Brahmapuranamu    Chapters   

అథ త్రిచత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

వసిష్ఠం ప్రతి మోక్షధర్మ విషయకో జనకప్రశ్నః

జనక ఉవాచ

అక్షరక్షరయో రేష ద్వయోః సంబంధ ఇష్యతే | స్త్రీ పుంసయో ర్వా సంబంధః స వై పురుష ఉచ్యతే || 1

ఋతే తు పురుషం నేహ స్త్రీ గర్భా న్ధారయ త్యుత | ఋతే స్త్రియం న పురుషో రూపం నిర్వర్తతే తథా || 2

అన్యోన్య స్యాభిసంబంధా దన్యోన్య గుణ సంశ్రయాత్‌ | రూపం నిర్వర్తయే దే తదేవం సర్వాసు యోనిషు || 3

రత్యర్థ మతి సంయోగా దన్యోన్య గుణ సంశ్రయాత్‌ | ఋతౌ నిర్వర్తతే రూపం త ద్వక్ష్యామి నిదర్శనమ్‌ || 4

యే గుణాః పురుష స్యేహ యే చ మాతు ర్గుణా స్తథా | అస్థి స్నాయు చ మజ్జా చ జానీమః పితృతో ద్విజ || 5

త్వ ఙ్మాంసం శోణితం చేతి మాతృజా న్యనుశుశ్రుమ | ఏవ మేత ద్ద్విజశ్రేష్ఠ వేదశాస్త్రేషు పఠ్యతే || 6

ప్రమాణం యచ్చ వేదోక్తం శాస్త్రోక్తం యచ్చ పఠ్యతే | వేదశాస్త్ర ప్రమాణం చ ప్రమాణం త త్సనాతనమ్‌||

ఏవ మే వాభిసంబద్ధౌ నిత్యం ప్రకృతి పూరుషౌ | యచ్చాపి భగవం స్తస్మా న్మోక్షధర్మో న విద్యతే || 8

అథవానంతరకృతం కించి దేవ నిదర్శనమ్‌ | త న్మమాచక్ష్వ తత్త్వేన ప్రత్యక్షో హ్యసి సర్వదా || 9

మోక్షకామా వయం చాపి కాంక్షాయో య దనామయమ్‌ | అజేయ మజరం నిత్య మతీంద్రియ మనీశ్వరమ్‌ || 10

క్షరాక్షరతత్త్వముల సంబంధమును నిరూపించుట

జనకుడు వసిష్ఠునితో ఇట్లు పలికెను : మీరు ప్రతిపాదించిన క్షర అక్షర తత్త్వముల సంబంధము లోకమున స్త్రీ పురుషుల సంబంధము వంటిదని నేననుకొనుచున్నాను. అన్ని ప్రాణులలోను ఋతుకాలమున సంగమించినపుడు స్త్రీ పురుషులు అన్యోన్య గుణముల నొకచో చేర్చిననే మఱియొక దేహి దేహధారణము జరుగుచున్నది. పురుషుని నుండి అస్థిస్నాయమజ్జలును స్త్రీ నుండి త్వక్‌మాంస రక్తములును ఏర్పడి దేహమును నిర్వర్తించుచున్నవి. అంతేకాక పురుషుడు లేక స్త్రీ గర్భమును ధరించజాలదు. స్త్రీ లేనిదే పురుషుడు దేహమునకు రూపమును ఈయజాలడు. ఇట్లే క్షరతత్త్వము అగు ప్రకృతియు అక్షరతత్త్వమగు పరతత్తరూప పురుషుడును కలియనిదే ఈ సృస్టి జరుగదని వేద శాస్త్రప్రమాణములు తెలుపుచున్నవని నా అభిప్రాయము. మాకు తమనుండి ఈ తత్త్వము తెలియవలెను. తత్త్వజ్ఞానము వలన మోక్షము కలుగును. మేము మోక్షమును కోరువారము. అనామయమును అజేయమును అజరమును నిత్యమును అతీంద్రియము ను అనీశ్వరమును అగు పరతత్త్వమును పొందుట మా కోరిక. కనుక యథార్థతత్త్వము ను మాకు తెలుపుము.

వసిష్ఠ ఉవాచ

య దేతదుక్తం భవతా వేదశాస్త్ర నిదర్శనమ్‌ | ఏవ మేత ద్యథా వక్ష్యే తత్త్వగ్రాహీ యథా భవాన్‌ || 11

ధార్యతే హి త్వయా గ్రంథ ఉభయో ర్వేదశాస్త్రయోః | న చ గ్రంథస్య తత్త్వజ్ఞో యథా తత్త్వం నరేశ్వర ||

యో హి వేదే చ శాస్త్రే చ గ్రంథ ధారణ తత్పరః | న చ గ్రంథార్థ తత్త్వజ్ఞ స్తస్య త ద్ధారణం వృథా || 13

భారం స వహతే తస్య గ్రంథ స్యార్థం న వేత్తి యః | యస్తు గ్రంథార్థ తత్త్వజ్ఞో నాస్య గ్రంథాగమో వృథా ||

గ్రంథస్యార్థం సపృష్ఠ స్తు మాదృశో వక్తు మర్హతి | యథా తత్త్వాభిగమనా దర్థం తస్య స విందతి || 15

న యః సముత్సుకః కశ్చి ద్గ్రంథార్థం స్థూలబుద్ధిమాన్‌ | స కథం మందవిజ్ఞానో గ్రంథం వక్ష్యతి నిర్ణయాత్‌ ||

ఆజ్ఞాత్వా గ్రంథతత్త్వాని వాదం యః కురుతే నరః | లోభాద్వాప్యథవా దంభా త్స పాపీ నరకం వ్రజేత్‌ || 17

నిర్ణయం చాపి చ్ఛిద్రాత్మా న త ద్వక్ష్యతి తత్త్వతః | సోపీ హాస్యార్థ తత్త్వజ్ఞో యస్మాన్నైవాత్మవానపి ||

తస్మాత్త్వం శృణు రాజేంద్ర యథై తదను దృశ్యతే | యథా తత్త్వేన సాంఖ్యేషు యోగేషు చ మహాత్మసు || 19

యదేవ యోగాః పశ్యంతి సాంఖ్యం తదనుగమ్యతే | ఏకం సాంఖ్యం చ గం చయో యః పశ్యతి స బుద్ధిమాన్‌ ||

వసిష్ఠు డిట్లు జనకునితో పలికెను: ఓ జనకా! నీవు చెప్పినట్టె విషయ నిర్ణయము నందు వేదశాస్త్రములు ప్రమాణములు. నీవు తత్త్వమును గ్రహింపగల జిజ్ఞాసువు. కాని వేదశాస్త్రములను గ్రంథములుగా అధ్యయనము చేసి ధారణ చేసినందువలన ప్రయోజనము లేదు. వానియందలి విషయమును ఎఱిగి వివేచనతో తత్త్వనిర్ణయము చేసినవారు. మాత్రమే ఆ ప్రమాణభూతములగు వేద శాస్త్రములందలి తాత్త్విక విషయ మిదియని చెప్పగలరు గాని మిగిలినవారు గ్రంథములను ధారణ చేయుట బరువును మోయుటకు మాత్రమే. నేను తత్త్వమును ఉన్నది ఉన్నట్లుగ చెప్పెదను వినుము. ఈ విషయమున సిద్ధాంతములో యోగులకును సాంఖ్యులకును అభిప్రాయభేదము లేదు. ఈ రెండు దర్శనములును ఒకదానిని మఱియొకటి అనుగమించుచునే - పరస్పర విరోధము లేకుండ విషయమును ప్రతిపాదించుచునే యుండును. వాటి పరస్పర సమన్వయము నెఱిగినవాడే తత్త్వజ్ఞుడు.

త్వ ఙ్మాంసం రుధిరం మేదః పిత్తం మజ్జాస్థి స్నాయు చ | ఏత దైంద్రియికం తాత యద్భవానిత్థమాత్థమామ్‌ ||

ద్రవ్యా ద్ద్రవ్యస్య నిర్వృత్తి రింద్రియా దింద్రియం తథా | దేహాద్దేహ మవాప్నోతి బీజాద్బీజం తథైవ చ || 22

నిరింద్రియస్య బీజస్య నిర్ద్రవ్య స్యాపి దేహినః | కథం గుణా భవిష్యంతి నిర్గుణత్వా న్మహాత్మనః || 23

గుణా గుణషు జాయంతే తత్రైవ విరమంతి చ | ఏవం గుణాః ప్రకృతిజా జాయంతే న చ యాంతి చ || 24

త్వ ఙ్మాంసం రుధిరం మేదః పిత్తం మజ్జాస్థి స్నాయు చ | అష్టౌ తాన్యథ శుక్రేణ జానీహి ప్రాకృతేన వై ||

పుమాంశ్చైవాపుమాంశ్చైవ స్త్రీలింగం ప్రాకృతం స్మృతమ్‌ | వాయురేష పుమాంశ్చైవ రస ఇత్యభిధేయతే || 26

అలింగా ప్రకృతిర్లింగై రుపలభ్యతి సా೭೭త్మజైః | యథా పుష్పఫలైర్నిత్యం మూర్తం చామూర్తయ స్తథా || 27

ఏవ మ ప్యనుమానేన స లింగ ముపలభ్యతే | పంచవింశతిక స్తాత లింగేషు నియతాత్మకః || 28

అనాదినిధనోనంతః సర్వదర్శనకేవలః || కేవలం త్వభిమానిత్వా ద్గుణషు గుణ ఉచ్యతే || 29

గుణా గుణవతః సంతి నిర్గుణస్య కుతో గుణాః | తస్మా దేవం విజానంతి యే జనా గుణదర్శినః || 30

యదా త్వేష గుణా సేతా న్ప్రాకృతా నభిమన్యతే | తదా స గుణవా నేవ గుణభేదా న్ప్రపశ్యతి || 31

య త్త ద్బుద్ధేః పరం ప్రాహుః సాంఖ్యయోగం చ సర్వశః | బుధ్యమానం మహాప్రాజ్ఞాః ప్రబుద్ధపరివర్జనాత్‌ ||

అప్రబుద్ధం యథా వ్యక్తం స్వగుణౖః ప్రాహు రీశ్వరమ్‌ | నిర్గుణం చేశ్వరం నిత్య మధిష్ఠాతార మేవ చ || 33

ప్రకృతే శ్చ గుణానాం చ పంచవింశతికం బుధాః | సాంఖ్యయోగే చ కుశలా బుధ్యంతే పరమైషిణః || 34

