Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

వ్యాసః : 

తాం దృష్ట్వాతు వధం ఘోరం చుక్రోధ భగవాన్భృగుః | వేపమానో%తి దుఃఖార్తః ప్రోవాచ మధుసూదనమ్‌.

భృగురువాచ : అకృతంతేకృతం విష్ణో! జానన్పాపం మహామతే! వధో%యం విప్రజాతాయా మనసా కర్తుమక్షమః. 1

ఆఖ్యాత స్త్వం సత్త్వగుణః స్మృతో బ్రహ్మా చ రాజసః | తథా%సౌతామసః శంభు ర్విపరీతం కథం స్మృతమ్‌. 2

తామసస్త్వం కథం జాతః కృతం కర్మాతినిందితమ్‌ | అవధ్యస్త్రీ త్వయా విష్ణో హతా కస్మా న్నిరాగసా. 3

శపామి త్వాం దురాచారం కి మన్యత్ర్పకరోమి తే | విధురో%హం కృతః పాప:త్వయా%హం శక్రకారణాత్‌. 4

న శ##పే%హం తథా శక్రం శ##పే త్వాం మధుసూదన| తదా ఛలపరో%సి త్వం కీటయోని ర్దురాశయః. 6

యేచ త్వాం సాత్త్వికం ప్రాహు స్తే మూర్ఖా మునయః కిల | తామస స్త్వం దురాచారః ప్రత్యక్షం మే జనార్దన. 7

అవతారా మృతులోకే సంతు ముచ్ఛాపసంభవాః | ప్రాయో గర్భభవం దుఃఖం భుంక్ష్వ పాపా జ్జనార్దన. 8

తత స్తేనా%థ శాపేన నష్టే ధర్మే పునఃపునః | లోకస్య చ హితార్థాయ జాయతే మానుషేహ్విహ. 9

రాజోవాచ : భృగుభార్యా హతా తత్ర చ క్రేణామిత తేజసా | గార్హస్థ్యం చ పున స్తస్య కథం జాతం మహాత్మనః. 10

వ్యాసః: ఇతి శప్త్వా హరిం రోషాత్తదాదాయ శిరస్త్వరన్‌ | కాయే సంయోజ్య తరసా భృగుః ప్రోవాచకార్యవిత్‌. 11

అద్య త్వాం విష్ణువా దేవి: హతాం సంజీవయామ్యహమ్‌ | యది కృత్స్నో మయాధర్మో జ్ఞాయతేచరితో%పివా. 12

పన్నెండవ అధ్యాయము

జయంతీ శుక్రుల సమాగమము

ఓ జనమేజయా! ఆ ఘోరమైన స్త్రీ వధ గాంచి భృగుమహర్షి కంపితుడై దుఃఖార్తుడై మధుసూదనున కిట్లనెను : విష్ణూ! మహామతీ! నీ కీ దుష్కార్యము పాపమని తెలియును గదా! ఐన నీ పని కేల యొడిగట్టితివి? విప్ర స్త్రీ వధ మనసున సైతము దలంపరాదు గదా! విష్ణువు సత్వగుణ సంపన్నుడు - బ్రహ్మ రజోగుణయుక్తుడు - శివుడు తమోగుణుడని మహర్షులందురు. కాని, నేడా విషయము నీ యెడల విపరీతమైనది. సాత్త్వికుడవైన నీవు తామసుడ వెట్లయితివి? అతినిందిత కార్యమేల చేసితివి? స్త్రీని వధింపరాదు గదా! ఈమె యేపాప మెఱుగనిదే! మఱి యీమె నేల చంపితివి? నీవు కడు దురాచారుడవు. నిన్నేమి చేసినన తప్పులేదు. నిన్నిప్పుడే శపించివైతును. ఇంద్రుని మేలుగోరి నీవే దురిత మొనర్చితివి. నన్ను దుఃఖముల పాలు చేసితివి. నీవు కపటివి - దురాశయుడవు - నీచ యోని సంజాతుడవు. కనుక నేను నిన్నే శపింతును, ఇంద్రుని శపింపను. జనార్దనా! మునులు నిన్ను సాత్త్వికుడందురు. కాని నీవు తామసుడవు. నీవు చేసిన దుర్మార్గము నేను కనులార గంటిని. ఇదిగో! నా శాప కారణముగ నీవు మృత్యులోకమున నవతారములు దాల్చెదవు. ఈ పాప ఫలితముగ గర్భ దుఃఖమనుభవించి తీరుదువు.'' అట్టి భృగు శాప ఫలితముగ ధర్మము నశించి నపుడెల్ల ధర్మసంస్థాపనకై విశ్వ కల్యాణార్థము విష్ణువు మాటిమాటికిని మనుజలోకమం దవతరించును అను వ్యాస వచనములు విని రాజిట్లనెను : మహాతేజముగల సుదర్శన చక్రముతో భృగు పత్ని చంపబడెను గదా! అటు పిమ్మట భృగు మహర్షి గృహస్థ జీవిత మెట్లు గడపెను? అన వ్యాసు డిట్లనియెను : అట్లు కార్యకుశలుడగు భృగుమహర్షి మహారోషముతో విష్ణుని శపించి పిమ్మట తన భార్యతలను మొండెముతో జేర్చి యిట్లు వచించెను : ఓ దేవీ! నేను సర్వధర్మ విదుడనేని ధర్మాచరణుడనేని విష్ణుని చేతిలో చచ్చిన నిన్ను పునర్జీవితురాలి నొనర్తును.

తేన సత్యేన జీవేత యది సత్యం బ్రవీమ్యహమ్‌ | పశ్యంతు దేవతాః సర్వా మమ తేజోబలం మహత్‌. 13

అద్భి స్తాం ప్రోక్ష్య శీతాభిర్జీవయామి తపోబలాత్‌ | సత్యం శౌచం తథా వేదా యది మే తపసో బలమ్‌. 14

అద్భిః సంప్రోక్షితా దేవీ సద్యః సంజీవితా తదా | ఉత్థితా పరమప్రీతా భృగోర్భార్యా శుచిస్మితా. 15

తత స్తాం సర్వభూతాని దృష్ట్వా సుప్తోత్థితామివ | సాధు సాధ్వితి తం తాం తు తుష్టువుః సర్వతోదిశమ్‌. 16

ఏవం సంజీవితా తేన భృగుణా వరవర్ణినీ | విస్మయం పరమం జగ్ముర్దేవాః సేంద్రా విలోక్యతత్‌. 17

ఇంద్రః సురానథోవాచ మునినా జీవితా సతీ | కావ్య స్తప్త్వా తపో ఘోరం కిం కరిష్యతి మంత్రవిత్‌. 18

గతా నిద్రాసురేంద్రస్యదేహే%క్షేమమభూన్నృప | స్మృత్వాకావ్యస్యవృత్తాంతం మంత్రార్థమతిదారుణమ్‌. 19

విమృశ్య మనసా శక్రో జయంతీం స్వసుతాం తదా | ఉవాచ కన్యాం చార్వంగీం స్మితపూర్వమిదంవచః. 20

గచ్ఛ పుత్త్రి! మయా దత్తా కావ్యాయ త్వం తపస్వినే | సమారాధయ తన్వంగి! మత్కృతే తం వశే కురు. 21

ఉపచారై ర్మునిం తైసై#్తః సమారాధ్య మనః ప్రియైః | భయం మే తరసా గత్వా హర తత్ర పరాశ్రమే. 22

సా పితు ర్వచనం శ్రుత్వా తత్రాగచ్ఛ న్మరోమమా | తమపశ్య ద్విశాలాక్షీ పిబంతం ధూమమాశ్రమే. 23

తస్య దేహం సమాలోక్య స్మృత్వా వాక్యం పితుస్తదా | కదళీదళ మాదాయ వీజయామాస తం మునిమ్‌. 24

నేను నిత్యసత్యవాదినేని నా సత్య ప్రభావమున నీమె పునర్జీవితు రాలగును గాక! ఎల్లదేవతలు నేడు నా తపోమహిమ గాంతురు గాక! నేను సత్య-శౌచ-వేద-తపోవీర్యము గలవాడనేని నా తపో మహిమచే చల్లని మంత్రజలము సంప్రోక్షించి యీమెను పునర్జీవితురాలి నొనర్పగలను అని మంత్రజలముచే ప్రోక్షించినంత భృగుపత్ని పునర్జీవితురాలై పరమ ప్రీతితో పవిత్రమగు నగవుతో నిదుర నుండి లేచినటులే లేచెను. వారిని సర్వభూతములును గాంచి నలుదెసల నుండి మేలు మేలనుచు ప్రణుతించెను. అట్లు భృగుముని భార్య మరల జీవించుట నింద్రాది దేవతలు గాంచి పరమ విస్మయ మందిరి. అట్లు భృగువు తన యర్ధాంగిని మరల బ్రతికించు కొనెను. అటు శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోరముగ తపమొనర్చుచున్నాడు. ఆ శుక్రుడు మంత్ర లాభమున నింకేమేమి చేయగలడో? యని యింద్రుడు సురలతో ననెను. అట్లు నిద్రాదేవి తన్ను వదలగా నింద్రుడు మేలుకొని శుక్రుడు మంత్ర ప్రాప్తికై ఘోర తప మొనర్చుట ఎఱిగి దుఃఖాక్రాంతుడయ్యెను. అంత నింద్రుడు నెమ్మదిలో ముందుచూపుతో నంతయు నాలోచించి జయంతి యను యనుంగు కూతుతో నవ్వుచు నిట్లు పలికెను: ఓ పుత్త్రీ! నిన్ను తపమొనర్చుచున్న శుక్రుని సేవకు నియోగించితిని. నీవిపుడేగి యతనిని సేవించి నీవానిగజేసికొమ్ము. నీవతని యాశ్రమమున కరుగుము. అతని చిత్తము మెచ్చునట్లుగ మసలుకొనుము. చేయదగిన తగిన యుపచారము లొనర్చుము. అతనిని బూజించి వేగమే నా భయ ముడుపుము. విశాలాక్షి మనోరమయగు ఆ జయంతి తన తండ్రిమాట లాకర్ణించి శుక్రు నాశ్రమమున కేగెను. శుక్రుడు ధూమపాన మొనర్చు చుండుట నామె కాంచెను. ఆ ముని మేనిని జూచి తన తండ్రి మాటలు మదిలో దలంచి జయంతి మునివరునకు లేత యరటి యాకులతో వీవ మొదలుపెట్టెను.

నిర్మలం శీతలం వారి సమానీయ సువాసితమ్‌ | పానాయ కల్పయామాస భక్త్యా పరమయా లఘు. 25

ఛాయాం వస్త్రాతపత్రేణ భాస్కరే మధ్యగే సతి | రచయామాస తన్వంగీ స్వయం ధర్మే స్థితా సతీ. 26

ఫలాన్యానీయ దివ్యాని పక్వాని మధురాణి చ | ముమో చాగ్రే మునే స్తస్య భక్షార్థం విహితాని చ. 27

కుశాః ప్రాదేశమాత్రా హి హరితాః శుకసన్నిభాః | దధారగ్రే%థ పుష్పాణి నిత్యకర్మ సమృద్ధయే. 28

నిద్రార్థం కల్పయామాస సంస్తరం పల్లవాన్వితమ్‌ | తస్మి న్మునౌ చా%%దరస్థా చకార వ్యజనం శ##నైః 29

హావభావాదికం కించి ద్వికారజననం చ తత్‌ | న చకార జయంతీ సా శాపభీతా మునేస్తదా. 30

స్తుతిం చకార తన్వంగీ గీర్భిస్తస్య మమాత్మనః | సుభాషిణ్యనుకూలాభిః ప్రీతికర్త్రీభి రప్యుత. 31

ప్రబుద్ధే జలమాదాయ దధారాచమనాయ చ మనో%సుకూలం సతతం కుర్వతీ వ్యచరత్తదా. 32

ఇంద్రో2పి సేవకాం స్తత్ర ప్రేషయామాస చాతురః | ప్రవృత్తిం జ్ఞాతుకామో వై మునేస్తస్య జితాత్మానః. 33

ఏవం బహూని వర్షాణి పరిచర్యాపరా%భవత్‌ | నిర్వికారా జితక్రోధా బ్రహ్మచర్యపరా సతీ. 34

పూర్ణే వర్షసహస్రే తు పరితుష్ఠో మహేశ్వరః | వరేణ చ్ఛందయామాస కావ్యం ప్రీతమనా హరః. 35

ఈశ్వరః : యచ్చ కించిదపి బ్రహ్మన్విద్యతే భృగునందన | ప్రతిపశ్యసి యత్సర్వం య చ్చ వాచ్యం న కస్యచిత్‌. 36

ఆమె పరమభక్తిమీర నిర్మలమైన చల్లని జలములు వేగమే కొనివచ్చి మునిపతి త్రాగుట కందించెను. పగటింటి సూర్యుడు నడినెత్తిమీదికి రాగా నా తన్వంగి తాను ధర్మమందు నిలిచి వస్త్రమును శుక్రాచార్యునకు గొడుగుగ బట్టి చల్లని నీడను కల్పించెను. ఆ యువిద బాగుగ పండిన తీపి పండ్లను దెచ్చి యారగించుటకు ఏర్పరచి ముని సమక్షమున నుంచెను. ముని నిత్యవిధులు నిర్వహించుటకై చిల్కల వంటి దర్భలు దెచ్చి యాతన్వంగి ముని యెదుట నుంచెను. ముని ప్రవరుడు నిద్రించుట కాప్రమద మెత్తని చిగురుటాకు సెజ్జ సమకూర్చెను. ఆ ముని యందలి ఆదర భావముతో మెల్లగ వీచుచుండును. ఆ నెలతుక యేనాడు గాని ముని శాపభయమున యతనికి వికారములు గొలుపు హావభావములు వెల్లడించలేదు. ఆ సుభాషిణి ప్రియము లొలుకుచు అతనికి ననుకూలములైన మాటలతో మునిని ప్రస్తుతించుచుండెను. ముని మేల్కనినంతనే యాలలన ముని కాచమనము కొఱకు నీరు దెచ్చి యిచ్చెను. ఈ తీరున నామె ముని మనస్సు నెఱిగి యనువర్తించుచుండెను. ఆతురుడగు సురపతి జితాత్ముడైన ముని చేష్టల నెఱుంగదలచి యచ్చోటికి తన సేవకుల నంపెను. ఈ ప్రకారముగ జితేంద్రియ - నిర్వికార - బ్రహ్మచారిణి యగు జయంతి మునినాథునకు పెక్కేండ్లు పరిచర్యలు చేసెను. అట్లు వేయేండ్లు నిండెను. అంత మహాదేవుడు ప్రీతమనస్కుడై సంతుష్టుడై ప్రసన్నుడై మునివరునకు వర మొసగవచ్చి నీ కేమి వరము కావలెనో కోరుమని ఇట్లనెను : ఓ భృగునందనా! యీ విశ్వమందు ఏదేది కలదో యేది వాక్కున కందదో దేనిని నీవు గనదలతువో దానిని నీవు గందువు.

సర్వాభిభావకత్వేన భవిష్యతి న సంశయః | అవధ్య స్వర్వ భూతానాం ప్రజేశశ్చ ద్విజోత్తమః. 37

వ్యాసః : ఏవం దత్త్వా వరాన్‌ స్తత్రైవాంత రధీయత | కావ్యస్తామథ సంవీక్ష్య జయంతీం నాక్యమబ్రవీత్‌. 38

కా%సి కస్యాసి సుశ్రోణి | బ్రూహి కిం తే చికీర్షితమ్‌ | కిమర్థమిహ సంప్రాప్తా కార్యం వద వరోరు! మే. 39

కిం వాంఛసి కరోమ్యద్య దుష్కరం చే త్సులోచనే | ప్రీతో%స్మి త్వత్కృతేనాద్య వరం వరయ సువ్రతే. 40

తతః సా తు మునిం ప్రాహ జయంతీ ముదితాననా | చికీర్షితం మే భగవం స్తపసా జ్ఞాతు మర్హసి. 41

కావ్యః : జ్ఞాతం మయాతథా%పిత్వం బ్రూహి యన్మనసేప్సితమ్‌ | కరమిసర్వథాభద్రం ప్రీతో%స్మి పరిచర్యయా. 42

జయంతీ : శక్రస్యా%హంసుతా బ్రహ్మన్పిత్రాతుభ్యంసమర్పితా | జయంతీనామతశ్చాహం జయంతావరజా మునే. 43

సకామా%స్మి త్వయి విభో వాంఛితం కురు మే%ధునా | రంస్యే త్వయా మహాభాగ ధర్మతః ప్రీతిపూర్వకమ్‌. 44

శుక్రః : మయాసహ త్వం సుశ్రోణి దశవర్షాణి భామిని | సర్వై ర్భూతై రదృశ్యా చ రమస్వేహ మదృచ్ఛయా. 45

వ్యాసః : ఏవ ముక్త్వా గృహం గత్వా జయంత్యాః పాణిముద్వహన్‌ | తయా సహావసద్దేవ్యా దశవర్షాణి భార్గవః. 46

అదృశ్య: సర్వభూతానాంమాయయాసంవృతః ప్రభుః | దైత్యాస్తమాగతం శ్రుత్వాకృతార్థం మంత్రసంయుతమ్‌. 47

అభిజగ్ము ర్గృహే తస్య ముదితాస్తే దిదృక్షవః | నాపశ్యన్రమమాణం తే జయంత్యాసహ సంయుతమ్‌. 48

వాని నన్నిటిని నీవు జయింపగలవు. నీవు సర్వభూతములలో వేనికిని వధ్యుడవు గావు. నీవు ప్రజాపతివి. ద్విజోత్తముడవు. ఇందు సందేహము లేదు అని ఇట్లు వరము లొసంగి శివు డదృశ్యుడయ్యెను. అంత శుక్రుడు కన్నెత్తి కాంచి జయంతితో నిట్లు పలుకసాగెను : ఓ సుశ్రోణీ ! నీ వెవ్వతవు? ఎవ్వరి దానవు? నీలోని కోరిక యేమి? నీ వేమి చేయదలచితివి? నీవు నన్ను దేనికి జేరితివి? నీకు నావలన గాదగిన కార్య మేది? త్వరగ తెలియబఱచుము. ఓ సులోచనా! నీలోని కోరిక యెంతటి యసాధ్యమైన దైనను నేను తప్ప కీడేర్పగలను. నీ యింపైన చేతలకు నా మది ప్రీతినందినది. ఇప్పుడే వరము గోరుకొమ్ము, ఇదిగో యిత్తును అను మునివరుని మాటలకు జయంతి ముఖము సంతోషముతో వికసించగా ఆ మగువ భగవన్‌! మీరు మీ తపోమహిమముననే నా మనస్సునందలి ఈప్సితమును తెలిసికొన వేడుకొనుచున్నాను అనగా శుక్రు డిట్లనెను : నే నిదంతయు నెఱుంగుదును. ఐనను నీ మనస్సునందలి యీప్సితమును నాకు చెప్పుము. నీ కన్ని విధముల శుభము కలిగింతును. నీ పరిచర్యకు ప్రీతి నందితిని అను శుక్రుని వచనములు విని జయంతి యిట్లు పలికెను. ఓ ముని వరేణ్యా! బ్రాహ్మణోత్తమా! నే నింద్రుని కూతురను. జయంతుని చెల్లెలను. నా పేరు జయంతి. నన్ను నా తండ్రి మీకు సమర్పించెను. ఓ విభూ! నేను మీ విషయమున కామముతో నున్నాను. ఇపుడు నా కోరిక తీర్చుడు. ధర్మము ననుసరించి ప్రీతి పూర్వకముగా మీతో రమింతును అనగా శుక్రు డామెతో సుశ్రోణివగు ఓ భామినీ! నీవు పదియేండ్లపాటు సర్వ భూతములకు అదృశ్యురాలవై నాతో కూడి ఇచ్చటనే నీ ఇచ్ఛానుసారము రమింపుము అనెను. అని యిట్లు పలికి ముని వరుడు శుక్రు డామెను వెంటగొని తన యింటికేగి యామెను పెండ్లాడి ఆ చందముగ ముని జయంతిని గూడి పదేండ్లవఱకు నివసించెను. ఆ కాలములో శుక్రుడును మాయాశక్తితోగూడి సర్వభూతములకు కంటబడక యుండెను. శుక్రుడు మంత్రయుక్తుడై యేతెంచెనని దైత్యులు విని మునిని గన మదముమీద నాతని యింటి కరిగిరి. కాని, వారికి ముని కనబడలేదు. ఏలన, శుక్రు డెవరి కంటబడక జయంతిని కూడి యుండెను.

తదా విమనసః సర్వే జాతా భగ్నోద్యమాశ్చ తే | చింతాపరాతి దీనాశ్చ వీక్షమాణాః పునః పునః. 49

అదృష్ట్వా తం తు సంవృత్తం ప్రతిజగ్ము ర్యథాగతమ్‌ | స్వగృహాన్దైత్యవర్యాస్తే చింతావిష్ఠా భయాతురాః 50

రమమాణం తథా జ్ఞాత్వా శుక్రః ప్రోవాచ తం గురుమ్‌ | బృహస్పతిం మహాభాగం కిం కర్తవ్య మితఃపరమ్‌. 51

గచ్ఛాద్య దానవాన్ర్బహ్మ న్యాయయా త్వం ప్రలోభయ | అస్మాకం కురుకార్యం త్వం బుద్ధ్యాసంచింత్య మానద. 52

తచ్ఛ్రుత్వా వచనం కావ్యం రమమాణం సుసంవృతమ్‌ | జ్ఞాత్వా తద్రూప మాస్థాయ దైత్యాన్ప్రతి య¸°గురుః 53

గత్వా తత్రా%తిభక్త్యా%సౌ దానవాన్సముపాహ్వయత్‌ | ఆగతా స్వే%సురా ! సర్వే దదృశుః కావ్య మగ్రతః. 54

ప్రణమ్య సంస్థితాః సర్వే కావ్యం మత్వా%తి మోహితాః | న విదుస్తే గురోర్మాయాం కావ్యరూప విభావినీమ్‌. 55

తానువాచ గురుః కావ్యరూపః ప్రచ్ఛన్నమాయయా | స్వాగతం మమయాజ్యానాం ప్రాప్తో%హంవోహితాయవై. 56

అహం వో బోధయిష్యామి విద్యాం ప్రాప్తా మమాయయా | తపసా తోషితః శంభ్వుర్యుష్మత్కల్యాణ హేతవే. 57

తచ్ఛ్రుత్వా ప్రీతమనసో జాతాస్తే దానవోత్తమాః | కృతకార్యం గురుం మత్వా జహృషుస్తే విమోహితాః 58

ప్రణముస్తే ముదాయుక్తా నిరాతంకా గతవ్యథాః | దేవేభ్య శ్చ భయం త్యక్త్వా తస్థుః సర్వే నిరామయాః. 59

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే ద్వాదశో%ధ్యాయః.

అంతట వారు భగ్న హృదయులై విమనస్కులై చింతాపరులై దీనులై మాటిమాటికి మునికై ఎదురు తెన్నులు చూచుచుండిరి. కాని మాయావృతుడైన శుక్రు డెంతకును వారికి గనబడలేదు. అంత వారు భయార్తులై చింతాపరులై తమ యిండ్ల కేగిరి. అట్లు శుక్రుడు జయంతితో రమించు చుండుట యింద్రుడెఱిగి తన గురునితో ఇక మీద మా కర్తవ్య మేమి? ఓ విప్రశ్రేష్ఠా! నీవు మాత్ర మిపుడే వెళ్ళి దానవుల కాసగొల్పుము. నీ చక్కని బుద్ధితో నాలోచించి మన కార్యము సాధింపుము' అనెను. బృహస్పతి యింద్రుని మాటలన్నియు వినెను. శుక్రుడు మాయావృతుడై జయంతితో రమించుచుండు టెఱింగెను. అపుడు గురుడు శుక్రునియున్న రూపుదాల్చి దానవుల చెంతకేగెను. గురుడుచటి కేగి దానవుల నతిప్రీతితో నాహ్వానించెను. అసురు లెల్ల రేతెంచి తమ ముందున్న శుక్రుని పొడగాంచిరి. వారు మాయా మోహితులై దేవగురుని దైత్యగురునిగ భావించి దోయిలించిరి. కాని, శుక్రరూపము దాల్చిన గురుని మాయ దెలియరైరి. మాయతో శుక్రరూపము దాల్చిన గురువు వారికి స్వాగతము పలికి నేను మీ మేలుగోరి వచ్చితిననెను. నేను మీ మేలుగోరి తపమొనరించితిని. శివుడు మెచ్చి నాకు విద్య నొసంగెను. దాని నిపుడు మీకు ప్రబోధింపగలను. అది విని రాక్షసులు ప్రీతమనస్కులైరి. మన యాచార్యులవారు మన పని సాధించిరని మోహితాత్ములై సంతసిల్లిరి. అంత దానవులు దేవతల వలని భయము మాని వెతలు బాసి మోదముతో నిరామయులై యుండిరి.

ఇది శ్రీదేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు జయంతీ శుక్రుల సమాగమమను ద్వాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters