగా, మనస్సునకు అతీతుడని మరికొందరు చెప్పుచున్నారు. ఆయన నిర్విశేషజ్ఞానస్వరూపుడని కొందరు చెప్పగా, సవిశేషజ్ఞానస్వరూపుడని మరి కొందరు చెప్పుచున్నారు (32). ఆయన తెలియబడునని కొందరు చెప్పగా, తెలియబడడని మరికొందరు చెప్పచున్నారు. ఆయన నిర్గుణుడని కొందరు, సగుణుడని మరికొందరు చెప్పచున్నారు (33). ఈ విధముగా వివిధములగు అభిప్రాయములు ఉన్న కారణముగా మునులు ఆ పరమేశ్వరుని యథార్థస్వరూపమును గురించి కల్పనలను చేయుచూ నిశ్చయమునకు రాలేక పోవుచున్నారు (34). కాని, ఎవరైతే పరమేశ్వరుడే సర్వస్వము అనే భక్తితో శరణు జొచ్చెదరో, వారు అనాయాసముగా సర్వకారణకారణుడగు శివుని తెలుసుకొనుచున్నారు (35). తనకంటె అధికుడగు ఈశ్వరుడు లేనివాడు, సనాతనుడు, భువనమును పాలించువాడు అగు పరమేశ్వరుని జీవుడు ఎంతవరకు తెలియజాలడో, అంతవరకు దుఃఖముతో నిండిన ఈ సంసారమునందు రథచక్రము యొక్క ధారకు ఉండే క్రమములో క్రిందికి పైకి తిరుగుచుండును (36). ఎప్పుడైతే వివేకము గల సాధకుడు స్వయంప్రకాశస్వరూపుడు, జగత్కర్త, చేతనుడు బ్రహ్మగారికి కూడ కారణమైనవాడు అగు ఈశ్వరుని దర్శించునో, అపుడా జ్ఞాని పుణ్యపాపములను దులిపి వేసుకొని నిర్మలుడై ఆ పరమేశ్వరునితో సర్వోత్తమమగు అభేదమును పొందును (37).

శ్రీ శివమహాపురాణములోని వాయువీయసంహితయందు ఉత్తరఖండలో శివతత్త్వమును నిరుపించే అయిదవ అధ్యాయము ముగిసినది (5).

Siva Maha Puranam-4    Chapters