Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ఏకోనత్రిం శోsధ్యాయః

దక్ష యజ్ఞములో సతి

బ్రహ్మోవాచ |

దాక్షాయణీ గతా తత్ర యత్ర యజ్ఞో మహాప్రభః | సురాసురమునీంద్రాది కుతుహల సమన్వితః || 1

స్వపితుర్భవనం తత్ర నానాశ్చర్య సమన్వితమ్‌ | దదర్శ సుప్రభం చారు సురర్షిగణసంయుతమ్‌ || 2

ద్వారి స్థితా తదా దేవీ హ్యవరుహ్య నిజాసనాత్‌ | నందినోభ్యంతరం శీఘ్రమేకైవా గచ్ఛదధ్వరమ్‌ || 3

ఆగతాం చ సతీం దృష్ట్వాసిక్నీ మాతా యశస్వినీ | అకరోదాదరం తస్యా భగిన్యశ్చ యథోచితమ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుని యజ్ఞము మహా ప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్లెను (1). అనేక వింతలతో గూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము నామె అచట చూచెను (2). అపుడా దేవి ద్వారము వద్ద తన వాహనమగు నందినుండి దిగి వెంటనే ఆమె ఒక్కతెయే లోపలకు యజ్ఞశాలకు వెళ్లెను (3).యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని, మరియు సోదరీ మణులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి (4).

నాకరోదాదరం దక్షో దృష్ట్వా తామపి కించన | నాన్యోపి తద్భయాత్తత్ర శివమాయా విమోహితః || 5

అథ సా మాతరం దేవీ పిరతం చ సతీ మునే | అనమద్విస్మితాత్యంతం సర్వలోక పరాభవాత్‌ || 6

భాగానపశ్యద్దేవానాం హర్యాదీనాం తదధ్వరే | న శంభు భాగమకరోత్‌ క్రోధం దుర్విషహం సతీ || 7

దక్షుడు ఆమెను చూచెను. కాని ఎట్టి ఆదరమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు (5). ఓ మహర్షీ!ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి, తండ్రికి సమస్కరించెను (6). ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతల కీయబడిన హవిర్భాగముల నామె చూచెను. కాని దక్షుడు శంభునకు భాగము నీయలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను (7).

తదా దక్షం దహంతీవ రుషా పూర్ణా సతీ భృశమ్‌ | క్రూరదృష్ట్యా విలోక్యైవ సర్వానప్యవమానితా || 8

ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించువేయునా యన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడ భయమును గొల్పు దృష్టితో చూచెను (8).

సత్యువాచ |

అనాహూతస్త్వయా కస్మా చ్ఛంభుః పరమశోభనః | యేన పూతమిదం విశ్వం సమగ్రం సచరాచరమ్‌ || 9

యజ్ఞో యజ్ఞవిదాం శ్రేష్ఠో యజ్ఞాంగో యజ్ఞదక్షిణః |యజ్ఞకర్తా చ యశ్శంభుస్తం వినా చ కథం మఖః || 10

యస్య స్మరణమాత్రేణ సర్వం పూతం భవత్యహో | వినా తేన కృతం సర్వమపవిత్రం భవిష్యతి || 11

ద్రవ్యమంత్రాదికం సర్వం హవ్యం కవ్యం చ యన్మయమ్‌ | శంభునా హి వినా తేన కథం యజ్ఞః ప్రవర్తితః || 12

సతి ఇట్లు పలికెను -

పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేల ఆహ్వానించలేదు? ఆయన ఈ చరాచర జగత్తునకంతకు పవిత్రత నాపాదించుచున్నాడు (9). యజ్ఞ స్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు, సోమయాజి స్వరూపుడునగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము? (10). ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము!ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నియూ అపవిత్రములగును (11). యజ్ఞద్రవ్యములు, మంత్రములు, దేవతల కిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది?(12).

కిం శివం సురసామాన్యం మత్వాకార్షీరనాదరమ్‌ | భ్రష్టబుద్ధిర్భవానద్య జాతోసి జనకాధమ || 13

విష్ణుబ్రహ్మాదయో దేవా యం సంసేవ్య మహేశ్వరమ్‌ | ప్రాప్తాస్స్వపదవీం సర్వే తం న జానాసి రే హరమ్‌ || 14

ఏతే కథం సమాయాతా విష్ణు బ్రహ్మాదయ స్సురాః | తవ యజ్ఞే వినా శంభుం స్వప్రభుం మునయస్త థా || 15

ఓరీ తండ్రీ !నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది (13). ఓరీ! ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరు తమతమ పదవులను పొందినారో, అట్టి హరుని ఎరుగకున్నావు (14). విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువగు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు వచ్చేసిరి ? (15).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా పరమేశానీ విష్ణ్వాదీన్‌ సకలాన్‌ ప్రతి | పృథక్‌ పృథగవోచత్సా భర్త్స యంతీ భవాత్మి కా || 16

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివస్వరూపిణి, పరమేశ్వరి అగు ఆ సతి ఇట్లు పలికి, మరల విష్ణ్వాదులనందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను (16).

సత్యువాచ |

హే విష్ణో త్వం మహాదేవం కిం న జానాసి తత్త్వతః | సగుణం నిర్గుణం చాపి శ్రుతయో యం వదంతి హి || 17

యద్యపి త్వాం కరం దత్త్వా బహూవారం మహేశ్వరః | అశిక్షయత్పురా శాల్వ ప్రముఖాకృతిభిర్హరే || 18

తదపి జ్ఞానమాయాతం న తే చేతసి దుర్మతే | భాగార్థీ దక్షయజ్ఞేస్మిన్‌ శివం స్వస్వామినం వినా || 19

పురా పంచముఖో భూత్వా గర్వితోసి సదాశివమ్‌ | కృతశ్చతుర్ముఖస్తేన విస్మృతోపి తదద్భుతమ్‌ || 20

సతి ఇట్లు పలికెను -

ఓ విష్ణూ!నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా ? వేదములాయనను సగుణుడనియు, నిర్గుణుడనియు కూడ వర్ణించుచున్నవి గదా !(17). ఓ హరీ! పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూత నిచ్చి, నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణ నిచ్చియుండెను (18). ఓరీ! దుష్టబుద్ధీ !అయిననూ నీకు మనస్సులో జ్ఞానము ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి (19). ఓరీ బ్రహ్మా! పూర్వము నీవు అయిదు ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా, ఆయన నిన్ను నాల్గు ముఖములు గలవానిని చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి (20).

ఇంద్ర త్వం కిం న జానాపి మహాదేవస్య విక్రమమ్‌ | భస్మభూతః పవిస్తే హి హరేణ క్రూరకర్మణా || 21

హే సురాః కిం న జానీథ మహాదేవస్య విక్రమమ్‌ | అత్రే వసిష్ఠ మునయో యుష్మాభిః కిం కృతం త్విహ || 22

భిక్షాటనం చ కృతవాన్‌ పురా దారువనే విభుః | శప్తో యద్భిక్షుకో రుద్రో భవద్భిర్మునిభిస్తదా || 23

శ##ప్తేనాపి చ రుద్రేణ యత్కృతం విస్మృతం కథమ్‌ | తల్లింగే నాఖిలం దగ్ధం భువనం సచరాచరమ్‌ || 24

ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది (21). ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ?(22) పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి (23). అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు (24).

సర్వే మూఢాశ్చ సంజాతా విష్ణుబ్రహ్మాదయస్సురాః | మునయోన్యే వినా శంభుమాగతా యదిహాధ్వరే || 25

సర్వే వేదాశ్చ సంభూతాస్సాంగాశ్శాస్త్రాణి వాగ్యతః | యోసౌ వేదాంత గశ్శంభుః కైశ్చిద్‌ జ్ఞాతుం న పార్యతే || 26

విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి (25). ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు (26).

బ్రహ్మోవాచ |

ఇత్యునేక విధా వాణీ రగదజ్జగదంబికా | కోపాన్వితా సతీ తత్ర హృదయేన విదూయతా || 27

విష్ణ్వా దయోఖిలా దేవా మునయో యే చ తద్వచః | మౌన భూతాస్తదాకర్ణ్య భయవ్యాకుల మానసాః || 28

అథ దక్షస్సమాకర్ణ్య స్వపుత్ర్యాస్తాదృశం వచః | విలోక్య క్రూరదృష్ట్యా తాం సతీం క్రుద్ధోబ్రవీద్వచః || 29

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను (27). విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి (28). అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను (29)..

దక్ష ఉవాచ |

తవ కిం బహునోక్తేన కార్యం నాస్తీహ సాంప్రతమ్‌ | గచ్ఛ వా తిష్ఠ వా భ##ద్రే కస్మాత్త్వం హి సమాగతా || 30

అమంగలస్తు తే భర్తా శివోసౌ గమ్యతే బుధైః | అకులీనో వేదబాహ్యో భూతప్రేతపిశాచరాట్‌ || 31

తస్మాన్నాహ్వానితో రుద్రో యజ్ఞార్ధం సుకువేషభృత్‌ | దేవర్షి సంసది యయా జ్ఞాత్వా పుత్రి విపశ్చితా || 32

విధినా ప్రేరితేన త్వం దత్తా మందేన పాపినా | రుద్రాయావిదితార్థాయ చోద్ధతాయ దురాత్మనే || 33

తస్మాత్కోపం పరిత్యజ్య స్వస్థా భవ శుచిస్మితే | యద్యాగతాసి యజ్ఞేస్మిన్‌ దాయం గృహ్ణీష్వ చాత్మనా || 34

దక్షుడిట్లు పలికెను -

నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?(30). నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు (31). అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (32). బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని (33). ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము (34).

బ్రహ్మోవాచ |

దక్షేణోక్తేతి సా పుత్రీ సతీ త్రైలోక్యపూజితా | నిందాయుక్తం స్వపితరం దృష్ట్వా సీద్రుషితా భృశమ్‌ || 35

అచింతయత్తదా సేతి కథం యాస్యామి శంకరమ్‌ | శంకరం ద్రుష్టు కామాహం పృష్టా వక్ష్యే కిముత్తరమ్‌ || 36

అథ ప్రోవాచ పితరం దక్షం తం దుష్టమానసమ్‌ | నిశ్శ్వసంతీ రుషావిష్టా సా సతీ త్రిజగత్ర్పసూః || 37

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను (35). అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? (36) అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను (37).

సత్యువాచ |

యో నిందతి మహాదేవం నింద్యమానం శృణోతివా | తావు భౌ నరకం యాతౌ యావచ్చంద్రదివాకరౌ || 38

తస్మాత్త్యక్ష్యామ్యహం దేహం ప్రవేక్ష్యామి హుతాశనమ్‌ | కిం జీవితేన మే తాత శృణ్వంత్య నాదరం ప్రభోః || 39

యది శక్తస్స్వయం శంభోర్నిందకస్య విశేషతః | ఛింద్యాత్ర్ప సహ్య రసనాం తదా శుద్ధ్యేన్న సంశయః || 40

యద్యశక్తో జనస్తత్ర నిరయాత్సుపిధాయ వై | కర్ణౌ ధీమాన్‌ తతశ్శుద్ధ్యే ద్వదంతీదం బుధా వరాః || 41

సతి ఇట్లు పలికెను -

ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు (38). కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?(39). శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును (40). అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు (41)|

బ్రహ్మోవాచ |

ఇత్థముక్త్వా ధర్మనీతిం పశ్చాత్తాపమవాప సా | అస్మార చ్ఛాంకరం వాక్యం దూయమానేన చేతసా || 42

తతస్సంక్రుద్ధ్య సా దక్షం నిశ్శంకం ప్రాహ తానపి | సర్వాన్‌ విష్ణ్వాదికాన్‌ దేవాన్మునీనపి సతీ ధ్రువమ్‌ || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను (42). అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను (43).

సత్యు వాచ |

తాత త్వం నిందకర్శంభోః పశ్చాత్తాపం గమిష్యసి | ఇహ భుక్త్వా మహాదుఃఖమంతే యాస్యసి యాతనామ్‌ || 44

యస్య లోకోప్రియో నాస్తి ప్రియశ్చైవ పరాత్మనః | తస్మిన్నవైరే శ##ర్వేస్మిన్‌ త్వాం వినా కః ప్రతీపకః || 45

మహద్వినిందా నాశ్చర్యం సర్వదాసత్సు సేర్ష్యకమ్‌ | మహదంఘ్రిరజో ధ్వస్తతమస్సు నైవ శోభనా || 46

శివేతి ద్వ్యక్షరం యస్య నృణాం నామ గిరేరితమ్‌ | సకృత్ర్పసంగాత్సకల మఘమాశు విహంతి తత్‌ || 47

పవిత్రకీర్తితమలం భవాన్‌ ద్వేష్టి శివేతరః | అలంఘ్య శాసనం శంభు మహో సర్వేశ్వరం ఖలః || 48

సతీదేవి ఇట్లు పలికెను -

తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు (44). ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు? (45) దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు (46). ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును (47). అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము (48).

యత్పాదపద్మం మహతాం మనోలి సునిషేవితమ్‌ | సర్వార్థదం బ్రహ్మరసై స్సర్వార్థిభి రథాదరాత్‌ || 49

యద్వర్షత్యర్థిన శ్శీఘ్రం లో కస్య శివ ఆదరాత్‌ | భవాన్‌ ద్రుహ్యతి మూర్ఖత్వాత్తసై#్మ చాశేషబంధవే || 50

కిం వా శివాఖ్య మశివం త్వదన్యే విదుర్బధాః | బ్రహ్మాదయస్తం మునయస్సనకాద్యాస్తథాపరే || 51

అవకీర్య జటాభూతైశ్శ్మశానే సకపాలధృక్‌ | తన్మాల్య భస్మ వా జ్ఞాత్వా ప్రీత్యావసదుదారధీః || 52

యే మూర్ధభిర్దధతి తచ్చరణోత్సృష్ట మాదరాత్‌ | నిర్మాల్యం మునయో దేవాస్స శివః పరమేశ్వరః || 53

మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు (49). శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు (50). శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళ##వేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు (51). విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు (52). ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు (53).

ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ చోదితమ్‌ | వేదే వివిచ్య వృత్తం చ తద్వి చార్య మనీషి భిః || 54

విరోధి ¸°గపద్యైకకర్తృకే చ తథా ద్వయమ్‌ | పరబ్రహ్మణి శంభౌ తు కర్మర్ఛతి న కించన || 55

మా వః పదవ్యస్స పితర్యా అస్యదాస్థితాస్సదా | యజ్ఞశాలాసు వో ధూమ్ర వర్త్మ

భుక్తో జ్ఘి తాః పరమ్‌ || 56

నో వ్యక్త లింగస్సతత మవధూత సుసేవితః | అభిమానమతో న త్వం కురు తాత కుబుద్ధిధృక్‌ || 57

వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు (54). ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు (55). ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు (56). ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము (57).

కిం బహూక్తేన వచసా దుష్టస్త్వం సర్వథా కుధీః | త్వదుర్భవేన దేహేన న మే కించిత్ర్పయోజనమ్‌ || 58

తజ్జన్మ ధిగ్యో మహతాం సర్వథా వద్యకృత్ఖలః | పరిత్యాజ్యో విశేషేణ తత్సంబంధో విపశ్చితా || 59

గోత్రం త్వదీయం భగవాన్‌ యదాహ వృషభధ్వజః | దాక్షాయణీతి సహసాహం భవామి సుదుర్మనాః || 60

తస్మాత్త్వదంగజం దేహం కుణపం గర్హితం సదా | వ్యుత్సృజ్య నూనమధునా భవిష్యామి సుఖావహా || 61

ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు (58). మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను (59). భగవాన్‌ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును (60). కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను (61).

హే సురా మునయస్సర్వే యూయం శృణుత మద్వచః | సర్వధానుచితం కర్మ యుష్మాకం దుష్ట చేతసామ్‌ || 62

సర్వే యూయం విమూఢా హి శివనిందాః కలిప్రియాః | ప్రాప్స్యంతి దండం

నియతమ ఖిలం చ హరాద్ధ్రువమ్‌ || 63

ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు (62). శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు (63).

బ్రహ్మోవాచ |

దక్ష ముక్త్వాధ్వరే తాంశ్చ వ్యరమత్సా సతీ తదా | అనూద్య చేతసా శంభుమస్మరత్ర్పాణవల్లభమ్‌ || 64

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితియాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీఖండే సతీవాక్యవర్ణనం నామైకోనత్రింశోధ్యాయః (29).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను (64).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

Sri Sivamahapuranamu-I    Chapters