Sri Sivamahapuranamu-II    Chapters   

అథసప్తవింశో ధ్యాయః -బ్రహ్మచారి శివుని నిందించుట

పార్వత్యువాచ-

శృణు ద్విజేంద్ర జటిల మద్వృత్తం నిఖిలం ఖలు| సఖ్యుక్తం యే ద్య యత్సత్యం తత్తథైవ న యాన్యథా|| 1

మనసా వచసా సాక్షాత్కర్మణా పతి భావతః | సత్యం బ్రవీమి నో సత్యం వృతో వై శంకరో మయా|| 2

జానామి దుర్లభం వస్తుం కథం ప్రాప్యం మయా భ##వేత్‌ | తథాపి మన ఔత్సుక్యాత్తప్యతే ద్య తపో మయా ||

పార్వతి ఇట్లుపలికెను-

ఓ బ్రాహ్మణాశ్రేష్టా! బ్రహ్మచారీ! నావృత్తాంతమునంతనూ వినుము నా సఖి ఇప్పుడు చెప్పిన వచనములు సత్యమే గాని మరియొకటి గాదు(1) నేను మనస్సుచే సత్యమును సంకల్పించి, వాక్కుచే సత్యమును పలికి కర్మచే సత్యము ననుష్టించెదను. అసత్యము పలుకను. నేను శంకరుని భర్తగా వరించితిని(2). దుర్లభమగు వస్తువును నేను ఎట్లు పొందదగును? ఈ విషయమును నేను ఎరుంగుదును. అయిననూ మనస్సునందు ఉత్సాహముండుటచే నేనీనాడు తపస్సును చేయుచున్నాను.(3)

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా వచనం తసై#్మ స్థితా సా గిరిజా తదా| ఉవాచబ్రాహ్మణస్తత్ర తచ్ఛ్రుత్వా పార్వతీవచః|| 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడా పార్వతి ఆ బ్రహ్మచారితో నిట్లు పలికి మిన్నకుండెను పార్వతి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మనుడిట్లు పలికెను(4).

బ్రాహ్మన ఉవాచ|

ఏతవత్కాల పర్యంతం మమేచ్ఛా మహతీ హ్యభూత్‌ | కిం వస్తు కాంక్షతీ దేవీ కురుతే సుమహత్త పః || 5

తద్‌ జ్ఞాత్వా నిఖిలం దేవి శ్రుత్వా త్వన్ముఖ పంకజాత్‌ | ఇతో గచ్‌చామ్యహం స్థానా ద్యథేచ్ఛసి తథా కురు || 6

న కథ్యతే త్వయా మహ్యం మిత్రత్వం నిష్ఫలం భ##వేత్‌ | యథా కార్యం తథా భావి కథనీయం సుఖేన చ || 7

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఈ దేవి ఏ వస్తువును గోరి తీవ్రమగు తపస్సును చేయుచున్నదో తెలియవలెనని నాకు ఇంతకాలము నుండియు కోరిక గలదు(5). ఓ దేవీ! ఇపుడా వృత్తాంతమునంతనూ నీ పద్మములవంటి ముఖమునుండి వినియుంటిని. ఇపుడీ స్థానమునుండి నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు తోచినట్లు చేయుము.(6) నీవు నాకు చెప్పనిచో స్నేహభావము వ్యర్థమయ్యెడిది. నీవు ఎట్లు ప్రవర్తించెదవో, నీ భవిష్యత్తు అటులనే నిర్మాణమగును. నీకు దీనియందే సుఖము ఉన్నచో, చెప్పవలసినది ఏమియూలేదు(7).

బ్రహ్మోవాచ-

ఇత్యుక్త్వా వచనం తస్య యావద్గంతుమియేష సః | తాపచ్ఛ పార్వతీ దేవీ ప్రణమ్యోవాచ తం ద్విజమ్‌ ||8

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికిన ఆ బ్రహ్మచారి బయలుదేరుటకు సిద్దపడుచుండెను. ఇంతలో పార్వతీదేవి ఆ బ్రాహ్మణునకు నమస్కరించి ఇట్లు పలికెను.(8)

పార్వతువాచ-

కిం గమిష్యసి విప్రేంద్ర స్థితో భవ హితం వద | ఇత్యుక్తే చ తయా తత్ర స్థిత్వోవాచ స దండధృక్‌|| 9

పార్వతి ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణా శ్రేష్టా! ఏల వెళ్ళి పోవుచున్నావు? ఉండుము. నాకు హితమును భోధించుము. ఆమె ఇట్లు పలుకగా దండమును ధరించి యున్న భ్రాహ్మణుడు నిలబడి ఇట్లు పలికెను.(9).

ద్విజ ఉవాచ -

యది శ్రోతుమనా దేవి మాం స్థాపయసి భక్తితః | వదామి తత్త్వం తత్సర్వం యేన వయునం భ##వేత్‌ || 10

జానామ్యహం మహాదేవంసర్వథా గురుధర్మతః | ప్రవదామి యథార్ధం హి సావధానతయా శృణు || 11

పృషధ్వజో మహాదేవో భస్మదిగ్దో జటాధరః | వ్యాఘ్రచర్మాంబరధర స్సంవీతో గజకృతీనా|| 12

కపాలధారీ సర్పౌఘైస్సర గాత్రేషు వేష్టితః | విషదిగ్ధో భక్ష్య భక్షో విరూపాక్షో విభీషణః || 13

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ దేవీ! నేను వెళ్లకుండగా భక్తి పూర్వకముగా ఆపివేయుచున్నావు. నా మాటను వినగోరుచున్నావా? అట్లైనచో నీకు జ్ఞానమును కలిగించే సత్యమున్నంతనూ చెప్పెదను(10). నేను మహాదేవుని బాగుగా ఎరుంగుదును. నేను నీకు గురువు యొక్క ధర్మము ననుసరించి సత్యము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినుము (11) మహాదేవుడు వృషభము ధ్వజమునందు గలవాడు, భస్మచే లిప్తమైన దేహము గలవాడు జటలను ధరించువాడు, పెద్దపులి, చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఏనుగు చర్మము ఉత్తరీయముగా గలవాడు(12). ఆయన కపాలమును ధరించును. ఆయన శరీరమంతయూ పాములచే చుట్టబడి యుండును ఆయన విషమును ధరించి యుండును. ఆయన తినకూడని పదార్ధములను తినును. వికృతమగు కన్నులుగల ఆయనను చూచినచో భయము కలుగును(13).

అవ్యక్తజన్మా సతతం గృహభోగవివర్జితః| దిగంబరో దశభుజో భూతప్రేతాన్వితస్సదా || 14

కేన వా కారణన త్వం తం భర్తారం సమీహసే | క్వ జ్ఞానం తే గతం దేవి తద్వదాద్య విచారతః || 15

పూర్వం శ్రుతం మయా చైవ వ్రతంతస్య భయంకరమ్‌ | శృణు తే నిగదామ్యద్య యదితే శ్రవణ రుచిః || 16

ధక్షస్య దుహితా సాధ్వీ సతీ వృషభవాహనమ్‌| వవ్రే పతిం పురా దైవాత్తత్సంభోగః పరిశ్రుతః ||17

ఆయన పుట్టుక గురించి ఎవ్వరికి తెలియదు. ఆయన ఏనాడూ గృహ సుఖములనెరుంగడు. ఆయన దిగంబరుడు పది చేతులు గలవాడు. భూతప్రేతములు సర్వదా ఆయనను చుట్టువారి యుండును. (14). ఆయనను నీవు భర్తగా కోరుటకు కారణమేమి? ఓ దేవీ! నీ జ్ఞానము ఎచ్చటకు పోయినది? నాకీ విషయమును ఆలోచించి చెప్పుము (15). నేనాతని భయంకరమగు వ్రతమును గూర్చి పూర్వమే వినియుంటిని. నీకు కూడా వినుట యందు అభిరుచియున్నచో, ఇప్పుడు చెప్పెదను. వినుము(16) దక్షపుత్రి, ప్రతివ్రత యగు సతి వృషభము వాహనముగా గల శివుని పూర్వము దైవవశముచే భర్తగా పొందెను. ఆమె పొందిన భోగము అందరికీ తెలిసినదే(17).

కపాలి జాయేతి సతీ దక్షేణ పరివర్జితా | యజ్ఞే భాగప్రదానాయ శంభుశ్చాపి వివర్జితః || 18

సా తథైవాపమానేన భృశం కోపాకులా సతీ | తత్త్యాజాసూన్‌ ప్రియాంస్తత్ర తయా త్యక్తశ్య శంకరః || 19

త్వం స్త్రీరత్నం తవ పితా రాజా నిఖిల భూభృతామ్‌ | తథావిధం పతిం కస్మాదుగ్నేణ తపసేహసే || 20

దత్త్వా సువర్ణ ముద్రాం చ గ్రహీతుం కాచమిచ్ఛసి | హిత్వా చ చదనం శుభ్రం కర్దమం లేప్తుమిచ్ఛిసి || 21

సతీదేవి కపాలమును ధరించువాని భార్యయను కారణముచే దక్షుడామెను తిరస్కరించినాడు. మరియు యజ్ఞములో భాగము ఈయబడే దేవతలలో శంభుని జేర్చలేదు.(18) ఆ అవమానముచే మిక్కిలి కోపమును, దుఃఖమును పొందిన సతీదేవి శంకరుని విడిచిపెట్టి, ప్రియమగు ప్రాణములను కూడ త్యజించెను(19). నీవు స్త్రీలలో గొప్పదానవు నీ తండ్రి పర్వతములన్నింటికీ రాజు. నీవు ఉగ్రమగు తపస్సును అట్టి భర్తను పొందవలెననే కోరికతో ఏల చేయుచున్నావు?(20) బంగరు నాణమునిచ్చి నీవు గాజు ముక్కనుపొందగోరుచున్నావు. నీవు స్వచ్ఛమగు చందనమును త్రోసిపుచ్చి బురదను శరీరముపై లేపనము చేయగోరుచున్నావు.(21)

సూర్యతేజః పరిత్యజ్య ఖద్యోతద్యుతిమిచ్ఛిసి | చీనాంశుకం విహాయైవ చర్మాంబరమిహేచ్ఛసి || 22

గృహవాసం పరిత్యజ్య వనవాసం సమీహసే | లోహమిచ్ఛసి దేవేశి త్యక్త్వా శేవధిముత్తమమ్‌ || 23

ఇంద్రాది లోకపాలాంశ్చ హిత్వా శివమనువ్రతా | నైతత్సూక్తం హి లోకేషు విరుద్ధం దృశ్యతే ధునా || 24

క్వత్వం కమల పత్రాక్షీ క్వాసౌ వై త్రివిలోచనః | శశాంకవదనా త్వం చ పంచవక్త్ర శ్శివస్స్మృతః ||25

నీవు సూర్యతేజస్సును విడిచిపెట్టి మిణుగురు పురుగుల కాంతిని గోరుచున్నావు పట్టువస్త్రములను వీడి చర్మవస్త్రములను గోరుచున్నావు(22) నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించ గోరుచున్నావు. ఓ దేవదేవీ! నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుపముక్కను కోరుచున్నావు '23). నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలురను విడిచిపెట్టి శివుని గురించి వ్రతముననుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కన్పట్టుచున్నది(24). పద్మ పత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి యెక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖముగల నీవెక్కడ ? ఆ అయిదు ముఖముల శివుడెక్కడ? (25)

వేణీ శిరసి తే దివ్యా సర్పిణీవ విభాసితా| జటాజూలం శివస్యేవ ప్రసిద్ధం పరిచక్షతే ||26 చందనం చ త్వదీయాంగే చితాభస్మ శివస్య చ | క్వ దుకూలం త్వదీయం వై శాంకరం క్వ గజాజినమ్‌||27

భూఫణాని చ దివ్యాని క్వ సర్పశ్శశంకరస్య చ | క్వ చరా దేవతాస్సర్వాః క్వ చ భూతబలిప్రియః || 28

క్వ వా మృదంగవాదశ్చ క్వ చ తడ్డమరుస్తథా | క్వ చ భేరీకలాపశ్చ క్వ చ శృంగవో శుభః ||

నీ శిరస్సుపై జడ దివ్య సర్పమువలె భాసించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాల ప్రసిద్ధి చెందినట్లున్నది(26). నీ శరీరమునందు చందనము ఉండగా, శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర యెక్కడ? శంకరుని గజచర్మము ఎక్కడ? (27). నీ దివ్యములగు అలంకారములెక్కడ? శంకరుని సర్పములెక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరు దేవతలెక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ?(28) మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని డమరుకము యొక్క శబ్ధము ఎక్కడ? భేరీ ధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని యెక్కడ? (29).

క్వ చ ఢక్కా మయశ్శబ్దో గలనాదః క్వ చాశుభః | భవత్యాశ్చ శివసై#్యవ న యుక్తం రూపముత్తమమ్‌ || 30

యది ద్రవ్యం భ##వేత్తస్య కథం స్యాత్స దిగంబరః | వాహనం చ బలీవర్ధ స్సామగ్రీకాపి తస్య న || 31

వరేషు యే గుణాః ప్రోక్తా నారీణాం సుఖదాయకాః | తన్మధ్యే హి విరూపాక్షే ఏకోపి న గుణస్మ్సతః || 32

తవాపి కామో దయితో దగ్ధస్తేన హరేణ చ అనాదరస్తదా దృష్టో హిత్వా త్వామన్యతో గతః 33

ఢక్కా శబ్దమెక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు (30) ఆయన వద్ద ధనమున్నచో దిగంబరుడై ఉండనేల? ఎద్దు ఆయనకు వాహనము. ఆయన వద్ద సామగ్రి ఏమియూ లేదు (31). వరులయందలి ఏయే గుణములు స్త్రీలకు సుఖమునిచ్చునవి చెప్పబడినవో, వాటిలో ఒక్క గుణమైననూ ఆ ముక్కంటి యందు లేదు (32). నీకు అప్తుడగు మన్మథుని ఆ హరుడు దహించివేసినాడు. మరియు ఆయన చూపిన అనాదరమును నీవు ఎరుగుదువు. ఆయన నిన్ను విడిచి ఎక్కడికో వెళ్లినాడు (33).

జాతిర్న దృశ్యతే తస్య విద్యా జ్ఞానం తథైవ చ | సహాయాశ్చ పిశాచ హి విషం కంఠే హి దృశ్యతే|| 34

ఏకాకీ చ సదా నిత్యం విరాగీ చ విశేషతః | తస్మాత్త్వం హి హరే నైవ మనో యోక్తుం తు చార్హసి || 35

క్వచ హీరస్త్వదీయో వై క్వ చ తన్ముండమాలికా | అంగరాగః క్వ తే దివ్యః చితాభస్మ క్వ తత్తనౌ || 36

సర్వం విరుద్ధం రూపాది తవ దేవి హరస్య చ మహ్యం న రోచతే హ్యేతద్యదిచ్ఛసి తథా కురు || 37

అసద్వస్తు చ యత్కించిత్‌ తత్సర్వం స్వయమీహసే| నివర్తయ మనస్తస్మాన్నో చేదిచ్ఛసి తత్కురు ||

ఆయనకు జాతిగాని, విద్యగాని జ్ఞానముగాని ఉన్నట్లు కానరాదు. ఆయనకు పిశాచములు తోడు కంఠములో విషము స్పష్టముగా కనబడుచుండును (34). ఆయన సర్వదా ఒంటరిగా నుండును. ఆయన నిత్యవైరాగ్యము దృఢముగా గలవాడు. కావున నీవు శివుని మనస్సులో కోరుకొనుట ఎంతయూ తగని విషయము (35) నీ హారమెక్కడ; ఆయన యొక్క నరకపాలములమాల యెక్కడ? నీ దివ్యమగు శరీరలేపనమెక్కడ? ఆయన శరీరమందలి చితాభస్మము ఎక్కడ? (36) ఓ దేవీ! నీకు శివునకు రూపము మొదలగు వాటియందు సర్వమునందు విరోధము గలదు. కావున నాకీ వివాహము నచ్చుబాటు అగుటలేదు. నీకు తోచినట్లు చేయుము(37). నీవు ఈ సృష్టిలోని చెడు వస్తువుల నన్నిటినీ పొందగోరుచున్నావు. మనస్సును శివునినుండి మళ్ళించుము. లేనిచో, నీకు తోచినట్లు చేసుకొనుము(38)

బ్రహ్మోవాచ -

ఇత్యేవం వచనం శ్రుత్వా తస్య విప్రస్య పార్వతీ ఉవాచ క్రుద్దమనసా శివనిందాపరం ద్విజమ్‌ || 39

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే బ్రహ్మచారి ప్రతారణ వాక్య వర్ణనం నామ సప్తవింశో ధ్యాయః (39).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ భ్రాహ్మణుని ఈ మాటలను విని మనస్సులో క్రోధమును పొందిన పార్వతి శివుని నిందించుటలో ఉత్సాహముగల బ్రాహ్మణునితో నిట్లనెను (39)

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో బ్రహ్మచారి మోసపు మాటలను వర్ణించే ఇరువది ఏడవ అద్యాయము ముగిసినది (27).

Sri Sivamahapuranamu-II    Chapters