Siva Maha Puranam-4    Chapters   

శ్రీ గణశాయ నమః

శ్రీ శివమహాపురాణము

ఉమా సంహితా

అథ ఏకత్రింశో% ధ్యాయః

సృష్టి వర్ణనము

శౌనక ఉవాచ |

దేవానాం దానవానాం చ గంధర్వోరగరక్షసామ్‌ | సృష్టిం తు విస్తరేణమాం సూతపుత్ర వదాశు మే || 1

శౌనకుడు ఇట్లు పలికెను -

ఓ సూతపుత్రా! ఈ దేవ - దానవ - గంధర్వ-సర్ప-రాక్షసుల సృష్టిని గురించి నాకు వెంటనే వివరముగా చెప్పుము (1).

సూత ఉవాచ |

యదా న వవృధే సా తు వీరణస్య ప్రజాపతిః | సుతాం సుతపసా యుక్తామాహ్వయత్సర్గకారణాత్‌ || 2

స మైథునేన ధర్మేణ ససర్జ వివిధాః ప్రజాః | తాః శృణు త్వం మహాప్రాజ్ఞ కథయామి సమాసతః || 3

తస్యాం పుత్రసహస్రాణి వీరిణ్యాం పంచ వీర్యవాన్‌ | ఆశ్రిత్య జనయామాస దక్ష ఏవ ప్రజాపతిః || 4

ఏతాన్‌ సృష్టాంస్తు తాన్‌ దృష్ట్వా నారదః ప్రాహ వై మునిః | సర్వం స తు సముత్పన్నో నారదః పరమేష్ఠినః || 5

శ్రుతవాన్‌ వా కశ్యపాద్వై పుంసాం సృష్టిర్భవిష్యతి | దక్షస్యేవ దుహితృఘ తస్మాత్తానబ్రవీత్తు సః || 6

అజానంతః కథం సృష్టిం బాలిశా వై కరిష్యథ | దిశం కాంచిదజానంతస్తస్మాద్విజ్ఞాయ తాం భువమ్‌ || 7

ఇత్యుక్తాః ప్రయయుస్సర్వే ఆశాం విజ్ఞాతుమోజసా | తదంతం న హి సంప్రాప్య న నివృత్తాః పితుర్గృహమ్‌ || 8

తద్‌ జ్ఞాత్వా జనయామాస పునః పంచశతాన్‌ సుతాన్‌ | తానువాచ పునస్సో%పి నారదస్సర్వదర్శనః || 9

సూతుడు ఇట్లు పలికెను -

సృష్టి వర్ధిల్లకపోవుటను గాంచి దక్షప్రజాపతి గొప్ప తపస్సును చేయుచున్న వీరణుని కుమార్తెను సృష్టి కొరకై ఆహ్వానించెను (2). ఆయన మైథునధర్మముచే అనేక సంతానమును గనెను. ఓ మహాబుద్ధిశాలీ ! ఆ వివరములను సంగ్రహముగా చెప్పుచున్నాను. వినుము (3). శక్తిమంతుడగు దక్షప్రజాపతి ఆమెను ఆశ్రయించి ఆమెయందు అయిదు వేల మంది పుత్రులను గనెను (4). పురుషుల సృష్టి అంతయు దక్షుని కుమార్తెల ద్వారా మాత్రమే జరుగగలదని బ్రహ్మపుత్రుడగు నారదుడు కశ్యపునినుండి వినియుండెను. కావుననే, ఆ నారదముని ఈ విధముగా సృష్టించబడిన దక్షపుత్రులను గాంచి వారితో నిట్లనెను (5,6). మీరు బాలకులు. మీకు దిక్కు ఒక్కటియైననూ తెలియదు. సృష్టిని ఎట్లు చేయగల్గుదురు ? కావున, భూమిని గురించి తెలుసుకొని తరువాత ముందుకు సాగుడు (7). ఆయన ఇట్లు పలుకగా, వారు అందరు దిక్కును తెలియుటకై వేగముగా బయలుదేరిరి. కాని వారు దాని అంతమును చేరలేకపోయిరి. అయిననూ, వారు తండ్రి గృహమునకు తిరిగి రాలేదు (8). ఈ విషయము తెలిసి దక్షుడు మరల అయిదు వందల మంది పుత్రులను గనెను. సర్వమును తెలుసుకొనే నారదుడు మరల వారితోనిట్లనెను (9).

నారద ఉవాచ |

భువో మానమజానంతః కథం సృష్టిం కరిష్యథ | సర్వే హి బాలిశాః కిం హి సృష్టిం కర్తుం సముద్యతాః || 10

నారదుడు ఇట్లు పలికెను -

మీరందరు చిన్న పిల్లలు. భూమియొక్క పరిమాణమును తెలియకుండగా సృష్టిని ఎట్లు చేయగల్గుదురు ? సృష్టిని చేయుటకు ఉద్యుక్తులగుచున్నారా యేమి? (10)

సూత ఉవాచ |

తే%పి తద్వచనం శ్రుత్వా నిర్యాతాస్సర్వతోదిశమ్‌ | సుబలాశ్వా దక్షసుతా హర్యశ్వా ఇవ తే పురా || 11

అనంతం పుష్కరం ప్రాప్య గతాస్తే%పి పరాభవమ్‌ | అద్యాపి న నివర్తంతే సముద్రేభ్య ఇవాపగాః || 12

తదాప్రభృతి వై భ్రాతా భ్రాతురన్వేషణ రతః | ప్రయాతో నశ్యతి మునే తన్న కార్యం విపశ్చితా || 13

తాంశ్చాపి నష్టాన్‌ విజ్ఞాయ పుత్రాన్‌ దక్షః ప్రజాపతిః | స చ క్రోధాద్దదౌ శాపం నారదాయ మహాత్మనే || 14

కుత్రచిన్న లభ##స్వేతి సంస్థితిం కలహప్రియ | తవ సాన్నిధ్యతో లోకే భ##వేచ్చ కలహస్సదా || 15

సాంత్వితో%థ విధాత్రా హి స దక్షస్తు ప్రజాపతిః | కన్యాఃషష్ట్యసృజత్పశ్చాద్వీరిణ్యామితి నః శ్రుతమ్‌ | 16

దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ | సప్తవింశతి సోమాయ చతస్రో%రిష్టనేమినే || 17

ద్వేచైవ బ్రహ్మపుత్రాయ ద్వేచైవాంగిరసే తదా | ద్వే కృశశ్వాయ విదుషే తాసాం నామాని మే శృణు || 18

అరుంధతీ వసుర్యామిర్లంబా భానుర్మరుత్వతీ | సంకల్పా చ ముహూర్తా చ సంధ్యా విశ్వా చ వై మునే || 19

ధర్మపత్న్యో మునే త్వేతాస్తాస్వపత్యాని మే శృణు | విశ్వేదేవాస్తు విశ్వాయాస్సాధ్యాన్‌ సాధ్యా వ్యజాయత || 20

మరుత్వత్యాం మరుత్వంతో వసోస్తు వసవస్తథా | భానోస్తు భానవస్సర్వే ముహూర్తాయాం ముహూర్తజాః || 21

లంబాయాశ్చైవ ఘోషో%థ నాగవీథీ చ యామిజా | పృథివీ విషమస్తస్యామ రుంధత్యామజాయత || 22

సంకల్పాయాస్తు సత్యాత్మా జజ్ఞే సంకల్ప ఏవ హి | అయాదయో వసోః పుత్రా అష్టా తాన్‌ శృణు శౌనక || 23

అయో ధ్రువశ్చ సోమశ్చ ధరశ్చైవానిలో%నలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో%ష్టౌ చ నామతః || 24

అయస్య పుత్రో వైతండః శ్రమశ్శాంతో మునిస్తథా | ధ్రువస్య పుత్రో భగవాన్‌ కాలో లోకప్రభావనః || 25

సూతుడు ఇట్లు పలికెను -

సుబలాశ్వులనబడే ఆ దక్షపుత్రులు కూడ పూర్వమునందు హర్యశ్వుల వలెనే ఆయన మాటలను విని అన్ని దిక్కుల వైపునకు నిష్క్రమించిరి (11). వారు అనంతమహిమ గల పుష్కరక్షేత్రమును చేరి సంసారమునుండి విముఖులై సముద్రమును చేరిన నదుల వలె అచటినుండి ఈ నాటికి కూడ మరలి రాకుండిరి (12). ఓ మునీ! అప్పటినుండియు సోదరుని అన్వేషిస్తూ వెళ్లిన సోదరుడు నశించుచున్నాడు. కావున, వివేకవంతుడగు మానవుడు ఆ విధముగా చేయరాదు (13). ఆ పుత్రులు కూడ తనకు కాకుండా పోయిరని తెలసుకొని దక్షప్రజాపతి కోపముతో మహాత్ముడగు నారదునకు శాపమునిచ్చెను (14). ఓ కలహప్రియుడా ! నీకుఎక్కడనైననూ స్థిరనివాసము ఏర్పడకుండుగాక! నీ సన్నిధిలో లోకములో సర్వదా కలహములు పుట్టుచుండును (15). తరువాత బ్రహ్మచే ఓదార్చబడినవాడై ఆ దక్షప్రజాపతి వీరిణియందు అరవై కన్యలను కనినాడని మేము వినియుంటిమి (16). వారిలో పదిమందిని ధర్మునకు, పదముగ్గురిని కశ్యపునకు, ఇరవై ఏడు మందిని సోమునకు, నలుగురిని అరిష్టనేమికి (17), ఇద్దరిని బ్రహ్మపుత్రునకు, ఇద్దరిని అంగిరసునకు, ఇద్దరిని విద్వాంసుడగు కృశాశ్వునకు ఇచ్చి వివాహమును చేసెను. వారి పేర్లను చెప్పెదను. వినుము (18). ఓ మునీ ! అరుంధతి, వసువు, యామి, లంబ, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సంధ్య, విశ్వ అనునవి ధర్ముని భార్యల పేర్లు. ఓ మునీ! వారి సంతానమును గురించి నేను చెప్పెదను. వినుము. విశ్వకు విశ్వేదేవతలు, సంధ్యకు సాధ్యులు జన్మించిరి (19,20). మరుత్వతికి మరుత్వంతులు, వసువునకు అష్టవసువులు, భానునకు ద్వాదశాదిత్యులు, ముహూర్తకు ముహూర్తజలు (21), లంబకు ఘోషుడు, యామికి నాగవీథి, అరుంధతికి పృథివీవిషముడు జన్మించిరి (22). సంకల్పకు సత్యస్వరూపుడగు సంకల్పుడు జన్మించెను. ఓ శౌనకా ! వసువునకు అయుడు మొదలగు ఎనమండుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లను వినుము (23). అయుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనునవి ఎనిమిది వసువుల పేర్లు (24). అయునకు వైతండుడు, శ్రముడు, శాంతుడు మరియు ముని అనే పేర్లు గల పుత్రులు కలిగిరి. పూజ్యుడు, లోకములను ప్రభావితము చేయువాడు అగు కాలుడు ధ్రువుని పుత్రుడు (25).

సోమస్య భగవాన్వర్చా వర్చస్వీ యేన జాయతే | ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహస్తథా || 26

మనోహరాయాశ్శిశిరః ప్రాణో%థ రమణస్తథా | అనిలస్య శివా భార్యా యస్యాః పుత్రాః పురోజవః || 27

అవిజ్ఞాతగతిశ్చైవ ద్వౌ పుత్రావనిలస్య తు | అగ్నిపుత్రః కుమారస్తు శరస్తంబే శ్రియావృతే || 28

తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠతః | అపత్యం కృత్తికానాం తు కార్తికేయ ఇతి స్మృతః || 29

ప్రత్యూషస్య త్వభూత్పత్ర ఋషిర్నామ్నాతు దేవలః | ద్వౌపుత్రౌ దేవలస్యాపి ప్రజావంతౌ మనీషిణౌ || 30

బృహస్పతేస్తు భగినీ వరస్త్రీ బ్రహ్మచారిణీ | యోగసిద్ధా జగత్కృత్స్నం సమంతాద్వ్యచరత్తదా || 31

ప్రభాసస్య తు సా భార్యా వసూనామష్టమస్య చ | విశ్వకర్మా మహాభాగ తస్య జజ్ఞే ప్రజాపతిః || 32

కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వార్ధకిః | భూషణానాం చ సర్వేషాం కర్తా శిల్పవతాం వరః || 33

యస్సర్వాసాం విమానాని దేవతానాం చకార హ | మనుష్యాశ్చోపజీవంతి యస్య శిల్పం మహాత్మనః || 34

పూజ్యుడగు వర్చస్సు సోముని పుత్రుడు. ఆయన వలననే మానవుడు కాంతిని పొందుచున్నాడు. ద్రవిణుడు మరియు హుతహవ్యవహుడు అను వారలు ధరుని పుత్రులు (26). శిశిరుడు, ప్రాణుడు మరియు రమణుడు అను వారలు మనోహరయొక్క కుమారులు. అనిలుని భార్య శివ. ఆమెయందు అనిలునకు పురోజవుడు మరియు అవిజ్ఞాతగతి అనే ఇద్దరు పుత్రులు కలిగిరి (27). శోభాయుతమగు రెల్లు గడ్డియందు జన్మించిన కుమారుడు అగ్నియొక్క పుత్రుడు (28). శాఖుడు, విశాఖుడు మరియు నైగమేయుడు అను వారలు కుమారుని సోదరులు. కుమారుడు కృత్తికలచే పుత్ర రూపములో పాలింపబడుటచే ఆయన కార్తికేయుడు అయినాడు (29). దేవలమహర్షి ప్రత్యూషుని పుత్రుడు. దేవలునకు విద్వాంసులగు ఇద్దరు పుత్రులు గలరు. వారికి కూడ సంతానము గలదు (30). బృహస్పతి సోదరి బ్రహ్మచారిణి మరియు గొప్ప యోగ్యురాలు. ఆమెకు యోగసిద్ధులు గలవు. ఆమె జగత్తునంతనూ విస్తారముగా సంచరించెను (31). ఓ మహాత్మా ! వసువులలో ఎనిమిదవ వాడగు ప్రభాసునకు ఆమె భార్య ఆయెను. ఆతనికి విశ్వకర్మ ప్రజాపతి పుత్రుడై జన్మించెను (32). శిల్పులలో శ్రేష్ఠుడగు ఆ విశ్వకర్మ దేవతలకు శిల్పి ఆయెను. ఆయన వేలాది శిల్పములను, అనేకములగు భూషణములను నిర్మించెను (33). దేవతల విమానములను అన్నింటినీ ఆయనయే నిర్మించెను. ఆ మహాత్ముని శిల్పమునే మానవులు అనుకరించి గృహాదులను నిర్మించుకొనుచున్నారు (34).

మతాంతరమాహ |

రైవతో%జో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః | అజైకపాదహిర్బుధ్న్యో బహురూపో మహానితి || 35

సరూపాయాం ప్రసూతస్య స్త్రియాం రుద్రాశ్చ కోటిశః | తత్రైకాదశముఖ్యాస్తు తన్నామాని మునే శృణు || 36

అజైకపాదహిర్బుధ్న్యస్త్వష్టా రుద్రశ్చ వీర్యవాన్‌ | హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చాపరాజితః || 37

వృషాకపిశ్చ శంభుశ్చ కపర్దీ రైవతస్త థా | ఏకాదశైతే కథితా రుద్రాస్త్రి భువనేశ్వరాః || 38

శతం త్వేవం సమాఖ్యాతం రుద్రాణామమితౌజసామ్‌ | శృణు కశ్యపపత్నీనాం నామాని మునిసత్తమ || 39

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం సృష్టివర్ణనం నామ ఏకత్రింశో%ధ్యాయః (31).

మహర్షి మరియొక పక్షమును చెప్పుచున్నాడు -

రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాత్‌, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాన్‌ మొదలైన అసంఖ్యాకులగు రుద్రులు ప్రసూతుని భార్యయగు సరూపయందు జన్మించిరి. వారిలో పదకొండు మంది ముఖ్యులు. ఓ మునీ ! వారి పేర్లను వినుము (35, 36). అజైకపాత్‌, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రులలో పరాక్రమశాలియగు హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు (37), వృషాకపి, శంభుడు, కపర్ది, రైవతుడు అనే ఈ పదకొండుగురు రుద్రులు ముల్లోకములకు ప్రభువులని చెప్పబడినారు (38). ఈ విధముగా నేను సాటిలేని తేజస్సు గల వంద మంది రుద్రులను గురించి చెప్పితిని. ఓ మహర్షీ! కశ్యపుని భార్యలయొక్క పేర్లను వినుము (39).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు సృష్టివర్ణనము అనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).

Siva Maha Puranam-4    Chapters