యదా ప్రబుద్ధ మవ్యక్త మవస్థాపన భీ రవః | బుధ్యమానం న బుధ్యంతేవగచ్ఛంతి సమం తథా || 35

ఏత న్నిదర్శనం సమ్య ఙ్న సమ్యగను దర్శనమ్‌ | బుధ్యమానం ప్రబుధ్యంతే ద్వాభ్యాం పృథగరిందమ || 36

పరస్పరే ణౖతద్దుఃఖం క్షరాక్షర నిదర్శనమ్‌ | ఏకత్వ మక్షరం ప్రాహు ర్నానాత్వం క్షర ముచ్యతే || 37

పంచవింశతి నిష్ఠోయం తదా సమ్య క్ర్పచక్షతే | ఏకత్వ దర్శనం చాస్య నానాత్వం చాస్య దర్శనమ్‌ || 38

తత్త్వవి త్తత్త్వయోరేవ పృథ గేత న్నిదర్శనమ్‌ | పంచ వింశతిభి స్తత్వం తత్త్వమాహు ర్మనీషిణః || 39

నిస్తత్త్వం పంచవింశస్య పర మాహు ర్మనీషిణః | వర్జ్యస్యవర్జ్యమాచారం తత్త్వం తత్త్వా త్సనాతనమ్‌ || 40

వసిష్ఠు డింకను ఇట్లు పలికెను : ద్రవ్యమునుండి ద్రవ్యము ఇంద్రియమునుండి ఇంద్రియము దేహమునుండి దేహము బీజమునుండి బీజము గుణములనుండి గుణములు ఉత్పన్నమగును. చతుర్వింశతి తత్త్వరూపమగు ప్రకృతి కంటె అతీతమగు పంచవింశతితమ - ఇరువదియైదవ - తత్త్వము బీజము. దానికి ద్రవ్యములు ఇంద్రియములు దేహములు గుణములు అనునవి లేవు. త్వక్కుమాంసము రక్తము మేదస్సు పిత్తము మజ్జ అస్థి స్నాయుము ఈ ఎనిమిదియు స్త్రీనుండి ఏర్పడినను పురుషునినుండి ఏర్పడినను ఇవి అన్నియు ప్రాకృతికములు - ప్రకృతినుండి కలిగినవి. ఇవి అన్నియు లింగములు. హేతువులు - గుర్తులు : పంచవింశతి తమతత్త్వమగు ఆత్మ ఇచ్చట ఉపాధిని గ్రహించియున్నదని మనము వ్యవహారమునకై గుర్తించుటకు ఉపపత్తి మాత్రము. అనగా పర్వతమునకు ఆవల దూరముగా పొగ కనిబడగా అచ్చట ఆ పొగ యున్న తప్పకయుండవలసిన అగ్ని యున్నదని ఊహించినట్లే ఆయా పనులను చేయుచున్న దేహములో ఈ ఆత్మతత్త్వమున్నదని ఊహించుటకు అవకాశముమ ఇచ్చునది లింగము. అంతేకాని ఈదేహము - ఇంద్రియములు - ధాతువులు ప్రకృతిజనితములేకాని అది క్షరతత్త్వముయొక్కకాని అక్షర తత్త్వముయొక్క కాని వాస్తవరూపము కాదు. అంతేకాక ఆ క్షరాక్షరాత్మకమగు ఆత్మతత్త్వము నిర్గుణము. నిరింద్రియము నిర్దేహము. ఐనను మాయాకృతమైన అహంకార మమకారావరణముచే సగుణము సేంద్రియము - సశరీరము అగుచున్నది. ఈ ప్రకృతియు మాయాకృతము. అనగా ఈ దృశ్యమగు ఈ ప్రకృతి యంతయు ఆ ఆత్మతత్త్వము యొక్క వ్యక్తరూపము. ఇవిలేని ఆ తత్త్వము అవ్యక్తము. అవ్యక్తము ప్రబుద్ధము - బుద్ధ్యమానము. వ్యక్తమగు క్షరతత్త్వము అప్రబుద్ధము. అదియే ఈ మాయాకృత ప్రకృతితత్త్వములు ఇరువది నాలుగింటికి అతీతమగు ఇరువదియైదవ తత్త్వము. ఏకత్వము అక్షరతత్త్వము. నానాత్వము క్షరతత్త్వము. ఇది వాస్తవమగు విషయ ప్రతిపాదనము.

కరాలజనక ఉవాచ :

నానా త్వైకత్వ మిత్యుక్తం త్వ యైత ద్ద్విజసత్తమ | పశ్యత స్తద్ధి సందిగ్ధ మేతయో ర్వై నిదర్శనమ్‌ || 41

తథా బుద్ధ ప్రబుద్ధాభ్యాం బుధ్యమానస్య చానఘ | స్థూల బుద్ధ్యా న పశ్యామి తత్త్వ మేత న్న సంశయః || 42

అక్షరక్షరయో రుక్తం త్వయా య దపి కారణమ్‌ | తద ప్యస్థిర బుద్ధిత్వా త్ప్రనష్టమివ మేనఘ || 43

త దేత చ్ఛ్రోతు మిచ్ఛామి నానాత్వైకత్వ దర్శనమ్‌ | ద్వంద్వం చైవానిరుద్ధం చ బుధ్యమానం చ తత్త్వతః || 44

విద్యావిద్యే చ భగవ న్నక్షరం క్షర మేవ చ | సాంఖ్యయోగం చ కృత్స్నేన బుద్ధా బుద్ధిం పృథక్పృథక్‌ || 45

జనకుడు వసిష్ఠుని ఇట్లు ప్రార్ధించెను : ఓ ద్విజసత్తమా! ఏకత్వము అక్షరతత్త్వము - నానాత్వము క్షరతత్త్వము అని తాము చెప్పిన విషయము నిస్సంశయముగా నాకు అవగతము కాలేదు. ప్రబుద్ధము - బుధ్యమానమ-అప్రబుద్ధము అను నిదర్శనము కూడ నాకు అవగతము కాలేదు. అక్షరక్షరముల వివేచించుకొనుటకు తాము తెలిపిన హేతువులు కూడ నా బుద్ధి అస్థిరమగుటచే దానియందు నిలువలేదు. కావున తాము నాయందలి దయతో అక్షరక్షర తత్త్వములను ఏకత్వ నానాత్వములతో దర్శించవలసిన తీరును ద్వంద్వముల స్థితిని అక్షరతత్త్వము ఆ ద్వంద్వములచే నిరుద్ధము - అడ్డగించబడినది - బాధనొందబడినది - కాని స్థితిని విద్య - అవిద్య - వీని స్వరూపమును సాంఖ్య విధానమునను యోగవిధానమునను తత్త్వమును వివేచించు ప్రక్రియలను బుద్ధ ఆబుద్ధస్థితుల వివేచనమును చక్కగా తెలుప ప్రార్థించుచున్నాను.

వసిష్ఠ ఉవాచ :

హంత తే సంప్రవక్ష్యామి య దేత దనుపృచ్ఛసి | యోగకృత్యం మహారాజ పృథగేవ శృణుష్వమే || 46

యోగకృత్యం తు యోగానాం ధ్యాన మేవ పరం బలమ్‌ | తచ్చాపి ద్వివిధం ధ్యాన మాహు ర్వాద్యావిదో జనాః ||

ఏకాగ్రతా చ మనసః ప్రాణాయామ స్తథైవ చ | ప్రాణాయామస్తు సగుణో నిర్గుణో మానస స్తథా || 48

మూత్రోత్సర్గే పురీషే చ భోజనే చ నరాధిప | ద్వికాలం నోపభుంజీత శేషం భుంజీత తత్పరః || 49

ఇంద్రియాణీంద్రియార్థేభ్యో నివర్త్య మనసా మునిః | దశద్వాదశభి ర్వాపి చతుర్వింశాత్పరం యతః || 50

స చోదనాభిర్మతిమా న్నా೭೭త్మానం చోదయే దథ | తిష్ఠంత మజరం తంతు యత్త దుక్తం మనీషిభిః || 51

విశ్వాత్మా సతతం జ్ఞేయ ఇత్యేవ మనుశుశ్రుమ | ద్రవ్యం హ్యహీన మనసో నాన్యథేతి వినిశ్చయః || 52

విముక్తః సర్వ సంగేభ్యో లవాహారో జితేంద్రియః | పూర్వరాత్రే పరార్ధే చ ధారయీత మనో హృది || 53

స్థిరీకృ త్యేంద్రియగ్రామం మనసా మిథిలేశ్వర | మనో బుద్ధ్యా స్థిరం కృత్వా పాషాణ ఇవ నిశ్చలః || 54

స్థాణువ చ్చా ప్యకంప్యః స్యా ద్దారువ చ్చాపి నిశ్చలః | బుద్ధ్యా విధివిధానజ్ఞ స్తతో యుక్తం ప్రచక్షతే || 55

న శృణో తి న చా೭೭ఘ్రాతి న చ పశ్యతి కించన | న చ స్పర్శం విజానాతి న చ సంకల్పతే మనః || 56

న చాపి మన్యతే కించి న్న బుధ్యేత కాష్ఠవత్‌ | తదా ప్రకృతి మాపన్నం యుక్త మాహు ర్మనీషిణః || 57

న భాతి హి యథా దీపో దీప్తి స్తద్వచ్చ దృశ్యతే | నీలింగ శ్చాధ శ్చోర్ధ్వం చ తిర్య గ్గతి మవాప్నుయాత్‌ || 58

తదా త దుపపన్న శ్చ యస్మి న్దృష్టే చ కథ్యతే | హృదయస్థోంతరా త్మేతి జ్ఞేయో జ్ఞ స్తాత మద్విధైః || 59

నిర్ధూమ ఇవ సప్తార్చి రాదిత్య ఇవ రశ్మివాన్‌ | వైద్యుతోగ్నరి వా೭೭కాశే పశ్య త్యాత్మాన మాత్మని || 60

యం పశ్యంతి మహాత్మానో ధృతిమంతో మనీషిణః | బ్రాహ్మణా బ్రహ్మయోనిస్థా హ్యయోని మమృతాత్మకమ్‌ ||

తదే వాహు రణుభ్యోణు త న్మహద్భ్యో మహత్తరమ్‌ | సర్వత్ర సర్వభూతేషు ధ్రువం తిష్ఠ న్న దృశ్యతే ||

బుద్ధి ద్రవ్యేణ దృశ్యేన మనోదీపేన లోకకృత్‌ | మహత స్తమస స్తాత పారే తిష్ఠ న్న తామసః || 63

తమసో దూర ఇత్యుక్త స్తత్త్వజ్ఞై ర్వేద పారగైః | విమలో విమత శ్చైవ నిర్లింగోలింగ సంజ్ఞకః || 64

యోగ ఏష హి లోకానాం కి మన్య ద్యోగ లక్షణమ్‌ | ఏవం పశ్య న్ప్రపశ్యేన ఆత్మాన మజరం పరమ్‌ || 65

వసిష్ఠుడు జనకునితో ఇట్లు పలికెను : నీవడిగిన ప్రశ్నకు చాల సంతోషము కలిగినది. ఓ మహారాజా! నీవడిగిన వానిలో యోగశాస్త్రానుసారియగు తత్త్వ వివేచన ప్రక్రియను నీకు తెలిపెదను. వినుము. ఈ ప్రక్రియలో ధ్యానమే యోగసాధనకు బలమును చేకూర్చును. ధ్యానము కూడ మనస్సుయొక్క ఏకాగ్రత - ప్రాణాయామము అని రెండువిధములు. ఈ రెండిటిలో ప్రాణాయామము సగుణధ్యానప్రక్రియ. మానస ఏకాగ్రతారూపమగు ధ్యానము నిర్గుణమైనది. ఈ రెండువిధములగు ధ్యానప్రక్రియలలో దేనిని సాధన చేయదలచినను ఈ చెప్పబోవు నియమములను తప్పక పాటించవలెను. మూత్రవిసర్జనము మలవిసర్జనము నియతములు కావలెను. అందులకై ఆహారమునను నియమము కావలెను. దినమున రెండుమారులు భుజింపరాదు. భగవంతునికి నివేదించిన దానిని తత్పరుడై భుజించవలెను. ఇంద్రియములను ఆయా ఇంద్రియ విషయములనుండి మరలించి మనస్సు నియమించవలెను. మౌనమును విచారణా శీలత్వమును పూనవలెను. ఆ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మాత్రమే అని లెక్కించినచో పదిమాత్రము. వాటితో మనోబుద్ధులను కూడ చేర్చినచో పండ్రెండు. ఇట్టి ఇంద్రియనిగ్రహ పూర్వకమగు ధ్యాన ప్రక్రియతో చతుర్వింశతి తత్త్వములకు అతీతమగు తత్త్వమును సాక్షాత్కరించుకొనవలెను. మనస్సును తత్త్వ సాక్షాత్కరామునకై చోదన చేయవలెను. ఆ తత్త్వము అజరము. విశ్వాత్మకము. అదియే జ్ఞేయము - తెలిసికొన - సాక్షాత్కరించుకొనదగినది. ఉన్నత మనస్సు గల సాధకుడు ఆశ్రయించవలసినది ఈ తత్త్వమునే. మఱి దేనిని కాదు.సర్వసంగములను విడిచి లఘువు - తేలికగా జీర్ణమగు - ఆహారము తినుచు ఇంద్రియములను జయించి రాత్రియొక్క మొదటి జాములోనో కడపటి జాములోనో మనస్సును తత్త్వముపై నిలుపవలెను. కొయ్యమొద్దువలె నిశ్చలుడై- అనగా స్థిరమగు చిత్తము కలవాడై- విధివిధానముతో ధ్యానము చేసినవాడు యుక్తుడు- యోగసాధకుడు అని చెప్పబడును. అప్పుడు ఆ సాధకుడు ఏమియు వినడు; వాసన చూడడు; చూడడు : స్పర్శమునను భవించడు ; మనస్సుతో ఏదియు సంకల్పించడు : ఆలోచింపడు : ఎఱుగడు. అప్పుడే ఈ యుక్తుడు- యోగసాధకుడు- ప్రకృతిని స్వాభావిక స్థితియగు- తత్త్వమును- పొందెనని చెప్పబడును. ఆ స్థితిలో ఈ ఆత్మతత్త్వము లోకమునందలి దీపమువలె వత్తి నూనె ప్రమిద మొదలగునవి లేకయు ప్రకాశించును. దానికి ఇంద్రియములు మొదలగు వ్యావహారిక చిహ్నములు ఏవియు లేవు. క్రిందికిని పైకిని అడ్డముగాను అన్నివైపులకును ప్రసరించగలదు : ఆ తత్త్వ దర్శనము కాగానే సాధకుడు ఆత్మదర్శనముతో కూడినవాడ య్యెను. అనబడును. అతడే హృదయస్థుడగు అంతరాత్మ. ఆతడే జ్ఞేయుడు- తెలియబడ వలసినవాడు. జ్ఞుడు - అన్నింటిని ఎఱిగినవాడు. అని నావంటి తత్త్వవేత్తలు చెప్పుదురు. ఆ తత్త్వము పొగలేని అగ్నివంటిది. కిరణములు ఏ ఆవరణములును లేక వెలుగు సూర్యునివంటివాడు. నిర్మలాకాశమున ప్రకాశించు మెఱపు ప్రకాశమువంటివాడు. ఈ తత్త్వమును ధృతిమంతులు - నిశ్చలచిత్తము కల మనీషులు మహాత్ములు బ్రహ్మనిష్ఠులగు బ్రాహ్మణులు తనయందు తన్నే దర్శింతురు. ఈ మహాతత్త్వము తనకు ఏదియు ఉత్పత్తిహేతువు లేనట్టిది. అమృతరూపమైనది. అది అణువులకంటె అణుతరము. మహత్తులకంటె మహత్తరము. అంతట అన్ని భూతములయందు నిశ్చయముగా నిశ్చలముగా నుండియు కనబడదు- లోకకర్తయగు ఈతడు బుద్ధియను ద్రవ్యముతో వెలుగు మనోదీపము యొక్క ప్రకాశము సాయమున చూడ సాధ్యమగును. మహాతపస్సునకు ఆవల నుండును. తమోగుణముచే ఆవరింపబడినవాడు కాదు. వేదతత్త్వజ్ఞులగువారు ఈ తత్త్వమును గూర్చియే''తమసఃపరస్తాత్‌'' ''తమస్సునకు ఆవల దూరముగా నున్నవాడు'' అని చెప్పచున్నారు. ఇతడు విమలుడు. లింగరహితుడు -అనగా ఇంద్రియ దేహాదిఉపాధులు లేనివాడయ్యు కలవాడై కనబడుచున్నాడు. ఈ యోగదర్శనమును అనుష్ఠించినవారు అజరుడు-నాశరహితుడు - అగు పరమాత్ముని దర్శింపగలుగుదురు.

యోగదర్శన మేతావ దుక్తం తే త త్త్వతో మయా | సాంఖ్య జ్ఞానం ప్రవక్ష్యామి పరిసంఖ్యా నిదర్శనమ్‌ || 66

అవ్యక్త మాహుః ప్రఖ్యానం పరాం ప్రకృతి మాత్మనః | తస్మా న్మహ త్సముత్పన్నం ద్వితీయం రాజసత్తమ || 67

అహంకార స్తు మహత స్తృతీయ ఇతి నః శ్రుతమ్‌ | పంచభూతా న్యహంకారా దాహుః సాంఖ్యాత్మ దర్శినః || 68

ఏతాః ప్రకృతయ స్త్వష్టౌ వికారా శ్చాపి షోడశ | పంచ చైవ విశేషా శ్చ తథా పంచేంద్రియాణి చ || 69

ఏతావదేవ తత్త్వానాం సాంఖ్య మాహు ర్మ నీషిణః | సాంఖ్యే సాంఖ్య విధానజ్ఞా నిత్యం సాంఖ్యపథే స్థితాః || 70

యస్మా ద్య దభిజాయేత తత్తత్రైవ ప్రలీయతే | లీయంతే ప్రతిలోమాని గృహ్యంతే చాంతరాత్మనా || 71

ఆనులోమ్యేన జాయంతే లీయంతే ప్రతిలోమతః | గుణా గుణషు సతతం సాగర స్యోర్మయో యథా || 72

సర్గప్రలయ ఏతావా న్ప్రకృతే ర్నృప సత్తమ | ఏకత్వం ప్రలయే చాస్య బహుత్వం చ తథా సృజి || 73

ఏవ మేవ చ రాజేంద్ర విజ్ఞేయం జ్ఞానకోవిదైః | అధిష్ఠాతార మవ్యక్త మస్యాప్యేత న్నిదర్శనమ్‌ || 74

ఏకత్వం చ బహుత్వం చ ప్రకృతే రనుతత్త్వవాన్‌ | ఏకత్వం ప్రలయే చాస్య బాహుత్వం చ ప్రవర్తనాత్‌ || 75

బహుధా೭೭త్మా ప్రకుర్వీత ప్రకృతిం ప్రసవాత్మి కామ్‌ | త చ్చ క్షేత్రం మహా నాత్మా పంచవింశోధితిష్ఠతి|| 76

అధిష్ఠా తేతి రాజేంద్ర ప్రోచ్యతే యతి సత్తమైః | అధిష్ఠానా దధిష్ఠాతా క్షేత్రాణా మితి నః శ్రుతమ్‌ || 77

క్షేత్రం జావాతి చావ్యక్తం క్షేత్రజ్ఞ ఇతి చోచ్యతే | ఆవ్యక్తికే పురే శేతే పురుష శ్చేతి కథ్యతే || 78

అన్య దేవ చ క్షేత్రం స్యా దన్యః క్షేత్రజ్ఞ ఉచ్యతే | క్షేత్ర మవ్యక్త ఇ త్యుక్తం జ్ఞాతారం పంచవింశకమ్‌ || 79

అన్య దేవ చ జ్ఞానం స్యా దన్య జ్జేయం త దుచ్యతే | జ్ఞాన మవ్యక్త మిత్యుక్తం జ్ఞేయో వై పంచవింశకః || 80

అవ్యక్తం క్షేత్ర మి త్యుక్తం తథా సత్త్వం తథేశ్వరమ్‌ | అనీశ్వర మతత్త్వం చ తత్త్వం త త్పంచవింశకమ్‌ ||

సాంఖ్య దర్శన మేతావ త్పరి సంఖ్యా న విద్యతే | సంఖ్యాం ప్రకురుతే చైవ ప్రకృతిం చ ప్రవక్ష్యతే || 82

చత్వారింశ చ్చతుర్వింశ త్ప్రతి సంఖ్యాయ తత్త్వతః | సంఖ్యా సహస్రకృత్యా తు నిస్తత్త్వః పంచవింశకః || 83

పంచవింశ త్ర్పబుద్ధాత్మా బుధ్యమాన ఇతి శ్రుతః | యదా బుధ్యతి ఆత్మానం తదా భవతి కేవలః || 84

సమ్య గ్ధర్శన మేతావ ద్భాషితం తవ తత్త్వతః | ఏవ మేత ద్విజానంతః సామ్యతాం ప్రతియాంత్యుత || 85

సమ్య ఙ్నిదర్శనం నామ ప్రత్యక్షం ప్రకృతే స్తథా | గుణవత్త్వా ద్య థైతాని నిర్గుణభ్య స్తథా భ##వేత్‌ || 86

న త్వేవం వర్తమానానా మావృత్తి ర్వర్తతే పునః | విద్యతే క్షరభావ శ్చ న పరస్పర మవ్యయమ్‌ || 87

పశ్యం త్యమతయో యే న సమ్య క్తేషు చ దర్శనమ్‌ | తే వ్యక్తిం ప్రతి పద్యంతే పునః పున రరిందమ || 88

సర్వ మేత ద్విజానంతో న సర్వస్య ప్రబోధనాత్‌ | వ్యక్తి భూతా భవిష్యంతి వ్యక్త సై#్యవాను వర్తనాత్‌ || 89

సర్వ మవ్యక్త మిత్యుక్త మసర్వః పంచ వింశకః | య ఏవ మభిజానంతి న భయం తేషు విద్యతే || 90

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వసిష్ఠకరాల జనక సంవాద వర్ణనంనామ త్రిచత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

ఇంతవరకును నేను నీకు యోగదర్శనమును తాత్త్వికముగా తెలిపితిని. ఇక సాంఖ్య జ్ఞాన - దర్శనము - ను తెలిపెదను. ఇది పరిసంఖ్యా నిదర్శనరూపమైనది. (ఇదియే సత్యము కాని అది సత్యము కాదు అని చెప్పుట పరిసంఖ్యానము. సామాన్య మానవులకు వ్యవహారములో కనబడుచున్నందున ఈ లోకము సత్యమే యని పించును. కాని శాస్త్రములలో మాత్రము ప్రపంచము శాశ్వతమగు సత్యముకాదు. పరమాత్మ తత్త్వమే శాశ్వతమగు సత్యమని చెప్పబడుచున్నది. ఈ రెండిటిలో ఏది గ్రాహ్యము? అని సందేహము కలుగును. అట్టివానికి వివేచనాపూర్వకముగా జగత్తు యొక్క సత్యత్వమును నిర్ధారించునది పరిసంఖ్య అదియేసంఖ్య; సంఖ్యా - నిర్ణయ - ప్రధానమైన దర్శనము సాంఖ్య దర్శనము. ఇది మీమాంసాశాస్త్ర ప్రక్రియననుసరించిన వివరణము- అనువాదకుడు.)

(ప్రకృతి యనగా స్వాభివికస్థితి యని అర్థము. ఇది పరాప్రకృతి - అపరాప్రకృతి - అపరాప్రకృతి యని రెండు విధములు. ఈ విషయములో భగ. 7అ.

4. భూమిరాపోనలో వాయుః | ఖం మనోబుద్ధి రేవచ,

అహంకార ఇతీయంమే| భిన్నా ప్రకృతి రష్టధా.

5. అపరేయ మితస్త్వన్యాం| ప్రకృతిం విద్ధి మే పరామ్‌

జీవభూతాం మహాబాహో| యయేదంధార్యతే జగత్‌.

6. ఏతద్యోనీని భూతాని| సర్వాణీత్యువ ధారయ

అహంకృత్స్నస్య జగతః| ప్రభవః ప్రళయన్తథా.

7. మత్తః పరతరం నాన్యత్‌| కించిదస్తి ధనంజయ

మయిసర్వమిదంప్రోతం నూత్రేమణిగణాఇవ.

అను శ్లోకముల యర్థమును అను సంధానము చేసికొని విషయమునుగ్రహించుటకు ప్రయత్నించవలెను - అను వాడకుడు.)

ఆ పరమాత్మతత్త్వముయొక్క వ్యక్తస్థితికి మూలమగు పరమస్థితి అవ్యక్తస్థితి- ఇదియే ప్రఖ్యానము వ్యక్తత - అనబడును. ఇదియు పరమాత్మునియొక్క ప్రకృతి - స్వాభావికస్థితి - యే. కాని ఉత్కృష్టమైనదియు మొట్టమొదటిదియు కావున ''పరాప్రకృతి'' అనబడును. రెండవదశ మహత్త్వము. ఇదియే వేదాంత దర్శనమునందలి బుద్ధి తత్త్వాత్మకమగు హిరణ్య గర్భుడు అనెడి తత్త్వము. మహత్తునుండి అహంకారము వ్యక్తమగుట మూడవదశ. అహంకారమునుండి పంచ-సూక్ష్మ - అపంచీకృత భూతము లేర్పడుట నాలుగవదశ. మహత్తు-అహంకారము-మనస్సు-పంచభూతములు - అనెడి ఎనిమిదియు అపరా - ప్రకృతి అనబడును. వీని విస్తరణములగు షోడశ వికారములు - విశేష పంచకము - పంచేంద్రియములు మొదలగు భౌతికసృష్టియంతయు ఐదవదశ. ఇదియే సాంఖ్య తత్త్వమంతయు.

షోడశకశ్చ వికారః - సాంఖ్యకారికలు - 3కా. అనియు గణశ్చషోడశకః - సాంఖ్య 22కా. అనియు చెప్పిన విధమున ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు శబ్దస్పర్శ రూపరస గంధములు అనెడి తన్మాత్రలు ఐదు మనస్సు మొత్తము పదునారు వికారములు. వీనిలో ఈ ఐదు తన్మాత్రలు స్థూల భూత సృష్టికి మూలము కావున ఐదు విశేషములు - వాటిని జీవుడు అనుభవించుటకు సాధనములు కావున ఐదు జ్ఞానేంద్రి యములు ముఖ్యములనిఇచట సూచింపబడినదని గ్రహించ వలెను - అనువాదకుడు.

ఇవి అన్నియు ఏక్రమమున నృష్టింపబడినవో అక్రమమునకు ప్రతిలోమముగా లయము జరుగును. అనగా చివరి చివరిది లయమొంది మొదటి మొదటిది మిగులుచు వచ్చును. ఈ లయము అలలు సముద్రములో లయమగుటవంటిది. ఏలయన ఏది ఎచట నుండి జనించునో అదిదానియందే లయమొందును. ఇట్లు లయమొందగా కడపటికి మిగిలిన ఆత్మతత్త్వము యోగసాధనమున తనయందు తన్నుతానుగా చూచును. ఓ రాజసత్తమా! అపరాపరా ప్రకృతులు సృష్టి ప్రళయ స్వరూపక్రమము ఇదియే. ప్రళయమునకు తరువాత ఏకత్వము. సృష్టికాలములో నానాత్వము. దీనికంతటికిని అధిష్ఠాత అవ్యక్త కూటస్థతత్త్వము. పరమాత్ముడు తన్నుతాను నానాత్వమున రూపొం దించుకొనగా ఏర్పడిన పాంచ భౌతికదేహము క్షేత్రము. దానిని మహాన్‌ ఆత్మా - మాయావశమున ఆశ్రయించి అధిష్ఠాతయై యుండును. ఇది ఇరువది ఐదవ తత్త్వము. ఇతడు క్షేత్రమును ఎరుగును - క్షేత్రం - జానాతి - కావున క్షేత్రజ్ఞుడు. వ్యక్తరూపమగు ఈ దేహము అనుపురమున శయనించుటచే - పురి - శేతే - పురుషుడు అనబడును. ఇదియే క్షేత్రక్షేత్రజ్ఞ వ్యక్తావ్యక్త పరా7పరా ప్రకృతి వివేచనక్రమము. ఈక్షేత్రజ్ఞుడే జ్ఞాత- జానాతి -తెలిసికొనువాడు. ఈ జ్ఞాతయొక్క స్థితిని ఆధారముగా చేసికొని - జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము అను త్రిపుటి ఏర్పడుచున్నది. ఇచట మఱియు సూక్ష్మమగు వివేచనాక్రమముఇది; క్షేత్రజ్ఞుడుగానున్న అవ్యక్తతత్త్వము - వ్యక్తమైనట్లు కనబడుచు - జ్ఞాత అగును. వ్యక్తతత్త్వములకు అతీతమైన ఇవువదియైదవ శుద్ధతత్త్వము జ్ఞేయము - తెలియబడవలసినది. దానిని ఎరుగుట వ్యవహారదశలో జ్ఞానము - కాని పరమార్ధదశలో ఆఅవ్యక్త - శుద్ధ - తత్త్వము ఒక్కటియే జ్ఞానము అది ఎఱుగుట అనెడి వ్యాపారమునకు - పనికి - అతీతము అదిచిత్‌ - జ్ఞాన - రూపమైనది.

ఓ జనక మహారాజా! వాస్తవమగు జ్ఞానమనగా ఈ పరాప్రకృతిని సాక్షాత్కరించు కొనుటయే. సగుణమునుండి నిర్గుణమును వేరుపరచి తెలిసికొని అది తానగుటయే. ఈ స్థితిని పొందినవారికి జనన మరణావృత్తిలేదు. క్షరభావము ఉండదు. కావున క్షరాక్షర ములు రెండును లోకవ్యవహారమునందలి స్త్రీ పురుషులవలెపరస్పరాశ్రయములని నీవను కొనిన భావమునకుకూడ ఇచ్చట అవకాశములేదు. ఇదియెరుగక వేరుగా తెలిసి కొను మందమతులకు జననమరణ పునరావృత్తి తప్పదు. వారు అవ్యక్తతత్త్వమును వ్యక్తతత్త్వమునుగా చూచుటచే దానినే అనువర్తించుచు వ్యక్తస్థితిలో పడియుండక - సంసారమున సంచరించక - తప్పదు. వ్యక్తప్రపంచమునందలి ఏ తత్త్వమునుకానట్టి ఇరువదియైదవదగు అవ్యక్తతత్త్వమును ఎరిగినవారికి భయములేదు.

(ఇచట ప్రమాణము : తైత్తిరీయోపనిషత్‌ ఆనందవల్లీ - అనువాకము-7 -యదా హ్యేవైష ఏతస్మి న్నదృశ్యేనాత్మ్యేనిరుక్తే నిలయనే భయం ప్రతిష్ఠాం విందతే | అథ సోభయం గతో భవతి | యదా హ్యేవైష ఏతస్మి న్నుదర మంతరం కురుతే | అథ తస్య భయం భవతి|)

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వసిష్ఠజనక సంవాదమున క్షరాక్షరతత్త్వ సంబంధనిరూపణమను రెండువందల నలువది మూడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters