Sri Padma Mahapuranam-I    Chapters   

శ్రీరస్తు

శ్రీగణశాయనమః శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః

పద్మపురాణమ్‌

సృష్టిఖండః ప్రథమో ధ్యాయః

మంగళాచరణమ్‌ : పురాణావతారికా

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |

దేవీం సరస్వతీంచైవ తతో జయ ముదీరయేత్‌ ||

స్వచ్ఛం చంద్రావదాతం కరికరమకరక్షోభసంజాతఫేనం

బ్రహ్మోద్భూతిప్రసక్తై ర్ధృతనియమపరైః సేవితం విప్రముఖ్యైః ||

ఓంకారాలంకృతేన త్రిభువన గురుణా బ్రహ్మణా దృష్టిపూతం

సంభోగాభోగరమ్యం జల మశుభహరంపౌష్కరం వః పునాతు || 1

సూత మేకాంతమాసీనం వ్యాసశిష్యో మహామతిః | లోమహర్షణనామాసౌ ఉగ్రశ్రవస మాదిశత్‌ 2

ఋషీణా మాశ్రమాం స్తాత గత్వా ధర్మాన్‌ సమాసతః | పృచ్ఛ తాన్‌ విస్తరా ద్ర్బూహి యన్మత్తః ళ్రుతవానసి || 3

వేదవ్యాసా న్మయా పుత్ర పురాణా న్యఖిలానిచ | తవాఖ్యాతాని ప్రాప్తాని మునిభ్యో వద విస్తరాత్‌ || 4

ప్రయాగే మునివర్యైశ్చ యథా పృష్టః స్వయం ప్రభుః | పృష్టేన చానుశిష్టాస్తే మునయో ధర్మకాంక్షిణః || 5

దేశం పుణ్య మభీప్సంతో విభునాచ హితైషిణా | సునాభం దివ్యరూపంచ సత్యగం శుభవిక్రమమ్‌ || 6

అనౌపమ్య మిదం చక్రం వర్తమాన మతం ద్రితాః | పృష్టతో యాత నియమాత్‌ పదం ప్రాస్స్యథ యద్ధితమ్‌ || 7

గచ్ఛతో ధర్మచక్రస్య యత్ర నేమి ర్విశీర్యతే| పుణ్యః స్వదేశో మంతవ్య ఇత్యువాచ స్వయంప్రభుః || 8

ఉక్త్వా చైవ మృషీన్‌ సర్వా నదృశ్యత్వ మగాత్‌ పునః| గంగావర్తసమాహారో నేమి ర్యత్ర వ్యశీర్యత|| 9

ఈజిరే దీర్ఘ సత్రేణ ఋషయో నైమిశే తదా | తత్ర గత్వా తు తాన్‌ బ్రూహి పృచ్ఛతో ధర్మసంశయాన్‌ || 10

ఉగ్రశ్రవాస్తతో గత్వా జ్ఞానవి న్మునిపుంగవాన్‌ | అభిగమ్యోపసంగృహ్య నమస్కృత్వా కృతాంజలిః || 11

తోషయామాస మేధావీ ప్రణిపాతేన తా నృషీన్‌ | తేచాపి సత్రిణః ప్రీతాః ససదస్యా మహాత్మనే || 12

తసై#్మ సమేత్య పూజాంచ యథావత్‌ ప్రతిపేదిరే || 13

ఋషయ ఊచుః

కుతస్త్వమాగతః సూత కస్యాదేశా దిహాగతః | కారణం చాగమే బ్రూహి బృందారకసమద్యుతే || 14

స్వచ్ఛమైనది చంద్రునివలెదెల్లనిది చల్లనిదియు నేనుగులు మొశళ్లుచేయు సంక్షోభముచే నుఱుగులు గ్రమ్మునది బ్రహ్మానుసంధానమందు పరమనిష్ఠకొని వ్రతనియమాచరణపరులైన విప్రవర్యులచేసేవింపబడునది (స్నానపానాదుల కుపయోగపడునదన్న మాట) ఓంకారముచే నలంకరింపబడువాడు ఆకారము, ఉకారము, మకారము (అర్ధతన్మాత్ర) రూపమైన త్రిమూర్తుల స్వరూపమయిన త్రిలోకగురువగు బ్రహ్మచే (పరమాత్మచే) దృష్టిపూరితము కటాక్షమాత్రప్రసారముచే బవిత్రము సర్వపుణ్య ఫలానుభవ సమృద్ధిచే మనోహరమును అశుభముల హరించునదియు నగు పుష్కరతీర్ధపవిత్రోదకము మిమ్ములను బవిత్రులను గావించుగాక ! ఇది యీ వద్మపురాణ ప్రారంభ మంగళ శ్లోకము, ఈ పుష్కర సరస్తీర్థ ప్రభావము బ్రహవ్మవురాణమందు విపులముగ వర్ణింపబడినది. ఇది హిమాలయమునందున్నది.

ఏకాంతమం దాసీనుడైయున్న ఉగ్రశ్రవుడను పేరుగల సూతునితో వ్యాసశిష్యుడు బుద్ధిమంతుడునగు లోమహర్షణుడిట్లనియె. నాయన ! ఋషులయాశ్రమములకేగి నావలన సంగ్రహముగ విన్న ధర్మములను వా రడుగ విపులముగ జెప్పుము. కుమార ; వేదవ్యాసభగవానుని వలన నేను విన్నపురాణము లన్నిటిని నీకు జెప్పితిని. వానిని మునులకు విస్తరముగ బ్రవచనము సేయుము, ప్రయాగ క్షేత్రమందు వ్యాసభగవానులు స్వయముగ ధర్మరతులు మునులడుగ నీవురాణముల నుపదేశించెను. సర్వలోకహితముగోరి చక్కనినాభి గలిగి దివ్యరూపమై సత్యపథమందు దిఱుగు శుభకరమైన విక్రమము గల్లి యీ చక్రము విష్ణునిచే ప్రవర్తింపబడినది. ఏలాటి యలసటగొనక దీని వెంట నేగుడు. దాన మీ యభీష్టమును పొందగలరు. ఈ ధర్మచక్రము వోవుచుండ దీనినేమి (చుట్టునున్న పట్టా) ఎక్కడ నూడిపడునో ఆ ప్రదేశ మతి పుణ్యము అని లోమహర్షణముని సెప్పి యదృశ్యుడయ్యెను. గంగలో బొడమిన సుడివలె పరిభ్రమించు నా ధర్మచక్రము (నేమి) అంచు విడివడినచోట నైమిశారణ్యమునందు (నేమికి సంబంధించిన ప్రదేశమగుటచే నిది నై మిశమను పేరందినది) ఋషులున్నారు, అటకేగి వారికి మనవి సేయుము. ధర్మసందేహములను వారి నడుగుము. అన నుగ్రశ్రవుడు (సూతుడు) జ్ఞానులయిన యా మునివరుల సన్ని ధికేగి పాదములు పట్టుకొని చేతులు జోడించి సాష్టాంగనమస్కారముసేసి యా మేధావి వారినానందభరితులను జేసెను. సత్యయాగ దీక్షితులగు నమ్మునులు సభాసదులతో వచ్చి యమ్మహానుభావుని పూజించిట్లనిరి.

పిత్రాహంతు సమాదిష్టో వ్యాస శిష్యేణ ధీమతా | శుశ్రూషస్వ మునీన్‌ గత్వా యత్తే పృచ్ఛంతి తద్వద || 15

వదంతు భగవంతో మాం కథయామి కథాం తు యామ్‌ | పురాణం చేతిహాసం వాధర్మా నథ పృధగ్విధాన్‌ || 16

తాం గిరం మధురాం తస్య శుశ్రువూ ఋషి సత్తమాః | అథ తేషాం పురాణస్య శుశ్రూషా సమపద్యత || 17

దృష్ట్వా త మతివిశ్వస్తం విద్వాంసం లౌమహర్షణిమ్‌ | తస్మిన్‌ సత్రే కులపతిః సర్వశాస్త్ర విశారదః || 18

శౌనకో నామ మేధావీ విజ్ఞానారణ్యకే గురుః | ఇత్థం తద్భావమాలంబ్య ధర్మాన్‌ శుశ్రూషు రాహ తమ్‌ || 19

త్వయా నూతమహాబుద్ధే భగవాన్‌ బ్రహ్మవిత్తమః | ఇతిహాసపురాణార్థం వ్యాసః సమ్యగుపాసితః || 20

దుదోహిథ మతిం తస్య త్వం పురాణాశ్రయాం శుభామ్‌ | అమీషాం విప్రముఖ్యాణాం పురాణంప్రతి సంప్రతి || 21

శుశ్రూషాస్తే మహాబుద్ధే తచ్ఛ్రావయితు మర్హసి | సర్వేహిమే మహాత్మానో నానాగోత్రాః సమాగతాః || 22

స్వాన్‌ స్వానంశాన్‌ పురాణోక్తాన్‌ శృణ్వంతు బ్రహ్మవాదినః | సంపూర్ణ దీర్ఘ సత్రే%స్మిసాంస్త్వం శ్రావయవై మునీన్‌ 23

పాద్మం పురాణం సర్వేషాం కథయస్వ మహామతే| కథం భూతం సముద్భూతం బ్రహ్మా తత్ర కథం న్వభూత్‌ || 24

ప్రోద్భూతేన కథం సృష్టిః కృతా తాంతు తథా వద | ఏవం పృష్ట స్తత స్తాంస్తు ప్రత్యువాచ శుభాం గిరమ్‌ || 25

సూక్ష్మంచ న్యాయసంయుక్తం ప్రాబ్రవీ ద్రౌమహర్షిణిః| ప్రీతో%స్మ్యనుగృహీతో స్మి భవధ్భి రిహ చోదనాత్‌ || 26

పురాణార్ధం పురాణజ్ఞైః సర్వధర్మపరాయణౖః| యథా శ్రుతం సువిఖ్యాతం తత్సర్వం కథయామి వః || 27

ధర్మ ఏషతు సూతస్య సద్భిద్దృష్టః సనాతనః | దేవతానా మృషీణాంచ రాజ్ఞాం చామిత తేజసాం || 28

వంశానాం ధారణం కార్యం స్తుతీనాంచ మహాత్మనామ్‌ | ఇతిహాస పురాణషు దృష్టాయే బ్రహ్మవాదినః || 29

సూత ! నీ వెక్కడ నుండి యెందుల కెవరియాన నిటకు వచ్చితివి ? దేవవర్చస్వి ! నీవది చెప్పుమన సూతుడు; వ్యాస శిష్యుడగు లోమహర్షణునిచే మునులకు శుశ్రూష సేసి వారడిగినదెల్ల చెప్పుమని యాదేశింపబడినాను. భగవంతులు మీరిపు డేనేమికథ చెప్పవలెనో సెలవిండు. పురాణమా ? ఇతిహాసమా ? లేక పెక్కుతెఱగులయిన ధర్మములనా ? మీరేమి వినవలతురన నా మధురభాషణము వారాలించిరి. అవ్వల వారికి పురాణము వినవలయునను కోరిక గల్గెను. మిగుల విశ్వాసముతో వచ్చిన విద్వాంసుని లోమహర్షణ కుమారునింగని యా సత్రయాగమున కులపతి సర్వశాస్త్రవిశారదుడు మేధావి విజ్ఞానారణ్యకమున ఆరణ్యకమను వేదాంత భాగమందు గురువు నైన శౌనకుడు సూతుని భావముంగైకొని ధర్మముల నాలింపగోరి యతని కిట్లనియె.

సూతా ! ఓ బుద్ధిశాలీ ! బ్రహ్మవేత్తల కగ్రేసరుడైన వ్యాసభగవానుని నీ వితిహాస పురాణముల కొఱకు లెస్సగా నుపాసించితివి. పురాణ విషయ నిష్ఠమైన యాయన శుభప్రదమ్తెన బుద్ధిని నీవు పిదికికొంటివి. దూడ కుడిచిన కొలది ఆవు పాలు చేవును. ఆ విధముగ నీవు వ్యాసభగవానుల నుపాసించి ఇతిహాస పురాణ భావమాధుర్యమును సమృద్థిగ గ్రహించితివన్న మాట. ఈ విప్రముఖ్యులుపురాణము నాలింప గుతూహలపడుచున్నారు. నీ వది వినిపింప నర్హుడవు. వీరందరు మహాత్ములు. నానా గోత్రములవారు దయచేసినారు. ఈ బ్రహ్మవాదులు తమ తమ కభిరుచి గల యాయా యంశములు నీవల్ల విందురుగాక ! ఇది సంపూర్ణమైన దీర్ఘ సత్ర యాగము. ఇందా పురాణ ప్రవచనము నీవు గావింపుము. ఏలాంటి పదార్ధము మొట్టమొదట రూపొందినది ? అందు బ్రహ్మ యెట్లు పుట్దెను ? ఆ పుట్టిన వానివలన సృష్టి యెట్లయ్యె నది తెలుపుము. అన సూతుండు వారికి శుభప్రదముగ సూక్ష్మముగ న్యాయసమ్మతముగ నిట్లు బదులు పలికెను.

1ప్రీతుడనైతిని తామిక్కడ జేసిన ప్రబోధన వలన (ప్రేరణ వలన) అనుగ్రహీతుడనైతిని. అనుగ్రహ పాత్రుడనైతినన్నమాట) సర్వధర్మనిష్ఠులు పురాణవేత్తలునైస మహానుభావులవలన నెట్లు వింటిని. అది మిక్కిలి ప్రసిద్ధమైన కథ యదెల్ల మీకు జెప్పుచున్నాను. ఈ చెప్పుట సత్పురుషులు సూతుని సనాతనమైన ధర్మమని కనుగొన్నారు. దేవర్షి రాజవంశములు మహాతేజస్వులగువారు సేసిన స్తుతులను ధారణసేయవలయును. అవి ఇతిహాసపురాణములందు గనిపించును.

నహి వేదే ష్వధికారః కశ్చిత్‌ సూతస్య దృశ్యతే| వైన్యస్య హి పృధోర్యజ్ఞే వర్తమానే మహాత్మనః || 30

మాగధశ్చైవ సూతశ్చ త మస్తౌతాం నరేశ్వరమ్‌ | తుష్టేనాథ తయో ర్దత్తో వరో రాజ్ఞా మహాత్మనా || 31

సూతాయ సూతవిషయో మగధో మాగధాయ చ | తత్ర సూత్యాం సముత్పన్నః సూతోనామ్నో బభూవహ || 32

ఐంద్రే సత్రే ప్రవృత్తేతు గ్రహయుక్తే బృహస్పతౌ | తమే వేంద్రం బార్హస్పత్యే తత్రసూతో వ్యజాయత || 33

శిష్యహస్తేన యత్పృక్త మభిభూతం గురోర్హవిః | అధరోత్తరధారేణ జజ్ఞే తద్వర్ణ సంకరమ్‌ || 34

యే7త్ర క్షాత్రాత్‌ సమభవన్‌ బ్రాహ్మణ్యాశ్చైవ యోనితః | పూర్వేణౖవతు సాధర్మ్యా ద్వైధర్మాస్తే ప్రకీర్తితాః || 35

మధ్యమో హ్యే సూతస్య ధర్మః క్షత్రోపజీవినః | పురాణష్వధికారో7యం విహితో బ్రాహ్మణౖరిహ || 36

దృష్ట్వా ధర్మ మహం పృష్టో భపద్భి ర్ర్బహ్మవాదిభిః| తస్మాత్సమ్య గ్భువి బ్రూయాం పురాణ మృషిపూజితమ్‌ || 37

పితౄణాం మానసీ కన్యా వాసవం సమపద్యత | అపధ్యాతా చ పితృభి ర్మత్స్యగర్భే బభూవ సా || 38

అరణీవ హుతాశస్య నిమిత్తం పుణ్యజన్మనః | తస్యాం బభూవ పూతాత్మా మహర్షిస్తు పరాశరాత్‌ || 39

తసై#్మ భగవతే కృత్వా నమః సత్యాయ వేదసే | పురుషాయ పురాణాయ బ్రహ్మవాక్యానువర్తినే || 40

మానవచ్ఛద్మరూపాయ విష్ణవే శంసితాత్మనే | జాతమాత్రంచ యం వేద ఉపతస్ధే ససంగ్రహః ||

మతిమంథాన మావిధ్య యేనాసౌ శ్రుతిసాగరాత్‌ | ప్రకాశో జనితో లోకే మహాభారతచంద్రమాః || 41

భారతం భానుమాన్‌ విష్ణుర్యది న స్యురమీ త్రయః | తతో7జ్ఞాన తమోంధస్య కావస్థా జగతో భ##వేత్‌ || 42

కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్‌ | కో హ్యన్యః వుండరీకాక్షా న్మహాభారతకృద్భవేత్‌ || 43

తస్మా దహ ముపాశ్రౌషం పురాణం బ్రహ్మవాదినః | సర్వజ్ఞాత్‌ సర్వలోకేషు పూజితాద్దీప్తతేజసః || 44

సూతునికి వేదములం దధికారము లేదు. వేనునికుమారుడు పృథుచక్రవర్తి యజ్ఞము సేయుచుండ మాగధుడు సూతుడును నా నరపతిని స్తుతించిరి. సంతుష్టుడై యా మహాత్ముడు వారికి వరమిచ్చెను. సూతునికి సూతమను దేశమును మాగధునికి మగధ దేశము నీయబడినవి. ఆ యజ్ఞమందు సుత్యాహస్సునం దీతడు పుట్టి సూతుడను పేరందెను. ఇంద్రదేవతాకమయిన యాగము నడచుచుండ బృహస్పతి గ్రహము గొనినంత నా హవిస్సు శిష్యునిచే తారుమారుసేయబడెను. అట్లు క్రిందిది పైకి పైది క్రిందికి హవిర్ధారలు (నేతి ధారలు) దారుమారయినందున వర్ణ సాంకర్యమేర్పడెను. క్షత్రియుని వలన బ్రాహ్మణ స్త్రీకి బుట్టిన వానికి క్షత్రియునితో సమాన ధర్మమేర్పడుటవలన వారు వైధర్ములుగా జెప్పబడిరి. (విలోమ సంబంధమునుబట్టి) క్షత్రియధర్మానుసారియగు సూతునికీ ధర్మము మధ్యమము. అందుచే నాకు పురాణములందధికారము బ్రాహ్మణులచే నీయబడినది. కావున యీ యవనియందు ఋషులు పూజించు పురాణమును నేను బ్రవచనము సేయుదును.

పితృదేవతలకు మనస్సంకల్పమాత్రమున నొక కన్యక గల్గెను (మానసిక పుత్రి). ఆమె యింద్రుని బొందినది. పితరులామెను శీలభంగము గల్గిన దానింగా భావించినంత చేప గర్భమున పుట్టెను. అగ్ని పుట్టుకకు కారణమైన అరణివలె (జమ్మి కర్రతో జేసిన అగ్ని మంథన పాత్ర అరణి) నామె యొక ఉత్తమజన్మునికి నిమిత్తమయ్యెను. ఆమెయందు బరాశర మహర్షికి మహానుభావుడగు ఋషి యుదయించెను. అట్టి భగవంవతునికి సత్యునకు వేధసునికి (బ్రహ్మకు) పురాణపురుషునికి బ్రహ్మవాక్యముల ననువర్తించు వానికి (వేదోక్త విధి విధానమును దప్పని వానికన్న మాట) మానుష వేషధారికి వేద ప్రశంసితునికి విష్ణువునకు పుట్టినంతనే వేదము సర్వస్వముగ నుపస్థితము (స్ఫురించినది) అయ్యెను. ఏ మహానుభావుడు వేద సముద్రములను బుద్ధియను కవ్వముచే మధింప మహా భారతమను చంద్రబింబ ముదయించెనో; భారతము భానుడు విష్ణువునను నీ మూడును లేనిచో నజ్ఞాన గాఢాంధకార బంధురమగు నీ జగత్తు యొక్క యవస్థ యెట్లుండెడిదో కదా! అట్టి దానికి గర్తయైన కృష్ణద్వైపాయనుడైన వ్యాసుని సాక్షాన్నారాయణుడని గ్రహింపుము. పుండరీకాక్షుని కంటె (విష్ణువుకంటె) ను యెవడు మహాభారత కర్త కాగలడు ? అట్టి బ్రహ్మవాది వలన నేను బురాణమును విన్నాడను. ఆయన సర్వజ్ఞుడు, సర్వలోకములకు వెలుగునిచ్చు తేజఃపుంజస్వరూపుడు.

పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్‌ | ఉత్తమం సర్వలోకానాం సర్వజ్ఞానోప పాదకం || 45

త్రివర్గ సాధనం పుణ్యం శతకోటి ప్రవిస్తరమ్‌ | నిఃశేషు చ లోకేషు వాజిరూపేణ కేశవః || 46

బ్రహ్మణస్తు సమాదేశాద్వేదానాహృతవానసౌ | అంగాని చతురో వేదాన్‌ పురాణన్యాయవిస్తరమ్‌ || 47

అసురేణా ఖిలం శాస్త్ర మపహృత్యాత్మసా త్కృతమ్‌ | మత్స్యరూపేణాజహార కల్పాదా పుదకార్ణవే || 48

అశేష మేతదవద దుదకాంతర్గతో విభుః | శ్రుత్వా జగాద చ మునీన్‌ ప్రతి వేదాం ళ్చతుర్ముఖః || 49

ప్రవృత్తిః సర్వ శాస్త్రాణాం పురాణ స్యాభవత్తదా | కాలే నాగ్రహణం దృష్ట్వా పురాణస్య తదా విభుః || 50

వ్యాసరూప స్తదాబ్రహ్మా సంగ్రహార్థం యుగే యుగే | చతుర్లక్ష ప్రమాణన ద్వాపరే ద్వాపరే జగౌ || 51

తదాష్టదశధా కృత్వా భూలోకే7స్మిన్‌ ప్రకాశితమ్‌ | అద్యాపి దేవలోకేషు శతకోటి ప్రవిస్తరమ్‌ || 52

తదేవాత్ర చతుర్లక్షం సంక్షేపణ నివేశితమ్‌ | ప్రవక్ష్యామి మహాపుణ్యం పురాణం పాద్మసంజ్ఞితమ్‌ || 53

బ్రహ్మ అన్ని శాస్త్రములకు ముందు పురాణమును స్మరించెను. (శాసించునది శాస్త్రము. అనగా వేదము. కావుననే దానిని ప్రభుసమ్మితమని విజ్ఞులన్నారు) బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పమందు స్ఫురించినది పురాణమన్నమాట. అందుచే నది సర్వజ్ఞానము సమకూర్చుటయందుత్తమము. ధర్మార్ధకామములను త్రివర్గమునకు సాధనము. పవిత్రము, శతకోటి శ్లోక సంఖ్యాకము. లోకములు నిశ్శేషము లయినప్పుడు (ప్రళయమందన్న మాట) విష్ణువు అశ్వరూపుడైన బ్రహ్మ యొక్క యాజ్ఞవలన అంగములను (వేదాంగములను) నాల్గు వేదములను పురాణమును న్యాయశాస్త్రమును-సోమకాసురు డదియెల్ల దొంగిలించి తన వశముచేసికొన్న దానిని- మత్స్యావతారమెత్తి కల్పాదియం దేకార్ణవమైన తఱినందుండి గొనివచ్చెను. ఉదకములందుండియే యా ప్రభువీ వేదముల నుపదేశించెను. చతుర్ముఖుడు వానిని విని మునులకుం జెప్పెను. అన్ని శాస్త్రముల ప్రవృత్తియు పురాణముల నుండియే యయ్యెను. కలక్రమమున పురాణ గ్రహణశక్తి లేకపోవుట చూచి విష్ణువు వ్యాసరూపుడైన బ్రహ్మ యుగయుగమందు (ద్వాపరమున) నవతరించి నాల్గు లక్షల శ్లోకములలో అష్టాదశాత్మకముగా భూలోకమున వెల్లడించెను. శతకోటి పరిమితమైన మూలపురాణ మిప్పటికిని దేవలోకములందున్నది. అదే సంక్షేపించి నాల్గులక్షలుగా నీభూమిపై నుంపబడినది.

సహస్రం పంచపంచాశత్‌ పంచ ఖండైః సమన్వితమ్‌ | తత్రాదౌ సృష్టిఖండం స్యాద్భూమిఖండం తతః పరమ్‌ || 54

స్వర్గఖండం తతః పశ్చాత్తతః పాతాళఖండకమ్‌ | పంచమంచ తతః ఖ్యాత ముత్తరం ఖండముత్త మమ్‌ || 55

ఏతదేవ మహాపద్మ ముద్భూతం యన్మయం జగత్‌ | తదృత్తాంతాశ్రయం యస్మాత్‌ పాద్మ మిత్యుచ్యతే తతః || 56

ఏతత్‌ పురాణమమలం విష్ణుమాహత్మ్య విస్తరమ్‌ | దేవదేవో హరిర్యద్వై బ్రహ్మణ ప్రోక్తవాన్‌ పురా || 57

బ్రహ్మణాభిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే | ఏతదేవ చ వైద్బ్రహ్మా పాద్మం లోకే జగాదవై || 58

సర్వభూతాశ్రయం తచ్చ పాద్మమిత్యుచ్యతే బుధైః| పాద్మం పంచ పంచాశత్‌ సహస్రాణీహ పఠ్యతే || 59

పంచభిః పర్వభిః ప్రోక్తం సంక్షేపాద్వ్యాసకారితాత్‌ | పౌష్కరం ప్రథమం పర్వ యత్రోత్పన్నః స్వయం విరాట్‌ || 60

దానిలో నివుడు పరమపుణ్యమైన పత్మమనుపేరను మహాపురాణమును జెప్పబోవుచున్నాను. ఇందైదు ఖండములు ఏబదియైదువేల శ్లోకములును గలవు. సృష్టిఖండము భూమి ఖండము స్వర్గ ఖండము పాతాల ఖండము ఉత్తరఖండము ననునవైదు క్రమముగా నున్నవి. మహాపద్మమొకటి సర్వసృష్టిమయమదే విష్ణునాభి కమలమనుపేరంబొడమెను. ఆ వృత్తాంతమెల్ల యీ పురాణమందుండుటంబట్టి యీ పురాణము 'పాద్మము' అని పేర్కొనబడినది. ఈ పురాణము పుణ్యప్రసాదము. విష్ణుమాహాత్మ్య విస్తరము. దీనిని దేవదేవుడు హరి బ్రహ్మకు మున్నుపదేశించెను. బ్రహ్మ యిదంతయు మరీచికి చెప్పెను. విష్ణునాభిపద్మము సర్వభూతాశ్రయమైనట్లే యిదియును సర్వభూత చరిత్రాశ్రయమైనందున పాద్మమనబడుచున్నది. ఇది ఖండాత్మకమనియు పర్వాత్మకమనియు గూడ బేర్కొనబడినది. పర్వవిభాగానుసారము, పౌష్కరపర్వము. ఇందే 1. విరాట్పురుషావిర్భావము వర్ణింపబడినది. 2వది తీర్థపర్వము ఇందు సర్వగ్రహములను గూర్చి తెలుపబడినది. 3వ పర్వము భూరిదక్షిణములయిన యజ్ఞములు సేసిన రాజులచరిత్ర. 4వ పర్వము, రాజవంశాను చరిత్రము 5వ పర్వము మోక్షతత్త్వము (సర్వతత్త్వము) పుష్కర పర్వమందు బ్రహ్మచేసినతొమ్మిది విధములయిన సృష్టి 1) దేవర్షిపితృప్రముఖ సృష్టివిశేషము 2వ పర్వములో ద్వీపములు సప్త సాగరముల సృష్టి 3) (పర్వత) రుద్రసృష్టి - దక్షశాపవృత్తాంతము 4వ పర్వములోరాజుల పుట్టుక - వారి వంశచరిత్ర 5వ పర్వములో మోక్షశాస్త్ర సంకీర్తనము - ఇదంతము నీ పురాణమునం జెప్పెద. ఈ పురాణము పవిత్రము కీర్తి కరము పితృదేవతలకెంతేని యిష్టము. ఇది విష్ణుదేవ ప్రీతికరము. మహాపాపాత్ములకు గూడ నిది సేవింపదగినది.

ఇది పద్మపురాణమున సృష్టిఖండమునందు మంగళాచరణము - పురాణావతారికయను మొదటి అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters