Sri Sivamahapuranamu-I    Chapters   

అథ అష్టాదశోsధ్యాయః

సతీ కల్యాణము

నారద ఉవాచ |

రుద్రపార్శ్వేత్వయి గతే కిమ భూచ్చరితం తతః | కా వార్తా హ్య భవత్తాత కిం చకార హరస్స్వయమ్‌ || 1

నారదుడిట్లు పలికెను -

నీవు రుద్రుని వద్దకు వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? తండ్రీ! హరుడు స్వయముగా ఏమి చేసినాడు?(1)

బ్రహ్మోవాచ |

అథాహం శివమానేతుం ప్రసన్నః పరమేశ్వరమ్‌ |ఆసదం హి మహా దేవం హిమవద్గిరి సంస్థితమ్‌ || 2

మాం వీక్ష్య లోకస్రష్టారమాయాంతం వృషభధ్వజః | మనసా సంశయం చక్రే సతీ ప్రాప్తౌ ముహుర్ముహుః || 3

అథ ప్రీత్యా హరో లోకగతి మాశ్రిత్య లీలయా | సత్యాం భక్త్యా చ మాం క్షిప్రమువాచ ప్రాకృతో యథా || 4

బ్రహ్మఇట్లు పలికెను -

తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడ్కొని వచ్చుటకై, హిమవత్పర్వము నందున్న ఆ మహాదేవుని వద్దకు వెళ్లితిని (2). సృష్టి కర్తనగు నేను వచ్చుచుండుటను గాంచి ఆ వృషభధ్వజుడు తన మనస్సులో సతీ దేవిని పొందే విషయములో అనేక సంశయములకు దావిచ్చెను (3). అపుడు హరుడు ప్రాకృత జనుని వలె లోకపు తీరును పాటించే లీలను చే గొన్నవాడై సతీదేవియందలి ప్రేమతో, నన్ను ఉద్దేశించి ప్రీతిపూర్వకముగా వెంటనే ఇట్లు పలికెను (4).

ఈశ్వర ఉవాచ |

కిమకార్షీత్సురజ్యేష్ఠ సత్యర్థే త్వత్సుతస్స మామ్‌ | కథయస్వ యథా స్వాంతం న దీర్యే మన్మథేన హి || 5

ధావమానో విప్రయోగో మామేవ చ సతీం ప్రతి | అభిహంతి సురజ్యేష్ఠ త్యక్త్వా న్యాం ప్రాణధారిణీమ్‌ || 6

సతీతి సతతం బ్రహ్మన్‌ వద కార్యం కరోమ్యహమ్‌ | అభేదాన్మమ సా ప్రాప్యా తద్విధే క్రియతాం తథా || 7

ఈశ్వరుడిట్లు పలికెను -

దేవతలలో పెద్దవైన ఓ బ్రహ్మా! నా మనస్సు వియోగ దుఃఖముచే బ్రద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతీ విషయములో ఏమి చేయును?(5). హే సురజ్యేష్ఠా! ఈ సతీవియోగము తన్మూలకమగు జ్వరము అధికముగా పెరుగుచున్నదై నన్ను చాల హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర ప్రాణులను వీడి నన్ను పట్టుకున్నది (6). హే బ్రహ్మన్‌! నేను నిరంతరము సతినే ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలయునో చెప్పుము. చేసెదను. నేనామెకు దూరము గాకుండా వెంటనే ఆమెను పొందే విధానమును ఆచరింపుము (7).

బ్రహ్మోవాచ |

ఇతి రుద్రోక్తవచనం లోకాచారసుగర్భితామ్‌ | శ్రుత్వాహం నారదమునే సాంత్వయన్నగదం శివమ్‌ || 8

సత్యర్థం యన్మమ సుతో వదతి స్మ వృషధ్వజ | తచ్ఛృణుష్వ నిజాసాధ్య సిద్ధ మిత్యవధారయ || 9

దేయా తసై#్మ మయా పుత్రీ తదర్థం పరికల్పితా | మమా భీష్టమిదం కార్య త్వద్వాక్యారదధికం పునః || 10

మత్పు త్ర్యారాధితశ్శం భురేతదర్థం స్వయం పునః | సోsష్యన్విష్యతి మాం యస్మాత్తదా దేయా మయా హరే || 11

శుభే లగ్నే సుమూహుర్తే సమాగచ్ఛ తు సాంతికమ్‌ | తదా దాస్యామి తనయాం బిక్షార్థం శంభ##వే విధే || 12

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదమహర్షీ! ఈ తీరున లోక ప్రవృత్తితో నిండియున్న రుద్రుని మాటను విని నేనా శివుని ఓదార్చుచూ ఇట్లు పలికితిని (8). హే వృషభధ్వజా! సతి విషయములోనా కుమారుడు చెప్పిన మాటల నాలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిద్ధించిన దని నిశ్చయించుము (9). నా కుమార్తె శివుని కొరకై తనువును దాల్చినది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు అభిష్టము. నీ ఆదేశము చే అది మరింత అభిష్టమగు చున్నది (10). నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి యున్నది.ఆ శివుడు కూడా నన్ను సతి కొరకు ప్రార్థించుచున్నాడు. కాన ఆమెను శివునికిచ్చి వివాహమును చేయవలెను (11). హే బ్రహ్మన్‌! శంభుడు శుభలగ్నములో సుమహూర్తములో కన్యా భిక్ష కొరకు నా వద్దకు వచ్చు గాక! నేను నా కుమార్తెను ఇచ్చి వివాహమును చేయగలను(12).

ఇత్యువాచ స మాం దక్ష స్తస్మాత్త్వం వృషభధ్వజ | శుభే ముహూర్తే తద్వేశ్మ గచ్ఛ తామానయస్వ చ || 13

ఇతి శ్రుత్వా మమ వచో లౌకికీం గతిమాశ్రితః | ఉవాచ విహసన్రుద్రో మునే మాం భక్తవత్సలః || 14

హే వృషభధ్వజా!దక్షడు నాతో ఇట్లు పలికినాడు. కాన నీవు శుభముహూర్తములో ఆతని గృహమునకు వెళ్లి ఆమెను తీసుకురమ్ము(13). ఈ నా మాటను విని భక్తవత్సలుడగు రుద్రుడు లోకప్రవృత్తి నాశ్రయించి నవ్వెను. ఓ మహర్షీ! ఆయన నాతో ఇట్లనెను (14).

రుద్ర ఉవాచ |

గమిష్యే భవతా సార్థం నారదేన చ తద్గృహమ్‌ | అహమేవ జగత్ర్సష్టస్తస్మాత్త్వం నారదం స్మర || 15

మరీచ్యాదీన్‌ స్వపుత్రాంశ్చ మానసానపి సంస్మర | తై స్సార్ధం దక్ష నిలయం గమిష్యే సగణో విధే || 16

రుద్రుడిట్లు పలికెను -

ఓ సృష్టి కర్తా! నీతో మరియు నారదునితో గూడి నేను స్వయముగా ఆతని ఇంటికి వెళ్లగలను. కాన నీవు నారదుని స్మరింపుము (15). ఓ విధీ! నీ మానసపుత్రులగు మరీచి మొదలగు వారిని కూడా స్మరించుము. నేను వారితో, మరియు గణములతో కూడి దక్షుని గృహమునకు వెళ్లెదను (16).

బ్రహ్మోవాచ |

ఇత్యాజ్ఞప్తోsహ మీశేన లోకాచారపరేణ హ | సంస్మరం నారదం త్వాం చ మరీచ్యాదీన్సుతాంస్తథా || 17

తతస్సమాగతాస్సర్వే మానసాస్త నయాస్త్వయా | మమ స్మరణమాత్రేణ హృష్టాస్తే ద్రుతమాదరాత్‌ || 18

విష్ణుస్సమాగతస్తూర్ణం స్మృతో రుద్రేణ శైవరాట్‌ | సస్వసైన్యః కమలయా గరుడా రూఢ ఏవ చ || 19

అథ చైత్రసితే పక్షే నక్షత్రే భగదైవతే | త్రయోదశ్యాం దినే భానౌ నిర్గచ్ఛత్స మహేశ్వరః || 20

బ్రహ్మ ఇట్లు పలికెను -

లోకాచార పరాయణుడగు ఈశ్వరుడిట్లు ఆజ్ఞాపించిగా, నేను నిన్ను (నారదుని), మరియు మరీచి మొదలగు కుమారులను స్మరించితిని (17). అపుడా మానసపుత్రులందరు నీతో గూడి నేను స్మరించినంతనే ఆనందముతో ఆదరముతో వెను వెంటనే అచటకు వచ్చేసిరి (18). శివభక్తా గ్రగణ్యుడగు విష్ణువును రుద్రుడు స్మరించగ ఆయన లక్ష్మీదేవితో గూడి తన సైన్యమును వెంటబెట్టుకొని గరుడుని అధిష్ఠించి వెను వెంటనే విచ్చేసెను (19). తరువాత చైత్ర శుక్ల త్రయోదశీ ఆదివారము ఉత్తరా నక్షత్రము నాడు ఆ మహేశ్వరుడు బయలు దేరెను (20).

సర్వైస్సురగణౖస్సార్థం బ్రహ్మవిష్ణు పురస్సరైః | తథా తైర్మునిభిర్గచ్ఛన్‌ స బభౌ పథి శంకరః || 21

మార్గే సముత్సుకో జాతో దేవాదీనాం చ గచ్ఛతామ్‌ | తథా హరగణానాం చ సానంద మనసామతి || 22

గజగోవ్యాఘ్రసర్పాశ్చ జటా చంద్ర కలా తథా | జగ్ముస్సర్వే భూషణత్వం యథా యోగ్యం శివేఛ్చయా || 23

తతః క్షణన బలినా బలీవర్దేన యోగినా | స విష్ణు ప్రముఖః ప్రీత్యా ప్రాప దక్షాలయం హరః || 24

తతో దక్షో వినీతాత్మ సంప్రహృష్ట తనూరుహః | ప్రయ¸° సన్ముఖం తస్య సంయుక్త స్సకలైర్నిజైః || 25

ఆ శంకరుడు సర్వ దేవతాగణములతో, బ్రహ్మ విష్ణువులతో, మరియు మహర్షులతో కూడి మార్గము నందు వెళ్లుచూ మిక్కిలి శోభిల్లెను (21). దేవతలకు శివగణములకు, ఇతరులకు వెళ్లుచుండగా మార్గము నందు గొప్ప ఉత్సాహము, మనస్సులో పట్టరాని ఆనందము కలిగెను (22). గజము ,గోవు , వ్యాఘ్రము, సర్పములు, జటాజూటములు, మరియు చంద్రకళ అనునవి శివుని సంకల్పముచే యోగ్యమగు భూషణములుగా మారిపోయినవి (23). తరువాత శివుడు విష్ణువు మొదలగు వారితో గూడి బలశాలి, యోగశక్తి గలది అగు వృషభము నధిష్ఠించి క్షణకాలములో ఆనందముగా దక్షుని గృహమునకు చేరెను (24). అపుడు ఆనందముతో గగుర్పాటు గల దక్షుడు వినయముతో కూడిన వాడై తన బంధువులందరితో గూడి ఆయనకు ఎదురేగెను (25)

సర్వే సురగణాస్తత్ర స్వయం దక్షేణ సత్కృతాః | పార్ష్వే శ్రేష్ఠం చ మునిభిరుపవిష్టా యథాక్రమమ్‌ || 26

పరివార్యాఖిలాన్‌ దేవాన్‌ గణాంశ్చ మునిభిర్యథా | దక్షస్సమానయామాస గృహాభ్యంతరతశ్శివమ్‌ || 27

అథ తక్షోః ప్రసన్నాత్మారస్వయం సర్వేశ్వరం హరమ్‌ | సమానర్చ విధానేన దత్తవా సనమనుత్తమమ్‌ || 28

తతో విష్ణుంచ మాం విప్రాన్‌ సురాన్‌ సర్వాన్‌ గణాంస్తథా | పూజయామాస సద్భక్త్యా యథోచితవిధానతః || 29

దక్షుడు తన గృహగమునకు విచ్చేసిన దేవతలనందరినీ స్వయముగా సత్కరించెను. శ్రేష్ఠుడగు శివుని కూర్చుండ బెట్టి, ఆయన ప్రక్కన మునులందరిని వరుసలో కూర్చుండునట్లు చేసెను (26). అపుడు దక్షుడు దేవతలనందరినీ, మరియు మునులను ప్రదక్షిణము చేసి, వారితో సహా శివుని ఇంటిలోపలికి దోడ్కోని వెళ్లెను (27). అపుడు ప్రసన్నమగు చిత్తము గల దక్షుడు సర్వేశ్వరుడగు హరునకు సర్వశ్రేష్ఠమగు ఆసనమును స్వయముగా నిచ్చి విధి విధానముగా పూజించెను (28). తరువాత ఆతడు మంచి భక్తితో సరియగు విధానములో నున్న, విష్ణువును బ్రహ్మణులను, సర్వ దేవతలను, మరియు రుద్రగణములను పూజించెను (29).,

కృత్వా యథో చితాం పూజాం తేషాం పూజ్యాదిభిస్తథా | చకార సంవిదం దక్షో మునిభిర్మానసైః పునః || 30

తతో మాం పితరం ప్రాహ దక్షః ప్రీత్యా హి మత్సుతః| ప్రణిపత్య త్వయా కర్మ కార్యం వైవాహికం విభో || 31

బాఢమిత్యహమప్యుక్త్వా ప్రహృష్టేనాంతరాత్మనా | సముత్థాయ తతోsకార్షం తత్కార్యమఖిలం తథా || 32

తతశ్శుభే ముహర్తే హి లగ్నే గ్రహబలాన్వితే | సతీం నిజసుతాం దక్షో దదౌ హర్షేణ శంభ##వే || 33

పూజ్యులగు మహర్షులతో కూడియున్న వారికి యథా యోగ్యమగు పూజను చేసి దక్షుడు మరల నా మానసపుత్రులగు మునులతో సంప్రదించెను (30). తరువాత నా కుమారుడగు ఆ దక్షుడు ప్రీతితో తండ్రినగు నాతో 'ప్రభో!వివాహ కర్మను నీవే జరిపింపుము' అని పలికి ప్రణమిల్లెను (31). నేను కూడా సంతసిల్లిన అంతఃకరణము గలవాడనై, సరే అని పలికి, లేచి ఆ కార్యమునంతనూ నిర్వర్తించితిని (32). అపుడు శుభముహూర్తమునందు గ్రహబలముతో కూడిన లగ్నములో దక్షుడు ఆనందముతో తన కుమార్తె యగు సతిని శంభునకిచ్చెను (33).

ఉద్వాహవిధినా సోsపి పాణిం జగ్రా హ హర్షితః | దాక్షాయణ్యా వరతనోస్తదానీం వృషభధ్వజః || 34

అహం హరిస్త్వ దాద్యావై మునయశ్చ సురా గణాః | నేముస్సర్వే సంస్తుతిభి

స్త్సో షయామాసురీశ్వరమ్‌ || 35

సముత్సవో మహానాసీన్నృత్యగాన పురస్సరః |ఆనందం పరమం జగ్ముస్సర్వే ముని గణాస్సురాః || 36

కన్యాం దత్త్వా కృతార్థోsభూత్తదా దక్షో హిమత్సుతః | శివాశివౌ ప్రసన్నౌ చ నిఖిలం మంగలాలయమ్‌ || 37

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కన్యాదాన వర్ణనం నామ అష్టాదశోsధ్యాయః (18).

అపుడా వృషభధ్వజుడు ఆనందించి యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠించి సుందరియగు దాక్షాయణితో పాణి గ్రహణమును చేసెను (34). నేను, విష్ణువు, నీవు, ఇతరమునులు, దేవతలు, శివగణములు అందరు ఈశ్వరునకు నమస్కరించి గొప్ప స్తుతులచే సంతోషపెట్టిరి (35). గొప్ప ఉత్సవము జరిగెను. నాట్యములు గానములు నిర్వహించబడెను. ముని గణములు, దేవతలు అందరు పరమానందమును పొందిరి (36). నా కుమారుడగు దక్షుడు ఆనాడు కన్యాదానమును చేసి కృతార్ధుడాయెను. ఉమా పరమేశ్వరులు ప్రసన్నులైరి. సర్వము మంగళ నిధానమాయెను.(37).

శ్రీశివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో కన్యాదాన వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

Sri Sivamahapuranamu-I    Chapters