Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

దేవజలంధర సంగ్రామము

సనత్కుమార ఉవాచ |

ఏకదా వారిధిసుతో వృందాపతిరుదారధీః | సభార్యస్సంస్థితో వీరో%సురైస్సర్వైస్సమన్వితః || 1

తత్రాజగమ సుప్రీతస్సు వర్చాస్త్వథ భార్గవః | తేజః పుంజో మూర్త ఇవ భాసయన్‌ సకలా దిశః || 2

తం దృష్ట్వా గురుమాయాంత మసురాస్తే%ఖిలా ద్రుతమ్‌ | ప్రణముః ప్రీతమనస స్సింధుపుత్రో%పి సాదరమ్‌ || 3

దత్త్వాశీర్వచనం తేభ్యో భార్గవస్తేజసాం నిధిః | నిషసాదాసనే రమ్యే సంతస్థుస్తే%పి పూర్వవత్‌ || 4

అథ సింధ్వాత్మోజో వీరో దృష్ట్వా ప్రీత్యా నిజాం సభామ్‌ | లంధరః ప్రసన్నో%భూ దనష్ట వరశాసనః || 5

తత్‌ స్థితం ఛిన్న శిరనం దృష్ట్వా రాహుం స దైత్యరాట్‌ | పప్రచ్ఛ భార్గవం శీఘ్రమిదం సాగరనందనః || 6

సనత్కుమారుడిట్లు పలికెను -

ఒక నాడు వృందాపతి, విశాల హృదయుడు, వీరుడు, సముద్రపుత్రుడునగు జలంధరుడు భార్యతో గూడి రాక్షసులందరిచే చుట్టు వారబడి యుండెను (1). ప్రేమతో నిండిన హృదయము గలవాడు, గొప్ప తేజశ్శాలి, మూర్తీభవించిన తేజోరాశి వలె నున్నవాడు అగు శుక్రుడు దిక్కుల నన్నిటినీ ప్రకాశింప చేయుచూ అచటకు విచ్చేసెను (2). గురువు వచ్చుచుండుటను గాంచిన రాక్షసులందరు వెంటనే ఆనందముతో నిండిన మనస్సు గలవారై ఆయనకు నమస్కరించిరి. సముద్రపుత్రుడు కూడా ఆదరముతో నమస్కరించెను (3). తేజోరాశియగు శుక్రుడు వారిని ఆశీర్వదించి సుందరమగు ఆసనములో కూర్చుండెను. వారు కూడా తమ తమ ఆసనములలో గూర్చుండిరి (4). నాశము లేని గొప్ప శాసనము గలవాడు, సముద్రపుత్రుడు, వీరుడు అగు జలంధరుడు అపుడు తన సభను ప్రీతితో గాంచి మిక్కిలి ప్రసన్నుడాయెను (5). సభలో దేహమునుండి నరుకబడి వేరుచేయబడిన శిరస్సుగల రామువును గాంచి రాక్షసేశ్వరుడగు జలంధరుడు వెంటనే శుక్రుని ఇట్లు ప్రశ్నించెను (6).

జలంధర ఉవాచ |

కేనేదం విహితం రాహోశ్శిరచ్ఛేదనకం ప్రభో | తద్‌ బ్రూహి నిఖిలం వృత్తం యథావత్తత్త్వతో గురో || 7

జలంధరురిడిట్లు పలికెను -

ప్రభూ! రాహువుయొక్క శిరస్సును ఈ విధముగా ఖండించినదెవరు? ఓ గురూ! ఆ వృత్తాంతము నంతనూ సారరూపముగా యథాతథముగా చెప్పుము (7).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య సింధు పుత్రస్య భార్గవః | స్మృత్వా శివపదాంభోజం ప్రత్యువాచ యథార్థవత్‌ || 8

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆ జలంధరుని ఈ మాటను విని శుక్రుడు శివుని పాదపద్మములను స్మరించి వృత్తాంతమును యథార్థముగా నిట్లు చెప్పెను (8).

