Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

కార్తికేయుని కొరకై అన్వేషణ

నారద ఉవాచ |

దేవ దేవ ప్రజానాథ తతః కిమభవద్విధే | వదేదానీం కృపాతస్తు శివలీలా సమన్వితమ్‌ || 1

నారదుడిట్లు పలికెను -

ఓ దేవ దేవా! ప్రజాపతీ! విధీ! తరువాత ఏమాయెను? శివలీలలతో కూడిన వృత్తాంతమును దయతో ఇపుడు చెప్పుము (1).

బ్రహ్మోవాచ |

కృత్తికాభిర్గృహీతేవై తప్మిన్‌ శంభుసుతే మునే | కశ్చిత్కాలో వ్యతీయాయ బుభోధ న హిమాద్రిజా || 2

తస్మి న్నవసరే దుర్గా స్మేరానన సరోరుహా | ఉవాచ స్వామినం శంభుం దేవ దేవేశ్వరం ప్రభుమ్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! కృత్తికలు ఆ శివసుతుని తీసుకు వెళ్లిన తరువాత కొంత కాలము గడిచెను. కాని పార్వతికి ఏమియూ తెలియకుండెను (2). ఆ సమయములో చిరునవ్వుతో ప్రకాశించే ముఖపద్మము గల దుర్గ దేవదేవుడు, సర్వేశ్వరుడు అగు శంభు స్వామితో నిట్లనెను (3).

పార్వత్యువాచ |

దేవ దేవ మహాదేవ శృణు మయే వచనం శుభమ్‌ | పూర్వపుణ్యాతిభారేణ త్వం మయా ప్రాప్త ఈశ్వర || 4

కృపయా యోగిషు శ్రేఎ్ఠోవిహారైస్తత్పరో%భవః | రతిభంగః కృతో దేవై స్తత్రమే భవతా భవ || 5

భూమౌ నిపతితం వీర్యం నోదరే మమ తే విభో | కుత్ర యాతం చ తద్దేవ కేన దేవేన నాహ్నుతమ్‌ || 6

కథం మత్స్వామానో వీర్యమమోఘం తే మహేశ్వర | మోఘం యాతం చ కిం కిం వా శిశుర్జాతశ్చ కుత్రచిత్‌ || 7

పార్వతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ ఈశ్వరా! అతిశయించిన పూర్వపుణ్యవిశేషముచే నీవు నాకు లభించినావు (4). యోగి శ్రేష్టుడవగు నీవు దయతో నాతో గలిసి విహారము నందు నిమగ్నమై యుండగా దేవతలు మన విహారమునకు భంగము కలిగించిరి. ఓ శివా! (5) విభో! నీ తేజస్సు నాలో ప్రవేశించలేదు. ఓ దేవా! ఆ తేజస్సు ఏమైనది? ఏ దేవత దానిని దాచినాడు? (6) మహేశ్వరా! అమోఘమగు నా స్వామి యొక్క తేజస్సు వ్యర్థమైనది. ఆ తేజస్సు శిశురూపమును దాల్చినదా?, అయినచో ఆ శిశువు ఎక్కడ? (7)

బ్రహ్మోవాచ |

పార్వతీవచనం శ్రుత్వా ప్రహస్య జగదీశ్వరః | ఉవాచ దేవానాహూయ మునీంశ్చాపి మునీశ్వర || 8

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీశ్వరా! ఆ జగదీశ్వరుడు పార్వతి యొక్క మాటలను విని నవ్వి దేవతలను మరియు మునులను ఆహ్వానించి ఇట్లు పలికెను (8).

