Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకోనపంచాశత్తమో%ధ్యాయః

ఉమా ప్రాదుర్భావము

మునయ ఊచుః |

ఉమాయా భువనేశాన్యాస్సూత సర్వార్థవిత్తమ | అవతారం సమాచక్ష్వ యతో జాతా సరస్వతీ || 1

యా గీయతే పరబ్రహ్మ మూలప్రకృతి రీశ్వరీ | నిరాకారాపి సాకారా నిత్యానందమయీ సతీ || 2

మునులు ఇట్లు పలికిరి -

ఓ సూతా ! సర్వవిషయములనెరింగిన జ్ఞానులలో నీవు శ్రేష్ఠుడవు. భువనేశ్వరియగు ఉమాదేవి యొక్క అవతారమును గురించి చెప్పుము. సరస్వతి ఆమెనుండియే పుట్టినది (1). ఆమె పరబ్రహ్మయొక్క మూల ప్రకృతియగు ఈశ్వరి; ఆకారము లేకున్ననూ ఆకారముతో ఆవిర్భవించును. ఆమె నిత్యానందస్వరూపురాలగు సతీదేవి యని కీర్తింపబడుచున్నది (2).

సూత ఉవాచ |

తాపసాశ్శృణుత ప్రేవ్ణూ చరిత్రం పరమం మహత్‌ | యస్య విజ్ఞానమాత్రేణ నరో యాతి పరాం గతిమ్‌ || 3

దేవదానవయోర్యుద్ధమే కదాసీత్పరస్పరమ్‌ | మహామాయాప్రభావేణామరాణాం విజయో%భవత్‌ || 4

తతో%వలిప్తా అమరాస్స్వప్రశంసాం వితేనిరే | వయం ధన్యా వయం ధన్యాః కిం కరిష్యంతి నో%సురాః || 5

యే ప్రభావం సమాలోక్యాస్మాకం పరమదుస్సహమ్‌ | భీతా నాగాలయం యాతా యాత యాతేతి వాదినః || 6

అహో బలమహో తేజో దైత్యవంశక్షయంకరమ్‌ | అహో భాగ్యం సుమనసామేవం సర్యే%భ్యవర్ణయన్‌ || 7

తత ఆవిరభూత్తేజః కూటరూపం తదైవ హి | అదృష్టపూర్వం తద్దృష్ట్వా విస్మితా అభవన్‌ సురాః || 8

కిమిదం కిమిదం చేతి రుద్ధకంఠాస్సమబ్రువన్‌ | అజానంతః పరం శ్యామానుభావం మానభంజనమ్‌ || 9

తత ఆజ్ఞాపయద్దేవాన్‌ దేవానామధినాయకః | యాత యూయం పరీక్షధ్వం యాథాతథ్యేన కిన్న్వితి || 10

సురేంద్రప్రేరితో వాయుర్మహసస్సన్నిధిం గతః | కస్త్వం భోరితి సంబోధ్యావోచదేనం చ తన్మహః || 11

ఇతి పృష్టస్తదా వాయుర్మహసాతి గరీయసా | వాయురస్మి జగత్ర్పాణస్సాభిమానో%బ్రవీదిదమ్‌ || 12

జంగమాజంగమం సర్వమోత ప్రోతమిదం జగత్‌ | మయ్యేవ నిఖిలాధారే చాలయామ్యఖిలం జగత్‌ ||13

సూతుడిట్లు పలికెను -

ఓ మునులారా ! మిక్కిలి గొప్పది యగు ఈ చరిత్రను ప్రేమతో వినుడు. మానవుడు దీనిని తెలుసుకున్నంత మాత్రముచే మోక్షమును పొందును (3). ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్యలో యుద్ధము జరిగెను. దానియందు మహామాయయొక్క ప్రభావముచే దేవతలకు విజయము లభించెను (4). అపుడు దేవతలు గర్వించి తమ గొప్పదనమును అధికముగా చాటించుటకు మొదలిడిరి : మేము ధన్యులము, మేము ధన్యులము. రాక్షసులు మమ్ములనేమి చేయగలరు? (5) వారు మిక్కిలి సహింప శక్యము కాని మా ప్రభావమును గాంచి భయపడి 'నడువుడు, నడువుడు' అని పలుకుతూ పాతాళమునకు పోయిరి (6). ఆశ్చర్యము ! ఆశ్చర్యము ! మన బలము, తేజస్సు రాక్షసవంశమును నాశనమొనర్చినవి. దేవతల భాగ్యము గొప్పది. ఈ విధముగా వారందరు అధికముగా వర్ణించుచుండిరి (7). అపుడు అక్కడనే ఒక రాశి రూపములో తేజస్సు ఆవిర్భవించెను. అట్టి తేజస్సును వారెన్నడూ చూడలేదు. దానిని చూచి దేవతలు చకితులైరి (8). ఇదియేమి ? ఇది యేమి ? అని వారు భయముచే అడ్డుకట్ట వేయబడిన కంఠములతో పలుకుచుండిరి. గర్వమునడంచే మహామాయా ప్రభావమును వారు తెలియలేకపోయిరి (9). అపుడు దేవప్రభువు 'మీరు వెళ్లి దీని స్వరూపమును యథాతథముగా పరిశీలించుడు' అని దేవతలనాజ్ఞాపించెను (10). ఇంద్రునిచే ప్రేరేపింపబడిన వాయువు ఆ తెజస్సు వద్దకు వెళ్లెను. 'ఓయీ ! నీవెవరు ?' అని సంబోధించి, ఆ తేజస్సు వాయువును ప్రశ్నించెను (11). అపుడీ తీరున మిక్కిలి పెద్దదియగు ఆ తేజస్సుచే ప్రశ్నంచబడిన వాడై, వాయువు గర్వముతో ఇట్లు చెప్పెను: నేను వాయువును. జగత్తునకు ప్రాణము నేనే. కదిలే మరియు కదలని ప్రాణులతో కూడియున్న ఈ జగత్తు సర్వాధారుడనగు నాయందు మాత్రమే పడుగు-పేక వలె పూర్తిగా ఆధారపడియున్నది. జగత్తనంతనూ నడుపువాడను నేనే (12, 13).

తదోవాచ మహాతేజశ్శక్తో%సి యది చాలనే | ధృతమేతత్తృణం వాయో చాలయస్వ నిజేచ్ఛయా || 14

తతస్సర్వప్రయత్నేనాకరోద్యత్నం సదాగతిః | న చచాల యదా స్థానాత్తదాసౌ లజ్జితో%భవత్‌ || 15

తూష్ణీం భూత్వా తతో వాయుర్జగామేంద్ర సభాం ప్రతి | కథయామాస తద్వృత్తం స్వకీయాభిభవాన్వితమ్‌ || 16

సర్వేశత్వం వయం సర్వే మృషైవాత్మని మన్మహే | న పారయామహే కించిద్విధాతుం క్షుద్రవస్త్వపి || 17

తతశ్చ ప్రేషయామాస మరుత్వాన్‌ సకలాన్‌ సురాన్‌ | నశేకుస్తే యదా జ్ఞాతుం తదేంద్రస్స్వయమభ్యగాత్‌ || 18

మఘవంతమథాయాంతం దృష్ట్వా తేజో%తి దుస్సహమ్‌ | బభూవాంతర్హితం సద్యో విస్మితో%భూచ్చ వాసవః || 19

చరిత్రమీదృశం యస్య తమేవ శరణం శ్రయే | ఇతి సంచింతయామాస సహస్రాక్షః పునః పునః || 20

ఏతస్మిన్నంతరే తత్ర నిర్వ్యాజకరుణాతనుః | తేషామనుగ్రహం కర్తుం హర్తుం గర్వం శివాంగనా || 21

చైత్రశుక్లనవమ్యాం తు మధ్యాహ్నస్థే దివాకరే | ప్రాదురాసీదుమా దేవీ సచ్చిదానందరూపిణీ || 22

మహీమధ్యే విరాజంతీ భసయంతీ దిశో రుచా | బోధయంతీ సురాన్‌ సర్వాన్‌ బ్రహ్మైవాహమితి స్ఫుటమ్‌ || 23

చతుర్భిర్దధతీ హసై#్తర్వరపాశాంకుశాభయాన్‌ | శ్రుతిభిస్సేవితా రమ్యా నవ¸°వనగర్వితా || 24

రక్తాంబరపరీధానా రక్తమాల్యానులేపనా | కోటికందర్పసంకాశా చంద్రకోటిసమప్రభా || 25

వ్యాజహార మహామాయా సర్వాంతర్యామిరూపిణీ | సాక్షిణీ సర్వభూతానాం పరబ్రహ్మ స్వరూపిణీ || 26

అపుడా మహాతేజస్సు ఇట్లు పలికెను : ఓ వాయూ ! నీకు కదిల్చే శక్తి ఉన్నచో, ఈ గడ్డిపోచను నీ ఇచ్చ వచ్చినట్లు కదల్చుము. నేను దీనిని పట్టుకొని యున్నాను (14). అపుడు వాయువు పూర్ణప్రయత్నమును చేసియూ దానిని ఆ స్థానమునుండి కదల్చలేక పోయెను. అపుడాయన సిగ్గుపడెను (15). అపుడు వాయువు మారు మాటాడక ఇంద్ర సభకు వెళ్లి తనకు జరిగిన ఆ పరాభవ వృత్తాంతమును చెప్పెను (16). మనము అందరము సర్వసమర్థులమని తలంచుచున్నాము. ఇది నిశ్చయముగా తప్పు. మనము అల్పమగు వస్తువునైననూ కొంచెమైనను కదల్చలేము (17). తరువాత ఇంద్రుడు దేవతలనందరినీ పంపించెను. వారు విషయమును తెలియలేకపోయిరి. అపుడు ఇంద్రుడు స్వయముగా వెళ్లెను (18). మిక్కిలి సహింప శక్యము కాని ఆ తేజస్సు అపుడు ఇంద్రుడు వచ్చుచుండుటనుగాంచి వెంటనే అంతర్థానమయ్యెను. ఇంద్రుడు చకితుడయ్యెను (19). 'ఇటువంటి మహిమాన్వితమగు చరితము ఎవ్వానికి గలదో, వానినే నేను శరణు వేడుచున్నాను' అని ఇంద్రుడు పలుమార్లు తలపోసెను (20). అదే సమయములో నిష్కారణమగు కరుణ మూర్తీభవించినది అనదగిన ఆ పార్వతీదేవి వారి గర్వమును పోగొట్టి అనుగ్రహించుట కొరకై చైత్రశుక్ల నవమినాడు, సూర్యుడు మిట్టమధ్యాహ్న సమయములో నడినెత్తిపై నుండగా ఆవిర్భవించెను. ఆ ఉమాదేవి సచ్చిదానంద స్వరూపురాలు (21,22). ఆమె భూమధ్యములో ప్రకాశిస్తూ దిక్కులను కాంతులతో ప్రకాశింప జేయుచూ దేవతలందకి స్పష్టముగా 'బ్రహ్మను నేనే' అను మహావాక్యమును బోధించుచుండెను (23). ఆమె నాల్గు చేతులలో వరముద్రను, పాశమును, అంకుశమును, అభయముద్రను దాల్చియుండెను. నూతన ¸°వనముతో గర్వించియున్న ఆ సుందరిని వేదములు సేవించుచుండెను (24). ఆమె ఎర్రని చీరను ధరించి, ఎర్రని మాలను దాల్చి, కోటి మన్మథులను పోలియున్నదై, కోటి చంద్రులతో సమమగు కాంతిని కలిగియుండెను (25). సర్వప్రాణులలో అంతర్యామి రూపముగ నున్నది, సర్వప్రాణుల కర్మలకు సాక్షి మరియు పరబ్రహ్మ స్వరూపిణి అగు ఆ మహామాయ ఇట్లు పలికెను (26).

ఉమోవాచ |

న బ్రహ్మా న సురారాతిర్న పురారాతిరీశ్వరః | మదగ్రే గర్వితుం కించిత్కా కథాన్యసుపర్వణామ్‌ || 27

పరం బ్రహ్మ పరం జ్యోతిః ప్రణవద్వంద్వరూపిణీ | అహమేవాస్మి సకలం మదన్యో నాస్తి కశ్చన || 28

నిరాకారాపి సాకారా సర్వతత్త్వస్వరూపిణీ | అప్రతర్క్యగుణా నిత్యా కార్యకారణరూపిణీ || 29

కదాచిద్దయితాకారా కదాచిత్పురుషాకృతిః | కదాచిదుభయాకారా సర్వాకారాహమీశ్వరీ || 30

విరంచిస్సృష్టికర్తాహం జగత్పాతాహమచ్యుతః | రుద్రస్సంహారకర్తాహం సర్వవిశ్వవిమోహినీ || 31

కాలికా కమలా వాణీ ముఖాస్సర్వాహి శక్తయః | మదంశాదేవ సంజాతాస్తథేమాస్సకలాః కలాః || 32

మత్ర్పభావాజ్జితాస్సర్వే యుష్మాభిర్దితినందనాః | తామవిజ్ఞాయ మాం యూయం వృథా సర్వేశమానినం || 33

యథా దారుమయీం యోషాం నర్తయత్యైంద్రజాలికః | తథైవ సర్వభూతాని నర్తయామ్యహమీశ్వరీ || 34

మద్భయాద్వాతి పవనస్సర్వం దహతి హవ్యభుక్‌ | లోకపాలాః ప్రకుర్వంతి స్వస్వకర్మాణ్యనారతమ్‌ || 35

కదాచిద్దేవవర్గాణాం కదాచిద్దితి జన్మనామ్‌ | కరోమి విజయం సమ్యక్‌ స్వతంత్రా నిజలీలయా || 36

అవినాశి పరం ధామ మాయాతీతం పరాత్పరమ్‌ | శ్రుతయో వర్ణయంతే యత్తద్రూపం తు మమైవ హి || 37

సగుణం నిర్గుణం చేతి మద్రూపం ద్వివిధం మతమ్‌ | మాయాశబలితం చైకం ద్వితీయం తదనాశ్రితమ్‌ || 38

ఏవం విజ్ఞాయ మాం దేవాస్స్వం స్వం గర్వం విహాయ చ | భజత ప్రణయోపేతాః ప్రకృతిం మాం సనాతనీమ్‌ || 39

ఇతి దేవ్యా వచశ్ర్శుత్వా కరుణా గర్భితం సురాః | తుష్టువుః పరమేశానీం భక్తి సంనత కంధరాః || 40

క్షమస్వ జగదీశాని ప్రసీద పరమేశ్వరి | మైవం భూయాత్కదాచిన్నో గర్వో మాతర్దయాం కురు || 41

తతః ప్రభృతి తే దేవా హిత్వా గర్వం సమాహితాః | ఉమామారాధయామాసుర్యథాపూర్వం యథావిధి || 42

ఇతి వః కథితో విప్రా ఉమాప్రాదుర్భవో మయా | యస్య శ్రవణమాత్రేణ పరమం పదమశ్నుతే || 43

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం ఉమా ప్రాదుర్భావవర్ణనం నామ ఏకోనపంచాశత్తమో%ధ్యాయః (49).

ఉమ ఇట్లు పలికెను -

బ్రహ్మ గాని, విష్ణువు గాని, శివుడు గాని నా యెదుట గర్వించుటకు సమర్థులు గారు. ఇతరదేవతల గురించి చెప్పునదేమున్నది ? (27) సర్వాభాసకమగు చైతన్యము, ఓంకార రూపము, సుఖదుఃఖాది ద్వంద్వములను ప్రకాశింప జేయునది, సర్వజగద్రూపము అగు పరం బ్రహ్మ నేనే. నాకంటె భిన్నముగా ఏదీ లేదు (28). వాస్తవముగా ఆకారము లేకున్ననూ ఆకారమును దాల్చునది, తత్త్వములన్నింటి యొక్క యథార్థస్వరూపము అయి ఉన్నది, ఊహింప శక్యము గాని గుణములు గలది, అవినాశి, కార్యకారణరూపములో నున్నది, ఒకప్పుడు స్త్రీ రూపములో ఇంకోసారి పురుషరూపములో మరియొకప్పుడు ఆ రెండు రూపములలో నుంటూ ఆకారములన్నియు తానే అయి ఉన్న జగదీశ్వరిని నేనే (29,30). నేను బ్రహ్మనై సృష్టిని, విష్ణువునై జగద్రక్షణమును, రుద్రుడనై సంహారమును చేయుచూ, జగత్తునంతనూ విశేషముగా మోహింపజేయుచున్నాను (31). కాళి, లక్ష్మి, సరస్వతి మొదలగు శక్తులన్నియు నా అంశనుండి మాత్రమే పుట్టినవి. మరియు ఈ కళారూపములన్నియు నానుండి పుట్టుచున్నవి (32). నా ప్రభావము చేతనే రాక్షసులందరు మీచే జయించబడిరి. అట్టి నన్ను తెలుసుకొనలేక, 'మేమే గొప్పవారము' అని మీరు తలంచుట వ్యర్థము (33). ఇంద్రజాలమును చూపించు వ్యక్తి కర్ర బొమ్మచే నాట్యము చేయించు విధముగా సర్వేశ్వరిని అగు నేను ప్రాణులనన్నింటిని నాట్యమును చేయించుచున్నాను (34). నా భయము వలననే వాయువు వీచుచున్నాడు; అగ్ని సర్వమును దహించుచున్నాడు; లోకపాలకులు తమ తమ విధులను నిరంతరముగా అనుష్ఠించుచున్నారు (35). స్వతంత్రురాలనగు నేను నా లీలను ప్రకటిస్తూ ఒకప్పుడు దేవతల వర్గములకు, మరియొకప్పుడు రాక్షసులకు చక్కని విజయమును చేకూర్చుచుందును (36). వినాశము లేనిది, పరమ గమ్యము, సర్వజగత్కారణమగు మాయకు అతీతమైనది అగు ఏ పరం బ్రహ్మను వేదములు వర్ణించుచున్నవో ఆ పరం బ్రహ్మ నా స్వరూపమే (37). నా రూపము సగుణము, నిర్గుణము అని రెండు రకములుగా నున్నది. మాయ ఉపాధిగా గలది సగుణము, మాయకు అతీతమైనది నిర్గుణము (38). ఓ దేవతలారా ! మీరీ విషయమును తెలుసుకొని మీమీ గర్వములను విడనాడి భక్తితో గూడిన వారై సనాతన ప్రకృతినగు నన్ను సేవించుడు (39). దయాపూర్ణమగు దేవియొక్క ఈ పలుకుల నాలకించి దేవతలు భక్తితో మెడలను వంచి ఆ పరమేశ్వరిని స్తుంతిచిరి (40). ఓ జగదీశ్వరీ ! పరమేశ్వరీ ! క్షమించుము. ప్రసన్నురాలవు కమ్ము. మాకు ఎన్నడైననూ ఈ విధమైన గర్వము కలుగకుండు గాక ! ఓ తల్లీ ! దయను చూపుము (41). ఆ దేవతలు ఆనాటి నుండియు గర్వమును విడనాడి పూర్వము నందు వలెనే ఏకాగ్ర చిత్తము గలవారై యథావిధిగా ఉమాదేవిని ఆరాధించిరి (42). ఓ బ్రాహ్మణులారా ! నేను మీకు ఉమాప్రాదుర్భావమును గురించి చెప్పితిని. దీనిని విన్నంత మాత్రాన పరమ పదము లభించును. (43).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు ఉమా ప్రాదుర్భావమును వర్ణించే నలుబది తొమ్మిదవ అద్యాయము ముగిసినది (49).

Siva Maha Puranam-4    Chapters