Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏవింశో%ధ్యాయః

అథ కాలే తు సంప్రాప్తే దేవకీ దేవరూపిణీ | గర్భం దధార విధివ ధ్వసుదేవేన సంగతా. 1

పూర్ణే%థ దశ##మే మాసే సుషువే సుతముత్తమం | రూపావయవసంపన్నం దేవకీ ప్రథమం యదా. 2

తదా%సౌ వసుదేవ స్తాం సత్యవాక్యానుమోదితః | భావిత్వా చ్చ మహాభాగో దేవకీం దేవమాతరమ్‌. 3

వరోరు ! సమయం మే త్వం జానాసి స్వమతార్పణ | మోచితా త్వం మహాభాగే ! శపథేన మయా తదా. 4

ఇమం పుత్త్రం సుకేశాంతే! దాస్యామి భ్రాతృసేనవే | ఖలే కంసే వినాశార్థం దైవే కిం వా కరిష్యసి. 5

విచిత్రః కర్మణాం పాకో దుర్ఞేయో హ్యకృతాత్మభిః.

సర్వేషాం కిల జీవానాం కాలపాశానువర్తినాం | భోక్తవ్యం స్వకృతం శుభం వా యదివా%శుభమ్‌. 6

ప్రారబ్ధం సర్వథై వా%త్ర జీవస్య విధినిర్మితం | దేవకీ: స్వామిన్పూర్వం కృతం కర్మ భోక్తవ్యం సర్వథానృభిః. 7

తీర్థై స్తపోభి ర్దానై ర్వా కిం న యాతి క్షయంహి తత్‌ | లిఃతో ధర్మశాస్త్రేషు ప్రాయశ్చిత్తవిధి ర్నృప! 8

పూర్వార్జితానాం పాపానాం వినాశాయ మహాత్మభిః | బ్రహ్మహా హేమహారి చ సురాపో గురుతల్పగః. 9

ద్వాదశాబ్దవ్రతే చీర్ణే శుద్ధిం యాతి యత స్తతః | మన్వాదిభి ర్యథోద్దిష్టం ప్రాయశ్చిత్తం విధానతః. 10

తథా కృత్వా నరః పాపా న్ముచ్యతే వా న వా%నఘ | విగీతవచనాస్తే కిం మునయ స్తత్త్వ దర్శినః. 11

యజ్ఞవల్క్యాదయః సర్వే ధర్మశాస్త్ర ప్రవర్తకాః | భవితవ్యం భవత్యేవ యద్యేవం నిశ్చయః ప్రభో! 12

ఆయుర్వేదః స మిథ్యైవ మంత్రవాదా స్తథా%ఃలాః | ఉద్యమస్తు వృథా సర్వ మేవం చే ద్దేవ నిర్మితమ్‌. 13

భవితవ్యం భవిత్యేవ ప్రవృత్తి స్తు నిరర్థికా | అగ్నిష్టోమాదికం వ్యర్థం నియతం స్వర్గసాధనమ్‌. 14

యదా తదా ప్రమాణం హి వృథైవ పరిభాషితమ్‌ | వితథే తత్ప్రమాణ తు ధర్మోచ్ఛేదః కుతో నహి. 15

ఉద్యమే చ కృతే సిద్ధిః ప్రత్యక్షేణౖవ సాధ్యతే | తస్మా దత్ర ప్రకర్తవ్యః ప్రపంచశ్చిత్త కల్పితః. 16

