Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ఏకచత్వారింశోధ్యాయః

దేవతలు శివుని స్తుతించుట

విష్ణ్వాదయ ఊచుః |

దేవదేవ మహాదేవ లౌకిచార కృత్ర్పభో | బ్రహ్మ త్వామీశ్వరం శంభుం జానీమః కృపయా తవ || 1

కిం మోహయసి నస్తాత మాయయా పరయా తవ | దుర్‌జ్‌జ్ఞే యయా సదా పుంసాం మోహిన్యా పరమేశ్వర || 2

ప్రకృతేః పురుషస్యాపి జగతో యోని బీజయోః | పరబ్రహ్మ పరస్త్వం చ మనోవాచమగో చరః || 3

త్వమేవ విశ్వం సృజసి పాస్యత్సి నిజతం తత్రః | స్వరూపాం శివశక్తిం హి క్రీడన్నూర్ణపటో యథా || 4

విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి -

దేవదేవా! మహాదేవా! హే ప్రభో! నీవు పరబ్రహ్మ అగు శంభుడవని నీ కృపచే ఎరుంగుదుము (1). తండ్రీ! పరమేశ్వరా! మానవులను మోహింపచేయునది, తెలియ శక్యము కానిది, సర్వోత్కృష్టమైనది అగు నీ మాయచే మమ్ములను ఏల మోహింపజేయుచున్నావు? (2) జగత్తునకు యోని అగు ప్రకృతి కంటె, బీజమగు పురుషుని కంటె ఉత్కృష్టము అగు పరబ్రహ్మ నీవు. నీవు మనస్సునకు, వాక్కునకు అందవు (3). నీవు స్వేచ్ఛచే నీ స్వరూపమైన శివ శక్తిని వశము చేసుకొని, సాలెపురుగు గూటిని వలె, ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయుచున్నావు. ఇది నీలీల (4).

త్వమేవ క్రతుమీశాన ససర్జిథ దయాపరః | దక్షిణా సూత్రేణ విభో సదా త్రయ్యభిపత్తయే|| 5

త్వయైవ లోకేవసితాస్సేతవో యాన్‌ ధృతవ్రతాః | శుద్ధాన్‌ శ్రద్దధతే విప్రా వేదమార్గ విచక్షణాః || 6

కర్తుస్త్వం మంగలానాం హి స్వపరం తు ముఖే విభో | అమంగలానాం చ హితం మిశ్రం వాథ విపర్యయమ్‌ || 7

సర్వకర్మఫలానాం హి సదా దాతా త్వమేవ హి | సర్వే హి ప్రోక్తా హి యశస్తత్పతిస్త్వం శ్రుతి శ్రుతః || 8

ఓ ఈశ్వరా! దయానిధివగు నీవే యజ్ఞమును సృష్టించితివి. ఋగ్యజుస్సామ రూపము అగు వేదమును లోకములో ప్రవర్తింపజేయుటకై సృష్టింపబడిన ఆ యజ్ఞమును దక్షిణయను సూత్రముతో దృఢము చేసితివి (5). స్వీకరింపబడిన వ్రతము గలవారు, వేదమార్గములో నిష్ణీతులునగు వేతవేత్తలు లోకమునందు నీ చేతనే నిర్మింపబడిన శుద్ధములగు ధార్మిక నిలయములను శ్రద్ధతో ఆచరించుచున్నారు (6). మంగలములను గాని, అమంగళ కర్మలను గాని ఆచరించువారికి నీవు స్వపర భేదము లేకుండగా హితకరములగు ఫలములను, అహిత ఫలములను, మరియు మిశ్రమ ఫలములను కర్మానురూపముగా ఇచ్చెదవు (7). ప్రాణులకు కర్మ ఫలముల నన్నిటినీ ఇచ్చే దాతవు నీవే. సర్వమానవులు చేయు కీర్తి గానములన్నియు ఆయా వ్యక్తులకు గాక నీకు మాత్రమే చెందునని వేదములు ఉద్ఘాటించుచున్నవి (8).

పృథగ్ధియః కర్మదృశోరుం తుదాశ్చ దురాశయాః | వితుందతి పరాన్‌ మూఢా దురుక్తైర్మత్సరాన్వితాః || 9

తేషాం దైవవధానాం భో భూయస్త్వాచ్చ వధో విభో | భగవన్పరమేశాన కృపాం కురు పరప్రభో || 10

నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణ పరమాత్మనే | కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహేతే నమః || 11

త్వం హి విశ్వసృజాం స్రష్టా ధాతా త్వం ప్రపితామహః | త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతేః పురుషాత్పరః || 12

నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే | విశ్వాయ విశ్వబీజాయ జగదానంద హేతవే || 13

వేర్పాటు బుధ్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, అసూయతో నిండినవారు, ఇతరుల మనస్సును గాయపరచువారు, కేవల కర్మఠులు అగు మూర్ఖులు పరుష వచనములతో ఇతరులను బాధించెదరు (9). హే విభో! అట్టిదైవద్రోహుల ఆగడములు మితిమీరినపుడు వారిని సంహరించవలసినదే. కాని హేభగవాన్‌ ! పరమేశ్వరా!పరమాత్మా! ప్రభూ! దయను చూపుము (10). శాంతుడు, పరబ్రహ్మ, పరమాత్మ, జటాజూటధారి, మహేశ్వరుడు, మహాజ్యోతి స్స్వరూపుడునగు రుద్రునకు నమస్కారము (11). జగత్తును సృష్టించు ప్రజాపతులను నీవే సృజించితివి. సృష్టికర్తవు నీవే. సృష్టికర్తకు తండ్రివి నీవే. త్రిగుణ స్వరూపుడవు నీవే. నిర్గుణుడవు నీవే. నీవు ప్రకృతికంటె పురుషుని కంటె ఉత్కృష్టమైనవాడవు (12). నల్లని కంఠము గలవాడు, జగత్సృష్టి కర్త, పరమాత్మ, జగత్స్వరూపుడు, జగత్తునకు బీజమైనవాడు, జగత్తునకు ఆనందమును కలిగించువాడు అగు నీ కొరకు నమస్కారము (13).

ఓంకారస్త్వం వషట్‌ కార స్సర్వారంభ ప్రవర్తకః | హంతకార స్స్వధాకారో హవ్యకవ్యాన్న భుక్‌ సదా || 14

కృతః కథం యజ్ఞ భంగస్త్వయా ధర్మ పరాయణ | బ్రహ్మణ్యస్త్వం మహాదేవ కథం యజ్ఞహనో విభో || 15

బ్రాహ్మణానాం గవాం చైవ ధర్మస్య ప్రతిపాలకః | శరణ్యోసి సదానంత్య స్సర్వేషాం ప్రాణినాం ప్రభో || 16

నమస్తే భగవన్‌ రుద్ర భాస్కరామిత తేజసే | నమో భవాయ దేవాయ రసాయాంబు మాయాయ తే || 17

ఓం వషట్‌, హంత, స్వధా అను యజ్ఞోపయోగి వేదశబ్దములు నీ స్వరూపమే. సర్వక్రతువులను ప్రవర్తిల్ల జేయువాడువు నీవే. హవ్యము (దేవతలకు అర్పింపబడిన అన్నము) ను, కవ్యము (పితురుల కర్పింపబడిన అన్నము) ను భుజించునది నీవే (14). ధర్మపరాయణుడవగు నీవు యజ్ఞమును ఎట్లు భంగపరచ గల్గితివి ? ఓ మహాదేవా!వేదస్వరూపుడవు నీవు యజ్ఞమును ఎట్లు ధ్వంసమొనర్చితివి? హే విభో! (15) బ్రాహ్మణులను గోవులను, మరియు ధర్మమును రక్షించునది నీవే. హే ప్రభో !సత్స్వరూపుడు, అనంతుడు అగు నీవు సర్వప్రాణులకు శరణు పొంద దగినవాడవు (16). హే భగవాన్‌! రుద్రా! సూర్యుని కంటె అధికమగు తేజస్సు గలవాడు జగద్రూపుడు, ప్రకాశ స్వరూపుడు, జలములలోని రసతన్మాత్ర స్వరూపుడు నగు నీ కొరకు నమస్కారము (17).

శర్వాయ క్షితిరూపాయ సదా సురభిణ నమః | రుద్రాయాగ్ని స్వరూపాయ మహాతేజస్వినే నమః || 18

ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః | పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేధసే || 19

భీమాయ వ్యోమరూపాయ శబ్ద మత్రాయ తే నమః | మహా దేవాయ సోమాయ ప్రవృత్తాయ నమోస్తుతే || 20

ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే | నమస్తే కాలకాలాయ నమస్తే రుద్ర మన్యవే || 21

గంధము నిత్యగుణముగా గల పృథివి స్వరూపమైన శర్వునకు నమస్కారము. మహాతేజశ్శాలి, అగ్ని స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (18). హే ఈశా! స్పర్శ గుణము గల వాయువు నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు. సర్వప్రాణులకు ప్రభువు, యజమాన స్వరూపుడు, సృష్టికర్త అగు నీకు నమస్కారము (19). శబ్ద గుణకమగు ఆకాశము స్వరూపముగా గల భీమునకు నమస్కారము. ఉమాదేవితో గూడి జగత్తును రక్షించే మహాదేవుడవగు నీకు నమస్కారము (20).భయంకరమైనవాడు, సూర్య రూపుడు, కర్మయోగి అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు అగు నీకు నమస్కారము. హే రుద్రా! నీకోపమునకు నమస్కారము (21).

నమశ్శివాయ భీమాయ శంకరాయ శివాయ తే | ఉగ్రోసి సర్వభూతానాం నియంతా యచ్ఛివోసి నః || 22

మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణ హ్యార్తి నాశినే |అంబికాపతయే తుభ్యముమాయాః పతయే నమః || 23

శర్వాయ సర్వరూపాయ పురుషాయ పరాత్మనే | సదసద్వ్యక్తి హీనాయ మహతః కారణాయ తే || 24

జాతాయ బహుధా లోకే ప్రభూతాయ నమో నమః | నీలాయ నీలరుద్రాయ కద్రుద్రాయ ప్రచేతసే || 25

మీఢుష్టమాయ దేవాయ శిపివిష్టాయ తే నమః | మహీయసే నమస్తుభ్యం హంత్రే దేవారిణాం సదా || 26

మంగళస్వరూపుడు, భయంకరా కారుడు, శుభకరుడు అగు నీకు నమస్కారము. నీవు ఉగ్రుడవు, సర్వప్రాణులకు అధీశ్వరుడవు, మకు మంగలముల నిచ్చువాడవు (22). కళ్యాణ కరుడు, సర్వజగద్రూపుడు, పరబ్రహ్మ, ఆపదలను గట్టెక్కించువాడు, ఉమాపతి అగు నీకు నమస్కారము (23). ఈశ్వరుడు (హింసకుడు), సర్వజగద్రూపుడు, దేహమునందు ఆత్మరూపముగా నుండువాడు, పరమాత్మ కారణ కార్య భావమునకు అతీతుడు, మహత్తునకు కారణమైనవాడు అగు నీకొరకు నమస్కారము (24). లోకములో అనేక రూపములుగా పుట్టి విస్తరించినవాడు, కంఠముందు నీలవర్ణము గలవాడు, ప్రశంసనీయుడు, ప్రకృష్ట జ్ఞానమేతుడు అగు రుద్రునకు అనేక నమస్కారములు (25). భక్తులకు కోర్కెలను వర్షించువాడు, ప్రకాశ స్వరూపుడు, జ్ఞానఘనుడు, పరబ్రహ్మ, దేవశత్రువులను సదా సంహరించువాడు అగు నీకు నమస్కారము (26).

తారాయ చ సుతారాయ తరుణాయ సుతేజసే | హరికేశాయ దేవాయ మహేశాయ నమో నమః || 27

దేవానాం శంభ##వే తుభ్యం విభ##వే పరమాత్మనే | పరమాయ నమస్తుభ్యం కాలకంఠాయ తే నమః || 28

ప్రణవప్రతిపాద్యుడు, ప్రాణులను తరింపజేయువాడు, నిత్య యువకుడు, గొప్ప తేజశ్శాలి, నల్లని కేశములు గలవాడు, ప్రకాశ స్వరూపుడు అగు మహేశ్వరునకు అనేక నమస్కారములు (27). దేవతలకు మంగళముల నిచ్చువాడు, సర్వవ్యాపి, పరమాత్మ సర్వోత్కృష్టుడు, నీలకంఠుడు అగు నీకు పునః పునః నమస్కారములు (28).

హిరణ్యాయ పరేశాయ హిరణ్య వపుషే నమః | భీమాయ భీమరూపాయ భీమకర్మ రతాయ చ || 29

భస్మ దిగ్ధ శరీరాయ రుద్రాక్షాభరణాయ చ | నమో హ్రస్వాయ దీర్ఘాయ వామనాయ నమోస్తుతే || 30

దూరే వధాయ తే దేవాగ్రే వధాయ నమో నమః | ధన్వినే శూలినే తుభ్యం గదినే హలినే నమః || 31

నానాయుధ ధరాయైవ దైత్యదానవ నాశినే | సద్యాయ సద్యురూపాయ సద్యోజాతాయ వై నమః || 32

తేజోమయుడు, తేజోమయమగు దేహము గలవాడు, భయంకరుడు, భయంకరాకారుడు, భయంకరమగు కర్మలయందభిరుచి గలవాడునగు పరమేశ్వరునకు నమస్కారము (29). భస్మము పూయబడిన శరీరము గలవాడు, రుద్రాక్షలను ఆభరణములుగా ధరించినవాడు, పొట్టివాడు, పొడుగువాడు, వామనావతారుడు అగు నీకు నమస్కారములు (30). ఓ దేవా! దూరమున నున్న శత్రువులను, మరియు ఎదుట నున్న శత్రువులను సంహరించువాడు, ధనస్సును శూలమును గదను నాగలిని ధరించినవాడు అగు నీకు అనేక నమస్కారములు (31). అనేక ఆయుధములను ధరించి దైత్య దానవులను సంహరించువాడు, సత్పురుషులకు ఆశ్రయణీయుడు, సత్పురుషులచే ధ్యానింపబడు దివ్యరూపము గలవాడు, స్వయముగా అవ్యక్త స్థితి నుండి వ్యక్త జగత్తుగా ప్రకటమగువాడు అగు నీకు నమస్కారము (31).

తత్పురుషాయ నాథాయ పురాణ పురుషాయ చ | పురుషార్థ ప్రదానాయ వ్రతినే పరమేష్ఠినే || 33

వామాయ వామరూపాయ వామనేత్రాయ తే నమః | అఘేరాయ పరేశాయ వికటాయ నమో నమః || 34

ఈశానాయ నమస్తుభ్య మీశ్వరాయ నమో నమః | బ్రహ్మాజీ బ్రహ్మరూపాయ నమస్సాక్షాత్పరాత్మనే || 35

ఉగ్రోసి సర్వదుష్టానాం నియంతాసి శివోసి నః | కాలకూటాశివే తుభ్యం దేవాద్యవన కారిణ || 36

తత్వమసీత్యాది మహా వాక్యములచే ప్రతిపాదింపబడు ఔపనిషద పురుషుడు, జగన్నాథుడు, సనాతనుడు, పురుషార్థములను ఇచ్చువాడు, వ్రతనిష్ఠుడు, పరమేష్ఠి స్వరూపుడునగు నీకు నమస్కారము (33). సుందరుడు, సుందరాకారుడు, సుందరమగు నేత్రములు గలవాడు, అఘోరుడు మరియు ఘోరుడు, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారములు (34). సర్వ జగన్నియంత, చతుర్ముఖ బ్రహ్మరూపుడు, పరబ్రహ్మ, సాక్షాత్‌ పరమాత్మ, ఈశానుడు అగు నీకు అనేక నమస్కారములు (35). నీవు ఉగ్రుడవై దుష్టులనందరినీ దండించెదవు. మాకు మంగలముల నిచ్చెదవు. కాల కూట విషమును భక్షించి దేవతలు మొదలగు వారిని రక్షించిన నీకు నమస్కారము (36).

వీరాయ వీరభద్రాయ క్షరద్వీరాయ శూలినే | మహాదేవాయ మహతే పశూనాం పతే నమః || 37

వీరాత్మనే సువిద్యాయ శ్రీ కంఠాయ పినాకినే | నమోనంతాయ సూక్ష్మాయ నమస్తే మృత్యు మన్యవే || 38

పరాయ పరమేశాయ పరాత్పరతరాయ తే ష పరాత్పరాయ విభ##వే నమస్తే విశ్వమూర్తయే || 39

నమో విష్ణుకలత్రాయ విష్ణుక్షేత్రాయ భావనే | భైరవాయ శరణ్యాయ త్ర్యంబకాయ విహారిణ || 40

వీరుడు, వీరభద్రస్వరూపుడు, శత్రువీరులను నశింపజేయువాడు, శూలధారి, మహాత్ముడు, పశు (జీవ) పతి అగు మహాదేవునకు నమస్కారము (37). వీరభద్ర స్వరూపుడు, సర్వవిద్యాప్రవర్తకుడు, విషకంఠుడు, పినాకమను ధనస్సును ధరించువాడు, అనంతుడు, సూక్ష్మ స్వరూపుడు, మృత్యురూపమగు క్రోధము గలవాడు అగు నీకు నమస్కారము (38). శ్రేష్ఠమగు వాటన్నింటి కంటె శ్రేష్ఠుడు, తనకంటె పరము లేనివాడు, సర్వవ్యాపి, వశ్వమూర్తి, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారము (39). విష్ణువు యొక్క అంశ పత్నిగా గలవాడు, విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు, సూర్య రూపుడు, భైరవుడు, శరణాగతి చేయదగినవాడు, లీలావిహారి అగు ముక్కంటి దేవునకు నమస్కారము (40).

మృత్యుంజయాయ శోకాయ త్రిగుణాయ గుణాత్మనే | చంద్ర సూర్యాగ్ని నేత్రాయ సర్వకారణ సేతవే || 41

భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా | పరబ్రహ్మ నిర్వికారీ చిదానందః ప్రకాశవాన్‌ || 42

బ్రహ్మ విష్ణ్వింద్ర చంద్రాది ప్రముఖాస్సురాః | మునయశ్చాపరే త్వత్త స్సంప్రసూతా మహేశ్వర || 43

యతో బిభర్షి సకలం విభజ్య తనుమష్టధా | అష్ట మూర్తి రితీశశ్చ త్వమాద్యః కరుణామయః || 44

శోక స్వరూపుడు, సత్త్వరజస్తమోగుణస్వరూపుడు, చంద్ర సూర్యాగ్నులు కన్నులుగా గలవాడు, సర్వమునకు కారణమగు ధర్మము తన రూపముగా గలవాడు అగు మృత్యుంజయునకు నమస్కారము (41). నీవు నీ తేజస్సుచే జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. నీవు వికారములు లేని, చిదానంద స్వరూపమగు, ప్రకాశస్వరూపమగు పరబ్రహ్మవు (42). ఓ మహేశ్వరా ! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు మొదలుగా గల దేవతలు, మునులు, ఇతరులు నీనుండి పుట్టినారు (43). నీవు శరీరమును ఎనిమిది భాగములుగా విభజించి సర్వజగత్తును ధరించియున్న అష్టమూర్తివి. ఈశ్వరుడవు. నీవు ఆద్యుడవు. కరుణామూర్తివి (44).

త్వద్భయాద్వాతి వతోయం దహత్యగ్నిర్భయాత్తవ | సూర్యస్తపతి తే భీత్యా మృత్యుర్థావతి సర్వతః || 45

దయాసింధో మహేశాన ప్రసీద పరమేశ్వర | రక్ష రక్ష సదైవాస్మాన్‌ యస్మాన్నష్టాన్‌ విచేత సః || 46

రక్షితాస్సతతం నాథ త్వయైవ కరుణానిధే |నానాపద్భ్యోవయం శంభో తథైవాద్య ప్రపాహినః || 47

యజ్ఞస్యోద్ధరణం నాథ కురు శీఘ్రం ప్రసాదకృత్‌ | అసమాప్తస్య దుర్గేశ దక్షస్య చ ప్రజాపతేః || 48

నీభయముచే ఈ గాలి వీచుచున్నది. నీ భయముచే అగ్ని దహించుచున్నది. నీ భయముచే సూర్యుడు తపించుచున్నాడు. మృత్యువు అంతటా పరువులెత్తుచున్నది (45). ఓ దయాసముద్రా! మహేశ్వరా !పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము. ముర్ఖులైన భ్రష్టులైన మమ్ములను సదా రక్షింపుము (46). హే నాథా! కరుణానిధీ! నీవు మమ్ములను ఎల్లవేళలా ఆపదలన్నింటి నుండియూ రక్షించినావు. హే శంభో! ఈనాడు కూడా అదే తీరున మమ్ములను పూర్తిగా రక్షించుము (47). హే నాథా! నీవు శీఘ్రమే మమ్ములను అనుగ్రహించి సమాప్తము కాని యజ్ఞమును ఉద్ధిరించుము. హే దుర్గేశా! దక్షప్రజాపతిని కూడ అనుగ్రహించుము (48).

భగోక్షిణీ ప్రపద్యేత యజమానశ్చ జీవతు | పూష్ణో దంతాశ్చ రోహంతు భృగోశ్శమశ్రుణి పూర్వవత్‌ || 49

భవతాను గృహీ తానాం దేవాదీనాం చ సర్వశః | ఆరోగ్యం భగ్నగాత్రాణాం శంకర త్వాయుధాశ్మభిః || 50

పూర్ణ భాగోస్తు తే నాథావశిష్టేధ్వరకర్మణి | రుద్ర భాగేన యజ్ఞస్తే కల్పితో నాన్యథా క్వచిత్‌ || 51

ఇత్యుక్త్వా స ప్రజేశశ్చ రమేశశ్చ కృతాంజలిః | దండవత్పతితో భూమౌ క్షమాపయితు ముద్యతః || 52

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దేవస్తుతి వర్ణనం నామ ఏకచత్వారింశోధ్యాయః (41).

భగునకు నేత్రములను లభించుగాక! యజమానుడగు దక్షుడు జీవుంచుగాక! పూషకు దంతములు మొలకెత్తుగాక! భృగువునకు పూర్వము వలెనే గెడ్డము, మీసములు వచ్చుగాక! (49) ఓ శంకరా! నీ ఆయుధములచే, రాళ్ళచే విరుగగొట్టబడిన ఆ వయవములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహముచే ఆరోగ్యము అన్ని విధములా సమకూరుగాక !(50). హే నాథా! మిగిలిన యజ్ఞ కర్మలో నీకు పూర్ణభాగము లభించుగాక! రుద్రునకు భాగము గల యజ్ఞమే పరిపూర్ణము అగును. అట్లు కాని యజ్ఞము ఎన్నటికీ పరిపూర్ణము కాదు (51). ఇట్లు పలికి ఆ బ్రహ్మ, విష్ణువు చేతులొగ్గి భూమిపై దండమువలె పడి నమస్కరించి క్షమార్పణలను చెప్పుకొనిరి (52).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో దేవస్తుతి వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

Sri Sivamahapuranamu-I    Chapters