Varahamahapuranam-1    Chapters   

అష్టవింశో7ధ్యాయః - ఇరువది యెనిమిదవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లు పలికెను.

కథం మాయా సముత్పన్నా దుర్గా కాత్యాయనీ శుభా,

ఆదిక్షేత్రే స్థితా సూక్ష్మా పృథగ్మూర్తా వ్యజాయత. 1

మాయారూపిణి కాత్యాయని దుర్గ, మంగళరూప యెట్లు ఉదయించెను? ఆమె మొదటి స్థితిలో సూక్ష్మరూపముతో ఉండెను గదా! వేరు స్వరూపముతో ఎట్లు ఆవిర్భవించెను?

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

ఆసీద్‌ రాజా పురా రాజన్‌ సింధుద్వీపః ప్రతాపవాన్‌,

వరుణాంశో మహారాజ సోరణ్య తపసి స్థితః. 2

రాజా! మునుపు సింధుద్వీపుడను గొప్పప్రతాపముగల రాజుండెను. ఆతడు వరుణుని అంశముతో పుట్టినవాడు. అరణ్యమున తపస్సున నెలకొని యుండెను.

పుత్రో మే శక్రనాశాయ భ##వేదితి నరాధిపః

ఏవం కృతమతిః సోథ మహతా తపసా స్వకమ్‌,

కలేవరం స్థితో భూత్వా శోషయామాస సువ్రత. 3

ఆరాజు నాకుమారుడు ఇంద్రుని నశింపజేయు వలయునని నిశ్చయించి గొప్పతపస్సుతో తన దేహమును ఎండగట్టెను.

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లనెను.

కథం తస్య ద్విజశ్రేష్ఠ శ##క్రేణాపకృతం భ##వేత్‌,

యేనా సౌ తద్వినాశాయ పుత్ర మిచ్ఛన్‌ వ్రతే స్థితః. 4

బ్రహ్మనవరేణ్యా! ఆతనికి ఇంద్రునివలన అపకారమెట్లు సంభవించెను? దానితో గదా ఆతడు ఇంద్రుని చంపు పుత్రుని గోరుచు తపమున నిలిచెను.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

సోన్యజన్మని పుత్రో భూత్‌ త్వష్టు ర్బలభృతాం వరః,

అవధ్యః సర్వశ##స్త్రేషు అపాం ఫేనేన నాశితః. 5

ఆతడు పూర్వజన్మమున త్వష్టుడను వాని కొడుకు. గొప్ప బలము గలవాడు. ఏ ఆయుధములకు చావనివాడు. నీటిప నురుగుతో ఇంద్రునివలన మరణించెను.

జలఫేనేన నిహత స్తస్మిన్‌ లయ మవాప్తవాన్‌,

పున ర్బ్రహ్మాన్వయా జ్జాతః సిన్ధుద్వీపేతి సంజ్ఞితః,

సతేపే పరమం తీవ్రం శక్రవైర మనుస్మరన్‌. 6

ఆతడు నీటినురుగుతో మడిసి యందు లయము పొందెను. తిరిగి బ్రహ్మణవంశమున పుట్టి సంధుద్వీపుడను పేరుగల వాడాయెను. ఆ ఇంద్రుని తోడి పగను మరవక ఆతడు ఘోరమైన తాపస్సు గావించెను.

తతః కాలేన మహతా నదీ వేత్రవతీ శుభా,

మానుషం రూపమాస్థాయ సాలంకారం మనోరమమ్‌,

ఆజగామ యతో రాజా తేపే పరమకం తపః. 7

అంత పెద్దకాలమునకు వేత్రవతి యనునది చక్కని అలంకారములు, అందచందములు గల మునుష్యవేషము తాల్చి ఆరాజు తపము చేయుచున్న తావునకు వచ్చెను.

తాం దృష్ట్వా రూపసంపన్నాం సరాజా క్రుద్ధమానసః,

ఉవాచ కాసి సుశ్రోణి సత్యం కథయ భామిని. 8

చక్కని రూపసంపదగల ఆకాంతను గాంచి రాజు కోపముతో మండిపడి ఓ భామినీ! నీవెవరవు? నిజము చెప్పుమని యడిగెను.

నద్యువాచ - నది పలికెను.

అహం జలపతేః పత్నీ వరుణస్య మహాత్మనః,

నామ్నా వేత్రవతీ పుణ్యా త్వామిచ్ఛన్తీహ మాగతా. 9

నేను మహాత్ముడు, జలాధిదేవతయునగు వరుణుని పత్నిని. పేరు వేత్రవతి. పుణ్యురాలను. నిన్ను కామించి యిటకు వచ్చితిని.

సాభిలాషాం పరస్త్రీం చ భజమానాం విసర్జయేత్‌,

సపాపః పురుషో జ్ఞేయో బ్రహ్మహత్యాం చ విన్దతి,

ఏవం జ్ఞాత్వా మహారాజ భజమానాం భజస్వమామ్‌. 10

కోరివచ్చినదియు, తన్ను సేవించునదియునగు ఇంతి పరస్త్రీ అయినను ఆమెను వదలి వైచు మనుజుడు పాపుడగును. బ్రహ్మహత్యాపాతకమందును. ఇది యెరిగి నిన్ను కోరిన నన్ను పొందుము.

ఏవ ముక్తస్తయా రాజా సాభిలాషోపభుక్తవాన్‌,

తస్య సద్యోభవత్‌ పుత్రో ద్వాదశార్క సమప్రభః. 11

ఇట్లు ఆమె పలుకగా రాజు అభిలాషతో ఆమె ననుభవించెను. వెనువెంటనే ఆతనికి పండ్రెండుగురు సూర్యులకు దీటైన కాంతిగల కొడుకు పుట్టెను.

వేత్రవత్యుదరే జాతో నామ్నా వైత్రాసురోభవత్‌,

బలవానతితేజస్వీ ప్రాగ్జ్యోతిషపతి ర్భవత్‌. 12

వేత్రవతి కడుపున పుట్టెను గనుక వాడు వైత్రాసురుడయ్యెను. గొప్పబలము, దొడ్డతేజముగల ఆతడు ప్రాగ్జ్యోతిషమునకు ఏలిక యయ్యెను.

సకాలేన యువా జాతో జలవాన్‌ దృధవిక్రమః,

మహాయోగేన సంయుక్తో జిగా యేమాం వసుంధరామ్‌. 13

కొంతకాలమునకు ఆతడు యువకుడు, బలపరాక్రమములు గలవాడునై పెద్దయోగము కలసిరాగా ఈ భూమిని గెలిచెను.

సప్తద్వీపవతీం పశ్చాన్మేరు పర్వత మారుహత్‌,

తత్రేన్ద్రం ప్రథమం జిగ్యే పశ్చాదగ్నిం యమం తతః,

నిరృతిం వరుణం వాయుం ధనదం చేశ్వరం తతః. 14

ఇట్లు ఏడుద్వీపములుగా నున్న భూమినంతటిని గెలిచి పిదప మేరుపర్వతము నెక్కెను. అందు మొదట ఇంద్రుని తరువాత అగ్నిని, అటుపై యముని, నిరృతిని, వరుణుని, వాయువు, కుబేరుని, ఈశానుని వరుసగా గెలిచెను.

ఇన్ద్రో భగ్నో గతః సోగ్ని మగ్ని ర్భగ్నో యమంయ¸°

యమో నిరృతి మాగచ్ఛ న్నిరృతి ర్వరుణం య¸°. 15

ఇన్ద్రాదిభి రుపేతస్తు వరుణో వాయు మన్వగాత్‌,

వాయు ర్దనపతిం త్వాగాత్‌ సర్వై రిన్ద్రాదిభిః సహ. 16

ఇంద్రుడు దెబ్బతిని అగ్నికడకరిగెను. అగ్నిఓడి యముని జేరబోయెను. యముడు నిరృతికడకు వచ్చెను. నిరృతి వరుణుని చేరెను. ఇంద్రాదులతో కూడిన వరుణుడు వాయువు నాశ్రయించెను. వాయువు కుబేరుని కడ కరిగెను.

ధనదోపి స్వకం మిత్ర మీశం దేవసమన్వితః,

ఇయాయ గదయా సోపి దానవో బలదర్పితః,

గదామాదాయ దుద్రావ శివలోకం ప్రతి ప్రభో. 17

కుబేరుడు దేవతలతోకూడి ఒకగదచేపట్టి తనమిత్రుమగు ఈశానుని చేరుకొనెను. బలముతో కనుగానని ఆ దానవుడు గదను లాగుకొని వానిని శివలోకమునకు తరిమెను.

శివోప్యవధ్యం తంమత్వాదేవాన్‌ గృహ్యయ¸° పురీమ్‌,

బ్రహ్మణః సురసిద్ధాధ్యై ర్వన్దితాం పుణ్యకారిభిః. 18

శివుడును, ఆరాక్షసుడు చంపరానివాడని తలపోసి దేవతలను గైకొని, సురలు, సిద్ధులు మొదలగు పుణ్యవంతులు కొనియాడు బ్రహ్మనగరి కరిగెను.

తత్ర బ్రహ్మా జగత్ర్సష్టా విష్ణు పాదోద్భవే జలే,

నియామితా కాశగతో జపత్యన్త ర్జలే శుభే,

క్షేత్రజ్ఞమాయాం గాయత్రీం తతో దేవా విచుక్రుశుః. 19

జగత్తులను సృష్టిచేయు బ్రహ్మ అచట విష్ణు పాదములందు పుట్టిన పవిత్ర జలము లోపలి భాగమున ఆకాశమును ఏర్పాటు చేసికొని క్షేత్రజ్ఞుడగు పరమాత్మ మాయయగు గాయత్రిని జపించుచుండెను. అంత దేవతలు పెద్దగా దుఃఖముతో అరచిరి.

త్రాహి ప్రజాపతే సర్వాన్‌ దేవా నృషివరానపి,

అసురార్భయ మాపన్నాన్‌ త్రాహిత్రాహీ త్యచోదయన్‌. 20

ప్రజాపతీ! కాపాడు. రక్కసునివలన భయము పొందిన దేవతలను, ఋషివరులను కాపాడు, కాపాడు అని తొందర చేసిరి.

ఏవముక్త స్తదా బ్రహ్మా దృష్ట్వా దేవాం స్తదాగతాన్‌,

చిన్తయామాస దేవస్య మాయేయం వితతం జగత్‌,

నాసురా న సురాశ్చాత్ర మాయేయం కీదృశీ మతా. 21

అంత బ్రహ్మ అట్లు వచ్చిన దేవతలందరును గాంచి ఇదియంతయు దేవుని మాయ. జగత్తంతయు దీనితో నిండినది. ఇచట రక్కసులు లేరు. దేవతలు లేరు. ఇదియెట్టి మాయయోకదా! అని తలపోసెను.

ఏవం చిన్తయత స్తస్య ప్రాదురాసీ దయోనిజా.

శుక్లామ్బరధరా కన్యా స్రక్కిరీటోజ్జ్వలాననా,

అష్టభి ర్భాహుభి ర్యుక్తా దివ్య ప్రహరణోద్యతా. 22

ఆత డిట్లు భావించుచుండగా ఆతనిముందు ఒక కన్య ప్రత్యక్షమాయెను. ఆమె స్త్రీ గర్భమున పుట్టినది కాదు. తెల్లని వస్త్రములను ధరించి యుండెను. పూమాలతో కిరీటములతో ఆమె మోము వెలుగొందుచుండెను. ఆమె యెనిమిది చేతులతో, దివ్యములగు ఆయుధములు తాల్చి యుండెను.

చక్రం శఙ్ఞం గదాం పాశం ఖడ్గం ఘణ్టాం తథా ధనుః,

ధార్తయన్తీ తథాచాన్యాన్‌ బద్ధతూణాం జలాద్బహిః. 23

నిశ్చక్రామ మహదేవి సింహవాహన వేగితా,

యుయుధే చాసురాన్‌ సర్వానేకైవ బహుధా స్థితా. 24

చక్రము, శంఖము, గద, పాశము, ఖడ్గము, ఘంట, విల్లు అనువానిని మరియు ఇతర ఆయుధములను చేపట్టి అమ్ములపొది కట్టుకొని నీటినుండి వెలువడి ఆమహాదేవి సింహవాహనయై వడివడిగా వచ్చెను. ఒక్కతెయే పెక్కురూపములు తాల్చి రక్కసు లందరితో పోరుసల్ఫెను.

దివ్యం వర్షసహస్రం తు దివ్యై రసై#్త్రర్మహాబలమ్‌,

యుద్ధ్వా కాలాత్యయే దేవ్యా హతో వైత్రాసురో రణ,

తతః కిలకిలాశబ్దో దేవసైన్యేభవన్మహాన్‌. 25

దేవతల వేయిసంవత్సరముల కాలము, దివ్యములగు అస్త్రములతో ఆ మహాబలునితో ఆదేవి యుద్ధము చేసెను. అట్లు పోరి కొంతకాలము గడచినపిదప ఆవైత్రాసురుని రణమున చంపివైచెను. అంత దేవతలసేనయందు కిలకిలా రావములు పెద్దపెట్టున చెలరేగెను.

హతే వైత్రసురే భీమే తదా సర్వే దివౌకసః,

ప్రణము ర్జయ యుద్ధేతి స్వయ మీశః స్తుతిం జగౌ. 26

అట్లు భయంకరుడగు వైత్రాసురుడు చావగా స్వర్గవాసులందరు గెలువుము. పోరుము అని ఆమెను ప్రశంసించుచు ప్రణమిల్లిరి. స్వయముగా ఈశ్వరుడు ఇట్లు స్తుతిచేసెను.

మహేశ్వర ఉవాచ - మహేశ్వరుడిట్లు పలికెను.

జయస్వదేవి గాయత్రి మహామాయే మహాప్రభే,

మహాదేవి మహాభాగే మహాసత్త్వే మహోత్సవే. 27

దేవీ! గాయత్రీ! మహామాయా! మహాప్రభా! మహాదేవి! గొప్ప శక్తియు, గొప్ప ఆనందముగల ఓ పుజ్యులారా! జయము గొనుము.

దివ్యగన్ధాను లిప్తాఙ్గి దివ్యస్రగ్ధామభూషితే,

వేదమాత ర్నమ స్తుభ్యం త్రక్ష్యరస్థే మహేశ్వరి. 28

దివ్యములగు గంధముల పూతగల దేహముతో, దివ్యములగు పూలమాలలతో అలరారు మహేశ్వరీ! మూడక్షరములందున్న ఓ వేదమాతా! నీకు నమస్సులు. (మూడక్షరములు - ఓంకారము)

త్రిలోకస్థే త్రితత్త్వస్థే త్రివహ్నిస్థే త్రిశూలిని,

త్రినేత్రే భీమవక్త్రే చ భీమనేత్రే భయానకే,

కమలాసనజే దేవి సరస్వతి నమోస్తు తే. 29

మూడులోకములందును మూడుతత్త్వములందును మూడగ్నులయందును నెలకొనియున్న ఓ త్రిశూలధారిణీ! మూడుకన్నులు, భయము గొలుపు మోము, భయము గొలుపు కన్నులు గలిగిన భయంకర స్వరూపిణీ! కమలము ఆసనముగా గల బ్రహ్మవలన పుట్టిన ఓ సరస్వతీదేవి! నీకు నమస్కారము.

నమః వఙ్కజ పత్రాక్షి మహామాయేమృత స్రవే,

సర్వగే సర్వభూతేశి స్వాహాకారే స్వధేమ్బికే. 30

పద్మపత్రముల వంటి కన్నులుగల ఓ మహామాయా! అమృతమును జాలువార్చు ఓ దేవీ! అంతట నిండినతల్లీ! సర్వభూతములకు ఏలికయైనమాతా! స్వాహాకారస్వరూపిణీ! స్వధారూపిణీ! అంబికా! నీకు నమస్సు.

సంపూర్ణే పూర్ణచంద్రాభే భాస్వరాఙ్గే భవోద్భవే,

మహావిద్యే మహావేద్యే మహాదైత్యవినాశిని,

మహాబుద్ధ్యుద్భవే దేవి వీతశోకే కిరాతిని. 31

సంపూర్ణా! పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతిగలదానా! తళతళలాడు దేహకాంతిగలదేవీ! భవుని పుట్టుకకు కారణమైన తల్లీ! మహావిద్యాస్వరూపిణీ! జ్ఞాన స్వరూపిణీ! మహాదైత్యులను రూపుమాపు కరుణామయీ! శోకములేని ఆనందరూపా! పర్వతరాజపుత్రీ! నీకు నమస్కారము.

త్వం నీతి స్త్వం మహాభాగే త్వం గీస్త్వం గౌ స్త్వమక్షరమ్‌,

త్వంధీ స్త్వం శ్రీ స్త్వమోఙ్కార స్తత్తేచాపి పరిస్థితా,

సర్వసత్త్వహితే దేవి నమస్తే పరమేశ్వరి. 32

ఓ దేవి! నీవునీతివి. నీవు వాక్కు. నీవు భూమివి. నీవు అక్షరమవు. నీవు బుద్ధిస్వరూపిణివి. నీవు లక్ష్మీదేవివి. నీవు ఓంకారమవు. నీవు తత్వమున నిలిచియున్నదానవు. సర్వప్రాణులకు హితము చేయు దానవు. ఓ పరమేశ్వరీ! అట్టినీకు నమస్కారము.

ఇత్యేవం సంస్తుతా దేవీ భ##వేన పరమేష్ఠినా,

దేవై రపి జయేత్యుచ్చైరిత్యుక్తా పరమేశ్వరీ. 33

పరమేశ్వరుడగు శివు డిట్లు ఆదేవిని సంస్తుతించెను. దేవత లందరును జయ జయనాదములు ఆ పరమేశ్వరిని గూర్చి పెద్దగా చేసిరి.

యావదాస్తే చతుర్వక్త్ర స్తావదన్త ర్జలాద్‌ బహిః,

నిశ్చక్రామ తతో దేవీం కృతకృత్యాం దదర్శ సః. 34

ఆ బ్రహ్మదేవుడు నీటినుండి వెలుపలికి వచ్చి కార్యము నెరవేరిన ఆ దేవిని దర్శించుకొనెను.

తాం దృష్ట్వా దేవకార్యం చ సిద్ధిం మత్వా పితామహః,

భవిష్యం కార్య ముద్ధిశ్య తతో వచన మబ్రవీత్‌. 35

బ్రహ్మ ఆమెను గాంచి దేవకార్యము నెరవేరినదని తలచి రాబోవు కార్యమును గూర్చి యిట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను.

ఇయం దేవీ వరారోహో యాతు శైలం హిమోద్భవమ్‌,

తత్ర యూయం సురాః సర్వే గత్వా నన్దత మాచిరమ్‌. 36

ఈ దేవి హిమవత్పర్వతమునకు అరుగుగాక! దేవతలారా! మీరందఱుకూడ నచట కరిగి ఆనంద మందుడు. ఆలసింపకుడు.

నవమ్యాం చ సదా పూజ్యా ఇయం దేవీ సమాధినా,

వరదా సర్వలోకానాం భవిష్యతి స సంశయః. 37

ఈ దేవిని ఏకాగ్రబుద్ధితో నవమినాడు పూజింపవలయును. అట్లు ఆమె సర్వలోకములకు వరముల నొసగునది యగుచు. సంశయములేదు.

నవమ్యాం యశ్చ పిష్టాశీ భవిష్యతి హి మానవః,

నారీ వా తస్య సంపన్నం భవిష్యతి మనోగతమ్‌. 38

నవమినాడు మగవాడు కాని, స్త్రీకాని, పిండిభోజనము నియమముగా చేసికొని యీమె నర్చించినచో మనసులోని కోరిక తీరును.

యశ్చ సాయం తథా ప్రాత రిదం స్తోత్రం పఠిష్యతి,

త్వయేరితం మహాదేవ తస్యదేవ్యా సమం భవాన్‌. 39

వరదో దేవ సర్వాసు ఆపత్స్వప్యుద్ధరస్వతమ్‌,

ఓ మహాదేవా! నీవు పలికిన ఈ స్తోత్రమును ఉదయ సాయంకాలములలో పఠించువానికి నీవు దేవితో పాటు వరముల నొసగుము. ఆపదలన్నింటినుండియు వాని నుద్ధరింపుము.

ఏవముక్త్వా భవం బ్రహ్మా పునర్దేవీం సచాబ్రవీత్‌. 40

ఇట్లు శివునితో పలికి బ్రహ్మమరల దేవితో నిట్లనెను.

త్వయా దేవి మహత్కార్యం కర్తవ్యం చాన్య దస్తి నః.

భవిష్యం మహిషాఖ్యస్య అసురస్య వినాశనమ్‌. 41

దేవీ! నీవు మాకు చేయవలసిన మరియొక ఘనకార్యము కలదు. మహిషుడను రక్కసుని వినాశనమును నీవు భవిష్యత్తున చేయవలయును.

ఏవముక్త్వా తతో బ్రహ్మాసర్వే దేవా శ్చ పార్థివ,

యథాగతం తతో జగ్ముర్దేవీం స్థాప్య హిమే గిరౌ,

సంస్థాప్య నన్దితా యస్మాత్‌ తస్మా న్నన్దాభవత్‌ తు సా. 42

బ్రహ్మయిట్లు పలుకగా సర్వదేవతలును ఆయనను హిమగిరి యందు ప్రతిష్ఠించి తమతమ నెలవుల కిరిగిరి. ఆమెనట్లు ప్రతిష్ఠించి వారందరు ఆనందము పొందుట వలన ఆమెకు 'నంద' యను పేరు కలిగెను.

యశ్చేదం శృణుయాజ్జన్మ దేవ్యా యశ్చ స్వయం పఠేత్‌,

సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణ మృచ్ఛతి. 43

ఈ దేవి జన్మకథను వినువాడును, తనకుతాను, పఠించు వాడును సర్వపాపములనుండి విముక్తుడగును. మోక్షము నొందును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్ఠావింశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువదియెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters