Siva Maha Puranam-4    Chapters   

అథ త్రింశోధ్యాయః

మునులు శివతత్త్వమును గురించి ప్రశ్నించుట

ఋషయ ఊచుః |

చరితాని విచిత్రాణి గుహ్యాని గహనాని చ | దుర్విజ్ఞేయాని దేవైశ్చ మోహయంతి మనాంసి చ || 1

శివయోస్తత్త్వసంబంధే న దోష ఉపలభ్యతే | చరితైః ప్రాకృతో భావస్తయోరపి విభావ్యతే || 2

బ్రహ్మాదయో%పి లోకానాం సృష్టిస్థిత్యంతహేతవః | నిగ్రహానుగ్రహౌ ప్రాప్య శివస్య వశవర్తినః || 3

శివః పునర్న కస్యాపి నిగ్రహాను గ్రహాస్పదమ్‌ | అతో%నాయత్తమైశ్వర్యం తసై#్యవేతి వినిశ్చితమ్‌ || 4

యద్యేవమీదృశైశ్వర్యం తత్తు స్వాతంత్ర్యలక్షణమ్‌ | స్వభావసిద్ధం చైతస్య మూర్తిమత్తాస్పదం భ##వేత్‌ || 5

న మూర్తిశ్చ స్వతంత్రస్య ఘటతే మూలహేతునా | మూర్తేరపి చ కార్యత్వాత్తత్సిద్ధిస్స్యాదహైతుకీ || 6

సర్వత్ర పరమో భావో%పరమశ్చాన్య ఉచ్యతే | పరమాపరమౌ భావౌ కథమేకత్ర సంగతౌ || 7

నిష్కలో హి స్వభావో%స్య పరమః పరమాత్మనః | స ఏవ సకలః కస్మాత్స్వభావో హ్యవిపర్యయః || 8

స్వభావో విపరీతశ్చేత్స్వతంత్రస్స్వేచ్చయా యది | స కరోతి కిమీశానో నిత్యానిత్యవిపర్యయమ్‌ || 9

మూర్తాత్మాసకలః కశ్చిత్స చాన్యో నిష్కలశ్శివః | శివేనాధిష్ఠితశ్చేతి సర్వత్ర లఘు కథ్యతే || 10

ఋషులు ఇట్లు పలికిరి -

శివుని గృహస్థజీవనమునకు చెందిన చరిత్రలు విచిత్రమైనవి, లోతైనవి, దేవతలకైననూ తెలియుట కష్టము అయినవి. అవి మా మనస్సులకు మోహమును కలిగించుచున్నవి (1). పార్వతీపరమేశ్వరుల తత్త్వముల సంబంధము విషయములో దోషము కానవచ్చుట లేదు. కాని, వారి లీలలను బట్టి చూచినచో, వారు కూడ సాధారణ జీవులేనాయను ఊహ కలుగవచ్చును (2). లోకముల సృష్టిస్థితిలయములకు కారణభూతులైన బ్రహ్మ మొదలగు వారు కూడా శివుని వశములోనుండి ఆయనయొక్క నిగ్రహానుగ్రహములను (దండించుట మరియు వరముల నిచ్చుట) పొందినారు (3). కాని, శివుడు మరియొకని నిగ్రహానుగ్రహములకు విషయము అగుట లేదు. కావున, ఆయనయొక్క ఈశ్వరభావము నిరాటంకమైనదని నిశ్చయించ బడినది (4). శివుని ఈశ్వరభావము ఈ విధముగా స్వతంత్రమైనదైనచో, అది ఆయనకు స్వతస్సిద్ధము గావలెను. మరియు అది ఆయన సగుణరూపమును ఆశ్రయించి యుండవలెను (5). కాని ఈశ్వరుడు స్వతంత్రుడు మరియు మూలకారణుడు అగుటచే, ఆయనకు రూపము ఉండుట పొసగదు. రూపము కూడ కార్యమే (పుట్టునది) అగుటచే, ఈశ్వరుడు మూలకారణుడగుటచే, ఆ రూపము కారణము లేకుండగనే సిద్ధించవలసి యుండును (6). సర్వసందర్భములలో ఒక సద్వస్తువు, దానిపై భాసించే మరియొక మిధ్యాపదార్థము ఉండునని చెప్పబడినది. కాని, సత్యము మరియు మిథ్య ఒకే తత్త్వమునందు కలిసి సమగూడుటయెట్లు? (7) పరమాత్మయొక్క పరమార్థస్వరూపము నిర్గుణము. అట్టి పరమేశ్వరుడే రూపము గలవాడు ఎట్లు అయినాడు? స్వరూపము మార్పులకు లోను కాదు గదా! (8) ఈశ్వరుడు స్వతంత్రుడు గనుక, ఆయన తన ఇచ్ఛచే తన స్వరూపములో కూడ మార్పులను పొందవచ్చునని చెప్పే పక్షములో, ఆయన నిత్యములను అనిత్యములుగను, అనిత్యములను నిత్యములుగను ఏల చేయుట లేదు? (9) సగుణసాకారుడగు ఈశ్వరుడు ఒకడు. నిర్గుణుడగు శివుడు మరియొకడు. సగుణతత్త్వమునకు అధిష్ఠానము నిర్గుణము అని సర్వత్రా తేలికగా చెప్పబడుచున్నది (10).

