Varahamahapuranam-1    Chapters   

ద్వాదశాధికశతతమోధ్యాయః - నూటపండ్రెండవ అధ్యాయము

ఓం నమో వరాహాయ! ఓం నమో బ్రహ్మపుత్రాయ సనత్కు మారాయ నమః.

ఓం శ్రీవరాహదేవునకు నమస్కారము. ఓమ్‌ బ్రహ్మకుమారుడగు సనత్కుమారునకు నమస్కారము.

నమస్తసై#్మ వరాహాయ లీలయోద్ధరతే మహీమ్‌,

ఖురమధ్యగతో యస్య మేరుః ఖణఖణాయతే. 1

లీలగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామికి నమస్కారము. అట్లెత్తునప్పుడు ఆతని గిట్టలనడుమ చిక్కిన మేరుపర్వతము ఖణఖణలాడినది.

స తేన సాన్త్వితాయాం వై పృథివ్యాం వై సమాగతః,

సనత్కుమార స్తత్‌క్షేత్రే దృష్ట్వా తాం సంస్థితాం మహీమ్‌,

స్వస్తివాచ్యాహ పుణ్యాగ్రే ప్రత్యువాచ వసుంధరామ్‌. 2

ఆ దేవుడు భూమిని మంచిమాటలతో సాంత్వనపరచిన పిమ్మట సనత్కుమారుడు ఆక్షేత్రమున భూదేవిని చూచి స్వస్తి పుణ్యాహ వాచనము గావించి వసుంధరతో ఇట్లు పలికెను.

సనత్కుమార ఉవాచ - సనత్కుమారు డిట్లనెను.

యందృష్ట్వా వర్ధసే దేవి త్వం చ యాస్యసి మాధవి,

విష్ణునా ధార్యమాణా చ కింత్వయా దృష్టమద్భుతమ్‌. 3

భూదేవీ! ఎవనిని చూచి నీవు పొంగిపోవుదునో, నీవు ఎవనిని చేరుకొందువో, ఆ విష్ణువు నిన్ను కొనిపోవునపుడు నీవు చూచిన అద్భుతమెయ్యది?

ఏత దాచక్ష్వ తత్త్వేన యత్‌తే హరిముఖాచ్ఛ్రుతమ్‌,

బ్రహ్మపుత్రవచః శ్రుత్వా పృథివీ వాక్య మబ్రవీత్‌. 4

నీవు విష్ణుముఖమునుండి వినినదానివి తత్త్వముతో చెప్పుము. అనగా ఆ బ్రహ్మకుమారుని మాట విని భూదేవి యిట్లు పలికెను.

ధరణ్యువాచ - భూమి పలికెను.

యద్‌ గుహ్యం సమయా పృష్టో యచ్చమే సంప్రభాషితమ్‌,

శృణు తత్త్వేన విప్రేన్ద్ర గృహ్యం ధర్మమహౌజనమ్‌. 5

నేను ఆ మహానుభావుని అడిగిన రహస్యమేదియో, అతడు నాతో చక్కగా పలికిన పలుకేదియో విప్రవరా! ఆ ధర్మపు గొప్ప మహిమను, గ్రహింపదగినదానిని, చెప్పెదను. వినుము.

భగవత్ర్పోక్త ధర్మాణి యద్‌ గుహ్యం కథయామ్యహమ్‌

తేన యే కథితం హ్యేతత్‌ సంసారాత్‌తు విమోక్షణమ్‌. 6

భగవంతుడు వక్కాణించిన ధర్మములలో మిక్కిలి రహస్యమైన దానిని చెప్పుచున్నాను. అది సంసారమునుండి విముక్తి కలిగించునట్టిది.

విష్ణుభ##క్తేన యత్కార్యం యత్ర్కియా పరినిష్ఠితా,

ఉవాచ పరమం గుహ్యం ధర్మాణాం వ్యాప్తనిశ్చయమ్‌,

అయం ధర్మో మయా హ్యేత చ్ఛ్రుతం ధర్మసనాతనమ్‌. 7

ఆ ప్రభువు, విష్ణుభక్తున కేది కార్యమో, ఏది మిక్కిలి శ్రద్ధతో చేయదగినదియో, ధర్మములన్నింటిలో వ్యాపించి నిశ్చయమైనదేదో, మిక్కిలి రహస్యమైనదేదో, సనాతనమగునదేదో అట్టిపరమధర్మమును వక్కాణింపగా నేను వింటిని.

తతో మహీవచః శ్రుత్వా బ్రహ్మపుత్రో మహాతపాః,

ఉపజాయత తిష్ఠన్తో కోకాదిశముఖం ప్రతి,

జటిలో బ్రహ్మచారీ చ యే కేచిత్‌ సమయే స్థితాః. 8

తాన్‌ సర్వాన్‌ స సమానీయ యోగినాం పరమఃప్రభుః,

సనత్కుమారః పూతాత్మా ప్రత్యువాచ మహీంప్రతి. 9

అంత భూదేవిమాటలు విని మహాతాపసుడు, బ్రహ్మపుత్రుడు అగు సనత్కుమారుడు కోకాదిశముఖ తీర్థము వైపుచూచి అచటనున్న తాపసులు, బ్రహ్మచారులు, ఇంకను ఆసమయమున అచట నున్నవారు మొదలగువారినందరిని అచటకు రావించి యోగులలో పరమప్రభువు పూతాత్ముడునగు అతడు భూదేవితో ఇట్లు పలికెను.

యన్మయా పూర్వముక్తాసి కథయస్వ వరాననే,

అప్రమేయగతిం చైవ ధర్మ మాచక్ష్వ తత్త్వతః. 10

వరాననా! భావించుటకలవి కాని ధర్మమును నేను మున్నడిగి తిని. దానిని చెప్పుము.

తత స్తస్య వచః శ్రుత్వా ప్రణమ్య ఋషిపుంగవాన్‌,

ఉవాచ పరమప్రీతా ధాత్రీ మధురయా గిరా. 11

అంతనతని మాట విని ఋషిపుంగవులకు ప్రణమిల్లి మిక్కిలి ప్రీతినొందిన భూదేవి తీయని పలుకులతో ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

శృణ్వస్తు ఋషయః సర్వే యత్తద్విష్ణు ముఖాచ్ఛ్రుతమ్‌,

బాఢ మిత్యేవ తాం దేవీం స్వస్తి బ్రూహీతి సాబ్రవీత్‌. 12

''ఋషులారా! మీరందరు విష్ణుముఖము వలన నేను విన్న దానిని వినుడు'' అని పలుకగా వారు ''అట్లే! నీకు స్వస్తి, చెప్పుము'', అని పలికిరి. ఆమె ఇట్లు చెప్పెను.

నష్టచన్ద్రానిలే లోకే నష్టభాస్కరతారకే,

స్తమ్భితాశ్చ దిశః సర్వా న ప్రజ్ఞాయత కిఞ్చన. 13

చంద్రుడు, వాయువు లోకమున కానరావు. సూర్యుడు నక్షత్రములు రూపుమాసిపోయినవి. దిక్కులన్నియు మొద్దుబారి పోయినవి. ఏమియు తెలియరాకున్నది.

న వాతి పవన స్తత్ర నైచవాగ్ని ర్న జ్యోతిషః,

నకిఞ్చి త్తత్ర విద్యేత న తారా నచ రాశయః. 14

అచట గాలి వీవదు. అగ్నివెలుగదు. నక్షత్రములు ప్రకాశింపవు. అచట ఏమియు తెలియరాదు. తారలు లేవు, రాశులు లేవు.

అంశవచ్చ నవిద్యన్తే న నక్షత్రా న వా గ్రహాః,

నచైవాంగారక స్తత్ర నశుక్రో న బృహస్పతిః. 15

అంశువులు, నక్షత్రములు, గ్రహములు, కుజుడు, శుక్రుడు బృహస్పతి - ఎవ్వరు లేరు.

శ##నైశ్చరబుధౌ నాత్ర నచేన్ద్రో ధనదో యమః,

వరుణోపి సవిద్యేత నాన్యే కేచిద్‌ దివౌకసః,

వర్జయిత్వా త్రయో దేవాన్‌ బ్రహ్మవిష్ణుమహేశ్వరాన్‌. 16

శని, బుధుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ఇంకను తక్కిన దేవతలు ఎవ్వరును లేరు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులనెడు ముగ్గురు దేవులు తప్ప మరియెవ్వరు లేరు.

పృథివీ భారసంతప్తా బ్రహ్మాణం శరణం గతా,

గత్వా తు శరణం దేవీ దైన్యం వదతి మాధవీ. 17

అప్పుడు భారముతో మిక్కిలి వగచిన భూదేవి బ్రహ్మను శరణు చొచ్చెను. మాధవుని ఇల్లాలగు ఆమె ఆ దేవునికడ కరిగి దీనముగా ఇట్లు పలికెను.

ప్రసీద మమ దేవేన్ద్ర మగ్నాహం భారపీడితా,

సపర్వతవనైః సార్ధం మాం తారయ పితామహ. 18

దేవేంద్రా! పితామహా! భారము పీడింపగా నేను పర్వతము లతో అడవులతోపాటుగా మునిగి పోయితిని. నన్ను తరింప జేయుము.

పృథివ్యా వచనం శ్రుత్వా బ్రహ్మా లోకపితామహః,

ముహూర్తం ధ్యానమాస్థాయ పృథివీం తామువాచ హ. 19

భూదేవిమాట విని లోకపితామహుడగు బ్రహ్మ ముహూర్త కాలము ధ్యానములోనుండి భూమితో ఇట్లనెను.

నాహం తారయితుం శక్తో విషమస్థాం వసుంధరే,

లోకనాథం సురశ్రేష్ఠ మాదికర్తార మఞ్జసా,

లోకేశం ధన్వినం కృష్ణం యాహి మాయాకరణ్డకమ్‌. 20

వసుంధరా! ఈ విషమదశలో ఉన్న నిన్ను నేను ఉద్ధరింప జాలను. లోకముల కెల్ల ప్రభువు, సర్వదేవతలకు మిన్న, మొదటికర్త, లోకేశుడు, విలుకాడు, మాయలపెట్టె అగు నల్లని దేవరను శరణు పొందుము.

సర్వేషామేవ నః కార్యం యచ్చ కిఞ్చిత్‌ ప్రవర్తతే,

సర్వాం స్తారయితుం శక్తః కింపుననస్త్వాం వసుంధరే. 21

మా యెల్లరకు ఏపనిపడినను, మమ్ముద్ధరించుట కాతడే సమర్థుడు, నిన్నుద్ధరించునని మరల చెప్పనేల?

అనన్తశయనే దేవం శయానం యోగశాయినమ్‌,

తతః కమలపత్రాక్షీ నానాభరణభూషితా,

కృతాఞ్జలిపుటా దేవీ ప్రసాదయతి మాధవమ్‌. 22

అంత కమలముల రేకులవంటి కనులు గలదియు, అనేకము లగు ఆభరణములను తాల్చినదియునగు ఆ భూదేవి అనంతశయనమున యోగనిద్రలో ఉన్న మాధవుని, చేతులు జోడించినదై ప్రార్థించెను.

అహం భారసమాయుక్తా బ్రహ్మాణం శరణం గతా,

ప్రత్యాఖ్యాతా భగవతా తేనాప్యుక్తమిదం వచః. 23

ప్రభూ! నేను బరువుతో నున్నాను. బ్రహ్మను శరణు చొచ్చితిని. ఆయన కాదనెను. ఇట్లు పలికెను.

నాహం తారయితుం శక్తః సుశ్రోణి వ్రజ మాధవమ్‌,

సత్వాం తారయితుం శక్తో మగ్నాసి యది సాగరే. 24

''అమ్మా! నిన్ను దాటవేయుటకు నాకు శక్తిచాలదు. మాధవుని కడకరుగుము. సముద్రమున మునిగినను నిన్నుద్ధరించుట కతడు సమర్థుడు''.

