Siva Maha Puranam-4    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

సన్న్యాస నియమములు

ఈశ్వర ఉవాచ |

అతః వరం ప్రవక్ష్యామి సన్న్యాసాహ్నికకర్మ చ | తవ స్నేహాన్మహాదేవి సంప్రదాయానురో ధతః || 1

బ్రాహ్మే ముహుర్త ఉత్థాయ శిరసి శ్వేతపంకజే | సహస్రారే సమాసీనం గురుం సంచింతయేద్యతిః || 2

శుద్ధస్ఫటికసంకాశం ద్వినేత్రం వరదాభ##యే | దధానం శివసద్భావమేవాత్మని మనోహరమ్‌ || 3

భావోపనీతైస్సంపూజ్య గంధాదిభిరనుక్రమాత్‌ | బద్ధాంజలిపుటో భూత్వా నమస్కుర్యాద్గురుం తతః || 4

ప్రాతః ప్రభృతి సాయాంతే సాయాది ప్రాతరంతతః | యత్కరోమి మహాదేవ తదస్తు తవ పూజనమ్‌ || 5

ప్రతివిజ్ఞాప్య గురవే లబ్ధానుజ్ఞస్తతో గురోః | నిరుద్ధప్రాణ ఆసీనో విజితాత్మా జితేంద్రియః || 6

మూలాదిబ్రహ్మరంధ్రాంతం షట్‌ చక్రం పరిచింతయేత్‌ | విద్యుత్కోటిసమప్రఖ్యం సర్వతేజోమయం పరమ్‌ || 7

తన్మధ్యే చింతయేన్మాం చ సచ్చిదానందవిగ్రహమ్‌ | నిర్గుణం పరమం బ్రహ్మ సదాశివమనామయమ్‌ || 8

సో%హమస్మీతి మతిమాన్మదైక్యమనుభూయ చ | బహిర్నిర్గత్య చ తతో దూరం గచ్ఛేద్యథాసుఖమ్‌ || 9

వస్త్రే ణా చ్ఛాద్య మతిమాన్‌ శిరో నాసికయా సహ | విశోధ్య దేహం విధివత్తృణమాధాయ భూతలే || 10

గృహీతశిశ్న ఉత్థాయ తతో గచ్ఛేజ్జలాశయమ్‌ | ఉద్ధృత్య వార్యథాన్యాయం శౌచం కుర్యాదతంద్రితః || 11

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ మహాదేవీ! నీయందు నాకు గల ప్రేమచే నేనీపైన సంప్రదాయానుసారముగా సన్య్యాసియొక్క దినచర్యను గురించి చెప్పెదను (1). సన్న్యాసి బ్రాహ్మముహూర్తమునందు నిద్రలేచి, శిరస్సునందు తెల్లని పద్మము రూపములో నుండే సహస్రారచక్రమునందు కూర్చుండియున్న గురువును భావన చేయవలెను (2). స్ఫటికమువలె స్వచ్ఛమైనవాడు, రెండు నేత్రములు గలవాడు, వరద-అభయముద్రలను దాల్చియున్నవాడు, మనస్సునకు ఆహ్లాదమును కలిగించువాడు, శివస్వరూపుడు అగు గురువునకు మనస్సులో భావనలచే సంపాదింపబడిన గంధము మొదలగు ద్రవ్యములతో చక్కగా క్రమములో సర్వోపచారములను చేసి, తరువాత చేతులను జోడించి నమస్కరించవలెను (3,4). ఓ మహాదేవా! నేను ఉదయము మొదలిడి సాయంకాలము వరకు, సాయంకాలము మొదలిడి ఉదయము వరకు ఏయే పనులను చేయుదునో, అవి అన్నియు నీ ఆరాధనయే అగుగాక! (5) తరువాత గురువునకు విన్నవించి, ఆయన అనుమతిని (మానసికముగా) తీసుకొని, కూర్చుండి ప్రాణాయామమును చేసి మనస్సును ఇంద్రియములను దేహమును జయించి (6), మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు ఆరు చక్రములను (స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రములు) ధ్యానము చేయవలెను. బ్రహ్మరంధ్రమునకు మధ్యలో కోటి మెరపులతో సమానమగు తేజస్సు కలిగినట్టియు, సర్వశ్రేష్ఠమగు తేజోమయమగు నా సచ్చిదానందమూర్తిని ధ్యానించవలెను. నిర్గుణపరబ్రహ్మ, దోషరహితుడు అగు సదాశివుని 'సో%హమస్మి ( సదాశివుడు నేనే అగుచున్నాను)' అని భావన చేసి ఆ సదాశివునితో ఏకత్వముననుభవించి, తరువాత బయటకు వచ్చి సుఖముగా దూరమునకు వెళ్లవలెను (7-9). సావధానచిత్తుడగు ఆ యతి శిరస్సుపై వస్త్రమును కప్పుకొని ముక్కునకు వస్త్ర మును కట్టుకొని నేలపై గడ్డిని ఉంచి దేహమును శోధించి చేతితో గుహ్యము ధరించి పైకి లేచి తరువాత జలాశయమునకు వెళ్లి నీటిని గ్రహించి జాగరూకతతో శౌచమునాచరించవలెను (10, 11).

హస్తౌ పాదౌ చ సంశోధ్య ద్విరాచమ్యోమితి స్మరన్‌ | ఉత్తరాభిముఖో మౌనీ దంతధావనమాచరేత్‌ || 12

తృణపర్ణైస్సదా కుర్యాదమామేకాదశీం వినా | ఆపాం ద్వాదశగండూషైర్ముఖం సంశోధయేత్తతః || 13

ద్విరాచమ్య మృదా తోయైః కటిశౌచం విధాయ చ | అరుణోదయకాలే తు స్నానం కుర్యాన్మృదా సహ || 14

గురుం సంస్మృత్య మాం చైవ స్నానసంధ్యాద్యమాచరేత్‌ | విస్తారభయతో నోక్తమత్ర ద్రష్టవ్యమన్యతః || 15

ఆబధ్య శంఖముద్రాం చ ప్రణవేనాభిషేచయేత్‌ | శిరసి ద్వాదశావృత్త్యా తదర్ధం వా తదర్ధకమ్‌ || 16

తీరమాగత్య కౌపీనం ప్రక్షాల్యాచమ్య చ ద్విధా | ప్రోక్షయేత్ర్పణవేనైవ వస్త్ర మంగోపమార్జనమ్‌ || 17

ముఖం ప్రథమతో మృజ్య శిర అరభ్య సర్వతః | తేనైవ మార్జయేద్దేహం స్థిత్వా చ గరుసన్నిధౌ || 18

ఆబధ్యాద్వామతశ్శుద్ధం కౌపీనం చ సడోరకమ్‌ | తతస్సంధారయేద్భస్మ తద్విధిః ప్రోచ్యతే%ద్రిజే || 19

ద్విరాచమ్య సమాదాయ భస్మ సద్యాదిమంత్రితః | అగ్నిరిత్యాదిభిర్మంత్రై రభిమంత్ర్య స్పృశేత్తనుమ్‌ || 20

ఆపో వేత్యభిమంత్ర్యాథ జలం తేనైవ సేచయేత్‌ | ఓమాపో జ్యోతిరిత్యుక్త్వా మానస్తోకేతి మంత్రతః || 21

సంమర్ద్య కబలద్వంద్వం కుర్యాదేకం తు పంచధా | శిరోవదనహృద్గుహ్యపదేషు పరమేశ్వరి || 22

ఈశానాది సమారభ్య సద్యాంతం పంచభిః క్రమాత్‌ | ఉద్ధూల్య కబలం పశ్చాత్ర్పణవేనాభిషేచయేత్‌ || 23

సర్వాంగం చ తతో హస్తౌ ప్రక్షాల్యాన్యత్సమాహరేత్‌ | సమర్చ్య పూర్వవత్తత్తు త్రిపుండ్రాంస్తేన ధారయేత్‌ || 24

చేతులను, కాళ్లను కడుగుకొని రెండు సార్లు ఆచమనమును చేసి ఓంకారమును స్మరిస్తూ ఉత్తరము వైపునకు తిరిగి మౌనముగా పళ్లను తోముకొనవలెను (12). అమావాస్యనాడు, ఏకాదశి నాడు పళ్లను తోముకొనుటకు గడ్డిని కాని, ఆకులను కాని వాడరాదు. మిగిలిన రోజులలో వాటితో మాత్రమే తోముకొనవలెను. పన్నెండు సార్లు నీటిని పుక్కిలించి తరువాత ముఖమును కడుగుకొన వలెను (13). రెండు సార్లు ఆచమనమును చేసి మట్టితో మరియు నీటితో వెనుక భాగమును శుద్ధి చేసి అరుణోదయకాలము (సూర్యోదయమునకు అరగంట ముందు) మట్టితో స్నానమును చేయవలెను (14). గురువును మరియు నన్ను స్మరిస్తూ స్నానమును సంధ్యావందనము మొదలగు వాటిని చేయవలెను. ఆ వివరములను విస్తారమగుననే భయముతో ఇక్కడ చెప్పుట లేదు. వాటిని మరియొక చోట చూచి తెలుసుకొన వలెను (15). అర చేతులతో శంఖముద్రను పట్టి దానితో నీటిని తీసుకొని ఓంకారమును ఉచ్చరిస్తూ పన్నెండు లేదా ఆరు, లేదా మూడు పర్యాయములు తలపై అభిషేకించుకొనవలెను (16). ఒడ్డు పైకి వచ్చి, కౌపీనమును ఉతుకుకొని రెండు సార్లు ఆచమనమును చేసి వస్త్ర ముపై నీటిని చల్లి ఒంటిని తుడుచుకొనవలెను (17). ముందుగా ముఖమును తుడుచుకొని, తరువాత శిరస్సుతో మొదలిడి దేహమును అంతటా అదే వస్త్రముతో తుడుచుకొని, గురువు సన్నిధిలో నిలబడవలెను (18). శుభ్రమగు లంగోటాను ముడి ఎడమ వైపునకు వచ్చు విధముగా కట్టుకొని, తరువాత భస్మను ధరించవలెను. ఓ పార్వతీ! ఆవిధానమును చెప్పుచున్నాను (19). రెండు సార్లు ఆచమనమును చేసి సద్యోజాతమంత్రముతో భస్మను తీసుకొని 'అగ్నిరితి' అను మంత్రముతో దానిని అభిమంత్రించి దేహమును స్పృశించవలెను (20). తరువాత 'ఆపో వా' అను మంత్రముతో నీటిని అభిమంత్రించి దానితో భస్మను తడుపవలెను. ఓ పరమేశ్వరీ! ఓమాపో జ్యోతిః, మానస్తోకే అను మంత్రములను పఠించి, దానిని ముద్ద చేసి, రెండు ముద్దలుగా విభజించి, ఒక ముద్దను మరల అయిదు భాగములుగా చేసి, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అను స్థానములయందు 'ఈశానః' ఆను మంత్రముతో మొదలిడి సద్యోజాతమంత్రము వరకు అయిదు మంత్రములను క్రమముగా పఠిస్తూ ధరించవలెను. తరువాత, దేహమంతటా ఓంకారమును ఉచ్చిరిస్తూ ఆ భస్మను పూసుకొనవలెను. తరువాత చేతులను కడుగుకొని రెండవ ముద్దను తీసుకొని దానిని పూర్వమునందు వలెనే చక్కగా పూజించి దానితో త్రిపుండ్రము (లలాటముపై మూడు రేఖలు) ను ధరించవలెను (21-24).

త్రియాయుషైస్త్య్రంబకైశ్చ ప్రణవేన శివేన చ | శిరస్యథ లలాటే చ వక్షసి స్కంధ ఏవ చ || 25

పంచీకరణముచ్చార్య భావయేత్స్వగురుం బుధః | వక్ష్యమాణప్రకారేణ ప్రాణాయామాన్‌ షడాచరేత్‌ || 26

నాభౌ బాహ్వోస్సంధిషు చ పృష్ఠే చైవ యథాక్రమమ్‌ | ప్రక్షాల్య హస్తౌ చ తతో ద్విరాచమ్య యథావిధి || 27

దక్షహస్తేన సంగృహ్య జలం వామేన పాణినా | సమాచ్ఛాద్య ద్విషడ్వారం ప్రణవేనాభిమంత్రయేత్‌ || 28

ఏవంత్రివారం సంప్రోక్ష్య శిరసి త్రిః పిబేత్తతః | సమాహితేన మనసా ధ్యాయన్నోంకారమీశ్వరమ్‌ || 29

సౌరమండలమధ్యస్థం సర్వతేజోమయం పరమ్‌ | అష్టబాహుం చతుర్వక్త్ర మర్ధనారీకమద్భుతమ్‌ || 30

సర్వాశ్చర్యగుణోపేతం సర్వాలంకారశోభితమ్‌ | ఏవం ధ్యాత్వా%థ విధివద్దద్యాదర్ఘ్యత్రయం తతః || 31

అష్టాత్తరశతం జప్త్వా ద్విషడ్వారం తు తర్పయేత్‌ | పునరాచమ్య విధి వత్ర్పా ణాయామత్రయం చరేత్‌ || 32

పూజాసదనమాగచ్ఛేన్మనసా సంస్మరన్‌ శివమ్‌ | ద్వారమాసాద్య ప్రక్షాల్య పాదౌ మౌనీ ద్విరాచమేత్‌ || 33

ప్రవిశేద్విధినా తత్ర దక్షపాదపురస్సరమ్‌ | మండపాంతస్సుధీస్తత్ర మండలం రచయేత్ర్క మాత్‌ || 34

ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం సన్న్యాసాచారవర్ణనం నామ చతుర్థో%ధ్యాయః (4).

త్రియాయుషమంత్రమును, త్ర్యంబకమంత్రమును ఒక్కొక్కటి మూడు సార్లు చొప్పున జపించి ఓంకారమును నమశ్శివాయ మంత్రమును పఠించి శిరస్సు, లలాటము, వక్షఃస్థలము, భుజములు అను స్థానములయందు భస్మను ధరించవలెను (25). అపుడు విద్వాంసుడగు ఆ యతి పంచీకరణమంత్రమునుచ్చరించి తన గురువును భావన చేయవలెను. తరువాత చెప్పబోవు విధములో ఆరు ప్రాణాయామములను చేయవలెను (26). తరువాత నాభి, రెండు బాహువులు, వాటి సంధులు, వీపు అను స్థానములను క్రమముగా స్పృశించి, చేతులను కడుగుకొని రెండు సార్లు యథావిధిగా ఆచమనమును చేసి (27), కుడిచేతితో నీటిని తీసుకొని, ఎడమ చేతితో దానిని కప్పి పన్నెండు సార్లు ఓంకారముతో అభిమంత్రించవలెను (28). ఈ విధముగా శిరస్సుపై మూడు సార్లు సంప్రోక్షించుకొని, తరువాత మూడు సార్లు ఆ నీటిని త్రాగవలెను. తరువాత ఓంకారమును జపిస్తూ ఏకాగ్రమగు మనస్సుతో, సూర్యమండలమునకు మధ్యలోనున్నవాడు, సకలతేజోరాశి, పరంబ్రహ్మ, ఎనిమిది చేతులు గలవాడు, నాలుగు ముఖములు గలవాడు, అర్ధనారీశ్వరుడు, ఆశ్చర్యమును గొల్పువాడు, సర్వులకు ఆశ్చర్యమును కలిగించే గుణములు గలవాడు, సకలాభరణములతో విరాజిల్లువాడు అగు ఈశ్వరుని ధ్యానించి, తరువాత మూడు సార్లు యథావిధిగా అర్ఘ్యమునీయవలెను (29-31). తరువాత గాయత్రిని 108 సార్లు జపించి పన్నెండు తర్పణముల నీయవలెను. మరల ఆచమనమును చేసి యథావిధిగా మూడు సార్లు ప్రాణాయామమును చేయవలెను (32). తరువాత మనస్సులో శివుని స్మరిస్తూ పూజాగృహమునకు విచ్చేయవలెను. ద్వారము వద్దకు వచ్చి కాళ్లను కడుగుకొని మౌనియై రెండు సార్లు ఆచమనమును చేయవలెను (33). తరువాత ఆ పూజాగృహములోనికి ముందు కుడి కాలిని పెట్టి యథావిధిగా ప్రవేశించవలెను. పవిత్రాంతఃకరణుడగు యతి ఆ మండపము లోపల క్రమముగా మండలమును రచించవలెను (34).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసాచారమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Siva Maha Puranam-4    Chapters