Siva Maha Puranam-4    Chapters   

శ్రీ శివ మహాపురాణము

అథ ఏకోనత్రింశత్తమో%ధ్యాయః

కామ్య కర్మ నిరూపణము

శ్రీకృష్ణ ఉవాచ |

భగవంస్త్వన్ముఖాదేవ శ్రుతం శ్రుతిసమం మయా | స్వాశ్రితానాం శివప్రోక్తం నిత్యనైమిత్తికం తథా || 1

ఇదానీం శ్రోతుమిచ్ఛామి శివధర్మాధికారిణామ్‌ | కామ్యమప్యస్తి చేత్కర్మ వక్తుమర్హసి సాంప్రతమ్‌ || 2

శ్రీ కృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! వేదముతో సమానమైనది, శివునిచే తన భక్తుల కొరకు చెప్పబడినది అగు నిత్యనైమిత్తికస్వరూపమును నేను నీ నోటినుండియే వినియున్నాను (1). శివధర్మము నందు అధికారము గల వ్యక్తులకు కామ్యకర్మలు కూడ గలవా? ఉన్నచో ఆ వివరములను నేను ఇప్పుడు వినగోరుచున్నాను. కావున, నీవా విషయమును ఇప్పుడు చెప్పదగుదువు (2).

ఉపమన్యురువాచ |

అసై#్త్యహికఫలం కించిదాముష్మికఫలం తథా | ఐహికాముష్మికం చాపి తచ్చ పంచవిధం పునః || 3

కించిత్ర్కియామయం కర్మ కించిత్కర్మ తపోమయమ్‌ || 4

జపధ్యానమయం కించిత్కించిత్సర్వమయం తథా | క్రియామయం తథా భిన్నం హోమదానార్చనక్రమాత్‌ || 5

సర్వశక్తిమతామేవ నాన్యేషాం సఫలం భ##వేత్‌ | శక్తిశ్చాజ్ఞా మహేశస్య శివస్య పరమాత్మనః || 6

తస్మాత్కామ్యాని కర్మాణి కుర్యాదాజ్ఞాధరో ద్విజః | అథ వక్ష్యామి కామ్యం హి చేహాముత్ర ఫలప్రదమ్‌ || 7

శైవైర్మాహేశ్వరైశ్చైవ కార్యమంతర్బహిః క్రమాత్‌ | శివో మహేశ్వరశ్చేతి నాత్యంతమిహ భిద్యతే || 8

యథా తథా న భిద్యంతే శైవా మాహేశ్వరా అపి | శివాశ్రితా హి తే శైవా జ్ఞానయజ్ఞరతా నరాః || 9

మాహేశ్వరాస్సమాఖ్యాతా కర్మయజ్ఞరతా భువి | తస్మాదాభ్యంతరే కుర్యుశ్శైవా మాహేశ్వరా బహిః || 10

ఉపమన్యువు ఇట్లు చెప్పెను -

కొన్ని కర్మలు ఈ లోకమునందలి ఫలములను ఇచ్చును; అదే విధముగా మరికొన్ని పరలోకఫలమునిచ్చును; ఇంకో కొన్ని కర్మలు ఈ రెండు రకముల ఫలములనిచ్చును. ఈ కర్మలను మరో దృష్టికోణములో అయిదు రకములుగా విభజించవచ్చును (3). కొన్ని కర్మలు కేవలము క్రియారూపముగా నుండును; కొన్ని కర్మలు తపస్సు రూపములో నుండును (4). కొన్ని కర్మలు జపము మరియు ధ్యానము అనే రూపములో నుండును; కొన్నింటిలో ఇవి అన్నీ కలిసి ఉండును. మరల క్రియాప్రధానమగు కర్మలో క్రమముగా హోమము, దానము మరియు పూజ అనే విభాగము గలదు (5). ఈ కర్మలు సకలశక్తులు గలవారికి మాత్రమే సఫలమగును; అట్లు కానివారికి సఫలము కావు. శక్తి అనగా మహేశ్వరుడగు శివపరమాత్మ యొక్క ఆజ్ఞయే (6). కావున శివుని ఆజ్ఞను శిరసావహించి బ్రాహ్మణుడు కామ్య కర్మలను చేయవలెను. ఇహపరలోకములలో ఫలములనిచ్చే కామ్యకర్మలను ఇప్పుడు చెప్పెదను (7). వీటిని శైవులు మానసికముగను, మాహేశ్వరులు బాహ్యమునందు చేయవలెను. ఏ విధముగానైతే శివునకు, మహేశ్వరునకు అత్యంతభేదము లేదో, అదే విధముగా శైవులకు మాహేశ్వరులతో భేదము లేదు. ఈ లోకములో జ్ఞానయజ్ఞమునందు ప్రీతిగల శివ భక్తులగు మానవులు శైవులనబడుదురు. కర్మయజ్ఞమునందు ప్రీతి గలవారు మాహేశ్వరులనబడుదురు. కావున శైవులు మానసికముగను, మాహేశ్వరులు బాహ్యమునందు శివుని ఆరాధించెదరు (8-10).

న తు ప్రయోగో భిద్యేత వక్ష్యమాణస్య కర్మణః | పరీక్ష్య భూమిం విధివద్గంధవర్ణరసాదిభిః || 11

మనోభిలషితే తత్ర వితానవితతాంబరే | సుప్రలిస్తే మహీపృష్ఠే దర్పణోదరసంనిభే || 12

ప్రాచీముత్పాదయేత్పూర్వం శాస్త్రదృష్టేన వర్త్మనా | ఏకహస్తం ద్విహస్తం వా మండలం పరికల్పయేత్‌ || 13

ఆలిఖేద్విమలం పద్మమష్టపత్రం సకర్ణికమ్‌ | రత్న హేమాదిభిశ్చూర్ణైర్యథాసంభవసంభృతైః || 14

పంచావరణసంయుక్తం బహుశోభాసమన్వితమ్‌ | దలేషు సిద్ధయః కల్ప్యాః కేసరేషు సశక్తికాః || 15

రుద్రా వామాదయస్త్వష్టౌ పూర్వాదిదలతః క్రమాత్‌ | కర్ణికాయాం చ వైరాగ్యం బీజేషు నవ శక్తయః || 16

కందే శివాత్మకో ధర్మో నాలే జ్ఞానం శివాశ్రయమ్‌ | కర్ణికోపరి చాగ్నేయం మండలం సౌరమైందవమ్‌ || 17

చెప్పబోయే కర్మవిషయములో వీరిద్దరు చేయదగిన ప్రయోగములో భేదము లేదు. భూమిని యథావిధిగా గంధము, రంగు, రుచి మొదలగు అంశములలో పరీక్షించి (11), దానియందు మనస్సునకు నచ్చిన స్థానములో ఆకాశమునందు చందువను ఏర్పాటు చేసి, నేలను ఆలికి అద్దమువలె తయారు చేయవలెను (12). శాస్త్రములో చెప్పిన విధముగా ముందు తూర్పు దిక్కును గుర్తు పెట్టవలెను. అచట ఒకటి లేక రెండు చేతుల పరిమాణము గలది, అయిదు ఆవరణములు గలది అగు మండలమును అనకములగు శోభలు గలదిగా చేయవలెను. దొరికిన మేరకు రత్నములు బంగారము మొదలగు వాటి పొడులను సంపాదించుకొని, వాటితో దానియందు స్వచ్ఛమైన ఎనిమది రేకుల పద్మమును కర్ణికతో సహా వ్రాయవలెను. క్రమముగా తూర్పుతో మొదలిడి దళములయందు అష్టసిద్ధులను, కేసరములయందు వామ మొదలగు ఎనిమిది శక్తులతో కూడిన రుద్రులను, కర్ణికయందు వైరాగ్యమును, బీజములయందు తొమ్మిది శక్తులను, పద్మముయొక్క దుంపయందు శైవధర్మమును, తూడునందు శివునకు సంబంధించిన జ్ఞానమును స్థాపించవలెను (13-17).

శివవిద్యాత్మతత్త్వాఖ్యం తత్త్వత్రయమతః పరమ్‌ | సర్వాసనోపరి సుఖం విచిత్రకుసుమాన్వితమ్‌ || 18

పంచావరణసంయుక్తం పూజయేదంబయా సహ | శుద్ధస్ఫటికసంకాశం ప్రసన్నం శీతలద్యుతిమ్‌ || 19

విద్యుద్వలయసంకాశజటాముకుటభూషితమ్‌ | శార్దూలచర్మవసనం కించిత్‌ స్మితముఖాంబుజమ్‌ || 20

రక్తపద్మదలప్రఖ్యపాదపాణితలాధరమ్‌ | సర్వలక్షణసంపన్నం సర్వాభరణభూషితమ్‌ || 21

దివ్యాయుధవరైర్యుక్తం దివ్యగంధానులేపనమ్‌ | పంచవక్త్రం దశభుజం చంద్రఖండశిఖామణిమ్‌ || 22

ఈ మండలములకు పైన శివ-విద్యా- ఆత్మతత్త్వములనే మూడు తత్త్వములను, పూర్ణపద్మాసనమునకు పైన రంగురంగుల పుష్పములతో మరియు అయిదు ఆవరణలతో కూడి సుఖముగా నున్న శివుని పార్వతితో సహా పూజించవలెను. స్వచ్ఛమగు స్ఫటికమువలె ప్రకాశించువాడు, ప్రసన్నుడు, చల్లని కాంతులు గలవాడు (18,19), మెరుపు చుట్టవలె ప్రకాశించే జటామండలమును కిరీటముతో అలంకరించుకున్నవాడు, పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించినవాడు, చిరునవ్వుతో కూడియున్న ముఖపద్మము గలవాడు (20), ఎర్రని పద్మమువలె ప్రకాశించే అరికాళ్లు అరచేతులు మరియు పెదవులు గలవాడు, సకలలక్షణములతో నొప్పారువాడు, సకలాభరణములను అలంకరించుకున్నవాడు (21), దివ్యములు మరియు శ్రేష్ఠములు అగు ఆయుధములతో కూడియున్నవాడు, దివ్యమగు గంధమును పూసుకున్నవాడు, అయిదు ముఖములు పది చేతులు గలవాడు, చంద్రవంకను చూడామణిగా పెట్టుకున్నవాడు అగు శివుని ధ్యానించవలెను (22).

అస్య పూర్వముఖం సౌమ్యం బాలార్కసదృశప్రభమ్‌ | త్రిలోచనారవిందాఢ్యం కృతబాలేందు శేఖరమ్‌ || 23

దక్షిణం నీలజీమూతసమానరుచిరప్రభమ్‌ | భ్రుకుటీకుటిలం ఘోరం రక్తవృత్తేక్షణత్రయమ్‌ || 24

దంష్ట్రా కరాలం దుర్ధర్షం స్ఫురితాధరపల్లవమ్‌ | ఉత్తరం విద్రుమప్రఖ్యం నీలాలకవిభూషితమ్‌ || 25

సవిలాసం త్రినయనం చంద్రాభరణ శేఖరమ్‌ | పశ్చిమం పూర్ణచంద్రాభం లోచనత్రితయోజ్జ్వలమ్‌ || 26

చంద్రరేఖాధరం సౌమ్యం మందస్మితమనోహరమ్‌ | పంచమం స్ఫటికప్రఖ్యమిందు రేఖాసముజ్జ్వలమ్‌ || 27

అతీవ సౌమ్యముత్ఫుల్లలోచనత్రితయోజ్జ్వలమ్‌ | దక్షిణ శూలపరశువజ్రఖడ్గానలోజ్జ్వలమ్‌ || 28

సవ్యే చ నాగనారాచఘంటాపాశాంకుశోజ్జ్వలమ్‌ | నివృత్త్యానుసంబద్ధమానాభేశ్చ ప్రతిష్ఠయా || 29

ఆకంఠం విద్యయా తద్వదాలలాటం తు శాంతయా | తదూర్ధ్వం శాంత్యతీతాఖ్యకలయా పరయా తథా || 30

పంచాధ్వవ్యాపినం సాక్షాత్కలాపంచకవిగ్రహమ్‌ | ఈశానముకుటం దేవం పురుషాఖ్యం పురాతనమ్‌ || 31

అఘోరహృదయం తద్వద్వామగుహ్యం మహేశ్వరమ్‌ | సద్యపాదం చ తన్మూర్తిమష్టత్రింశత్కలామయమ్‌ || 32

ఆయన తూర్పువైపు ముఖము సౌమ్యముగా, బాలసూర్యుని పోలిన కాంతి గలదై, పద్మములను బోలిన మూడు నేత్రములతో సంపన్నమై, చంద్రవంక శిరోభూషణముగా కలిగి యుండును (23). దక్షిణముఖము నల్లని మేఘములతో సమానమగు కాంతిని కలిగి, వంకర తిరిగిన కనుబొమలు గలదై, భయంకరముగా, ఎర్రని గిరగిర తిరిగే మూడు కన్నలు గలదై (24), కోరలతో కురూపముగా, అదిరే చిగురుటాకు వంటి క్రింది పెదవి కలిగి సహింప శక్యము కానిదిగా నుండును. ఉత్తరముఖము పగడము వలె ప్రకాశిస్తూ, నల్లని ముంగురులతో అలంకరింపబడి (25), వయ్యారము గలదై, మూడు కన్నులతో, చంద్రుని శిరోభూషణముగా కలిగియుండును. పశ్చిమముఖము పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ, మూడు కన్నులతో గొప్పగా వెలిగిపోతూ (26), చంద్రవంకను దాల్చినదై, సౌమ్యముగా చిరునవ్వుతో మనస్సును దోచివేయును. అయిదవ ముఖము స్ఫటికము వలె ప్రకాశిస్తూ, చంద్రవంకతో వెలిగిపోతూ (27), మిక్కిలి సౌమ్యముగా, పూర్తిగా వికసించిన మూడు కన్నులతో గొప్పగా ప్రకాశించుచుండను. కుడి చేతిలో శూలము, పరశువు, వజ్రము, కత్తి మరియు అగ్ని గొప్పగా ప్రకాశించుచుండును (28). ఎడమ చేతిలో పాము, బాణము, గంట, పాశము, మరియు అంకుశము ప్రకాశించుచుండును. మోకాళ్ల వరకు నివృత్తి కళ, బొడ్డు వరకు ప్రతిష్ఠాకళ (29), కంఠము వరకు విద్యాకళ, అదే విధముగా, లలాటము వరకు శాంతకళ, ఆ పైన సర్వోత్తమమగు శాంత్యతీతకళ ఉండును (30). శివుడే సాక్షాత్తుగా అయిదు మార్గములను వ్యాపించి యుండే అయిదు కళలతో నిండిన దేహము గలవాడు. ఆ పురాతనుడగు మహేశ్వరదేవునకు ఈశానుడు కిరీటము కాగా, తత్పురుషుడు ముఖము, అఘోరుడు హృదయము, వామదేవుడు గుహ్యము, సద్యోజాతుడు పాదము అగుచున్నారు. శివునకు ముప్పది ఎనిమిది తత్త్వములే (కళ, కాలము, నియతి, విద్య, రాగము, ప్రకృతి, గుణము, పంచభూతములు, పంచతన్మాత్రలు, పది ఇంద్రియములు, మనోబుద్ధ్యహంకారములు, శబ్దరూపరసస్పర్శగంధములు, శక్తి, చైతన్యము) స్వరూపము అట్టి శివుని ధ్యానించవలెను (31,32).

మాతృకామయమీశానం పంచబ్రహ్మమయం తథా | ఓంకారాఖ్యమయం చైవ హంసశక్త్యా సమన్వితమ్‌ || 33

తథేచ్ఛాత్మికయా శక్త్యా సమారూఢాంకమండలమ్‌ | జ్ఞానాఖ్యయా దక్షిణతో వామతశ్చ క్రియాఖ్యయా || 34

తత్త్వత్రయమయం సాక్షాద్విద్యామూర్తిం సదాశివమ్‌ | మూర్తిం మూలేన సంకల్ప్య సకలీకృత్య చ క్రమాత్‌ || 35

సంపూజ్య చ యథా న్యాయమర్ఘాంతం మూలవిద్యయా | మూర్తిమంతం శివం సాక్షాచ్ఛక్త్యా పరమయా సహ || 36

తత్రావాహ్య మహాదేవం సదసద్వ్యక్తివర్జితమ్‌ | పంచోపకరణం కృత్వా పూజయేత్పరమేశ్వరమ్‌ || 37

బ్రహ్మభిశ్చ షడంగైశ్చ తతో మాతృకయా సహ | ప్రణవేన శివేనైవ శక్తియుక్తేన చ క్రమాత్‌ || 38

శాంతేన వా తథాన్యైశ్చ వేదమంత్రైశ్చ కృత్స్నశః | పూజయేత్పరమం దేవం కేవలేన శివేన వా || 39

పాద్యాదిముఖవాసాంతం కృత్వా ప్రస్థాపనం వినా | పంచావరణపూజాం తు హ్యారభేత యథక్రమమ్‌ || 40

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే కామ్యకర్మ వర్ణనం నామ ఏకోనత్రింశత్తమో%ధ్యాయః (29).

వర్ణమాలయే స్వరూపముగా గలవాడు, జగత్తును నియంత్రించువాడు, పంచబ్రహ్మ స్వరూపుడు, ఓంకారస్వరూపుడు, హంసశక్తితో కూడినవాడు (33), అదే విధముగా ఇచ్ఛాశక్తిచే అధిష్ఠించబడిన అంకమండలము గలవాడు, కుడివైపున జ్ఞానశక్తితో, ఎడమవైపున క్రియాశక్తితో కూడియున్నవాడు (34), మూడు తత్త్వములే స్వరూపముగా గలవాడు, సాక్షాత్తుగా విద్యయే స్వరూపముగా గలవాడు అగు సదాశివుని ధ్యానించవలెను. మూలమంత్రముతో క్రమముగా మూర్తిని కల్పించి, సకలీకరణము అనే క్రియను చేసి (35), మూలమంత్రముతో అర్ఘ్యము వరకు యథావిధిగా చక్కగా పూజించవలెన, పరాశక్తితో కూడియున్నవాడు, సాక్షాత్తుగా మూర్తిరూపములో నున్నవాడు, మంగళస్వరూపుడు, కార్యకారణరూపములకు అతీతమైనవాడు, పరమేశ్వరుడు అగు మహాదేవుని ఆ మూర్తియందు అవాహన చేసి, అయిదు ఉపచారములతో పూజించవలెను (36,37). పంచబ్రహ్మమంత్రములు, ఆరు అంగమంత్రములు, మాతృకామంత్రము, ఓంకారము, శక్తిమంత్రముతో గూడియున్న శివమంత్రము, శాంతిమంత్రములు, మరియు ఇతరవేదమంత్రములను క్రమముగా పఠించి, ఆ పరమేశ్వరుని పూర్ణముగా పూజించవలెను; లేదా, కేవలము శివమంత్రముతోనైననూ పూజించవలెను (38,39). పాద్యముతో మొదలిడి, తాంబూలము వరకు పూజను చేసి, ఉద్వాసనను చెప్పకుండగా, క్రమముగా అయిదు ఆవరణముల పూజను ఆరంభించవలెను (40).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో కామ్యకర్మనిరూపణమనే ఇరువది తొమ్మిదవ ఆధ్యాయము ముగిసినది (29).

Siva Maha Puranam-4    Chapters