Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చత్వారింశోధ్యాయః

శివుని యాత్ర

బ్రహ్మోవాచ|

అథ శంభుస్సమాహూయ నంద్యాదీన్‌ సకలాన్‌ గణాన్‌ | ఆజ్ఞాప యామాస ముదా గంతుం స్వేన చ తత్ర వై || 1

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శంభుడు నంది మొదలగు గణములనందరిని పిలిచి తనతో బాటు ఆనందముతో వివాహమునకు రమ్మని ఆజ్ఞాపించెను (1).

శివ ఉవాచ|

అపి యూయం సహ మయా సంగచ్ఛధ్వం గిరేః పురమ్‌ | కియద్గణానిహాస్థాప్య మహోత్సవపురస్సరమ్‌ || 2

కొద్ది గణముల నిచట ఉంచి మీరు కూడా నాతో బాటు మహోత్సవమును జరుపు కుంటూ హిమవంతుని నగరమునకు పయనించుడు (2).

బ్రహ్మోవాచ|

అథ తే సమనుజ్ఞప్తా గణశా నిర్యయుర్ముదా | స్వం స్వం బలము పాదాయ తాన్‌ కథం చిద్వదామ్యహమ్‌ || 3

అభ్యగా చ్ఛంఖకర్ణశ్చ గణకోట్యా గణశ్వరః | శివేన సార్ధం సంగంతుం హిమాచల పురం ప్రతి || 4

దశకోట్యాకేకరాక్షో గణానాం సమహోత్సవః | అష్టకోట్యా చ వికృతో గణానాం గణనాయకః || 5

చతుష్కోట్యా విశాఖశ్చ గణానాం గణనాయకః | పారిజాతశ్చ నవభిః కోటిభిర్గణ పుంగవః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శివునిచే ఆజ్ఞాపించబడిన గణనాయకులు ఆనందముతో తమ తమ సైన్యములను తీసుకొని బయట దేరిరి. నేనా వివరములను కొంత శ్రమపడి వర్ణించెదను (3). శంఖకర్ణుడను గణాధ్యక్షుడు కోటి గణములతో కూడి హిమవంతుని నగరమునకు శివునితో బాటు బయలు దేరెను (4). గొప్ప ఉత్సవమును చేయుచూ కేకరాక్షుడు పదికోట్లతో (5), విశాఖుడను గణనాయకుడు నాల్గు కోట్ల గణములతో, గణాధ్యక్షుడగు పారిజాతుడు తొమ్మిది కోట్ల గణములతో బయల్వెడలిరి (6).

షష్టిస్సర్వాంతక శ్శ్రీమాన్‌ తథైవ వికృతాన నః | గణానాం దుందు భోష్టాభిః కోటి భిర్గణ నాయకః || 7

పంచభిశ్చ కపాలాఖ్యో గణశః కోటిభిస్తథా | షడ్భి స్సందారకో వీరో గణానాం కోటి భిర్మునే || 8

కోటి కోటి భిరేవేహ కందుకః కుండకస్తథా | విష్టంభో గణపోష్టా భిర్గణానాం కోటిభిస్తథా || 9

సహస్ర కోట్యా గణపః పిప్పలో ముదితో య¸° | తథా సంనాదకో వీరో గణశో మునిసత్తమ || 10

శ్రీమంతుడగు సర్వాంతకుడు అరవై, వికృతాననుడు అరవై, దుందుభుడను గణాధ్యక్షుడు ఎనిమిది కోట్ల గణములతో బయలు దేరిరి (7). ఓ మహర్షీ ! కపాలుడు గణాధ్యక్షుడు అయిదుకోట్లు, వీరుడగు సందారకుడు ఒక కోటి, కందుక కుండకులు ఒక్కొక్క కోటి విష్టంభుడను గణాధిపతి ఎనిమిది కోట్లు (8,9), పిప్పలుడను గణాధ్యక్షుడు వేయి కోట్లు గణములతో ఆనందముతో బయలు దేరిరి. ఓ మహర్షీ! వీరుడైన సంనాదకుడను గణాధ్యక్షుడు కూడ వెళ్లెను (10).

ఆ వేశనస్త థాష్టాభిః కోటిభిర్గణనాయకః | మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో య¸° || 11

కుండో ద్వాదశ కోట్యా హి తథా పర్వతకో మునే | అష్టాభిః కోటిభిర్వీరస్సమగాచ్చంద్ర తాపనః || 12

కాలశ్చ కాలకశ్చైవ మహాకాల శ్శతేన వై | కోటీనాం గణనాథో హి త థైవాగ్ని కనామకః ||13

కోట్యాగ్నిముఖ ఏవాగాద్‌ గణానాం గణనాయకః | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథా చైవ ఘనావహః || 14

ఓ మహర్షీ! ఆవేశనుడనే గణనాయకుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (11), కుండుడు పన్నెండు, పర్వతకుడు పన్నెండు, వీరుడగు చంద్రతాపనుడు ఎనిమిది, కాల, కాలక, మహాకాల, అగ్నికులను గణానాయకులు కోటి చొప్పున (12, 13), అగ్నిముఖుడను గణనాయకుడు కోటి, ఆదిత్య మూర్ధుడు, మరియు ఘనావహుడు కోటి గణములతో నడిచిరి (14).

సన్నాహశ్శతకోట్యా హి కుముదో గణపస్తథా | అమోఘః కోకిలశ్చైవ శత కోట్యా గణాధిపః || 15

సుమంత్రః కోటి కోట్యా చ గణానాం గణనాయకః | కాకపాదోదరః కట్యా షష్ట్యా సంతానకస్తథా || 16

మహా బలశ్చ నవభిర్మధు పింగశ్చ కోకిలః | నీలో నవత్యా కోటీనాం పూర్ణ భద్రస్తథైవ చ || 17

సప్త కోట్యా చతుర్వక్త్రః కరణో వింశ కోటిభిః | య ¸° నవతి కోట్యా తు గణశానోహిరోమకః || 18

సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, మరియు కోకిలుడను గణనాయకులు వందకోట్ల చొప్పున గణములతో బయలు దేరిరి (15). సుమంత్రుడను గణనాయకుడు ఒక కోటి, కాకపాదోదరుడు, సంతానకుడు అరైవ కోట్ల చొప్పున (16), మహాబలుడు తొమ్మిది, మధుపింగుడు తొమ్మిది, నీలుడు తొంభై, పూర్ణ భద్రుడు తొంభై (17), చతుర్వక్త్రుడు ఏడు, కరణుడు ఇరవై, అహిరోమకుడు తొంభై కోట్ల గణములతో బయలు దేరిరి (18).

యజ్వాశశ్శతమన్యుశ్చ మేఘమన్యుశ్చ నారద | తావత్కోట్యా యయుస్సర్వే గణశా హి పృథక్‌ పృథక్‌ || 19

కాష్ఠాంగుష్ఠ శ్చతుష్షష్ట్యా కోటీనాం గణనాయకః | విరూపాక్షస్సు కేశశ్చ వృషా భశ్చ సనాతనః || 20

తాలకేతుష్షడా స్య శ్చ చంచ్వాస్యశ్చ సనాతనః | సంవర్తకస్తథా చైత్రో లకు లీశస్స్వయం ప్రభుః || 21

లోకాంతకశ్చ దీప్తాత్మ తథా దైత్యాంతకో మునే | దేవో భృంగిరిటి శ్శ్రీమాన్‌ దేవ దేవ ప్రియస్తథా || 22

ఓ నారదా! యజ్వాశుడు, శతమన్యుడు, మేఘమన్యుడు అను గణనాయకులు కోటి చొప్పున (19), కాష్ఠాంగుష్ఠుడనే గణనాయకుడు అరవై నాలుగు కోట్లు గణములతో బయలు దేరిరి. విరూపాక్షుడు, సుకేశుడు, వృషాభుడు, సనాతనుడు (20), తాలకేతుడు, షడాస్యుడు, చంచ్వాస్యుడు సంవర్తకుడు, చైత్రుడు, లకులీశుడను గణపతి (21), ప్రకాశించే దేహము గల లోకాంతకుడు, దైత్యాంతకుడు, శోభాసంపన్నుడు దేవ దేవునకు ప్రియుడు అగు భృంగిరిటి దేవుడు బయలు దేరిరి (22).

అశనిర్భానుకశ్చైవ చతుష్షష్ట్యా సహస్రశః | యయుశ్శివ వివాహార్థం శివేన సహసోత్సవాః || 23

భూతకోటి సహస్రేణ ప్రమథైః కోటిభిస్త్రిభిః | వీర భద్రశ్చతుష్షష్ట్యా రోమజానాం త్రికోటిభిః|| 24

కోటి కోటి సహస్రాణాం శ##తై ర్వింశతిభిర్వృతాః | తత్ర జగ్ముశ్చ నంద్యాద్యా గణపాశ్శంకరోత్సవే || 25

క్షేత్ర పాలో భైరవశ్చ కోటి కోటి గణౖర్యుతః | ఉద్వాహశ్శంకర స్యేత్యా య¸° ప్రీత్యా మహోత్సవే || 26

అశని, భానుకుడు అరవై నాల్గువేల గణములతో గూడి శివుని వివాహము కొరకై ఉత్సాహముతో శివుని వెంట నడిచిరి (23). వీర భద్రుడు వేయు కోట్ల ప్రమథ గణములతో, మరియు రోమముల నుండి జన్మించిన అరవై ఏడు కోట్ల గణములతో నడచెను (24). నంది మొదలగు గణాధ్యక్షులు శంకరుని వివాహమహోత్సవము నందు పదకొండు వందల ఇరవై కోట్ల గణములతో విచ్చేసిరి (25). క్షేత్రపాలుడగు భైరవుడు శంకరుని వివాహమహోత్సవమునకు కోటి గణములతో గూడి ఆనందముతో విచ్చేసెను (26).

ఏతే చాన్యే చ గణపా అసంఖ్యాతా మహాబలాః | తత్ర జగ్ముర్మహాప్రీత్యా సోత్సాహా శ్శంకరోత్సవే || 27

సర్వే సహస్ర హస్తాశ్చ జటాముకుట ధారిణః | చంద్ర రేఖావతంసాశ్చ నీలకంఠా స్త్రిలోచనాః || 28

రుద్రాక్షా భరణాస్సర్వే తథా సద్భస్మ ధారిణః | హారకుండల కేయూర ముకుటాద్యై రలంకృతాః || 29

బ్రహ్మ విష్ణ్వింద్ర సంకాశా అణి మాది గుణౖర్యుతాః | సూర్య కోటి ప్రతీకాశాస్తత్ర రేజుర్గణశ్వరాః || 30

వీరు మాత్రమే గాక మహాబలశాలురగు గణాధ్యక్షులు లెక్కలేనంత మంది శంకరుని వివాహమునకు ఆనందముతో ఉత్సాహముతో హిమవంతుని రాజధానికి వెళ్లిరి (27). వారందరు వేయి భుజములు గలవారు, జటలను కిరీటములను ధరించినవారు, చంద్రకలను శిరస్సుపై ఆభరణముగా ధరించిన వారు, నీల వర్ణముతో గూడిన కంఠము గలవారు, మూడు కన్నులు గలవారు అయి ఉండిరి (28). మరియు వారందరు రుద్రాక్షమాల ఆ భరణముగా గలవారు, చక్కని భస్మను ధరించినవారు, హారములు కుండలములు కేయూరములు కిరీటములు మొదలగు ఆభరణములచే ఆలంకరింపబడినవారు (29), బ్రహ్మ, విష్ణువు, ఇంద్రులను పోలియున్నవారు, ఆణిమాది సిద్ధులు గలవారుగ నుండిరి. అచట గణాధ్యక్షులు కోటి సూర్యుల కాంతులతో ప్రకాశించిరి (30).

పృథి వీచారిణః కేచిత్‌ కేచిత్పాతాల చారిణః | కేచిద్వ్యోమచరాః కేచిత్సప్త స్వర్గ చరా మునే || 31

కిం బహూక్తేన దేవర్షే సర్వ లోక నివాసినః | ఆయ యుస్స్వ గణాశ్శంభోః ప్రీత్యా వై శంకరోత్సవే || 32

ఇత్థం దేవైర్గణౖ శ్చా న్యై స్సహితశ్శంకరః ప్రభుః| య ¸° హిమగిరి పురం వివాహార్థం నిజస్యవై|| 33

యదా జగామ సర్వేశో వివాహార్థం సురాదిభిః | తదా తత్ర హ్యభూద్వృత్తం తచ్ఛృణు త్వం మునీశ్వర || 34

ఓ మునీ! వారిలో కొందరు భూమి యందు, మరికొందరు పాతాళమునందు, కొందరు ఆకాశమునందు, ఇంకొందరు ఏడు స్వర్గముల యందు నివసించెదరు (31). ఓ దేవర్షీ! పెక్కు మాటలేల? సర్వ లోకములలో నుండే శంభుని గణములు శంకరుని వివాహమునకు ఆనందముతో విచ్చేసిరి (32). ఈ విధముగా దేవతలతో గణములతో మరియు ఇతరులతో కూడిన శంకర ప్రభుడు తన వివాహము కొరకై హిమవంతుని రాజధానికి వెళ్ళెను(32) ఓ మహర్షీ! సర్వేశ్వరుడగు శివుడు దేవతలు మొదలగు వారితో కలసి వివాహము కొరకై వెళ్ళిన సమయములో అచట ఒక వృత్తాంతము జరిగినది. దానిని నీవు వినుము (34).

రుద్రస్య భగినీ భూత్వా చండీ సూత్సవ సంయుతా | తత్రా జగామ సుప్రీత్యా పరేషాం సు భయావహా || 35

ప్రేతాసన సమారూఢా సర్పా భరణ భూషితా | పూర్ణం కలశమాదాయ హైమం మూర్ధ్ని మహాప్రభమ్‌ || 36

స్వపరీవార సంయుక్తా దీప్తాస్యా దీప్త లోచనా% | కుతూహలం ప్రకర్వంతీ జాత హర్షా మహాబలా || 37

తత్ర భూతగణా దివ్యా విరూపాః కోటిశో మునే | విరాజంతే స్మ బహుశస్తథా నానావిధాస్త దా || 38

చండి రుద్రుని సోదరియై మహోత్సాహముతో, ఆనందముతో ఇతరులకు చాల భయమును కలిగిస్తూ అచటకు వచ్చెను (35). ప్రేతాసనము అధిష్ఠించి యున్న దై. సర్పములను ఆభరణములుగా అలంకరించు కున్నదై, శిరస్సుపై గొప్ప కాంతులను వెదజల్లే బంగరు పూర్ణ కలశమును ధరించి (36), తన సహచరులతో కూడి యున్నదై, ఎర్రని ముఖము ఎర్రని నేత్రములు గలదియై, గొప్ప హర్షముతో సర్వులకు ఉత్కంఠను రేకెత్తించు చున్నదై, మహాబలవతి యగు చండివచ్చెను(37) ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు రేకెత్తించుచున్నదై, మహాబలవతి యగు చండి వచ్చెను (37). ఓ మునీ! అచట దివ్యములగు భూత గణములు అనేక రూపముల వారు కోట్లాది సంఖ్యలో విరాజిల్లిరి (38).

తైస్సమేతాగ్రతశ్చండీ జగామ వికృతాననా | కుతూహలాన్వితా ప్రీతా ప్రీత్యుపద్రవకారిణీ || 39

చండ్యా సర్వే రుద్ర గణాః పృష్ఠతశ్చ కృతాస్తదా | కోట్యేకాదశ సంఖ్యాకా రౌద్రా రుద్రప్రియాశ్చ తే || 40

తదా డమరునిర్ఘోషై ర్వ్యాప్త మాసీ జ్జగత్రయమ్‌ | భేరీఝంకార శ##బ్దేన శంఖానాం నినదేన చ || 41

తథా దుందుభి నిర్ఘోషై శ్శబ్దః కోలాహలోభవత్‌ | కుర్వన్‌ జగన్మంగలం చ నాశ##యేన్మంగలేతరత్‌ || 42

వికృతమగు ముఖము గల చండి వారిని ఎదుట నుంచుకొని కుతూహలముతో, ఆనందముతో ఉపద్రవమును సృష్టించు చున్నదైనడచెను (39). రుద్రనకు ప్రియమైన భయంకరాకారులగు పదకొండు కోట్ల రుద్ర గణములు అపుడామెను అనుసరించినవి (40). అపుడు ముల్లోకములు డమరు ధ్వనులతో, భేరీఝంకారములతో, శంఖనాదములతో నిండి పోయెను (41). మరియు కోలాహలముగ నున్న దుందుభిధ్వని జగత్తులోని అమంగళములను నశింప జేసి జగత్తును మంగళమయము చేసెను (42).

గణానాం పృష్ఠతో భూత్వా సర్వే దేవాస్సముత్సుకాః | అన్వయుస్సర్వసిద్ధాశ్చ లోకాపాలాదికా మునే || 43

మధ్యే వ్రజన్‌ రమేశోథ గరుడాసనమాశ్రితః | శుశుభే ధ్రియమాణన ఛత్రేణ మహతా మునే || 44

చామరై ర్వీజ్యమానోసౌ స్వగణౖః పరివారితః | పార్ష దైర్విలసద్భిశ్చ స్వభూషావిధి భూషితః || 45

తథాహమప్యశోభం వై వ్రజన్మార్గే విరాజితః | వేదై ర్మూర్తిధరైశ్శాసై#్త్రః పురాణౖరాగమైస్తథా || 46

ఓ మునీ! గణముల వెనుక దేవతలు, సిద్ధులు, లోకాపాలురు మొదలగు వారందరు ఉత్సాహముతో నడిచిరి (43). ఓ మునీ! వారి మధ్యలో గరుడాసనముపై గూర్చుండి లక్ష్మీపతి వెళ్లు చుండెను. ఆయనకు ఛత్రము ధరింపబడెను. ఆయన గొప్పగా ప్రకాశించెను (44). విష్ణు పార్షదులు ఆయనను చుట్టు వారి ప్రకాశించిరి. కొందరు ఆయనకు వింజామరలను వీచు చుండిరి. ఆయన తన అలంకారముల నన్నింటినీ ధరించి యుండెను (45). అదే విధముగా నేను కూడ మార్గములో వెళ్లుచూ శోభిల్లితిని. మూర్తిని దాల్చిన వేదశాస్త్రములతో, పురాణాగమములతో నేను ప్రకాశించితిని (46).

సనకాది మహాసిద్ధై స్సప్రజాపతిభిస్సుతైః | పరివారైస్సంయుతో హి శివసేవనతత్పరః || 47

స్వసైన్య మధ్యగశ్శక్ర ఐరావతగజస్థితః | నానావిభూషితోత్యంతం వ్రజన్‌ రేజే సురేశ్వరః || 48

తదా తు వ్రజమానాస్తే ఋషయో బహవశ్చ తే | విరేజు రతిసోత్కంఠాశ్శివస్యోద్వాహనం ప్రతి || 49

శాకిన్యో యాతుధానశ్చ వేతాల బ్రహ్మరాక్షసాః | భూతప్రేతపిశాచాశ్చ తథాన్యే ప్రమథాదయః || 50

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48). శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

తుంబురుర్నారదో హా హా హూ హూశ్చేత్యాదయో వరాః | గంధర్వాః కిన్నరా జగ్ము ర్వాద్యానాధ్మాయ హర్షితాః || 51

జగతో మాతరస్సర్వా దేవకన్యాశ్చ సర్వశః | గాయత్రీ చైవ సావిత్రీ లక్ష్మీ రన్యాస్సురస్త్రియః || 52

ఏతాశ్చాన్యాశ్చ దేవానాం పత్నయో భవమాతరః | ఉద్వాహ శ్శంకరస్యేతి జగ్ము స్సర్వా ముదాన్వితాః || 53

శుద్ధ స్ఫటిక సంకాశో వృషభ స్సర్వసుందరః | యో ధర్మ ఉచ్యతే వే దైశ్శాసై#్త్రస్సిద్ధ మహర్షభిః || 54

తమారూఢో మహాదేవో వృషభం ధర్మ వత్సలః | శుశుభేతీవ దేవర్షి సేవిత స్సకలైర్వ్రజన్‌ || 55

తుంబురుడు, నారదుడు, హాహా, హూహూ మొదలగు గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు వాద్యములను మ్రోయించుచూ ఆనందముతో ముందునకు సాగిరి (51). సవితృమండలాధిష్ఠాన దైవమగు గాయత్రి, లక్ష్మి అను జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతాస్త్రీలు వచ్చిరి (52). జగత్తునకు తల్లులైన ఇతర దేవభార్యలు శంకరుని వివాహమను కారణముచే ఆనందముతో అందరు విచ్చేసిరి (53). శుద్ధస్పటికమువలె తెల్లనిది, సర్వాంగ సుందరమైనది, వేదశాస్త్రములచే సిద్ధులచే మహర్షులచే ధర్మ మూర్తి యని కొనియా డబడినది అగు వృషభమును (54) ధర్మ ప్రేమియగు మహాదేవుడు అధిష్ఠించెను. దేవతలచే, ఋషులచే, ఇతరులందరిచే సేవింపబడుతూ పయనించుచున్న శంకరుడు మిక్కిలి ప్రకాశించెను (55).

ఏభిస్సమేతైస్స కలైర్మహర్షిభిర్బ భౌ మహేశో బహుశోత్యలంకృతః |

హిమాలయాహ్వస్య ధరస్య సంప్రజన్‌ పాణి గ్రహార్థం సదనం శివాయాః || 56

ఇత్యుక్తం శంభు చరితం గమనం పరమోత్సవమ్‌ | హిమాలయ పురోద్భూతం సద్వృత్తం శృణు నారద || 57

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే యాత్రావర్ణనం నామ చత్వారింశోధ్యాయః (40).

పూర్ణముగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీ దేవితో వివాహము కొరకై హిమవంతుని గృహమునకు వెళ్లుచున్న వాడై ఈ ఋషులందరితో గూడి ప్రకాశించెను (56). శివుని పరమోత్సవ యాత్రను ఇంత వరకు వర్ణించి యుంటిని. ఓ నారధా! హిమాలయ నగరములో జరిగిన చక్కని వృత్తాంతమును వినుము (57).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణన మనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).

Sri Sivamahapuranamu-II    Chapters