Varahamahapuranam-1    Chapters   

అథ అష్టదశాధిక శతతమోధ్యాయః - నూటపదునెనిమిదవ అధ్యాయము

ఏవం కర్మవిధిం శ్రుత్వా సర్వసంసార మోక్షణమ్‌,

ప్రసన్నవదనం దేవం పునర్వాక్యమువాచ హ. 1

ఇట్లు సంసారమునుండి విముక్తి కలిగించు పూజా విధానమును విని భూదేవి ప్రసన్నమగుముఖముగల దేవునితో మరల ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

ఏవం మహౌజసం కర్మ తవ మార్గానుసారిణః,

త్వత్తస్తు ప్రాపణవిధి స్తవ ప్రీత్యా మయా శ్రుతః,

కేన ద్రవ్యేణ సంయుక్తం తన్మమాచక్ష్వ మాధవ. 2

నీ మార్గము ననుసరించువాని గొప్ప శక్తిగల కర్మమును గూర్చియు, నీకు నైవేద్యము నొసగుటను గూర్చియు, దేవా! నేను ప్రీతితో వింటిని. నివేదనము ఏ వస్తువుతో కూడినదియో, మాధవా! నాకు తెలియజెప్పుము.

వసుధాయా వచః శ్రుత్వా వరాహః పరమాత్మవాన్‌,

ఉవాచ ధర్మసంయుక్తం ధర్మజ్ఞో వాక్యకోవిదః. 3

భూదేవి పలుకు విని గొప్ప ఆత్మకలవాడు, ధర్మజ్ఞుడు, వాక్యకోవిదుడు అగు వరాహదేవుడు ధర్మముతో కూడుకొన్న విధముగా నిట్లు పలికెను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడిట్లు పలికెను.

యేన మన్త్రేణ సంయుక్తో మమ ప్రాపణకం నయేత్‌,

సప్తవ్రీహి తతో గృహ్య పయసా సహ సంయుతమ్‌,

పరమం తస్య శాకాని మధుకోదుంబరం తథా. 4

నాకు నైవేద్యమును మంత్రపూర్వకముగా ఒసగవలయును. ఏడువిధములగు ధాన్యములను పాలతో పాటుగా గ్రహించి, కూరలను, ఇప్పపూవులను, మేడిపూవులను నాకు సమర్పింప వలయును.

ఏతే చాన్యే చ బహవః శతశోథ సహస్రశః,

కర్మణ్యాశ్చ య ఏతే యే తే మయా పరికీర్తితాః. 5

ఇంకను ఇట్టిపనికి ఉపయోగపడునవి వందలకొలదిగా వేలకొలదిగా కలవు. వానిని నేను చక్కగా చెప్పియుంటిని.

వ్రీహీణాంచ ప్రవక్ష్యామి ఉపయోగ్యాని మాధవి,

ఏకచిత్తం సమాదాయ ప్రాపణం శృణు సుందరి. 6

మాధవీ! నీ నివేదనమునకు ఉపయోగింపదగిన ధాన్యములను చెప్పెదను. స్థిరమగు చిత్తముతో ఆలకింపుము.

ధర్మచిల్లికశాకం చ సుగంధం రక్తశాలికౌ,

దీర్గశాలి మహాశాలి వరకుంకుమమక్షికే. 7

ఆమోదా సివసుందర్యౌ శిరీకా కులకాలికే,

వివిధా యావకాన్నాని జ్ఞేయా కర్మజ్ఞ ఏవతత్‌. 8

ధర్మచిల్లికశాకము, సుగంధము, రక్తశాలికములు, దీర్ఘశాలి, మహాశాలి, వరకుంకుమము, మక్షికము, ఆమోదములు, సివసుందరి, శిరిక, కుల, కాలికములు మొదలగునవి ఉపయోగపడునవిగా కర్మజ్ఞుడు తెలియదగును.

కర్మణ్యా ముద్గమాషా వై తిలకబ్గు కులుత్థకాః,

గవేధుకం మహామోహం మకుంఠమథ వాహిజమ్‌. 9

పప్పుధాన్యములతో పెసలు, మినుములును, నూవులు, కొఱ్ఱలు, ఉలవలు, అడవివడ్లు, మహామోహము, మకుంఠము, వాహిజము అనునవి ఈ కర్మమునకు పనికి వచ్చునవి.

శ్యామాక మితి చోక్తాని కర్మణ్యాని వసుంధరే,

కర్మణ్యతాని ప్రోక్తాని వ్యఞ్జనాని క్రియాన్వితా,

ప్రతిగృహ్ణమ్యహం హ్యేతాత్‌ యచ్చ భాగవతాం ప్రియమ్‌. 10

ఇంకను, ఓవసుంధరా! చామలు కూడ నైవేద్యమునకు యోగ్యములు. ఇంకను భాగవతులకు ప్రియమైన వానిని నేను గ్రహింతును. వ్యంజనములను గూర్చి చెప్పెదను వినుము.

పశూనాం చ ప్రవక్ష్యామి ధాన్యానాం గోరసాని చ,

యే మమైవోపయోగ్యాని గవ్యం దధిపయోఘృతమ్‌,

మాహిష మావికం ఛాగమయాజ్ఞిక ముదాహృతమ్‌. 11

పశువుల పాలు మొదలగువానిలో నేని ఉపయోగింపదగినవో చెప్పెదను. గోవు పెరుగు, పాలు, నెయ్యు నాకు ఒసగదగినవి. గేదె, గొఱ్ఱ, మేక అనువాని పాలు మొదలగునవి యజ్ఞమునకు పనికి రానివిగా చెప్పుదురు.

మార్గం మాంసం పరచ్ఛాగం శాశం సమనుయుజ్యతే,

ఏతే హి ప్రాపణ దద్యాన్మమ చైవ ప్రియావహమ్‌,

యుఞ్జానో వితతే యజ్ఞే బ్రాహ్మణ వేదపారగే. 12

లేడి, పొటేలు, కుందేలు అనువాని మాంసము నాకు ప్రియమైనది. కనుక నైవేద్యమున నాకొసగదగును. వేదముకడదాక చదివిన బ్రాహ్మణుడు యజ్ఞమునందును వీనిని వాడుచుండును.

భాగం మమాస్తి తత్రాపి వశూనాం ఛాగలస్య చ,

మాహిసం వర్జయేన్‌ మహ్యం క్షీరం దధి ఘృతం తతః. 13

ఆ యజ్ఞమునందు నాకును ఆ పశువుమాంసమునందు భాగము కలదు. గేదెపాలు, పెరుగు, నెయ్యి అనువానిని నావిషయమున వదలిపెట్టవలయును.

వర్జయేత్‌ తత్ర మాంసాని యజుషా వైష్ణవే సుతే,

పరపాయస వర్జ్యాని తన్మాంసం చైకతః ఖురమ్‌. 14

విష్ణుసంబంధమైన పూజలో యజుర్వేదమంత్రములతో చేయుదానితలో మాంసములను ముఖ్యముగా ఒంటిగిట్టలుగల జంతువుల పాలు మాంసము మొదలగు వానిని పరిహరింపవలయును.

పక్షిణాం చ ప్రవక్ష్యామి యే ప్రయోజ్యా వసుంధరే,

యే చైవ మమ యజ్ఞేషు ఉపసృజ్యన్తి నిత్యశః. 15

నా పూజలయందు ఉపయోగింపదగిన పక్షులనుగూర్చి తెలిపెదను వినుము.

కర్మణ్యం కౌకురం మాంసం మాయూరం కుక్కుటం తథా,

లావకం వర్తికం చైవ ప్రశసంచ కపింజలమ్‌. 16

వేణుకః కశ్చికశ్చైవ సమాతశ్చైవ వీర్యవాన్‌,

తత్తస్య కుకురం చైవ పరిక్షాణాం వరప్రియః,

పఞ్చకోటక మిత్యేవ ఖారికా చైవ పక్షిణామ్‌. 17

కౌకురమాంసము, నెమలి, కోడి, లావుకపిట్ట, వార్తికము కముజుపిట్ట, వేణుకము, కశ్చికము, గొప్పశక్తిగల సమాతము కుకురము అనువాని మాంసములు నాకు ప్రియమైనవి. అట్లే పంచ కోటకము, ఖారిక, అనునవియు పక్షులలో ఇష్టములైనవి.

నమే దద్యాత్‌ తు పక్షీణాం నీలపత్రం తథైవ చ,

గిరివర్తిక నుప్యేవ మేధ్యం పదవిలాసకమ్‌,

చిత్రమంగకపోతం చ చతురః పక్షిణః స్థితాః. 18

పక్షులలో నల్లని రెక్కలు కలదానిని నాకు ఒసగరాదు. కాని గిరివర్తికము, పదవిలాసకము, చిత్రము, అంగకపోతము అనునాలుగు పక్షిజాతులు పూజ కుపయోగింపదగినవి.

ఏతే చాన్యే చ బహవః శతశోథ సహస్రశః,

మమ యే కర్మయోగ్యాని యే మయా పరికీర్తితాః. 19

ఇవియు, మరియు వందలకొలది వేలకొలదిగా నా పూజలయందు ఉపయోగింపదగిన కలవు.

యస్త్వేతాని విజానీయాత్‌ కర్మకర్తా కదాచన,

తతశ్చ నాపరాధోక్తం మమై వోక్తం వచః ప్రియే. 20

వీనిని చక్కగా తెలిసికొని పూజాకార్యము నొనరించు వాడెన్నటికిని అపరాధము చేయువాడు కాదని నేనే పలుకుచున్నాను.

తేచ భోజ్యాశ్చ మజ్గల్యా మమభక్త సుఖావహః,

తతో యష్టవ్య మేవం హి యదిచ్ఛేత్‌ సిద్ధిముత్తమామ్‌. 21

నాకును, నాభక్తలకును సుఖము కూర్చెడు భోజ్యములు, మంగళవస్తువులు అనువానితో ఉత్తమసిద్ది కోరువాడు పూజల నాచరింపవలయును.

య ఏతేన విధానేన యజిష్యన్తి వసుంధరే,

ప్రాప్నోతి పరమాం సిద్ధిం మమైవం కృతకర్మణః. 22

ఈ విధానముతో పూజనొనరించువారు నాపూజను ముగించినవారై పరమసిద్ధిని పొందెదరు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టాదశాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట పదునెనిమిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters