Siva Maha Puranam-4    Chapters   

అథ పంచవింశోsధ్యాయః

శివభక్తియొక్క మహిమ

ఉపమన్యురువాచ|

అనుక్తం చాత్ర పూజాయాః క్రమలోపభయాదివ| యత్తదన్యత్ర్పవక్ష్యామి సమాసాన్న తు విస్తరాత్‌|| 1

హవిర్ని వేదనాత్పూర్వం దీపదానాదనంతరమ్‌ | కుర్యాదావరణాభ్యర్చాం ప్రాప్తే నీరాజనేsథవా || 2

తత్రేశానాదిసద్యాంతం హృదాద్యస్త్రాంతమేవచ| శివస్య వా శివయాశ్చ ప్రథమావరణ యజేత్‌ || 3

ఐశాన్యాం పూర్వభాగే చ దక్షిణ చోత్తరే తథా | పశ్చిమే చ తథాగ్నేయ్యామైశాన్యాం నైరృతే తథా || 4

వాయవ్యాం పునరైశాన్యాం చతుర్దిక్షు తతః పరమ్‌|గర్భావరణమాఖ్యాతం మంత్రసంఘాతమేవ వా|| 5

హృదయాద్యస్త్రపర్యంతమథవాపి సమర్చయేత్‌ | తద్బహిః పూర్వతశ్శక్రం యమం దక్షిణతో యజేత్‌ || 6

వరుణం వారుణ భాగే ధనదం చోత్తరే బుధః | ఈశ##మైశే%నలం స్వీయే నైరృతే నిరృతిం యజేత్‌ || 7

మారుతే మారుతం విష్ణుం నైరృతే విధిమైశ్వరే | బహిః పద్మస్య వజ్రాద్యాన్యబ్జాంతాన్యాయుధాన్యపి || 8

ప్రసిద్ధ రూపాణ్యాశాసు లోకేశానాం క్రమాద్యజేత్‌ | దేవం దేవీం చ సంప్రేక్ష్య సర్వావరణదేవతాః || 9

బద్ధాంజలిపుటా ధ్యేయాస్సమాసీనా యథాసుఖమ్‌ | సర్వావరణదేవానాం స్వాభిధానైర్నమోయుతైః || 10

పుషై#్పస్సంపూజనం కుర్యాన్నత్వా సర్వాన్‌ యథాక్రమమ్‌ | గర్భావరణమేవాపి యజేత్స్వావరణన వా || 11

ఉపమన్యువు ఇట్లు పలికెను-

క్రమము తప్పు నేమో యను భయముతోనా యన్నట్లు నేను ఇదివరలో పూజావిశేషములను కొన్నింటిని చెప్పలేదు. వాటిని, మరియు ఇతరములగు విశేషములు ఏవి గలవో వాటిని విస్తారముగా గాక, సంగ్రహముగా చెప్పెదను (1). దీపమును ఇచ్చిన తరువాత హవిస్సును నివేదించుటకు ముందు గాని, లేదా నీరాజనము వచ్చినప్పుడు గాని ఆవరణపూజను చేయవలెను (2). దానిలో శివుని లేదా పార్వతి యొక్క మొదటి అవరణలో ఈశానునితో మొదలిడి సద్యోజాతుని వరకు, మరియు హృదయముతో మొదలిడి అస్త్రము వరకు పూజించవలెను (3), ఈశాన్యము, తూర్పు, దక్షిణము, ఉత్తరము, పశ్చిమము, ఆగ్నేయము, ఈశాన్యము, నైరృతి, వాయవ్యము, మరల ఈశాన్యము, తరువాత నాలుగు దిక్కులు అను స్థానములలో గర్భావరణపూజ గాని, మంత్రసంఘాతపూజ గాని నిర్దేశించబడినది (4,5). లేదా, హృదయముతో మొదలిడి అస్త్రము వరకు పూజించవలెను. విద్వాంసుడగు సాధకుడు దానికి బయట తూర్పునందు ఇంద్రుని, దక్షిణమునందు యముని, పశ్చిమమునందు వరుణుని, ఉత్తరమునందు కుబేరుని, ఈశాన్యమునందు ఈశానుని, ఆగ్నేయమునందు అగ్నిని, నైరృతియందు నిరృతిని, వాయవ్యమునందు వాయుదేవుని, నైరృతియందు విష్ణువును, ఈశాన్యమునందు బ్రహ్మను, పద్మమునకు బయట వజ్రముతో మొదలిడి పద్మము వరకు గల లోకపాలకుల ప్రసిద్ధమైన రూపములు గల ఆయుధములను వరుసగా పూజించవలెను. ఆవరణదేవతలు అందరు పార్వతీపరమేశ్వరులను చూస్తూ చేతులను జోడించుకొని సుఖముగా కూర్చుండి యున్నట్లు ధ్యానించవలెను. ఆవరణదేవతలందరికీ వారి పేర్లకు నమః అను పదమును జోడించి క్రమమును తప్పకుండగా నమస్కరించి పుష్పములతో చక్కగా పూజించవలెను. స్వీయమగు ఆవరణమంత్రముతో కూడియున్న గర్భావరణమును కూడ పూజించవచ్చును (6-11).

యోగే ధ్యానే జపే హోమే బాహ్యే వాభ్యంతరే%పి వా | హవిశ్చ షడ్విధం దేయం శుద్ధం ముద్గాన్నమేవ చ || 12

పాయసం దధిసంమిశ్రం గౌడం చ మధునాప్లుతమ్‌ | ఏతేష్వనేకమేకం వా నానావ్యంజనసంయుతమ్‌ || 13

గుడఖండాన్వితం దద్యాన్మథితం దధి చోత్తమమ్‌ | భక్ష్యాణ్యపూపముఖ్యాని స్వాదుమంతి ఫలాని చ || 14

రక్తచందనపుష్పాడ్యం పానీయం చాతిశీతలమ్‌ | మృదు ఏలారసాక్తం చ ఖండం పూగఫలస్య చ || 15

దలాని నాగవల్ల్యాశ్చ యుక్తాని ఖదిరాదిభిః | గౌరాణి స్వర్ణవర్ణాని విహితాని శివాని చ |

శైలమేవ సితం చూర్ణం నాతిరూక్షం న దూషితమ్‌ || 16

కర్పూరం చాథ కంకోలం జాత్యాది చ నవం శుభమ్‌ | ఆలేపనం చందనం స్యాన్మూలకాష్ఠం రజోమయమ్‌ || 17

కస్తూరికా కుంకుమం చ రసో మృగమదాత్మకః | పుష్పాణి సురభీణ్యవ పవిత్రాణి శుభాని చ || 18

నిర్గంధాన్యుగ్రగంధాని దూషితాన్యుషితాని చ | స్వయమేవావశీర్ణాని న దేయాని శివార్చనే || 19

వాసాంసి చ మృదూన్యేవ తపనీయమయాని చ | విద్యుద్వలయకల్పాని భూషణాని విశేషతః || 20

యోగము, ధ్యానము, జపము, హోమము, బాహ్యపూజ, ఆభ్యంతరపూజ అను కర్మలలో ఆరు విధముల హవిస్సును ఈయవలెను. పెసలను కలిపి ఉడికించిన శుద్ధమగు అన్నము (12), పెరుగును కలిపిన పాయసము, బెల్లముతో చేసిన హవిస్సు, తేనెతో తడుపబడిన తినుబండారము అను వాటిలో ఒకదానిని గాని, అనేకములను గాని వివిధములగు పచ్చళ్లను జత చేసి సమర్పించవలెను (13). బెల్లపు ముక్కలను వేసి చిలికిన శ్రేష్ఠమగు పెరుగును, అప్పములు మొదలగు భక్ష్యములను, రుచిగానుండే పళ్లను (14), ఎర్రచందనముతో మరియు పుష్పములతోకూడి నిండుగా ప్రకాశించుచున్న మిక్కిలి చల్లని పానీయమును, ఏలకుల రసముతో తడిసి మెత్తగానుండే వక్కసొడిని (15), కవిరి మొదలగు వాటితో కూడిన తమలపాకులను ఈయవలెను. బంగారమువలె పచ్చని రంగు గల ఆకులు శాస్త్రసమ్మతములు మరియు మంగళకరములు. శిలాజిత్తును, చెడిపోని సున్నమును కూడ ఈయవలెను. సున్నము మిక్కిలి పొడిగా నుండరాదు (16). కర్పూరమును, కంకోలమును, శుభకరములైన కొంగ్రొత్త జాజికాయలు మొదలగు వాటిని ఈయవలెను. మూలకాష్ఠపు పొడితో కూడిన చందనమును ఆలేపనము (శరీరమునకు రాసుకొనే చూర్ణము) కొరకు ఈయవలెను (17). కస్తూరిమృగముయొక్క నాభినుండి వచ్చిన సుగంధద్రవ్యముయొక్క సారమగు కస్తూరిని, కుంకుమను, పరిమళభరితములు పవిత్రములు మంగళకరములు అగు పుష్పములను సమర్పించవలెను (18). సువాసన లేనివి, ఘాటైన వాసన గలవి, పాడైనవి, నిలవ ఉన్నవి మరియు వాటంతట అవి రాలినవి అగు పుష్పములు శివపూజకు పనికి రావు (19). కోమలములగు వస్త్రములను మాత్రమే సమర్పించవలెను. మెరుపు తీగవలె ప్రకాశించే బంగరు ఆభరణములను విశేషముగా సమర్పించవలెను (20).

సర్వాణ్యతాని కర్పూరనిర్యాసాగురుచందనైః | ఆధూపితాని పుష్పౌఘైర్వాసితాని సమంతతః || 21

చందనాగురుకర్పూరకాష్టగుగ్గులు చూర్ణకైః | ఘృతేన మధునా చైవ సిద్ధో ధూపః ప్రశస్యతే || 22

కపిలాసంభ##వేనైవ ఘృతేనాతిసుగంధినా | నిత్యం ప్రదీపితా దీపాశ్శస్తాః కర్పూరసంయుతాః || 23

పంచగవ్యం చ మధురం పయో దధి ఘృతం తథా | కపిలాసంభవం శంభోరిష్టం స్నానే చ పానకే || 24

ఆసనాని చ భద్రాణి గజదంతమయాని చ | సువర్ణరత్నయుక్తాని చిత్రాణ్యాస్తరణాని చ || 25

మృదూపధానయుక్తాని సూక్ష్మతూలమయాని చ | ఉచ్చావచాని రమ్యాణి శయనాని సుఖాని చ || 26

నద్యాస్సముద్రగామిన్యా నదాద్వాంభస్సమాహృతమ్‌ | శీతం చ వస్త్రపూతం తద్విశిష్టం స్నానపానయోః || 27

ఛత్రం శశినిభం చారు ముక్తాదామవిరాజితమ్‌ | నవరత్నచితం దివ్యం హేమదండమనోహరమ్‌ || 28

చామరే చ సితే సూక్ష్మే చామీకరపరిష్కృతే | రాజహంసద్వయాకారే రత్నదండోపశోభితే || 29

దర్పణం చాపి సుస్నిగ్ధం దివ్యగంధానులేపనమ్‌ | సమంతాద్రత్నసంఛన్నం స్రగ్వరైశ్చాపి భూషితమ్‌ || 30

ఈ పదార్థములకు అన్నింటికీ కర్పూరము, గుగ్గిలము, అగరు మరియు చందనములతో ధూపమును వేసి, వాటి చుట్టూ పుష్పముల సమూహములను ఉంచి పరిమళభరితములుగా చేయవలెను (21), చందనము, అగరు, కర్పూరము, మూలకాష్ఠము, మరియు గుగ్గిలము అనువాటి పొడిని నేతితో మరియు తేనెతో కలిపి దానితో ధూపమును వేసినచో, అది ప్రశస్తముగా నుండును (22). కపిలగోవుయొక్క పాల నుండి పుట్టిన మిక్కిలి పరిమళభరితమైన నేయికి కర్పూరమును కలిపి దానితో మాత్రమే నిత్యము దీపములను పెట్టుట ప్రశస్తము (23). పంచగవ్యములు, తియ్యని పాలు, పెరుగు, కపిలగోవు పాలనుండి వచ్చిన నెయ్యి అనునవి శివునకు అభిషేకమునకు మరియు ఆచమనమునకు కూడ ప్రీతికరములైనవి (24). ఏనుగు దంతముతో చేసినవి, బంగారము మరియు రత్నముల గలవి అగు భద్రాసనములు, రంగురంగుల తివాచీలు (25), మెత్తని తలగడలు గలవి, సున్నితమైన దూదితో తయారైనవి, మిక్కిలి విలువైనవి, సుఖకరమైనవి, సుందరమైనవి అగు శయ్యలు ప్రశస్తమైనవి (26). సముద్రములో కలిసే నది నుండి గాని, లేదా నదము నుండి గాని తెచ్చిన చల్లని వడగట్టిన నీరు స్నానమునకు మరియు త్రాగుటకు శ్రేష్ఠము (27). చంద్రుని బోలి సుందరముగా నున్నది, ముత్యాల హారములతో ప్రకాశించునది, తొమ్మిది రత్నములు పొదిగినది, బంగరు దండముతో మనోహరముగా నున్నది అగు దివ్యమైన గొడుగును (28), తెల్లనివి నాజూకైనవి, బంగారముతో చేసినవి, రాజహంసల జంటవలె శోభిల్లునవి, రత్నములు పొదిగిన దండములు గలవి అగు రెండు వింజామరలను (29), మిక్కిలి నునుపైనది, దివ్యగంధము యొక్క అనులేపనము గలది, అంతటా రత్నములు పొదిగినది, మంచి మాలలతో కూడ అలంకరించబడినది అగు అద్దమును కూడ సమర్పించవలెను (30).

గంభీరనినదశ్శంఖో హంసకుందేందుసన్నిభః | ఆస్యపృష్ఠాదిదేశేషు రత్నచామీకరాచితః || 31

కాహలాని చ రమ్యాణి నానానాదకరాణి చ | సువర్ణనిర్మితాన్యేవ మౌక్తికాలంకృతాని చ || 32

భేరీమృదంగమురజతిమిచ్ఛపటహాదయః | సముద్రకల్పసన్నాదాః కల్పనీయాః ప్రయత్నతః || 33

భాండాన్యపి చ రమ్యాణి పత్రాణ్యపి చ కృత్స్నశః | తదాధారాణి సర్వాణి సౌవర్ణాన్యేవ సాధయేత్‌ || 34

ఆలయం చ మహేశస్య శివస్య పరమాత్మనః | రాజావసథవత్కల్ప్యం శిల్పశాస్త్రోక్తలక్షణమ్‌ || 35

ఉచ్చప్రాకారసంభిన్నం భూధరాకారగోపురమ్‌ | అనేకరత్నసంఛన్నం హేమద్వారకపాటకమ్‌ || 36

తప్తజాంబూనదమయం రత్నస్తంభశతావృతమ్‌ | ముక్తాదామవితానాఢ్యం విద్రుమద్వారతోరణమ్‌ || 37

చామీకరమయైర్దివ్యైర్ముకుటైః కుంభలక్షణౖః | అలంకృతశిరోభాగమస్త్రరాజేన చిహ్నితమ్‌ || 38

రాజన్యార్హనివాసైశ్చ రాజవీథ్యాదిశోభితైః | ప్రోచ్ర్ఛితప్రాంశుశిఖరైః ప్రాసాదైశ్చ సమంతతః || 39

ఆస్థానస్థానవర్యైశ్చ స్థితైర్దిక్షు విదిక్షు చ | అత్యంతాలంకృతప్రాంతమంతరావరణౖరివ || 40

గంభీరమగు ధ్వని గలది, హంసను మల్లెపువ్వును చంద్రుని పోలియున్నది, ముఖము వెనుకభాగము మొదలగు స్థానములయందు రత్నములతో మరియు బంగారముతో అలంకరింపబడినది అగు శంఖము సమర్పించ బడవలెను (31). సుందరమైనవి, అనేకములగు నాదములను చేయునవి, బంగారముతో నిర్మించబడినవి, ముత్యములతో అలంకరించ బడినవి అగు బాకాలను (32), భేరీలు, మద్దెలలు, డోళ్లు, తిమిచ్ఛములు, తప్పెటలు మొదలగు సముద్రధ్వనిని బోలిన చక్కని ధ్వనిని చేసే వాద్యములను ప్రయత్న పూర్వకముగా ఏర్పాటు చేయవలెను (33). పూజకు ఉపయోగించే భాండములు, పాత్రలు వాటి ఆధారములు అన్నియు బంగారముతో చేసినవై ఉండవలెను (34). మహేశ్వరుడగు శివపరమాత్మ యొక్క ఆలయము శిల్పశాస్త్రములో చెప్పిన లక్షణములు కలదియై రాజు యొక్క ప్రాసాదమును పోలియుండవలెను (35). ఎత్తైన ప్రాకారములతో కూడియున్నది, పర్వతమును పోలిన గోపురము గలది, అనేకములగు రత్నములు పొదిగినది, బంగారముతో చేయబడిన ద్వారములు మరియు తలుపులు గలది (36), పుటము పెట్టిన బంగారముతో నిండియున్నది, రత్నములు పొదిగిన వంద స్తంభములు గలది, ముత్యాల హారములతో కూడిన వితానము (చందువ) తో గొప్పగా ప్రకాశించునది, పగడములతో చేసిన ద్వారతోరణములు గలది (37), బంగారముతో చేసిన కుండ ఆకారము గల కిరీటములతో అలంకరింపబడిన శిఖరము గలది, అస్త్రములలో రాజగు త్రిశూలము చిహ్నముగా గల శిఖరము గలది (38), రాజులు నివసించుటకు తగినవి, రాజమార్గములు మొదలగు వాటితో ప్రకాశించునవి, మిక్కిలి ఎత్తైన పొడుగాటి శిఖరములు గలవి అగు ప్రాసాదములతో మరియు గొప్ప ఆస్థానప్రదేశములతో నాల్గుదిక్కులు మాత్రమే గాక మూలలు కూడ అంతటా నిండి యున్నది, లోపలి ఆవరణములతో మరింత అలంకరింపబడిన ప్రాంతములు గలది అగు ఆలయమును నిర్మించవలెను (39,40).

ఉత్తమస్త్రీసహసై#్రశ్చ నృత్యగీతవిశారదైః | వేణువీణావిదగ్ధైశ్చ పురుషైర్బహుభిర్వృతమ్‌ || 41

రక్షితం రక్షిభిర్వీరైర్గజవాజిరథాన్వితైః | అనేక పుష్పవాటీభిరనేకైశ్చ సరోవరైః || 42

దీర్ఘికాభిరనేకాభిర్దిగ్విదిక్షు విరాజితమ్‌ | వేదవేదాంత తత్త్వ జ్ఞైశ్శివశాస్త్ర పరాయణౖః || 43

శివాశ్రమరతైర్భక్తైశ్శివశాస్త్రోక్తలక్షణౖః | శాంతైస్స్మితముఖైస్స్ఫీతైస్సదాచారపరాయణౖః 44

శైవైర్మా హేశ్వరైశ్చైవ శ్రీమద్భి స్సేవితం ద్విజైః | ఏవమంతర్బహిర్వాథ యథాశక్తి వినిర్మితైః || 45

స్థానే శిలామయే దాంతే దారవే చేష్టకామయే | కేవలం మృన్మయే వాపి పుణ్యారణ్య% థవా గిరౌ || 46

నద్యాం దేవాలయే%న్యత్ర దేశే వాథ గృహే శుభే | ఆఢ్యో వాథ దరిద్రో వా స్వకాం శక్తిమవంచయన్‌ |

ద్రవ్యైర్న్యాయార్జితైరేవ భక్త్యా దేవం సమర్చయేత్‌ || 47

అథాన్యాయార్జితైశ్చాపి భక్త్యా చేచ్ఛివమర్చయేత్‌ | న తస్య ప్రత్యవాయో%స్తి భావవశ్యో యతః ప్రభుః || 48

న్యాయార్జితైరపి ద్రవ్యైరభక్త్యా పూజయేద్యది | న తత్ఫలమవాప్నోతి భక్తిరేవాత్ర కారణమ్‌ || 49

భక్త్యా విత్తానుసారేణ శివముద్దిశ్య యత్కృతమ్‌ | అల్పే మహతి వా తుల్యం ఫలమాఢ్యదరిద్రయోః || 50

వేలాది ఉత్తమస్త్రీలతో, నాట్యామునందు మరియు గానమునందు నిష్ణాతులు మరియు వేణువాదనమునందు వీణావాదనమునందు పండితులు అగు అనేకులగు పురుషులతో కూడియున్నది (41), ఏనుగులు గుర్రములు మొదలగు వాటితో గూడిన వీరులగు రక్షకభటులచే రక్షించబడినది, నాలుగు దిక్కులలో మాత్రమే గాక అవాంతరదిక్కుల యందు కూడ అనేకములగు పుష్పవాటికలతో సరస్సులతో మరియు దిగుడుబావులతో ప్రకాశించునది; వేదవేదాంతముల సారమునెరింగినవారు, శివశాస్త్రమునందు నిష్ఠ గలవారు, శివాశ్రమమునందు ప్రీతి గలవారు, భక్తులు, శివశాస్త్రమునందు చెప్పబడిన లక్షణములు గలవారు, చిరునగవుతో కూడిన మోము గలవారు, సంతోషము గలవారు, సదాచారమునందు శ్రద్ధ గలవారు, శోభాయుక్తులు అగుశైవులచే మాహేశ్వరులచే మరియు బ్రాహ్మణులచే సేవించబడినది, ఈ విధముగా లోపల మరియు బయట యథాశక్తిగా నిర్మించబడిన భవనములతో కూడినది అగు శివాలయమును నిర్మించవలెను (42-45), రాతినేలపై దంతముతో గాని, చెక్కతో గాని, ఇటుకలతో గాని, లేదా కేవలము మట్టితో గాని దేవాలయమును పవిత్రమగు అరణ్యమునందు గాని, పర్వతమునందు గాని, నదీతీరమునందు గాని నిర్మించవలెను. దేవాలయమునందు గాని మరియొక స్థానమునందు గాని, లేదా శుభకరమగు గృహమునందు గాని శివుని ఆరాధించవలెను. సాధకుడు ధనవంతుడైనా, బీదవాడైనా, తన శక్తివంచన లేకుండగా న్యాయముగా సంపాదించిన సొమ్ముతో మాత్రమే భక్తిపూర్వకముగా శివుని చక్కగా పూజించవలెను (46,47). సాధకుడు అన్యాయముతో సంపాదించిన ధనముతోనైననూ శివుని భక్తితో ఆరాధించినచో, వానికి ప్రత్యవాయము లేదు. ఏలయనగా, ఆ ప్రభుడు భక్తికి వశుడగును (48). సాధకుడు న్యాయముగా ఆర్జించిన ధనముతో పూజించిననూ భక్తి లేనిచో, ఆ పూజయొక్క ఫలము ఆతనికి దక్కదు. పూజాఫలము లభించుటలో ప్రముఖకారణము భక్తి మాత్రమే (49). సాధకుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, పూజ చిన్నదైనా, పెద్దది అయినా, తన ఆర్థికమగు శక్తిని అనుసరించి శివుని ఉద్దేశించి భక్తితో చేసినచో, దానికి ఫలము సమానము (50).

భక్త్యా ప్రచోదితః కుర్యాదల్పవిత్తోపి మానవః | మహావిభవసారోపి న కుర్యాద్భక్తివర్జితః || 51

సర్వస్వమపి యో దద్యాచ్ఛివే భక్తివివర్జితః | న తేన ఫలభాక్‌ స స్యాద్భక్తిరేవాత్ర కారణమ్‌ || 52

న తత్తపోభిరత్యుగ్రైర్న చ సర్వైర్మహామఖైః | గచ్ఛేచ్ఛివపురం దివ్యం మూక్త్వా భక్తిం శివాత్మికామ్‌ || 53

గుహ్యాద్గుహ్యతరం కృష్ణ సర్వత్ర పరమేశ్వరే | శివే భక్తిర్న సందేహస్తయా భక్తో విముచ్యతే || 54

శివమంత్రజపో ధ్యానం హోమో యజ్ఞస్తపః శ్రుతమ్‌ | దానమధ్యయనం సర్వే భావార్థం నాత్ర సంశయః || 55

భావహీనో నరస్సర్వం కృత్వాపి న విముచ్యతే | భావయుక్తః పునస్సర్వమకృత్వాపి విముచ్యతే || 56

చాంద్రాయణసహసై#్రశ్చ ప్రాజాపత్యశ##తైస్తథా | మాసోపవాసైశ్చాన్యైశ్చ శివభక్తస్య కిం పునః || 57

అభక్తా మానవాశ్చాస్మింల్లోకే గిరిగుహాసు చ | తపంతి చాల్పభోగార్థం భక్తో భావేన ముచ్యతే || 58

సాత్త్వికం ముక్తిదం కర్మ సత్త్వే వై యోగినః స్థితాః | రాజసం సిద్ధిదం కుర్యుః కర్మిణో రజసావృతాః || 59

అసురా రాక్షసాశ్చైవ తమోగుణసమన్వితాః | ఐహికార్థం యజంతీశం నరాశ్చాన్యే%పి తాదృశాః || 60

మానవుడు తక్కువ ధనము గలవాడే అయినానూ, భక్తిచే ప్రేరేపించబడిన వాడై పూజను చేయవలెను. గొప్ప సంపదయొక్క సారము గల మానవుడైననూ భక్తి లేనివాడైనచో, పూజను చేయుటకు అర్హుడు కాడు (51). ఎవడైతే భక్తి లేనివాడై శివునకు సర్వస్వమును సమర్పించునో, వానికి దాని ఫలము లభించదు. కర్మఫలవిషయములో భక్తి మాత్రమే ప్రధానకారణమగుచున్నది (52). మానవుడు మిక్కిలి తీవ్రమగు తపస్సులచేత గాని, గొప్ప యజ్ఞములనన్నింటినీ చేయుట చేతగాని, ఆ దివ్యమగు శివపురమును పొందలేడు. శివునియందు భక్తి వలన మాత్రమే మానవునకు అది లభించును (53). ఓ శ్రీకృష్ణా! పరమేశ్వరుడగు శివునకు సంబంధించిన విషయములన్నింటిలో భక్తి సర్వశ్రేష్ఠమనుటలో సందేహము లేదు. భక్తుడు భక్తిచే మోక్షమును పొందును. ఇది పరమరహస్యము (54). శివమంత్రమును జపించుట, ధ్యానము, హోమము, యజ్ఞము, తపస్సు, వేదవిజ్ఞానము, దానము, అధ్యయనము అనే ఈ సర్వము అంతఃకరణశుద్ధి మరియు భక్తి కొరకు మాత్రమే. ఈ విషయములో సందేహము లేదు (55). అంతఃకరణశుద్ధి లేని మానవుడు సర్వకర్మలను చేసిననూ మోక్షమును పొందలేడు. భక్తి గల మానవుడు దేనినీ చేయకపోయిననూ మోక్షమును పొందును (56). శివభక్తునకు వేయి చాంద్రాయణవ్రతములతో గాని, వంద ప్రాజాపత్యక్రతువులతో గాని, మాసము రోజుల ఉపవాసములతో గాని, ఇతర వ్రతములతో గాని, ఏమి ప్రయోజనము? (57) ఈ లోకములో భక్తి లేని మానవులు అల్పభోగముల కొరకై పర్వతగుహలలో తపస్సును చేయుచున్నారు. భక్తుడు భక్తిభావముచేతనే మోక్షమును పొందును (58). సాత్త్విక కర్మ మోక్షమునిచ్చును. యోగులు సత్త్వగుణప్రధానులై యుందురు. రజోగుణముచే కప్పి వేయబడిన బుద్ధి గల కర్మఠులు సిద్ధులను ఇచ్చే రాజస కర్మను చేయుదురు (59). తమోగుణముతో నిండియుండే అసురులు (భోగలాలసులు) మరియు రాక్షసులు (క్రూరచరితులు) ఇహలోకసుఖముల కొరకై ఈశ్వరుని పూజించెదరు. సామాన్యులగు మానవులు కూడ అట్టి వారే (60).

తామసం రాజసం వాపి సాత్త్వికం భావమేవ చ | ఆశ్రిత్య భక్త్యా పూజాద్యం కుర్వన్‌ భద్రం సమశ్నుతే || 61

యతః పాపార్ణవాత్త్రాతుం భక్తిర్నౌరివ నిర్మితా | తస్మాద్భక్త్యుపపన్నస్య రజసా తమసా చ కిమ్‌ || 62

అంత్యజో వాధమో వాపి మూర్ఖో వా పతితో%పి వా | శివాం ప్రపన్నశ్చేత్కృష్ణ పూజ్యస్సర్వసురాసురైః || 63

తస్మాత్సర్వప్రయత్నేన భ##క్త్యైవ శివమర్చయేత్‌ | అభక్తానాం క్వచిదపి ఫలం నాస్తి యతస్తతః || 64

వక్ష్యామ్యతిరహస్యం తే శృణు కృష్ణ వచో మమ | వేదైశ్శాసై#్త్రర్వేదవిద్భిర్విచార్య సువినిశ్చితమ్‌ || 65

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివభక్తిమహిమవర్ణనం నామ పంచవింశో %ధ్యాయః (25).

తామసము గాని, రాజసము గాని, సాత్త్వికము గాని అగు మనోభావమునాశ్రయించి పూజ మొదలగు వాటిని భక్తితో చేయు మానవుడు మంగళమును పొందును (61). పాపము అనే సముద్రమును దాటుటకు భక్తి నౌకవలె నిర్మించబడినది. కావున, భక్తి గలవానికి రజస్త మోగుణములతో పని యేమి? (62) ఓ కృష్ణా! అంత్యజుడు గాని, అధముడు గాని, మూర్ఖుడు గాని, పతితుడే అయినా గాని, శివుని శరణు పొందినచో, అట్టివాడు సర్వదేవతలకు మరియు రాక్షసులకు పూజ్యుడు అగును (63). కావున, సకలప్రయత్నమును చేసి భక్తితో శివుని పూజించవలెను. ఏలయనగా, భక్తి లేనివారికి ఏ కాలమునందైననూ ఫలము లభించదు (64). ఓ శ్రీకృష్ణా! నీకు మిక్కిలి రహస్యము, వేదవేత్తలు వేదశాస్త్రములను నిష్కర్ష చేసి చెప్పినది అగు వచనమును చెప్పెదను. వినుము (65).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివభక్తిమహిమను వర్ణించే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).

Siva Maha Puranam-4    Chapters