శుక్ర ఉవాచ |

జలంధర మహావీర సర్వాసురసహాయక | శృణు వృత్తాంతమఖిలం యథావత్కథయామి తే || 9

పురాభవద్బలిర్వీరో విరోచనసుతో బలీ | హిరణ్య కశిపోశ్చైవ ప్రపౌత్రో ధర్మవిత్తమః || 10

పరాజితాస్సురాస్తేన రమేశం శరణం యయుః | సవాసవాస్స్వవృత్తాంతమాచఖ్యుస్స్వార్థసాధకాః || 11

తదాజ్ఞయా సురైస్సార్థం చక్రుస్సంధిమథో%సురాః | స్వకార్యసిద్ధయే తాత చ్ఛలకర్మవిచక్షణాః || 12

అథామృతార్థం సింధోశ్చ మంథనం చక్రురాదరాత్‌ | విష్ణోస్సహాయినస్తే హి సురాస్సర్వే%సురైస్సహ || 13

తతో రత్నో పహరణమకార్షు ర్దైత్యశత్రవః | జగృహుర్యత్నతో దేవాః పపురప్యమృతం ఛలాత్‌ || 14

తతః పరాభవం చక్రురసురాణాం సహాయతః | విష్ణోస్సురాస్సచక్రాస్తే%మృతపానాద్బలాన్వితాః || 15

శుక్రడిట్లు పలికెను -

జలంధరా! మహావీరా! రాక్షసులందరికీ సహాయమును చేయువాడా! జరిగిన వృత్తాంతమునంతనూ యథాతథముగా చెప్పెదను. వినుము (9). పూర్వము బలవంతుడు, వీరుడు, విరోచనుని కూమారుడు, హిరణ్యకశిపుని మునిమనుమడు, గొప్ప ధర్మవేత్త అగు బలి యనువాడు ఒకడు ఉండెను (10). స్వార్థ సంపాదనలో ఘనులగు దేవతలు వానిచే ఓడింపబడి ఇంద్రునితో గూడి లక్ష్మీ పతిని శరణు జొచ్చి తమ వృత్తాంతమును చెప్పిరి (11). తరువాత ఆయన ఆజ్ఞచే రాక్షసులు దేవతలతో సంధిని కుదుర్చుకొనిరి. మోసపుచ్చుటలో పండితులగు దేవతలు తమ కార్యమును చక్కబెట్టుకొనుట కొరకై అట్లు చేసిరి. వత్సా! (12) అపుడు విష్ణువు యొక్క సాహాయ్యము గల దేవతలందరు రాక్షసులతో గూడి అమృతము కొరకు సముద్రమును శ్రద్ధతో మథించిరి (13). తరువాత రాక్షసులకు శత్రువులగు దేవతలు యోజన చేసి శ్రేష్ఠవస్తువులను గొని పోయిరి. మరియు మోసము చేసి అమృతమును త్రాగిరి (14). మరియు విష్ణువు యొక్క సాహాయ్యముతో అమృతమును త్రాగి బలమును పొందిన ఆ దేవతలు రాక్షసులను పరాభవించిరి. విఫ్ణవు యొక్క చమ్రు వారికి సహాయపడెను (15).

శిరశ్ఛేదం చకారాసౌ పిబతశ్చామృతం హరిః | రాహోర్దేవసభాయం హి పక్షపాతీ హరేస్సదా || 16

నిత్యము ఇంద్రుని పక్షమును వహించు విష్ణువు, దేవతల ప్రక్కన చేరి అమృతమును త్రాగుచున్న రాహువు యొక్క శిరస్సును నరికివేసెను (16).

సనత్కుమార ఉవాచ |

ఏవం కవిస్తస్య శిరశ్ఛేదం రాహోశ్శశంస చ | అమృతార్థే సముద్రస్య మంథనం దేవకారితమ్‌ || 17

రత్నో పహరణం చైవ దైత్యానాం చ పరాభవమ్‌ | దేవైరమృతపానం చ కృతం సర్వం చ విస్తరాత్‌ || 18

తదాకర్ణ్య మహావీరో*%ంబుధిబాః ప్రతాపవాన్‌ | చుక్రోధ క్రోధరక్తాక్ష స్స్వపితుర్మంథనం తదా || 19ంబు

అథ దూతం సమాహూయ ఘస్మరాభిధముత్తమమ్‌ | సర్వం శశంస చరితం యదాహ గురురాత్మవాన్‌ || 20

అథ తం ప్రేషయామాస స్వదూతం శక్రసన్నిధౌ | సమ్మాన్న బహుశః ప్రీత్యా%భయం దత్త్వా విశారదమ్‌ || 21

దూతస్త్రి విష్టపం తస్య జగామారమలం సుధీః | ఘస్మరో%ంబుధి బాలస్య సర్వదేవసమన్వితమ్‌ || 22

తత్ర గత్వాస దూతస్తు సుధర్మాం ప్రాప్య సత్వరమ్‌ | గర్వాదఖర్వమౌలిర్హి దేవేంద్రం వాక్యమబ్రవీత్‌ || 23

సనత్కుమారుడిట్లు పలికెను -

శుక్రాచార్యుడు రాహువు యొక్క శిరశ్ఛేదమును గురించి, అమృతము కొరకు దేవతులు సముద్రమును మథించుట గురించి వివరించి చెప్పెను (17). శ్రేష్ఠ వస్తువు లను దేవతలు గొని పోవుట, రాక్షసులు పరాభవమును పొందుట, దేవతలు అమృతపానమును చేయుట అను వృత్తాంతమునంతనూ విస్తరముగా చెప్పెను (18). మహావీరుడు, ప్రతాపవంతుడు అగు జలంధరుడు తన తండ్రి మథింపబడిన వృత్తాంతమును విని కోపించెను. కోపముచు ఆతని కన్నులు ఎరుపెక్కెను (19). స్వాభిమానము గల జలంధరుడు అపుడు ఘస్మరుడనే ఉత్తముడగు దూతను పిలిపించి శుక్రుడు వివరించిన వృత్తాంతమునంతనూ చెప్పెను (20). అప్పుడాతడు బుద్ధశాలియగు ఆ దూతను ప్రీతతో బలుతెరంగుల సన్మానించి అభయమునిచ్చి ఇంద్రుని సన్నిధికి పంపెను (21). జలంధరుని దూత, బుద్ధమంతుడు అగు ఘస్మరుడు దేవతలందరితో విరాజిల్లే స్వర్గమునకు వెళ్లెను (22). ఆ దూత అచటకు వెళ్లి వెంటనే సుధర్మయను దేవసభకు వెళ్లి గర్మముతో తలను పైకెత్తి దేవేంద్రునితో నిట్లు పలికెను (23).

ఘస్మర ఉవాచ |

జలంధరో%బ్ధితనయ స్సర్వదైత్యజనేశ్వరః | సుప్రతాసీ మహావీరస్స్వయం కవిసహాయవాన్‌ || 24

దూతో%హం తస్య వీరస్య ఘస్మరాఖ్యో న ఘస్మరః | ప్రేషితస్తేన వీరేణ త్వస్సకాశమిహాగతః || 25

అవ్యాహతాజ్ఞ స్సర్వత్ర జలంధర ఉదగ్రధీః | నిర్జితాఖిల దైత్యారిస్స యదాహ శృణుష్య తత్‌ || 26

ఘస్మరుడిట్లు పలికెను -

జలంధరుడు రాక్షస జనులందరికీ ప్రభువు. సముద్రుని పుత్రుడు. గొప్ప ప్రతాపశాలి. మహావీరుడు. శుక్రుని ఆలంబనము గలవాడు (24). నేను ఆ వీరుని దూతను. నాపేరు ఘస్మరుడు. కాని నేను కార్యనాశకుడను గాదు. ఆ వీరుడు పంపగా నేను మీవద్దకు వచ్చి యుంటిని (25). జలంధరుని ఆజ్ఞకు ఎక్కడైననూ తిరుగు లేదు. కుశాగ్రబుద్ధి యగు ఆతడు రాక్షస శత్రువుల నందరినీ జయించినాడు. ఆతడు చెప్పిన పందేశమును వినుము (26).

జలంధర ఉవాచ |

కస్మాత్త్వయా మమ పితా మథితస్సాగరో%ద్రిణా | నీతాని సర్వరత్నాని పితుర్మే దేవతాధమ || 27

ఉచితం న కృతం తే%ద్య తాని శీఘ్రం ప్రయచ్ఛ మే | మమాయాహి విచార్యేత్థం శరణం దైవతై స్సహ || 28

అన్యథా తే భయం భూరి భవిష్యతి సురాధమ | రాజ్య విధ్వంసనం చైవ సత్యమేత ద్ర్బవీమ్యహమ్‌ || 29

జలంధరుడిట్లు పలికెను -

ఓ దేవతాధముడా! నీవు నా తండ్రిమగు సముద్రుని పర్మతముతో మథించి నా తండ్రికి చెందిన శ్రేష్ఠవస్తువులనన్నింటినీ గొని పోతివి. ఇట్లు చేయుటకు కారణమేమి? (27). నీవు చేసినది తగని పని. కావున వాటిని వెంటనే నాకు సమర్పించుము. జాత్రగ్తగా ఆలోచించి దేవతలతో సహా నన్ను శరణు జొచ్చుము (28). ఓ దేవాధమా! అట్లు చేయనిచో నీకు గొప్ప భయము కలుగును. రాజ్యము వినాశమగును. నేను సత్యమును పలుకుచున్నాను (29).

సనత్కుమార ఉవాచ |

ఇతి దూతవచశ్శ్రుత్వా విస్మితస్త్రి దశాధిపః | ఉమాచ తం స్మరన్నింద్రో భయరోషసమన్వితః || 30

అద్రయో మద్భయాత్త్రస్తా స్స్వకుక్షిస్థ్సా యతః కృతాః | అన్యే%పి మద్ద్విషస్తేన రక్షితా దితాజాః పురా || 31

తస్మాత్తద్రత్నజాతం తు మయా సర్మం హృతం కిల | న తిష్ఠతి మమ ద్రొహీ సుఖం సత్యం బ్రవీమ్యహమ్‌ || 32

శంఖో%ప్యేవం పురా దైత్యో మా ద్వషన్‌ సాగరాత్మజః | అభవన్మూఢచిత్తస్తు సాధుసంగాత్సము జ్ఘితః || 33

మమానుజేన హరిణా నిహతస్స హి సాసధీః | హిసకస్సాధు సంఘస్య పాపిష్ఠస్సాగరోదరే || 34

తద్గచ్ఛ దూత శీఘ్రం త్వం కథయస్వాస్య తత్త్వతః | అబ్ధిపుత్రస్య సర్వం హి సింధోర్మంథన కారణమ్‌ || 35

ఇత్ధం విసర్జితో దూతో ఘస్మరాఖ్యస్సుబుద్ధిమాన్‌ | తదేంద్రేణా గమత్తూర్ణం యత్ర వీరో జలంధరః || 36

సనత్కుమారుడిట్లు పలికెను -

దూతయొక్క ఈ మాటను వినిన దేవేంద్రుడు ఆశ్చర్యపడెను. ఆయన గతమును స్మరించి భయమును మరియు రోషమును పొంది అతనితో నిట్లనెను (30). నాకు భయపడి పారిపోయిన పర్వతములను సముద్రుడు తన గర్భములో దాచినాడు. మరియు అతడు పూర్వము నా శత్రువులగు ఇతరులను కూడా రక్షించినాడు (31). అందువలననే ఆతని శ్రేష్ఠవస్తువులనన్నింటినీ అపహిరించినాను. నాకు ద్రోహమును చేయు వ్యక్తి సుఖముగా మనజాలడు. నేను సత్యమును పలుకుచున్నాను (32). ఇదే విధముగా పూర్వము సముద్ర పుత్రుడగు శంఖాసురుడు మూర్ఖుడగుటచే సత్పురుషులతోడి మైత్రిని విడనాడి నన్ను ద్వేషించుట మొదలిడెను (33). సముద్రుని పుత్రునిగా జన్మించి సాధుసమాజమును హింసిచిన ఆ మహాపాపిని నా తమ్ముడగు విష్ణువు సంహరించినాడు (34). ఓయీ దూతా! కావున నీవు వెంటనే వెళ్లి ఆ సముద్రపుత్రునకు ఈ సత్యమును తెనుపుము. సముద్రమును మథించుటకు గల కారణమునుసమగ్రముగా వివరించుము (35). ఇంద్రడు ఈ తీరున పలికి పంపివేసెను. అపుడు మహాబుద్ధిశాలి, ఘస్మరుడను పేరు గలవాడునగు ఆ దూత శీఘ్రమే వీరుడగు జలంధరుడు ఉన్న స్థానమునకు వెళ్లెను (36).

తదిదం వచనం దైత్యరాజో హి తేన ధీమతా | కథితో నిఖిలం శక్ర ప్రోక్తం దూతేన వై తదా || 37

తన్నిశమ్య తతో దైత్యో రోషాత్ప్రస్ఫురితాధరః | ఉద్యోగమకరోత్తూర్ణం సర్వదేవ జిగీషయా || 38

తదోద్యోగే %సురేంద్రస్య దిగ్భ్యః పాతాలతస్తథా | దితిజాః ప్రత్యపద్యంత కోటిశః కోటిశస్తథా || 39

అథ శుంభ ని శుంభాద్యైర్బలాధిపతి కొటిభిః | నిర్జగామ మహావారస్సింధుపుత్రః ప్రతాపవాన్‌ || 40

ప్రాప త్రివిష్టపం సద్యస్సర్వసైన్య సమావృతః | దధ్మౌ శంఖం జలధి జో నేదుర్వీరాశ్చ సర్వతః || 41

గత్వా త్రివిష్టపం దైత్యో నందనాధిష్ఠితో%భవత్‌ | సర్వసైన్నం సమావృత్య కుర్వాణస్సింహవద్రవమ్‌ || 42

పురమావృత్య దిష్ఠ త్తద్దృష్ట్వా సైన్యబలం మహాత్‌ | నిర్యయుస్త్వమరావత్యా దేవా యుద్ధాయ దంశితాః || 43

ఆ బుద్ధి మంతుడగు దూత అపుడు ఇంద్రుడు పలికిని వచనములనన్నింటినీ రాక్షరాజునకు నివేదించెను (37). ఆ మాటలను వినిన పిదప కోపముతో వణుకు చున్న క్రింది పెదవిగల ఆ రాక్షసుడు దేవతలనందరినీ జయించవలెనను కోరికతో వెంటనే

సైన్య మును సన్నద్ధము చుసెను (38). రాక్షసేంద్రుని ఆ సైన్యసన్నాహము లోనికి అన్ని దిక్కులనుండియు, మరియు పాతాళములనుండియు రాక్షసులు కోట్ల సంఖ్యలో వచ్చి చేరిరి (39). ప్రతాపశాలి, మహావీరుడు, సముద్రపుత్రుడునగు జలంధరుడు అపుడు శుంభ నిశుంభాదిరాక్షసులతో, కోట్లాది సైన్యముతో, సేనానాయకులతో గూడి బయలుదేరెను (40). ఆ సముద్రపుత్రుడు సైన్యములన్నింటితో గూడి శీఘ్రమే స్వర్గమునుచురి శంఖము నూదగా, వీరులు అంతటా సింహనాదములను చుసిరి (41). ఆ రాక్షసుడు స్వర్గమును చేరి నందనవనములో విడిది చేసి మహాసైన్యముతో చుట్టు వారబడి యున్నవాడై సింహనాదమును చుసెను (42). అమరావతీనగరమును ముట్టడించిన ఆ మహాసైన్యమును గాంచిన దేవతలు కవచములను ధరించి యుద్ధము కొరకై నగరమునుండి బయలుదేరిరి (43).

తతస్సమభవద్యుద్ధం దేవదానవసేనయోః | ముసలైః మరిఘైర్బాణౖర్గదాపరశుశక్తిభిః || 44

తే%న్యోన్యం సమధావేతాం జఘ్నతుశ్చ పరస్పరమ్‌ | క్షణనాభవతాం సేనే రుధిరౌఘపరిప్లుతే || 45

పతితైః పాత్యమానైశ్చ గజాశ్వరథ పత్తిభిః | వ్యరాజత రణ భూమి స్సంధ్యాభ్రపటలైరివ || 46

తత్ర యుద్ధే మృతాన్‌ దైత్యాన్‌ భార్గవస్తానజీవయత్‌ | విద్యయా మృత జీవిన్యా మంత్రితైస్తోయబిందుభిః || 47

దేవానపి తథా యుద్ధే తత్రాజీవయదంగిరాః | దివ్యౌషధైస్సమానీయ ద్రోణాద్రేస్స పునః పునః || 48

దృష్టవాన్‌ స తథా ముద్ధే పునరేవ సముత్థితాన్‌| జలంధరః క్రోధవశో భార్గవం వాక్యమబ్రవీత్‌ || 49

అపుడు దేవసైన్యము, రాక్షస సైన్యముల మధ్య జరిగెను. దానిలో వారు రోకళ్లను, పరిఘలను, బాణములను, గదలను, గొడ్డళ్లను, శక్తి ఆయుధములను వాడిరి (44). ఆ రెండు సైన్యములు ఒక దానిపై నొకటి దండయాత్ర చేసినవి. సైనికులు ఒకరినొకరు సంహరింప మొదలిడిరి. క్షణములో ఆ రెండు సేనలలో రక్షము ప్రవహింపజొచ్చెను (45). నేలగూలినట్టియు, మరియు నేల గూలుచున్న ఏనుగులతో, గుర్రములతో, రథములతో మరియు సైనికులతో ఆ యుద్ధభూమి మేఘపు తునకలతో గూడిన సంధ్యాకాలపు టాకాశము వలె ప్రకాశించెను (46). శుక్రుడు మృతసంజీవినీ మంత్రమును పఠించి, ఆ మంత్రించిన జలములను చల్లి అచట యుద్ధములో మరణించిన రాక్షసులను మరల బ్రతికించెడివాడు (47). అదే విధముగా అంగిరసుడు ద్రోణపర్వతమునుండి అనేకపర్యాయములు దివ్యమగు ఓషధులను తెచ్చి యుద్ధమునందు అసువులను బాసిన దేవతలను జీవింపజేసెడివాడు (48). యుద్ధములో మరణించియు మరల బ్రతికి వచ్చిన దేవతలను గాంచి జలంధరుడు మిక్కిలి కోపించి శుక్రాచార్యునితో నిట్లనెను (49).

జలంధర ఉవాచ |

మయా దేవా హతా యుద్ధే ఉత్తిష్ఠంతి కథం పునః | తతస్సంజీవినీ విద్యా నైవాన్యత్రేతి వై శ్రుతా || 50

జలంధరుడిట్లు పలికెను -

నా చేతిలో మరణించిన దేవతలు యుద్ధరంగములో మరల జీవించుట ఎట్లు సంభవమగుచున్నది? సంజీవినీ విద్య మరియొకని వద్ద లేదని నేను విని యుంటిని (50).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య సింధుపుత్రస్య భార్గవః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా గురశ్శుక్రో జలంధరమ్‌ || 51

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆ సముద్రతనయుని వాక్యమును విని గురువగు శుక్రాచార్యుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై జలంధరునకిట్లు బదులిడెను (51).

శుక్ర ఉవాచ |

దివ్యౌషధీస్సమానీయ ద్రోణాద్రేరంగిరాస్సురాన్‌ | జీవయత్యేష వై తాత సత్యం జానీహి యే వచః || 52

జయమిచ్ఛసి చేత్తాత శృణు మే వచనం శుభమ్‌ | తతస్సో%రం భుజాభ్యాం త్వం ద్రోణమబ్ధావుపాహర || 53

శుక్రుడిట్లు పలికెను -

వత్సా! అంగిరసుడు ద్రోణపర్వతమునుండి దివ్యమగు ఓషధులను తెచ్చి దేవతలను బ్రతికించుచున్నాడు. నా ఈ వచనము సత్యమని యెరుంగుము (52). వత్సా! నీవు జయమును గోరువాడవైనచో, నేను చెప్పే శుభవచనమును వినుము. నీవు శీఘ్రమే నీ బుజములతో ఆ ద్రోణ పర్వతమును సముద్రములోనికి త్రోసి వేయుము (53).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తస్స దైత్యేంద్రో గురుణా భార్గవేణ హ | ద్రుతం జగామ యత్రాసావాస్తే చైవాద్రిరాట్‌ చ సః || 54

భుజాభ్యాం తరసా దైత్యో నీత్వా త్రోణం చ తం తదా | ప్రాక్షిపత్సాగరే తూర్ణం చిత్రం న హరతేజసి || 55

పునరాయాన్మహా వీరస్సింధుపుత్రో మహాహవమ్‌ | జఘానా సై#్త్రశ్చ వివిధైస్సురాన్‌ కృత్వా బలం మహత్‌ || 56

అథ దేవాన్‌ హతాన్‌ దృష్ట్వా ద్రోణాద్రిమగమద్గురుః | తావత్తత్ర గిరీంద్రం తం న దదర్శ సురార్చితః || 57

జ్ఞాత్వా దైత్యహృతం ద్రోనం ధిషణో భయవిహ్వలః | ఆగత్య దేవాన్‌ ప్రోవాచ జీవో వ్యాకుల మానసః || 58

సనత్కుమారుడిట్లు పలికెను -

గురువగు భార్గవుడిట్లు చెప్పగా, ఆ రాక్షసరాజు వెను వెంటనే ఆ గొప్ప పర్వతము ఉన్న స్థలమునకు వచ్చెను (54). ఆ రాక్షసుడు తన భుజములతో ఆ పర్వతమునువేగముగా లాగుకొనిపోయి వెంటనే సముద్రములో పారవైచెను. శివుని తేజస్సునుండి పుట్టిన వ్యక్తి ఇట్టి పనిని చేయుట ఆశ్చర్యము కాదు (55). మహావీరుడగు ఆ జలంధరుడు వెనుకకు మరలివచ్చి ఆ మహాసంగ్రామములో తన గొప్ప బలమును ప్రదర్శించు వాడై దేవతలను వివిధములగు అస్త్రములతో సంహరింపజొచ్చెను (56). ఇట్లు దేవతలు సంహరింపబడుటను గాంచి, దేవతలచే పూజింపబడు వాడు, గురువునగు అంగిరసుడు ద్రోణ పర్వతము వద్దకు చనెను. కాని ఆతనికి అచట ఆ పర్వతము కానరాలేదు (57). ద్రోణపర్వతము రాక్షసులచే అపహరింపబడినదని తెలియగానే బుద్ధిశాలియగు బృహస్పతి భయముతో నిండిన మనస్సు గల వాడై వచ్చి దేవతలతో నిట్లనెను (58).

గురురువాచ |

పలాయధ్వం సురాస్సర్వే ద్రోణో నాస్తి గిరిర్మహాన్‌ | ధ్రువం ధ్వస్తశ్చ దైత్యేన పాథోధితనయేన హి || 59

జలంధరో మహాదైత్యో నాయం జేతుం క్షమో యంతః | రుద్రాంశసంభవో హ్యేష సర్వామర విమర్దనః || 60

మయా జ్ఞాతః ప్రభావోస్య మథోత్పన్న స్స్వయం సురాః | శివాపమాన కృచ్ఛక్రచుష్టితం స్మరాతాఖిలమ్‌ || 61

గురువు ఇట్లు పలికెను -

దేవతలారా! మీరందరు పారిపొండు. గొప్ప ద్రోణపర్వతము ఇప్పుడు లేదు. సముద్రపుత్రుడగు ఆ రాక్షసుడు దానిని నిశ్చితముగా నాశనము చేసి యుండును (59). జలంధరుడు మహారాక్షసుడు, రుద్రుని అంశ##చే జన్మించిన వాడు, మరియు శత్రువులనందనరినీ జయించినవాడు. ఈతనిపై విజయమును పొందుట శక్యము కాదు (60) ఓ దేవతలారా! ఈతడు జన్మించిన విధానము, ఈతని ప్రభావము నాకు తెలిసినవి. శివుని అవమాని ఇంద్రుడు చేసిన చేష్టను అంతనూ గుర్తుకు తెచ్చుకొనుడు (61).

సనత్కుమార ఉవాచ |

శ్రుత్వా తద్వచనం దేవాస్సురాచార్య ప్రకీర్తితమ్‌ | జయాశాం త్యక్త వంతస్తే భయవిహ్వలితాస్తథా || 62

దైత్యరాజేన తేనాతి హన్యమానాస్సమంతతః | ధైర్యం త్యక్త్వా పలాయంత దిశో దశ సవాసవాః || 63

దేవాన్‌ విద్రావితాన్‌ దృష్ట్వా దైత్య స్సాగరనందనః | శంఖభేరీ జయరవైః ప్రవివేశామరావతీమ్‌ || 64

ప్రవిష్టే నగరీం దైత్యే దేవాశ్శక్రపురోగమాః | సువర్ణాద్రిగుహాం ప్రాప్తా న్నవసన్‌ దైద్యతాపితాః || 65

తదైవ సర్వేష్వసురో%ధికారేష్వంద్రాదికానాం వినివేశ్య సమ్యక్‌ |

శుంభాదికాన్‌ దైత్యవరాన్‌ పృథక్‌ పృథక్‌ స్వయం సువర్ణాద్రిగుహాం వ్యగాన్మునే || 66

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయం యుద్ధఖండే దేవ జలంధర యుద్ధవర్ణనం నామ పంచదశో%ధ్యాయః (15).

సనత్కుమారుడిట్లు పలికెను-

దేవగురువుయొక్క ఆ మాటలను వినిన దేవతలు జలమునందలి ఆశను వీడి భయముతో కంగారు పడ జొచ్చిరి (62). ఆ రాక్షసవీరుడు దేవతలను నలువైపులనుండియూ సంహరించ మొదలిడెను. ఇంద్రుడు మొదలగు దేవతలు అపుడు ధైర్యమును గోల్పోయి పది దిక్కులకు పారిపోయిరి (63). సముద్రనందనుడగు ఆ రాక్షసుడు దేదతల పలాయనమును గాంచి, శంఖధ్వనులతో భేరీధ్వనులతో జయరావములతో అమరావతిలోనికి ప్రవేశించెను (64). ఇట్లు ఆ రాక్షసడు అమరావతిని ప్రవేశంశించగా, ఇంద్రాది దేవతలు ఆ రాక్షసుని బాధలకు తాళ##లేక మేరుపర్వత గుహను చేరి తలదాచుకొనిరి (65). ఓ మహర్షీ! అపుడా రాక్షసుడు ఇంద్రాది దేవతల అధికారములన్నింటియందు శుంభుడు మొదలగు రాక్షస శ్రేష్ఠులను వేర్వేరుగా చక్కగా నియమించి తాను స్వయంముగా మేరుపర్వతగుహ వద్దకు వెళ్లెను (66).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధఖండలో దేవజలంధర యుద్ధ వర్ణన మనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).

Sri Sivamahapuranamu-II    Chapters