మహేశ్వర ఉవాచ |

దేవాశ్శృణుత మద్వాక్యం పార్వతీవచనం శ్రుతమ్‌ | అమోఘం కుత్ర మే వీర్యం యాతం కేన చ నిహ్నుతమ్‌ || 9

సభయం నావదత్‌ క్షిప్రం స చేద్దండం న చార్హతి | శక్తౌ రాజా న శాస్త్రా యః ప్రజా బాధ్యశ్చ భక్షకః || 10

శంభోస్తద్వచనం శ్రుత్వా సమాలోచ్య పరస్పరమ్‌ | ఊచుస్పర్వే క్రమేణౖవ త్రస్తాస్తు పురతః ప్రభోః || 11

మహేశ్వరుడిట్లు పలికెను -

దేవతలారా! నా మాటను వినుడు. పార్వతి యొక్క ప్రశ్నను వింటిరి గదా! అమోఘమగు నా తేజస్సు నుండి జన్మించినన శిశువును దాచిన వారెవరు? (9) వెంటనే భయముతో సత్యమును వెల్లడించ లేకపోయిన వ్యక్తి దండమునకు అర్హుడు కాబోడు. దండించవలసిన వానిని ఏ రాజు దండించడో, ఏ రాజు ప్రజాధనమును భక్షించునో, వాడు ప్రజలచే బాధితుడగును (10). శంభుప్రభుని ఆ మాటలను విని పరస్పరము సంప్రదించు కొని వారందరు భయపడుతూ శంభుని ఎదుట వరుసగా నిట్లు పలికిరి(11).

విష్ణురువాచ |

తే మిథ్యావాదినస్సంతు భారతే గురుదారికాః | గురు నిందాదతాశ్శశ్వత్త్వద్వీర్యం యైశ్చ నిహ్నుతమ్‌ || 12

విష్ణువు ఇట్లు పలికెను -

భరత ఖండమునందు ఎవరైతే నీ శిశువుని దాచియుంచినారో వారు మిథ్యావాదులు, గురుదారా సమాగమమును చేయువారు, గురువును నిందించుట యందు ఆసక్తి గలవారుగా శాశ్వతముగా నగుదురు గాక!(12)

బ్రహ్మోవాచ |

త్వద్వీర్యం నిహ్నుతం యేన పుణ్యక్షేత్రే చ భారతే | స నాన్వితో భ##వేత్తత్ర సేవనే పూజనే తవ || 13

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీ తేజస్సును దాచియుంచిన వ్యక్తి భారత దేశములోని పుణ్య క్షేత్రములో నిన్ను సేవించుటకు, పూజించుటకు అర్హతను గోల్పోవును (13).

లోకపాలా ఊచుః |

త్వద్వీర్యం నిహ్నుతం యేన పాపినా పతితభ్రమాత్‌ | భాజనం తస్య సో%త్యంతం తత్తపం కర్మ సంతతిమ్‌ || 14

లోకపాలురు ఇట్లు పలికిరి -

నీ తేజస్సంజాతుడగు శిశువును దాచిన పాపి పతితుడగును. వాని పుణ్య కర్మలు వ్యర్ధమగును. వాని సంతానము నష్టమగును (14).

దేవా ఊచుః |

కృత్వా ప్రతిజ్ఞాం యో మూఢో నాపాదయతి పూర్ణతామ్‌ | భాజనం తస్య పాపస్య త్వద్వీర్యం యేన నిహ్నుతమ్‌ || 15

దేవతలిట్లు పలికిరి -

నీ శిశువుని దాచిన వానికి, వాగ్దానమును చేసి నెరవార్చని మూర్ఖునకు లభించు పాపము చుట్టు కొనును (15).

దేవపత్న్య ఊచుః |

యా నిందతి స్వభర్తారం పరం గచ్ఛతి పూరుషమ్‌ | మాతృ బంధు విహీనా చ త్వద్వీర్యం నిహ్నుతం యయా|| 16

దేవ పత్నులు ఇట్లు పలికిరి -

ఏ స్త్రీ నీ శిశువును దాచి యుంచునో, అట్టి స్త్రీకి, భర్తను నిందించి పరపురుషునితో సమాగమమును చేసి తల్లివైపు బంధువులకు కూడా దూరమైన పాపాత్మురాలి పాపము చుట్టుకొనును (16).

బ్రహ్మోవాచ |

దేవానాం వచనం శ్రుత్వా దేవదేవేశ్వరో హరః | కర్మణాం సాక్షిణశ్చాహ ధర్మాదీన్‌ సభయం వచః || 17

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవుడగు శివప్రభుడు దేవతల మాటను విని ధర్ముడు మొదలగు కర్మ సాక్షులనుద్ధేశించి భయముతో ఇట్లు పలికెను (17).

శ్రీ శివ ఉవాచ |

దేవైర్న నిహ్నుతం కేన తద్వీర్యం నిహ్నుతం ధ్రువమ్‌ | తదమోఘం భగవతో మహేశస్య మమ ప్రభోః || 18

యూయం చ సాక్షిణో విశ్వే సతతం సర్వకర్మణామ్‌ | యుష్మాకం నిహ్నుతం కిం వా కిం జ్ఞాతుం వక్తు మర్హథ || 19

శ్రీ శివుడు ఇట్లు పలికెను -

దేవతలెవ్వరూ నా తేజస్సును దాచిపెట్టలేదు. కాని భగవంతుడగు, మహేశ్వరుడను, ప్రభుడను అగు నా అమోఘమగు తేజస్సు ఎవరో ఒకరు దాచి పెట్టినారనుట నిశ్చయము (18). మీరందరు సర్వకర్మలకు సర్వకాలములలో సాక్షులై యున్నారు. మీకు తెలియని దాపరికముండునా? కాన మీరు తెలుసుకున్న సత్యమును చెప్పుడు (19).

బ్రహ్మోవాచ |

ఈశ్వరస్య వచ శ్శ్రత్వా సభాయాం కంపితాశ్చ తే | పరస్పరం సమాలోక్య క్రమేణోచుః పురః ప్రభోః || 20

రతే తు తిష్ఠతో వీర్యం పపాత వసుధా తలే | మయా జ్ఞాతమమోఘం తచ్ఛంకరస్య ప్రకోపతః || 21

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఈశ్వరుని మాటలు విని వారా సభలో వణికిపోయిరి. వారు ఒకరి నొకరు చూచుకొని ప్రభువు ఎదుట వరుసగా నిట్లు పలికిరి (20). కోపించిన శంకరుని అమోఘమైన తేజస్సారము భూతలముపై పడినది. నాకు అంతవరకు మాత్రమే తెలియునని నేను (బ్రహ్మ) చెప్పితిని (21).

క్షితిరువాచ |

వీర్యం సోఢుమశక్తాహం తద్వహ్నౌ న్యక్షిపం పురా | అతో%త్ర దుర్వహం బ్రహ్మన్నబలాం క్షంతుమర్హసి || 22

ఓ పరమాత్మా ! నేను సహింప శక్యము కాని ఆ తేజస్సును ధరించుటకు శక్తి లేని దాననై అగ్ని యందు నిక్షేపించితిని. నేను అబలను. నన్ను క్షమించవలెను (22).

వహ్నిరువాచ|

వీర్యం సోఢుమశక్తో%హం తవ శంకర పర్వతే | కైలాసే న్యక్షిపం సద్యః కపోతాత్మా సుదుస్సహమ్‌ || 23

అగ్ని ఇట్లు పలికెను -

ఓ శంకరా! పాపురము రూపములోనున్న నేను దుస్సహమగు నీ తేజస్సును ధరింప జాలక కైలాస పర్వతమునందు వెను వెంటనే నిక్షేపించితిని (23).

గిరిరువాచ |

వీర్యం సోఢుమశక్తో%హం తవ శంకర లోకప | గంగాయాం ప్రాక్షిపం సద్యో దుస్సహం పరమేశ్వర || 24

పర్వతము ఇట్లు పలికెను -

లోకములను రక్షించు ఓ శంకరా! పరమేశ్వరా! దుస్సహమగు నీ తేజస్సును సహింప జాలక నేను వెంటనే గంగ యందు నిక్షేపించితిని (24).

గంగోవాచ |

వీర్యం సోఢు మశక్తాహం తవ శంకర లోకప | వ్యాకులా%తి ప్రభో నాథ న్యక్షిపం శరకాననే || 25

గంగ ఇట్లు పలికెను -

లోకములను రక్షించు ఓ శంకరా! ప్రభూ! నాథా! నీ తేజస్సును సహింపజాలని నేను చాల కంగారు పడి రెల్లుగడ్డి యందు నిక్షేపించితిని (25).

వాయురువాచ |

శ##రేషు పతితం వీర్యం సద్యో బాలో బభూవ హ | అతీవ సుందరశ్శంభో స్వర్నద్యాః పావనే తటే || 26

వాయువు ఇట్లు పలికెను -

ఓ శంభూ! ఆ తేజస్సు రెల్లు గడ్డి యందు వెంటనే బాటకుడాయెను. గంగానదీపావన తీరమునందు ఆ సుందర బాలకుడు మిక్కిలి ప్రకాశించెను (26).

సూర్య ఉవాచ |

రుదంతం బాలకం దృష్ట్వా గమమస్తాచలం ప్రభో | ప్రేరితః కాల చక్రేణ నిశాయాం స్థాతుమక్షమః || 27

సూర్యుడిట్లు పలికెను -

ఓ ప్రభూ! కాలచక్రముచే ప్రేరితుడనగు నేను ఏడ్చుచున్న బాలకుని చూచి రాత్రియందు అచట నిలిచి యుండుటకు సామర్ఢ్యము లేనివాడనగుటచే అస్తాద్రికి వెళ్లితిని (27).

చంద్ర ఉవాచ |

రుదంతం బాలకం ప్రాప్య గృహీత్వా కృత్తికాగణః | జగామ స్వాలయం శంభో గచ్ఛన్‌ బదరికాశ్రమమ్‌ || 28

చంద్రుడిట్లు పలికెను -

ఓ శంభూ! బాలుడు ఏడ్చు చుండుటను గాంచి కృత్తికలు తీసుకొని బదరికాశ్రమములోని తమ గృహములోనికివెళ్లిరి || (29)

జలమువాచ |

అముం రుదంతమానీయ స్తన్యపానేన తాః ప్రభో | వర్ధయామాసురీశస్య సుతం తవ రవి ప్రభమ్‌ || 29

జలాధి దేవత ఇట్లు పలికెను -

ఓ ప్రభూ! వారు సూర్యకాంతితో వెలుగొందే ఆ శివసుతుని ఏడ్చుచుండగా తీసుకొని వెళ్లిస్లన్యము నిచ్చి పెంచిరి (29).

సంధ్యోవాచ |

అధునా కృత్తికానాం చ వనం తం పోష్య పుత్రకమ్‌ | తన్నామ చక్రుస్తాః ప్రేవ్ణూ కార్తికశ్చేతి కౌతుకాత్‌ || 30

సంధ్య ఇట్లు పలికెను -

ఆ కృత్తికలు అడవిలో దొరికిన ఆ బాలకుని ప్రేమతో పోషించి, ఆతనికి ఉత్సాహముతో కార్తీకుడని పేరు పెట్టిరి (30).

రాత్రిరువాచ |

న చక్రుర్బాలకం తాశ్చ లోచనానామగోచరమ్‌ | ప్రాణభ్యో%పి ప్రీతిపాత్రం యః పోష్టా తస్య పుత్రకః || 31

రాత్రి ఇట్లు పలికెను -

వారా బాలకుని తమ దృష్ఠి పథమునుండి తప్పుకోని విధముగా పెంచిరి. ఆబాలకుడు వారికి ప్రాణముల కంటె ఎక్కువ ప్రియమయ్యెను. ఎవరు శిశువును పోషించెదరో, వారికే ఆ శిశువు పుత్రుడగును (31).

దినమువాచ |

యాని యాని చ వస్త్రాణి భూషణాని వరాణి చ | ప్రశంసితాని స్వాదూని భోయామాసురేవ తమ్‌ || 32

దినాధి దేవత ఇట్లు పలికెను -

వారా బాలకునిచే శ్రేష్టులగు వస్త్రములను, అలంకారములను ఏరి కోరి ధరింపసజేసిరి. రుచ్యములు, శ్రేష్ఠములు అగు పదార్ధములను తినిపించిరి (32).

బ్రహ్మోవాచ |

తేషాం తద్వచనం శ్రుత్వా సంతుష్టః పురసూదనః | ముదం ప్రాప్య దదౌ ప్రీత్యా విప్రేభ్యో బహుదక్షిణమ్‌ || 33

పుత్రస్య వార్తాం సంప్రాప్య పార్వతీ హృష్ట మానసా | కోటి రత్నాని విప్రేభ్యో దదౌ బహుధనాని చ || 34

లక్ష్మీ సరస్వతీ మేనా సావిత్రీ సర్వయోషితః | విష్ణుస్సర్వే చ దేవాశ్చ బ్రహ్మణభ్యో దదుర్ధనమ్‌ || 35

ప్రేరితస్స ప్రభుర్దేవైర్మునిభిః పర్వతైరథ | దూతాన్‌ ప్రస్థాపయామాస స్వపుత్రో యత్ర తాన్‌ గణాన్‌ || 36

బ్రహ్మ ఇట్లు పలికెను -

త్రిపురారి యగు శివుడు వారి ఆ మాటలను విని ఆనందించి బ్రహ్మణులకు ప్రీతితో అనేక దక్షిణల నిచ్చెను (33). పుత్రుని వార్తను వినిన పార్వతి అంతరంగములో మిక్కిలి సంతసించి బ్రాహ్మణులకు కోటి రత్నములను, వివిధ ధనములను ఇచ్చెను (34). లక్ష్మి సరస్వతి, మేన, సావిత్రి, మరియు ఇతర దేవతా స్త్రీలు, విష్ణువు మొదలుగా గల సర్వ దేవతలు బ్రాహ్మణులకు ధనము నిచ్చిరి (35). తరువాత దేవతలు, మునులు, పర్వతములు ప్రోత్సహించగా, ఆ ప్రభుడు తన పుత్రుడు ఉన్న చోటికి గణములను దూతలుగా పంపెను (36).

వీర భద్రం విశాలాక్షం శంకుకర్ణం కరాక్రమమ్‌ | నందీశ్వరం మహాకాలం వజ్రదంష్ట్రం మహోన్మదమ్‌ || 37

గోకర్ణాస్యం దధిముఖం జ్వలదగ్ని శిఖోపమమ్‌ | లక్షం చ క్షేత్ర పాలానాం భూతానాం చ త్రిలక్షకమ్‌ || 38

రుద్రాంశ్చ భైరవవాంశ్చైవ శివతుల్య పరాక్రమాన్‌ | అన్యాంశ్చ వికృతాకారానసంఖ్యా నపి నారద|| 39

తే సర్వే శివదూతాశ్చ నానాశస్త్రాస్త్ర పాణయః | కృత్తికానాం చ భవనం వేష్టయామాసురుద్ధతాః || 40

వీరభద్రుని, విశాలాక్షుని, శంకుకర్ణుని, కరాక్రముని, నందీశ్వరుని, మహాకాలుని, వజ్రదంష్ట్రుని, మహోన్మదుని (37), గోకర్ణాస్యుని, దధిముఖుని, అగ్ని జ్వాలలవలె ప్రకాశించు అక్ష క్షేత్ర పాలకులను, మూడు లక్షల భూతములను (38), రుద్రులను, శివునితో సమానమగు పరాక్రమము గల భైరవులను, వికృతరూపము గల ఇతరులను లెక్కలేనంత మందిని పంపెను. ఓ నారదా! (39) అనేక శస్త్రాస్త్రములను చేతులయందు ధరించి గర్వించి యున్న ఆ శివదూతలు అందరు కృత్తికల భవనమును చుట్టు ముట్టిరి (40).

దృష్ట్వా తాన్‌ కృత్తికాస్సర్వా భయవిహ్వల మానసాః | కార్తికం కథయామాసుర్జ్వలంతం బ్రహ్మతేజసా || 41

ఆ కృత్తికలు వారిని చూచి భయముతో కంగారుతో నిండిన మనస్సు గలవారై, బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోవుచున్న కార్తికునితో చెప్పిరి (41).

కృత్తికా ఊచుః |

వత్స సైన్యాన్యసంఖ్యాని వేష్టయామాసురాలయమ్‌ | కిం కర్తవ్యం క్వ గంతవ్యం మహా భయముపస్థితమ్‌ || 42

కృత్తికలిట్లు పలికిరి -

కుమారా! లెక్క లేనన్ని సైన్యములు ఇంటిని చుట్టు ముట్టినవి. ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? గొప్ప భయము సంప్రాప్తమైనరది (42).

కార్తికేయ ఉవాచ |

భయం త్యజత కల్యాణ్యో భయం కిం వా మయిస్థితే | దుర్నివార్యో%స్మి బాలశ్చ మాతరః కేన వార్యతే || 43

కార్తికేయుడిట్లు పలికెను -

ఓ మంగళ మూర్తులారా ! భయమును విడనాడుడు. నేను ఉండగా భయమేల? తల్లులారా!: నేను ఆప శక్యము గాని బాలకుడను. నన్ను ఎవరు ఆపగలరు? (43)

బ్రహ్మోవాచ |

ఏతస్మిన్నంతరే తత్ర సైన్యేంద్రో నందికేశ్వరః | పురతః కార్తికేయస్యోపవిష్ట స్సమువాచ హ || 44

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలో సేనాధి పతియగు నందీశ్వరుడు అచట కార్తికేయుని ఎదుట గూర్చుండి ఇట్లు పలికెను (44).

నందీశ్వర ఉవాచ |

భ్రాతః ప్రవృత్తిం శృణు మే మాతరశ్చ శుభావహామ్‌ | ప్రేరితో%హం మహే శేన సంహర్త్రా శంకరేణ చ || 45

కైలాసే సర్వదేవాశ్చ బ్రహ్మ విష్ణు శివాదయః | సభాయాం సంస్థితాస్తాత మహత్యుత్సవ మంగలే || 46

తదా శివా సభాయాం వై శంకరం సర్వశంకరమ్‌ | సంబోధ్య కథయామాస తవాన్వేషణ హేతుకమ్‌ || 47

పప్రచ్ఛ తాన్‌ శివో దేవాన్‌ క్రమాత్త్వత్ప్రాప్తి హేతవే | ప్రత్యుత్తరం దదుస్తే తు ప్రత్యేకం చ యథోచితమ్‌ || 48

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ తల్లులారా! సోదరా! నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. లయకర్త, మహేశ్వరుడు అగు శంకరుడు నన్ను పంపినాడు (45). కుమారా! బ్రహ్మ విష్ణు శివులు, సమస్త దేవతలు కైలాసమయునందు మహోత్సాహముతో మంగళకరమగు సందర్భములో సభను దీర్చి యున్నారు (46). అపుడు పార్వతి సభ యందు సర్వులకు శుభమును కలిగించే శంకరుని సంభోదించి నిన్ను వెతికించు మని చెప్పెను (47). అపుడు శివుడు దేవతలను నీ గురించి ప్రశ్నించగా, వారు ఒకరి తరువాత మరియొకరు సముచితమగు సమాధానముల నిచ్చిరి (48).

త్వామత్ర కృత్తికాస్థానే కథయామాసురీశ్వరమ్‌| సర్వే ధర్మాదయో ధర్మా ధర్మస్య కర్మ సాక్షిణః || 49

ప్రబభూవ రహః క్రీడా పార్వతీశివయోః పురాః | దృష్టస్య చ సురైశ్శంభోర్వీర్యం భూమౌ పపాత హ || 50

భూమిస్తదక్షిపద్వహ్నౌ వహ్ని శ్చాద్రౌ స భూధరః | గంగాయాం సాక్షిపద్వేగాత్‌ తరంగైశ్శరకాననే || 51

తత్ర బాలో%భవస్త్వం హి దేవకార్య కృతే ప్రభుః | తత్ర లబ్దః కృత్తికాభిస్త్వం భూమిం గచ్ఛ సాంప్రతమ్‌ || 52

ధర్మా ధర్మములగు కర్మలకు సాక్షులుగా ఉండే ధర్ముడు మొదలగు వారందరు ఈశ్వరునితో నీవు కృత్తికల గృహములో ఇచట ఉన్నావని చెప్పిరి (49). పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరించు చుండిరి. దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలింగించగా శివుని తేజస్సు భూమికి సంక్రమించెను (50). భూమి అగ్ని యందు, అగ్ని కైలాస పర్వతమునందు, కైలాసుడు గంగయందు, గంగ తన తరంగముల వేగముచే రెల్లు గడ్డి వనమునందు నిక్షేపించిరి(51). అపుడు సమర్ధుడవగు నీవు దేవకార్యము కొరకై బాలుడవై జన్మించితివి. కృత్తికలు నిన్ను అచట కనుగొనిరి. ఇప్పుడు నీవు కైలాసమునకు వెళ్లుము (52).

తవాభిషేకం శంభుస్తు కరిష్యతి సురైస్సహ| లప్స్యసే సర్వశస్త్రాణి తారకాఖ్యం హనిష్యసి || 53

పుత్రస్త్వం విశ్వసంహర్తు స్త్వాం ప్రాప్తుం చాక్షమా ఇమాః | నాగ్నిం గోప్తుం యథాశక్త శ్శుష్క వృక్షస్స్వ కోటరే || 54

దీప్త వాంస్త్వం చ విశ్వేషు నాసాం గేహేషు శోభ##సే | యథా పతన్మహాకూపే ద్విజరాజో న రాజతే || 55

కరోషి చ యథా%లోకం నా%%చ్ఛన్నో%స్మాసు తేజసా | యథా సూర్యః కలాచ్ఛన్నో న భ##వేన్మానవస్య చ || 56

శంభుడు దేవతలతో గూడి నీకు అభిషేకమును చేయగలడు. నీకు ఆయుధములన్నియు లభించగలవు. తారకాసురుని సంహరించగలవు (53). నీవు జగత్తును లయము చేయు రుద్రుని కుమారుడవు. నిన్ను దాచే సామర్ధ్యము ఈ కృత్తికలకు లేదు. ఎండిన మ్రాను తన తొర్రలో అగ్నిని దాచియుంచలేదు (54). బ్రహ్మాండములన్నింటిలో అధిక ప్రకాశము గల నీవు వీరి ఇంటిలో నుండుట బాగుండలేదు. నూతిలో నున్న మదపుటేనుగు ప్రకాశించదు (55). మానవుని దృష్టికి సూర్యుడు కానరాకుండగా చంద్రకాంతి కప్పివేయజాలదు. అటులనే నీ తేజస్సు నిన్ను దాగి ఉండనీయదు. నీవు మా సన్నిధికి రమ్ము (56).

విష్ణుస్త్వం జగతాం వ్యాపీ నాన్యో జాతో%సి శాంభవ | యథా న కేషాం వ్యాప్యం చ తత్సర్వం వ్యాపకం నభః || 57

యోగీంద్రో నానులిప్తశ్చ భాగీ చేత్పరిపోషణ | నైవ లిప్తో యథాత్మా చ కర్మయోగేషు జీవినామ్‌ 58

విశ్వారంభస్త్వమీశశ్చ నామ తే సంభ##వేత్‌ స్థితిః | గుణానాం తేజసాం రాశిర్యథాత్మానం చ యోగినః || 59

భ్రాతర్యే త్వాం న జానంతి తే నరా హతబుద్ధయః | నాద్రియంతే యథా భేకాస్త్వేకవాసాశ్చ పంకజాన్‌ || 60

ఓ శంభుపుత్రా! జగత్తులను వ్యాపించి యుండు విష్ణువు నీవే. నీ వంటి వాడు మరియొకడు పుట్టలేదు. పరిచ్ఛిన్నములగు వస్తువులనన్నిటినీ ఆకాశము వ్యాపించి యుండు తీరున నీవు సర్వమును వ్యాపించెదవు (57). కాని, జ్ఞానులు కర్మలనాచరించు చున్నానూ కర్మఫలముతో సంగమును పొందని తీరున, యోగీంద్రుడవగు నీకు కూడా సంసారలేపము లేదు. జగత్తును పోషించు నీవు జగత్తుతో సంపర్కమును పొందవు (58). యోగి యొక్క ఆత్మ త్రిగుణాతీతమై యుండును. అటులనే ఈ జగత్తును సృజించి రక్షించే తేజోరాశివగు నీవు ఈత్రిగుణములకు అంతర్గతుడవై లేవు (59). ఓ సోదరా! నిన్ను ఎరుంగని మానవులు భ్రష్టమైన బుద్ధి గలవారు. కప్పలు, పద్మములు ఒకే సరస్సులో నుండును. కాని కప్పలు పద్మములను ఆదరించవు (60).

కార్తికేయ ఉవాచ |

భ్రాతస్సర్వం విజానాసి జ్ఞానం త్త్రైకాలికం చ యత్‌ | జ్ఞానీ త్వం కా ప్రశంసా తే యతో మృత్యుంజయాశ్రితః || 61

కర్మణా జన్మ యేషాం వా యాసు యాసు చ యోనిషు | తాసు తే నిర్వృతిం భ్రాతః ప్రాప్నువంతీహ సాంప్రతమ్‌ || 62

కృత్తికా జ్ఞానవత్యశ్చ యోగిన్యః ప్రకృతేః కలాః | స్తన్యేనాసాం వర్ధితో%హముపకారేణ సంతతమ్‌ ||63

ఆసామహం పోష్యపుత్రో మద్వంశ్యా యోషితస్త్విమాః | తస్యాశ్చ ప్రకృతే రంశాస్తతస్తత్స్వామి వీర్యజః || 64

కార్తికేయుడిట్లు పలికెను -

సోదరా! నీకు సర్వము దెలియును. నీవు త్రికాల జ్ఞానివి. మృత్యుంజయుడగు శివుని ఆశ్రయించిన నిన్ను ఏమని ప్రశంసించవలెను? (61) సోదరా! ప్రాణులు తమ పూర్వకార్మాను సారముగా ఏయే యోనులయందు జన్మింతురో, వాటి యందే ఆనందమును పొందుచుందురు (62). ప్రకృతి యొక్క అంశములగు ఈ కృత్తికలు జ్ఞానము గల యోగినులు. నేను వీరి స్తన్యము చేత, మరియు వీరు చేసిన నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనైతిని (63). నేను వీరి పెంపుడు కొడుకును. ఈ స్త్రీలు నా వంశమునకు చెందిన వారే. వీరు ఆ ప్రకృతి యొక్క అంశలు. నేను ఆ స్వామి యొక్క తేజస్సు నుండి జన్మించితిని (64).

న మద్భంగో హిశైలేంద్రకన్యయా నందికేశ్వర | సా చ ము ధర్మతో మాతా యథేమాస్సర్వ సమ్మతాః || 65

శంభునా ప్రేషితస్త్వం చ శంభోః పుత్రసమో మహాన్‌ | ఆగచ్ఛామి త్వయా సార్ధం ద్రక్ష్యామి దేవతాకులమ్‌ || 66

ఇత్యేవముక్త్వా తం శీఘ్రం సంబోధ్య కృత్తి%్‌ఆ గణమ్‌ | కార్తికేయః ప్రతస్థే హి సార్ధం శంకరపార్హదైః || 67

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమార ఖండే కార్తికేయాన్వేషఫణం నామ చతుర్థో%ధ్యాయః (4).

ఓ నందీశ్వరా! పార్వతితో నా బంధుత్వమునకు భంగము లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. వీరు కూడా నాకు తల్లులు అను విషయము సర్వసమ్మతము (65). నిన్ను శంభుడు పంపెను. మహాత్ముడవగు నీవు శంభుని పుత్రునితో సమానమైన వాడవు. నేను నీతో వచ్చి దేవతలనందరినీ చూచెదను (66). అతనితో ఇట్లు పలికి కార్తికేయుడు కృత్తికల అనుమతిని పొంది శంకరుని గణములతో బాటు పయనమయ్యెను (67).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమారఖండములో కార్తికేయుని వెదుకుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Sri Sivamahapuranamu-II    Chapters