Siva Maha Puranam-4    Chapters   

శ్రీ గణశాయ నమః | శ్రీ గౌరీశంకరాభ్యాం నమః |

వాయవీయసంహితా - ఉత్తరఖండ:

అథ ప్రథమో%ధ్యాయః

శ్రీకృష్ణునకు శివుడు వరమునిచ్చుట

||అథ సప్తమ్యాం వాయవీయసంహితాయాముత్తరఖండః ప్రారభ్యతే ||

ఓం నమస్సమస్తసంసారచక్రభ్రమణ హేతవే | గౌరీకుచతటద్వంద్వ కుంకుమాంకితవక్షసే || 1

ఇపుడు ఏడవదియగు వాయవీయసంహితయందు ఉత్తరఖండము ఆరంభింప బడుచున్నది. సకలసంసారము అనే చక్రము తిరుగుటకు కారణమైనవాడు, పార్వతీదేవియొక్క స్తనద్వంద్వమునందలి కుంకుమచే చిహ్నితమైన వక్షఃస్థలము గలవాడు అగు పరమేశ్వరునకు నమస్కారము (1).

సూత ఉవాచ |

ఉక్త్వా భగవతో లబ్ధప్రసాదాదుపమన్యునా | నియమాదుత్థితో వాయుర్మధ్యే ప్రాప్తే దివాకరే || 2

ఋషయశ్చాపి తే సర్వేనైమిషారణ్యవాసినః | అథాయమర్థః ప్రష్టవ్య ఇతి కృత్వా వినిశ్చయమ్‌ || 3

కృత్వా యథా స్వకం కృత్యం ప్రత్యహం తే యథా పురా | భగవంతముపాయాంతం సమీక్ష్య సముపావిశన్‌ || 4

అథాసౌ నియమస్వాంతే భగవానంబరోద్భవః | మధ్యే మునిసభాయాస్తు భేజే క్లుప్తం వరాసనమ్‌ || 5

సుఖాసనోపవిష్టశ్చ వాయుర్లోకనమస్కృతః | శ్రీమద్విభూతిమీశస్య హృది కృత్వే దమబ్రవీత్‌ || 6

తం ప్రపద్యే మహాదేవం సర్వజ్ఞమపరాజితమ్‌ | విభూతిస్సకలం యస్య చరాచరమిదం జగత్‌ || 7

ఇత్యాకర్ణ్య శుభాం వాణీమృషయః క్షీణకల్మషాః | విభూతివిస్తరం శ్రోతుమూచుస్తే పరమం వచః || 8

సూతుడు ఇట్లు పలికెను -

పరమేశ్వరుని అనుగ్రహమును పొందిన ఉపమన్యుని వృత్తాంతమును చెప్పిన తరువాత, సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చియున్న మధ్యాహ్న సమయములో నియమానుష్ఠానము కారణముగా వాయు దేవుడు అక్కడనుండి లేచెను (2). నైమిషారణ్యమునందు నివసించే ఆ ఋషులు అందరు కూడా, ఈ పైన మనమీ విషయమును ప్రశ్నిచవలెను అని నిశ్చయించుకొని (3), పుర్వములో ప్రతిదినము తాము ఏయే కృత్యములను చేసుకొనెడి వారో, ఆ పనులను పూర్తిచేసుకొని, దగ్గరకు వచ్చుచున్న వాయుభగవానుని గాంచి కూర్చుండిరి (4). ఈ వాయుభగవానుడు తన నిత్యానుష్ఠానమును పూర్తి చేసుకున్న పిదప మునుల సభలో మధ్యలో ఏర్పాటు చేయబడిన గొప్ప ఆసనమునందు కూర్చుండెను (5). లోకములలో పూజలనందుకొనే వాయువు సుఖకరమగు ఆసనమునందు కూర్చుండి పరమేశ్వరుని శోభాయుక్తమగు విభూతి (మహిమ ప్రకటనము) ని మనస్సులో భావన చేసి ఇట్లు పలికెను (6). సర్వము తెలిసిన వాడు, పరాజయమునెరుంగని వాడు అగు ఆ మహాదేవుని శరణు పొందుచున్నాను. ఈ చరాచరజగత్తు అంతయు ఆయన విభూతియే (7). నశించిన పాపములు గల ఋషులు ఈ శుభకరమగు మాటను విని ఆ విభూతియొక్క వివరములను వినుట కొరకై శ్రేష్ఠమగు వచనమును ఇట్లు పలికిరి (8).

ఋషయఊచుః |

ఉక్తం భగవతా వృత్తముపమన్యోర్మహత్మనః | క్షీరార్థేనాపి తపసా యత్ర్పాప్తం పరమేశ్వరాత్‌ || 9

దృష్టో %సౌ వాసుదేవేన కృష్ణేనాక్లిష్టకర్మణా | ధౌమ్యాగ్రజస్తతస్తేన కృత్వా పాశుపతం వ్రతమ్‌ || 10

ప్రాప్తం చ పరమం జ్ఞానమితి ప్రాగేవ శుశ్రుమ | కథం స లబ్ధవాన్‌ కృష్ణో జ్ఞానం పాశుపతం పరమ్‌ || 11

పూజ్యుడవగు నీవు మహాత్ముడగు ఉపమన్యుని వృత్తాంతమును, అతడు పాల కొరకై తపస్సును చేసి పరమేశ్వరుని నుండి పొందిన వివిధ వరములను గురించి చెప్పియుంటివి (9). వసుదేవుని కుమారుడు, కఠినకార్యములను కూడా అనాయాసముగా చేయువాడు అగు శ్రీకృష్ణుడు ధౌమ్యుని అన్నగారగు ఈ ఉపమన్యుని దర్శించినాడనియు, ఆ కారణముగా తరువాత ఆయన పాశుపతవ్రతమును చేసి (10), పరమజ్ఞానమును పొందినాడనియు ఇదివరకే వినియుంటిమి. ఆ శ్రీకృష్ణుడు సర్వోత్కృష్టమగు పాశుపతజ్ఞానమును పొందిన విధమెట్టిది? (11).

వాయురువాచ |

స్వేచ్ఛయా హ్యవతీర్ణోపి వాసుదేవస్సనాతనః | నిందయన్నివ మానుష్యం దేహశుద్ధిం చకార సః || 12

పుత్రార్థం హి తపస్తప్తుం గతస్తస్య మహామునేః | ఆశ్రమం మునిభిర్దృష్టం దృష్టవాంస్తత్ర వై మునిమ్‌ || 13

భస్మావదాతసర్వాంగం త్రిపుండ్రాంకితమస్తకమ్‌ | రుద్రాక్షమాలాభరణం జటామండలమండితమ్‌ || 14

తచ్ఛిష్యభూతైర్మునిభిశ్శాసై#్త్రర్వేదమివావ్రతమ్‌ | శివధ్యానరతం శాంతముపమన్యుం మహాద్యుతిమ్‌ || 15

నమశ్చకార తం దృష్ట్వా హృష్టసర్వతనూరుహః | బహుమానేన కృష్ణో%సౌ త్రిః కృత్వా తు ప్రదక్షిణమ్‌ |

స్తుతిం చకార సుప్రీత్యా నతస్కంధః కృతాంజలిః || 16

తస్యావలోకనాదేవ మునేః కృష్ణస్య ధీమతః | నష్టమాసీన్మలం సర్వ మాయాజం కార్మమేవ చ | | 17

తతఃక్షీణమలం కృష్ణముపమన్యుర్యథావిధి | భస్మనోద్ధూల్య తం మంత్రైరగ్నిరిత్యాదిభిఃక్రమాత్‌ || 18

అథ పాశుపతం సాక్షాద్వ్రతం ద్వాదశమాసికమ్‌ | కారయిత్వా మునిస్తసై#్మ ప్రదదౌ జ్ఞానముత్తమమ్‌ || 19

తదా ప్రభృతి తం కృష్ణం మునయశ్శంసితవ్రతాః | దివ్యాః పాసుపతాస్సర్వే పరివృత్యోపతస్థిరే || 20

తతో గురునియోగాద్వై కృష్ణః పరమశక్తిమాన్‌ | తపశ్చకార పుత్రార్థం సాంబముద్దిశ్య శంకరమ్‌ || 21

వాయువు ఇట్లు పలికెను -

సనాతనుడగు ఆ వాసుదేవుడు తన ఇచ్ఛచేతనే అవతరించిన వాడైననూ మనుష్యజన్మను నిందించుచున్నాడా యన్నట్లు దేహమునకు శుద్ధిని చేసుకొనెను (12). ఆయన పుత్రుల కొరకు తపస్సును చేయుటకై మహర్షులచే దర్శింపబడే ఆ మహామునియొక్క ఆశ్రమమునకు వెళ్లి, అక్కడ ఆ మునిని చూచెను (13). భస్మముచే తెల్లగా ప్రకాశించే సకలావయవములు గలవాడు, త్రిపుండ్రము దిద్దబడిన లలాటము గలవాడు, రుద్రాక్షమాలలే ఆభరణములుగా గలవాడు, జటామండలముచే ప్రకాశించువాడు (14), శాస్త్రములచే వేదము వలె తన శిష్యులగు మునులచే చుట్టువారబడి యుండువాడు, శివుని ధ్యానించుటయందు ప్రీతి గలవాడు, శాంతస్వభావము గలవాడు, గొప్ప కాంతి గలవాడు అగు ఆ ఉపమన్యుని దర్శించి నమస్కరించి, ఆనందముతో దేహమంతయు గగుర్పాటు గలవాడై, ఈ శ్రీకృష్ణుడు ఆదరముతో మూడు సార్లు ప్రదక్షిణమును చేసి, నడుమును వంచి చేతులను జోడించి పరమప్రీతితో స్తోత్రమును చేసెను (15, 16). ఆ మహర్షి యొక్క దర్శనమాత్రముచే బుద్ధిశాలియగు శ్రీకృష్ణుని దోషమంతయు, మాయనుండి మరియు కర్మనుండి పుట్టిన దోషము, నశించెను (17). తరువాత నశించిన దోషములు గల ఆ శ్రీకృష్ణునకు ఉపమన్యుమహర్షి యథావిధిగా, అగ్నిరితి భస్మ మొదలైన మంత్రములను వరుసగా పఠిస్తూ భస్మను శరీరమంతటా పూసి, తరువాత సాక్షాత్తుగా పాశుపతవ్రతమును పన్నెండు మాసములు చేయించి,అతనికి ఉత్తమమగు జ్ఞానమును ఇచ్చెను (18, 19). ఆ నాటినుండియు కొనియాడదగిన వ్రతములు గలవారు, దివ్యులు , పాశుపతులు అగు మునులందరు ఆ శ్రీకృష్ణుని చుట్టువారి స్తుతించిరి (20). తరువాత గొప్ప శక్తి గల శ్రీకృష్ణుడు గురువు యొక్క ఆజ్ఞచే పుత్రుని కొరకై జగన్మాతతో గూడియున్న శంకరుని ఉద్దేశించి తపస్సును చేసెను (21).

తపసా తేన వర్షాంతే దృష్టో%సౌ పరమేశ్వరః | శ్రియా పరమయా యుక్తస్సాంబశ్చ సగణశ్శివః || 22

వరార్ధమావిర్భూతస్య హరస్య సుభగాకృతేః | స్తుతిం చకార నత్వాసౌ కృష్ణస్సమ్యక్‌ కృతాంజలిః || 23

సాంబం సగుణమవ్యగ్రో లబ్ధవాన్‌ పుత్రమాత్మనః | తపసా తుష్టచిత్తేన దత్తం విష్ణోశ్శివేన వై || 24

యస్మాత్సాంబో మహాదేవః ప్రదదౌ పుత్రమాత్మనః | తస్మాజ్జాంబవతీసూనుం సాంబం చక్రే స నామతః || 25

తదేతత్కథితం సర్వం కృష్ణస్యామితకర్మణః | మహర్షేఃజ్ఞానలాభశ్చ పుత్రలాభశ్చ శంకరాత్‌ || 26

య ఇదం కీర్తయేన్నిత్యం శృణుయాచ్ఛ్రావయేత్తథా | స విష్ణోః జ్ఞానమాసాద్య తేనైవ సహ మోదతే || 27

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాముత్తరఖండే కృష్ణపుత్రప్రాప్తి వర్ణనం నామ ప్రథమో%ధ్యాయః (1).

ఆ తపస్సు చే సంవత్సరము తరువాత గొప్ప శోభ గలవాడు, జగన్మాతతో మరియు గణములతో కూడియున్నవాడు, మంగళస్వరూపుడు అగు ఈ పరమేశ్వరుడు దర్శనమిచ్చెను (22). వరములనిచ్చుటకై దర్శనమిచ్చిన సుందరాకారుడగు శివుడు ఈ శ్రీకృష్ణుడు చేతులను జోడించిచక్కగా నమస్కరించి స్తుతించెను (23). తపస్సుచే సంతోషించిన మనస్సు గల శివునిచే ఈయబడిన సాంబుడను వానిని విష్ణుని అవతారమగు శ్రీకృష్ణుడు తన పుత్రునిగా పొంది ప్రసన్నుడాయెను (24).సాంబుడు (జగన్మాతతో గూడియున్నవాడు) అగు మహాదేవుడు తనకు పుత్రుని అనుగ్రహించుటచే, ఆయన జాంబవతి యొక్క పుత్రునకు సాంబుడని పేరు పెట్టెను (25). ఈ విధముగా అనంతమగు కర్మలను చేసిన శ్రీకృష్ణుడు మహర్షి వద్దనుండి జ్ఞానమును పొందుట, శంకరుని నుండి పుత్రుని పొందుట అనే వృత్తాంతమునంతనూ చెప్పి యుంటిని (26). దీనిని ఎవడైతే నిత్యము కీర్తించునో, వినునో మరియు వినిపించునో , వాడు విష్ణువునుండి జ్ఞానమును పొంది ఆయనతో కలిసి ఆనందించును (27).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శ్రీకృష్ణునకు పుత్రుడు లభించుటను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Siva Maha Puranam-4    Chapters