మూర్త్యాత్మైన తదా మూర్తిశ్శివస్యాస్య భ##వేదితి | తస్య మూర్తౌ మూర్తిమతోః పారతంత్ర్యం హి నిశ్చితమ్‌ || 11

అన్యథా నిరపేక్షేణ మూర్తిస్స్వీక్రియతే కథమ్‌ | మూర్తిస్వీకరణం తస్మాన్మూర్తౌ సాధ్యఫలేప్సయా || 12

న హి స్వేచ్ఛాశరీరత్వం స్వాతంత్ర్యాయోపపద్యతే | స్వేచ్ఛైవ తాదృశీ పుంసాం యస్మాత్కర్మానుసారిణీ || 13

స్వీకర్తుం స్వేచ్ఛయా దేహం హాతుం చ ప్రభవంత్యుత | బ్రహ్మాదయః పిశాచాంతా| కింతే కర్మాతివర్తినః || 14

ఇచ్ఛయా దేహనిర్మాణమింద్రజాలోపమం విదుః | అణిమాదిగుణౖశ్వర్యవశీకారానతిక్రమాత్‌ || 15

విశ్వరూపం దధద్విష్ణుర్దధీచేన మహర్షిణా | యుధ్యతా సముపాలబ్ధస్తద్రూపం దధతా స్వయమ్‌ || 16

సర్వస్మాదధికస్యాపి శివస్య పరమాత్మనః | శరీరవత్తయాన్యాత్మసాధర్మ్యం ప్రతిభాతి నః || 17

సర్వానుగ్రాహకం ప్రాహుశ్శివం పరమకారణమ్‌ | స నిర్గృహ్ణాతి దేవానాం సర్వానుగ్రాహకః కథమ్‌ || 18

చిచ్ఛేద బహుశో దేవో బ్రహ్మణః పంచమం శిరః | శివనిందాం ప్రకుర్వంతం పుత్రేతి కుమతేర్హఠాత్‌ || 19

విష్ణోరపి నృసింహస్య రభసా శరభాకృతిః | బిభేద పద్ఛ్యామాక్రమ్య హృదయం నఖరైః ఖరైః || 20

అట్లైనచో, శివుడు సగుణరూపుడే యగుగాక! అని చెప్పినచో, మూర్తిని కలిగియున్న శివపార్వతులకు పరాధీనత తప్పని సరి యగును (11). అట్లు గానిచో, పరాపేక్ష లేని తత్త్వము సగుణరూపమునేల స్వీకరించ వలెను? మూర్తిచే పొందదగిన ఫలములయందు అపేక్ష ఉన్నప్పుడు మాత్రమే సగుణరూపమును స్వీకరించుట పొసగును (12). తన ఇచ్ఛచే శరీరమును స్వీకరించినాడు అని చెప్పుట ఈశ్వరుడు స్వతంత్రుడు అను సత్యమునకు అనురూపముగా లేదు. ఏలయనగా, పురుషులకు శరీరమును స్వీకరించుటలో గల అట్టి స్వేచ్ఛ కర్మను అనుసరించియే యుండును (13). బ్రహ్మతో మొదలిడి పిశాచము వరకు గల ప్రాణులు తమ ఇచ్ఛచేతనే దేహమును స్వీకరించి పరిత్యజించ గల్గుచున్నారు. వారందరు కర్మను దాటిన వారేనా యేమి? (14). ఇచ్ఛను అనుసరించి దేహమును ధరించుట ఇంద్రజాలము వంటిదని పెద్దలు చెప్పుచున్నారు. స్వేచ్ఛచే రూపమును స్వీకరించుట, అణిమాదిగుణములచే సంప్రాప్తమయ్యే ఈశ్వరభావము మరియు వశీకరణశక్తి కంటె అధికమైనది కాదు (15). దధీచమహర్షితో యుద్ధమును చేయు సమయములో విష్ణువు విశ్వరూపమును ధరించగా, దధీచుడు కూడ స్వయముగా విశ్వరూపమును దాల్చి విష్ణువును నిందించినాడు (16). శివుడు అందరికంటె అధికుడగు పరమాత్మయే అయిననూ, శరీరము గలవాడైనచో, ఇతరజీవులను పోలియున్నవాడే అగునని మాకు తోచుచున్నది (17). శివుడు సర్వకారణకారణుడనియు, సర్వులను అనుగ్రహించువాడనియు చెప్పెదరు. కాని, ఆయన దేవతలను దండించుచున్నాడు. అట్టి స్థితిలో సర్వులను అనుగ్రహించువాడు ఎట్లైనాడు? (18) పుత్రా! అని పిలుస్తూహఠమును చేస్తూ శివనిందను చేసే దుర్బుద్ధియగు బ్రహ్మయొక్క తలను పలుమార్లు ఆ దేవుడు ఖండించినాడు (19). ఆయన శరభరూపమును దాల్చి నృసింహరూపములోనున్న విష్ణువును బలాత్కారముగా కాళ్లతో తొక్కిపెట్టి పదునైన గోళ్లతో ఆయన హృదయమును చీల్చినాడు (20).

దేవస్త్రీ షు చ దేవేషు దక్షస్యాధ్వరకాణాత్‌ | వీరేణ వీరభ##ద్రేణ న హి కశ్చిదదండితః || 21

పురత్రయం చ సస్త్రీ కం సదైత్యం సహ బాలకైః | క్షణనైకేన దేవేన నేత్రాగ్నేరింధనీకృతమ్‌ || 22

ప్రజానాం రతిహేతుశ్చ కామో రతిపతిస్స్వయమ్‌ | క్రోశతామేవ దేవానాం హుతో నేత్రహుతాశ##నే || 23

గావశ్చ కాశ్చిద్దుగ్ధౌఘం స్రవంత్యో మూర్ధ్ని ఖేచరాః | సరుషా ప్రేక్ష్య దేవేన తత్‌క్షణ భస్మసాత్కృతాః || 24

జలంధరాసురో దీర్ణశ్చక్రీకృత్య జలం పదా | బద్ధ్వానంతేన యో విష్ణుం చిక్షేప శతయోజనమ్‌ || 25

తమేవ జలసంధాయీ శూలేనైవ జఘాన సః | తచ్ఛక్రం తపసా లబ్ధ్వా లబ్ధవీర్యో హరిస్సదా || 26

జిఘాంసతాం సురారీణాం కులం నిర్ఘృణచేతసామ్‌ | త్రిశూలేనాంధకస్యోరశ్శిఖినైవోపతాపితమ్‌ || 27

కంఠాత్కాలాంగనాం సృష్ట్వా దారకోపి నిపాతితః | కౌశికీం జనయిత్వా తు గౌర్యాస్త్వక్కోశగోచరామ్‌ || 28

శుంభస్సహ నిశుంభేన ప్రాపితో మరణం రణ | శ్రుతం చ మహదాఖ్యానం స్కాందే స్కందసమాశ్రయమ్‌ || 29

దక్షయజ్ఞము కారణముగా దేవతలలో గాని, దేవతల స్త్రీ లలో గాని, వీరుడగు వీరభద్రునిచే దండింపబడనివారు ఒక్కరైననూ లేరు (21). స్త్రీలతో, పిల్లలతో మరియు రాక్షసులతో కూడియున్న మూడు పురుములను ఆ దేవుడు ఒక క్షణములో తన నేత్రములోని అగ్నికి ఇంధనముగా చేసినాడు (22). స్త్రీ పురుషుల మధ్యలో ప్రేమకు కారణమైనవాడు, రతీదేవికి భర్త అగు మన్మథుని దేవతలు అక్రోశించుచుండగనే ఆయన స్వయముగా నేత్రాగ్నియందు హోమము చేసినాడు (23). కొన్ని ఆవులు ఆకసములో సంచరిస్తూ పాల ధారను శిరస్సుపై స్రవింప జేయగా, ఆ దేవుడు కోపముతో చూచి వెంటనే వాటిని బూడద చేసినాడు (24). విష్ణువును అనంతునితో బంధించి వంద యోజనముల దూరము వరకు విసిరి వేసిన జలంధరాసురుని ఆయన కాలితో నీటిని చక్రముగా చేసి పొడిచినాడు (25). ఆయన ఆ రాక్షసుని నీటిలో పారవైచి శూలముతో చంపినాడు. ఆ చక్రమును తపస్సు చేసి సంపాదించి విష్ణువు సర్వదా పరాక్రమమును కలిగి యున్నాడు (26). తనను చంపబోయిన నిర్దయులగు రాక్షసుల సమూహమును అగ్నితో కాల్చివేసి, ఆయన అంధకుని వక్షఃస్థలమును త్రిశూలముతో పొడిచినాడు (27). ఆయన కంఠమునుండి నల్లని యువతిని సృష్టించి, దారకుని సంహరించినాడు. గౌరీదేవియొక్క చర్మకోశమునుండి కౌశికిని సృష్టింపజేసి (28), యుద్ధములో శుంభనిశుంభులను సంహరింప జేసినాడు. స్కందుని మహిమను వర్ణించే గాథను స్కాందపురాణములో వినియుంటిమి (29).

వధార్థే తారకాఖ్యస్య దైత్యేంద్రస్యేంద్రవిద్విషః | బ్రహ్మణాభ్యర్థితో దేవో మందరాంతఃపురం గతః || 30

విహృత్య సుచిరం దేవ్యా విహారాతిప్రసంగతః | రసాం రసాతలం నీతామివ కృత్వాభిధాం తతః || 31

దేవీం చ వంచయంస్తస్యాం స్వవీర్యమతిదుర్వహమ్‌ | అవిసృజ్య విసృజ్యాగ్నౌ హవిః పూతమివామృతమ్‌ || 32

గంగాదిష్వపి నిక్షిప్య వహ్నిద్వారా తదంశతః | తత్సమాహృత్య శనకైః స్తోకం స్తోకమితస్తతః || 33

స్వాహయా కృత్తికారూపాత్స్వభర్త్రా రమమాణయా | సువర్ణీభూతయా న్యస్తం మేరౌ శరవణ క్వచిత్‌ || 34

సందీపయిత్వా కాలేన తస్య భాసా దిశో దశ | రంజయిత్వా గిరీన్‌ సర్వాన్‌ కాంచనీకృత్య మేరుణా || 35

తతశ్చిరేణ కాలేన సంజాతే తత్ర తేజసి | కుమారే సుకుమారాంగే కుమారాణాం నిదర్శనే || 36

తచ్ఛైశవం స్వరూపం చ తస్య దృష్ట్వా మనోహరమ్‌ | సహ దేవాసురైర్లోకైర్విస్మితే చ విమోహితే || 37

దేవో%పి స్వయమాయాతః పుత్రదర్శనలాలసః | సహ దేవ్యాంకమారోప్య తతో%స్య స్మేరమాననమ్‌ || 38

పితామృతమివ స్నేహవివశేనాంతరాత్మనా | దేవేష్వపి చ పశ్యత్సు వీతరాగైస్తపస్విభిః || 39

స్వస్య వక్షఃస్థలే సై#్వరం నర్తయిత్వా కుమారకమ్‌ | అనుభూయ చ తత్ర్కీడాం సంభావ్య చ పరస్పరమ్‌ || 40

ఇంద్రుని ద్వేషించే వీరుడగు తారకాసురుని వధించుట కొరకై బ్రహ్మచే అభ్యర్థించ బడిన ఆ దేవుడు మందరపర్వతమునందు అంతఃపురము లోనికి వెళ్లి (30), చాల కాలము దేవితో గూడి విహరించి, ఆ విహారముయొక్క ఆధిక్యముచే భూమి పాతాళము లోనికి క్రుంగి పోవునా యన్నట్లు చేసి, తరువాత (31) దేవిని మోసగించి, మిక్కిలి సహింప శక్యము కాని తన తేజస్సును ఆమెయందు నిక్షేపించకుండగా, పవిత్రమగు హవిస్సును వలె ఆ అమృతరూపమగు తేజస్సును అగ్నియందు నిక్షేపించి (32), ఆ అగ్ని ద్వారా అగ్నియొక్క అంశతో గంగ మొదలగు వాటియందు నిక్షేపింప జేసి, దానిని గంగలో మెల్లమెల్లగా ఇటు నటు ప్రవహింప జేసి తీసుకు వచ్చెను (33). కృత్తికల రూపములో తన భర్తతో రమిస్తూ గొప్ప తేజస్సును పొంది బంగరు రంగుతో ప్రకాశించే స్వాహాదేవి దానిని మేరుపర్వతమునందు ఒకచోట రెల్లుగడ్డియందు ఉంచెను. ఆ తేజస్సుయొక్క (34) కాంతిచే కొంత కాలము తరువాత పది దిక్కులు ప్రకాశించునట్లు చేసి, పర్వతములకు శోభను జేగూర్చి, మేరువునకు కూడ బంగారముయొక్క ప్రకాశము వచ్చునట్లు చేసెను (35). తరువాత చాల కాలము గడచిన పిదప అక్కడ ఆ తేజస్సునుండి బాలురందరికీ నిదర్శనమనదగిన సుకుమారమగు అవయవములు గల కుమారుడు పుట్టగా (36), ఆ బాలుని మనోహరమగు రూపమును గాంచి దేవతలు, రాక్షసులు, సకలప్రాణులు విస్మయమును విశేషమగు మోహమును చెందగా (37), పుత్రుని దర్శించ వలెననే ఉత్సాహము గల శివుడు స్వయముగా దేవితో గూడి వచ్చి ఒడిలో కూర్చుండ బెట్టుకుని, చిరునవ్వుతో కూడిన ఆ బాలుని ముఖమును ముద్దాడి (38), అమృతపానము చేసినాడా యన్నట్లు ఆనందించి, ప్రేమతో నిండి వశము తప్పిన అంతఃకరణము గలవాడై, దేవతలు మరియు విరాగులగు తపశ్శాలురు చూచుచుండగా (39), ఆ కుమారుని తన వక్షఃస్థలముపై యథేచ్ఛగా నాట్యమాడునట్లు చేసి, ఆ ఆటలోని ఆనందమును అనుభవించెను. శివపార్వతులు ఒకరినొకరు అభినందించు కొనిరి (40).

స్తన్యమాజ్ఞాపయన్దేవ్యాః పాయయిత్వామృతోపమమ్‌ | తవావతారో జగతాం హితాయేత్యనుశాస్య చ || 41

స్వయం దేవశ్చ దేవీ చ న తృప్తిముపజగ్మతుః | తతశ్శక్రేణ సంధాయ బిభ్యతా తారకాసురాత్‌ || 42

కారయిత్వాభిషేకం చ సేనాపత్యే దివౌకసామ్‌ | పుత్రమంతరతః కృత్వా దేవేన త్రిపురద్విషా || 43

స్వయమంతర్హితేనైవ స్కందమింద్రాదిరక్షితమ్‌ | తచ్ఛక్త్యా క్రౌంచభేదిన్యా యుధి కాలాగ్నికల్పయా || 44

ఛేదితం తారకస్యాపి శిరశ్శక్రభియా సహ | స్తుతిం చక్రుర్విశేషేణ హరిధాతృముఖాస్సురాః || 45

తథా రక్షోధిపస్సాక్షాద్రావణో బలగర్వితః | ఉద్ధరన్‌ స్వభుజైర్దీర్ఘైః కైలాసం గిరిమాత్మనః || 46

తదాగో%సహమానస్య దేవదేవస్య శూలినః | పదాంగుష్ఠపరిస్పందాన్మమజ్జ మృదితో భువి || 47

బటోః కేనచిదర్థేన స్వాశ్రితస్య గతాయుషః | త్వరయాగత్య దేవేన పాదాంతం గమితోంతకః || 48

స్వవాహనమవిజ్ఞాయ వృషేంద్రం బడబానలః | సగలగ్రహమానీతస్తతో%స్త్యేకోదకం జగత్‌ || 49

అలోకవిదితైసై#్తసై#్తర్వృత్తైరానందసుందరైః | అంగహారస్వసేనేదమసకృచ్చాలితం జగత్‌ || 50

శాంత ఏవ సదా సర్వమనుగృహ్ణాతి చేచ్ఛివః | సర్వాణి పూరయేదేవ కథం శ##క్తేన మోచయేత్‌ || 51

అనాదికర్మవైచిత్ర్యమపి నాత్ర నియామకమ్‌ | కారణం ఖలు కర్మాపి భ##వేదీశ్వరకారితమ్‌ || 52

కిమత్ర బహునోక్తేన నాస్తిక్యం హేతుకారకమ్‌ | యథా హ్యాశు నివర్తేత తథా కథయ మారుత || 53

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే శివతత్త్వ ప్రశ్నోనామ త్రింశో%ధ్యాయః (30).

ఆయన అపుడు దేవిని ఆజ్ఞాపించి పిల్లవానికి అమృతముతో సమానమగు పాలను ఇప్పించి, నీ అవతారము జగత్తులకు క్షేమమును చేకూర్చగలదని ఆశీర్వదించెను (41). శివునకు, పార్వతికి తృప్తి కలుగ లేదు. తరువాత తారకాసురుని వలన భయపడుచున్న ఇంద్రుని ఆ పిల్లవానితో కలిపించి (42), దేవసేనల అధ్యక్షపదవియందు అభిషేకమును చేయించి, ఆ బాలకుని దేవతల మధ్యలో విడిచి పెట్టి, త్రిపురాసురసంహారకుడగు ఆ శివుడు (43) స్వయముగా అంతర్ధానమును చెందెను. ఇంద్రాదులు స్కందుని చుట్టువారి రక్షించు చుండిరి. స్కందుడు క్రౌంచపర్వతమును భేదించినట్టియు, ప్రళయకాలాగ్నిని బోలియున్నశక్తితో యుద్ధమునందు (44) తారకుని శిరస్సును, ఇంద్రుని భయమును ఏకకాలములో ఛేదించెను. విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు స్కందుని అధికముగా స్తుతించిరి (45). అదే విధముగా బలముచే గర్వించియున్న రాక్షసరాజగు రావణుడు పొడవైన తన బాహువులతో, కైలాసపర్వతమును పైకి ఎత్తగా (46), ఆ దోషమును తాళజాలక దేవదేవుడు, త్రిశూలధారి యగు శివుడు కాలిబొటన వ్రేలిని కదిలించగా అణచి వేయబడిన రావణుడు భూమిలోనికి కూరుకొని పోయెను (47). అయుర్దాయము మూడియున్న ఒక బ్రహ్మచారి ఏదో ఒక కారణముతో తనను ఆశ్రయించగా, ఆ దేవుడు తొందరగా వచ్చి, యముడు పాదములపై పడునట్లు చేసెను (48). తన వాహనమగు గొప్ప ఎద్దును గుర్తు పట్ట లేక బడబాగ్ని మ్రింగి వేసెను. అపుడాయన ఆ వృషభమును విడిపించి మెడ పట్టుకొని తీసుకొని వచ్చెను. అపుడు జగత్తు అంతయు నీటితో నిండి పోయెను (49). జనులకు తెలియని ఇట్టి ఎన్నో సుందరమగు ఆనందమునిచ్చు చరితములను ఆయన చేసినాడు. శివుడు తన శరీరమునకు అభరణమగు ఆదిశేషుని ద్వారా పలుమార్లు బ్రహ్మాండమును కుదిపివేసినాడు (50). శివుడు సర్వదా శాంతస్వరూపుడై సర్వమును అనుగ్రహించే పక్షములో, కోరికలన్నింటినీ తీర్చి యుండెడివాడు. సమర్థుడగు శివుడు అందరికి ఏల మోక్షమునిచ్చుట లేదు? (51) అనాదికాలమునుండి వచ్చుచున్న జీవుల కర్మలలో తేడాలు ఉండుటచే అట్లు జరుగుట లేదని చెప్పుట పొసగదు. సుఖదుఃఖములకు కారణమగు కర్మ కూడ ఈశ్వరుని అధీనములోననే యున్నది (52). ఈ విషయములో ఇన్న మాటలేల? ఓ వాయూ! హేతువాదముపై ఆధారపడిన నాస్తిక్యము తొందరగా దూరమయ్యే విధముగా సమాధానమును చెప్పుము (53).

శ్రీశివమహాపురాణములోని వాయువీయసంహితయందు పూర్వఖండలో ఋషులు శివతత్త్వమును గురించి వేసిన ప్రశ్నలను వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).

Siva Maha Puranam-4    Chapters