ప్రసీద మమ దేవేశ లోకనాథ జగత్పతే,

భక్తాయాః శరణాయాశ్చ ప్రసీద మమ మాధవ. 25

దేవదేవా! లోకనాథా! జగత్పతీ! నాపై దయజూపుము. భక్తురాలను, శరణు కోరితిని. మాధవా! నన్ననుగ్రహింపుము.

త్వ మాదిత్యశ్చ చన్ద్రశ్చ త్వం యమో ధనదస్తు వై,

వాసవో వరుణ శ్చాపి అగ్ని ర్వారుత ఏవ చ. 26

నీవు సూర్యుడవు. చంద్రుడవు, యముడవు, కుబేరుడవు, ఇంద్రుడవు, వరుణుడవు, అగ్నిని, వాయువవు.

అక్షరశ్చ క్షరశ్చా సి త్వం దిశో విదిశో భవాన్‌,

మత్స్యః కూర్మో వరాహోథ నారసింహోసి వామనః,

రామో రామశ్చ కృష్ణోసి బుద్ధః కల్కి ర్మహాత్మవాన్‌. 27

నీవు అక్షరుడవు. క్షరుడవు. దిక్కులు, విదిక్కులును నీవే. మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, వామనుcడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహాత్ముడగు కల్కి అను అవతారము లన్నియు నీవే.

ఏవం యాస్యసి భోగేన శ్రూయతే త్వం మహాయశాః,

యుగేయుగే సహస్రాణి వ్యతీతా యేచ సంస్థితాః. 28

మహాకీర్తిశాలివగు నీవు ఇట్లనేకవిధములుగా ప్రతియుగము నను వేలవేలు రూపములను, ఉన్నవానిని, రానున్న వానిని యోగము తో ధరింతువని మేము వినుచున్నాము.

పృథివీ వాయు రాకాశ మాపో జ్యోతిశ్చ పంచమమ్‌,

శబ్దస్పర్శస్వరూపోసి రసోగన్ధోసి నో భవాన్‌. 29

భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని అనునవియు, శబ్దము, స్పర్శ, రూపము, గంధము అనునవియు అన్నియు మాకు నీవే.

సగ్రహా యే చ నక్షత్రాః కలాకాలముహూర్తకాః,

జ్యోతిశ్చక్రం ధ్రువ శ్చాసి సర్వముద్యతతే భవాన్‌. 30

గ్రహములు, నక్షత్రములు, కలలు, కాలము, ముహూర్తములు, జ్యోతిశ్చక్రము, ధ్రువుడు ఈ అన్నింటిని నీవే ప్రకాశింప జేయుదువు.

మాసః పక్షమహోరాత్ర మృతుః సంవత్సరాణ్యపి,

ఋతవశ్చాసి షణ్మాసాః షడ్రసా శ్చాసి సంయుతః. 31

నెల, పక్షము, దినము, సంవత్సరము, ఋతువులు, అయనములు, ఆరురసములు అన్నియు సమాహారరూపమున నీవే.

సరితః సాగరా శ్చాసి పర్వతాశ్చ మహోరగాః,

త్వం మేరు ర్మన్దరో విన్ధ్యో మలయో దర్దురోభవాన్‌. 32

నదులు, సముద్రములు, పర్వతములు, మహాసర్పములు, మేరువు, మందరము, వింధ్యము, మలయము, దర్దురము - ఇవి యన్నియు నీవే.

హిమవాన్‌ నిషధశ్చాసి చక్రోసి చ వరాయుధః,

ధనూంషి చ పినాకోసి యోగః సాంఖ్యోసి చోత్తమః. 33

హిమవంతుము, నిషధము, శ్రేష్ఠమగు ఆయుధమగు చక్రము, ధనుస్సులు, పినాకము నీవే, మోగమును, ఉత్తమమగు సాంఖ్యమును నీవే.

పరంపరోసి లోకానాం నారాయణ పరాయణః,

సంక్షిప్తం చైవ విస్తారో గోప్తా క్షేప్తా చ వై భవాన్‌. 34

నారాయణా! లోకముల పరంపరయు, పరాయణమును నీవే. సంక్షేపస్వరూపము, విస్తారస్వరూపము నీవే. రక్షకుడవు. భక్షకుడవును నీవే.

యజ్ఞానాం చ మహాయజ్ఞో యూపానా మసి సంస్థితః,

వేదానాం సామవేదోసి యజుర్వేదో వరానన. 35

యజ్ఞములలో నీవు మహా యజ్ఞస్వరూపుడవు. నీవు యూపస్తంభములలో నెలకొని యున్నావు. వేదములలో సామ వేదస్వరూపుడవు. యజుర్వేద స్వరూపడవు. (యూపము - యజ్ఞపశువును కట్టు స్తంభము.)

ఋగ్వేదోథర్వ వేదోసి సాంగోపాంగో మహాద్యుతే,

గర్జనం వర్షణం చాసి త్వం వేధా అనృతానృతే. 36

అంగములలో, ఉపాంగములతో కూడిన ఋగ్వేదము, అధర్వవేదము నీస్వరూపములే. గర్జనము, వర్షణము నీవే. వేధ, ఋతము, అనృతము అనునవి నీవే.

అమృతం సృజసే విష్ణో యేన లోకా నధారయత్‌,

త్వంప్రీతి స్త్వం పరా ప్రీతిః పురాణః పురుషో భవాన్‌. 37

విష్ణూ! ఈ లోకము లన్నింటిని పట్టినిలుపు అమృతమును నీవు సృజించితివి. ప్రీతివి, పరమప్రీతివి నీవే. నీవే పురాణపురుషుడవు.

ధ్యేయాధ్యేయం జగత్సర్వం యచ్చ కిఞ్చిత్‌ ప్రవర్తతే,

సప్తానామపి లోకానాం త్వంనాథ స్త్వంచ సంగ్రహః. 38

ధ్యానింపదగినది, తగనిదియగు జగత్తు సర్వము నీవే. ఏడులోకములకు నాథుడవు నీవే. ఆ లోకములసముదాయమును నీవే.

త్వం చ కాలశ్చ మృత్యుశ్చ త్వం భూతో భూతభావనః,

ఆదిమధ్యాంతరూపోసి మేధా బుద్ధిః స్మృతి ర్భవాన్‌. 39

నీవు కాలస్వరూపుడవు. మృత్యువవు. భూతస్వరూపుడవు. భూతములను పాలించువాడవు. ఆదిమధ్యాంతరూపుడవు. మేధవు, బుద్ధివి, స్మృతివి.

ఆదిత్యస్త్వం యుగావర్తః సచ పంచ మహాతపాః,

అప్రమాణప్రమేయోసి ఋషీణాంచ మహానృషిః. 40

నీవు ఆదిత్యుడవు. యుగముల పరంపరవు. అయిదు విధములైన గొప్పతపస్సుల స్వరూపమగు ప్రమాణములకందని స్వరూపముకలవాడవు. ఋషులలో మహర్షివి.

ఉగ్రదణ్డశ్చ తేజస్వీ హ్రీ ర్లక్ష్మీ ర్విజయో భవాన్‌,

అనన్తశ్చాసి నాగానాం సర్పాణా మసి తక్షకః,

ఉద్వహః ప్రవహశ్చాసి వరుణో వారుణో భవాన్‌. 41

నీవు భయంకరమగు దండరూపుడవు. గొప్పతేజస్సు కలవాడవు. సిగ్గు, లక్ష్మి, విజయము నీవే. నాగులలో అనంతుడు, సర్పములలో తక్షకుడు నీవే, ఉద్వహము, ప్రవహము అను తీవ్రవాయుస్వరూపములు, వరుణుడు, వారుణము నీవే.

క్రీడా విక్షేపణ శ్చాసి గృహేషు గృహదేవతాః,

సర్వాత్మకః సర్వగతో వర్దనో మాన ఏవ చ. 42

నీవు క్రీడలలోని చైతన్యస్వరూపడవు, ఇండ్లలో గృహదేవతా మూర్తివి. సర్వాత్మకుడవు. సర్వగతుడవు. వృద్ధి, మన్నన నీస్వరూపములే.

సాఙ్గస్త్వం విద్యుతీనాం చ విద్యుతానాం మహాద్యుతిః,

యుగో మన్వన్తర శ్చాసి వృక్షాణాం చ వనస్పతిః. 43

మెరువులలో అంగములు, మెరపులలోని మహాకాంతియు నీవే. యుగము మన్వంతరము నీవే. వృక్షములలో నీవు వనస్పతివి. (వనస్పతి=పూవులు లేకుండ కాచెడుచెట్టు.)

అండజోద్భిజ్జ స్వేదానాం జరాయూణాం చమాధవ,

శ్రద్ధాసి త్వం చ దేవేశ దోషాన్‌ హన్తాసి మాధవ. 44

మాధవా! గ్రుడ్డునుండి పుట్టునవి, పగులగొట్టుకొని వచ్చునవి, చెమటవలన పుట్టునవి, గర్భమునుండి పుట్టునవి అనువానిలో నీవే యున్నావు. నీవు శ్రద్ధారూపుడవు. దోషములను పరిమార్చువాడవు.

గరుడోసి మహాత్మానం వహసే త్వం పరాయణః,

దున్దుభి ర్నేమి ఘెషైశ్చ ఆకాశగమనో భవాన్‌. 45

నీవు గరుడుడవై మహాత్ముడగు మాధవుని మోయు చున్నావు. దుందుభి, రథము, చక్రముల పట్టాల ఘెషతో ఆకాశమున ప్రవర్తించు చుందువు.

జయశ్చ విజయశ్చాసి గృహేషు గృహదేవతాః,

సర్వాత్మకః సర్వగత శ్చేతనో మన ఏవ చ. 46

జయవిజయులు, గృహదేవతలు నీవే. సర్వాత్మకుడవు. సర్వగతుడవు. చేతన, మనస్సు నీవే.

భగస్త్వం వృషలిఙ్గశ్చ పరస్త్వం పరమాత్మకః,

సర్వభూతనమస్కార్యో నమోదేవ నమో నమః,

మాం త్వం మగ్నామసి త్రాతుం లోకనాథ ఇహార్హసి. 47

నీవు భగము, వృషము, లింగము, పరుడవు, పరమాత్మకుడవు సర్వభూతములకు నమస్కరింపదగినవాడవు. దేవా! నమస్సు, నమస్సు, మునిగిన నన్ను కాపాడుటకు లోకనాథా! నీవే సమర్థుడవు.

ఆది కాలాత్మకం హ్యేతత్‌ సర్వపాపహరం శివమ్‌,

య ఇదం పఠతే స్తోత్రం కేశవస్య దృఢవ్రతః,

వ్యాధితో ముచ్యతే రోగాత్‌ బుద్ధో ముచ్యేత బంధనాత్‌. 48

ఈ స్తోత్రము ఆదికాలమునకు సంబంధించినది. అన్ని పాపములను హరించునది. మంగళ##మైనది. దృఢమైన వ్రతము గలిగి ఈ కేశవస్తోత్రమును పఠించునరుడు సర్వరోగములనుండియు, సర్వబంధములనుండియు ముక్తు డగును.

అపుత్రో లభ##తే పుత్రం దరిద్రో ధన మాప్నుయాత్‌,

అభార్యో లభ##తే భార్యా మపతిః పతి మాప్నుయాత్‌. 49

పుత్రులు లేనివాడు పుత్రుని, దరిద్రుడు ధనమును, భార్యలేనివాడు భార్యను, పతిలేనిపడతి పతిని పొందుదురు.

ఉభే సంధ్యే పఠేద్‌ యస్తు మాధవస్య మహాస్తవమ్‌,

స గచ్ఛేద్‌ విష్ణులోకం హి నాత్ర కార్యా విచారణా. 50

రెండు సంధ్యలలో ఈ మాధవమహాస్తవమును పఠించువాడు విష్ణులోకమున కరుగను. విచారణచేయబని లేదు.

అయంతు అక్షరోక్తోపి భ##వేత్‌ తు పరికల్పనా,

తావద్‌ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. 51

ఈ మహాస్తుతిని కేవలము అక్షరములు రూపములలో నైనను చదువువాడు వేలవత్సరములు స్వర్గలోకమున ప్రతిష్ఠ పొందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వాదశాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపండ్రెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters