Sri Sivamahapuranamu-II    Chapters   

అథ దశమో%ధ్యాయః

తారకాసుర వధ

బ్రహ్మోవాచ |

నివార్య వీరభద్రం తం కుమారః పరవీరహా | సమైచ్ఛత్తారకవధం స్మృత్వా శివపదాంబుజౌ || 1

జగర్జాథ మహాతేజాః కార్తికేయో మహాబలః | సన్నధ్ధస్సో%భవత్క్రుద్ధసై#్సన్యేన మహతా వృతః || 2

తదా జయ జయోత్యుక్తం సర్వైర్దేవైర్గణౖస్తథా | సంస్తుతో వాగ్భి రిష్టాభిస్తదైవ చ సురర్షిభిః || 3

తారకస్య కుమారస్య సంగ్రమో%తీవ దుస్సహః | జాతస్తదా మహాఘోరస్సర్వభూత భయంకరః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

శత్రు సంహారకుడగు కుమారస్వామి ఆ వీరభద్రుని ఆపి, శివుని పాదపద్మములను తారకుని వధించుటకు సంకల్పించెను (1). అపుడు మహాతేజస్వి, మహాబలశాలి యగు కార్తికేయుడు గర్జించి, పెద్ద సైన్యముతో కూడిన వాడై కోపముతో యుద్దమునకు సన్నధ్ధుడాయెను (2). అపుడు దేవతలు, గణములు జయజయ ధ్వానములను చేసిరి. దేవర్షులు తమకు సమ్మతమైన వాక్కులతో అదే సమయములో స్తోత్రమును పలికిరి (3). అపుడు తారక కుమారులకు మిక్కిలి సహింప శక్యము కానిది, సర్వప్రాణులకు పెద్ద భయమును కలిగించునది అగు మహాయుద్ధము జరిగెను (4).

శక్తిహస్తౌ చ తౌ వీరౌ యుయుధాతే పరస్పరమ్‌ | పర్వేషాం పశ్యతాం తత్ర మహాశ్చర్యవతాం మునే || 5

శక్తినిర్భిన్నదేహౌ తౌ మహాసాధనసంయుతౌ | పరస్పరం వంచయంతౌ సింహావివ మహాబలౌ || 6

వైతాలికం సమాశ్రిత్య తథా ఖేచరకం మతమ్‌ | పాపంతం సమాశ్రిత్య శక్త్యా శక్తిం విజఘ్నతుః || 7

ఏభిర్మంద్రైర్మహావీరౌ చక్రతుర్యుద్ధమద్భుతమ్‌ | అన్యోన్యం పాధకౌ భూత్వా మహాబల పరాక్రమౌ || 8

ఓ మునీ! అందరు మహాశ్చర్యముతో చూచుచుండగా ఆ ఇద్దరు వీరులు శక్తులను చేతబట్టి ఒకరితో నొకరు యుధ్ధమును చేసిరి (5). వారిద్దరి దేహములకు శక్తి ప్రహారములచే గాయములయ్యెను. మహాబలురగు వారు గొప్ప సాధనములు గలవారై ఒకరిపై నొకరు సింహములవలె లంఘించిరి (6). వైతాలిక, ఖేచర, పాపంత ఇత్యాది యుద్ధగతులను చేపట్టి శక్తితో శక్తిని కొట్టుచూ వారు యుద్ధమును చేసిరి (7). మహాబలపరా క్రమవంతులు, మహావీరులనగు వారిద్దరు ఈ యుక్తులతో పరస్పరము కొట్టుకొనుచూ అద్భుతమగు యుద్ధమును చేసిరి (8).

మహాబలం ప్రకుర్వంతౌ పరస్పరవధైషిణౌ | జఘ్నతుశ్శక్తిధారాభీ రణ రణవిశారదౌ || 9

మూర్ద్ని కంఠే తథా చోర్వోర్జాన్వోశ్చైవ కటీతటే | వక్షస్యురసి పృష్ఠే చ చిచ్ఛిదుశ్చ పరస్పరమ్‌ || 10

తదా తౌ యుధ్ధ్యమానౌ చ హంతుకామౌ మహాబలౌ | వల్గంతౌ వీరశ##బ్దైశ్చ నానాయుద్ధ విశారదౌ || 11

అభవన్‌ ప్రేక్షకాస్సర్వే దేవా గంధర్వకిన్నరాః | ఊచుః పరస్పరం తత్ర కో%స్మిన్‌ యుద్ధే విజేష్యతే || 12

యుధ్ధపండితులగు వారిద్దరు ఒకరినొకరు వధించగోరి మహాబలమును ప్రదర్శిస్తూ యుద్ధములో శక్తిధారలతో కొట్టుకొనిరి (9). ఒకరినొకరు శిరస్సుపై, కంఠమునందు, తొడలయందు, మోకాళ్లపై, నడుముపై, వక్షస్థ్సలముపై, వెనుక భాగమునందు ఛేదించుకొనిరి(10). అనేకరకముల యుద్ధములలో దక్షులగు వారిద్దరు మహాబలము గలవారై ఒకరొనొకరు సింహరించగోరి యుద్ధము చేయుచూ బిగ్గరగా సంహనాదములను చేసిరి (11). దేవతలు, గంధర్వులు, కిన్నరులు అందరు ప్రేక్షకులైరి. ఈ యుద్ధములో విజేతలెవరు? అని వారిలో వారు చర్చించు కొనిరి (12).

తదా నభోగతా వాణీ జగౌ దేవాంశ్చ సాంత్వయన్‌ | అసురం తారకం చాత్ర కుమారో%యం హనిష్యతి || 13

మా శోచ్యతాం సురైస్సర్వైస్సుఖేన స్థీయతామితి | యుష్మదర్థం శంకరో హి పుత్రరూపేణ సంస్థితః || 14

శ్రుత్వా తదా తాం గగనే సమీరితాం వాచం శుభాం సప్రమథైస్సమావృతః |

నిహంతు కామస్సుఖితః కుమారకో దైత్యాధిపం తారకమాశ్వభూత్తదా || 15

అపుడు ఆకాశవాణి దేవతలనోదార్చుచూ నిట్లనెను: తారకాసురుని ఈ యుద్ధములో ఈ కుమారుడు సంహరించగలడు (13). దేవతలందరు దుఃఖించుట మాని సుఖముగా నుందురు గాక! మీకొరకై శంకరుడు పుత్రరూపమును దాల్చి యున్నాడు (14). అపుడా ఆకాశవాణి చెప్పిన శుభవచనములను విని కుమారుడు ఆనందించెను. అతడు ప్రమథ గణములచే చుట్టు వారబడి యుండెను. అపుడు కమారుడు వెంటనే రాక్షసరాజగు తారకుని సంహరించుటకు నిర్ణయించెను (15).

శక్త్యా తయా మహా బాహురాజఘాన స్తనాంతరే | కుమారస్స్మ రుషావిష్ట స్తారకాసురమమోజసా || 16

తం ప్రహారమనాదృత్య తారకో దైత్యపుంగవః | కుమారం చాపి సంక్రుద్ధ స్స్వశక్త్యా సంజఘాన సః || 17

తేన శక్తి ప్రహారేణ శాంకరిర్మూర్ఛితో%భవత్‌ | ముహూర్తాచ్చేతనాం ప్రాప్త స్తూయమానో మహర్షిభిః || 18

యథా సింహో మదోన్మత్తో హంతుకామస్తథాసురమ్‌ | కుమారస్తారకం శక్త్యా స జఘాన ప్రతాపవాన్‌ || 19

మహాబాహుడగు కుమారుడు మిక్కిలి కోపించి ఆ శక్తితో తారకాసురుని వక్షస్థ్సలము నందు బలముగా కొట్టెను (16). రాక్షసశ్రేష్ఠుడగు ఆ తారకుడు కూడా ఆ దెబ్బను లెక్కజేయక, మిక్కిలి కోపించి తన శక్తితో కుమారుని కొట్టెను (17). ఆ శక్తియెక్క ప్రహారమునకు శంకరపుత్రుడు మూర్ఛిల్లెను. కాని ఆయన మహర్షులు స్తుతించుచుండగా క్షణములో తెలివిని పొందెను (18). మదించిన సింహము వలె ప్రతాపశాలియై ఉన్న కుమారుడు తారకాసురుని సంహరించగోరి తారకుని శక్తితో కొట్టెను (19).

ఏవం పరస్పరం తౌ హి కుమారశ్చాపి తారకః | యుయుధాతే%తి సంరబ్ధౌ శక్తియుద్ధ విశారదౌ || 20

అభ్యాసపరమావాస్తామన్యోన్య విజిగీషయా | పదాతినౌ యుధ్యమానౌ చిత్రరూపౌ తరస్వినౌ || 21

వివిధైర్ఘాతపుంజైస్తావన్యోన్యం వినిజఘ్నతుః | నానామార్గాన్‌ ప్రకుర్వంతౌ గర్జంతౌ సుపరాక్రమౌ|| 22

అవలోకపరాస్సర్వే దేవగంధర్వకిన్నరాః | విస్మయం పరమం జగ్ముర్నోచుః కించన తత్ర తే || 23

ఈ విధముగా శక్తి యుధ్దములో నిష్ణాతులగు కుమారతారకులు ఒకరితోనొకరు మిక్కిలి వేగముగా యుద్ధమును చేసిరి (20). వారిద్దరు యుద్దమును బాగుగా అభ్యాసము చేసినవారే. ఒకరినొకరు జయించగోరి చిత్రగతులతోవేగముగా పదాతులై యుద్ధమును చేసిరి (21). అనేక యుద్ధరీతులను పాటించువారై పరాక్రమవంతులగు వారిద్దరు గర్జిస్తూ ఒకరిపై నొకరు వివిధ రకముల దెబ్బలను వేసిరి (22). దేవ గంధర్వ కిన్నరులందరు యుద్ధమును చూస్తూ గొప్ప విస్మయమును పొంది ఆ సమయములో ఏమియూ మాటలాడకుండిరి (23).

న వవౌ పవమానశ్చ నిష్ప్రభో%భూద్ది వాకరః | చచాల వసుధా సర్వా సశైలవనకాననా|| 24

ఏతస్మిన్నంతరే తత్ర హిమాలయముఖా ధరాః | స్నేహార్దితాస్తదా జగ్ముః కుమారం చ పరీప్సవః || 25

తతస్స దృష్ట్వా తాన్‌ సర్వాన్‌ భయభీతాంశ్చ శాంకరిః | పర్వతాన్‌ గిరిజాపుత్రో బభాషే పరిబోధయన్‌ || 26

వాయువు వీచలేదు. సూర్యుడు వెలవెల బోయెను. పర్వతములతో, అడవులతో సహా భూమి అంతయూ కంపించెను (24). ఇంతలో హిమవంతుడు మొదలుగా గల పర్వతములు కుమారుని వియోగముచే పీడితులై కుమారుని చూడగోరి అచటకు అప్పుడు విచ్చేసిరి (25). అపుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడగు ఆ కుమారుడు భయభీతులై ఉన్న వారినందరినీ గాంచి, పర్వతములను కూడ చూచి వారిని ఓదార్చుచూ నిట్లనెను (26).

కుమార ఉవాచ |

మా ఖిద్యతాం మహాభాగా మా చింతాం కుర్వతాం నగాః | ఘాతయామ్యద్య పాపిష్ఠం సర్వేషాం వః ప్రపశ్యతామ్‌ || 27

ఏవం సమాశ్వాస్య తదా పర్వతాన్నిర్జరాన్‌ గణాన్‌ | ప్రణమ్య గిరిజాం శంభు మాదదే శక్తిముత్ప్రభామ్‌ || 28

తం తారకం హంతుమనాః కరశక్తిర్మహాప్రభుః | విరరాజ మహావీరః కుమారశ్వంభు బాలకః ||29

శక్త్యాతయా జఘానాథ కుమారస్తాకాసురమ్‌ | తేజసాఢ్యశ్శంకరస్య లోకక్లేశకరం చ తమ్‌ ||30

కుమారుడిట్లు పలికెను -

మహాత్మురాలగు పార్వతి దుఃఖించకుండు గాక! చింతిల్లకుడు. మీరందరు చూచుచుండగా ఇపుడీ పాపాత్ముని సంహరించెదను (27). అతడీ తీరున పర్వతులను, దేవతలను, గణములను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లి అపుడు గొప్ప కాంతులు గల శక్తిని తీసుకొనెను (28). శంభుపుత్రుడు, మహావీరుడు, మహాప్రభుడునగు కుమారుడు తారకుని చంపుటకై శక్తిని చేత బట్టి మిక్కిలి ప్రకాశించెను (29). శంకరుని తేజజస్సు నిండియున్న కుమారుడు అపుడు లోకకంటకుడగు తారకాసురుని ఆ శక్తితో కొట్టెను(30).

పపాత సద్య స్సహసా విశీర్ణాంగో%సురః క్షితౌ | తారకాఖ్యో మహావీరస్సర్వాసురగణాధిపః || 31

కుమారేణ హతస్సో%తి వీరస్స ఖలు తారకః | లయం య¸° చ తత్రైవ సర్వేషాం పశ్యతాం మునే || 32

తథా తం పతితం దృష్ట్వా తారకం బలవత్తరమ్‌ | న జఘాన పునర్వీరస్స గత్వా వ్యసుమాహవే || 33

హతే తస్మిన్‌ మహాదైత్యే తారకాఖ్యే మహామతే | క్షయం ప్రణీతా బహవో%సురా దేవగణౖస్తదా || 34

మహావీరుడు, రాక్షసగణములన్నింటికి ప్రభువు అగు తారకాసురుడు శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే నేలగూలెను (31). ఓ మునీ! అందరు చూచుచుండగా కుమారునిచే కొట్టబడిన మహావీరుడగు ఆ తారకుడు అచటనే మరణించెను (32). యుద్ధములో ప్రాణములను వీడి నేలగూలిన బలశాలియగు తారకుని వీరుడగు ఆకుమారుడు చూచి మరల కొట్టలేదు (33). మహారాక్షసుడు, మహాబలశాలి యగు ఆ తారకాసురుడు సంహరింపబడగానే, అనేక రాక్షసులు దేవతలచే మరియు గణములచే సంహరింపబడిరి (34).

కేచిద్భీతాః ప్రాంజలయో బభూవుస్తత్ర చాహవే | ఛిన్న ఛిన్నాంగకాః కేచిన్మృతా దైత్యాస్సహస్రశః || 35

కేచిజ్ఞాతాః కుమారస్య శరణం శరణార్థినః | వదంతః పాహి పాహీతి దైత్యాస్సాంజలయస్తదా || 36

కియంతశ్చ హతాస్తత్ర కియంతశ్చ పలాయితాః | పలాయమానా వ్యథితాస్తాడితా నిర్జరైర్గణౖః || 37

సహస్రశః ప్రవిష్టాస్తే పాతాలే చ జిజీషవః | పలాయమానాస్తే సర్వే భగ్నాశా దైన్యమాగతాః || 38

ఆ యుధ్ధములో కొందరు రాక్షసులు భయముతో చేతులు జోడించిరి. వేలాది రాక్షసులు తెగిన అవయవములు గలవారై మరణించిరి(35). కొందరు రాక్షసులు అపుడు చేతులు జోడించి 'రక్షించుము, రక్షించుము' అని పలుకుచూ దిక్కుతోచక కుమారుని శరణు గోరిరి (36). కొందరు అచటనే సంహరింపబడగా, మరికొందరు పారిపోయిరి. పారిపోవు వారిని దేవతలు, గణములు తన్ని పీడించిరి (37). ఆశలు భగ్నము కాగా, దైన్యమును పొందియున్న ఆ రాక్షసులు వేలాది మంది బ్రతుకు తీపితో పారిపోయి పాతాళములో ప్రవేశించిరి (38).

ఏవం సర్వం దైత్యసైన్యం భ్రష్టం జాతం మునీశ్వర | న కేచిత్తత్ర సంతస్థు ర్గణదేవ భయాత్తదా || 39

ఆసీన్నిష్కంటకం సర్వం హతే తస్మిన్‌ దురాత్మని | తే దేవాస్సుఖమాపన్నాస్సర్వే శక్రాదయస్తదా || 40

ఏవం విజయమాపన్నం కుమారం నిఖిలాస్సురాః | బభూవుర్యుగపద్ధృష్టా స్త్రిలోకాశ్చ మహాసుఖాః || 41

తదా శివో%పి తం జ్ఞాత్వా విజయం కార్తికస్య చ | తత్రాజగామ స ముదా సగణః ప్రియయా సహ || 42

ఓ మహర్షీ! ఈ విధముగా రాక్షససైన్యమంతయూ చెల్లాచెదరయ్యెను. గణములకు, దేవతకు భయపడి అపుడచట ఒక్కరైననూ నిలబడలేదు (39). ఆ దుర్మార్గుడు సంహరింపబడగానే అంతయూ నిష్కంటకమాయెను. ఇంద్రాది దేవతలందరు అపుడు సుఖించిరి(40). ఈ విదముగా కుమారుడు విజయమును పొందెను. సమస్త దేవతలు, మరియు ముల్లోకములు ఏకకాలములో మహానందమును పొందెను (41). అపుడు శివుడు కూడా కార్తికుని ఆ విజయమునెరింగి గణములతో కూడి ప్రియురాలితో సహ ఆనందముతో అచటకు వచ్చెను (42).

స్వాత్మజం స్వాంకమారోప్య కుమారం సూర్యవర్చసమ్‌ | లాలయామాస సుప్రీత్యా శివా చ స్నేహ సంకులా || 43

హిమాలయస్తదా గత్య స్వపుత్రైః పరివారితః | సబంధు స్సానుగ శ్శంభుం తుష్టావ చ శివాం గుహమ్‌ || 44

తతో దేవగణాస్సర్వే మునయస్సిద్ధ చారణా ః | తుష్టువు శ్శాంకరిం శంభుం గిరిజాం తుషితాం భృశమ్‌ || 45

పుష్ప వృష్టిం సుమహతీం చక్రుశ్చోపసురాస్తదా | జగుర్గంధర్వ పతయో ననృతుశ్చాప్సరో గణాః || 46

పార్వతి ప్రేమతో నిండిన హృదయము గలదై సూర్యునితో సమమగు తేజజస్సు గల తన పుత్రుడగు కుమారుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మిక్కిలి ప్రీతితో లాలించెను (43). అపుడు హిమవంతుడు తన పుత్రులతో, బంధువులతో, అనుచరులతో కూడి వచ్చి శంభుని, పార్వతిని, గుహుని స్తుతించెను (44). అపుడు దేవతలు, గణములు, మునులు, సిద్ధులు, చారణులు అందరు మిక్కిలి సంతోషముతో నున్న గిరిజను, శంకరపుత్రుని, శంభుని స్తుతించిరి (45). అపుడు ఉపదేవతలు గొప్ప పుష్ప వృష్టిని కురిపించిరి. గంధర్వరాజులు పాడిరి. అప్సరసల గణములు నాట్యమాడిరి (46).

వాదిత్రాణి తథా నేదుస్తదానీం చ విశేషతః | జయశబ్దో నమశ్శబ్దో బభూవోచ్చైర్ముహుర్ముహుః || 47

తతో మయాచ్యుతశ్చాపి సంతుష్టో%భూద్విశేషతః | శివం శివాం కుమారం చ సంతుష్టావ

సమాదరాత్‌ ||48

కుమారమగ్రతః కృత్వా హరికేంద్రముఖాస్సురాః | చక్రుర్నీరాజనం ప్రీత్యా మునయశ్చాపరే తథా || 49

గీతవాదిత్ర ఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా | తదోత్సవో మహానాసీ త్కీర్తనం చ విశేషతః || 50

అపుడు వాద్యములు అధికముగా మ్రోగినవి. అనేక పర్యాయములు జయధ్వానములు, నమశ్శబ్దములు బిగ్గరగా బయల్వెడలినవి (47). అపుడు నేను, మరియు విష్ణువు మిక్కిలి సంతసించి పార్వతీ పరమేశ్వరులను ఆదరముతో స్తుతించితిమి (48). బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు, మహర్షలు మరియు ఇతరులు కుమారుని ఎదుట నుంచుకొని ప్రీతితో వారికి నీరాజనము నిచ్చిరి (49). అపుడు గీతములు, వాద్యములు, వేదపఠనము మొదలగు వాటి శబ్దము అధికముగా నుండెను. గొప్ప ఉత్సవము జరిగెను. భగవానుని మహిమలను కీర్తించిరి (50).

గీతవాద్యైస్సుప్రసన్నైస్తథా సాంజలిభిర్మునే | స్తూయమానో జగన్నాథస్సర్వైర్దేవగణౖరభూత్‌ || 51

తతస్స భగవాన్రుద్రో భవాన్యా జగదంబయా | సర్వై స్త్సుతో జగామాథ స్వగిరిం స్వగణౖర్వృతః || 52

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమారఖండే తారకాసురవధో నామ దశమో%ధ్యాయః(10).

మిక్కిలి ప్రసన్నులైన దేవతలు, గణములు అందరు చేతులు జోడించి గీత వాద్యములతో జగన్నాథుడగు శివుని స్తుతించిరి. ఓ మునీ! (51) అపుడా భగవానుడు రుద్రుడు జగన్మాతయగు భవానితో కూడి అందరిచే స్తుతింపబడుచూ తన గణములతో కూడిన వాడైకైలాసమునకు వెళ్లెను (52).

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సాంహితయందు కుమార ఖండలో తారకాసురవధ అను పదవ అధ్యాయము ముగిసినది (10).

Sri Sivamahapuranamu-II    Chapters