ఇరువది యొకటవ అధ్యాయము

అటుపిమ్మట దేవరూపిణియగు దేవకి ఋతుకాలమునందు నియమముతో వసుదేవునితోడ సంగమించి గర్భము దాల్చెను. ఆమెకు నిండుగ పదినెలలు నిండెను. అంత నామెకు రూపావయవ సంపన్నుడగు చక్కని కుమారుడు తొలిసారి యుదయించెను. మహానుభావుడైన వసుదేవుడు భవితవ్యమును - సత్యవాక్యమును జ్ఞప్తికి దెచ్చుకొని దేవమాతయగు దేవకితో నిట్లు పలికెను : ప్రియా! దేవకీ! ఆనాడు నేను చేసిన శపథమును బట్టి నీవు విముక్తి బొందితివి. ఇపుడు మన కుమారుని కంసున కప్పగించు సమయ మాసన్నమైనది. ఇది నీ వెఱుగుదవు. ఈ బాలుని నీ సోదరునక కర్పింతును. కంసుడు కడు దుష్టుడు. దైవము వినాశము గోరుచుండ నింక నీవేమి చేయగలవు? కర్మపరిపాక మతి విచిత్రమైనది. అది సామాన్యులకు తెలియరానిది. ఎల్ల ప్రాణులును కాలపాశవశులై తమ తమ శుభాశుభ కర్మము ననుభవించుదురు. ఎల్ల జీవుల కెల్ల విధముల తమ తమ ప్రారబ్ద మనుభవింపక తీరదు. అది విధికృతము అన దేవకి యిట్లనెను. స్వామీ! నరులు తప్పక తమ పురాకృత మనుభవింతురు. ఈ పురాకృత దోషము తీర్థ తపోదానముల వలన శమింపదు. ధర్మశాస్త్రములందు మహాత్ములు పూర్వార్జిత పాపనాశమునకు ప్రాయశ్చిత విధానమును వ్రాసిరి. బ్రహ్మహంత-సువర్ణచోరుడు-సురాపాయి-గురుతల్పగుడు- వీరు పండ్రెండేడులు నియమవ్రత మనుష్ఠించినచో శుద్ధి జెందుదురని మన్వాదులు వీరికి ప్రాయశ్చిత విధానము నుడివిరి. ధర్మశాస్త్ర ప్రవర్తకులు - తత్త్వ దర్శనులు నగు మునులు ప్రాయశ్చిత విధానము తెలిపిరి గదా? నరులావిధముగ నాచరించి పాపముక్తులగుదురా లేదా? కానిచో యాజ్ఞవల్కాది మునివరుల వాక్కులు మిథ్యలై నింద్యము లగును గదా! ప్రభూ! కానిచో మంత్రశాస్త్రము - ఆయుర్వేదము నన్నియు పనికిమాలినివే యగును. సర్వము దైవసంఘటితమే యైనచో నింక మానివ యత్నము వ్యర్థమే. జరుగనున్నది జరిగి తీరును. కానున్నది కాకమానదని యూరకున్న నిక ప్రవృత్తియే యుండదు. అపుడు స్వర్గ సాధనములైన వేదవాక్కులు ప్రమాణ రహితములు నిరర్థకములు నగును. అవి యబద్ధములైనచో ధర్మచ్యుతి గలుగును. అట్లుగాక ప్రయత్నముచేత ఫలసిద్ధి ప్రత్యక్షముగ గలిగినచో దానికి తగిన విధాన మాచరింపవలయును.

యథా%యం బాలకః క్షేమం ప్రాప్నోతి మమ పుత్త్రకః | మిథ్యా యది ప్రకర్తవ్యం వచనం శుభమిచ్చతా. 17

నత త్ర దూషణం కించి త్ప్రవదంతి మనీషిణః | వసుః నిశామయ మహాభాగేః సత్యమేత ద్బ్రవీమితే. 18

ఉద్యమః ఖలు కర్తవ్యః ఫలం దైవవశానుగం | త్రివిధా నీహ కర్మాణి సంసారే%త్ర పురావిదః. 19

ప్రవదంతీహ జీనానాం పురాణ ష్వాగ మేషు చ | సంచితాని చ జీర్ణాని ప్రారబ్ధాని సుమధ్యమేః. 20

వర్తమానాని వామోరుః త్రివిధానీహ దేహినామ్‌ | శుభశుభాని కర్మాణి బీజభూతాని యానివై. 21

బహుజన్మసముత్థాని కాలే తిష్ఠంతి సర్వథా | పూర్వదేహం పరిత్యజ్య జీవః కర్మవశానుగః. 22

స్వర్గం వా నరకం వా%పి ప్రాప్నోతి స్వకృతేన వై | దివ్యదేహం చ సంప్రాప్య యాతనాదేహ మర్థజమ్‌. 23

భునక్తి వివిధా న్భోగా న్స్వర్గే వా నరకే%థ వా | భోగాంతే చ యదోత్పతేతః సమయస్తస్యజాయతే. 24

లింగదేహేనసహితం జాయతే జీవసంజ్ఞితం | తదైవ సంచితేభ్యశ్చ కర్మభ్యః కర్మభిః పునః. 25

యోజయత్యేవ తంకాలః కర్మాణి ప్రాకృతాని చ | దేహేనానేన భావ్యాని శుభాని అశుభాని చ. 26

ప్రారబ్ధాని చ జీవేన భోక్తవ్యాని సులోచనే | ప్రాయశ్చిత్తేన నశ్యంతి వర్తమానాని భామిని! 27

సంచితాని తథైవా%%శు యథార్థం విహితేన చ | ప్రారబ్ధకర్మణాం బోగా త్సంక్షయో నాన్యథా భ##వేత్‌. 28

తేనాయం తే కుమారో వై దేయః కంసాయ సర్వథా | న మిథ్యా వచనం మే%స్తి లోకనిందా%భిదూషితమ్‌. 29

కనుక నిపుడు మన పుత్త్రునకు మేలు గలుగు విధ మాచరింపుము. మేలుగోరువాడు కల్లలాడినను మంచిదే. అట్టి వానికి దొసగు కొంచెమేనియు నంటదని పెద్దలందురు అన విని వసుదేవుడిట్లనెను : ఓ సౌభాగ్యవతీ! సత్యవాక్కు పలుకుదును. ఆలింపుము. నరుడు ప్రయత్నము మాత్రము చేయవలయును. ఫలితము దైవాధీనము. పూర్వతత్త్వ విధులు పురాణములందు లోకమున దేహికి మూడు విధములైన కర్మములు గలవని వచించిరి. అవి సంచితము ప్రారబ్ధము వర్తమానము అనబడునవి. శుభాశుభ బీజరూపమున నుండు శుభాశుభ కర్మములు సంచితములు. అవి జన్మాంతరములందు జీవులను వెంటాడు చుండును. జీవుడు తన మేను చాలించి కర్మ పరాధీను డగును. అపుడు జీవుడు తన సంచిత కర్మానుసారముగ స్వర్గమో నరకమో పొందును. దివ్యదేహమో యాతనా శరీరమో అతడు దాల్చును. అతడు స్వర్గమందు వివిధ భోగము లనుభవించును. నరకమందు యాతనలు కుడుచును. అవి అనుభవించిన పిదప మరల జన్మించు, సమయ మేతెంచును. అపు డతడు లింగ దేహముతో జీవరూపము దాల్చును. అంత సంచిత కర్మములతో నుండి పరిపక్వమైన కర్మములు కొన్ని కాలునిచే జీవునిలో గూర్చబడును. ఇట్లు జీవుని దేహములో సంచితములైన శుభాశుభ కర్మములు నిరంతరము కొనసాగుచుండును. ఇవియే ప్రారబ్ధ కర్మములు. ఇవి యనుభవింపక తీరవు. వర్తమాన కర్మములు ప్రాయశ్చితముచే తొలగిపోవును. వర్తమానములవలె సంచితములును తొలగిపోవును. కాని ప్రారబ్దములు మాత్ర మనుభవించిననే క్షమించును. వేరు విధముగ గాదు. కనుక, నీ కుమారు నిపుడు తప్పక కంసున కప్పగింప వలయును. కానిచో నీలోకము మనల దూషించినిందించును. నే నసత్యములు పలుకజాలను.

అనిత్యే2స్మింస్తు సంసారే ధర్మసారే మహాత్మానాం | దైవాధీనం హి సర్వేషాం మరణం జననం తథా. 30

తస్మా చ్ఛోకో న కర్తవ్యో దేహినా హి నిరర్థకః | సత్యం యస్య మతం కాంతే వృథా తసై#్యవ జీవితమ్‌. 31

ఇహలోకో గతో యస్మా త్పరలోకః కుతస్తతః | అలో దేహి సుతం సుభ్రు కంసాయ ప్రదదామ్యహమ్‌. 32

సత్య సంస్తరణాద్దేవి శుభ మగ్రే భవిష్యతి | కర్తవ్యం సుకృతం పుంభిః సుఖే దుఃఖే సతి ప్రియే. 33

సత్య సంరక్షణాద్దేవి శుభ##మేవ భవిష్యతి ఇత్యుక్తవతి కాంతే సా దేవకీ శోకసంయుతా |

దదౌ పుత్త్రం ప్రసూతం చ వేపమానా మనస్వినీ. 34

వసుదేవో%పి ధర్మాత్మా ఆదాయ స్వసుతం శిశుమ్‌ | జగామ కంససదనం మార్గే లోకై రభిష్ఠుతః. 35

లోకాః : పశ్యంతు వసుదేవం భోలోకాః ఏనం మనస్వినమ్‌ | స్వవాక్యమనురుధ్వైవ బాల మాదాయ యాత్స్య సౌ. 36

మృత్యవే దాతుకామో%ద్య సత్యవాగనసూయకః | సఫలం జీవితం చా%స్య ధర్మం పశ్యంతు చా%ద్భుతమ్‌. 37

యః పుత్త్రం యాతి కంసాయ దాతుం కాలాత్మనే%పి హి |

ఇతి సంస్తూయమానస్తు ప్రాప్తః కంసాలయం నృపః. 38

దదావసై#్మ కుమారం తం జాతమాత్ర మమానుషం | కంసో%పి విస్మయం ప్రాప్తో దృష్ట్వా ధైర్యం మహాత్మనః. 39

గృహీత్వా బాలకం ప్రాహ స్మితపూర్వ మిదం వచః | ధన్యస్త్వం శూరపుత్రాద్యజ్ఞాతః పుత్ర సమర్పణాత్‌. 40

మమమృత్యుర్నచాయం వైగిరా ప్రోకస్తుచాష్టమః | నహంతంవ్యోమయాకామంబాలో%యంయాతుతేగృహమ్‌. 41

అష్టమస్తు ప్రదాతవ్యస్త్వయా పుత్త్రో మహామతే | ఇత్యుక్త్వా వాసుదేవాయ దదావాశు ఖలః శిశుమ్‌. 42

గచ్ఛత్వయం గృహే బాలః క్షేమం వ్యాహృతవా న్నృప | తమాదాయ తదా శౌరి ర్జగామ స్వగృహం ముదా. 43

ఈ విచిత్ర సంసారము సారహీనము. ధర్మము మాత్రము సారవంతమైనది. మహాత్ముల జీవన మరణములు దైవాధీనములు కావున జీవు లెప్పుడును వ్యర్థముగ శోకింప గూడదు. ఎవడు సత్య భ్రష్టుడో వాని జీవితము నిరర్థకము. అట్టి భ్రష్టున కీలోకమే లేదు. ఇక పరలోక మెక్కడిది? కాన నీ సుతునిమ్ము - కంసునకు సమర్పింతును. సత్య నిష్ఠ పాటించినచో మనకు తప్పక శుభములు చేకురును. కనుక నరులు సుఖ దుఃఖములందు పుణ్యకార్యము లాచరింప వలయును. సత్య సంరక్షణమున సకల శుభము లొనగూడును అని యిట్లు వసుదేవుడు పలుకగ దేవకి బోరున నేడ్చుచు తన నవ జాత శిశువును తన పతి చేతిలో నుంచెను. ధర్మాత్ముడగు వసుదేవుడు తన తనయు నెత్తుకొని కంసునింటి కేగుచుండగ జనులతని సత్యనిష్ఠ నిట్లభినుతించు చుండిరి: సుజనులారా! ఈ మహా మనీషిని గనుడు. ఆహా! ఇతడు తన మాట నిలువ బెట్టుకొనుటకు తన పసికందును గొని యేగు చున్నాడు. ఈ సత్యవాది యీసు లేనివాడు. ఇతడు తన కుమారుని మిత్తి వాత బడవేయ నున్నాడు. ఇతని జీవిత మెంత ధన్యము! ఇతని యత్యద్భుత ధర్మ మేమన వచ్చును? ఇతడు కాలరూపుడైన కంసునకు తన సుతు నప్పగింప నేగుచున్నాడు అని జనులు నుతించుచుండ మానవాతీతుడైన వసుదేవుడు కంసునింటి కేగి తన కుమారు నతని కర్పించెను. కంసుడును మహాత్ముడగు వసుదేవు ధైర్యమున కబ్బుర పడెను. కంసుడా చిన్నారి బాలుని గైకొని నవ్వుచు నిట్లనియెను : శూరపుత్రా! పుత్త్ర సమర్పణమున నీవు కడు ధన్యుడ వైతివి. గగనవాణి నీ యష్టమ పుత్రుని నా మృత్యువుగ పేర్కొనినది. కాని యీ బాలకుని గాదు. ఇతడు చంపబడదగడు. నీ యింటి కితనిని గొని పొమ్ము. నీ యెనిమిదవ సుతుని తెచ్చి యిమ్ము. నీకు శుభమగుత! అని యా బాలకుని మరల వసుదేవున కప్పగించెను. వసుదేవుడు బాలునిగొని ముదమున తన సదనమున కేగెను.

కంసో%పి సచివానాహ వృథా కిం ఘాతయే శిశుమ్‌ | అష్టమా ద్దేవకీపుత్రా న్మమ మృత్యు రుదాహృతః. 44

అత కిం ప్రథమం బాలం హత్వా పాపం కరోమ్యహమ్‌ | సాధుసాధ్వితీ తే%ప్యుక్త్వా సంస్థితా మంత్రిసత్తమాః. 45

విసర్జితాస్తు కంసేన జగ్ము స్తే స్వగృహా న్ప్రతి | గతేషు తేషు సంప్రాప్తో నారదో మునిసత్తమః. 46

అభ్యుత్థానార్యపాద్యాది చకారోగ్రసుత స్తదా | పప్రచ్ఛ కుశలం రాజా తత్రా%%గమన కారణమ్‌. 47

నారద స్తం తదోవాచ స్మితపూర్వమిదం వచః | కంస! కంస! మహాభాగ! గతో%హం హేమపర్వతమ్‌. 48

తత్ర బ్రహ్మాదయో దేవా మంత్రం చక్రుః సమాహితాః | దేవక్యాం వసుదేవస్య భార్యాయాం సురసత్తమః. 49

వధార్థం తవ విష్ణుశ్చ జన్మ చా%త్ర కరిష్యతి | తత్కథం న హతః పుత్త్ర స్త్వయా నీతి విజానతా. 50

కంసః : అష్టమం చ హనిష్యేహం మృత్యుంమే దేవభాషితం | నారదః : నజానాసి నృపశ్రేష్ఠ రాజనీతిం శుభాశుభమ్‌. 51

మాయాబలం చ దేవానాం నత్వవేస్సి వదామి కిం | రిపురల్పో%పి శూరేణ నోపేక్ష్యః శుభమిచ్ఛతా. 52

సమ్మేళన క్రియయాంతుసర్వేతేహ్యష్టమాః స్మృతాః | మూర్ఖ స్త్వ మరిసంత్యాగః కృతో%యంజానతా త్వయా. 53

ఇత్యుక్త్వా%%శు గతః శ్రీమాన్నారదో దేవదర్శనః | గతే%థ నారదే కంసః సమాహూయాథ బాలకమ్‌. 54

పాషాణ పోథయామాస సుఖం ప్రాపచ మందధీః. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంథే ఏకవింశోధ్యాయః.

కంసుడు మంత్రులను పిలిపించి వారికిట్లనెను: ఈ పసికందును వ్యర్థముగ చంపనేల? దేవకి యెనిమిదవ పుత్రుడు గదా నా పాలి శత్రువు? కాగా తొలి బాలుని చంపి పాపము మూటకట్టుకొన నేల?' అను మాటలకు మంత్రులము మేలు మేలని కంసుని బొగడి కంసు ననుమతితో తమ నివాసముల కరిగిరి. పిమ్మట నారద మునీంద్రు డచ్చోటి కరుగుదెంచెను. కంసుడు నారదున కర్ఘ్యపాద్యవిధు లాచరించి సేమమడిగి యతని రాకకు కారణ మడిగెను. ఆ మునీంద్రుడు నవ్వుచు కంసున కిట్లనెను. ఓ మహాభాగా! కంసా! నేను మేరుగిరి కరిగితిని. అచట బ్రహ్మాదిదేవతలు సమావిష్టులై యిట్లు మంత్రాలోచనలు చేసిరి. కంసుని చంపుటకై దేవకీ వసుదేవులకు సురవరుడగు విష్ణువుద్భవింపగలడు అని. ఆ యుద్భవించువాడు విష్ణువే కనుక రాజ నీతివిదుడవగు నీవు వసుదేవుని సుతు నేల జంపకుంటివి'? అన కంసుడు దేవ వాణి ననుసరించి నే నెనిమిదవ వానినే వధింతును' అనెను. నారదుడిట్లు పలికెను : ఓ నరవరా! నీవు రాజనీతి యందలి మంచి చెడ్డ లెఱుగవు. దేవతల మాయాబల మెట్టిదో నీకు తెలియదు. ఇట్టి నీకు నేనేమి చెప్పుదును? తన మేలు గోరుకొనువాడు చిన్న పగతునైన చంపక విడువడు. కలియగలిపి లెక్కించిన ప్రతి యొకడును ఎనిమిదవవాడే యగును. అన్నియు తెలిసిన నీవు శత్రుని చేజేతుల వదలుట మూర్ఖత్వము' అని పలికి దేవ సమానుడగు నారదుడు వెళ్ళెను. పిదప దుష్టుడగు కంసు డా బాలుని తెప్పించి బండకు మోది చంపి నిశ్చింతుడయ్యెను.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు వసుదేవుని సత్యనిష్ఠయను నిరువదియొకటవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters