Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

తత్వం - తత్త్వవిత్‌ - ఏకాత్మా

మన ఆళ్వారులు, నాయనారులు వారి పుణ్యమాయని తమిళభాషలో భక్తి గ్రంథాలను పుష్కలంగా రచించి మన కిచ్చిపోయినారు, వారు తీర్థయాత్రలుచేస్తూ, దివ్యస్థలములందు భక్తిపారవశ్యంతో పరమేశ్వరుని కీర్తించారు. మహరుల తపశ్చరణముచే పవిత్రములైనతీర్థములను, క్షేత్రములనుసేవించు కోవాలనే తలంపేగాని, ఒకరికి ఉపదేశించాలనీ, మత ప్రచారం చేయాలనీ వారు అనుకోలేదు.

మనదేశంలో 108 విష్ణుక్షేత్రాలున్నవి. ఇక శివక్షేత్రాలకు లెక్కేలేదు. భక్తిరసపానమత్తలైన, ఈ యాళ్వారులు, నాయనారులు ఆయాక్షేత్రములలో ఈశ్వరదర్శనంచేసి కండ్లవెంట ఆనందబాష్పములుకురుస్తూ పరమభక్త్యావేశంతో భగవత్కీర్తనం చేశారు. ఒక్కచోటనే కూర్చుంటే కామక్రోధాది సంసర్గం కలుగుతుందేమో అనేభయంకొద్దీవారు నిరంతరంగా తీర్థాటనచేస్తూ, ఒక్కొక్కచో ఒక్కొక్కరూపంతో వెలసిన స్వామికి గానరూపంగా హదృయాల నర్పించుకున్నారు.

పరమేశ్వరుని ఒక్కపేరుతో పిలిస్తే ఈభక్తులకు తృప్తి ఉండేదికాదు. వారిలో ఒక మహనీయుడు ''పేరాయిరం పరవి కానర్‌ యెట్టుం పెరుమానె'' అన్నాడు. ఈశ్వరునకు వేయి నామాలున్నవట. వేయి అనగా అనంతంగా అనిఅభిప్రాయం. మహాభారతంలో మనకు విష్ణుసహస్రనామస్తోత్రం. శివసహస్రనామ స్తోత్రం కనిపిస్తవి. మొదటిదానిని వ్యాసుడు, రెండవ దానిని ఉపమన్యుడు రచించారు. విష్ణుసహస్రనామాలలో -

'తత్త్వం, తత్త్వవిత్‌ ఏకాత్మా జన్మ మృత్యు జరాధిగః' అనే పంక్తి ఒకటి వున్నది. ఈ పేళ్ళుఅలవోకగా గుచ్చి యెత్తినవికావు. వీటిలో ఒకసార్ధక్యం గోచరమవుతుంది. ఈశ్వరుడు తత్త్వము - అనగాపరతత్త్వమనీ, పరబ్రహ్మమనీ అర్థం. తత్త్వమగు ఆ ఈశ్వరుడు తత్త్వివిత్తుకూడాను అంటే బ్రహ్మవేత్తయని తాత్పర్యం. బ్రహ్మమును తెలుసుకొన్నవాడు బ్రహ్మమేఅవుతాడనిఉపనిషత్తు చెపుతున్నది. కనుక తత్త్వము, తత్త్వవిత్తు ఏకాత్మగా గ్రహించాలి ఆత్మఅనేది ఒక్కటేగాని రెండుకాదు. కాబట్టి తత్త్వము. తత్త్వవిత్తు ఏకమని తెలిసికొంటే జన్మ మృత్యు జరాదులు లేని ముక్తావస్థ లభిస్తుంది. జన్మమృత్యు జరాతీతమైన ఈశ్వరునిస్థితియే జీవునకు దొరకుతుందని తాత్పర్యం. ఏకము, అద్వయము అయినపరతత్త్వమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే తత్త్వవిత్తు, ఏకాత్మ అని గ్రహించాలి.

అద్వయతత్త్వ సారాంశం ఈనాలుగునామముల్లో ఇంత చక్కగా సంగ్రహింపబడింది. ఈపరతత్త్వమును తెలియ జెప్పుటకే విష్ణునామములిట్లుగుదిగ్రుచ్చబడినవి. పాణినిసూత్రములు గూడా అర్థములను, శబ్దములను ఇట్లే సంగ్రహిస్తవి. ఒక సూత్రంలో నుంచి ఇంకోసూత్రం మొలుచుకువచ్చినట్లు వుంటవి. లలితా సహస్రనామస్తోత్రముగూడా ఇటువంటిదే.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page