Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏక వింశో%ధ్యాయః

జాతకర్మాది సంస్కారాంశ్చకార నృపతి స్తదా | దినేదినేజాగా గామాశు వృద్ధింబాలః సులాలితః. 1

నృపః సంసారజం ప్రాప్య సుఖం పుత్రసముద్భవమ్‌ | ఋణత్రయ విమోక్షంచ మేనే తేన మహాత్మనా. 2

షష్ఠే%న్న ప్రాశనం తస్య కృత్వామాసి యథావిధి | తృతీయే%థతథా వర్షే చూడాకరణ ముత్తమమ్‌. 3

చకార బ్రాహ్మణా న్ద్రవైః సంపూజ్య వివిధైర్ధనైః | గోభిశ్చ వివిధైర్దానైర్యా చకా నితరా నపి. 4

వర్షే చైకాదశే తస్య మౌంజీబంధన కర్మవై | కారయిత్వా ధనుర్వేద మధ్యాపయత పార్థివః. 5

అధీతవేదం పుత్రం తం రాజధర్మ విశారదమ్‌ | దృష్ట్వా తస్యాభిషేకాయ మతిం చక్రే జనాధిపః. 6

పుష్యార్కయోగ సంయుక్త దివసే నృపసత్తమః | కారయామాస సంభార నభిషేకార్థ మాదరాత్‌. 7

ద్విజా నాహూయ వేదజ్ఞా న్సర్వశాస్త్ర విచక్షణాన్‌ | అభిషేకం చకారాసౌ విధివ త్స్వాత్మజస్య హ. 8

జల మానీయ తీర్థేభ్యః సాగరేభ్య శ్చ పార్థివః | స్వయం చకార విధివ దభిషేకం శుభే దినే. 9

ధనం దత్త్వా%థ విప్రేభ్యో రాజ్యం పుత్రే నివేశ్యసః | జగామ వన మేవాశు స్వర్గకామః స భూపతిః. 10

ఏకవీరం నృపం కృత్వా సమ్మాన్య సచివా నథ | భార్యయా సహ భూపాలః ప్రవివేశ వనం వశీ. 11

మైనాకశిఖరే రాజా కృత్వా తార్తీయ మాశ్రమమ్‌ | నిత్యం పత్రఫలాహార శ్చింత యామాస పార్వతీమ్‌. 12

ఇరువది ఒకటవ యధ్యాయము

ఏకవీరుని వనవిహారము

ఆ విధముగ రాజు బాలునకు జాతకర్మాది సంస్కారము లొనరించెను. బాలుడు పెంచబడి దినదినాభివృద్ధినందు చుండెను. రాజు పుత్రప్రాప్తివలన సంసార సుఖము లనుభవించి తాను ఋణత్రయ విముక్తుడైనట్లుగ దలంచెను. రాజు బాలుని యారవ మాసమున నన్న ప్రాశన మొనరించెను. మూడవ యేట చూడాకరణమొనరించి విప్రులను పూజించి భూరి ద్రవ్యము లొసంగి గోదానములిచ్చి సత్కరించెను. యాచకులను తనిపెను. పదునొకండవ యేట తన పుత్రున కుపనయన సంస్కారమొనరించి ధనుర్వేదము నేర్పించెను. తన పుత్రుడు వేదమునందు రాజధర్మమునందు నిష్ణాతుడగుటగాంచి రాజతనికభిషేకము చేయదలంచెను. ఆదివారమున పుష్యమీ నక్షత్రమున నభిషేకమునకు వలసిన సామగ్రి యంతయు సమకూర్చబడెను. రాజు వేదశాస్త్రపారగులగు బ్రాహ్మణులను పిలిపించి తన కుమారునకు యథావిధిగ పట్టాభిషేకము జరిపెను. అతడు పెక్కు సాగరములనుండియు తీర్థముల నుండియు పవిత్రజలములు దెప్పించి శుభదినమున తాను స్వయముగ తన పుత్రు నభిషేకించెను. అట్లు బ్రాహ్మణులకు భూరిగ ధనములొసంగి రాజ్యము తన తనయుని కొప్పగించి స్వర్గకాముడై రాజు వనముల కరిగెను. అట్లు రాజేకవీరుని రాజుగచేసి మంత్రులను సమ్మానించి తన భార్యతో నడవుల కేగెను. మైనాక గిరిపై ఆ శ్రమమేర్పరచుకొని పత్రఫలములు దినుచు శ్రీ పార్వతిని ధ్యానించు చుండెను.

ఏవం స నృపతిః కృత్వా దిష్టాంతే సహభ్యాయా | మృతో%సౌ వాసవం లోకం గతః పుణ్యన కర్మణా. 13

ఇంద్రలోకం పితా ప్రాప్త ఇతి శ్రుత్వా%థ హైహయః | చకార వేదనిర్దిష్టం కర్మ చైవౌర్ధ్వ దైవికమ్‌. 14

కృత్తోతరాః క్రియాః సర్వాః పితుః పార్థివనందనః | రాజ్యం చకార మేధావీ పిత్రా దత్తం సుసమ్మతమ్‌. 15

ఏకవీరో%థ ధర్మజ్ఞః ప్రాప్య రాజ్య మనుత్తమమ్‌ | బుభుజే వివిధా న్భోగా న్సచివైశ్చ సుమానితః. 16

ఏకస్మి న్దివసే రాజా మంత్రిపుత్రైః సమన్వితః | జగామ జాహ్నవీ తీరే హయారూఢః ప్రతాపవాన్‌. 17

సంపశ్య న్పాదపా న్రమ్యా న్కోకిలాలాపసంయుతాన్‌ | పుష్పితా న్భలసంయుక్తా న్షట్పదాళి విరాజితాన్‌. 18

మునీనా మాశ్రమా న్దివ్యా న్వేదధ్వనినినాదితాన్‌ | హోమధూమావృత్తాకాశా న్మృగశాబసమావృతాన్‌. 19

కేదారాంచ్ఛాలి సంపక్వా న్గోపికాభిః సురక్షితాన్‌ | ప్రపుల్ల పంకజారామా న్నికుంజాంశ్చ మనోరమాన్‌. 20

ప్రేక్షమానః ప్రియాలాంస్తు చంపకాన్పనసద్రుమాన్‌ | వకులాం స్తిలకా న్నీపా న్మందారాంశ్చ ప్రపుల్లితాన్‌. 21

శాలాం స్తాలం స్తమాలాంశ్చ జంబూ చూత కదంబకాన్‌ | స గచ్ఛన్‌ జాహ్నవీతోయే ప్రపుల్లం శతపత్రకమ్‌. 22

పంకజం చాతి గంధాఢ్య మపశ్య దవనీపతిః | దక్షిణ జలజస్యాథ పార్శ్వే కమలలోచనామ్‌. 23

ఆ విధముగ తన ప్రారబ్ధకర్మము ముగిసిన పిదప రాజు తన భార్యతో మరణించి పుణ్యకర్మల ఫలితముగ స్వర్గసీమ లలంకరించెను. తన తండ్రి దివంగతుడైన పిమ్మట హైహయుడు వేదోక్త ప్రాకరముగ తండ్రి కంత్యక్రియలాచరించెను. పైతృక రాజ్యమును చక్కగ నేలెను. ధర్మవిదుడై విశాల రాజ్యము పడసి మంత్రుల చేత సమ్మానములంది వివిధ భోగము లనుభవించెను. అంతనొకనాడతడు తన మంత్రి కుమారులను గూడి హయమునెక్కి పావన గంగా తీరమున కేగెను. అతడచట సుందర తరు వనములు గాంచెను. అవి గండు తుమ్మెదల ఝంకారముల నొప్పు పుష్ప మధువులతో మధుర ఫలరసములతో కోయిలల కలకల కూజనములతో సొంపుమించుచుండెను. అచట దివ్యమునుల పావనాశ్రమములుండెను. అలివేద ఘోషల మారుమ్రోతల కమ్మదనముతో నింగినంటు హోమ ధూమములతో పిల్లలేళ్ళ చెంగలింతలతో సొబగు మీరు చుండెను. అచ్చట బాగుగ పండిన కేదారశాలిధ్యానములును వానిని గాపాడు శాలిగోపికలును విప్పారిన పద్మవనములును తగిన మెత్తని పూపొదరిండ్లును సొంపు వహించుచుండెను. ఏకవీరుడు వానినెల్ల వేర్వేర తిలకించుచు చంపక పవనతరులను వికసించిన వకుళ తిలక నీపమందారములను సాల తాల తమాల జంబూ చూత కదంబతరులను పరికించుచు గంగాతోయములందు విరయబూచిన నెత్తమ్ములను గనుచు నెత్తమ్ముల నెత్తావులను గట్టి మూర్కొనెను. అంతలో కమలములకు కుడివైపున వింతకుల్కుల కమలనయన నొకతెను క్రిందికి మీదికి తేరిపార జూచెను.

కనకాభాం సుకేశీం చ కంబుగ్రీవాం కృశోదరీమ్‌ | బింబోష్ఠీం సుందరీం కించిత్సముద్యత్సుపయోధరామ్‌. 24

సునాసాం చారుసర్వాంగీ మపశ్య త్కన్యకాం నృపః | రుదతీం తాం సఖీం త్యక్త్వా విహ్వలాం దుఃఖపీడితామ్‌. 25

సా శ్రునేత్రాం క్రందమానాం విజనే కురరీ మివ | సంవీక్ష్య రాజా పప్రచ్ఛ కన్యకాం శోకకారణమ్‌. 26

సున సే బ్రూహి కా%సి త్వం కస్య పుత్రీ శుభాననే | గంధర్వీ దేవకన్యాథ కథం రోదిషి సుందరి. 27

కథ మేకా కినీ బాలే త్యక్తా కేన పికస్వరే | పతి స్తే క్వ గతః కాంతే పితా వా బ్రూహి సాంప్రతమ్‌. 28

కింతే దుఃఖ మరాలభ్రు కథయాద్య మమాంతికే | కరోమి దుఃఖనాశం తే సర్వథైవ కృశోదరి. 29

న రాజ్యే మమ తన్వంగి పీడాం కో%పికరోత్యలమ్‌ | న భయం చౌరజం కాంతే న రాక్షసభయం తథా. 30

మయి శాసతి భూపాలే నోత్పాతా దారుణాభువి | భయం న వ్యాఘ్రసింహేభ్యో న భయం కస్యచిద్భవేత్‌. 31

వద వా మోరు యస్మాత్త్వం విలాపం జాహ్నవీతటే | కరోషి త్రాణహీనా%త్ర కిం తే దుఃఖం వదస్వమే. 32

హన్మ్యహం దుఃఖ మత్యుగ్రం ప్రాణినాం పృథివీతలే | దైవం చ మానుషం కాంతే వ్రత మేత న్మమాద్భుతమ్‌. 33

విశాలలోచనే బ్రూహి కరోమి తవ చింతితమ్‌ | ఇత్యుక్తే వచనే రాజ్ఞా శ్రుత్వోవాచ మృదుస్వనా. 34

శృణు రాజేంద్ర వక్ష్యామి మమ శోకస్య కారణమ్‌ | విపత్తిరహితః ప్రాణీ కథం రుదతి భూతపే. 35

ప్రబ్రవీమి మహాబాహో యదర్థం రుదతీ త్వహమ్‌ | తవ రాజ్యా దన్య దేశే రాజా పరమ ధార్మికః. 36

రైభ్యో నామ మహారాజః సంతానరహితో భృశమ్‌ | తస్యభార్యా సువిఖ్యాతా రుక్మరేఖేతి నామతః. 37

సురూపా చతురా సాధ్వీ సర్వలక్షణసంయుతా | అపుత్రా దుఃఃతం కాంత మిత్యువాచ పునః పునః. 38

కిం జీవితేన మే నాథ ధిగ్వృథా జీవితం మమ | వంధ్యాయాః సుఖహీనాయా హ్యపుత్రాయాధరాతలే. 39

ఆ సుందరాంగి మిసమిసమను పసిడి వన్నెల చాయది - కొద్దిగ పైకి నిక్కుచున్న గుబ్బలుగలది. సుకేశి-కంబుకంఠి- బింబాధర-తలోదరి - సునాస-శోభనాంగి. ఆమె తన నెయ్యపు చెలులను వీడి విహ్వలయు దుఃఖపీడితయునై యుండెను. ఆ సులోచన ఆ రీతిగ కురరివలె నొంటిగ విలపించుట కన్నులారగాంచి యామెలోని బాధకు కారణమును రాజిట్లడిగెను : ఓ శుభాననా! నీ వెవరవు. ఎవ్వని కూతురవు గంధర్వ కన్యవా! దేవకాంతవా! సుందరీ! ఒంటిగ విలపింతువేల? కారణము చూపెట్టుము. ఓ బాలా! తోడు లేకుంటివేమి! ఓ పికస్వరా! నిన్నెవడు వదలిపెట్టెను? ఓ కాంతా! నీకాంతుడెచటికేగెను? నీ తండ్రి యెచటికేగెను? ఇక నా ముందు నీ దాపరికమేల? చెప్పుము. వంకరముంగురుల మోహనాంగీ! నేను నీ బాధ మాన్పగలను. నాతో మాటాడుము. విరిబోడీ! నా యీ రాజ్యమున నిన్ను బాధించునా డితరుడెవ్వడును లేడు. నీకు దొంగ భయము రాక్షస భీతి లేదు. నేను నరపతిని. నా యేలుబడిలో భూమిపై దారుణ విపత్తులుగాని వ్యాఘ్రసింహాదుల భయముగాని యెవ్వనికిని లేదు. దిక్కుమొక్కు లేనిదానవై యీ చల్లని గంగా తటమున విలపింతువేల? నీలోని బాధకు కారణమేమో తెలుపుము. కామినీ! ఈ భూతలమునందు దైవము వలన ప్రాణులకు సంభవించు దుఃఖములెంత తీవ్రతరములైన వైనను వానిని దొలగించుట నా వ్రతము. విశాలలోచనా! ఇక నీ మనసైన కోర్కెయేదో దాపక బైట పెట్టుము. నేను దాని నీడేర్పగలను.'' అని రాజు సానునయముగ పలుకవిని వలపులూరు పలుకులతో నామె నరపతికిట్లు పలికెను : ఓ లోకనాయకా! నా శోకకారణ మాలింపుము. ఏదైన భాధలేక యే ప్రాణియును దుఃఃంపదుగదా! ఓ మహానుబాహూ! నా శోక కారణము బయల్పఱచుచున్నాను వినుము. నీ రాజ్యముకంటె వేరొక రాజ్యముగలదు. దాని రాజు ధార్మికుడు. అతని పేరు రైభ్యుడు. అతని భార్య రుక్మరేఖయన పేరు గాంచెను. వారికి సంతులేదు. ఆ రుక్మరేఖ సుందరి - చతుర - సాధ్వి - సర్వలక్షణ లక్షిత - ఐన నామె పుత్రహీనురాలై విలపించుచు పల్మారు తన కాంతునకిట్లనెను : నాథా! నేను పుత్రసౌఖ్యమునకు నోచుకొనని గొడ్రాలను. ఈ నేలపై నేను బ్రదికి యేమి లాభము? నా బ్రతుకెండిన మ్రోడుగదా?

ఇత్యేవం భార్యయా భూపః ప్రేరితో మఖముత్తమమ్‌ | చకార బ్రాహ్మణాం స్తద్జా నాహూయ విధివత్తదా. 40

పుత్రకామో ధనం భూరి దదావథ యథోదితమ్‌ | హూయమానే ఘృతే%త్యర్థం పావకా దతి సుప్రభాత్‌. 41

ఆవిర్భభూవ చార్వంగా కన్యకా శుభలక్షణా | బింబోష్ఠీ సుదతీ సుభ్రూః పూర్ణచంద్రనిభాననా. 42

కనకాభా సుకేశాంతా రక్తపాణితలా మృదుః | సురక్తనయనా తన్వీ రక్తపాదతలా భృశమ్‌. 43

హుతాశ నాత్సముద్భూతా హోత్రా సా స్వీకృతాతదా | హోతా ప్రోవాచ రాజానం గృహీత్వాతాం సుమధ్యమామ్‌. 44

