Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

సన్న్యాస విధి

శ్రీసుబ్రహ్మణ్య ఉవాచ |

సాధు సాధు మహాభాగ వామదేవ మునీశ్వర | త్వమతీవ శివే భక్తశ్శివజ్ఞానవతాం వరః || 1

త్వయా త్వవిదితం కించిన్నాస్తి లోకేషు కుత్రచిత్‌ | తథాపి తవ వక్ష్యామి లోకానుగ్రహకారిణః || 2

లోకేస్మిన్‌ పశవస్సర్వే నానాశాస్త్ర విమోహితాః | వంచితాః పరమేశస్య మాయయా%తివిచిత్రయా || 3

న జానంతి పరం సాక్షాత్ప్రణవార్థం మహేశ్వరమ్‌ | సగుణం నిర్గుణం బ్రహ్మ త్రిదేవజనకం పరమ్‌ || 4

దక్షిణం బాహుముద్ధృత్య శపథం ప్రబ్రవీమితే | సత్యం సత్యం పునస్సత్యం సత్యం సత్యం పునః పునః || 5

ప్రణవార్థశ్శివస్సాక్షాత్ప్రాధాన్యేన ప్రకీర్తితః | శ్రుతిషు స్మృతిశాస్త్రే షు పురాణష్వాగమేషు చ || 6

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ | ఆనందం యస్య వై విద్వాన్న బిభేతి కుతశ్చన || 7

యస్మాజ్జగదిదం సర్వం విధివష్ణ్వింద్రపూర్వకమ్‌ | సహ భూతేంద్రియగ్రామైః ప్రథమం సంప్రసూయతే || 8

న సంప్రసూయతే యో వై కుతశ్చన కదాచన | యస్మిన్న భాసతే విద్యున్న చ సూర్యోన చంద్రమాః || 9

యస్య భాసా విభాతీదం జగత్సర్వం సమంతతః | సర్వైశ్వర్యేణ సంపన్నో నామ్నా సర్వేశ్వరస్స్వయమ్‌ || 10

శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇట్లు చెప్పెను -

బాగు. బాగు. ఓ మహాత్మా! వామదేవమహర్షీ! నీవు గొప్ప శివభక్తుడవు; శివజ్ఞానులలో శ్రేష్ఠుడవు (1).లోకములలో ఎక్కడైననూ నీకు తెలియనిది ఏదియు లేదు. అయిననూ, లోకముల ననుగ్రహించగోరే నీకు చెప్పెదను (2). పరమేశ్వరుని అతివిచిత్రమగు మాయచే ఈ లోకములో జీవులందరు అనేకశాస్త్రములచే మోహితులై మోసగింప బడుచున్నారు (3). సాక్షాత్తుగా పరబ్రహ్మ, ఓంకారవాచ్యుడు, సగుణుడు, నిర్గుణుడు, త్రిమూర్తులకు తండ్రి, వారికి అతీతుడు అగు మహేశ్వరుని జనులు తెలియకున్నారు (4). నేను నీ యెదుట కుడి చేతిన పైకెత్తి శపథమును చేయుచున్నాను. ఇదియే ముమ్మాటికీ సత్యము. మరల చెప్పుచున్నాను. ఇదియే ముమ్మారు సత్యము (5). శ్రుతి-స్మృతి-పురాణ-ఆగమములయందు ప్రధానముగా కీర్తింపబడిన శివుడే సాక్షాత్తుగా ఓంకారవాచ్యుడు (6). వాక్కులు మనస్సుతో సహా ఆ శివుని వర్ణించగోరి విఫలమై వెనుకకు మరలినవి. ఆయనయొక్క ఆనందస్వరూపమును ప్రత్యగభిన్నముగా నెరింగిన విద్వాంసుడు దేనివలనైననూ భయపడడు (7). బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదిదేవతలు, ప్రాణులు, వాటి ఇంద్రియముల సమూహములు అను వాటితో సహా ఈ జగత్తు అంతయు ఆదిలో ఆయన నుండియే ఉదయించుచున్నది (8). కాని, ఆయన ఏ నాడైననూ దేనినుండియైననూ పుట్టుట లేదు. ఆయనను మెరుపులు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని ప్రకాశింపజేయలేరు (9). ఈ జగత్తు అంతయు అన్ని విధములుగా ఆయన యొక్క ప్రకాశము చేతనే ప్రకాశించుచున్నది. సర్వైశ్వర్యసంపన్నుడగు ఆయనయే స్వయముగా సర్వేశ్వరుడు అను నామమునకు తగియున్నాడు (10).

యో వై ముముక్షుభిర్ధ్యేయశ్శంభురాకాశమధ్యగః | సర్వవ్యాపీ ప్రకాశాత్మా భాసరూపో హి చిన్మయః || 11

యస్య పుంసాం పరా శక్తిర్భావగమ్యా మనోహరా | నిర్గుణా స్వగుణౖరేవ నిగూఢా నిష్కలా శివా || 12

తదియం త్రివిధం రూపం స్థూలం సూక్ష్మం పరం తతః | ధ్యేయం ముముక్షుభిర్నిత్యం క్రమతో యోగిభిర్మునే || 13

నిష్కలస్సర్వదేవానామాదిదేవస్సనాతనః | జ్ఞానక్రియాస్వభావో యఃపరమాత్మేతి గీయతే || 14

తస్య దేవాధిదేవస్య మూర్తిస్సాక్షాత్సదాశివః | పంచమంత్రతనుర్దేవః కలాపంచకవిగ్రహః || 15

శుద్ధస్ఫటికసంకాశః ప్రసన్నశ్శీతలద్యుతిః | పంచవక్త్రో దశభుజస్త్రి పంచనయనః ప్రభుః || 16

ఈశానముకుటోపేతః పురుషాస్యః పురాతనః | అఘోరహృదయో వామదేవగుహ్యప్రదేశవాన్‌ ||17

సద్యపాదశ్చ తన్మూర్తిస్సాక్షాత్సకలనిష్కలః | సర్వజ్ఞత్వాదిషట్‌ శక్తిషడంగీకృతవిగ్రహః || 18

శబ్దాదిశక్తిస్ఫురితహృత్పంకజవిరాజితః | స్వశక్త్యా వామభాగే తు మనోమన్యా విభూషితః || 19

మంత్రాదిషడ్విధార్థానామర్థోపన్యాసమార్గతః | సమష్టివ్యష్టిభావార్థం వక్ష్యామి ప్రణవాత్మకమ్‌ || 20

ముముక్షువులు హృదయాకాశమధ్యమునందు సర్వవ్యాపకుడు, ప్రకాశస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చైతన్య స్వరూపుడు అగు శంభుని ధ్యానింతురు (11). మనోహరము, నిర్గుణము, కాని సగుణము, నిగూఢమైనది, నిరవయవము, మంగళకరము అగు ఆయనయొక్క పరాశక్తి మానవులకు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శింపదగును (12). ఓ మునీ! ముముక్షువులగు యోగులు స్థూలము, సూక్ష్మము మరియు పరము అనే ఆయనయొక్క మూడు రకములైన రూపములను ప్రతిదినము క్రమముగా ధ్యానించెదరు (13). అవయవములు లేనివాడు, దేవతలందరికీ ఆదిదేవుడు, సనాతనుడు, జ్ఞానము మరియు కర్మ స్వభావముగా గల వాడు అగు ఆ శివుడు పరమాత్మయని గానము చేయబడుచున్నాడు (14). దేవాధిదేవుడగు ఆ పరమాత్మయొక్క మూర్తియే సాక్షాత్తుగా సదాశివుడు. ఆ ప్రకాశస్వరూపునకు అయిదు మంత్రములు సూక్ష్మశరీరము మరియు అయిదు కళలు స్థూలదేహము అగుచున్నవి (15). స్వచ్ఛమగు స్ఫటికము వలె ప్రకాశించువాడు, ప్రసన్నుడు, చల్లని కాంతులు గలవాడు, అయిదు ముఖములు పది భుజములు పదిహేను కళ్లు గలవాడు, సర్వసమర్ధుడు, ఆదిపురుషుడు అగు ఆ పరమాత్మయొక్క మూర్తికి ఈశానుడే శిరస్సు, తత్పురుషుడే ముఖము, అఘోరుడే హృదయము, వామదేవుడే గుహ్యము, సద్యోజాతుడే పాదములు అగుచున్నారు. ఆయనయే సాక్షాత్తుగా సగుణుడు మరియు నిర్గుణుడు అగుచున్నాడు. సర్వజ్ఞత్వము మొదలగు ఆరు శక్తులు ఆయన దేహమునకు ఆరు అంగములగుచున్నవి (16-18). శబ్దము అనే ఆదిశక్తిచే ప్రకాశింప చేయబడిన హృదయపద్మములో విరాజిల్లే ఆ పరమాత్మ తన ఎడమ భాగమునందు మనోవృత్తులను ప్రేరేపించే చైతన్యస్వరూపమగు శక్తి (పార్వతి) చే అలంకరింప బడియున్నాడు (19). ఓంకారస్వరూపుడగు పరమేశ్వరుని సమష్టి-వ్యష్టిరూపముల తాత్పర్యమును నేను మంత్రము మొదలగు ఆరు విధముల తత్త్వములను వివరిస్తూ చెప్పగలను (20).

ఉపదేశక్రమో హ్యాదౌ వక్తవ్యః శ్రూయతామయమ్‌ | చాతుర్వర్ణ్యం హి లోకే% స్మిన్‌ ప్రసిద్ధం మానుషే మునే || 21

త్రై వర్ణికానామేవాత్ర శ్రుత్యాచారసమన్వయః | శుశ్రూషామాత్రసారా హి శూద్రాః శ్రుతిబహిష్కృతాః || 22

త్రై వర్ణికానాం సర్వేషాం స్వస్వాశ్రమరతాత్మనామ్‌ | శ్రుతిస్మృత్యుదితో ధర్మో% నుష్ఠేయో నాపరః క్వచిత్‌ || 23

శ్రుతిస్మృత్యుదితం కర్మ కుర్వన్‌ సిద్ధిమవాప్స్యతి | ఇత్యుక్తం పరమేశేన వేదమార్గప్రదర్శినా || 24

వర్ణాశ్రమాచారపుణ్యౖరభ్యర్చ్య పరమేశ్వరమ్‌ | తత్సాయుజ్యం గతాస్సర్వే బహవో మునిసత్తమాః || 25

బ్రహ్మచర్యేణ మునయో దేవా యజ్ఞక్రియా % ధ్వనా | పితరః ప్రజయా తృప్తా ఇతి హి శ్రుతిరబ్రవీత్‌ || 26

ఏవం ఋణత్రయాన్ముక్తో వానప్రస్థాశ్రమం గతః | శీతోష్ణసుఖదుఃఖాదిసహిష్ణుర్విజితేంద్రియః || 27

తపస్వీ విజితాహారో యమాద్యం యోగమభ్యసేత్‌ | తథా దృఢతరా బుద్ధి రవిచాల్యా భ##వేత్తథా || 28

ఏవం క్రమేణ శుద్ధాత్మా సర్వకర్మాణి విన్యసేత్‌ | సన్న్యస్య సర్వకర్మాణి జ్ఞానపూజాపరో భ##వేత్‌ || 29

సా హి సాక్షాచ్ఛివైక్యేన జీవన్ముక్తిఫలప్రదా | సర్వోత్తమా హి విజ్ఞేయా నిర్వికారా యతాత్మనామ్‌ || 30

ముందుగా ఉపదేశముయొక్క క్రమమును చెప్పవలసియున్నది. దీనిని వినుడు. ఓ మునీ! ఈ మానవలోకములో నాలుగు వర్ణములు ప్రసిద్ధములుగా నున్నవి (21). వేదాచారములు మూడు వర్ణముల వారికి మాత్రమే అన్వయించుచున్నవి. వేదకర్మలయందు అధికారము లేని వారు కేవలము శుశ్రూషను మాత్రమే చేయువారు శూద్రులనబడుచున్నారు (22). తమ తమ ఆశ్రమములయందు లగ్నమైన మనస్సులు గల మూడు వర్ణముల వారికి అందరికి శ్రుతిస్మృతులచే చెప్పబడిన ధర్మమును అనుష్ఠించుట తప్పని సరి యగుచున్నది (23). శ్రుతిస్మృతులచే చెప్పబడిన కర్మను చేయు మానవుడు సిద్ధిని పొందునని వేదమార్గమును ప్రదర్శించే పరమేశ్వరుడు చెప్పియున్నాడు (24). వర్ణాశ్రమాచారములను పాటించుట

చేత వచ్చే పుణ్యములచే పరమేశ్వరుని ఆరాధించి ఎందరో మహర్షులు ఆయన సాయుజ్యమును పొందియున్నారు. (25). వేదాధ్యయనముచే మునులు, యజ్ఞములను చేయుటచే దేవతలు, సంతానమును కనుటచే పితృదేవతలు సంతోషించెదరని వేదము చెప్పుచున్నది (26). మానవుడు ఈ తీరున మూడు ఋణముల నుండి విముక్తుడై వాన ప్రస్థాశ్రమమును చేరుకొని, చలి-వేడి సుఖము-దుఃఖము మొదలైన ద్వంద్వములను సహిస్తూ, ఇంద్రియములను జయించి, తపస్సును చేయుచూ, ఆహారనియమము గలవాడై యమనియమాది యోగసాధనలను అభ్యసించవలెను. అట్లు చేయుట వలన మనస్సు చాంచల్యమును విడనాడి మిక్కిలి దృఢమగును (27, 28). ఈ విధముగా కాలక్రమములో పరిశుద్ధమైన అంతఃకరణము గల వ్యక్తి సర్వకర్మలను విడిచిపెట్టి, జ్ఞానమునందు మరియు పూజయందు నిష్ఠను కలిగియుండవలెను (29). మనోజయము గల మహాత్ములకు సర్వశ్రేష్ఠము మరియు వికారములు లేనిది అగు ఈ జ్ఞాననిష్ఠ సాక్షాత్తుగా శివునితో ఐక్యమును కలిగించి జీవన్ముక్తి అనే ఫలమును ఇచ్చునని తెలియవలెను (30).

తత్ర్ప కారమహం వక్ష్యే లోకానుగ్రహకామ్యయా | తవ స్నేహాన్మహాప్రాజ్ఞ సావధానతయా శృణు || 31

సర్వశాస్త్రా ర్ధతత్త్వజ్ఞం వేదాంతజ్ఞానపారగమ్‌ | ఆచార్యముపగచ్ఛేత్స యతిర్మతిమతాం వరమ్‌ || 32

తత్సమీపముపవ్రజ్య యథావిధి విచక్షణః | దీర్ఘదండప్రణామాద్యైస్తోషయేద్యత్నతస్సుధీః || 33

యో గురుస్స శివః ప్రోక్తో యశ్శివస్స గురుస్మ్సృతః | ఇతి నిశ్చిత్య మనసా స్వవిచారం నివేదయేత్‌ || 34

లబ్ధానుజ్ఞస్తు గురుణా ద్వాదశాహం పయోవ్రతీ | శుక్లపక్షే చతుర్ధ్యాం వా దశమ్యాం వా విధానతః || 35

ప్రాతస్స్నాత్వా విశుద్ధాత్మా కృతనిత్యక్రియస్సుధీః | గురుమాహూయ విధినా నాందీశ్రాద్ధం సమారభేత్‌ || 36

విశ్వేదేవాస్సత్యవసుసంజ్ఞావంతః ప్రకీర్తితాః | దేవశ్రాద్ధే బ్రహ్మవిష్ణుమహేశాః కథితాస్త్ర యః || 37

ఋషిశ్రాద్ధే తు సంప్రోక్తా దేవక్షేత్రమనుష్యజాః | దేవశ్రాద్ధే తు వసురుద్రాదిత్యాస్సంప్రకీర్తితాః || 38

చత్వారో మానుషశ్రాద్ధే సనకాద్యా మునీశ్వరాః | భూతశ్రాద్ధే పంచ మహాభూతాని చ తతః పరమ్‌ || 39

చక్షురాదీంద్రియగ్రామో భూతగ్రామశ్చతుర్విధః | పితృశ్రాద్ధే పితా తస్య పితా తస్య పితా త్రయః || 40

ఓ మహాబుద్ధిశాలీ! లోకములను అనుగ్రహించవలెననే కోరికతో మరియు నీయందలి ప్రేమ వలన నేను ఆ విధానమును చెప్పగలను. సావధానముగా వినుము (31). ఆ యతి సర్వశాస్త్రముల సారతత్త్వమునెరింగినవాడు, వేదాంతజ్ఞానమునందు నిష్ణాతుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు ఆచార్యుని వద్దకు వెళ్లవలెను (32). విద్వాంసుడు, బుద్ధిమంతుడు అగు ఆ సాధకుడు ఆ గురువును యథావిధిగా సమీపించి, సాష్టాంగనమస్కారము మొదలగు వాటిచే ఆయనను ప్రసన్నుని చేసుకొనవలెను (33). గురువే శివుడు, శివుడే గురువని మహర్షులు చెప్పుచున్నారు. ఈ విషయమును మనస్సులో నిశ్చయించుకొని, తన అభిప్రాయమును గురువునకు తెలుపవలెను (34). గురువుయొక్క అనుమతిని పొంది పన్నెండు రోజులు పాలను మాత్రమే ఆహారముగా తీసుకొనవలెను. శుక్లపక్షచతుర్ధి నాడు గాని, దశమి నాడు గాని, యథావిధిగా (35) ఉదయమే స్నానము చేసి, బుద్ధిశాలియగు ఆ సాధకుడు పరిశుద్ధమగు అంతఃకరణము గలవాడై నిత్యకర్మలను ఆచరించి, గురువును ఆహ్వానించి, యథావిధిగా నాందీశ్రాద్ధము నారంభించవలెను (36). దేవశ్రాద్ధమునందు సత్యవసువులు అనే పేరు గల విశ్వేదేవతలు, బ్రహ్మవిష్ణురుద్రులనే త్రిమూర్తులు ఆరాధింపబడెదరు (37). ఋషిశ్రాద్ధమునందు దేవర్షులను, మానవులైన ఋషులను, దేవశ్రాద్ధమునందు వసువులను, రుద్రులను, ఆదిత్యులను ఆరాధించవలెను (38). మానుషశ్రాద్ధమునందు సనకుడు మొదలగు నలుగురు ఋషులను, భూతశ్రాద్ధమునందు పంచ మహాభూతములను, తరువాత (39) కన్ను మొదలగు ఇంద్రియాధిష్ఠానదేవతలను, నాలుగు రకముల ప్రాణులను, పితృశ్రాద్ధమునందు తండ్రి, తాత, ముత్తాత అను మూడు తరముల వారిని ఆరాధించవలెను (40).

మాతృశ్రాద్ధే మాతృపితామహ్యౌ చ ప్రపితామహీ | ఆత్మశ్రాద్ధే తు చత్వార ఆత్మా పితృపితామహౌ || 41

ప్రపితామహనామా చ సపత్నీకాః ప్రకీర్తితాః | మాతామహాత్మకశ్రాద్ధే త్రయో మాతామహాదయః || 42

ప్రతిశ్రాద్ధం బ్రాహ్మణానాం యుగ్మం కృత్వోపకల్పితాన్‌ | ఆహూయ పాదౌ ప్రక్షాల్య స్వయమాచమ్య యత్నతః || 43

సమస్తసంపత్సమవాప్తి హేతవస్సముత్థితాపత్కులధూమకేతవః ||

అపారసంసారసముద్రసేతవః పునంతు మాం బ్రహ్మణపాదరేణవః || 44

అసద్ఘనధ్వాంత సహస్ర భానవస్సమీహితార్థార్పణ కామధేనవః |

సమస్త తీర్థాంబు పవిత్ర మూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణపాదపాంసవః || 45

ఇతి జప్త్వా నమస్కృత్య సాష్టాంగం భువి దండవత్‌ | స్థిత్వా తు ప్రాఙ్ముఖశ్శంభోః పాదాబ్జయుగలం స్మరన్‌ || 46

సపవిత్రకరశ్శుద్ధ ఉపవీతీ దృఢాసనః | ప్రాణాయామత్రయం కుర్యాచ్ఛ్రుత్వా తిథ్వాదికం పునః || 47

మత్సన్న్యాసాంగభూతం యద్విశ్వే దేవాదికం తథా | శ్రాద్ధమష్టవిధం మాతామహాంతం పార్వణనవై || 48

విధానేన కరిష్యామి యుష్మదాజ్ఞాపురస్సరమ్‌ | ఏవం విధాయ సంకల్పం దర్భానుత్తరతస్త్యజేత్‌ || 49

ఉపస్పృశ్యాప ఉత్థాయ వరణక్రమమారభేత్‌ | పవిత్రపాణిస్సంస్పృశ్య వాణీం బ్రాహ్మణయోర్వదేత్‌ || 50

మాతృశ్రాద్ధమునందు తల్లి, తండ్రి యొక్క తల్లి మరియు ముత్తాతయొక్క భార్యలను, ఆత్మశ్రాద్ధమునందు భార్యలతో గూడియున్న తాను, తండ్రి, తాత, ముత్తాత అను నలుగురిని, మాతామహశ్రాద్ధమునందు తల్లియొక్క తండ్రిమొదలగు ముగ్గురిని ఆరాధించవలెను (41,42). ప్రతి శ్రాద్ధమునందు ఇద్దరు బ్రాహ్మణులను నిర్ణయించి వారిని ఆహ్వానించి వారి పాదములను శ్రద్ధతో కడిగి తాను ఆచమనమును చేయవలెను (43). సకలసంపదలను పొందుటకు కారణమైనవి, దెబ్బ తీయుటకు సిద్ధముగా నున్న ఆపదల సమూహమునకు తోకచుక్క వంటివి, అంతము లేని సంసారమనే సముద్రమునకు సేతువు వంటివి అగు బ్రాహ్మణపాదముల ధూళికణములు నన్ను పవిత్రము చేయుగాక! (44). ఆపత్తులనే దట్టనైన చీకటికి సూర్యుని వంటివి, కోరిన కోరికలను తీర్చుటలో కామధేనువు వంటివి, సమస్తపుణ్యతీర్థముల జలములతో సమానమైన పవిత్రత మూర్తీభవించినట్లున్నవి అగు బ్రాహ్మణపాదముల ధూళికణములు నన్ను రక్షించును గాక! (45) ఈ విధముగా జపించి, సాష్టాంగనమస్కారమును చేసి, తూర్పువైపు తిరిగి నిలబడి, శంభుని పాదపద్మయుగళమును స్మరించవలెను (46). చేతిలో దర్భముడిని పట్టుకొని శుచిగా నున్నవాడై యజ్ఞోపవీతమును సవ్యముగా నుంచుకొని, స్థిరముగా కూర్చుండి మూడు సార్లు ప్రాణాయామమును చేసి, తిథి మొదలగు వాటిని ఉచ్చరించవలెను (47). ' నా సన్న్యాసమునకు అంగముగా విశ్వేదేవతలతో మొదలిడి మాతామహశ్రాద్ధము వరకు గల ఎనిమిది శ్రాద్ధములను ప్రసిద్ధమగు పార్వణ (48) విధానముతో చేయుటకై మీ అనుమతిని కోరుచున్నాను' అని సంకల్పమును చేసి దర్భలను ఉత్తరదిక్కునందు విడువవలెను (49). నీటిని స్పృశించి లేచి నిలబడి వరుసగా బ్రాహ్మణులను ఆహ్వానించవలెను. చేతియందు దర్భముడి గలవాడై బ్రాహ్మణుల పాదములను స్పృశించి ఇట్లు చెప్పవలెను (50).

విశ్వేదేవార్థ ఇత్యాది భవద్భ్యాం క్షణ ఇత్యపి || 51

ప్రసాదనీయ ఇత్యంతం సర్వత్రైవం విధిక్రమః | ఏవం సమాప్య వరణం మండలాని ప్రకల్పయేత్‌ || 52

ఉదగారభ్య దశ చ కృత్వా%భ్యర్చనమక్షతైః | తేషు క్రమేణ సంస్థాప్య బ్రాహ్మణాన్‌ పాదయోః పునః || 53

విశ్వేదేవాదినామాని ససంబోధనముచ్చరేత్‌ |ఇదం వః పాద్యమితి సకుశపుష్పాక్షతోదకైః || 54

పాద్యం దత్త్వా స్వయమపి క్షాలితాంఘ్రిరుదఙ్ముఖః | ఆచమ్య యుగ్మక్లుప్తాంస్తానాసనేషూపవిశ్య చ || 55

విశ్వేదేవస్వరూపస్య బ్రాహ్మణస్యేదమాసనమ్‌ | ఇతి దర్భాసనం దత్త్వా దర్భపాణిస్స్వయం స్థితః || 56

అస్మిన్నాందీముఖశ్రాద్ధే విశ్వేదేవార్థ ఇత్యపి | భవద్భ్యాం క్షణ ఇత్యుక్త్వా క్రియతామితి సంవదేత్‌ || 57

ప్రాప్నుతామితి సంప్రోచ్య భవంతావితి సంవదేత్‌ | వదేతాం ప్రాప్నుయావేతి తౌ చ బ్రాహ్మణపుంగవౌ || 58

సంపూర్ణమస్తు సంకల్పసిద్ధిరస్త్వితి తాన్ప్రతి | భవంతో% నుగృహ్ణంత్వితి ప్రార్థయేద్ద్విజపుంగవాన్‌ || 59

తతశ్శుద్ధకదల్యాదిపాత్రేషు క్షాలితేషు చ | అన్నాదిభోజ్యద్రవ్యాణి దత్త్వా దర్భైః పృథక్‌ పృథక్‌ || 60

పరిస్తీర్య స్వయం తత్ర పరిషిచ్యోదకేన చ | హస్తాభ్యామవలంబ్యాథ పాత్రం ప్రత్యేకమాదరాత్‌ || 61

పృథివీ తే పాత్రమిత్యాది కృత్వా తత్ర వ్యవస్థితాన్‌ | దేవాదీంశ్చ చతుర్ధ్యంతాననూద్యాక్షతసంయుతాన్‌ || 62

'విశ్వేదేవార్థం భవంతౌ వృణ, భవద్భ్యాం క్షణః ప్రసాదనీయః (విశ్వేదేవతల కొరకు మిమ్ములనిద్దరినీ ఎన్నుకొంటిని. మీరిద్దరు కొద్ది సమయమును నాకు ఇచ్చి నన్ను అనుగ్రహించుడు)' అని పలుకవలెను. సర్వత్రా ఇదే పద్ధతిని పాటించవలెను. ఈ విధముగా ఆహ్వానించుటను పూర్తిచేసి, ఉత్తరముతో మొదలిడి పది మండలములను కల్పించవలెను. వాటిని అక్షతలతో పూజించి, వాటియందు వరుసగా బ్రాహ్మణులను నిలబెట్టి, వారి పాదములను మరల పూజించవలెను. (51-53). విశ్వేదేవాది దేవతలను వారి వారి నామములతో సంబోధించి, 'ఇదం వః పాద్యమ్‌ (%ుదగో, మీకు పాద్యము)' అని పలికి దర్భలు, పుష్పములు మరియు అక్షతలతో కూడిన నీటితో పాద్యమును ఇచ్చి, స్వయముగా వారి పాదములను కడిగి, ఉత్తరము వైపునకు తిరిగి ఆచమనమును చేసి, వారిని జంటలుగా ఆసనములయందు కూర్చుండబెట్టవలెను (54,55). 'విశ్వేదేవస్వరూపస్య బ్రాహ్మణస్యేదమాసనమ్‌ (విశ్వేదేవతల స్వరూపుడగు బ్రాహ్మణునకు ఇది ఆసనము)' అని పలికి, దర్భాసనమునిచ్చి, స్వయముగా దర్భలను చేతబట్టుకొని నిలబడవలెను (56). 'అస్మిన్నాందీముఖశ్రాద్ధే విశ్వేదేవార్ధే (ఈ నాందీముఖశ్రాద్ధములో విశ్వేదేవతల కొరకు,) భవద్భ్యాంక్షణః (మీరిద్దరు సమయమును) క్రియతామ్‌ (కేటాయించెదరు గాక!)'అని పలుకవలెను (57). 'ప్రాప్నుతాం భవంతౌ (మీరిద్దరు స్వీకరించుడు)' అని యజమాని పలుకగా, 'ప్రాప్నుయావ (స్వీకరించెదము)' అని ఆ బ్రాహ్మణశ్రేష్ఠులు ఇద్దరు పలికెదరు (58). 'సంపూర్ణమస్తు, సంకల్పసిద్ధరస్తు, భవంతో%నుగృహ్ణంతు (ఇది సంపూర్ణమగుగాక! సంకల్పము సిద్దించుగాక! మీరు అనుగ్రహించెదరు గాక!)' అని ఆ బ్రాహ్మణశ్రేష్ఠులను ప్రార్థించవలెను (59). తరువాత స్వచ్ఛమైన అరటి ఆకులు మొదలగు పాత్రలలో అన్నము మొదలగు ఆహారపదార్ధములను ఇచ్చి, వాటిని వేరు వేరుగా దర్భలతో కప్పి, స్వయముగా వాటి యందు నీటితో పరిషేచనమును చేసి, రెండు చేతులతో ఒక్కొక్క పాత్రను పట్టుకొని, 'పృథివీ తే పాత్రమ్‌ (భూమియే నీకు పాత్ర)' మొదలైన మంత్రములను సాదరముగా చెప్పి, అచట ఉపస్థితులై యున్న దేవతలు మొదలగు వారిని చతుర్థ్యంతశబ్ధములతో నిర్దేశించి అక్షతలతో పూజించవలెను (60-62).

ఉదగ్గృహీత్వా స్వాహేతి దేవార్ధే%న్నం యజేత్పునః | న మమేతి వదేదంతే సర్వత్రాయం విధిక్రమః || 63

యత్పాదపద్మస్మరణాద్యస్య నామజపాదపి | న్యూనం కర్మ భ##వేత్పూర్ణం తం వందే సాంబమీశ్వరమ్‌ || 64

ఇతి జప్త్వా తతో బ్రూయాన్మయా కృతమిదం పునః | నాందీముఖశ్రాద్ధమితి యథోక్తం చ వదేత్తతః || 65

అస్త్వితి బ్రూతేతి చ తాన్‌ ప్రసాద్య ద్విజపుంగవాన్‌ | విసృజ్య స్వకరస్థోదం ప్రణమ్య భువి దండవత్‌ || 66

ఉత్థాయ చ తతో బ్రూయాదమృతం భవతు ద్విజాన్‌ | ప్రార్థయేచ్చ పరం ప్రీత్యా కృతాంజలిరుదారధీః || 67

శ్రీరుద్రచమకం సూక్తం పౌరుషం చ యథావిధి | చిత్తే సదాశివం ధ్యాత్వా జపేద్ర్బ హ్మాణి పంచ చ || 68

భోజనాంతే రుద్రసూక్తం క్షమాపయ్య ద్విజాన్‌ పునః | తన్మంత్రేణ తతో దద్యాదుత్తరాపోశనం పురః || 69

ప్రక్షాలితాంఘ్రిరాచమ్య పిండస్థానం వ్రజేత్తతః | ఆసీనః ప్రాఙ్ముఖో మౌనీ ప్రాణాయామత్రయం చరేత్‌ || 70

నాందీముఖోక్తశ్రాద్ధాంగం కరిష్యే పిండదానకమ్‌ | ఇతి సంకల్ప్య దక్షాది సమారభ్యోదకాంతికమ్‌ || 71

నవ రేఖాస్సమాలిఖ్య ప్రాగగ్రాన్‌ ద్వాదశ క్రమాత్‌ | సంస్తీర్య దర్భాన్‌ దక్షాదిదేవాదిస్థానపంచకమ్‌ || 72

నీటిని తీసుకొని స్వాహా అని పలికి దేవతల కొరకు అన్నమును హోమము చేయవలెను. హోమద్రవ్యమును సమర్పించిన తరువాత 'న మమ (ఇది నాది కాదు)' అని త్యాగము చేయవలెను. సర్వత్రా ఇదే పద్ధతిని అవలంబించవలెను (63). ఎవని పాదపద్మములను స్మరించి ఎవని నామమును జపించినచో కర్మలోపములన్నియు తొలగిపోయి కర్మ పూర్ణమగునో, అట్టి పార్వతీసమేతుడగు ఈశ్వరునకు నమస్కారము (64). ఇట్లు ప్రార్థించి, తరువాత ఇట్లు పలుకవలెను : నేనీ నాందీముఖశ్రాద్ధమును యథావిధిగా పూర్తి చేసితిననియు, అది పూర్ణమగుననియు మీరు ఆశీర్వదించుడు. ఈ విధముగా ఆ బ్రాహ్మణశ్రేష్ఠులతో పలికి, వారి అనుగ్రహమును పొంది, చేతిలో నీటిని పోసుకొని విడిచిపెట్టి, సాష్టాంగనమస్కారమును చేయవలెను (65, 66). విశాలమగు మనస్సు గల ఆ సాధకుడు లేచి నిలబడి, ఆ బ్రాహ్మణులతో 'ఈ కర్మ అక్షయమగుగాక' అని పలికి చేతులను జోడించి వారిని పరమప్రీతితో ప్రార్థించవలెను (67). ఆతడు మనస్సులో సదాశివుని ధ్యానిస్తూ నమక, చమక, పురుషసూక్తములను మరియు సద్యోజాతాది మంత్రములను అయిదింటిని జపించవలెను (68). భోజనము అయిన తరువాత నమకమును పారాయణ చేసి, ఆ బ్రాహ్మణులకు మరల క్షమాపణలను చెప్పి, మంత్రపురస్సరముగా ఉత్తరాపోశనమును ఈయవలెను (69). తరువాత కాళ్లను కడుగుకొని, ఆచమనమును చేసి పిండములు ఉన్నచోటికి వెళ్లి, తూర్పు ముఖముగా కూర్చుండి స్థిరమగు చిత్తముతో మూడు ప్రాణాయామములను చేయవలెను (70). నాందీముఖశ్రాద్ధాంగం పిండదానం కరిష్యే (నాందీముఖశ్రాద్ధమునకు అంగమైన పిండదానమును చేసెదను) అని సంకల్పించి, దక్షిణమునుండి మొదలిడి ఉత్తరము వరకు తొమ్మిది రేఖలను గీసి, వాటిపై తూర్పు వైపు అగ్రభాగము ఉండునట్లుగా పన్నెండు దర్భలను వేయవలెను. దక్షిణము వైపునుండి దేవత, ఋషి మొదలగు అయిదు స్థానములను గ్రహించవలెను (71,72).

తూష్ణీం దద్యాత్సాక్షతోదం త్రిషు స్థానేషు చ క్రమాత్‌ | స్థానేష్వన్యేషు మాతృషు మార్జయంస్తాంస్తతః పరమ్‌ || 73

అత్రేతి పితరః పశ్చాత్సాక్షతోదం సమర్చ్య చ | దద్యాత్తతః క్రమేణౖవ దేవాదిస్థానపంచకే || 74

తత్తద్దేవాదినామాని చతుర్ధ్యంతాన్యుదీర్య చ | పిండత్రయం తతో దద్యాత్ర్ప త్యేకం స్థానపంచకే || 75

స్వగృహ్యోక్తేన మార్గేణ దద్యాత్పిండాన్‌ పృథక్‌ పృథక్‌ | దద్యాదిదం సాక్షతం చ పితృసాద్గుణ్యహేతవే || 76

ధ్యాయేత్సదాశివం దేవం హృదయాంభోజమధ్యతః | యత్పాదపద్మస్మరణాదితి శ్లోకం పఠన్‌ పునః || 77

నమస్కృత్య బ్రాహ్మణభ్యో దక్షిణాం చ స్వశక్తితః | దత్త్వా క్షమాపయ్య చ తాన్‌ విసృజ్య చ తతః క్రమాత్‌ || 78

పిండానుత్సృజ్య గోగ్రాసం దద్యాన్నో చేజ్జలే క్షిపేత్‌ | పుణ్యాహవాచనం కృత్వా భుంజీత స్వజనైస్సహ || 79

అన్యేద్యుః ప్రాతరుత్థాయ కృతనిత్యక్రియస్సుధీః | ఉపోష్య క్షౌరకర్మాది కక్షోపస్థవివర్జితమ్‌ || 80

కేశశ్మశ్రునఖానేవ కర్మావధి విసృజ్య చ | సమాష్టకేశాన్విధివత్కారయిత్వా విధానతః || 81

స్నాత్వా ధౌతపటశ్శుద్ధో ద్విరాచమ్యాథ వాగ్యతః | భస్మ సంధార్య విధినా కృత్వా పుణ్యాహవాచనమ్‌ || 82

ఆ స్థానములలో క్రమముగా అక్షతలతో కూడిన జలమును మంత్రము లేకుండగనే సమర్పించి, పితృమాతృవంశముల మూడు స్థానములలో అత్ర పితరః (పితృదేవతలు ఇక్కడ) అని ఉచ్చరించి తడి చేతితో తుడిచి, అక్షతలతో కూడిన నీటితో అర్చించవలెను. తరువాత దేవత మొదలగు అయిదు స్థానములలో క్రమముగా ఆయా దేవతల నామములను చతుర్థీ విభక్తితో అంతమగునట్లు ఉచ్చరించి ఒక్కొక్క దేవతకు మూడేసి పిండములనీయవలెను (73-75). సాధకుడు తన గృహ్యసూత్రములో చెప్పిన విధముగా పితరుల సద్గతిప్రాప్తి కొరకై అక్షతలతో కూడిన పిండములను వేర్వేరుగా సమర్పించవలెను (76). సాధకుడు యత్పాదపద్మస్మరణాత్‌ అనే శ్లోకమును (64) మరల పఠించి తన హృదయపద్మమునకు మధ్యలో ప్రకాశస్వరూపుడగు సదాశివుని ధ్యానించవలెను (77). బ్రాహ్మణులకు నమస్కరించి తన శక్తికి అనురూపముగా దక్షిణనిచ్చి వారికి క్షమాపణలను చెప్పి వారిని పంపించివేసి, తరువాత పిండములను వరుసగా ఆవునకు తినిపించవలెను; లేదా, నీటిలో విడిచిపెట్టవలెను. తరువాత పుణ్యాహవాచనమును చేసి బంధువులతో కలిసి భుజించవలెను (78,79). విద్వాంసుడగు ఆ సాధకుడు మరునాడు ఉదయమే లేచి, నిత్యకృత్యములను తీర్చుకొని, కక్షలను, గుహ్యమును విడిచి పెట్టి క్షౌరకర్మను చేయించుకొనవలెను. అనగా, ముండనము చేయించుకొనవలెను. మీసములను, గెడ్డమును తీసివేయవలెను. గోళ్లను తీసివేయుటతో క్షారకర్మ పూర్తి యగును. యథావిధిగా పిలక స్థానములో కొద్ది జుట్టును ఉంచుకొనవలెను. ఆతడు ఆ నాడు ఉపవాసమును చేయవలెను (80,81). ఆతడు స్నానమును చేసి ఉతికి ఆరవేసిన వస్త్రమును దాల్చి, పరిశుద్ధమగు మనస్సు గలవాడై, రెండుసార్లు ఆచమనమును చేసి, వాఙ్మియమము గలవాడై, భస్మను ధరించి, యథావిధిగా పుణ్యాహవాచనమును చేయవలెను (82).

తేన సంప్రోక్ష్య సంప్రాప్య శుద్ధదేహస్వభావతః | హోమద్రవ్యార్ధమాచార్యదక్షిణార్థం విహాయ చ || 83

ద్రవ్యజాతం మహేశాయ ద్విజేభ్యశ్చ విశేషతః | భ##క్తేభ్యశ్చ ప్రదాయాథ శివాయ గురురూపిణ || 84

వస్త్రాదిదక్షిణాం దత్త్వా ప్రణమ్య భువి దండవత్‌ | దోరకౌపీనవసనం దండాద్యం క్షాలితం భువి || 85

ఆదాయ హోమద్రవ్యాణి సమిధాదీని చ క్రమాత్‌ | సముద్రతీరే నద్యాం వా పర్వతే వా శివాలయే || 86

అరణ్య చాపి గోష్ఠే వా విచార్య స్థానముత్తమమ్‌ | స్థిత్వాచమ్య తతః పూర్వం కృత్వా మానసమంజరీమ్‌ || 87

బ్రాహ్మమోంకారసహితం నమో బ్రహ్మణ ఇత్యపి | జపిత్వా త్రిస్తతో బ్రూయాదగ్నిమీడే పురోహితమ్‌ || 88

అథ మహావ్రతమితి ఆగ్నిర్వై దేవనామతః | తథైతస్య సమామ్నాయామిషే త్వోర్జేత్వా వేతి తత్‌ || 89

ఆగ్న ఆయాహివీతయే శన్నో దేవీరభిష్టయే | పశ్చాత్ర్పో చ్య మయరసతజభనలగైస్సహ || 90

సంమితం చ తతః పంచసంవత్సరమయం తతః | సమామ్నాయస్సమామ్నాత అథ శిక్షాం వదేత్పునః || 91

అథాతో ధర్మజిజ్ఞాసేత్యుచ్చార్య పునరంజసా | అథాతో బ్రహ్మజిజ్ఞాసా దేవాదీనపి సంజపేత్‌ || 92

బ్రహ్మాణమింద్రం సూర్యం చ సోమం చైవ ప్రజాపతిమ్‌ | ఆత్మానమంతరాత్మానం జ్ఞానాత్మానమతః పరమ్‌ || 93

పరమాత్మానమపి చ ప్రణవాద్యం నమోంతకమ్‌ | చతుర్థ్యంతం జిపత్వా%థ సక్తుముష్టిం ప్రగృహ్య చ || 94

ప్రాశ్యాథ ప్రణవేనైవ ద్విరాచమ్యాథ సంస్పృశేత్‌ | నాభిం మంత్రాన్‌ వక్ష్యమాణాన్‌ ప్రణవాద్యాన్నమోంతకాన్‌ ||95

ఆ నీటితో సర్వమును సంప్రోక్షించి తద్ద్వారా దేహమునందు పరిశుద్ధస్వభావమును సంపాదించు కొనవలెను. హోమద్రవ్యముల కొరకు మరియు ఆచార్యునకు ఇచ్చే దక్షిణ కొరకు కావలసిన ధనమును మినహాయించుకొని (83), ధనమును మహేశ్వరునకు, ప్రత్యేకించి బ్రాహ్మణులకు మరియు భక్తులకు పంచిపెట్టి, తరువాత గురురూపములో నున్న శివునకు (84) వస్త్రములు, దక్షిణ మొదలగు వాటిని సమర్పించి, సాష్టాంగప్రణామమును చేసి, లంగోటీ, వస్త్రములు మరియు దండము అను వాటిని నేలపై మోది ఉతుకుకొని శుభ్రము చేసుకొని వలెను. సమిధలు మొదలగు హోమద్రవ్యములను, ఇతరసామగ్రిని తీసుకొని, వాటిని ఒక క్రమములో అమర్చుకొనవలెను. ఆలోచన చేసి ఉత్తమమగు స్థానమును, సముద్రతీరమును గాని, నదీతీరమును గాని, పర్వతమును గాని, శివాలయమును గాని, అరణ్యమును గాని, గోశాలను గాని ఎన్నుకొని, అచటకు వెళ్లి, నిలబడి ఆచమనమును చేసి, తరువాత ముందుగా మానసికజపమును చేసుకొనవలెను (85-87). ఓంకారసహితముగ వేదమంత్రములను పఠించి, 'నమో బ్రహ్మణ (పరబ్రహ్మకొరకు నమస్కారము)' అనే మంత్రమును మూడు సార్లు జపించి, తరువాత ' అగ్నిమీడే పురోహితమ్‌ (అందరికంటె ముందుగా హితమును చేయు అగ్నిని, అనగా పరమేశ్వరుని స్తుతించుచున్నాను)' అను మంత్రమును పఠించవలెను (88). తరువాత అథ మహావ్రతమ్‌ , 'అగ్నిర్వై దేవానామ్‌'; ఏతస్య సమామ్నాయమ్‌, 'ఇషే త్వోర్జే త్వా (అన్నము కొరకు శక్తి కొరకు నిన్ను ప్రార్థించుచున్నాను) అను మంత్రములను పఠించవలెను (89). తరువాత 'అగ్న ఆయాహి వీతయే, శన్నో దేవీరభిష్టయే' అను మంత్రములను, 'మయరసతజభనలగ' అను అక్షరములను పఠించవలెను (90). పంచ సంవత్సరమయమ్‌ అని చెప్పి, తరువాత, 'సమామ్నాయస్సమామ్నాతః (వేదము అధ్యయనము చేయబడినది)' అని చెప్పి, తరువాత అథ శిక్షాం ప్రవక్ష్యామి అని చెప్పవలెను (91). తరువాత వెంటనే 'అథాతో ధర్మజిజ్ఞాసా (వేదాధ్యయనము తరువాత ధర్మవిచారమును చేయవలెను )' అనియు, 'అథాతో బ్రహ్మజిజ్ఞాసా (సాధనచతుష్టయమును సంపాదించుకున్న తరువాత కర్మ మోక్షహేతువు కాదు గనుక బ్రహ్మవిచారమును చేయవలెను)' అని చెప్పవలెను. తరువాత బ్రహ్మ ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, ప్రజాపతి మొదలగు దేవతల నామములను, ఆత్మ, అంతరాత్మ, జ్ఞానాత్మ, పరమాత్మలను చతుర్థీవిభక్త్యంతముగా ఓంకారపూర్వకముగా చెప్పి 'నమః' తో ముగించవలెను. తరువాత గుప్పెడు పిండిని తీసుకొని ఓంకారమునుచ్చరించి దానిని తిని, రెండు సార్లు ఆచమనమును చేసి, చేతులను కడుగుకొని, చెప్పబోయే మంత్రములను ఓంకారముతో మొదలిడి 'నమః'తో అంతమగు విధముగా చెప్పవలెను (92-95).

ఆత్మానమంతరాత్మానం జ్ఞానాత్మానం పరం పునః | ఆత్మానం చ సముచ్చార్య ప్రజాపతిమతః పరమ్‌ || 96

స్వాహాంతాన్‌ ప్రజపేత్పశ్చాత్పయోదధిఘృతం పృథక్‌ | త్రివారం ప్రణవేనైవ ప్రాశ్యాచమ్య ద్విధా పునః || 97

ప్రాగాస్య ఉపవిశ్యాథ దృఢచిత్తః స్థిరాసనః |యథోక్తవిధినా సమ్యక్‌ ప్రాణాయామత్రయం చరేత్‌ || 98

ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం సన్య్యాసవిధి వర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12).

ఆత్మ, అంతరాత్మ, జ్ఞానాత్మ, పరమాత్మ, ప్రజాపతి అను పేర్లను చెప్పి, తరువాత (96) స్వాహాకారముతో అంతమగు విధముగా జపమును చేసి, తరువాత పాలను, పెరుగును, నేతిని మూడుసార్లు ఓంకారముతో భక్షించి, రెండు సార్లు మరల ఆచమనమును చేసి (97), తరువాత తూర్పు ముఖముగ స్థిరమగు ఆసనమునందు కూర్చుండి, దృఢమగు మనస్సు గలవాడై, యథావిధిగా మూడు సార్లు చక్కగా ప్రాణాయామమును చేయవలెను (98).

శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసవిధిని వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-4    Chapters