Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్దశో%ధ్యాయః

జనమేజయః: శ్రుతోవై హరిణా ఆ క్లప్తో యజ్ఞో విస్తరతో ద్విజ | మహిమానం తథాం%బాయా వద! విస్తరతోమమ. 1

శ్రుత్వా దేవ్యాశ్చరిత్రం వై కుర్వే మఖమనుత్తమమ్‌ | ప్రసాదాత్తవ విప్రేంద్ర! భవిష్యామి చ పావనః. 2

వ్యాసః: శృణు రాజన్ప్రవక్ష్యామి దేవ్యాశ్చరిత ముత్తమమ్‌ | ఇతిహాసపురాణంచ కథయామి సువిస్తరమ్‌. 3

కోసలేషు నృపశ్రేష్ఠ! సూర్యవంశసముద్భవః | పుష్పపుత్రో మహాతేజా ధ్రువసంధిరితి స్మృతః. 4

ధర్మాత్మా సత్యసంధశ్చ వర్ణాశ్రమహితేరతః | అయోధ్యాయం సమృద్ధాయాం రాజ్యం చక్రే శుచివ్రతః. 5

బ్రాహ్మణా: క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చాన్యే తథా ద్విజాః | స్వాంస్వాం వృత్తిం సమాస్థాయ తద్రాజ్యే ధర్మతో%భవన్‌. 6

నచరాః పిశునా ధూర్తా స్తన్యరాజ్యే చ కుత్రచిత్‌ | దంభాః కృతఘ్నాః మూర్ఖాశ్చ నసంతి కిల మానవాః. 7

ఏవం వై వర్తమానస్య నృపస్య కురుసత్తమ | ద్వే పత్న్యౌ రూపసంపన్నే హ్యాసతుః కామభోగదే. 8

మనోరమా ధర్మపత్నీ సురూపా%తి విచక్షణా | లీలావతీ ద్వితీయా చ సా%పిరూపగుణాన్వితా. 9

పదునాలుగవ అధ్యాయము

ధ్రువసంధి చరిత్ర

'విప్రవర్యా! నేను శ్రీమహావిష్ణుయాగము గుఱించి సవిస్తరముగ నాకర్ణించితిని. ఇపుడు శ్రీవిశ్వమాతయొక్క మాహాత్మ్యము విపులముగ విశదపఱచుము. నీ యనుగ్రహభాగ్యమున శ్రీదేవీ దివ్యచరిత్ర మహత్త్వము నాలకించి పవిత్రుడనై శ్రీభగవతీ యజ్ఞ మాచరింతును.' అని జనమేజయుడడుగ వ్యాసు డిట్లనెను: రాజా! శ్రీ మాతృదేవియొక్క సనాతన పవిత్ర చరిత్ర నీకు వినిపింతును. తదేకచిత్తమున నాలకింపుము. పూర్వము కోసలదేశమందు సూర్యవంశమున జన్మించిన మహాతేజస్వియగు ధ్రువసంధి యను మహారాజుండెను. ఆతడు పుష్పరాజునకు కుమారుడు. ఆ ధ్రువసంధి ధర్మాత్ముడు-సత్యసంధుడు-శుచివ్రతుడు-వర్ణాశ్రమ ధర్మపాలకుడునై సకల సంపత్సమృద్ధమగు నయోధ్యను రాజధానిగ చేసికొని ఏలుచుండెను. ఆతని యేలుబడిలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు తమ తమ వృత్తులందేమఱుపాటులేక వర్తించుచు ధర్మయుక్తులై యుండిరి. ఆ రాజ్యమందు దొంగలు పిసినిగొట్టులు మూర్ఖులు ధూర్తులు డంబాచారులు కృతఘ్నులు మచ్చునకైన కనబడరు. ఆ రీతిగ రాజ్య మేలు ధ్రువసంధి కిరువురు భార్యలుండిరి. వారిరువురును సురూపసంపదలు గలవారు. రాజును సకల కామభోగములతో దనుపువారు. వారిలో మొదటి ధర్మపత్ని మనోరమ. ఆ యమ సురూపవతి. విచక్షణురాలు. చతుర. సుగుణముల కాలవాలము. రెండవ భార్య లీలావతి రూపవతి-గుణవతి.

విజహార స పత్నీభ్యాం గృహేఠూపవనేషు చ | క్రీడాగిరౌ దీర్ఘికాసు సౌధేషు వివిధేషుచ. 10

మనోరమా శూభేకాలే సుషువే పుత్రముత్తమమ్‌ | సుదర్శనాభిధం పుత్రం రాజలక్షణ సంయుతమ్‌. 11

లీలావత్యపి తత్పత్నీ మాసేనైకేన భామినీ | సుషువే సుందరం ప్తుం శుభే పక్షే దినేతథా. 12

చకారనృపతి స్తత్ర జాతకర్మాదికం ద్వయోః | దదౌదానాని నిప్రేభ్యః పుత్రజన్మ ప్రమోదితః. 13

ప్రీతిం తయోః సమం రాజా చకార సుతయో ర్నృప | నృపశ్చకార సౌహార్దేష్వంతరం న కదాచన. 14

చూడాకర్మ తయోశ్చక్రే విధినా నృపసత్తమః | యథావిభనమేవాసౌ ప్రీతియుక్తః పరంతపః. 15

కృతచూడౌ సుతౌ కామం జహ్రతు ర్నృపతేర్మనః | క్రీడమానా వుభౌ కాంతౌ లోకానామనురంజకౌ. 16

తయోః సుదర్శనో జ్యేష్ఠో లీలావత్యాః సుతః శుభః | శత్రుజిత్సంజ్ఞకః కామం చాటువాక్యో బభూవహ. 17

నృపతేః ప్రీతిజనకో మంజువాక్చారు దర్శనః | ప్రజానాం వల్లభః సో%భూత్తథా మంత్రిజనస్య వై. 18

యథా తస్మి న్నృపః ప్రీతిం చకార గుణయోగతః | మందభాగ్యాన్మందభావో న తథా వై సుదర్శనే. 19

ఏవం గచ్ఛతి కాలే తు ధ్రువసంధి ర్నృపోత్తమః | జగామ వనమధ్యే%సౌ మృగయాభిరతః సదా. 20

నిఘ్నన్మృగా న్రురూన్నంబూన్సూకరా న్గవయాన్‌శశాన్‌ | మహిషాన్‌శరభాన్‌ఖడ్గాంశ్చిక్రీడ నృపతి ర్వనే. 21

ఆ రాజు తన భార్యలంగూడి గృహములందు వివిధ సౌధములందును వనోపవనములందును క్రీడాపర్వతము లందును డిగ్గియలందును విహరించుచుండెను. అంత నొక శుభసమయమున మనోరమ సర్వరాజలక్షణ లక్షితుడగు నొక పుత్త్రుని గనెను. ఆతని పేరు సుదర్శనుడు. లీలావతియు నదే మాసమున శుభపక్షమున శుభదినమున నొక కుమారుని గనెను. రాజు తన యిరువురు తనయులకు యథావిధిగ జాతకర్మాదు లొనరించెను. పుత్రోత్సాహమున విప్రులకు భూరిదాన దక్షిణ లొసంగెను. రాజు తన కొమరులందు భేదభావము పాటింపక సమభావమున నుండెను. వారును సోదరప్రేమతో నుండునట్లు చేసెను. ఆ రాజు ప్రీతితో వారికి యథావిభవముగ చూడాకర్మ జరిపించెను. చూడాకర్మలు జరిగిన పిమ్మట ఆ బాలురు లోకానురంజకులై పితృమనోహరులై క్రీడించుచుండిరి. వారిలో మనోరమ పుత్రుడగు సుదర్శనుడు జేష్ఠుడు. రెండవ కుమారుడు శత్రుజిత్తు. అతడు చాటు వాక్యములు చతుర భాషణము లాడుటలో నేర్పరి. ఆ శత్రుజిత్తు మంచి రూపము కలవాడు. మంజుభాషి. రాజునకు మంత్రులకు ప్రజలకు ప్రీతిపాత్రుడై వర్తించువాడు. రాజునకు శత్రుజిత్తునందున్నంత ప్రేమయు మమకారమును మందభాగ్యుడగు సుదర్శనునందు లేకుండెను. అట్లు కొంతకాలము గడచిన పిమ్మట ధ్రువసంధి వేటతమకమున వనముల కేగెను. ఆతడు వనములందు మృగ-రురు-గజ-కంబు-సూకర-గవయ-శశ-మహిష - శరభ-ఖడ్గమృగాదులను వేటాడుచు క్రీడించుచుండెను.

క్రీడమానే నృపే తత్ర ఘోరే%తి దారుణ | ఉదతిష్ఠ న్నికుంజాత్తు సింహః పరమకోపనః. 22

రాజ్ఞా శిలీముఖేనాదౌ విద్ధః క్రోధవశం గతః | దృష్ట్వా%గ్రే నృపతిం సింహో ననాద మేఘని స్వనః. 23

కృత్వా చోర్ధ్వం స లాంగూలం ప్రసారిత బృహత్సటః | హంతుం నృపతి మాకాశా దుత్పపాతాతికోపనః. 24

నృపతి స్తరసా వీక్ష్య దధారాసిం కరే తదా | వామే చర్మ సమాదాయ స్థితః సింహ ఇవాపరః. 25

సేవకా స్తస్య యే సర్వే తే%పి బాణాన్పృథక్‌ | అముంచన్కుపితాః కామం సింహోపరి రుషా%న్వితాః. 26

హాహాకారో మహానాసీ త్సంప్రహారశ్చ దారుణః | ఉత్పపాత తతః సింహో నృపస్యోపరి దారుణః. 27

తం పతంతం సమాలోక్య ఖడ్గేనాప్యహ నన్నృపః | సో%పి క్రూరైర్నఖాగ్రైశ్చ తత్రా%గత్య విదారితః. 28

స నఖై రాహతో రాజా పపాత చ మమారవై | చుక్రుశుః సైనికాస్తే తు నిర్జఘ్నుర్విశిఖై స్తదా. 29

మృతః సింహో%పి తత్రైవ భూపతిశ్చ తథామృతః | సైనికై ర్మంత్రిముఖ్యాశ్చ తత్రాగత్య నివేదితాః. 30

పరలోకగతం భూపం శ్రుత్వా తే మంత్రిసత్తమాం | సంస్కారం కారయామాసు ర్గత్వా తత్ర వనాంతికే. 31

పరలోక క్రియాం సర్వాం వసిష్ఠో విధిపూర్వకమ్‌ | కారయా మాస తత్రైవ పరలోక సుఖావహామ్‌. 32

రాజు భీకరమైన కాఱడవిలో వేటాడుచుండగ నొక క్రోధోద్రిక్తమైన మృగరాజు యమునిబోలె పొదరిల్లు వెడలి వచ్చెను. రాజు దానిని బాణముతో గొట్టెను. కాని యా సింహము దెబ్బతిని యెట్టయెదుట రాజునుగని మరింత కోపముతో మేఘ గంభీరముగ గర్జించి తోకపైకెత్తి సటలు విదళించి మహాక్రోధమున నింగికెగసి రాజుపై దుమికెను. అదికని రాజు వెంటనే చేత ఖడ్గముదాల్చి యెడమచేత డాలు బూని మరొక సింహమోయన నొప్పెను రాజభటులును కుపితులై వేర్వేరుగ పుంఖానుపుంఖములుగ సింహముపై బాణములు వేసిరి. ఆ క్రూరసింహము రాజుపై తీవ్రముగ దాడిచేసెను. ఆ ఘోరప్రహారముల వలన నచట హాహాకారములు చెలరేగెను. అట్లు తనపై క్రూరముగ దుముకు సింహమునుగని రాజు తన ఖడ్గముచేత వ్రేటువేసెను. అదియు నతనిని తన కఱకు గోటికొనలచే చీల్చివేసెను. ఆ సింహపు వాడి గోళ్ళచే దారుణముగ జీల్చబడి రాజు నేలగఱచెను. సైనికులెల్లరు దానిపై నొక్కుమ్మడిగ బాణాలు ప్రయోగించిరి. ఆ దెబ్బలకదియు నేలగూలెను. సైనికులు రాజు మరణవార్తను మంత్రులకెఱగించిరి. మంత్రులావనమునకేగి పరలోకగతుడైన రాజున కంత్యక్రియలొనర్చిరి. రాజూర్ధ్వలోకములకేగుటకు వసిష్ఠమహర్షి విధివిధానముగ నంత్యక్రియలు జరిపించెను.

ప్రజాః ప్రృకృతయశ్చైవ మహామునిః | సుదర్శనం నృపం కర్తుం మంత్రం చక్రుః పరస్పరమ్‌. 33

ధర్మపత్నీ సుతఃశాంతః పురుషశ్చ సులక్షణః | అయం నృపాసనార్హశ్చ హ్యబ్రువన్మంత్రి సత్తమాః. 34

వసిష్ఠో%పి తథైవా%%హ యోగ్యో%యం నృపతేఃసుతః | బాలో%పి ధర్మవాన్రాజా నృపాసన మిహార్హతి. 35

కృతేమంత్రే మంత్రివృద్దై ర్యుధాజిన్నామ పార్థివః | తత్రా%%జగామ తరసా శ్రుత్వా తూజ్జయినీ పతిః. 36

మృతం జామాతరం శ్రుత్వా లీలీవత్యాః పితాతదా | తత్రా%%జగామ త్వరితో దౌహిత్రప్రియకామ్యయా. 37

వీరసేన స్తథా%%యాతః సుదర్హనహితేచ్ఛయా | కళింగాధిపతిశ్చైవ మనోరమపితా నృపః. 38

ఉభౌ తౌ సైన్యసంయుక్తౌ నృపౌ సాధ్వస సంస్థితౌ | చక్రతు ర్మంత్రిముఖ్యై సై#్తర్మంత్రం రాజ్యస్యకారణాత్‌. 39

అంత వసిష్ఠ మహర్షియు ప్రజలను గలిసి సుదర్శనుని రాజుగ నాలోచించిరి. సుదర్శనుడు ధర్మపత్నీ తనయుడు శుభలక్షణ లక్షితుడు పరమశాంతుడు కాననితడే రాజ్యర్హుడగునని మంత్రిసత్తములు నిర్ణయించిరి. ఈ రాజపుత్త్రుడు బాలుడైనను ధర్మాత్ముడు. కనుక నితడే సింహాసనమునకు యోగ్యుడని వసిష్ఠుడు వక్కాణించెను. ఇట్లు వృద్ధామాత్యులాలోచించుచుండ లీలావతి తండ్రియగు నుజ్జయినీపతి యుధాజిత్తు తన యల్లుని చావు విని తన మనుమనికి ప్రియము చేకూర్పదలచి త్వరితగతి నచటికరుదెంచెను. ఆట్లే మనోరమ తండ్రి గళింగాధిపతి వీరసేనుడును తన మనుమడగు సుదర్శనునకు హితము గూర్పదలంచి క్రన్నన నచటికి వచ్చిచేరెను. సైన్యసమేతులగు నా యిరువురు రాజులును కాబోవు రాజును గూర్చి మంత్రి ముఖ్యులతోడ మంతనములాడదొడగిరి.

యుధాజిత్తు తదా%పృచ్ఛజ్జ్యేష్ఠః కః సుతయోర్ద్వయోః | రాజ్యం ప్రాప్నోతి జ్యేష్ఠోవై న కనీయా న్కదాచన. 40

వీరసేనో%పి తత్రా%%హ ధర్మపత్నీ సుతఃకిల | రాజ్యర్హః స యథారాజన్‌ శాస్త్రజ్ఞేబ్యో మయాశ్రుతమ్‌. 41

యుధాజిత్పునరాహేదం జ్యేష్ఠో%యం చయథాగుణౖః | రాజలక్షణసంయుక్తో న తథా%యం సుదర్శనః. 42

వివాదో%త్ర సుసంపన్నో నృపయో స్తత్రలుబ్ధయోః | కః సందేహ మపాకర్తుం క్షమః స్యాదతిసంకటే. 43

యుధాజిన్మంత్రిణః ప్రాహ యూయం స్వార్థపరాః కిల | సుదర్శనం నృపం కృత్వా ధనం భోక్తుం కిలేచ్ఛథ. 44

యుష్మాకం తు విచారో%యం మయాజ్ఞాతస్తథేంగితైః | శత్రుజిత్సబల స్తస్మా త్సమ్మతోవై నృపాసనే. 45

మయి జీవతి కః కుర్యా త్కనీయాంసం నృపం కిల | త్యక్త్వా జ్యేష్ఠం గుణార్హం చ సేనయా చ సమన్వితమ్‌ 46

నూనం యుద్ధం కరిష్యామి తస్మి న్ఖడ్గస్య మేదినీ | ధారయా చ ద్విధా భూయా ద్యుష్మాకం తత్రకా కథా. 47

వీరసేన స్తు తచ్ఛ్రుత్వా యుధాజిత మభాషత | బాలౌ ద్వౌ సదృశప్రజ్ఞా కో భేదో%త్ర విచక్షణ. 48

ఏవం వివదమానౌ తౌ సంస్థితౌ నృపతీ సదా | ప్రజాశ్చ ఋషయశ్చైవ బభూవు ర్వ్యగ్రమానసాః. 49

సమాజగ్ము శ్చ సామంతాః ససైన్యాః క్లేశతత్పరాః | విగ్రహం చాభికాంక్షంతః పరస్పర మతంద్రితాః. 50

నిషాదా హ్యాయము స్తత్ర శృంగబేర పురాశ్రయాః | రాజద్రవ్య ముపాహర్తుం మృతం శ్రుత్వా మహీపతిమ్‌. 51

పుత్రౌ చ బాలకౌ శ్రుత్వా విగ్రహం చపరస్పరమ్‌ | చౌరాస్తత్ర సమాజగ్ముః దేశ##దేశాంతరాదపిః 52

సమ్మర్ద స్తత్ర సంజాతః కలహే సముపస్థితే | యుథాజిద్వీరసేనశ్చ యుద్ధకామౌ బభూవతుః. 53

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే చతుర్దశో%ధ్యాయః.

ఈ యిరువురు రాకుమారులలో జ్యేష్ఠుడెవడు? రాజ్యమునకు జ్యేష్ఠుడు తగినవాడు. కనిష్ఠుడెన్నటికిని రాజ్యార్హుడు గాడని యుధాజిత్తు పలికెను. ధర్మపత్నికి బుట్టినవాడే యెల్ల విధముల రాజ్యమునకు దగినవాడని శాస్త్రజ్ఞులవలన వింటినని వీరసేనుడు వాదించెను. రాజులో నెట్టి రాజలక్షణములుండవలయునో యట్టివి సుదర్శనునందులేవని యుధాజిత్తనియెను. ఇట్లు రాజ్యలుబ్ధులగు నిరువురు రాజుల మధ్య తీవ్ర వాద వివాదములు చెలరేగును. వారి పోరాటమెవ్వడు నాపజాలకుండెను. ''మీరెల్లరును స్వార్థపరులు. సుదర్శనుని రాజుగజేసి ధనము సంపాదింప దలంచుచున్నాను. మీ రహస్యసమాలోచనముల వలన మీలోని యుద్దేశ్యమెఱింగితిని. కాని నిజమునకు శత్రుజిత్తు సబలుడు. నృపాసనమునకు యోగ్యుడు. సేనాసమేతుడు. సుగుణఖనియగు జ్యేష్ఠుని వదలి నేను బ్రతికియుండగనే చిన్నవానినెట్లు రాజుగ చేయుదురు? నేనిపుడు యుద్ధము చేయుదును. అందు నా వాడి ఖడ్గధారచే నేల వ్రయ్యలగును. ఇక మీరొక లెక్కయా?'' అని యుధాజిత్తు మంత్రులతో ననెను. ''ఇరువురు కుమారులును సమ ప్రజ్ఞులు. వారిలో నెట్టియంతరమును గోచరింపదు'' అని వీరసేనుడు యుధాజిత్తుతో వాదించెను. ఇట్లాపుడమి పతులిద్దఱును వాదించుకొనుచుండగ ఋషులను జనులును వ్యగ్రమనస్కులైరి. అంత సేనాసమేతులగు సామంతులు విచారించి చేయునదిలేక యుద్ధసన్నద్ధులైరి. అదే సమయమునందు రాజు మరణవార్త విని శృంగివేర పురవాసులగు నిషాదులు రాజద్రవ్యమపహరింప నచ్చటికి వచ్చిరి. బాలురగు రాకొమరులు పరస్పరము కలహించుకొనుట విని దేశ##దేశాంతరమందలి చోరులచ్చటికి వచ్చిరి. ఇట్లు కలహము చెలరేగగ జనసమ్మర్దమెక్కువయ్యెను. యుధాజిద్వీర సేనులు యుద్ధకాములై నిలుచుండిరి.

ఇది శ్రీ దేవీ భాగవతమందలి తృతీయ స్కంధమున పదునాల్గవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters