Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షడింశో ధ్యాయః - బ్రహ్మచారి రాక

గతేషు తేషు మునిషు స్వం లోకం శంకరస్స్వయమ్‌| పరీక్షితుం తపో దేవ్యా ఐచ్ఛత్సూతి కరః ప్రభుః|| 1

పరీక్షాచ్ఛద్మనా శంభుర్ద్రష్టుం తాం తుష్టమానసః | జాటిలం రూపమాస్థాయ స య¸° పార్వతీవనమ్‌ || 2

అతీవ స్థవిరో విప్రదేహధారీ స్వతేజసా| ప్రజ్వలన్మనసా హృష్ఠో దండీ ఛత్రీ బభూవ సః || 3

తత్రాపశ్యత్‌ స్థితాం దేవీం సఖీభిః పరివారితామ్‌| వేదికోపరి శుద్ధాం తాం శివామివ విధోః కలామ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మునులు తమ లోకమునుకు వెళ్లగానే సృష్టికారణడగు శంకర ప్రభుడు పార్వతీ దేవియొక్క తపస్సును స్వయముగా పరిక్షింపగోరెను.(1).శంభుడు పరీక్షయను నెపముతో ఆమెను చూడగోరి, సంతోషముతో గూడిన మనస్సు గలవాడై, జటాధారియగు విప్రుని రూపమును ధరించి పార్వతి తపస్సు చేయుచున్న వనమునకు వెళ్ళెను.(2). సంతసముతో నిండిన మనస్సుగల ఆ శివుడు తన తేజస్సుచే ప్రకాశించువాడు, కర్రను గొడుగును పట్టుకున్నవాడు, మిక్కిలి ముదుసలి యగు బ్రహ్మణుని వేషమును ధరించి యుండెను(3). ఆయన సఖురాండ్రచే చుట్టువార బడి, తపోవిదికపై స్వచ్ఛమగు చంద్రకళవలె ప్రకాశించుచున్న ఆ పార్వతీదేవిని చూచెను.(4)

శంభుర్నిరీక్ష్య తాం దేవీం బ్రహ్మచారి స్వరూపవాన్‌ | ఉపకంఠం య¸° ప్రీత్యా తదా సౌ భక్తవత్సలః || 5

అగతం తం తదా దృష్ట్వా బ్రాహ్మణం తేజసాద్భుతమ్‌ | అపూజయచ్ఛవా దేవీ సర్వపూజోపహారకైః || 6

సుసత్కృతం సంవిధాభిః పూజితం పరయా ముదా| పార్వతీ కుశలం ప్రీత్యా ప్రపచ్ఛ ద్విజమాదరాత్‌ || 7

భక్తవత్సలుడగు ఆ శంభుడు బ్రహ్మచారి రూపమును ధరించినవాడై ఆ దేవిని చూచి, అపుడు ప్రేమతో సమీపమునకు వెళ్లెను.(5) అద్భుతమగు తేజస్సుతో ప్రకాశిస్తూ అచటకు విచ్చేసిన బ్రహ్మణుని చూచి అపుడా పార్వతీదేవి ఆయనను సర్వోపచారములతో మరియు బహుమానములతో పూజించెను(6). పార్వతీదేవి పరమానందముతో యరియుఏ చక్కగా అమర్చబడిన పూజా ద్రవ్యములతో ఆ బ్రాహ్మణుని పూజించి ఆదరముతో ప్రేమతో కుశలము అడిగెను(7).

పార్వత్యువాచ-

బ్రహ్మచారి స్వరూపేణ కస్త్వం హి కుత అగతః| ఇదం వనం భాసయసే వద వేద విదాం వర || 8

పార్వతి ఇట్లు పలికెను: వేదవేత్తలలో శ్రేష్ఠమైనవాడా! బ్రహ్మచారి రూపములో నున్న నీవు ఎవరివి? ఈ వనము నీచే ప్రకాశించుచున్నది చెప్పుము (8)

విప్ర ఉవాచ|

అహమిచ్ఛాభిగామీ చ వృద్ధో విప్రతనుస్సుధీః | తపస్వీ సుఖదో న్యేషాముపకారీ న సంశయః || 9

కా త్వం కస్యాసి తనయా కి మర్థం విజనే వనే | తపశ్చరసి దుర్ధర్షం మునిభిః ప్రపదైరపి || 10

