Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వితీయో ధ్యాయః

సనత్కుమారుని శాపము

నారదఉవాచ

విధే ప్రాజ్ఞ వదేదానీం మేనోత్పత్తిం సమాదరాత్‌| అపి శాపం సమాచక్ష్వకురు సందేహ భంజనమ్‌||1

నారదుడిట్లు పలికెను

హే విధే! హే ప్రాజ్ఞా! ఇపుడు మేన యొక్క జన్మను గురించి, మరియు శాపమును గరించి విస్తరముగా చెప్ప నా సందేహములను తొలగించుము(1)

బ్రహ్మోవాచ

శృణు నారద సుప్రీత్యా మేనోత్పత్తిం వివేకతః| మునిభిస్సహ వక్ష్యేహం సుతవర్య మహాబుధ||2

దక్షనామా మమ సుతో యః పురా కథితో మునే | తస్య జాతాస్సుతాష్షష్టి ప్రమితా స్సృష్టికారణాః||3

తాసాం వివాహమకరోత్స వరైః కశ్యపాదిభిః| విదితం తే సమస్తం తత్ప్రస్తుతం శృణు నారద||4

తాసాం మధ్యే స్వధానమ్నీం పితృభ్యో దత్తవాన్‌ సుతామ్‌ | తిస్రోభవన్‌ సుతాస్తస్యాస్సుభగా ధర్మమూర్తయః ||5

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ నారదా! నాకుమారులలో నీవు శ్రేష్ఠుడవు. మహా పండితుడువు. నేను మేనా దేవి యొక్క జన్మ వృత్తాంతమును వివేకపూర్వకముగా చెప్పెదను . నీవు మనులతో గూడి మి క్కిలి ప్రీతితో వినము(2) ఓ మహర్షీ! నా కుమారడగు దక్షుని గురించిన నీకు పూర్వమే చెప్పియుంంటిని. అతనికి అరవది కుమర్తెలు కలిగిరి. వారే ఈ సృష్టికి మూలము అయిరి(3) అతడు వారిని కశ్యపుడు మొదలగు వరుల కిచ్చి వివాహమును చేసిన వృత్తాంతమంతయు నీకు తెలిసినదే. ఓ నారదా! ప్రస్తుత గాథను వినుము(4) వారిలో స్వధ అను పేరుగల కుమార్తెను ఆయన పితృదేవల కిచ్చి వివాహమును చేసెను. ఆమెకు ధర్మమూర్తులు, సుందరీమణులు అగు ముగ్గురు కుమర్తెలు కలిగిరి(5)

తాసాం నామాని శృణు మే పావనాని మనీశ్వర| సదా విఘ్నహరాణ్యవ మహా మంగలదానిచ||6

మేనా నామ్నీ సుతా జ్యేష్టా మధ్యా ధన్యా కలావతీ| అంత్యా ఏతాస్సుతాస్సర్వాః పితౄణాం మానసోద్భవాః||7

అయేనిజాస్స్వధాయాశ్చ లోకతస్తత్సుతా మతాః| ఆసాం ప్రోచ్య సునామాని సర్వాన్‌ కామాన్‌ జనో లభేత్‌||8

జగద్వంద్యాస్సదా లోకమాతరఃపరమోదదాః| యోగిన్యః పరమా జ్ఞాన నిధనాస్తాస్త్రి లోకగాః||9

ఓ మహర్షీ| పవిత్రము చేయునవి, నిశ్చయముగా సర్వదా విఘ్నములను పారద్రోలి మహా మంగళములనిచ్చునవి అగు వాని నామములను చెప్పెదను వినుము(6) పెద్దకుమార్తెపేరు మేన, రెండవకుమార్తె ధన్య, మూడవ ఆమె కలావతి, ఈ ముగ్గురు పితృదేవతల మానస పుత్రికలు(7) వీరు అయెనిజలు, కాని లోకములో స్వధాదేవి యొక్క కుమార్తెలుగా ప్రసిద్ధిని గగాంచిరి. మానవుడు వారి పవిత్ర నామములనుచ్ఛరించినచో కోర్కెలన్నిటినీ, పొందును(8) వీరు సర్వజగత్తులకు పూజింపదగినవారు. ముల్లోకమలకు తల్లులు, గొప్ప ఆనందమును ఇచ్చువారు. యోగనిష్ఠలు. ముల్లోకముల యందు సంచరించే వీరు పరమజ్ఞాననిధులు(9)

ఏకస్మిన్‌ సమయే తిస్రో భగిన్యస్తా మునీశ్వర| శ్వేతద్వీపం విష్ణులోకం జగ్ముర్దర్శన హేతవే||10

కృత్వా ప్రణామం విష్ణోశ్చ సంస్తుతిం భక్తి సంయుతాః| తస్థుస్తదాజ్ఞాయా తత్ర సుసమాజో మహానభూత్‌||11

తదైవ సనకాద్యాస్తు సిద్ధా బ్రహ్మసుతా మునే| గతాస్తత్ర హరిం నత్వా స్తుత్వా తస్థుస్తదాజ్ఞయా||12

సనకాద్యాన్‌ మునీన్‌ దృష్ట్వోత్తస్ధుస్తే సకలా ద్రుతమ్‌|| తత్రస్థాన్‌ సంస్థితాన్నత్వా దేవద్యాన్‌ లోకవందితాన్‌||13

ఒకనాడు ఈ ముగ్గురు సోదరీమణులు విష్ణువును దర్శించుట కొరకై శ్వేత ద్వీపమునకు వెళ్లిరి. ఓ మహర్షీ! (10) అచట వారు విష్ణవునకు ప్రణమిల్లి, బక్తితో గూడిన వారై ఆయనను స్తుతించి నిలబడిరి. విష్ణువు ఆజ్ఞచే అడట గొప్ప సభ సమాయోజితమాయెను(11) ఓ మహర్షీ! బ్రహ్మపుత్రులగు సనకాది సిద్ధులు అపుడచటకు విచ్చేసి, విష్ణువునకు నమస్కరించి, స్తుతించి, ఆయన ఆజ్ఞచే అచట ఉండిరి(12) సనకాది మహర్షులను చూచిన సభా సదులందరు వెనువెంటనే లేచి నిలబడిరి. ఆమహర్షులు అచట నున్న దేవతలను, లోకపూజితులగు ఇతర మహర్షులను దర్శించి ప్రణమిల్లిరి.(13)

తిస్రో భగిన్యస్తాంస్తత్ర నోత్త స్థుర్మోహితా మునే| మాయయా దైవవివశాశ్శంకరస్య పరాత్మనః||14

మోహినీ సర్వలోకానాం శివమాయా గరీయసీ| తదధీనం జగత్సర్వం శివచ్ఛా సా ప్రకీర్యతే||15

ప్రారబ్ధం ప్రోచ్యతే సైవ తన్నాయమాని హ్యనేకశః| శివేచ్ఛయా భవత్యేవ నాత్ర కార్యా విచారణా||16

భూత్వా తద్వశగాస్తా వైన చక్రురపి తన్నతిమ్‌ | విస్మితాస్సంప్రదృశ్యైవ సంస్థితాస్తత్ర కేవలమ్‌||17

ఓ మహర్షీ! కాని ఆ సభలో ఆసీనలైయున్న ఆ ముగ్గురు సోదరీమణులు పమాత్మయుగు శంకరదేవుని మాయచే మోహితులగుటచే వివశులై నిలబడలేదు(14) సర్వలోకమును మోహింపజేయు శివమాయ మిక్కిలి బలమైనది. జగత్తంతయు ఈ మాయకు అధీనమైయున్నది ఈ మాయయే శివుని సంకల్ప శక్తియని కీర్తింపబడును(15) ఆ మాయకే ప్రారబ్ధమని కూడా పేరు గలదు. ఆమాయకు అనేక నామములు గలవు. అది శివుని ఇచ్ఛచే లోకములను మోహింపజేయును. దీని విషయములో చేయగలగినది ఏదీ లేదు(16) ఆ ముగ్గురు ఆ మాయకు వశులై, ఆ మహర్షులను చూచి విస్మితులై అటులనే చూచుచూ కూర్చుండిరేగాని, లేచి వారిక నమస్కరించరైరి(17).

తాదృశీం తద్గతిం దృష్ట్వా సనకారద్యా మనీశ్వరాః| జ్ఞాననోపిపరం చక్రుః క్రోధం దుర్విషహం చతే||18

శివేచ్ఛమోహితస్తత్ర సక్రోధస్తా ఉవాచ హ| సనత్కుమారో యోగీ శ శ్శాపం దండకరం దదన్‌ ||19

సనకాది మహర్షులు జ్ఞానులే అయిననూ, వారి స్థితిని చూచి మిక్కిలి, సహింపశక్యము గాని క్రోథమును పొందిరి(18) శివుని ఇచ్ఛచే మోహితుడైన సనత్కుమారుడను ఆ యోగి పుంగవుడు కోపించి దండరూపమగు శాపమునిచ్చువాడైన వారితో నిట్లనెను(19)

సనత్కుమార ఉవాచ|

యూయం తిస్రో భగిన్యశ్చ మూఢాదస్సద్వయునోజ్ఘితాః| అజ్ఞాత శ్రుతితత్త్వా హి పితృకన్యా ఆపి ధ్రువమ్‌||20

అభ్యుత్థానం కృతం నో యన్నమస్కారోపి గర్వతః| మోహితా నరభావత్వా త్స్వర్గా ద్దూరా భవంవతు హి||21

నరస్త్రియస్సంభవంతు తిస్రోపి జ్ఞానమోమితాః| స్వకర్మణః ప్రభావద్వై లభద్వం పలమీదృశమ్‌||22

సనత్కుమారుడిట్లు పలికెను

మీరు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు మూర్ఖులు. మీలో యోగ్యమగు జ్ఞానము లేదు. మీరు పితృదేవతల కుమర్తెలే అయినా, మీకు వేదతాత్పర్యము ఎరుక లేదనుట నిశ్చయము(20) మీరు గర్వముచే లేచి నిలబడలేదు. మాకు నమస్కరించలేదు. కావున, మోహితులైన మీరు మానవ శరీరమును పొంది స్వర్గమునకు దూరమగుదురు గాక!(21) జ్ఞానమునుండి వంచితులైన మీరు ముగ్గురు కూడ మానవస్త్రీలై జన్మించెదరు గాక! మీరు చేసుకొన్న కర్మయొక్క ప్రభావము వలననే మీకిట్టి ఫలము లభించుచున్నది(22)

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య చ సాధ్వస్తాస్తిస్రోపి జ్ఞానమోహితాః| పతిత్వా పాదయోస్తస్య సమూచుర్నతమ

స్తకాః||23

బ్రహ్మ ఇట్లు పలికెను-

జ్ఞానమునుండి వంచితులైన వారు, మిక్కిలి భయపడినవారు, తలవంచుకున్న వారు అగు ఆ ముగ్గురు ఈ మాటలను విని, ఆయన పాదములపై బడి ఇట్లు పలికిరి(23)

పితృతనయా ఊచుః|

మునివర్య దయాసింధో స్రసన్నో బవ చాధునా| త్వత్ర్పణామం వయం మూఢాః కుర్మహే స్మన భావతః||24

ప్రాప్తం చ తత్ఫలం విప్ర న తే దోషో మహామునే| అనుగ్రహం కురుష్వాత్ర లభేమ స్వర్గతిం పునః||25

పితృదేవతలు ఇట్లు పలికిరి

ఓ మహర్షీ! నీవు దయా సముద్రుడవు. నీవిపుడు ప్రసన్నుడవు కమ్ము. మూర్ఖులమగు మేము నీకు నమస్కరించకపోతిమి. దానికి కారమణము అనాదర భావన కాదు (24) హే విప్రా! మా తప్పునకు ఫలమును మేము పొందితిమి. ఓ మహర్షీ! దీనియందు నీ దోషము లేదు కాని మేము మరల స్వర్గ నివాసమును పొందునట్లు మమ్ములను అనుగ్రహించుము(25)

బ్రహ్మోవాచ

శ్రుత్వా తద్వచనం తాత ప్రోవాచ స మునిస్తదా| శాపోద్ధారం ప్రసన్నత్మా ప్రేరిత శ్శివమాయయా||26

బ్రహ్మ ఇట్లు పలికెను

వత్సా! అపుడా మహర్షీ ఆ మాటను విని ప్రసన్నుమగు అంతఃకరణము గలవాడై, శివుని మాయచే ప్రేరేపింపబడి శాపము నుండి ఉద్ధారమును ఇట్లు చెప్పెను(26)

సనత్కుమార ఉవాచl

పితౄణాం తనయాస్తిస్ర శ్శృణుత ప్రీతమానసాః| వచనం మమ శోకఘ్నం సుఖదం సర్వదైవ వః||27

విష్ణోరంశ స్య శైలస్య హిమాధారస్య కామినీ| జ్యేష్ఠా భవతు తత్కన్యా భవిష్యత్యేవ పార్వతీ||28

ధన్యా ప్రియా ద్వితీయా తు యోగినీ జనకస్య చ | తస్యాః కన్యా మహాలక్ష్మీర్నామ్నా సీతా భవిష్యతి||29

వృషభానస్య వైశ్యస్య కనిష్ఠా చ కలావతీ| భవష్యతి ప్రియా తత్సుతా ద్వాపరాంతతః|||20

సనత్కుమారుడిట్లు పలికెను

పితృదేవతల ముగ్గురు కుమర్తెలారా| వినుడు మనస్సులో ప్రీతిని చెందుడు. నా మాట మీకు సర్వదా శోకములను పోగొట్టి సుఖముల నీయగలదు(27) మీలో జ్యేష్ఠురాలు విష్ణువు యొక్క అంశ##మైన హిమవత్పర్వతుని బార్యయగు గాక| వారికి పార్వతియను కన్య ఉదయించగలదు(28). మీలో రెండవది, యోగ సంపన్నురాలు అగు ధన్య జనకునకు ప్రియురాలు కాగలదు. వారికి సీత యను పేర మహాలక్ష్మి కుమార్తె కాగలదు(29) కనిష్ఠురాలగు వృషభానుడగు వైశ్యునకు పత్ని కాగలదు. ద్వాపరయుగాంతమునందు వారికి రాధయను కుమార్తె కలుగును(30)

మేనకా యోగినీ పత్యా పార్వత్యాశ్చ వరేణ చ | దేన దేహేన కైలాసం గమిష్యతి పరం పదమ్‌||31

ధన్యా చ సీతయా సీరధ్వజో జనక వంశజః| జీవన్ముక్తో మహాయోగీ వైకుంఠం చ గమిష్యతి||32

కలావతీ వృషభానస్య కౌతుకాత్కన్యయా సహ | జీవన్ముక్తా చ గోలోకం గమిష్యతి న సంశయం||33

వినా విపత్తిం మహిమా కేషాం కుత్ర భవిష్యతి | సుకర్మిణాం గతే దుఃఖే ప్రభ##వే ద్ధర్లభం సుఖమ్‌||34

యోగిని యగు మేనక పార్వతి యొక్కక వరముచే భర్తతో గూడి ఆ దేహముతో పరమపదమగు కైలాసమును పొందగలదు(31) జనక వంశములో పుట్టినవాడు,జీవన్ముక్తుడు, మహాయోగి అగు సీరధ్వజుడు మరియు ఆతని పత్ని యగు ధన్య సీతాదేవితో గూడి వైకుంఠమును పొందగలరు(32). వృషభానుని వివాహమాడిన కలావతి జీవన్ముక్తురాలై తమ కుమార్తెయగు రాధతో గూడి గోలోకమును పొందగలదనుటలో సంశయము లేదు(33). కష్టములను పడని వారికి ఎవ్వరికైననూ ఎక్కడనైనూ అభ్యున్నతి లేదు. పుణ్యమును చేయు వారికి దుఃఖము దూరముకాగానే దుర్లభమగు సుఖము లభించును(34).

యూయం పితౄణాం తనయారస్సర్వాస్స్వరక్గ విలాసికాః| కర్మక్షయశ్చ యుష్మాకమభవద్విష్ణుదర్శనాత్‌||35

ఇత్యుక్త్వా పునరప్యాహ గతక్రోథో మునీశ్వరః | శివం సంస్మృత్య మనసా జ్ఞానదం భుక్తిముక్తిదమ్‌ ||36

అపరం శృణుత ప్రీత్యా మద్వచస్సుఖదం సదా| ధన్యా యూయం శివప్రీతా మాన్యాః పూజ్యా హ్యభీక్ణశః|| 37

మేనాయాస్తవయా దేవీ పార్వతీ జగదంబికా| భవిష్యతి ప్రియా శంభోస్తపః | కృత్వా సుదుస్సహమ్‌||38

పితృదేవతల కుమార్తెలగు మీరు ముగ్గురు స్వర్గము యొక్క విలాసము గలవారు. విష్ణువును దర్శించుట వలన మీకు కర్మక్షయమైనది(35) ఇట్లు పలికి తొలగిన క్రోథము గల ఆ మహర్షి జ్ఞానమును, భుక్తిని, ముక్తిని ఇచ్చే శివుని మనస్సులో స్మరించి ఇంకనూ ఇట్లు పలికెను(36) నేను సదా సుఖమును ఇచ్చే మరియొక మాటను చెప్పెదను. ప్రీతితో వినుడు శివుని ప్రీతికి పాత్రులగు మీరు ధన్యులు, ఆదరణీయులు, మరియు అత్యంత పూజనీయులు(37) మేన యొక్క కుమార్తెయగు పార్వతీ దేవి దుష్కరమగు తపస్సును చేసి, శివుని ప్రియురాలైన జగన్మాత కాగలదు(38)

ధన్యా సుతా స్మృతా సీతా రామపత్నీ భవిష్యతి | లౌకికాచారమాశ్రిత్య రామేణ విహరిష్యతి ||39

కలావతీ సుతా రాధా సాక్షా ద్గోలోక వాసినీ| గప్త స్నేహనిబద్ధా సా కృష్ణ పత్నీ భవిష్యతి||40

ధన్య యొక్క కుమార్తె సీతయను పేర రామునకు భార్యయై, లోకాచారముననుసరించి రామునితో గూడి విహరించగలదు(39). కలావతి యొక్క కుమార్తెయగు రాధ కృష్ణుని యందు రహస్య ప్రేమ పూర్ణమగు జీవితమమును గడిపి గోలోకమును పొంది కృష్ణపత్ని కాగలదు(40)

బ్రహ్మోవాచ|

ఇత్థమాభాష్య స ముని ర్భ్రాతృభిస్సహ సంస్తుతః | సనత్కుమారో భగవాంస్తత్రైవాంతర్హితో భవత్‌|| 41

తిస్రో భగిన్యస్తాస్తాత పితౄణాం మానసీస్సుతాః| గతపాపాస్సుఖం ప్రాప్య స్వధామ స్రయయుర్ద్రుతమ్‌||42

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయయాం రుద్ర సంహితాయాం తృతీయే పార్వతీఖండే పూర్వగతి వర్ణనం నామ ద్వితీయోధ్యాయః(2)

బ్రహ్మ ఇట్లు పలికెను-

పరమ పూజనీయుడు, సోదరుడుతో గూడి సర్వులచే స్తుతింపబడు వాడునగు, సనత్కుమార మహర్షి ఇట్లు పలికి అచటనే అంతర్థానమయ్యెను (41). వత్సా! పితృదేవతల మానస పుత్రికలగు ఆ ముగ్గురు సోదరీమణులు తొలగిన దుఃఖమనే పాపము గలవారై సుఖమును పొంది వెనువెంటనే తమ ధామమును పొందిరి(42)

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతి ఖండలో పూర్వగతి వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది(2)

Sri Sivamahapuranamu-I    Chapters