Varahamahapuranam-1    Chapters   

అష్టాధికశత తమోధ్యాయః - నూట యెనిమిదవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను.

అధాతః సంప్రవక్ష్యామి ధేనుం కార్పాసమయీం నృప.

యత్ర్పదానాన్నరోయాతి ఐన్ద్రం లోక మునుత్తమమ్‌. 1

రాజా! ప్రత్తి ఆవును గూర్చి వివరించెదను. దాని నిచ్చుట వలన నరుడు మిక్కిలి శ్రేష్ఠమగు ఇంద్రలోకమున కరుగును.

విషువే త్వయనే పుణ్య యుగాదిగ్రహణ తథా,

సర్వాసు గ్రహపీడాసు దుఃస్వప్నా ద్భూతదర్శనే.

పుణ్య చాయతనే రాజన్‌ శుచిదేశే గవాంగణ. 2

విషువము, అయనము, సంక్రాంతి పుణ్యకాలము, సంవత్సరాది, గ్రహణము అనుసమయములలో, గ్రహపీడలు సంభవించినపుడు, పీడకలలు, దయ్యములు కనబడినపుడును పుణ్యస్థలమునందును, ఆవులమందలున్నచోటను, పవిత్రస్థలము నందును దీనిని చేయనగును.

గోమయేనానులిప్తాయాం దర్భా నాస్తీర్య వై తిలాన్‌,

తన్మధ్యే స్థాపయేద్‌ ధేనుం వస్త్రమాల్యానులేపనైః,

నైవేద్య ధూపదీపాద్యైః పూజయేచ్చ విమత్సరః. 3

ఆవుపేడతో అలికిన భూమియందు దర్భలను పరచి దానిపై తిలలను ఉంచి ఆనడుమ ధేనువును నిలుపవలయును. వస్త్రములు, మాల్యములు, గందపు పూతలు, నైవేద్యము, ధూపము, దీపము మొదలగువానితో పొగరులేనివాడై పూజింపవలయును.

ఉత్తమా చతుర్భి ర్భారై స్తదర్ధేన తు మధ్యమా,

భారేణ అధమా ప్రోక్తా విత్తశాఠ్యం వివర్జయేత్‌,

చతుర్ధాంశేన కృత్వా వై వత్సంతు పరికల్పయేత్‌. 4

నాలుగుబారువుల పత్తితో చేయుట ఉత్తమపద్ధతి. అందులో సగముతో మధ్యమపద్ధతి. ఒకబారువుతో చేయుట అధమ పద్ధతి. ధనవిషయములో వంచన పనికిరాదు. నాలుగవ భాగముతో దూడను చేయవలయును.

కర్తవ్యా రుక్మశృజ్గైస్తు రాజతం ఖురసంయుతమ్‌,

నానాఫలమయా దన్తా రత్నగర్భ సమన్తితాః. 5

బంగారుకొమ్ములతో, వెండి గొరిజలతో, పెక్కుపండ్ల దంతములతో రత్నములు కడుపున ఉండునట్లుగా ధేనువును తీర్పవలయును.

ఇత్యేవం సర్వసంపూర్ణం కృత్వా శ్రద్ధయాన్వితః,

పూర్వోక్తస్తు విధిః కార్యో దానమంత్ర పురస్సరః. 6

ఇట్లు అన్నియు నిండుగా నుండునట్లు ఆవును రూపొందించి శ్రద్ధతో కూడినవాడై ఆ కార్పాసధేనువును మంత్రములతో ఆవాహనము చేయవలయును.

దద్యాదథ దర్భపాణిః ప్రయతః శ్రద్ధయాన్వితః,

పూర్వోక్తస్తు విధిః కార్యో దానమంత్ర పురస్సరః. 7

దర్భలు చేతదాల్చి పవిత్రుడై శ్రద్ధగలవాడై దానమంత్రము లతో పాటు మునుపటి విధానమును చేయవలయును.

యథా దేవగణాః సర్వే త్వయా హీనా నవర్తతే,

తథా మాముద్దరేద్‌ దేవి పాహి సంసారసాగరాత్‌. 8

దేవీ! నీవు లేక దేవగణములు లేవు. నన్నీ సంసారమనెడు సముద్రమునుండి ఉద్ధరింపుము - అని పలుక వలయును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయెనిమిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters