Varahamahapuranam-1    Chapters   

ద్వాదశోధ్యాయః - పండ్రెండవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవ డిట్లు చెప్పెను.

తతః పుత్రం రథాఙ్గాగ్ని దగ్ధం శ్రుత్వా నృపోత్తమః,

సుప్రతీకః ప్రతీతాత్మా చిన్తయామాస పార్థివః,

తస్య చిన్తయత స్త్వేవం తదా బుద్ధి రజాయత. 1

అంతట సుప్రతీకమహారాజు విష్ణువుచేతి చక్రమునగ్నికి తన కొడుకు బూదియైన వార్త విని చింతించెను. అట్లు చింతించు చుండగా ఆతని కిట్లు బుద్ధిపొడమెను.

చిత్రకూటే గిరౌ విష్ణుః సదా రామేతి కీర్త్యతే,

తతోహం రామసంజ్ఞేన నామ్నా స్తౌమి జగత్పతిమ్‌. 2

చిత్రకూటమను పేరుగల పర్వతమున విష్ణువును రాముడను నామముతో జనులు కొనియాడుదురు. కావున నేను రామ నామముతో జగత్పతిని స్తుతించెదను.

సుప్రతీక ఉవాచ - సుప్రతీకు డిట్లు పలికెను.

నమామి రామం నరనాథ మచ్యుతం

కవిం పురాణం త్రిదశారినాశనమ్‌,

శివస్వరూపం ప్రభవం మహేశ్వరం

సదా ప్రపన్నార్తిహరం ధృతశ్రియమ్‌.

నరనాథుడు, అచ్యుతుడు, కవి, పురాతనుడు, రాక్షసులను రూపుమాపినవాడు, మంగళస్వరూపడు, సమర్థుడు, మహేశ్వరుడు, ఎల్లవేళల శరణుపొందిన వారి ఆర్తిని పోకార్చువాడు, లక్ష్మీదేవికి ఆశ్రయమైనవాడు అగు శ్రీరామచంద్రునకు మ్రొక్కెదను.

భవాన్‌ సదా దేవ సమస్త తేజసాం

కరోషి తేజాంసి సమస్తరూపధృక్‌,

క్షితౌ భవాన్‌ పఞ్చగుణ స్తథా జలే

చతుః ప్రకార స్త్రివిధోథ తేజసి,

ద్విధాథ వా¸° వియతి ప్రతిష్ఠితో

భవాన్‌ హరే శబ్ద వపుఃపుమానసి.

ప్రభూ! నీవు వెలుగు లన్నింటికిని వెలుగుల నొసగు వాడవు. అన్నిరూపములను తాల్చువాడవు, భూమియందు అయిదుగుణములతో, నీట నాలుగుగుణములతో, నిప్పునందు మూడు గుణములతో, గాలియందు రెండు గుణములతో, గగనమున ఒక్కగుణముతో నెలకొనియుందువు. ఓ హరీ నీవు నాదమయమగు దేహము గల పురుషోత్తముడవు. (భూమి యందు - శబ్దస్పర్శరూపరస గంధములు. నీటియందు - శబ్దస్పర్శరూపరసములు, అగ్ని యందు శబ్దస్పర్శ రూపములు, గాలియందు శబ్ద స్పర్శములు, ఆకాశమునందు శబ్దము - అనునవి గుణములు).

భవాన్‌ శశీ సూర్య హుతాశనోసి

త్వయి ప్రలీనం జగదేత దచ్యుతే,

భవత్ర్పతిష్ఠితం రమతే జగద్‌ యతః

స్తుతోసి రామేతి జగత్ర్పతిష్ఠితమ్‌.

నీవు చంద్రుడవు, సూర్యుడవు, అగ్నివి, ఎందును, ఎప్పుడును నాశనములేని నీయందు ఈ జగత్తంతయు లీనమైయున్నది. నీ యందు చెదరక నిలిచియుండి 'రమించు' చున్నది కావుననే నిన్ను రాముడని కొనియాడుదురు. నీ వలననే జగత్తునకు ప్రతిష్ఠ యేర్పడుచున్నది.

భవార్ణవే దుఃఖతరోర్మిసంకులే

తథాక్షమాస గ్రహణతిభీషణ,

స మజ్జతి త్వత్స్మరణ ప్లవో నరః

స్మృతోసి రామేతి తథా తపోవనే. 6

ఈ సంసారమొక మహాసముద్రము. అందు పెనుదుఃఖములను అలలు ఎల్లవేళల చీకాకుగా ఎగిరిపడుచుండును. ఇంద్రియము లనెడు పెనుమొసళ్లతో భరింపరాని భయము గొల్పుచుండును. అట్టి ఈ సముద్రమున నరుడు నిన్ను తలపోయుట అను తెప్పను గ్రహించి మునిగిపోవకున్నాడు. అట్టి నిన్ను తపోవనములందు తపస్సంపన్నులు 'రామ' అని నోరార కొనియాడుదురు.

వేదేషు నష్టేషు భవాం స్తథా హరే

కరోషి మాత్స్యం వపురాత్మనః సదా,

యుగక్షయే రఞ్జిత సర్వ దిఙ్ముఖో

భవాం స్తథాగ్ని ర్బహురూపధృగ్‌ విభో. 7

ప్రభూ!హరీ! నీవు వేదములను రక్కసులు కొనిపోయినపుడు మత్స్య స్వరూపము ధరించితివి. యుగము ముగియునపుడు దిక్కులన్నింటిని ఎరుపెక్కించితిని. అట్టి అగ్ని స్వరూపుడగు నీవు బహురూపములను ధరింతువు.

కౌర్మం తథా తే వపు రాస్థితః సదా

యుగే యుగే మాధవ తోయమన్థనే,

న చాస్య దస్తీతి భవత్సమం క్వచి -

జ్జనార్దనాద్‌ యః స్వయం భూతముత్తమమ్‌. 8

మాధవా! ప్రతియుగమునందును నీవు సముద్రమును చిలుకునపుడు తాబేటి రూపుతాల్చి నిలుతువు. జనార్దనుడవగు నీకు సాటి వచ్చున దెందును లేదు. నీవే స్వయముగా ఉత్తమ భూతమవు.

త్వయా తతం విశ్వ మిదం మహాత్మన్‌

స్వకాఖిలాన్‌ వేద దిశశ్చ సర్వాః.

కథం త్వ మాద్యం పరమం తు ధామ

విహాయ చాన్యం శరణం ప్రజామి.

మహాత్మా! ఈ విశ్వమంతయు నీతోడనే నిండి యున్నది. ఈ దిక్కులన్నియు నీవే యని నీవే యెరుగుదువు. ఆద్యుడవు. పరంధాముడవునగు నిన్ను వదలి నేనెట్లు ఇతరుని శరణుకోరుదును?

భవా నేకః పూర్వ మాసీత్‌ తతశ్చ

త్వత్తో మహీ సలిలం వహ్ని రుచ్చైః,

వాయు స్తథా ఖం చ మనోపి బుద్ధి

శ్చేతోగుణా స్త్వత్ర్పభవం చ సర్వమ్‌. 0

ముందు నీ వొక్కడవే యుంటివి. ఆ పిమ్మట నీనుండి పెద్దపెట్టున భూమి, నీరు, నిప్పు, గాలి, నింగి అను అయిదు మహాభూతములు ఏర్పడినవి. అట్లే మనస్సు, బుద్ది, చిత్తము మొదలగు గుణములన్నియు నీ నుండియే వెలువడినవి.

త్వయా తతం విశ్వ మిదం సమస్తం

సనాతన స్త్వం పురుషో మతో మే,

సమస్త విశ్వేశ్వర విశ్వమూర్తే

సహస్రబాహో జయ దేవ దేవ,

నమోస్తు రామాయ మహానుభావ. 11

ఈ విశ్వమంతయు నీచేతనే అల్లుకొనబడి యున్నది. నీవు సనాతనుడగు పురుషుడనని నా భావము. సమస్త విశ్వమునకు ప్రభువవగు ఓ విశ్వమూర్తీ! వేల హస్తములు గల దేవాదిదేవా! నీకు జయము. రామా! మహానుభావా! నీకు నమస్కారము.

ఇతి స్తుతో దేవవరః ప్రసన్నః

తదా రాజ్ఞః సుప్రతీకస్య మూర్తిమ్‌,

సందర్శయామాస తతోభ్యువాచ

పరం వృణిష్వేతి చ సుప్రతీకమ్‌. 12

ఇట్లా సుప్రతీకుడు స్తుతింపగా దేవదేవుడు ప్రసన్నుడై సుప్రతీకునకు తన రూపమును చూపించెను. వరము కోరుకొమ్మని ప్రీతితో పలికెను.

ఏవం శ్రుత్వా వచనం తస్య రాజా

ససంభ్రమం దేవదేవం ప్రణమ్య,

ఉవాచ దేవేశ్వర మే ప్రయచ్ఛ

లయం యదాస్తే పరమం వపుస్తే.

అట్లు పలికిన విష్ణువు పలుకు విని సుప్రతీక మహారాజు తత్తర పాటుతో ప్రణమిల్లి దేవదేవా! నాకు నీ దివ్యదేహమున లయ మగునట్లు వరమిమ్మని వేడుకొనెను.

ఇతీరితే రాజవరః క్షణన

లయం తథాగా దసురఘ్న మూర్తౌ,

స్థిత స్తస్మి న్నాత్మభూతో విముక్తః

స భూమిపః కర్మకాణ్డౖ రనేకైః. 14

విష్ణువట్లు పలుకగా రాజు సుప్రతీకుడు వెనువెంటనే రాక్షస సంహారకుడగు విష్ణువు మూర్తిలో లీనమయ్యెను. ఆ రాజు పెక్కు కర్మకాండముల నుండి విడివడి ఆత్మభూతుడై యతనిలో నెలకొని యుండెను.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు చెప్పెను.

ఇతీరితం తేతు మయా పురాణం

స్వాయంభువే చాది కృతైక దేశమ్‌,

శక్యం న చాసై#్య ర్బహుభిః సహసై#్ర

రహీహ కేనాపి ముఖేన వక్తుమ్‌. 15

ఇట్లు నేను స్వాయంభువమన్వంతరము నందలి మొదటి కృతయుగము నాటి పురాణకథను కొంతభాగము చెప్పితిని. వేయి నోళ్లు గలవాడైనవాడు కూడ దీనిని పూర్తిగా చెప్పలేడు.

ఉద్దేశతః సంస్కృతమాత్ర మేత

న్మయా భ##ద్రే కథితం పురాణమ్‌,

సముద్రతోయాత్‌ పరిమాణసృష్టిః

క్వచిత్‌ క్వచిద్‌ వృత్తమథోహ్యనర్ఘ్యమ్‌. 16

భూదేవీ! నాకు గుర్తునకు వచ్చినంతమాత్రము సూచనగా నీకు పురాణ కథను చెప్పితిని. సముద్రజలము నుండి పాత్రల ప్రమాణమును బట్టి మాత్రమేకదా నీరు తీసికొనుటకు వీలగును. అట్లే ఎంతో విలువగల ఆ చరిత్రలో అక్కడక్కడ తడవితిని.

స్వయమ్భువా కథితం బ్రహ్మణాపి

నారాయణనాపి కుతో భ##వేన్యః,

అశక్య మస్మాభి రితీరితం తే

తన్మూర్తిత్వాత్‌ స్మరణ నేద మాద్యమ్‌. 17

తనంతతానుదయించిన బ్రహ్మయు. శ్రీ మన్నారాయణుడు దీనిని వివరించి చెప్పిరి. భూమిపై మరియెవ్వడు చెప్పగలడు? నాకును ఇది అశక్యమే. కాని ఆ నారాయణుని ఒక అంశము నగుట వలన ఏదో స్మరణకు తెచ్చుకొని నీకు చెప్పగలిగితిని.

సముద్రే వాలుకా సంఖ్యా విద్యతే రజసః క్షితౌ,

నతు సృష్టేః పునః సంఖ్యా క్రీడతః పరమేష్ఠినః. 18

సముద్రమున ఇసుకరేణువుల లెక్కయు, భూమి యందలి దుమ్ముకణముల లెక్కయు తెలియరావచ్చును. అటుగా చేయుచున్న బ్రహ్మ సృష్టి యొక్క లెక్క తెలియ శక్యము కాదు.

ఏష నారాయణస్యాంశోమయా ప్రోక్తః శుచిస్మితే,

కృతే వృత్తాన్త ఏషశ్చ కిమస్య చ్ఛ్రోతు మిచ్ఛసి. 9

మనోజ్ఞమగు నగవు గల భూదేవీ! ఇది నారాయణుని ఒక అంశము. దీనిని నేను నీకు చెప్పితిని. ఇది కృతయుగమున జరిగిన వృత్తాంతము. ఇటుపై నీవేమి వినగోరుదువు?

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ద్వాదశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పండ్రెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters