Siva Maha Puranam-4    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

శివుడు అష్టమూర్తి

ఉపమన్యురువాచ |

శృణు కృష్ణ మహేశస్య శివస్య పరమాత్మనః | మూర్త్వాత్మభిస్తతం కృత్స్నం జగదేతచ్చరాచరమ్‌ || 1

స శివస్సర్వమేవేదం స్వకీయాభిశ్చ మూర్తిభిః | అధితిష్ఠత్యమేయాత్మా హ్యేతత్సర్వమనుస్మృతమ్‌ || 2

బ్రహ్మా విష్ణుస్తథా రుద్రో మహేశానస్సదాశివః | మూర్తయస్తస్య విజ్ఞేయా యాభిర్విశ్వమిదం తతమ్‌ || 3

అథాన్యాశ్చాపి తనవః పంచ బ్రహ్మసమాహ్వయాః | తనూభిస్తాభిరవ్యాప్తమిహ కించిన్న విద్యతే || 4

ఈశానః పురుషో% ఘోరో వామస్సద్యస్తథైవ చ | బ్రహ్మాణ్యతాని దేవస్య మూర్తయః పంచ విశ్రుతాః || 5

ఈశానాఖ్యా తు యా తస్య మూర్తిరాద్యా గరీయసీ | భోక్తారం ప్రకృతేస్సాక్షాత్‌ క్షేత్రజ్ఞమధితిష్ఠతి || 6

స్థాణోస్తత్పురుషాఖ్యా యా మూర్తిర్మూర్తిమతః ప్రభోః | గుణాశ్రయాత్మకం భోగ్యమవ్యక్తమధితిష్ఠతి || 7

ధర్మాద్యష్టాంగసంయుక్తం బుద్ధితత్త్వం పినాకినః | అధితిష్ఠత్యఘోరాఖ్యా మూర్తిరత్యంతపూజితా || 8

వామదేవాహ్వాయాం మూర్తిం మహాదేవస్య వేధసః అహంకృతేరధిష్ఠాత్రీమాహురాగమవేదినః || 9

సద్యోజాదాహ్వయాం మూర్తిం శంభోరమితవర్చసః | మనసస్సమధిష్ఠాత్రీం మతిమంతః ప్రచక్షతే || 10

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

ఓ కృష్ణా! వినుము. మహేశ్వరుడగు శివపరమాత్మయొక్క సగుణసాకారరూపములచే ఈ చరాచరజగత్తు అంతయు వ్యాపించబడి యున్నది (1). ప్రత్యక్షాదిప్రమాణములకు గోచరము కాని స్వరూపము గల ఆ శివుడు ఈ సకలజగత్తును తన మూర్తులచే అధిష్ఠించి యున్నాడు. ఈ విషయమునంతనూ మహర్షులు చెప్పియున్నారు (2). బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశానుడు, సదాశివుడు ఆ శివుని మూర్తులని తెలియవలెను. వీరిచే ఈ జగత్తు అంతయు వ్యాపించబడి యున్నది (3). ఇంతే గాక, పంచబ్రహ్మలు అను పేరు గల ఇతరదేహములు కూడ గలవు. ఈ జగత్తులో ఆ దేహములచే వ్యాప్తము కానిది ఏదీ లేదు (4). ఈ శానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే ఆ దేవుని ఈ మూర్తులు పంచబ్రహ్మలు అని ప్రఖ్యాతిని గాంచి యున్నవి (5). మొదటిది, శ్రేష్ఠమైనది అగు ఈశాన అనే ఆయన మూర్తి సాక్షాత్తుగా ప్రకృతికి భోక్తయగు క్షేత్రజ్ఞుని అధిష్ఠించి యున్నది (6). చలనము లేనివాడే అయిననూ మూర్తులను స్వీకరించియున్న ఆ ప్రభుని తత్పురషమూర్తి సత్త్వరజస్తమోగుణములకు ఆశ్రయమై ఆ గుణములే స్వరూపముగా గల అవ్యక్తము (ప్రకృతి) ను అధిష్ఠించి యున్నది (7). పినాకధారియగు శివుని అతిశయించి పూజింపబడే అఘోరమూర్తి, ధర్మము మొదలగు ఎనిమిది అంగములతో కూడియున్న సమష్టిబుద్ధితత్త్వమును అధిష్ఠించి యున్నది (8). సృష్టికర్త యగు మహదేవుని వామదేవమూర్తి అహంకారమునకు అధిష్ఠానమని ఆగమవేత్తలు చెప్పుచున్నారు (9). అనంతమగు తేజస్సు గల శంభుని సద్యోజాతమూర్తి మనస్సునకు అధిష్ఠానమని బుద్ధిమంతులు చెప్పుచున్నారు (10).

శ్రోత్రస్య వాచశ్శబ్దస్య విభోర్వ్యోమ్నస్తథైవ చ | ఈశ్వరీమీశ్వరస్యేమామీశాఖ్యాం హి విదుర్బుధాః || 11

త్వక్పాణిస్పర్శవాయూనామీశ్వరీం మూర్తిమైశ్వరీమ్‌ | పురుషాఖ్యాం విదుస్సర్వే పురాణార్థవిశారదాః || 12

చక్షుషశ్చరణస్యాపి రూపస్యాగ్నేస్తథైవ చ | ఆఘోరాఖ్యామధిష్ఠాత్రీం మూర్తిమాహుర్మనీషిణః || 13

రసనాయాశ్చ పాయోశ్చ రసస్యాపాం తథైవ చ | ఈశ్వరీం వామదేవాఖ్యాం మూర్తిం తన్నిరతా విదుః || 14

ఘ్రాణస్య చైవోపస్థస్య గంధస్య చ భువస్తథా | సద్యోజాతాహ్వయాం మూర్తిమీశ్వరీం సంప్రచక్షతే || 15

మూర్తయః పంచ దేవస్య వందనీయాః ప్రయత్నతః | శ్రేయోర్థిభిర్నరైర్నిత్యం శ్రేయసామేకహేతవః || 16

తస్య దేవాధిదేవస్య మూర్త్యష్టకమయం జగత్‌ | తస్మిన్‌ వ్యాప్యం స్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ || 17

శర్వో భవస్తథా రుద్ర ఉగ్రో భీమః పశోః పతిః | ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః || 18

భూమ్యంభోగ్నిమరుద్వ్యోమక్షేత్రజ్ఞార్కనిశాకరాః | అధిష్ఠితా మహేశస్య శర్వాద్యైరష్టమూర్తిభిః || 19

చరాచరాత్మకం విశ్వం ధత్తే విశ్వంభరాత్మికా | శార్వీ శివాహ్వయా మూర్తిరితి శాస్త్రస్య నిశ్చయః || 20

చెవి, ముక్కు, శబ్దము, సర్వవ్యాపకమగు ఆకాశము అను వాటికి ఈశ్వరుని ఈ ఈశానమూర్తి అధిష్ఠానదైవమని పండితులు చెప్పుచున్నారు (11). చర్మము, చేయి, స్పర్శ, వాయువు అను వాటికి ఈశ్వరుని తత్పురుషమూర్తి అధిష్ఠానదైవమని పురాణతాత్పర్యమునందు నిష్ణాతులగు వారు అందరు చెప్పుచున్నారు (12). కన్ను, కాళ్లు, రూపము, అగ్ని అను వాటికి అఘోరమూర్తి అధిష్ఠానమని విద్వాంసులు చెప్పుచున్నారు (13). నాలుక, విసర్జనేంద్రియము, రసము, నీరు అను వాటికి ఈశ్వరుని వామదేవమూర్తి అధిష్ఠానమని ఆ ఈశ్వరభక్తులు చెప్పుచున్నారు (14). ముక్కు, జననేంద్రియము, గంధము, భూమి అను వాటికి ఈశ్వరుని సద్యోజాతమూర్తి అధిష్ఠానమని పెద్దలు చెప్పుచున్నారు (15). శ్రేయస్సులకు ఏకైకహేతువులు అగు ఆ దేవుని అయిదు మూర్తులను శ్రేయస్సులను గోరు మానవులు నిత్యము ప్రయత్నపూర్వకముగా నమస్కరించ వలెను (16). జగత్తు ఆ దేవాధిదేవుని ఎనిమిది మూర్తులతో నిండి యున్నది. ఆయనచే వ్యాపించబడియున్న జగత్తు సూత్రము నందు మణిగణములు వలె ఆయనయందు స్థితిని కలిగి యున్నది (17). శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అనే ఎనిమిది మూర్తులు ప్రసిద్ధముగా నున్నవి (18). శర్వుడు మొదలుగా గల మహేశ్వరుని ఈ ఎనిమిది మూర్తులచే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, చంద్రుడు అనునవి అధిష్ఠించబడి యున్నవి (19). శర్వుడు అను పేరు గల శివుని మూర్తి భూమి అను రూపములో నున్నదై చరాచరజగత్తును ధరించుచున్నదని శాస్త్రము నిర్ధారించినది. కావుననే భూమి అనే శివమూర్తికి శార్వీ అని పేరు (20).

సంజీవనం సమస్తస్య జగతస్సలిలాత్మికా | భావీతి గీయతే మూర్తిర్భవస్య పరమాత్మనః || 21

బహిరంతర్గతా విశ్వం వ్యాప్య తేజోమయీ శుభా | రౌద్రీ రుద్రాఖ్యయా మూర్తిరాస్థితా ఘోరరూపిణీ || 22

స్పందయత్యనిలాత్మదం బిభర్తి స్పందతే స్వయమ్‌ | ఔగ్రీతి కథ్యతే సద్భిర్మూర్తిరుగ్రస్య వేధసః || 23

సర్వావకాశదా సర్వవ్యాపికా గగనాత్మికా | మూర్తిర్భీమస్య భీమాఖ్యా భూతబృందస్య భేదికా || 24

సర్వాత్మనామధిష్ఠాత్రీ సర్వక్షేత్రనివాసినీ | మూర్తిః పశుపతేః జ్ఞేయా పశుపాశనికృంతనీ || 25

దీపయంతీ జగత్సర్వం దివాకరసమాహ్వయా | ఈశానాఖ్యా మహేశస్య మూర్తిర్దివి విసర్పతి || 26

అప్యాయయతి యో విశ్వమమృతాంశుర్నిశాకరః | మహాదేవస్య సా మూర్తిర్మహాదేవసమాహ్వయా || 27

ఆత్మా తస్యాష్టమీ మూర్తిశ్శివస్య పరమాత్మనః | వ్యాపికేతరమూర్తీనాం విశ్వం తస్మాచ్ఛివాత్మకమ్‌ || 28

వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వై యథా | శివస్య పూజయా తద్వత్పుష్యత్యస్య వపుర్జగత్‌ || 29

సర్వాభయప్రదానం చ సర్వానుగ్రహణం తథా | సర్వోపకారకరణం శివస్యారాధనం విదుః || 30

యథేహ పుత్రపౌత్రాదేః ప్రీత్యా ప్రీతో భ##వేత్పితా | తథా సర్వస్య సంప్రీత్యా ప్రీతో భవతి శంకరః || 31

దేహినో యస్య కస్యాపి క్రియతే యది నిగ్రహః | అనిష్టమష్టమూర్తేస్తత్కృతమేవ న సంశయః || 32

అష్టమూర్త్యాత్మనా విశ్వమధిష్ఠాయ స్థితం శివమ్‌ | భజస్వ సర్వభావేన రుద్రః పరమకారణమ్‌ || 33

సకలప్రాణుల ప్రాణములను నిలబెట్టే నీరు అనే పరమాత్మయగు భవుని మూర్తి భావీ అని కీర్తించబడుచున్నది (21). జగత్తును లోపల మరియు బయట వ్యాపించియున్న ఘోరమగు రూపము గల శుభకరమగు అగ్ని రుద్రుడు అనే మూర్తిచే అధిష్ఠించబడి రౌద్రీ అనబడుచున్నది (22). శివుడు తాను స్వయముగా స్పందిస్తూ వాయువును స్పందింపజేయును. సృష్టికర్తయగు శివుని ఉగ్రుడనే మూర్తి వాయురూపములో నుండి జగత్తును. నిలబెట్టుచున్నది. కావుననే, సత్పురుషులు వాయువును ఔగ్రి అను మూర్తిగా వర్ణించుచున్నారు (23). సర్వమునకు అవాకాశమునిచ్చునది, సర్వమును వ్యాపించునది, పదార్థసముదాయములో ఒకదానినుండి మరియొక దాని భేదమునకు ఆలంబనమైనది అగు అకాశము భీమా అనబడే భీముని మూర్తి (24). ఆత్మలన్నింటికీ అధిష్ఠానమగు పశుపతియొక్క చైతన్య స్వరూపము దేహములన్నింటి యందు నివసించు చున్నది. ఆ మూర్తి జీవుల బంధమును పోగొట్టును (25). దివాకరుడు అను పేరుతో జగత్తునంతనూ ప్రకాశింప జేయుచూ ఆకాశమునందు సంచరించే సూర్యుడు మహేశ్వరుని ఈశానమూర్తియొక్క రూపమే (26). జగత్తునకు రసముచే తృప్తినిచ్చువాడు, రాత్రిని చేయువాడు, అమృతకిరణుడు అగు చంద్రుడు మహాదేవుడగు శివుని మహాదేవుడు అను పేరు గల మూర్తియే (27). ఆ శివపరమాత్మ యొక్క ఎనిమిదవ మూర్తి ఆత్మ అది ఇతరమూర్తులను వ్యాపించి యున్నది. కావున, జగత్తునకు ఆత్మశివుడే (28). చెట్టుయొక్క వ్రేళ్లకు నీళ్లు పోసినచో, కొమ్మలు బలపడును. అదే విధముగా, శివుని పూజించినచో, శివుని దేహమగు జగత్తు బలపడును (29). శివుని పూజ సర్వులకు అభయమునిచ్చుననియు, సర్వులను అనుగ్రహించుననియు, సర్వులకు ఉపకారమును చేయుననియు పెద్దలు చెప్పుచున్నారు (30). ఈ లోకములో పుత్రులు పౌత్రులు మొదలగు వారు సంతోషముగా నున్నచో, తండ్రి సంతోషించును. అదే విధముగా, సర్వప్రాణులు సుఖముగా నున్నచో, శంకరుడు సంతోషించును (31). ఏ ప్రాణినైననూ బంధించి అపకారమును చేసినచో, అది అష్టమూర్తియగు శివునకు చేసినట్లే యగును. సందేహము లేదు (32). అష్టమూర్తి రూపములో జగత్తును అధిష్ఠించి యున్న శివుని, సర్వము బ్రహ్మయే నను భావముతో సేవించుము. సర్వకారణకారణుడు రుద్రుడే (33).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివుని అష్టమూర్తి స్వరూపమును వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).

Siva Maha Puranam-4    Chapters