రాజన్పుత్రీం గృహాణమాం సర్వలక్షణసంయుతామ్‌ | ఏకావలీవ సంభూతా హూయమానా ద్ధుతాశనాత్‌. 45

నామ్నా చైకావలీ లోకే ఖ్యాతా పుత్రీ భవిష్యతి | సుఃతో భవ భూపాల పుత్ర్యాపుత్ర సమానయా. 46

సంతోషం కురు రాజేంద్ర! దత్తా దేవేన విష్ణునా | హోతు ర్వాక్యం నృపః శ్రుత్వా దృష్ట్వాతాం కన్యకాంశుభామ్‌. 47

జగ్రాహ పరమప్రీతో హోత్రాదత్తాం సుసమ్మతామ్‌ | గృహీత్వా నృపతి స్తాం తు దదౌ పత్న్యౌ వరాననామ్‌. 48

ఆభాష్య రుక్మరేఖాయై గృహాణ సుభ##గే సుతమ్‌ | సా తాం కమలపత్రాక్షీం ప్రాప్య కన్యాం మనోరమామ్‌. 49

జహర్ష ముదితా రాజ్ఞీ పుత్రం ప్రాప్యయథా సుఖమ్‌ | చకార మంగళం కర్మ జాతకర్మాదికం శుభమ్‌. 50

పుత్ర జన్మ సముత్థం యత్తత్సర్వం విధివత్తతః | సమాప్య చ మఖం రాజా ద్విజేభ్యో దక్షిణాం శుభామ్‌. 51

దత్త్వా విసృజ్య విప్రేంద్రా న్ముదం ప్రాప మహీపతిః | దినే దినే%సితా పాంగా పుత్ర వృద్ధ్యా భృశం బభౌ. 52

ముదం చ పరమాం ప్రాప నృపభార్యా సుతాన్వితా | ఉత్సవ స్తద్దినే తస్య ప్రవృత్తః సుతజన్మజః. 53

అను భార్యమాటలచే ప్రేరితుడై రాజు తెలిసిన విప్రులను పిలిచి గొప్ప యజ్ఞ మొనరించెను. అతడు శాస్త్రమున చెప్పిన చొప్పున గొప్పగ ధనములొసంగి ప్రజ్వరిల్లుచున్న యగ్నిజ్వాలలలో నేయి వేల్చెను. ఆ యగ్ని దేవుని నుండి యొక కన్య యావిర్భవించెను. ఆమె శుభ లక్షణ-సుందరాంగి-బింబాధర-సుదతి-చంద్రముః-అందాల కనుబొమలది. ఆమె బంగారు వన్నెలాడి - సుకేశి - ఎఱ్ఱని పాణిపాద తలములు కన్నులు గలది. ఆ విధముగ నగ్ని నుండి బయలు వెడలిన సుమధ్యయగు కన్నియను హోతలు స్వీకరించి రాజుతో నిట్లు పలికిరి : 'రాజా! సర్వలక్షణ సమన్వితయగు నీ పుత్రికని స్వీకరింపుము. రాజా! ఈమెనే హోమాగ్నినుండి యేకావళీ మాలవలె నుద్భవించెను. ఈ పుత్రిక లోకమందు నేకావళీ నామమున వాసిగాంచును. రాజా! కొడుకుగ భావించి సంతసించుము. ఈమెను విష్ణుభగవానుడే ప్రసాదించెనని సంతోషించుము'' అను హోత వాక్కులు విని రాజు శుభలోక్షణముల కన్యను గాంచెను. అట్లు హోత యీయగ రాజాబాలను మోదమలర స్వీకరించెను. ఆ చారుముఃని గైకొని తన భార్యచెంతకేగి, సౌభాగ్యవతీ! ఈ కన్నియను గైకొనుమని రాజు పలికెను. అంత రాణి కమల పత్రాక్షి మనోరమయగు ఆ బాలికను గ్రహించెను. ఆమె పుత్రోత్సాహమును బొందినంత సంతోషమందెను. వారాబాలకు జాతకర్మాది మంగళ కార్యము లొనరించిరి. పుత్రునకు జరిపించునట్లు వారు యథావిధిగ నామెకన్ని విధులు జరిపించిరి. ఆ విధముగ యజ్ఞము పూర్తిచేసి రాజు బ్రాహ్మణులకు దానదక్షిణలు గొప్పగ నొసంగెను. పిమ్మట అతడు వీడ్కోలుపలికి ముదమున నుండెను. ఆ సుందర బాలిక దిన మొక తీరుగ పుత్రుని విధముగ పెంచబడు చుండెను. అట్లు రాణి కూతును బడసి సంతోషించెను. ఆ బాలకు పుట్టిన నాటి పండుగలు జరుపబడెను.

పుత్రీ పుత్రసమాత్య%ర్థం బభూవ వల్లభాకిల | రాజ్ఞో మంత్రిసుతా చాహం సుబుద్ధే మన్మథాకృతే. 54

యశోవతీ చమే నామ సమానం మయ ఆవయోః | వయస్యా%హం కృతా రాజ్ఞా క్రీడనాయ తయాసహ. 55

సదాసహచరీ జాతా ప్రేమయుక్తా దివానిశమ్‌ | ఏకావలీ గంధవంతి యత్ర పద్మాని పశ్యతి. 56

తత్ర సా రమతే బాలా నాన్యత్ర సుఖమాప్నుయాత్‌ | సుదూరే జాహ్నవీ తీరే భవంతి కమలాన్యపి. 57

రమమాణా తత్ర యాతా మత్సమేతా సఖీయుతా | మయా నివేదితం రాజ న్పుత్రీ తే కమలాకరాత్‌. 58

ప్రేక్షమాణా%తిదూరే సా ప్రయాతి నిర్జనేవనే | నిషేధితా%థ పిత్రా%సౌ గృహే కృత్వా జలాశయాన్‌. 59

కమలా న్వాపయిత్వా%థ పుష్పితా న్ర్భమరావృతాన్‌ | తథా%పి నిర్య¸° బాలా కమలాసక్తచేతనా. 60

తదా రాజ్ఞా రక్షపాలాః ప్రేరితాః శస్త్రపాణాయః | ఏవం రక్షయుతా తన్వీ మత్సమేతా సఖీయుతా. 61

క్రీడార్థం జాహ్నవీతోయే నిత్య మాయాతి యాతిచ.

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ఏకవింశో%ధ్యాయః.

ఆ కన్యయట్లు పుత్రసమముగ నెల్లరకు ప్రియముగ పెరుగుచుండెను. ఓ మదన సుందరా! ధీశాలీ! నేనట్టి రాజు యొక్క మంత్రి కూతురను. నన్ను యశోపతి యందురు. ఆమె నేను సమవయస్కులము. ఆమెతో నాడుకొనుటకు రాజు నన్నామెకు చెలికత్తెగ నియమించెను. నేను రేబవళ్ళు నెమ్మిగదుర నామెకండగ నుందును. ఆ యేకావళి నెత్తావులు విరజిమ్ము కమలములున్న యెడ నుండును. ఆమె యచ్చోటనే యాడుకొనునుగాని వేరొకయెడ నాడుకొనదు. ఈ గంగా తటమునకు దూరముగ పెక్కు కమలములు గలవు. ఆమె నా వెంట నచటి కేగి విహరించును. నేనొకనాడు రాజుతో నిట్లంటిని : 'నీ కూతురు కమల సరోవరములు గాంచగోరును. వానిని గాంచుట కామె విజన ప్రదేశమున నెంతదూరమైన వెళ్ళును అంత రాజు తన యింటనే కొలనేర్పరచెను. రాజందు కమల వనము నాటించెను. అవి విప్పారగ వానిపై గండు తుమ్మెదల దండు మూగెను. ఐనను కమలములందలి మక్కువ కొలది రాచకన్య దూరతీరాల కేగును. అంత నామె కంగరక్షకులుగ రాజు శస్త్రపాణులను నియోగించెను. అట్లు రక్షింపబడుచు నాతో తక్కిన చెలులతో విహరించుచు ఆ బాల ప్రతిదినము గంగాతీరమునకు వచ్చి పోవుచుండును.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి షష్ఠస్కంధమం దేకవీరుని వనవిహారమను నిరువదియొకటవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters