Sri Sivamahapuranamu-I    Chapters   

అథ షష్ఠోధ్యాయః

పార్వతి పుట్టుట

బ్రహ్మోవాచ |

అథ సంస్మరతుర్భక్త్యా దంపతీ తౌ భవాంబికామ్‌ | ప్రసూతి హేతవే తత్ర దేవకార్యర్థ మాదరాత్‌ || 1

తతస్సా చండికా యోగాత్త్యక్తదేహా పురా పితుః | ఈహయా భవితుం భూయస్సమైచ్ఛద్గిరిదారతః || 2

సత్యం విధాతుం స్వవచః ప్రసన్నాఖిలకామదా | పూర్ణాంశాచ్ఛైలచిత్తే సా వివేశాథ మహేశ్వరీ || 3

విరరాజ తతస్సోతి ప్రముదోపూర్వసుద్యతిః | హు తాశన ఇవాధృష్యస్తే జోరాశిర్మహామనాః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడా దంపతులు దేవ కార్యమునందు శ్రద్ధ గలవారై జగన్మాతను కుమార్తెగా పొందగోరి ఆమెను భక్తితో నిత్యము స్మరించుచుండిరి (1). పూర్వము తండ్రివలన అవమానమును పొంది యోగాగ్నిచే శరీరమును త్యజించిన ఆ చండిక అపుడు మరల హిమవంతుని భార్యయొక్క గర్భమునందు జన్మించుటకు సంకల్పించెను (2). ప్రసన్నురాలై కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఆ తల్లి తాను ఇచ్చిన మాటను సత్యము చేయదలచెను. అపుడా మహేశ్వరి పూర్ణాంశముతో హిమవంతుని మనస్సులో ప్రవేశించెను (3). విశాల హృదయుడు అగు ఆ హిమవంతుడు అపుడు మిక్కిలి ఆనందము గలవాడై, అపూర్వ కాంతులతో విరాజిల్లెను. ఆయన అగ్నిహోత్రము వలె తేరిపార చూడరాని తేజస్సుతో విరాజిల్లెను (4).

తతో గిరిస్స్వప్రియాయాం పరిపూర్ణం శివాంశకమ్‌ | సమాధిమత్వాత్సమయే సమధత్త సుశంకరే || 5

సమ ధత్త గిరేః పత్నీ గర్భం దేవ్యాః ప్రసాదతః | చిత్తే స్థితాయాః కరుణాకరాయాస్సుఖదం గిరేః || 6

అపుడు హిమవంతుడు మంగళకరమగు సమయములో శివాదేవి యొక్క పూర్ణాంశమును పరిశుద్ధమగు చిత్తముతో తన ప్రియురాలియందు ఆధానము చేసెను (5). మేన తన మనస్సునందుండి కరుణను వర్షించే పరమేశ్వరి అనుగ్రహము వలన గర్భమును దాల్చెను. హిమవంతుని పత్ని గర్భవతి కాగా ఆ పర్వత రాజు మిక్కిలి సుఖమును పొందెను (6).

గిరిప్రియా సర్వజగన్నివాసా సంశ్రయాధికమ్‌ | విరేజే సుతరాం మేనా తేజోమండలగా సదా || 7

సుఖోదయం స్వభర్తుశ్చ మేనా దౌహృదలక్షణమ్‌ | దధౌ నిదానం దేవానా మానందస్యేప్సితం శుభమ్‌ || 8

దేహ సాదా దసంపూర్ణ భూషణా లోధ్రసంముఖా | స్వల్ప భేందుక్షయే కాలం విచేష్యర్‌క్షా విభావరీ || 9

తదాననం మృత్సురభి నాయం తృప్తిం గిరీశ్వరః | మునే రహస్యుపాఘ్రాయ ప్రేమాధిక్యం బభూ వతత్‌ || 10

హిమవంతుని ప్రియురాలగు మేన, సర్వ బ్రహ్మాండములకు నివాస స్థానమగు జగన్మాతను తన గర్భములో ధరించుటచే, సర్వదా తేజోరాశిచే వ్యాప్తయై అతిశయించిన ప్రకాశముతో ఒప్పారెను (7). మేన యొక్క గర్భిణీ లక్షణములు ఆమె భర్తకు ఆనందమును కలిగించెను. మరియు దేవతల శుభకరమగు కోరిక ఈడేరుటచే, వారికి ఆమె గర్భము ఆనందహేతువు ఆయెను (8). శరీరములో శక్తి తక్కువగా నుండుటచే తక్కువ ఆభరణులను ధరించి, లోధ్ర పుష్పమువలె పాండు వర్ణము గల ముఖముతో ప్రకాశించే ఆమె చంద్రుడు అస్తమించిన తరువాత కనబడీ కనబడని నక్షత్రములు గల రాత్రివలె భాసిల్లెను (9). ఓ మహర్షీ! పర్వతరాజగు హిమవంతుడు ఏకాంతమునందు మృద్గంధముతో గూడియున్న ముఖమును ముద్దాడి అతిశయించిన ప్రేమను ప్రదర్శించెను. అయిననూ, ఆయనకు తృప్తి కలుగలేదు (10).

మేనా స్పృహావతీ కేషు న మే శంసతి వస్తుషు | కించిదిష్టం హ్రియాపృచ్ఛదనువేలం సఖీర్గిరిః || 11

ఉపేత్య దౌహృదం శల్యం యద్వవ్రేపశ్యదాతు తత్‌ | ఆనీతం నేష్టమాస్యాద్దా నాసాధ్యం త్రిదివేపి హి || 12

ప్రచీయమానావయవా నిస్తీర్య దోహదవ్యథామ్‌ | రేజే మేనా బాలలతా నద్ధ పత్రాధికా యథా || 13

గిరిస్సగర్భాం మహిషీమమంస్త పృథివీమివ | నిధాన గర్భామభ్యంతర్లీనవహ్నిం శమీమివ || 14

మేన ఏయే వస్తువులను కోరుచున్నది ? ఆమె సిగ్గు వలన నాకు చెప్పకున్నది ఆమె అభీష్టమేమి? అని హిమవంతుడు ఆమె చెలికత్తెలను పదే పదే ప్రశ్నించెను (11). గర్భసంబంధి క్లేశమును పొందిన మేన దేనిని చూచినా, లేక కోరినా దానిని హిమవంతుడు వెనువెంటనే రప్పించి ఆమెకు ఇచ్చెడివాడు. ఆమెకు ఇష్టమై ముల్లోకములలో ఆయన సంపాందిప శక్యము కాని వస్తువు లేనే లేదు (12). వృద్ధి పొందిన అవయవములు గల ఆ మేన గర్భక్లేశమును అతిక్రమించి, అనేక పత్రములతో నిండుగా నున్న లేత తీగవలె ప్రకాశించెను (13). హిమవంతుడు గర్భవతియగు తన భార్యను, నిధులనన్నిటినీ తనలో దాచుకున్న పృథివిని వలె, అగ్నిని తన గర్భములో దాచుకున్న శమీ వృక్షమును వలె, భావన చేసెను (14).

ప్రియా ప్రీతేశ్చ మనసః స్వార్జితద్రవిణస్య చ | సమున్నతేశ్ర్శుతేః ప్రాజ్ఞః క్రియాశ్చకే యథోచితాః || 15

దదర్శ కాలే మేనాం స ప్రతీతః ప్రసవోన్ముఖీమ్‌ | అభ్రితాం చ దివం గర్భగృహే భిషగధిష్ఠితే || 16

దృష్ట్వా ప్రియాం శుభాంగీం వై ముమోదాతి గిరీశ్వరః | గర్భస్థ జగదంబాం హి మహతేజోవతీం తదా || 17

తస్మిన్నవసరే దేవా మునే విష్ణ్వా దయస్తథా | మునయశ్చ సమాగమ్య గర్భస్థాం తుష్టవుశ్శివామ్‌ || 18

వివేకి యగు హిమవంతుడు ప్రియురాలి మనస్సును సంతోషపెట్టుటకు, తాను సంపాందించిన ధనమును సద్వినియోగము చెయుటకు, వేదధర్మము యొక్క ఉన్నతి కొరకు వైదిక సంస్కారములనన్నిటినీ యథావిధిగా జరిపించెను (15). కొంత కాలము తరువాత హిమవంతుడు, వైద్యులచే రక్షింపబడుతూ పురిటి గృహములో నున్న మేనను చూచెను. ఆమె ప్రసవించుటకు సిద్ధముగా నుండి, మేఘములతో నిండి వర్షించుటకు సిద్ధముగా నున్న అంతరిక్షమువలె, ప్రకాశించెను (16). తన గర్భమునందు జగన్మాతను ధరించి మహా తేజస్సుతో నొప్పారు, శుభకరములగు అవయవములు గల ప్రియురాలిని చూచి, ఆ సమయములో హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (17). ఓ మహర్షీ! ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అచటకు వచ్చి గర్భమునందున్న ఉమా దేవిని స్తుతించిరి (18).

దేవా ఊచుః |

దుర్గే జయ జయ ప్రాజ్ఞే జగదంబ మహేశ్వరి | సత్యవ్రతే సత్యపరే త్రిసత్యే సత్య రూపిణి || 19

సత్యస్థే సత్యసుప్రీతే సత్యయోనే చ సత్యతః | సత్య సత్యే సత్యనేత్రే ప్రసన్నాశ్శరణం చ తే || 20

శివ ప్రియే మహేశాని దేవదుఃఖ క్షయంకరి | త్రైలోక్యమాతా శర్వాణీ వ్యాపినీ భక్తవత్సలా || 21

ఆవిర్భూయ త్రిలోకేశి దేవకార్యం కురుష్య హ | సనాథాః కృపయా తే హి వయం సర్వే మహేశ్వరి || 22

దేవతలిట్లు పలికిరి -

ఓ దుర్గా! నీకు జయము జయము. ఓ మహేశ్వరీ!నీవు జ్ఞానఘనవు, జగన్మాతవు. సత్యము నందు నీవు దృఢముగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు. సత్యమే నీ స్వరూపము గనుక, నీవు త్రికాలములయందు సత్స్వరూపిణివి (19). నీవు సత్యమునందుండి సత్యము నుండి అవతరించి సత్యముచే సుప్రీతురాలగుదువు. వ్యావహారిక సత్యమగు జగత్తునకు అధిష్ఠాన సత్యము నీవే. నీది సత్యదర్శనము. నిన్ను మేము శరణు పొందుచున్నాము (20). హే శివప్రియే!మహేశ్వరీ! నీవు దేవతల దుఃఖమును హరించెదవు. ముల్లోకములకు తల్లివి, శర్వుని పత్నివి అగు నీవు సర్వమును వ్యాపించియున్నావు. నీకు భక్తులయందు ప్రేమ మెండు (21). ఓ త్రిలోకములకు అధీశ్వరి యగు మహేశ్వరీ! నీవు అవతరించి దేవకార్యమును చేయుము. నీ దయచే మేము అందరము నాథవంతులమైతిమి (22).

త్వత్తస్సర్వే చ సుఖినో లభ##న్తే సుఖముత్తమమ్‌| త్వాం వినా న హి కించిద్వై శోభ##తే త్రిభ##వేష్యపి|| 23

ఉత్తమ సుఖములను పొందు వారందరూ ఆ సుఖములను నీనుండియే పొందుచున్నారు. ముల్లోకములలో నీవు లేనిదే ఏదియూ శోభించ జాలదు (23).

బ్రహ్మోవాచ |

ఇత్థం కృత్వా మహేశాన్యా గర్భ స్థాయా బహుస్తుతిమ్‌ | ప్రసన్నమనసో దేవాస్స్వం స్వం ధామ యయుస్తదా || 24

వ్యతీతే నవమే మాసి దశ##మే మాసి పూర్ణతః | గర్భ స్థాయా గతిం దధ్రే కాలికా జగదంబికా || 25

తదా సుసమయశ్చాసీచ్ఛాంత భగ్రహతారకః | నభః ప్రసన్నతాం యాతం ప్రకాశస్సర్వదిక్షు హి || 26

మహీ మంగల భూయిష్ఠా సవనగ్రామసాగరా | సరస్ర్సవంతీ వాపీషు పుపుల్లుః పంకజాని వై || 27

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవతలు ఈ తీరున గర్భమునందున్న మహేశ్వరిని పరి పరి విధముల స్తుతించి, ప్రసన్నమగు మనస్సు గలవారై, అపుడు తమ తమ ధామములకు వెళ్లిరి (24). తొమ్మిది మాసములు గడచి పదియవ మాసము పూర్తియగు నంతవరకు, జగన్మాతయగు కాళీదేవి గర్భస్థురాలై ఉండెను (25). అపుడు ఒకనొక శుభముహూర్తమునందు, నక్షత్రములు గ్రహములు శాంతములై యుండగా, ఆకాశము ప్రసన్నమై దిక్కులన్నియు ప్రకాశించుచుండగా (26),వనములతో గ్రామములతో సముద్రములతో కూడిన భూమి మంగళములతో నిండియుండెను. సరస్సులలో, నదులలో, దిగుడు బావులలో పద్మములు వికసించియుండెను (27).

వవుశ్చ వివిధా వాతస్సుఖస్పర్శా మునీశ్వర| ముముదుస్సాధవస్సర్వేసంతాన్‌ దుఃఖమ భూద్ద్రుతమ్‌ || 28

దుందుభీన్‌ వాదయామాసుర్నభస్యాగత్య నిర్జరాః | పుష్ప వృష్టిరభూత్తత్ర జగుర్గంధర్వ సత్తమాః || 29

విద్యాధరస్త్రియో వ్యోమ్ని ననృతుశ్చాప్సరాస్తథా | తదోత్సవో మహానాసీద్దేవాదీనాం నభస్థ్స లే|| 30

తస్మిన్న వసరే దేవీ పూర్వశక్తిశ్శివా సతీ | ఆవిర్బభూవ పురతో మేనాయా నిజరూపతః || 31

వసంతర్తౌ మధౌ మాసే నవమ్యాం మృగధిష్ట్య కే | అర్ధరాత్రే సముత్పన్నా గంగేవ శశిమండలాత్‌ || 32

ఓ మహర్షీ! సుఖమగు స్పర్శ కలిగిన గాలులు అన్ని దిక్కుల యందు వీచినవి. సత్పురుషులందరు ఆనందించిరి. దుష్టులు శీఘ్రమే దుఃఖితులైరి (28). దేవతలు అంతరిక్షములోనికి దుందుభలను వాయించిరి. అపుడచట పుష్పవృష్టి కురిసెను. గంధర్వ శ్రేష్ఠులు గానమును చేసిరి (29). ఆకాశమునందు విద్యాధరస్త్రీలు, అప్సరసలు కూడ నాట్యమును చేసిరి. అపుడు దేవతలు మొదలగువారు అంతరిక్షములో గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30). ఆ సమయములో పూర్వము సతీ రూపముగా అవతరించిన శివశక్తి స్వీయరూపముతో మేన యెదుట సాక్షాత్కరించెను (31). వసంత ఋతువులో చైత్రమాసములో నవమీ తిథినాడు మృగశిరా నక్షత్రమునందు అర్ధరాత్రి సమయమునందు చంద్రమండలము నుండి ఆకాశగంగవలె ఆ దేవి జన్మించెను (32).

సమయే తత్స్వరూపేణ మేనకా జఠరాచ్ఛివా | సముద్భూయ సముత్పన్నా సా లక్ష్మీరివ సాగరాత్‌ || 33

తతస్తస్యాం తు జాతాయాం ప్రన్నోభూత్తదా భవః | అనుకూలో వవౌ వాయు ర్గంభీరో గంధయుక్‌ శుభః || 34

బభూవ పుష్పవృష్టిశ్చ తోయవృష్టి పురస్సరమ్‌ | జజ్వలుశ్చాగ్నయశ్శాంతా జగర్జుశ్చ తదా ఘనాః || 35

తస్యాం తు జాయామానాయాం సర్వస్వం సమపద్యత | హిమవన్నగరే తత్ర సర్వదుఃఖం క్షయం గత్‌ || 36

ఆ సమయములో ఆ స్వరూపముతో ఉమాదేవి మేన యొక్క గర్భము నుండి, సముద్రము నుండి లక్ష్మీదేవి వలె జన్మించెను (33). అపుడామె జన్మించగానే జగత్తు ప్రసన్నమాయెను. అనుకూలము, శుభగంధముతో గూడినది అగు వాయువు మెల్లగా వీచెను (34). జలవర్షముతో బాటు పుష్పవర్షము కూడ కురిసెను. అగ్నులు ప్రశాంతముగా ప్రజ్వరిల్లినవి. మేఘములు గర్జించెను (35). ఆమె జన్మించిన ఆ సమయములో హిమవంతుని రాజధాని యందు సర్వము సుసంపన్నమగుటయే గాక, సర్వదుఃఖములు క్షయమయ్యెను (36).

తస్మిన్నవసరే తత్ర విష్ణ్వాద్యాస్సకలాస్సురాః | ఆజగ్ముస్సుఖినః ప్రీత్యా దదృశుర్జగదంబికామ్‌ || 37

తుష్టువుస్తాం శివామంబాం కాలికాం శివకామినీమ్‌ | దివ్యరూపాం మహామాయాం శివలోకనివాసినీమ్‌ || 38

ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి ఆనందించి ప్రీతితో జగన్మాతను దర్శించిరి (37). జగన్మాత, శివునకు ప్రియురాలు, దివ్యమగు రూపము గలది, మహామాయ, శివలోకమునందు నివసించునది, శుభకరి అగు ఆ కాళికను వారు స్తుతించిరి (38).

దేవా ఊచుః |

జగదంబ మహాదేవి సర్వసిద్ధివిధాయిని | దేవ కార్యకరీ త్వం హి సదాతస్త్వాం నమామహే || 39

సర్వథా కురు కల్యాణం దేవానాం భక్తవత్సలే | మేనామనోరథః పూర్ణః కృతః కురు హరస్య చ || 40

దేవతలిట్లు పలికిరి -

ఓ జగన్మాతా! మహాదేవీ! నీవు సర్వసిద్ధులను ఇచ్చుదానవు. నీవు సర్వదా దేవకార్యములను చక్కబెట్టెదవు. కాన నిన్ను సమస్కరించుచున్నాము (39). హే భక్తవత్సలే! దేవతలకు అన్ని విధములా కల్యాణమును కలిగించుము. మేన యొక్క మనోరథము పరిపూర్ణమైనది. శివుని మనోరథమును గూడ పరిపూర్ణము జేయుము (40).

బ్రహ్మోవాచ |

ఇత్థం స్తుత్వా శివాం దేవీం విష్ణ్వాద్యాస్సుప్రణమ్య తామ్‌ | స్వం స్వం ధామ యయుః ప్రీతాశ్శంసంతస్తద్గతిం పరామ్‌ || 41

తాం తు దృష్ట్వా తథా జాతాం నీలోత్పలదలప్రభామ్‌ | శ్యామా సా మేనకా దేవీ ముదమాపాతి నారద || 42

దివ్య రూపం విలోక్యాను జ్ఞానమాప గిరిప్రియా | విజ్ఞాయ పరమేశానీం తుష్టావాతిప్రహర్షితా || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు ఆ శివాదేవిని ఇట్లు స్తుతించిరి, ప్రణమిల్లి, ప్రీతులై ఆమె యొక్క ఉత్కృష్టమగు జన్మను ప్రశంసిస్తూ తమ తమ ధామములకు వెళ్లిరి (41). ఓ నారదా! నల్ల కలువ రేకులవలె ప్రకాశించుచున్న ఆ బాలికను చూచి సుందరియగు మేన అతిశయించిన ఆనందమును పొందెను (42). మేన ఆమె దివ్యరూపమును చూచి, ఆ పిదప జ్ఞానమును పొంది, ఆమె పరమేశ్వరియని గుర్తించి మిక్కిలి ఆనందించి స్తుతించెను (43).

మేనో వాచ |

జగదంబ మహేశాని కృతాతికరుణా త్వయా | ఆవిర్భూతా మమ పురో విలసన్తీ యదంబికే || 44

త్వమాద్య సర్వశక్తీనాం త్రిలోకజననీ శివే | శివప్రియా సదా దేవీ సర్వదేవస్తుతా పరా || 45

కృపాం కురు మహేశాని మమ ధ్యానస్థితా భవా | ఏతద్రూపేణ ప్రత్యక్షం రూపం ధేహి సుతాసమమ్‌ || 46

మేన ఇట్లు పలికెను -

ఓ జగదంబా! మహేశ్వరీ! నీవు నాయందు అతిశయించిన దయను చూపితివి. ఏలయన, హే అంబికే! నీవు నీ సుందరరూపముతో నా ఎదుట ప్రత్యక్షమైతివి (44). శక్తులన్నింటికి మూలమగు శక్తివి నీవే. హే శివే! నీవు ముల్లోకములకు తల్లివి. నీవు సర్వదా శివునకు ప్రియురాలవగు దేవివి. దేవతలందరు స్తుతించే పరాశక్తివి నీవే (45). ఓ మహేశ్వరీ! దయను చూపుము. నీవు నా ధ్యానమునందు నిలిచి యుండుము. నీవు ఈ రూపములో ప్రత్యక్షమై, కుమార్తెతో సమానమగు రూపమును స్వీకరించుము (46).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్యా మేనాయా భూధరస్త్రియాః | ప్రత్యువాచ శివా దేవీ సుప్రసనాం గిరిప్రియామ్‌ || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతునికి ప్రియమగు భార్యయై చక్కని సంతానమును గనిన ఆమేన యొక్క ఈ మాటను విని శివా దేవి ఇట్లు బదులిడెను (47).

దేవ్యు వాచ |

హే మేనే పురా త్వం మాం చ సుసేవితవతీ రతా | త్వద్భక్త్యా సుప్రసన్నాహం వరం దాతుం గతాంతికమ్‌ || 48

వరం బ్రూహీతి మద్వాణీం శ్రుత్వా తే తద్వరో వృతః | సుతా భవ మహాదేవి సా మే దేవహితం కురు || 49

తథా దత్త్వ వరం తేహం గతా స్వం పదమాదరాత్‌ | సమయం ప్రాప్య తనయోభవం తే గిరికామిని || 50

దివ్య రూపం ధృతం మేద్య యత్తే మత్స్మరణం భ##వేత్‌ | అన్యథా మర్త్య భావేన తవాజ్ఞానం భ##వేన్మయి || 51

దేవి ఇట్లు పలికెను -

ఓ మేనా!పూర్వము నీవు నన్ను శ్రద్ధతో చక్కగా సేవింతివి. నీభక్తిచే నేను మిక్కిలి ప్రసన్నురాలనై, వరము నీయుట కొరకు నీ వద్దకు వచ్చితిని (48). 'వరమును కోరుకొనుము' అని నేను పలుకగా, నీవు విని 'ఓ మహాదేవీ!నీవు నాకు కుమార్తెవై జన్మించి, దేవకార్యమును చక్కబెట్టుము' అని నీవు కోరియుంటివి (49). నేనపుడు నాకా వరమునిచ్చి నా ధమమునకు వెళ్లితిని. ఇపుడు దానికి సమయము వచ్చినది. ఓ హిమవంతుని ప్రియురాలా! నీకా కుమార్తెనై జన్మించితిని (50). నేనిపుడు దివ్య రూపముతో నీ ఎదుట ప్రత్యక్షమైతిని. అట్లు ప్రత్యక్షమై నీకు నా స్మరణ కల్గునట్లు చేసితిని. అట్లు గానిచో, నీవు నన్ను గుర్చించలేక అజ్ఞానముచే నన్ను ప్రాకృత స్త్రీయని తలపోసి యుండెడి దానవు (51).

యువాం మాం పుత్రిభావేన దివ్యభావేన వాసకృత్‌ | చిన్తయన్తౌ కృతస్నేహౌ యతాస్థ్సో మద్గతిం పరామ్‌ || 52

దేవ కార్యం కరిష్యామి లీలాం కృత్వాద్భుతాం క్షి తౌ | శంభుపత్నీ భవిష్యామి తారయిష్యామి సజ్జనాన్‌ || 53

మీరిద్దరు నన్ను కుమార్తె యను భావన గలవారై ప్రేమతో పెంచుడు. అప్పుడప్పుడు నా దివ్యతత్త్వమును కూడ ఎరుంగగలరు. మరియు నా పరమ పదమును పొందగలరు (52). భూమి యందు అద్భుతమగు లీలలను ప్రదర్శించి దేవ కార్యమును సిద్ధింపజేసెదను. శంభుని పత్ని కాగలను. సత్పురుషులను తరింపజేయగలను (53).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వాసీచ్ఛివా తూష్ణీ మంబికా స్వాత్మమాయయా | పశ్యంత్యాం మాతరి ప్రీత్యా సద్యోభూత్తనయా తనుః || 54

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే పార్వతీ జన్మవర్ణనం నామ షష్ఠోధ్యాయః (6).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి జగన్మాతయగు ఆ శివ మిన్నకుండెను. తల్లి ప్రేమతో చూచుచుండగనే ఆమె వెనువెంటనే తన మాయాశక్తిచే శిశు రూపమును స్వీకరించెను (54).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ జన్మవర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Sri Sivamahapuranamu-I    Chapters