Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

నిత్య నైమిత్తిక కర్మలు

శ్రీ కృష్ణ ఉవాచ |

భగవన్‌ శ్రోతుమిచ్ఛామి శివశ్రమనిషేవిణామ్‌ | శివశాస్త్రోదితం కర్మ నిత్యం నైమిత్తికం తథా || 1

శ్రీ కృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! శివభక్తిపూర్ణమైన జీవితమును గడిపే వారిని ఉద్దేశించి శివశాస్త్రములో చెప్పబడిన నిత్యనైమిత్తికకర్మలను గురించి వినగోరుచున్నాను (1).

ఉపమన్యురువాచ |

ప్రాతరుత్థాయ శయనాద్ధ్యాత్వా దేవం సహాంబయా | విచార్య కార్యం నిర్గచ్ఛేద్గృహాదభ్యుదితే%రుణ || 2

అబాధే విజనే దేశే కుర్యాదావశ్యకం తతః | కృత్వా శౌచం విధానేన దంతధావనమాచరేత్‌ || 3

అలాభే దంతకాష్ఠానామష్టమ్యాదిదినేషు చ | అపాం ద్వాదశగండూషైః కుర్యాదాస్యవిశోధనమ్‌ || 4

ఆచమ్య విధివత్పశ్చాద్వారుణం స్నానమాచరేత్‌ | నద్యాం వా దేవఖాతే వా హ్రదే వాథ గృహే%పి వా || 5

స్నానద్రవ్యాణి తత్తీరే స్థాపయిత్వా బహిర్మలమ్‌ | వ్యాపోహ్య మృదమాలిప్య స్నాత్వా గోమయమాలిపేత్‌ || 6

స్నాత్వాపునః పునర్వస్త్రం త్యక్త్వా వాథ విశోధ్య చ | సుస్నాతో నృపవద్భూయశ్శుధ్ధం వాసో వసీత చ || 7

మలస్నానం సుగంధాద్యైస్స్నానం దంతవిశోధనమ్‌ | న కుర్యాద్ర్బహ్మచారీ చ తపస్వీ విధవా తథా || 8

సోపవీతశ్శిఖాం బద్ధ్వా ప్రవిశ్య చలాంతరమ్‌ | అవగాహ్య సమాచాంతో జలే న్యస్యేత్త్రిమండలమ్‌ || 9

సౌమ్యే మగ్నఃపునర్మంత్రం జపేచ్ఛక్త్యా శివం స్మరేత్‌ | ఉత్థాయాచమ్య తేనైవ స్వాత్మానమభిషేచయేత్‌ || 10

గోశృంగేణ సదర్భేణ పాలాశేన దలేన వా | పాద్మేన వాథ పాణిభ్యాం పంచకృత్వస్త్రి రేవ వా || 11

ఉపమన్యువు ఇట్లు పలికెను -

ఉదయమే శయనమునుండి లేచి జగన్మాతతో గూడియున్న దేవునకు నమస్కరించి, చేయదగిన పనిని గురించి ఆలోచించుకొని, అరుణోదయకాలము (తెలతెలవారే సమయము) లో ఇంటి నుండి బయటకు రావలెను (2). జనుల రద్దీ లేని స్థానమునందు ఆవశ్యకమగు శౌచకార్యమును పూర్తి చేసుకొని, తరువాత యథావిధిగా పళ్లను తోముకొన వలెను (3). పళ్లను తోమే పుల్ల దొరకని సందర్భములలో మరియు అష్టమి మొదలగు తిథులయందు నీళ్లను పన్నెండు సార్లు పుక్కిలించి నోటిని శుద్ధి చేసుకొనవలెను (4). యథావిధిగా ఆచమనమును చేసి, తరువాత వారుణస్నానము (నీటితో చేసే స్నానము) ను నదిలో, కొండల మధ్యలో సహజముగా ఏర్పడిన సరస్సులో, చెరువులో లేదా ఇంటిలో చేయవలెను (5). స్నానమునకు ఉపయోగించే పదార్థములను నదీతీరమునందు పెట్టుకొని, మాలిన్యమును ఒడ్డు మీదనే పోగొట్టుకొని మట్టిని రాసుకొని స్నానమును చేసి గోమయమును రాసుకొనవలెను (6). మరల మరల స్నానమును చేసి వస్త్రమును విడిచి, లేదా ఉతుకుకొని, రాజువలె చక్కగా స్నానమును చేసినవాడై శుద్ధమగు వస్త్రమును ధరించవలెను (7). బ్రహ్మచారి, తపశ్శాలి మరియు భర్తృహీన మాలిన్యమును పోగొట్టే స్నానమును సుగంధ ద్రవ్యములతో చేయరాదు, పళ్లను తోముకొనుటకు పుల్లను వాడరాదు (8). యజ్ఞోపవీతమును కలిగి యున్న ఆ సాధకుడు శిఖను ముడి వేసుకొని నీటి లోపలకు ప్రవేశించి మునిగి ఆచమనము చేసి నీటిలో మూడు మండలములను చేయవలెను (9). కల్లోలితము కాని ఆ నీటిలో మునిగి మరల యథాశక్తిగా మంత్రమును జపించి శివుని స్మరించి నీటి పైకి లేచి ఆచమనమును చేసి ఆ నీటితోనే దర్భను కట్టిన ఆవు కొమ్ముతో, పలాశవృక్షముయొక్క ఆకుతో, తామరాకుతో లేదా రెండు చేతులతో అయిదు సార్లు గాని, మూడు సార్లు గాని తనను అభిషేకించు కొనవలెను (10. 11).

ఉద్యానాదౌ గృహే చైవ వర్ధన్యా కలశేన వా | అవగాహనకాలే %ద్భిర్మంత్రితైరభిషేచయత్‌ || 12

అథ చేద్వారుణం కర్తుమశక్తశ్శుద్ధ వాససా | ఆర్ద్రేణ శోధయేద్దేహమాపాదతలమస్తకమ్‌ || 13

ఆగ్నేయం వాథ వా మాంత్రం కుర్యాత్స్నానం శివేన వా | శివచింతాపరం స్నానం యుక్తస్యాత్మీయముచ్యతే || 14

స్వసూత్రోక్తవిధానేన మంత్రాచమనపూర్వకమ్‌ | ఆచరేద్ర్బహ్మయజ్ఞాంతం కృత్వా దేవాదితర్పణమ్‌ || 15

మండలస్థం మహాదేవం ధ్యాత్వాభ్యర్చ్య యథావిది | దద్యాదర్ఘ్యం తతస్తసై#్మ

శివాయాదిత్యరూపిణ || 16

ఆథ వై తత్స్వ సూత్రోక్తం కృత్వా హస్తౌ విశోధయేత్‌ | కరన్యాసం తతః కృత్వా సకలీ కృత విగ్రహః || 17

వామహస్తగతాంభోభిర్గంధసిద్ధార్థకాన్వితైః | కుశపుంజేన వాభ్యుక్ష్య మూలమంత్రసమన్వితైః || 18

ఆపోహిష్ఠాదాభిర్మం త్రైశ్శేషమాఘ్రాయ వై జలమ్‌ | వామనాసాపుటేనైవ దేవం సంభావయేత్సితమ్‌ || 19

అర్ఘమాదాయ దేహస్థం సవ్యనాసాపుటేన చ | కృష్ణవర్ణేన బాహ్యస్థం భావయేచ్చ శిలాగతమ్‌ || 20

తర్పయేదథ దేవేభ్య ఋషిభ్యశ్చ విశేషతః | భూతేభ్యశ్చ పితృభ్యశ్చ దద్యాదర్ఘ్యం యథావిధి || 21

ఉద్యానవనము మొదలగు స్థలములలో గాని, ఇంటిలో గాని స్నానమును చేసే సమయములో మంత్రమును ఉచ్చరిస్తూ వర్ధనీ అనే పాత్రతో గాని, కలశముతో గాని నీటిని పోసుకొన వలెను (12). వారుణస్నానమును చేయుటకు శక్తి లేనివాడైనచో, స్వచ్ఛమగు వస్త్రమును తడిపి దానితో దేహమును కాలినుండి తల వరకు శుద్ధి చేసుకొన వలెను (13). ఆగ్నేయస్నానమును గాని , మంత్రస్నానమును గాని, లేక శివనామస్మరణరూపమగు స్నానమును గాని చేయవచ్చును. శివునిధ్యానము చేయుట అనే స్నానము యోగికి ఆత్మీయమగు స్నానమగునని చెప్పబడినది (14). స్వీయ గృహ్యసూత్రములో చెప్పిన విధముగా మంత్రములనుచ్చరిస్తూ ఆచమనమును చేసి దేవతర్పణము మొదలగు తర్పణములను చేసిబ్రహ్మయజ్ఞపర్యంతము చేయవలెను (15). మండలమునందున్న మహాదేవుని ధ్యానించి యథావిధిగా పూజించి, తరువాత ఆదిత్యరూపములోనున్న ఆ శివునకు అర్ఘ్యము నీయవలెను (16). లేదా, స్వీయగృహ్యసూత్రములో విధింపబడిన కర్మను చేసి, చేతులను కడుగుకొనవలెను. తరువాత కరన్యాసమును చేసి సకలీకరణ సంస్కారము చేయబడిన దేహము గలవాడై (17), మూలమంత్రమును మరియు ఆపో హిష్ఠా మయోభువః (ఓ జలములారా! మీరు సుఖమును కలిగించుడు) అను మంత్రములను ఉచ్చిరిస్తూ గంధమును మరియు తెల్ల ఆవాలను కలిగియున్న ఎడమ చేతియందలి నీటిని దర్భకట్టతో పైన చల్లుకొని,మిగిలిన నీటిని ఎడమ ముక్కుతో మాత్రమే ఆఘ్రాణించి, దేవుని ధ్యానించవలెను. ఆ జలములలోని పవిత్రతను తెల్లని వర్ణము గలదిగా భావన చేసి లోపలకు గ్రహించి, దేహమునందలి దోషమును నల్లరంగు గలదిగా భావన చేస్తూ ఆ దోషము కుడి ముక్కు గుండా బయటనున్న రాయిని చేరినట్లు గా తలచవలెను (18-20). తరువాత దేవతలకు, విశేషించి ఋషులకు, ప్రాణులకు పితృదేవతలకు యథావిధిగా తర్పణములను మరియు అర్ఘ్యమును ఈయవలెను (21).

రక్తచందనతోయేన హస్తమాత్రేణ మండలమ్‌ | సువృత్తం కల్పయేద్భూమౌ రక్తచూర్ణాద్యలంకృతమ్‌ || 22

తత్ర సంపూజయేద్భానుం స్వకీయావరణౖస్సహ | స్వఖోల్కాయేతి మంత్రేణ సాంగతస్సుఖసిద్ధయే || 23

పునశ్చ మండలం కృత్వా తదంగాః పరిపూజ్యచ | తత్ర స్థాప్య హేమపా6ం మాఘధప్రస్థసంమితమ్‌ || 24

పూరయేద్గంధతోయేన రక్తచందన యోగినా | రక్తపుషై#్పస్తిలైశ్చైవ కుశాక్షతసమన్వితైః || 25

దూర్వాపామార్గగవ్యైశ్చ కేవలేన జలేన వా | జానుభ్యాం ధరణీం గత్వా నత్వా దేవం చ మండలే || 26

కృత్వా శిరసి తత్పాత్రం దద్యాదర్ఘ్యం శివాయ తత్‌ | అథవాంజలినా తోయం సదర్భం మూలవిద్యయా || 27

ఉత్‌ క్షి పేదంబరస్థాయ శివాయాదిత్య మూర్తయే | కృత్వా పునః కరన్యాసం కరశోధన పూర్వకమ్‌ || 28

బుద్ధ్వే శానాది సద్యాంతం పంచ బ్రహ్మమయం శివమ్‌ | గృహీత్వా భసితం మంత్రైర్విమృజ్యాంగాని సంస్పృశేత్‌ || 29

యాదినాంతైశ్శిరోవక్త్రహృద్గుహ్యచరణాన్‌ క్రమాత్‌ | తతో మూలేన సర్వాంగమాలభ్య వసనాంతరమ్‌ || 30

పరిధాయ ద్విరాచమ్య ప్రోక్ష్యైకాదశమంత్రితైః | జలైరాచ్ఛాద్య వాసో%న్యద్ద్విరాచమ్య శివం స్మరేత్‌ || 31

నేలపై రక్తచందనమును కలిపిన నీటితో చేయి పరిమాణము గల చక్కని గుండ్రని మండలమును చేసి ఎర్రని చూర్ణము మొదలగు వాటితో అలంకరించ వలెను (22). సాధకుడు సుఖమును పొందుట కొరకై దానియందు తనవైన ఆవరణములతో కూడియున్న సూర్యుని అంగములతోసహా, కషోత్కాయ స్వాహా (పరమేశ్వరుని కొరకు సమర్పించు చున్నాను) అను మంత్రముతో ఆరాధించవలెను (23). మరల మండలమును చేసి, దానిని చుట్టూ అంగములతో సహా పూజించి, మగధదేశములో ప్రసిద్ధి చెందిన ప్రస్థ అనే పరిమాణము గల బంగరు కలశమును దానియందు స్థాపించి (24), రక్తచందనము, గంధము, ఎర్రని పుష్పములు, నువ్వులు , దర్భలు, అక్షతలు, గడ్డిపరకలు, ఉత్తరేణి , పుష్పములు, మరియు ఆవు పాలు మొదలగు గోద్రవ్యములు అను వాటిని కలిపి న నీటితో గాని, లేదా సామాన్యమగు నీటితో గాని దానిని నింపవలెను. నేలమీద మోకాళ్లపై నిలబడి మండలమునందలి దేవునకు నమస్కరించి (25, 26), ఆ కలశమును నెత్తిపై పెట్టుకొని మూలమంత్రమును ఉచ్చరిస్తూ ఆ నీటితో శివునకు అర్ఘ్యమును ఈయవలెను. లేదా, దర్భలతో గూడిన నీటిని దోసిలితో ఈయవచ్చును (27).నీటిని ఆకాశమునందు సూర్యరూపములో నున్న శివుని ఉద్దేశించి పైకి చిమ్మవలెను. మరల చేతులను కడుగుకొని కరన్యాసమును చేసి (28), ఈశానునితో మొదలిడి సద్యోజాతునితో అంతమయ్యే అయిదుగురు బ్రహ్మల రూపములతో నున్న శివుని ధ్యానించి, భస్మను, తీసుకొని, దానిని నీటితో తడిపి య, వ, శి, మ, న అనే బీజాక్షరములతో క్రమముగా శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అనే అవయవములకు పెట్టుకొనవలెను. తరువాత మూలమంత్రమును ఉచ్చరిస్తూ శరీరావయవములను అన్నింటినీ స్పృశించి, మరియొక వస్త్రమును ధరించి, రెండు సార్లు ఆచమనమును చేసి, పదకొండు సార్లు మంత్రించిన నీటిని తనపై చల్లుకొని , మరియొక వస్త్రమును పైన కప్పుకొని, రెండు సార్లు ఆచమనమును చేసి, శివుని స్మరించవలెను (29-31).

పునర్న్యస్తకరో మంత్రీ త్రిపుండ్రం భస్మనా లిఖేత్‌ | అవక్రమాయతం వ్యక్తం లలాటే గంధవారిణా || 32

వృత్తం వా చతురస్రం వా బిందుమర్ధేందుమేవ వా | లలాటే యాదృశం పుండ్రం లిఖితం భస్మనా పునః || 33

తాదృశం భుజయోర్మూర్ధ్ని స్తనయోరంతరే లిఖేత్‌ | సర్వాంగోద్ధూలనం చైవ న సమానం త్రిపుండ్రకైః || 34

తస్మాత్త్రిపుండ్రమేవైకం లిఖేదుద్ధూలనం వినా | రుద్రాక్షాన్‌ ధారయేన్మూర్ధ్ని కంఠే శ్రోత్రే కరే తథా || 35

సువర్ణవర్ణమచ్ఛిన్నం శుభం నాన్యైర్ధృతం శుభమ్‌ | విప్రాదీనాం క్రమాచ్ఛ్రేష్ఠం పీతం రక్త మథాసితమ్‌ || 36

తదలాభే యథాలాభం ధారణీయమదూషితమ్‌ | తత్రాపి నోత్తరం నీచైర్ధార్యం నీచమథోత్తరైః || 37

నాశుచిర్ధారయేదక్షం సదా కాలేషు ధారయేత్‌ | ఇత్థం త్రిసంధ్యమథవా ద్విసంధ్యం సకృదేవ వా || 38

కృత్వా స్ననాదికం శక్త్యా పూజయేత్పరమేశ్వరమ్‌ | పూజాస్థానం సమాసాద్య బద్ధ్వా రుచిరమాసనమ్‌ || 39

ధ్యాయేద్దేవం చ దేవీంచ ప్రాఙ్ముఖో వాప్యుదఙ్ముఖః | శ్వేతాదీన్నకులీశాంతాంస్తచ్ఛిష్యాన్‌ ప్రణమేద్గురుమ్‌ || 40

పునర్దేవం శివం నత్వా తతో నామాష్టకం జపేత్‌ | శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణుః పితామహః || 41

సంసారవైద్యస్సర్వజ్ఞః పరమాత్మేతి చాష్టకమ్‌ | అథవా శివమేవైకం జపిత్వైకాదశాధికమ్‌ || 42

జిహ్వాగ్రే తేజసో రాశిం ధ్యాత్వా వ్యాధ్యాదిశాంతయే | ప్రక్షాల్య చరణౌ కృత్వా కరౌ చందన చర్చితౌ |

ప్రకుర్వీత కరన్యాసం కరశోధన పూర్వకమ్‌ || 43

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయం ఉత్తరఖండే నిత్యనైమిత్తికకర్మ వర్ణనం నామ ఏకవింశో%ధ్యాయః (21).

అతడు మంత్రమునుచ్చరిస్తూ మరల కరన్యాసమును చేసి, భస్మను గంధపు నీటితో కలిపి లలాటమునందు వంకర లేని, పొడవైన, స్పష్టముగా కానవచ్చే త్రిపుండ్రమును పెట్టవలెను (32). లేదా, భస్మను వృత్తాకారముగా గాని, చతురస్రాకారముగా గాని, బిందురూపముగా గాని, చంద్రవంకను పోలియుండునట్లు గాని ధరించవచ్చును. భస్మ లలాటమునందు ఏ విధముగా ధరించబడినదో (33), అదే విధముగా రెండు భుజములయందు తలపై మరియు వక్షఃస్థలము నందు పెట్టు కొనవలెను. శరీరమంతటా భస్మను చల్లుకున్నా అది త్రిపుండ్రముల ధారణమునకు సాటి రాదు (34). కావున, భస్మను చల్లుకొనుటను మాని, త్రిపుండ్రము (మూడు రేఖలు) ను మాత్రమే పెట్టుకొనవలెను. అంతే గాక, శిర్ససు, కంఠము, చెవులుమరియు చేతులు అను స్థానములయందు రుద్రాక్షలను ధరించవలెను (35). బంగరు రంగు గలది, ముక్కలు ఊడిపోనిది, శుభకరమైనది, ఇతరులు ధరించనిది అగు రుద్రాక్షను ధరించవలెను. బ్రాహ్మణులకు పసుపుపచ్చ , క్షత్రియులకు ఎరుపు, వైశ్యులకు నలుపు రంగు గల రుద్రాక్షలు శ్రేష్ఠము (36). ఆ రంగులలో లభించనిచో, ఏవి లభిస్తే వాటినే ధరించవలెను. కాని, అవి దోషములు లేకుండగా నుండవలెను. పైవర్ణములు క్రింది వర్ణములకు చెప్పిన రంగులను ధరించరాదు (37). అశుచిగానున్నవాడు రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలను సర్వకాలములలో ధరించవలెను. పైన చెప్పిన విధముగా మూడు సంధ్యలలో చేయవలెను. లేదా, రెండు సంధ్యలలో, లేదా, ఒక సారియైననూ చేయవలెను (38). స్నానము మొదలగు వాటిని యథాశక్తిగా చేసి, పూజాస్థానములో సుందరమగు ఆసనమును వేసి పరమేశ్వరుని పూజించవలెను (39). తూర్పు ముఖముగా గాని, ఉత్తరముఖముగా గాని, కూర్చుండి పార్వతీపరమేశ్వరులను ధ్యానించవలెను. శ్వేతునితో మొదలిడి నకులీశుని వరకు గల శివుని శిష్యులకు మరియు తన గురువునకు ప్రణమిల్లవలెను (40). మరల శివదేవునకు నమస్కరించి, తరువాత ఎనిమిది నామములను జపించవలెను. శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, పితామహుడు (41), సంసారవైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ అనునవి ఎనిమిది నామములు. లేదా, పదకొండు సార్లుగాని, లేక అధికముగా గాని ఒక్క శివనామమును మాత్రమే జపించి (42), వ్యాధి మొదలగునవి తొలగి పోవుట కొరకై నాలుక కొనలో తేజస్సుయొక్క ముద్దను ధ్యానించి, పాదములను కడుగుకొని, చేతులకు గంధమును పూసుకొని, చేతులను కడుగుకొని, కరన్యాసమును చేయవలెను (43)

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో నిత్యనైమిత్తిక కర్మలను వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).

Siva Maha Puranam-4    Chapters