న బాలా నచ వృద్ధాపి తరుణీ భాసీ శోభనా | కథం పతిం వినా తీక్ణం తపశ్చరసి వై వనే || 11

కిం త్వం తపస్వినీభ##ద్రే కస్యచిత్సహచారిణీ| తపస్వీ స న పుష్టాతి దేవి త్వాం గతో న్యతః || 12

ఆ బ్రాహ్మణుడిట్లు పలికెను

నేను ఇచ్చవచ్చిన చోట సంచరించే వృద్ధ బ్రాహ్మణుడను,విద్వాంసుడను, తపశ్శాలిని. నేను ఇతరులకు ఉపకారమును చేసి సుఖమును కలిగించెద ననుటలో సందియము లేదు.(9) నీ వెవరు? ఎవరి కుమార్తెవు? నిర్జనమగు ఈ వనములో నిలబడి తపస్సును చేయు మునులు కూడ చేయ శక్యము కాని తపస్సును ఎందులకు చేయుచున్నావు? (10). నీవు చిన్న పిల్లవు కాదు. వృద్ధురాలవు కాదు నీవుఅందమగు యువతివి యని స్పష్టమగు చున్నది భర్త తోడు లేకుండగా ఈవనములో ఉగ్రమగు తపస్సును ఏల చేయుచున్నావు? (11) ఓ మంగళస్వరూపులారా! తపస్సును చేయుచున్న నీవు ఎవని భార్యవు ? ఆ అభాగ్యుడు నిన్ను పోషించుటలేదు. ఓ దేవీ! అతడు నిన్ను వీడి మరియోక చోటకు వెళ్ళినాడా యేమి?(12)

వద కస్య కులే జాతాః కః పితా తవ కా విధి | మహా సౌభాగ్యరూపా త్వం వృథా తవ తపోరతిః|| 13

కిం త్వం వేద ప్రసూర్లక్మీః కిం సురూపా సరస్వతీ| ఏతాసు మధ్యే కా వా త్వం నాహం తర్కితుముత్సహే ||14

నీవు ఎవరి కులములో జన్మించితివో చెప్పుము. నీ తండ్రి ఎవరు? నీకున్న జీవనాధరమేమి? నీరూపము మహా సౌభాగ్యవంతమై యున్నది. తపస్సుపై నీకు గల ప్రేమవ్యర్థము(13). నీవు వేదమాతవా? లక్ష్మివా? లేక సుందర రూపిణి యగు సరస్వతివా? వీరిలో నీవెవ్వరివి అను విషయమును ఊహించుట నాకు శక్యము కాదు (14).

పార్వతువాచ|

నాహం వేదప్రసూర్విప్ర న లక్ష్మిశ్చ సరస్వతీ| అహం హిమాచల సుతా సాంప్రతం నామ పార్వతీ || 15

పురా దక్షససుతా జాతా సతీ నామాన్య జన్మని | యోగేన త్యక్త దేహాహం యత్పిత్రా నిందితఃపతిః || 16

అత్ర జన్మని సంప్రాప్త శ్శివో పి విధివైభవాత్‌ | మాం త్యక్త్వా భస్మ సాత్కృత్య మన్మథం సజగామ హ ||17

ప్రయాతే శంకరే తాపోద్విజితాహం పితుర్గృహాత్‌| ఆగతా తపసే విప్ర స్వర్నదీ తటే || 18

పార్వతి ఇట్లు పలికెను-

నేను వేదమాతను గాను, లక్ష్మిని గాను, సరస్వతిని కూడ గాను. నేను ఈ జన్మలో హిమవంతుని కుమార్తెను. నా పేరు పార్వతి (15). పూర్వ జన్మలో నేను సతియను పేర దక్షుని కుమార్తెనె జన్మించితిని. నా భర్తను నా తండ్రి నిందించుటచే, నేను యోగ మార్గములో దేహమును త్యజించితిని(16). ఈ జన్మలో శివుడు లభించినవాడు. కాని విధివిలాసముచే ఆయన మన్మథుని దహించి నన్ను వీడి వెళ్ళినాడు(17). శంకరుడు వెళ్ళిన తరువాత నేను దుఃఖముచే పీడింపబడిన దాననై తండ్రిగారి గృహమును విడిచి పెట్టితిని. హే విప్రా! గంగానది తీరమునందు తపస్సు చేయవలననే దృఢనిశ్చయముతో వచ్చియుంటిని(18).

కృత్వా తపః కఠోర చ సుచిరం ప్రానవల్లభమ్‌| న ప్రాప్య్నాగ్నౌ వివిక్షంతీ త్వాం దృష్ట్వా సంస్థితా క్షణమ్‌|| 19

గచ్ఛ త్వం ప్రవిశామ్యగ్నౌ శివేనాంగీ కృతా నహి| యత్ర తత్ర తనుర్లప్స్యే వరిష్యామి శివం వరమ్‌ || 20

నేను చిరకాలము కఠినమగు తపస్సును చేసియూ ప్రాణప్రియుని పొందజాలక, అగ్నిలో ప్రవిశించ గోరి, నిన్ను చూచి కొద్దిసేపు ఆగితిని(19). నీవు వెళ్లుము. నేను అగ్నిలో ప్రవేశించెదను. ఏలయన శివుడు నన్ను స్వీకరించలేదు. నేను ఎక్కడ జన్మించిననూ శివుని భర్తగా వరించెదను(20).

బ్రహ్మవాచ-

ఇత్యుక్త్వాపార్వతీ వహ్నౌ తత్పురః ప్రవిశేశ సా | నిషిధ్యమానా పురతో బ్రాహ్మణన పునః పునః || 21

వహ్ని ప్రవేశం కుర్వంత్యా పార్వత్యాస్త త్స్రభావతః | బభూవ తత్‌ క్షణం వహ్ని స్సద్యశ్యందన పంకవత్‌|| 22

క్షణంతదంతరే స్థిత్వా హ్యుత్పతంతీదివం ద్విజః | పునః పప్రచ్ఛ సహసా విహసన్‌ సుతనుం శివః || 23

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి ఆ పార్వతి ఆయన యెదుట అగ్నిలో ప్రవేశించెను. ఆ బ్రాహ్మణుడు వద్దు వద్దని ఎన్నిసార్లు వారించిననూ ఆమె లెక్క చేయలేదు.(21) ఆయన మహిమచే అగ్నిలో ప్రవేశించిన పార్వతికి అగ్ని వెనువెంటనే గంధపు ముద్దవలె ఆయెను(22).

క్షణకాలము అగ్నియందుండి ఆకసము పైకి వచ్చుచున్న సుందరియగు పార్వతిని చూచిశివుడు చిరునవ్వుతో వెంటనే ఇట్లు ప్రశ్నించెను(23).

ద్విజ ఉవాచ-

అహో తపస్తే కి భ##ద్రే న బుద్ధం కించిదేవ హి| న దగ్ధో వహ్ని నా దేహో న చ ప్రాప్తం మనీషితమ్‌ ||24

అతస్సత్యం నికామం వై వద దేవి మనోరథమ్‌ | మామాగ్రేవిప్రవర్యస్య సర్వానందప్రదస్య హి || 25

యథావిధి త్వయా దేవి కీర్త్యతాం సర్వధాత్మనా| తస్మాన్మైత్రీ చ సంజాతా కార్యం గోప్యం త్వయా నహి || 26

కిమిచ్ఛసి వరం దేవి ప్రష్టుమిచ్ఛామ్యతః పరమ్‌ |త్యయ్యేవ తదసౌ దేవి ఫలం సర్వం ప్రదృశ్యతే ||27

ఆ బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ మంగళ స్వరూపురాలా! నీవు చేయు తపస్సు పరమాశ్చర్యము. నాకేమియూ తెలియకున్నది. అగ్నిలో ప్రవేశించిననూ నీకేమియు తెలియలేదు. నీ దేహమును అగ్ని దహించలేదు. నీ కోరిక నెరవేరలేదు(24). కావున, సర్వులకు ఆనందమునిచ్చే బ్రాహ్మన శ్రేష్ఠుడనగు నా యెదుట నీ మనస్సులోని కోరికను యథాతథముగా చెప్పుము. ఓ దేవీ!(25) నీవు నన్ను యథావిధిగా ఆదరించితిని. నీ మనస్సులోని మాటను చెప్పుము. నీకు నాకు మధ్య స్నేహము ఏర్పడినది గాన, నీవు నీ కోరికను దాచిపెట్టకుము (26) ఓ దేవీ నీకేమి వరము కావలెను? ఇంకనూ నిన్ను ప్రశ్నించవలయుననే కోరిక గలదు. ఓ దేవీ! నీ తపస్సు యొక్క ఫలమంతయూ నీ యందే గానవచ్చుచున్నది.(27)

పరార్ధే చ తపశ్చే ద్వై తిష్టేత్తు తప ఏవ తత్‌ | రత్నం హస్తే సమాదాయహిత్వా కాచస్తు సంచితః ||28

ఈ దృశం తవ సౌందర్యం కథం వ్యర్థీకృతం త్వయా | హిత్వా వస్త్రాణ్యనే కాని చర్మాది చ ధృతం త్వయా|| 29

తత్సరం కారణం బ్రూహి తపసస్త్వస్య సత్యతః | తచ్ఛ్రుత్వా విప్రవర్యో హం యథా హర్ష మవాప్నుయామ్‌||30

పరలోకము కొరకై తపస్సును చేయుచున్నావా? అట్లైనచో, ఆ తపస్సును దూరముగా నుంచుము. చేతిలోనికి వచ్చిన రత్నమును వీడి గాజుముక్కను పట్టుకున్నట్లే యగును(28). నీవు ఇట్టి నీ సౌందర్యమును వ్యర్థము చేయుటకు కారణమేమి? అనేక వస్త్రములను విడనాడి నీవు చర్మము మొదలగు వాటిని ధరించుచున్నావు(29). కావున నీవు ఈ తపస్సునకు గల యథార్ధ కారణమును పూర్తిగా వివరించి చెప్పుము. బ్రాహ్మణ శ్రేష్టుడనగు నేను ఆ వివరములను విని ఆనందించెదను.(30)

బ్రహ్మోవాచ-

ఇతి పృష్టా తదా తేన సఖీం పై#్రరయతాం బికా | తన్ముఖేనైవ తత్సర్వం కథయామాస సువ్రతా|| 31

తయా చ ప్రేరితా తత్ర పార్వత్యా విజయాభిధి | ప్రాణప్రియా సువ్రతజ్ఞా సఖీ జటిల మబ్రవీత్‌||32

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆయన ఇట్లు ప్రశ్నించగా అపుడా దృఢవ్రతయగు పార్వతి చెలికత్తెను ప్రేరేపించి ఆమె ద్వారా వృత్తాంతమునంతను చెప్పించెను (31). ఆ పార్వతిచే ప్రేరేపింపబడినదై, ఆమెకు ప్రాణ ప్రియురాలు, వ్రతము గురించి చక్కని జ్ఞానము గలది, విజయ అను పేరు గలది అగు చెలికత్తె ఆ బ్రహ్మచారితో నిట్లనెను.(32)

సఖ్యువాచ-

శృణు సాధో ప్రవక్ష్యామి పార్వతీ చరితం పరమ్‌ | హేతుంవ చ తపస స్సర్వం యది త్వం శ్రోతుమిచ్ఛసి || 33

సఖీ మే గిరిరాజస్య సుతేయం హిమభూ భృతః| ఖ్యాతా వై పార్వతీ నామ్నా సా కాలీతి చ మేనకా || 34

ఊఢేయం న చ కేనాపి న వాంఛతి శివాత్పరమ్‌ | త్రీణి వర్ష సహస్రాణి తపశ్చరణ సాధినీ || 35

తదర్ధం మే నయా సఖ్యా ప్రారబ్ధం తప ఈదృశమ్‌| తదత్ర కారణం వక్ష్యే శృణు సాధో ద్విజోత్తమ || 36

చెలికత్తె ఇట్లనెను-

ఓ సాధూ! శ్రేష్ఠమగు పార్వతీ చరిత్రను ఆమె తపస్సునకు గల కారణమును సర్వసమును నీవు వినగోరుచున్నచో, చెప్పెదను వినుము. (33) ఈ నా చెలికత్తె పర్వతరాజగు హిమవంతునికి మేనకయందు జన్మించినది. ఈమెకు పార్వతి, కాలి అను పేర్లు ప్రసిద్ధముగా నున్నవి (34). ఈమెకు ఇంకనూ వివాహము కాలేదు. ఈమె శివుని తక్క మరియొకనిని కోరుట లేదు. ఈమె మూడువేల సంవత్సరముల నుండి తపస్సును చేయుచున్నది (35) ఈ నా చెలికత్తె శివుని కొరకు ఇట్టి తపస్సును ఆరంభించినది. హే సాధో! బ్రాహ్మణశ్రేష్టా! దానికి గల కారణమును చెప్పెదను వినుము (36).

హిత్వేంద్ర ప్రముఖన్‌ దేవాన్‌ హరిం బ్రహ్మణమేవ చ | పతిం పినాకపాణిం వై ప్రాప్తుమిచ్ఛతి పార్వతీ||37

ఇయం సఖీ మదీయా వై వృక్షానారోపయత్సురా| తేషు సర్వేషు సంజాతం ఫల పుష్పాదికం ద్విజ||38

రూపసార్థాయజనక కులాలం కరణాయ చ | సముద్ధిశ్య మహేశానం కామస్యానుగ్రహాయ చ|| 39

మత్సఖీ నారదోప దేశాత్తపన్తపతి దారుణమ్‌| మనోరథః కుతస్తస్యా న ఫలిష్యతి తాపస || 40

ఇంద్రాది దేవతలను, విష్ణువును బ్రహ్మను కూడా విడిచి పార్వతి పినాక సాణియగు శివుని భర్తగా పొందగోరుచున్నది(37). ఈ నా చెలికత్తె పూర్వము వృక్షములును నాటెను. ఓ బ్రాహ్మణుడా! అవి అన్నీ పూవులు పూచి కాయలు కాచినవి(38). తన రూపమును సార్థకము చేయుట కొరకు తండ్రి వంశమును భూషితము చేయుట కొరకు మన్మథుని అనుగ్రహించుట కొరకు నా చెలికత్తె మహేశ్వరుని ఉద్దేశించి (39) నారదుని ఉపదేశముచే మిక్కిలి తీవ్రమగు తపస్సును చేయుచున్నది. ఓ తపశ్శాలీ! ఆమె కోరిక ఎందువలన నెరవేరదు? (40)

యత్తే పీష్టం ద్విజశ్రేష్ట మత్సఖ్యా మనసీప్సితమ్‌ | మయా ఖ్యాతం తత్ప్రీత్యా కిమన్య చ్చ్రోతుమిచ్ఛసి|| 41

ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పితిని. నా చెలియొక్క మనోరథమును ప్రీతితో వివరించితిని నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (41)

బ్రహ్మోవాచ-

ఇత్యేవం వచనం శ్రుత్వా విజయాయా యాథార్ధతః| మునే స జటిలో రుద్రో విహసన్వాక్యమబ్రవీత్‌ || 42

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ విజయ యొక్క ఆ యాథార్థ వచనములను విని బ్రహ్మచారి రూపములో నున్న ఆ రుద్రుడు నవ్వి ఇట్లనెను.(42)

జటిల ఉవాచ-

సఖ్యేదం కథితం తత్ర పరిహాసో ను మీయతే| యథార్ధం చేత్తదా దేవీ స్వముఖే నాభి భాషతామ్‌||43

బ్రహ్మచారి ఇట్లు పలికెను-

ఈ చెలికత్తె చెప్పిన మాటలో పరిహాసము ఉన్నట్లు తోచుచున్నది. ఈ వచనము యథార్ధమైనచో ఈ దేవి తన నోటితో ఆ మాటను చెప్పు గాక! (43)

బ్రహ్మోవాచ-

ఇత్యుక్తే చ తదా తేన జటిలేన ద్విజన్మకా| ఉవాచ పార్వతీ దేవీ స్వముఖేనైవ తం ద్విజమ్‌||44

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయ పార్వతీ ఖండే శివాజటిల సంవాదో నామ షండిశో ధ్యాయః (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఇట్లు పలుకగా, అపుడు పార్వతీదేవి తన నోటితో ఆ బ్రాహ్మణునితో నిట్లనెను(44)

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందతి పార్వతీ ఖండలో శివాజటిల సంవాదమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (44).

Sri Sivamahapuranamu-II    Chapters