Siva Maha Puranam-4    Chapters   

ద్వాత్రింశో%ధ్యాయః

శివపూజా ఫలము

ఉపమన్యురువాచ |

ఏతత్తే కథితం కృష్ణ కర్మేహాముత్ర సిద్ధిదమ్‌ | క్రియాతపజపధ్యానసముచ్చయమయం పరమ్‌ || 1

అథ వక్ష్యామి శైవానామిహైవ ఫలదం నృణామ్‌ | పూజాహోమజపధ్యానతపోదానమయం మహత్‌ || 2

తత్ర సంసాధయేత్పూర్వం మంత్రం మంత్రార్థవిత్తమః | ఇష్టసిద్ధికరం కర్మ నాన్యథా ఫలదం యతః || 3

సిద్ధమంత్రో%ప్యదృష్టేన ప్రబలేన తు కేనచిత్‌ | ప్రతిబంధఫలం కర్మన కుర్యాత్సహసా బుధః || 4

తస్య తు ప్రతిబంధస్య కర్తుం శ##క్యేహ నిష్కృతిః | పరీక్ష్య శకునాద్యైస్త దాదౌ నిష్కృతిమాచరేత్‌ || 5

యో%న్యథా కురుతే మోహాత్కర్మైహికఫలం నరః | న తేన ఫలభాక్స స్యాత్ర్పాప్నుయాచ్చోపహాస్యతామ్‌ || 6

అవిస్రబ్ధో న కుర్వీత కర్మ దృష్టఫలం క్వచిత్‌ | స ఖల్వశ్రద్దధానస్స్యాన్నాశ్రాద్ధః ఫలమృచ్ఛతి || 7

నాపరాధోస్తి దేవస్య కర్మణ్యపి తు నిష్ఫలే | యథోక్తకారిణాం పుంసామిహైవ ఫలదర్శనాత్‌ || 8

సాధకస్సిద్ధమంత్రశ్చ నిరస్తప్రతిబంధకః | విశ్వస్తః శ్రద్దధానశ్చ కుర్వన్నాప్నోతి తత్ఫలమ్‌ || 9

అథవా తత్ఫలావాపై#్త్య బ్రహ్మచర్యరతో భ##వేత్‌ | రాత్రౌ హవిష్యమశ్నీయాత్పాయసం వా ఫలాని వా || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

ఓ కృష్ణా! ఇహపరలోకములలో సిద్ధిని ఇచ్చే ఈ శివార్చన అనే కర్మను గురించి నీకు చెప్పితిని. క్రియ, తపస్సు, జపము, ధ్యానము అనువాటి సమాహారము అగు ఈ కర్మ సర్వశ్రేష్ఠమైనది (1). దీని తరువాత శివభక్తులగు మానవులకు ఇహలోకము లోననే ఫలమునిచ్చే గొప్ప కర్మను గురించి చెప్పెదను. ఈ కర్మ పూజ, హోమము, జపము, ధ్యానము, తపస్సు మరియు దానము అనువాటి సమాహారము (2). మంత్రముయొక్క అర్థము నెరింగిన వారిలో శ్రేష్ఠుడగు సాధకుడు ముందుగా మంత్రము తనకు సిద్ధిని ఇచ్చునట్లు చేసుకొనవలెను. సాధన చేయవలెను. ఏలయనగా, అట్లు గానిచో, అభీష్టములను సిద్ధింపజేసే కర్మయైననూ ఫలమునీయదు (3). మంత్రము సిద్ధించిన విద్వాంసుడైననూ కంటికి కానరాని బలమైన ఏదో ఒక ఆటంకముచే అడ్డుకొనబడిన ఫలము గల కర్మను తొందరపడి చేయరాదు (4). అట్టి ఆటంకమునకు నివారణోపాయమును ఇహలోకములోననే చేయుట సంభవమే . కావున, శకునము మొదలగు వాటిచే దానిని పరీక్షించి తెలుసుకొని, ముందుగా దానికి నిష్కృతిని చేయవలెను (5). ఇహలోకమునకు సంబంధించిన ఫలమునిచ్చే కర్మను అజ్ఞానముచే దీనికి భిన్నముగా కంగారు పడి చేసే మానవుడు దాని ఫలమును పొందజాలక నవ్వుల పాలగును (6). కంటికి కనబడే ఫలమునిచ్చే కర్మను ఏకాలమునందైననూ నమ్మకము లేకుండగా చేయరాదు.ఏలయన, వానికి దానియందు శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేనివానికి ఫలము లభించదు (7). కర్మ ఫలమునీయక పోయిననూ, అది దేవుని అపరాధము కాదు. ఏలయనగా, చెప్పినట్లు చేసిన మానవులకు ఇహలోకములోననే ఫలము లభించుట ప్రత్యక్షముగా కనబడుచునే యున్నది (8). సిద్ధించిన మంత్రము గలవాడు, ఆటంకములు లేనివాడు, శ్రద్ధావిశ్వాసములు గలవాడు అగు సాధకుడు కర్మను చేసి, దాని ఫలమును పొందును (9). ఫలము లభించని పక్షములో, అది లభించుట కొరకై బ్రహ్మచర్యమును పాటిస్తూ రాత్రియందు హవిస్సును గాని, పాయసమును గాని, ఫలములను గాని తినవలెను (10).

హింసాది యన్నిషిద్ధం స్యాన్న కుర్యాన్మనసాపి తత్‌ | సదా భస్మానులిప్తాంగస్సువేషశ్చ శుచిర్భవేత్‌ || 11

ఇత్థమాచారవాన్‌ భూత్వా స్వానుకూలే శుభే%హని | పూర్వోక్తలక్షణ దేశే పుష్పదామాద్యలంకృతే || 12

ఆలిప్య శకృతా భూమిం హస్తమానావరాం యథా | విలిఖేత్కమలం భ##ద్రే దీప్యమానం స్వతేజసా || 13

తప్తజాంబూనదమయమష్టపత్రం సకేసరమ్‌ | మధ్యే కర్ణికయా యుక్తం సర్వరత్నైరలంకృతమ్‌ || 14

స్వాకారసదృశేనైవ నాలేన చ సమన్వితమ్‌ | తాదృశే స్వర్ణనిర్మాణ కందే సమ్యగ్విధానతః || 15

తత్రాణిమాదికం సర్వం సంకల్ప్య మనసా పునః | రత్నజం వాథ సౌవర్ణం స్ఫాటికం వా సలక్షణమ్‌ |

లింగం సవేదికం చైవ స్థాపయిత్వా విధానతః || 16

తత్రావాహ్య యజేద్దేవం సాంబం సగణమవ్యయమ్‌ | తత్ర మహేశ్వరీ కల్ప్యా మూర్తిర్మూర్తిమతః ప్రభోః || 17

చతుర్భుజా చతుర్వక్త్రా సర్వాభరణభూషితా | శార్దూలచర్మవసనా కించిద్విహసితాననా || 18

వరదాభయహస్తా చ మృగటంకధరా తథా | అథవాష్టభుజా చింత్యా చింతకస్య యథారుచి || 19

ప్రాణిహింస మొదలగు శాస్త్రనిషిద్ధములగు కర్మలనుమనస్సుచేనైననూ ఆచరించరాదు. సాధకుడు సర్వకాలములలో భస్మ పూయబడిన అవయవములు గలవాడు, చక్కని వస్త్రములను ధరించినవాడు మరియు పరిశుద్ధుడు అయి ఉండవలెను (11). ఈ విధముగా సాధకుడు సచ్ఛీలము గలవాడై, తనకు అనుకూలమైన శుభదినము నాడు పూర్వము చెప్పబడిన లక్షణములు గలది, పుష్పమాలలు మొదలగువాటిచే అలంకరించ బడినది అగు స్థానమునందు (12), కనీసము ఒక హస్తము పరిమాణము గల నేలను గోమయముతో అలికి, దానిపై భద్రాసనమునందు , తన తేజస్సు చే పుటము పెట్టిన బంగారముతో (వలె) ప్రకాశించునది, ఎనిమిది రేకులు మరియు కింజల్కములు గలది, మధ్యలో దుద్దు గలది, సకలరత్నములతో (శ్రేష్ఠవస్తువులతో) అలంకరించ బడినది, తన ఆకారమునకు తగిన తూడు గలది అగు పద్మమును తయారు చేయవలెను. ఆ విధమైన పద్మమునందు బంగారముతో చేసిన దుంపయందు యథావిధిగా (13-15), భావనారూపముగా అణిమాది సిద్ధులు మొదలగు వాటిని కల్పించి, రత్నముతో గాని, బంగారముతో గాని, స్ఫటికముతో గాని చేసిన చక్కని లక్షణములు గల లింగమును వేదికతో సహా యథావిధిగా స్థాపించి (16), దానియందు జగన్మాతతో మరియు గణములతో కూడియున్నవాడు మరియు వినాశము లేనివాడు అగు శివుని ఆవాహన చేసి పూజించవలెను. దానియందు జగన్నాథుడగు మహేశ్వరుని సగుణరూపమును ధ్యానించవలెను (17).నాలుగు భుజములు మరియు నాలుగు మోములు గలది, సకలాభరణములచే అలంకరించ బడినది, పెద్దపులి చర్మమును ధరించినది, చిరునవ్వుతో కూడిన ముఖము గలది (18), చేతులలో వరదముద్రను అభయముద్రను దాల్చినది, మృగమును పరశువును ధరించినది అగు మూర్తిని గాని, లేదా ఎనిమిది భుజముల మూర్తిని గాని సాధకుడు తన అభిరుచికి అనురూపముగా ధ్యానించవలెను (19).

తదా త్రిశూలపరశుఖడ్గవజ్రాణి దక్షిణ | వామే పాశాంకుశౌ తద్వత్ఖేటం నాగం చ బిభ్రతీ || 20

బాలార్కసదృశప్రఖ్యా ప్రతివక్త్రం త్రిలోచనా | తస్యాః పూర్వాముఖం సౌమ్యం స్వాకారసదృశప్రభమ్‌ || 21

దక్షిణం నీలజీమూతసదృశం ఘోరదర్శనమ్‌ | ఉత్తరం విద్రుమప్రఖ్యం నీలాలకవిభూషితమ్‌ || 22

పశ్చిమం పూర్ణచంద్రాభం సౌమ్యమిందుకలాధరమ్‌ | తదంకమండలారూఢా శక్తిర్మాహేశ్వరీ పరా || 23

మహాలక్ష్మీ రితి ఖ్యాతా శ్యామా సర్వమనోహరా | మూర్తిం కృత్వైవమాకారాం సకలీకృత్య చ క్రమాత్‌ || 24

మూర్తిమంతమథావాహ్య యజేత్పరమకారణమ్‌ | స్నానార్థే కల్పయేత్తత్ర పంచగవ్యం తు కాపిలమ్‌ || 25

పంచామృతం చ చూర్ణాని బీజాని చ విశేషతః | పురస్తాన్మండలం కృత్వా రత్నచూర్ణాద్యలంకృతమ్‌ || 26

కర్ణికాయాం ప్రవిన్యస్యేదీశానకలశం పునః | సద్యాదికలశాన్‌ పశ్చాత్పరితస్తస్య కల్పయేత్‌ || 27

తతో విద్యేశకలశానష్టౌ పూర్వాదివత్ర్క మాత్‌ | తీర్థాంబుపూరితాన్‌ కృత్వా సూత్రేణావేష్ట్య పూర్వవత్‌ || 28

పుణ్యద్రవ్యాణి నిక్షిప్య సమంత్రం సవిధానకమ్‌ | దుకూలాద్యేన వస్త్రేణ సమాచ్ఛాద్య సమంతతః || 29

సర్వత్ర మంత్రం విన్యస్య తత్తన్మంత్రపురస్సరమ్‌ | స్నానకాలే తు సంప్రాప్తే సర్వమంగలనిస్స్వనైః || 30

పంచగవ్యాదిభిశ్చైవ స్నాపయేత్పరమేశ్వరమ్‌ |

ఆ విధముగా అష్టభుజమూర్తిని ధ్యానించే సందర్భములో ఆ మూర్తి కుడి చేతులయందు త్రిశూలము, పరశువు, ఖడ్గము మరియు వజ్రము ఉండగా, ఎడమ చేతులయందు పాశము, అంకుశము, డాలు మరియు సర్పము అనువాటిని ధరించియుండును (20). ఉదయించే సూర్యుని వలె ప్రకాశించే ఆ మూర్తియొక్క ప్రతిముఖమునకు మూడు కన్నులు ఉండును. ఆ మూర్తియొక్క తూర్పు ముఖము ప్రసన్నముగా, తన ఆకారమునకు తగిన కాంతి గలదై ఉండును (21). దక్షిణముఖము నల్లని మేఘమును బోలి చూచువారలకు భయమును గొల్పును. ఉత్తరముఖము పగడము వలె ప్రకాశిస్తూ నల్లని ముంగురులతో విరాజిల్లును (22). పశ్చిమ ముఖము పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ ప్రసన్నముగా నుండి, చంద్రవంకను దాల్చియుండును. ఆ మూర్తియొక్క మండలాకారములోనున్న అంకమునందు పరాశక్తియగు మాహేశ్వరి అధిష్ఠించి యుండును (23). సర్వాంగసుందరి, నల్లని వర్ణము గలది అగు ఆమెకు మహాలక్ష్మీ అని పేరు. ఈ విధమగు ఆకారముగల మూర్తిని భావన చేసి, క్రమముగా దానికి సకలీకరణమును చేసి, (24), తరువాత అట్టి రూపము గలవాడు, సర్వజగత్కారణకారణుడు అగు శివుని ఆవాహన చేసి, పూజించవలెను. అచట స్నానము కొరకై కపిలగోవునకు చెందిన పంచగవ్యమును, పంచామృతములను, విశేషించి కుంకుమాది చూర్ణము (పొడి) లను, బీజము (గింజ) లను ఏర్పాటు చేయవలెను. తూర్పు దిక్కునందు మండలమును చేసి, దానిని రత్నములతో మరియు చూర్ణములతో అలంకరించి (25, 26), పద్మకర్ణికయందు ఈశానకలశమును స్థాపించి, తరువాత మరల దాని చుట్టూ సద్యోజాతాది కలశములను స్థాపించవలెను (27). తరువాత తూర్పుదిక్కుతో మొదలిడి ఎనిమిది విద్యేశ్వరుల కలశములను వరుసగా ఏర్పాటు చేసి, వాటి యందు తీర్థజలమును నింపి, పూర్వమునందు వలెనే దారమును చుట్టి (28), వాటియందు మంత్రపూర్వకముగా యథావిధిగా పవిత్రద్యవ్యములను ఉంచి, వాటి చుట్టూ పట్టు వస్త్రమును గాని, ఇతరవస్త్రమును గాని పూర్తిగా కప్పవలెను (29). అంతటా మంత్రన్యాసమును చేసి, స్నానకాలము రాగానే సకలమంగళఘోషలను చేస్తూ, ఆయా మంత్రములను పఠిస్తూ (30), పంచగవ్యము మొదలగు వాటితో పరమేశ్వరుని అభిషేకించవలెను.

తతః కుశోదకాద్యాని స్వర్ణరత్నోదకాన్యపి || 31

గంధపుష్పాదిసిద్ధాని మంత్రసిద్ధాని చ క్రమాత్‌ | ఉద్ధృత్యోద్ధృత్య మంత్రేణ తైసై#్తస్స్నాప్య మహేశ్వరమ్‌ || 32

గంధపుష్పాది దీపాంశ్చ పూజాకర్మ సమాచరేత్‌ | పలావరస్స్యాదాలేప ఏకాదశపలోత్తరః || 33

సువర్ణరత్నపుష్పాణి శుభాని సురభీణి చ | నీలోత్పలాద్యుత్పలాని బిల్వపత్రాణ్యనేకశః || 34

కమలాని చ రక్తాని శ్వేతాన్యపి చ శంభ##వే | కృష్ణాగురూద్భవో ధూపస్సకర్పూరాజ్యగుగ్గులః || 35

కపిలాఘృతసంసిద్ధా దీపాః కర్పూరవర్తిజాః | పంచబ్రహ్మ షడంగాని పూజ్యాన్యావరణాని చ || 36

నైవేద్యః పయసా సిద్ధస్స గుడాజ్యో మహాచరుః | పాటలోత్పలపద్మాద్యైః పానీయం చ సుగంధితమ్‌ || 37

పంచసౌగంధికోపేతం తాంబూలం చ సుసంస్కృతమ్‌ | సువర్ణరత్నసిద్ధాని భూషణాని విశేషతః || 38

వాసాంసి చ విచిత్రాణి సూక్ష్మాణి చ నవాని చ | దర్శనీయాని దేయాని గానవాద్యాదిభిస్సహ || 39

జపశ్చ మూలమంత్రస్య లక్షః పరమసంఖ్యయా | ఏకావరా త్య్రుత్తరా చ పూజా ఫలవశాదిహ || 40

దశసంఖ్యావరో హోమః ప్రతిద్రవ్యం శతోత్తరః | ఘోరరూపశ్శివశ్చింత్యో మారణోచ్చాటనాదిషు || 41

తరువాత దర్భజలము (దర్భలను ముంచిన నీరు), స్వర్ణజలము, రత్నజలము మొదలగు జలములను (31) గంధము పుష్పములు మొదలగువాటితో పరిమళభరితములుగా చేసి, వాటిని మంత్రపూర్వకముగా పవిత్రములుగా చేసి, వాటిని వరుసగా మంత్రోచ్చారమపూర్వకముగా చేతిలోనికి తీసుకొని మహేశ్వరుని అభిషేకించవలెను (32). తరువాత గంధము, పుష్పములు, ధూపము, దీపము మొదలగు ఉపచారములతో పూజను చేయవలెను. గంధపు పూతను సమర్పించుటకు ఉపయోగించే సుగంధద్రవ్యము ఒక పలమునకు తగ్గకుండగా, పదకొండు పలములకు మించకుండగా ఉండవలెను (33). బంగరు పువ్వులను, రత్నుపుష్పములను, శుభకరములు సుగంధభరితములు అగు నల్ల కలువలను, ఇతరములగు కలువజాతికి చెందిన పుష్పములను, అనేకములగు మారేడు దళములను (34), ఎర్ర కలువలను, తెల్ల కలువలను శంభునకు పూజచేయవలెను. నల్ల అగురు, కర్పూరము, నెయ్యి కలిపిన గుగ్గులమును ధూపమునకు వినియోగించవలెను (35). కపిలగోవు పాలనుండి వచ్చిన నేతితో కర్పూరముతో చేసిన వత్తులతో దీపములను వెలిగించ వలెను. సద్యోజాతుడు మొదలగు అయిదు బ్రహ్మలను, హృదయము మొదలగు ఆరు అంగములను మరియు ఆవరణములను కూడ పూజించవలెను (36). బెల్లపు పరమాన్నమును పెద్ద మొత్తములో వండి దానిపై నేతిని వేసి నైవేద్యమును పెట్టవలెను. కలిగొట్టు పువ్వు, కలువ మరియు పద్మము అనువాటి పరిమళముతో గూడిన నీటిని పానీయముగా సమర్పించవలెను (37). అయిదు సుగంధద్రవ్యములతో చక్కగా తయారు చేయబడిన తాంబూలమును, బంగారముతో మరియు రత్నములతో చేసిన ఆభరణములను విశేషముగా సమర్పించవలెను (38). చూచుటకు ఇంపైన రంగు రంగుల నాజూకు నూతనవస్త్రములను సమర్పించవలెను. ఆ సమయములో పాటలు వాద్యములు మొదలగు వాటిని ఏర్పాటు చేయవలెను (39). లక్షకు మించకుండగా మూలమంత్రమును జపించవలెను. ఈ పూజను సాధకుడు తాను కోరే ఫలమును బట్టి ఒకటి, రెండు లేదా మూడు పర్యాయములకు మించకుండగా చేయవలెను (40) ప్రతి హోమద్రవ్యమునకు కనీససంఖ్య పది, అత్యధిక సంఖ్య వంద. శత్రుమారణము, భూతోచ్చాటనము మొదలగు ఫలములనపేక్షించు వారు భయంకరాకారుడగు శివుని ధ్యానించవలెను (41).

శివలింగే శివాగ్నౌ చ హ్యన్యాసు ప్రతిమాసు చ | చింత్యస్సౌమ్యతనుశ్శంభుః కార్యే శాంతికపౌష్టికే || 42

ఆయసౌ స్రుక్ర్సువౌ కార్యౌ మారణాదిషు కర్మసు | తదన్యత్ర చ సౌవర్ణౌ శాంతికాద్యేషు కృత్స్నశః || 43

దూర్వయా ఘృతగోక్షీరమిశ్రయా మధునా తథా | చరుణా సుఘృతేనైవ కేవలం పయసాపి వా || 44

జుహుయాన్మృత్యువిజయే తిలై రోగోపశాంతయే | ఘృతేన పయసా చైవ కమలైర్వాథ కేవలైః || 45

సమృద్ధికామో జుహుయాన్మహాదారిద్ర్యశాంతయే | జాతీపుష్పేణ వశ్యార్థీ జుహుయాత్సుఘృతేన తు || 46

ఘృతేన కరవీరైశ్చ కుర్యాదాకర్షణం ద్విజః | తైలేనోచ్చాటనం కుర్యాత్‌ స్తంభనం మధునా పునః || 47

స్తంభనం సర్షపేణాపి లశునేన తు పాతనమ్‌ | తాడనం రుధిరేణ స్యాత్ఖరస్యోష్ట్రస్య చో భయోః || 48

మారణోచ్చాటనే కుర్యాద్రోహిబీజైస్తిలాన్వితైః | విద్వేషణం చ తైలేన కుర్యాల్లాంగలకస్య తు || 49

బంధనం రోహబీజేన సేనాస్తంభనమేవ చ | రక్తసర్షపసంమిశ్రైర్హోమద్రవ్యైరశేషతః || 50

హస్తయంత్రోద్భవైసై#్తలైర్జుహుయాదాభిచారికే | కటుకీతుషసంయుక్తైః కార్పాసాస్థిభిరేవ చ || 51

సర్షపైసై#్తలసంమిశ్రైర్జుహుయాదాభిచారికే |

శాంతికర్మ (క్రూరగ్రహములను ఉపశమింప జేయు కర్మ), లేదా పౌష్టికకర్మను చేసే సమయములో శివలింగమునదు, శివాగ్నియందు మరియు ఇతరములగు ప్రతిమలయందు సౌమ్యమగు రూపము గల శంభుని ధ్యానము చేయవలెను (42). శత్రుమారణము మొదలగు కర్మలయందు ఇనుముతో చేసిన స్రుక్కును, స్రువమును ఉపయోగించవలెను. దీనికి భిన్నముగా ఇతరములగు శాంతికర్మలు మొదలగు వాటియందు బంగరు స్రుక్కును మరియు స్రువమును వాడవలెను (43). మృత్యువును జయించగోరు సాధకుడు నేయి ఆవుపాలు కలిసిన దూర్వను గాని, తేనెను గాని, నేయితో కూడిన అన్నమును గాని, లేక కేవలము పాలను గాని హోమము చేయవలెను. రోగశాంతిని గోరు సాధకుడు నువ్వులను హోమము చేయవలెను. కటిక దారిద్య్రము పోయి సంపదలను పొందుటకై సాధకుడు నేతితో, పాలతో లేదా కేవలము పద్మములతో హోమము చేయవలెను. వశీకరణశక్తిని కోరువాడు నేతితో కూడిన మల్లెలను హోమము చేయవలెను (44-46). ద్విజుడు నేయి కలిసిన ఎర్రగన్నేరు పుష్పములను హోమము చేసి ఆకర్షణశక్తిని పొందవచ్చును. నూనెను హోమము చేసినచో భూతప్రేతాదులు తొలగి పోవును. తేనెను హోమము చేసి శత్రువును స్తంభింప జేయవచ్చును (47). ఆవాలను హోమము చేసి కూడ స్తంభింప జేయవచ్చును. వెల్లుల్లిని హోమము చేసినచో, శత్రువు పతితుడగును. గాడిద, ఒంటె అనే రెండు జంతువుల రక్తమును హోమము చేసినచో, శత్రువు హింసకు గురి యగును (48). శత్రుమారణము, భూతోచ్చాటనము అనువాటి కొరకు నువ్వులతో కలిసిన మర్రి గింజలను హోమము చేయవలెను. శత్రువును ద్వేషించే సందర్భములో కొబ్బరి నూనెతో హోమమును చేయవలెను (49). శత్రుబంధనము కొరకై మర్రి గింజలను, శత్రుసైన్యము నిలిచి పోవుటకు కోరే సందర్భములో ఎర్ర ఆవాలు కలిసిన సకలహోమద్రవ్యములతో హోమమును చేయవలెను (50). ఆభిచారికకర్మయందు చేతితో నడిపిన యంత్రమునుండి వచ్చిన నూనెతో, కారము ఊకలతో కలిసిన పత్తి గింజలను (51) , నూనె కలిసిన ఆవాలను హోమము చేయవలెను.

జ్వరోపశాంతిదం క్షీరం సౌభాగ్యఫలదం తథా || 52

పర్వసిద్ధికరో హోమః క్షౌద్రాజ్యదధిభిర్యుతైః | క్షీరేణ తందులైశ్చైవ చరుణా కేవలేన వా || 53

శాంతికం పౌష్టికం వాపి సప్తభిస్సమిదాదిభిః | ద్రవ్యైర్విశేషతో హోమే వశ్యమాకర్షణం తథా || 54

వశ్యమాకర్షణం చైవ శ్రీ ప్రదం చ విశేషతః | బిల్వపత్రైస్తు హవనం శత్రోర్విజయదం తథా || 55

సమిధశ్శాంతికార్యేషు పాలాశఖదిరాదికాః | కరవీరార్కజాః క్రౌర్యే కంటకిన్యశ్చ విగ్రహే || 56

ప్రశాంతశ్శాంతికం కుర్యాత్పౌష్టికం చ విశేషతః | నిర్ఘృణః క్రుద్ధచిత్తస్తు ప్రకుర్యాదాభిచారికమ్‌ || 57

అతీవ దురవస్థాయాం ప్రతీకారాంతరం న చేత్‌ | ఆతతాయినముద్దిశ్య ప్రకుర్యాదాభిచారికమ్‌ || 58

స్వరాష్ట్రపతిముద్దిశ్య న కుర్యాదాభిచారికమ్‌ | యద్యాస్తికస్సుధర్మిష్ఠో మాన్యో వా యో%పి కోపి వా || 59

తముద్దిశ్యాపి నో కుర్యాదాతతాయినమప్యుత | మనసా కర్మణా వాచా యో%పి కోపి శివాశ్రితః || 60

స్వరాష్ట్రపతిముద్దిశ్య శివాశ్రితమథాపి వా | కృత్వాభిచారికం కర్మ సద్యో వినిపతేన్నరః || 61

స్వరాష్ట్రపాలకం తస్మాచ్ఛివభక్తం చ కంచన | న హింస్యాదాభిచారాద్యైర్యదీచ్ఛేత్సుఖమాత్మనః || 62

పాలను హోమము చేసినచో జర్వము తగ్గి, సౌభాగ్యము కలుగును (52). తేనె, నెయ్యి, పెరుగు, పాలు, బియ్యములతో కూడిన హోమము గాని, కేవలము అన్నముయొక్క హోమముగాని, సర్వసిద్ధులను కలిగించును (53).ఏడు విశిష్టసమిధలతో శాంతిక, పౌష్టిక (అభ్యుదయమును కలిగించే ) కర్మలను చేయవలెను. విశేషద్రవ్యములతో హోమమును చేసినచో, వశీకరణము మరియు ఆకర్షణము అను సిద్ధులు లభించును (54). మారేడు పత్రములతో హోమమును చేసినచో, వశీకరణము ఆకర్షణము మాత్రమే గాక, విశేషించి సంపద మరియు శత్రువుపై విజయము లభించును (55). శాంతికర్మలయందు మోదుగ, చండ్ర సమిధలను, క్రూరమగు కర్మలయందు ఎర్ర గన్నేరు, జిల్లేడు సమిధలను, యుద్ధసందర్భములో ముళ్లు ఉన్న సమిధలను హోమము చేయవలెను (56). శాంతిక, పౌష్టిక కర్మలను చేయు వ్యక్తి విశేషించి ప్రసన్నమగు మనస్సును కలిగి కర్మను చేయవలెను. ఆభిచారిక కర్మను చేయువాడు దయను విడనాడి, క్రూరమగు చిత్తముతో చేయవలెను (57). మిక్కిలి దురవస్థ కలిగి మరియొక మార్గము లేనప్పుడు ఆతతాయి (ఇంటికి నిప్పుపెట్టుట, విషమును ఇచ్చుట, భార్యను అపహరించుట మొదలగు పాపములను చేసినవాడు) అగు వ్యక్తిని ఉద్దేశించి ఆభిచారిక కర్మను చేయవచ్చును (58). తన దేశపు రాజు, ఆస్తికుడు, గొప్ప ధర్మాత్ముడు, పూజింప దగిన వ్యక్తి ఎవరైననూ, వీరిని ఉద్దేశించి ఆభిచారిక కర్మను చేయరాదు (59). ఎవడైతే మనోవాక్కాయకర్మలచే శివుని శరణు జొచ్చునో, వాడు ఆతతాయి అయిననూ, వానిని ఉద్దేశించి అభిచారిక కర్మను చేయరాదు (60). తన దేశపు రాజును గాని, శివభక్తుని గాని ఉద్దేశింఇ ఆభిచారిక కర్మను చేయు మానవుడు శీఘ్రముగా పతితుడగును (61). కావున, మానవుడు, తన సుఖమును కోరువాడైనచో, తన దేశపు ప్రభువును గాని, శివభక్తుడగు ఏ వ్యక్తియైననూ వానిని గాని ఉద్దేశించి ఆభిచారికము మొదలగు వాటిచే హింసకు గురి చేయరాదు (62).

అన్యం కమపి చోద్దిశ్య కృత్వా వై మారణాదికమ్‌ | పశ్చాత్తాపేన సంయుక్తః ప్రాయశ్చిత్తం సమాచరేత్‌ || 63

బాణలింగే%పి వా కుర్యాన్నిర్ధనో ధనవానపి | స్వయంభూతే%థ వా లింగే ఆర్షకే వైదికే%పి వా || 64

అభావే హేమరత్నానామశక్తౌ చ తదర్జనే | మనసైవాచరేదేతద్ద్రవ్యైర్వా ప్రతిరూపకైః || 65

క్వచిదంశే తు యశ్శక్తస్త్వశక్తః క్వచిదంశ##కే | సో%పి శక్త్యనుసారేణ కుర్వం శ్చేత్ఫలమృచ్ఛతి || 66

కర్మణ్యనుష్ఠితే%ప్యస్యిన్‌ ఫలం యత్ర న దృశ్యతే | ద్విస్త్రిర్వావర్తేయేత్తత్ర సర్వథా దృశ్యతే ఫలమ్‌ || 67

పూజోపయుక్తం యద్ద్రవ్యం హేమరత్నాద్యనుత్తమమ్‌ | తత్సర్వం గురవే దద్యాద్దక్షిణాం చ తతః పృథక్‌ || 68

స చేన్నేచ్ఛతి తత్సర్వం శివాయ వినివేదయేత్‌ | అథవా శివభ##క్తేభ్యో నాన్యేభ్యస్తు ప్రదీయతే || 69

యస్స్వయం సాధయేచ్ఛక్త్యా గుర్వాదినిరపేక్షయా | సో%ప్యేవమాచరేదత్ర న గృహ్ణీయాత్స్వయంపునః || 70

స్వయం గృహ్ణాతి యో లోభాత్పూజాంగద్రవ్యముత్తమమ్‌ | కాంక్షితం న లభేన్మూఢో నాత్ర కార్యా విచారణా || 71

అర్చితం యత్తు తల్లింగం గృహ్ణీయాద్వా న వా స్వయమ్‌ | గృహ్ణీయాద్యది తన్నిత్యం యం వాన్యో%పి వార్చయేత్‌ || 72

ఇతరులనెవరినైననూ ఉద్దేశించి మారణము మొదలగు ప్రయోగమును చేసిన మానవుడు పశ్చాత్తాపమును పొంది ప్రాయశ్చిత్తమును జాగ్రత్తగా చేసుకొనవలెను (63). ధనవంతుడు గాని, ధనము లేని వాడు గాని, బాణలింగమునందు గాని, స్వయం భూలింగమునందు గాని, ఋషులచే స్థాపించబడిన లింగమునందు గాని, వైదిక లింగమునందు గాని శివుని ఆరాధించవలెను (64). ఇవి లభ్యము కానిచో, బంగరు లింగమునందు గాని, రత్నలింగమునందు గాని పూజించవలెను. వాటిని సంపాదించే శక్తి లేనిచో, మానసపూజను చేయవలెను. లేదా, ప్రతి నిధి ద్రవ్యములతో లింగమును చేసి, పూజించవలెను (65). ఒకనికి ఒక అంశములో శక్తి ఉన్ననూ, మరియొక అంశములో శక్తి ఉండక పోవచ్చును. అట్టివాడు కూడ తన శక్తికి తగ్గట్లుగా ఆరాధించినచో, ఫలమును పొందగలడు (66). ఈ విధముగా కర్మను చేసిననూ ఫలము లభించని పక్షములో, అదే కర్మను రెండు మూడు సార్లు ఆవృత్తి చేసినచో, ఫలము తప్పక లభించును (67). పూజలో ఉపయోగించబడే బంగారము, రత్నములు మొదలగు ద్రవ్యములు ఏవి గలవో, వాటిని అన్నింటినీ గురువునకు ఇచ్చి , వాటికంటె వేరుగా దక్షిణను కూడ ఈయవలెను (68). ఆయన స్వీకరించుటకు అంగీకరించని పక్షములో, వాటినన్నింటినీ శివున కు గాని, శివభక్తులకు గాని సమర్పించవలెనే గాని, ఇతరులకు ఈయరాదు (69). ఎవడైతే గురువు మొదలగు వారి సాహాయ్యము లేకుండగా స్వయముగనే కర్మను ఆచరించునో, అట్టివాడు కూడ ఇటులనే చేయవలెనే గాని, ఆ వస్తువులను తాను ఉంచుకొనరాదు (70). ఎవడైతే లోభియై పూజలో వినియోగించబడిన ద్రవ్యములను తానే ఉంచుకొనునో, అట్టి మూఢుడు తాను కోరే ఫలమును పొందలేడనుటలో సందేహము లేదు (71). ఒకడు ఇతరునిచే పూజించబడిన శివలింగమును తీసుకొనవచ్చునా, లేదా అనునది అతని ఇచ్ఛపై ఆధారపడి యుండును. తీసుకున్న పక్షములో దానిని నిత్యము తాను స్వయముగా ఆరాధించ వలెను. లేదా, ఇతరులచే ఆరాధింప జేయవలెను (72).

యథోక్తమేవ కర్మైతదాచరేద్యో%నపాయతః | ఫలం వ్యభిచరేన్నైవమిత్యతః కిం ప్రరోచకమ్‌ || 73

తథాప్యుద్దేశతో వక్ష్యే కర్మణస్సిద్ధిముత్తమామ్‌ | అపి శత్రుభిరాక్రాంతో వ్యాధిభిర్వాప్యనే కశః || 74

మృత్యోరాస్యగతశ్చాపి ముచ్యతే నిరపాయతః | పూజయతే %తికృపణో రిక్తో వైశ్రవణాయతే || 75

కామాయతే విరూపో%పి వృద్ధో%పి తరుణాయతే | శత్రుర్మిత్రాయతే సద్యో విరోధీ కింకరాయతే || 76

విషాయతే యదమృతం విషమప్యమృతాయతే | స్థలాయతే సముద్రో%పి స్థలమప్యర్ణవాయతే || 77

మహీధరాయతే శ్వభ్రం స చ శ్వభ్రాయతే గిరిః | పద్మాకరాయతే వహ్నిస్సరో వైశ్వానరాయతే || 78

వనాయతే యదుద్యానం తదుద్యానయతే వనమ్‌ | సింహాయతే మృగః క్షుద్రస్సింహః క్రీడామృగాయతే || 79

స్త్రియో%భిసారికాయంతే లక్ష్మీస్సుచరితాయతే | సై#్వరప్రేష్యాయతే వాణీ కీర్తిస్తు గణికాయతే || 80

సై#్వరాచారాయతే మేధా వజ్రసూచీయతే మనః | మహావాతాయతే శక్తిర్బలం మత్తగజాయతే || 81

స్తంభాయతే సముద్యోగైశ్శత్రుపక్షేస్థితా క్రియా | శత్రుపక్షాయతే%రీణాం సర్వ ఏవ సుహృజ్జనః || 82

ఎవడైతే శాస్త్రమునతిక్రమించకుండగా పైన చెప్పబడిన విధముగా మాత్రమే కర్మను ఆచరించునో, వానికి ఫలము లభించకపోయే ప్రసక్తి లేదు. ఈ కర్మలో సాధకుని ప్రేరేపించుటకు ఈ మాటను మించి మరియేమి కావలెను ? (73) అయినప్పుటికీ ఈ కర్మ వలన కలిగే ఉత్తమమగు సిద్ధిని గురించి నేను సంక్షేపముగా చెప్పెదను. శత్రువులచే ముట్టడించబడినవాడైననూ, అనేకవిధముల వ్యాధులచే పీడించబడువాడైననూ (74), మృత్యువుయొక్క కోరలలో చిక్కినవాడైననూ విఘ్నములు లేకుండగా విముక్తుడగును. పరమలోభి కూడ పూజార్హుడగును. దరిద్రుడు కుబేరుడగును (75). కురూపి మన్మథునివంటి వాడగును. ముదసలి యవకునివంటి వాడగును. శత్రువు మిత్రుడగును. విరోధము తలపెట్టినవాడు వెనువెంటనే సేవకుని వలెనగును (76). అమృతము విషముగను, విషము అమృతముగను అగును. సముద్రము మెట్టగను, మెట్ట సముద్రముగను అగును (77). గొయ్యి పర్వతముగను, పర్వతము గొయ్యిగను అగును. అగ్ని సరస్సు వలె చల్లగను, సరస్సు అగ్నివలె కాల్చునదిగను అగును (78). ఉద్యానము అడవిగను, అడవి ఉద్యానముగను, అల్పమగు మృగము సింహమువలె శౌర్యము కలదిగను, సింహము ఆటలాడుకునే మృగముగను అగును (79). స్త్రీలు అభిసారికలు (అధికముగా ప్రేమించువారు) గను, లక్ష్మీసుస్థిరచిత్తము కలదిగను అగును. సరస్వతి తన కనుసన్నలలో మెలిగే దాసి యగును. కీర్తి గణిక (అంతటా వ్యాపించునది) అగును (80). బుద్ధి యథేచ్ఛాసంచారిణిగను, మనస్సు వజ్రములకు బెజ్జమును చేసే సూదివలె అత్యంతసూక్ష్మముగను అగును. శక్తి తుఫాను వలె ప్రబలమగును. బలము మదించిన ఏనుగుయొక్క బలముతో సమానమగును (81). శత్రుపక్షము వారు పూర్ణప్రయత్నముతో చేసే కార్యములన్నియు స్తంభించి పోవును. శత్రువుల మిత్రవర్గము వారు అందరు వారికి శత్రువులుగా మారిపోవుదురు (82).

శత్రవః కుణపాయంతే జీవంతోపి సబాంధవాః | ఆపన్నో%పి గతారిష్టస్స్వయం ఖల్వమృతాయతే || 83

రసాయనాయతే నిత్యమపథ్యమపి సేవితమ్‌ | అనిశం క్రియమాణాపి రతిస్త్వభినవాయతే || 84

అనాగతాదికం సర్వం కరస్థామలకాయతే | యాదృచ్ఛికఫలాయంతే సిద్ధయో%ప్యణిమాదయః || 85

బహునాత్ర కిముక్తేన సర్వకామార్థసిద్ధిషు | అస్మిన్‌ కర్మణి నిర్వృత్తే త్వనవాప్యం న విద్యతే || 86

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివపూజా ఫలవర్ణనం నామ ద్వాత్రింశో%ధ్యాయః (32)

శత్రువులు తమ బంధువులతో సహా జీవించియే యున్ననూ శవముల వలె నగుదురు. సాధకుడు ఆపదను పొందియున్ననూ, వాని ఆపద తొలగిపోయి తాను అమృతస్వరూపుడగును (83). ఆతడు నిత్యము అపథ్యము (ఆరోగ్యదృష్టితో తినకూడని ఆహారము) ను తిన్ననూ, అది ఆతనికి మందు వలెనే పని చేయును. నిత్యము చేయబడే ప్రేమాదికము కూడ నిత్యనూతనముగ నుండును (84). ఇంకనూ చేతికి అందని సర్వము చేతిలోని ఉసిరిక వలె నగును. అణిమాది సిద్ధులు కూడ కోరిన వెంటనే ఫలముల నిచ్చుచుండును (85). ఈ విషయములో ఇన్ని మాటలేల? ఈ కర్మను చేసినచో, కోరదగిన సకలములగు వస్తువుల విషయములో పొందబడనిది ఏదియు ఉండదు; అనగా సర్వము సిద్ధించును (86).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివపూజాఫలవర్ణనమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).

Siva Maha Puranam-4    Chapters