Sri Devi Bhagavatam-1    Chapters   

శ్రీమద్దేవీ భాగవతమ్‌

అథ షష్ఠస్కంధః

అథ ప్రథమో%ధ్యాయః

ఋషయః:

 సూతసూత మహాభాగ మిష్టం తే వచనామృతమ్‌ | నతృప్తాః స్మోవయంపీత్వాద్వైపాయనకృతంశుభమ్‌. 1

పున స్త్వాం ప్రష్టుమిచ్ఛామః కథాం పౌరాణికీం శుభామ్‌ | వేదే%పి కథితాం రమ్యాం ప్రసిద్ధాం పాపనాశినీమ్‌. 2

వృత్రాసుర ఇతి ఖ్యాతో వీర్యవాంస్త్వష్టు రాత్మజః | స కథం నిహతః సంఖ్యే వాసవేన మహాత్మనా. 3

త్వష్టా వై సురపక్షీయ స్తత్పుత్త్రో బలవత్తరః | శ##క్రేణ ఘాతితః కస్మా ద్బ్రహ్మయోని ర్మహాబలః. 4

దేవాః సత్త్వగుణోత్పన్నా మానుషా రాజసాః స్మృతాః | తిర్యంచ స్తామసాః ప్రోక్తాః పురాణాగమ వాదిభిః. 5

విరోధో%త్ర మహాన్భాతి నూనం శతమఖేన హ | ఛలేన బలవా న్వృత్రః శ##క్రేణ వినిపాతితః. 6

విష్ణుః ప్రేరయితా తత్ర సతు సత్త్వధరః పరః | ప్రవిష్టః పవి మధ్యే స చ్ఛద్మనా భగవాన్‌ ప్రభుః. 7

సంధిం విహాయ సహ్యేవం మంత్రితో%సౌ మహాబలః | హరిభ్యాం సత్య ముత్సృజ్య జలఫేనేన శాతితః. 8

కృత మింద్రేణ హరిణా కిమేతత్సూత సాహసమ్‌ | మహాంతో%పి చ మోహేన వంచితాః పాపబుద్ధయః. 9

అన్యాయవర్తినో%త్యర్ధం భవంతి సురస్తమాః | సదాచారేణ యుక్తేన దేవాః శిష్టత్వ మాగతాః. 10

ఏవం విశిష్టా ధర్మేణ శిష్టత్వం కీదృశం పునః | హత్వా వృత్రంతు విశ్వస్తం శ##క్రేణ చ్ఛద్మనా పునః.11

ప్రాప్తం పాపఫలం నో వా బ్రహ్మహత్యాసముద్భవమ్‌ | కిం చ త్వయా పురా ప్రోక్తం వృత్రాసురవధః కృతః. 12

షష్ఠ స్కంధము-మొదటిఅధ్యాయము

త్రిశిరసుని తపశ్చరణము

ఋషు లిట్లనిరి : 'ఓ సూతమహామునీ! శ్రీవ్యాసముని నోట వెడలిన శ్రీదేవి దివ్యగుణామృతరస మెంతక్రోలినను మాకు తనివితీరుట లేదు. మేము పాపనాశకము-వేదవర్ణితము-సుమనోహరము-సుప్రసిద్ధమునగు శ్రీమద్దేవీ భాగవత పురాణము నింకను నీ వలన వినదలచుచున్నాము. తొల్లి విశ్వకర్మ కొడుకు వృత్రాసురు డుండెను. అతడు బలశాలి మహాత్ముడు నైన దేవేంద్రుని చేతిలో నెట్లు హతు డయ్యెను? విశ్వకర్మ దేవతల పక్షమువాడు. అతని కొడుకు విప్రకులజుడు. బలశాలి. అత డింద్రునిచేత నేల మడిసెను? సత్త్వగుణమువలన దేవతలు రజోగుణమున నరులు తమోగుణమున తిర్యగ్జంతువులును పుట్టినవని వేదపురాణవేత్తలు వక్కాణింతురు. ఇంద్రుడు శతక్రతువు. ఆతడు వృత్రుని సంహరించెను. ఇందువలన వారిర్వురికిని నేదో గొప్ప విరోధముండియుండునని తోచుచున్నది. విష్ణువు సత్త్వగుణము గలవాడు. అత డింద్రుని ప్రేరించి మోసముతో వజ్రాయుధములో దాగియుండెను. వృత్రుడు సంధి కొడంబడిన తఱి నింద్రవిష్ణులు సత్యధర్మము విడనాడి వృత్రుని నీటి నురుగుతో చంపిరి. వారిట్టి దుష్కార్య మేల చేసిరో! గొప్పవారు సైతము మోహవంచితులై పాపమతు లగుదురు. దేవతలు సైత మన్యాయమునకు పాల్పడుదురు. కాని సదాచార సంపన్నులైనవారు శిష్టులన వన్నె కెక్కుదురు. ధర్మాభ్యుదయము లేనిచో శిష్టత్వ మెట్లు గల్గును? ఇంద్రుడు వృత్రుని వంచించి చంపెను గదా! ఇంద్రునకు బ్రహ్మహత్యాపాపము చుట్టుకొనెనా లేదా? మున్ను నీవు వృత్రవధ తెల్పితివి. అది శ్రీదేవి వలన జరిగినదని యంటివి. కనుక దేవి దేవేంద్రుడు వీరిర్వురిలో వృత్రుని చంపిన వారెవరు? ఈ విషయము తెలియక మా మది సంశయమున మునుగుచున్నది.''

శ్రీదేవ్యా ఇతి తచ్చాపి చిత్తం మోహయతీహ నః | సూతః: శృణ్వంతుమునయోవృత్తంవృత్రాసురవధాశ్రయమ్‌. 13

యథేంద్రేణ చ సంప్రాప్తం దుఃఖం హత్యాసముద్భవమ్‌ | ఏవ మేవ పురా పృష్టో వ్యాసః సత్యవతీసుతః. 14

పారీక్షితేన రాజ్ఞా2పి స యదా చ తద్‌బ్రువే | కథం వృత్రాసురః పూర్వం హతోమఘవతామునే. 15

సహాయం విష్ణు మాసాద్య చ్ఛద్మనా సాత్త్వికేన హి | కథంచ దేవ్యా నిహతో దైత్యో%సౌ కేన హేతునా. 16

కథ మేకవధో ద్వాభ్యాం కృతః స్యాన్మునిపుంగవ | తదేవ చ్ఛ్రోతు మిచ్ఛామి పరం కౌతూహలం హి మే. 17

మహతాం చరితం శృణ్వ న్కో విరజ్యేత మానవః | కథయాంబావైభవం త్వం వృత్రాసురవధాశ్రితమ్‌. 18

వ్యాసః: ధన్మో%సిరాజం స్తవబుద్ధిరీదృశీజాతాపురాణశ్రవణ%తి సాదరా |

పీత్వా%మృతం దేవవరాస్తు సర్వథా పానే వితృష్ణాః ప్రభవంతివై పునః. 19

దినేదినే తే%ధికభక్తిభావః కథాసు రాజన్మహనీయకీర్తేః | శ్రోతాయదైకప్రవణఃశృతోతివక్తాతదాప్రీతమనాబ్రవీతి. 20

యుద్ధం పురా వాసవవృత్రయోర్యద్వేదేప్రసిద్ధం చతథా పురాణ |

దుఃఖం సురేంద్రేణ తథైవ లబ్ధం హత్వారిపుంత్వాష్ట్రమపాపమేవ. 21

చిత్రం కిమత్ర నృపతే హరివజ్ర భృద్భ్యాం యచ్ఛద్మనా వినిహత స్త్రిశిరో%థ వృత్రః |

మాయాబలేన మునయో%పి విమోహితాస్తే చక్రుశ్చ నింద్యమనిశం కిల పాపభీతాః. 22

విష్ణుః సదైవ కపటేన జఘాన దైత్యాన్సత్త్వాత్మ మూర్తిరపిమోహ మవాప్య కామమ్‌ |

కో%న్యో%స్తి తాం భగవతీం మనసా%పి జేతుం శక్తః సమస్త జనమోహకరీం భవానీమ్‌. 23

మత్స్యాదియోనిషు సహస్రయుగేషు సద్యః సాక్షాద్భవత్యపి యయావినియోజితో%త్ర |

నారాయణో నరసఖో భగవాననంతః కార్యం కరోతి విహితానిహితం కదాచిత్‌. 24

దేహం ధనం గృహమిదం స్వజనామదీయం పుత్రాః కళత్ర మితిమోహ ముపేత్య సర్వః |

పుణ్యం కరోత్యథ చ పాపచయం కరోతి మాయా గుణౖ రతిబలై ర్వికలీకృతో యత్‌. 25

నజాతు మోహం క్షపితుం నరః క్షమః కశ్చిద్భవేద్భూప పరావరార్థవిత్‌ |

విమోహితసై#్త స్త్రిభిరేవ మూలతో వశీకృతాత్మాజగతీతలేభృశమ్‌. 26

అథ తౌ మాయయా విష్ణువాసవౌ మోహితో భృశమ్‌ | జఘ్నతు శ్ఛద్మనా వృత్రం స్వార్థసాధనతత్పరౌ. 27

సూతు డిట్లనెను : మునులారా! వృత్రవధ వృత్తాంతమంతయును ఇంద్రుడు బ్రహ్మహత్యాపాప మనుభవించిన విధమును వినుడు. పూర్వము దీనిని గూర్చి మీ వలెనే జనమేజయుడు సత్యవతీ సుతుడగు వ్యాసు నడిగెను. వ్యాస మునివరా! మున్ను వృత్రాసురుడు దేవేంద్రునిచేత నెట్లు చంపబడెను? ఇంద్రుడు విష్ణు సాయుజ్యమంది మోసముతో వృత్రుని చంపెనా? లేక దైత్యుడు శ్రీదేవి చేతిలో చచ్చెనా? ఇద్దఱును కలిసి యొక్కని నెట్లు చంపిరో నాకు విన కుతూహలముగ నున్నది. మహాత్ముల చరితము వినువాడెవ్వడును విసుగు జెందడు. కనుక వృత్రాసురవధను దెలుపునట్టి జగన్మాత పరాక్రమ శ్రీని వివరింపుము అన వ్యాసు డిట్లనెను: జనమేజయా! దేవత లమృతము ద్రావి తృప్తి గాంతురు. నీ బుద్ధి పురాణశ్రవణ మెంత జేసినను తనివి జెందుట లేదు. నీవు కడు ధన్యుడవు. నీ యశము ప్రశంసనీయము. శ్రీదేవీకథల యెడల నీ భక్తిభావము దినదినమునకు వర్ధిల్లుచున్నది. శ్రోత యేకాగ్రతతో వినుచో వక్త తప్పక ప్రీతితో నెంతైన చెప్పదలచును. తొల్లి ఇంద్రవృత్రులకు ఘోరయుద్ధము సంఘటిల్లెను. ఇంద్రుడు విశ్వకర్మ తనయుని చంపి దుఃఖముల పాలయ్యెను. మునీంద్రులును పాపమునకు భయపడుదురు. వారును మాయామోహితులై నింద్యము లొనరింతురు. ఇంక విష్ణువాసవులు త్రిశిరోవృత్రులను వంచించి చంపుటలో చిత్ర మేమున్నది? విష్ణువు సత్యమూర్తి. ఐన నతడు ననాదియగు మాయకు లొంగి కపటముతో దానవులను సంహరించును. ఇంక సకల జగన్మోహిని-మహామాయయగు భగవతిని గెల్చుట కెవ్వ డోపును? నారాయణుడు నరసఖుడు. అతడును దేవీ నియుక్తుడై మత్స్యాది రూపములు దాల్చి మంచిచెడులు చేయుచుండును. జీవుడు మాయాగుణబద్ధుడై ధన-పశు-మిత్ర-వనితా గృహములందు దగుల్కొని పుణ్యపాపము లొనర్చుచుండును. మాయ కార్యకారణాతీతము కనుక నెంతటి కార్యకారణవిదుడైనను త్రిగుణవశుడై మోహితుడై మాయను త్రోసివేయజాలడు. కావుననే విష్ణువాసవులు మాయామోహితులై స్వార్థబుద్ధితో కపటముతో వృత్రుని దెగటార్చిరి.

తదహం సంప్రవక్ష్యామి వృత్తాంత మవనీపతే | కారణం పూర్వ వైరస్య వృత్రావాసవయో ర్మిథః. 28

త్వష్టా ప్రజాపతి ర్హ్యాసీ ద్దేవశ్రేష్ఠో మహాతపాః | దేవానాం కార్యకర్తా చ నిపుణో బ్రాహ్మణప్రియః. 29

స పుత్రం వై త్రిశిరస మింద్రద్వేషా త్కిలా%సృజత్‌ | విశ్వరూపేతి విఖ్యాతం నామ్నా రూపేణ మోహనమ్‌. 30

త్రిభిః స వదనైః శ్రేష్ఠై ర్వ్యరోచత మనోహరైః | త్రిభి ర్భిన్నాని కార్యాణి ముఖైః సమకరో న్మునిః. 31

వేదా నేకేన సో%ధితే సురాం చైకేన సో%పిబత్‌ | తృతీయేన దిశాః సర్వా యుగపచ్చ నిరీక్షతే. 32

త్రిశిరా భోగ ముత్సృజ్య తపశ్చక్రే సుదుష్కరమ్‌ | తపస్వీ స మృదుర్దాంతో ధర్మమేవ సమాశ్రితః. 33

పంచాగ్నిసాధనం కాలే పాదపాగ్రేనివేశనమ్‌ | జలమధ్యే నివాసం చ హేమం తే శిశిరే తథా. 34

నిరాహారో జితాత్మా%సౌ త్యక్త సర్వపరిగ్రహః | తప శ్చచార మేధావీ దుష్కరం మందబుద్ధిభిః.35

తం చ దృష్ట్వా తపస్యంతం భేదమాప శచీపతిః | విషాద మగమత్తత్ర శక్రో2యం మాస్మభూదితి. 36

దృష్ట్వా తస్య తపోవీర్యం సత్యం చామితతేజసః | చింతాం చ మహతీం ప్రాప హ్యనిశం పాకశాసనః. 37

వివర్ధమాన స్త్రిశిరా మా మయం శాతయిష్యతి | నోపేక్ష్యః సర్వథా శత్రు ర్వర్ధమానబలో బుధైః. 38

తస్మా దుపాయః కర్తవ్య స్తపోనాశాయ సాంప్రతమ్‌ | కామ స్తు తపసాం శత్రుః కామా న్నశ్యతి వై తపః. 39

తథైవాద్య ప్రకర్తవ్యం భోగాసక్తో భ##వేద్యథా | ఇంతి సంచింత్య మనసా బుద్ధిమా న్బలమర్దనః. 40

ఇంద్ర వృత్రుల పూర్వ వైరకారణము వినిపింతును. వినుము. త్వష్ట ప్రజాపతి మహాతపస్వి దేవబ్రాహ్మణ ప్రియుడు సురశ్రేష్ఠుడు దేవకార్య నిర్వాహకుడు. అతడు చతురుడగు అమరశిల్పి. అతడింద్రునిమీది పగవలన త్రిశిరసుడు విశ్వరూపుడునను పేర్లుగల చక్కని కొడుకును గనెను. త్రిశిరసుడు చక్కని మూడుమొగములతో భిన్నకార్యములొనర్చుచుండెను. అతడొకేసారి యొక ముఖముతో వేదపఠనము వేరొక దానితో సురాపానము మరొక్క దానితో దెసలు పరికించుట చేయుచుండెను. ఆ కోమలాంగుడు ధర్మదమము లాశ్రయించి భోగములుడిగి తీవ్రతపమొనర్చెను. అతడు పంచాగ్నుల మధ్యమునను చెట్టు చివరలందును హేమంత శిశిరములందు నీటి నడుమనుండియు తపమొనర్చెను. ఇట్లతడు తెల్వితో నిరాహారుడై జితాత్ముడై పరిగ్రహము లన్నిటిని విడనాడి దుష్కరమగు ఘోరతపమొనర్చెను. ఇంద్రుడతనిని గని యతడింద్రపదవిని గాంచునేమోయని విషాదగ్రస్తుడయ్యెను. అతని సత్వ తేజము తపశ్శక్తిగాంచి యింద్రుడిట్లు చింతాక్రాంతుడయ్యెను. త్రిశిరసుడు పెరిగి చివరకు నన్ను వధింపగలడు. కావున పండితుడెన్నడును శత్రువర్ధనము నుపేక్షింపరాదు. ఇపుడతని తపోభంగమునకు యత్నింపవలయును. తపమునకు కామము శత్రువు కనుక తపము కామము వలన నశింపగలదు. అతనిని భోగాసక్తునిగ జేయవలయును అని యింద్రుడు దలచెను.

ఆజ్ఞాపయ త్సోప్సరస్త్వాష్ట్రపుత్ర ప్రలోభ##నే | ఊర్వశీం మేనకాం రంభాం ఘృతాచీం చ తిలోత్తమామ్‌. 41

సమాహూయా2బ్రవీచ్ఛక్ర స్తా స్తదా రూపగర్వితాః | ప్రియం కురుధ్వం మే సర్వాః కార్యే%ద్య సముపస్థితే. 42

యత్తో మే%ద్య మహాన్‌ శత్రు స్తపస్తపతి దుర్జయః | కార్యం కురుత గచ్ఛధ్వం ప్రలోభయత మాచిరమ్‌. 43

శృంగారవేషై ర్వివిధై ర్హావైర్దేహ సముద్భవైః | ప్రలోభయత భద్రం వః శమయధ్వం జ్వరం మమ. 44

అస్వస్థో%హం మహాభాగా స్తస్యజ్ఞాత్వా తపోబలమ్‌ | బలవానాసనం మే%ద్య గ్రహీష్య త్యవిలంబితః. 45

భయం మే సముపాయాతం క్షిప్రం నాశయతా%బలాః | ఉపకుర్వంతు సహితాః కార్యే%ద్య సముపస్థితే. 46

తచ్ఛ్రుత్వా వచనం నార్య ఊచుస్తం ప్రణతాః పురః | మా భయం కురు దేవేశ యతిష్యామః ప్రలోభ##నే. 47

యథా నస్యా ద్భయం తస్మాత్తథా కార్యం మహాద్యుతే | నృత్యగీతవిహరైశ్చ మునే స్తస్య ప్రలోభ##నే. 48

కటాక్షై రంగభేదైశ్చ మోహయిత్వా మునిం విభో | లోలుపం వశ మస్మాకం కరిష్యామో నియంత్రితమ్‌. 48

అతనిని కామమోహితునిగ జేయుట కింద్రుడూర్వశి మేనక-రంభ-ఘృతాచి తిలోత్తమలను రావించెను. వారు రూపగర్వితులు. ఇంద్రుడు వారికిట్లనెను : నాకిపుడొక కార్యము ఏర్పడినది. మీరు నాకిపుడు ప్రియుము గూర్చవలయును. నాకొక గొప్ప శత్రువు గలడు. అతడు ఘోరముగ తపము చేయుచున్నాడు. మీరచటికేగి యతని తపమును భంగపఱచుడు. మీరు వివిధ శృంగార వేషములు దాల్చి మీమీ వంపుసొంపులతో హావభావ విలాసములతో నతనిని మోహపెట్టుడు. నా యెదలోని కుందు మాన్పుడు, మీకు మేలగుత, ఓ యచ్చరలారా! వాని తపోబలము వలన నేనస్వస్థుడనైతిని. అతడు వెంటనే నా యింద్రాసనము చేజిక్కించుకొన జూచుచున్నాడు. కనుక నా భయముడిపి నా పనినెరవేర్చి నాకు పకారము సేయుడు అను నింద్రుని మాటలు విని వారు నమస్కరించి యిట్లనిరి : దేవేశ! భయపడకుము. అతనిని మోహవశుని చేయుటకు యత్నింపగలము. నీ భయము తొలగునట్లుగ మా నృత్యగీత విహారాదులచే మేమతనిని ప్రలోభింపజేతుము. మా కడగంటి చూపులతో అంగవిన్యాస విశేషములతో నతనిని ప్రలోభ##పెట్టి మా కైవసము చేసికొందుము.

ఇత్యాభాష్యహరిం నార్యో యయుస్త్రి శిరసో%ంతికమ్‌ | కుర్వంత్యో వివిధా న్భావా న్కామశాస్త్రోచితానపి. 50

గాయంత్యస్తాలభేదైస్తానృత్యంత్యః పురతోమునేః | తంప్రలోభయితుం చక్రు ర్నానాభావాన్వరాంగనాః. 51

నా2పశ్యత్స తపోరాశిరంగనానాం విడంబనమ్‌ | ఇంద్రియాణి వశేకృత్వామూకాంధబధిరః స్థితః. 52

దినాని కతిచిత్త స్థుర్నార్యస్తస్యాశ్రమే వరే | కుర్వంత్యో గాననృత్యాది ప్రపంచానతిమోహదాన్‌. 53

నచచాల యదా కామం ధ్యానాచ్చత్రిశిరా మునిః | పరావృత్యతదాదేవ్యః పునః శక్రముపస్థితాః. 54

కృతాంజలిపుటాః సర్వా దేవరాజమథా%బ్రువన్‌ | శ్రాంతా దీనాభయత్రస్తా వివర్ణవదనాభృశమ్‌. 55

దేవదేవమహారాజ యత్నశ్చ పరమః కృతః | న స శక్యో దురాధర్షోధైర్యాచ్చాలయితుం విభో. 56

ఉపాయో%న్యః ప్రకర్తవ్యః సర్వథా పాకశాసన | నా%స్మాకం బల మేతస్మిం స్తాపసే విజితేంద్రియే. 57

దిష్ట్యా వయం న శప్తాః స్మ యదనేన మహాత్మనా | మునినా వహ్ని తుల్యేన తపసా ద్యోతితేన హి. 58

విసృజ్యా%ప్సరసః శక్ర శ్చింతయామాస మందధీః | తసై#్యవ చ వధోపాయం పాపబుద్ధి రసాంప్రతమ్‌. 59

విసృజ్య లోకలజ్జాం స తథా పాపభయం భృశమ్‌ | చకార పాపబుద్ధిం తు తద్వధాయ మహీపతే. 60

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ప్రథమో%ధ్యాయః.

అని వారు త్రిశిరునికి మిక్కిలి చేరువగ నేగిరి. కామశాస్త్రమున చెప్పిన చొప్పున తమలోని వంపు సొంపులను వలపు బింకములను వారు బయట పెట్టిరి. వారాముని ముందట తాళగతులతో నాడిరి. రాగభావములు వెల్లడించిరి. అతనిని మోహపెట్ట యత్నించిరి. కాని యా తపోనిధి వారి విలాసములను కన్నెత్తియైనను జూడలేదు. అతడింద్రియములు విగ్రహించుకొని చెవిటి - మూగ - చీకు పగిది నుండెను. ఆ విలాసినులు మున్యాశ్రమములో మోహకరములగు నృత్యగానములు సల్పుచు కొన్ని దినములు గడిపిరి. కాని వారు త్రిశిరుని మనస్సును ధ్యాననిష్ఠనుండి చలింప జేయలేక తిరిగి యింద్రుని చెంత కేగిరి. వారు దీనముగ భయముతో వెలవెలబోయి చేతులు మోడ్చి యింద్రుని కిట్లనిరి : 'దేవ దేవా! మహారాజా! మేము మా శక్తి కొలది ప్రయత్నించి చూచితిమి - కాని మునీశు నాత్మధైర్యమును చలింపజేయలేకపోతిమి. మాకు విజితేంద్రియుని చలింపజేయుశక్తి లేదు. కనుక వేరొక యుపాయ మాలో చింపుము. ఆ నిప్పువంటి మహాముని మా యదృష్టవశమున మమ్ము శపింప కూరకుండెను. అది విని ఇంద్రుడు వారిని పంపివేసెను. మందమతి పాపబుద్ధియగు నింద్రు డతనిని చంపు నుపాయము తలపోసెను. ఇంద్రుడు లోకనింద పాపభీతి విడనాడి త్రిశిరుని వధింప నిశ్చయించుకొనెను.

ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి షష్ఠస్కంధమందు త్రిశిరుని తపోమహిమమను ప్రథమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters